ఆదర్శాలు ఆకాశాన – ఆచరణ నేల బారు

కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొ.కు.సాహిత్యం చదువుతుంటే ఆనందం కంటే ఆశ్చర్యం కలిగించింది.శిల్పమూ, వస్తువు అని గ్లోబల్ దాగుడు మూతలు ఆడుతున్న ఇప్పటి సందర్భంలో నిర్వికార శిల్పచమత్కృతితో సాగిన ఆయన రచనలు ఎంతో హాయిగాను  ఆనందంగాను వున్నాయి. మనసును తీవ్రమైన ఆందోళన కు గురిచేయక  మెదడుకు మేతను పెట్టిన రచనలు, తీరిగ్గా చదివి నింపాదిగా నెమరు వేసుకుంటూ జీర్ణం చేసుకోవాల్సిన సంగతులు, కొ.కు.చాలా సీరియస్ విషయాన్ని కూడా చిన్న చమత్కారం జోడించి మలుపు తిప్పడం – ఆయనకే చెందిన నైపుణ్యం. అందువల్లేఅటు సాధారణ పాఠకుల నుండి  మేధావుల వరకు ఆయన రచనలు అందరిని ఆకర్షించగలిగాయి.

ఇది చార్లీ చాప్లిన్ హాస్యమూ కాదు… తెనాలి రామలింగడి వారసత్వమూ కాదు. “వరాన్వేషణ” కథలో భద్రం అనే పాత్ర సుశీలను పెళ్ళాడతానంటాడు. దాని మీద స్నేహితురాళ్ళు మాట్లాడూకుంటూ….” నిన్ను పెళ్ళాడతానన్నాడా! అది వెన్నెల మహిమే కావచ్చు “నంటుంది…” ఉత్త వెన్నెల కూడా కాదు – రొప్పు” అంటుంది సుశీల పాత్ర. భద్రం నూట తొంభై ఎనిమిది పౌండ్లు, ఆ కథలో ఈ డైలాగుకు ముందు వర్ణనలు చదివితే గానీ.. దాని స్వారస్యం  అర్ధంకాదు. ఇట్లాంటివి ఆయన కథలో ఎన్నో.

ఆయన సృజన సాహిత్యాన్ని 1970 ల వరకు సాగించారు. తరువాత సాహిత్య, సామాజిక విమర్శన పై దృష్టి మరల్చారు. కొ.కు. తొలి దశలో ప్రధానంగా కుటుంబం, పిల్లల పెంపకం, వివాహాది ఆచారాల వంటి వాటిమీద రచన చేశారు. తరువాత కాలంలో ముఖ్యంగా నవలల్లో సామాజికాంశాలనూ.. అప్పటి వర్తమాన చరిత్రనూ చిత్రించారు. అయితే ఆయన ఏది రాసినా అటు కుటుంబ సంబంధాల నుండి, ఇటు సామాజిక సంబంధాలదాకా, మనుషుల మధ్య ఆర్ధిక సంబంధాలు ఎట్లాంటి పాత్ర నిర్వహిస్తుందో… అది వారి చైతన్యాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో చూపించారు.

ప్రధానంగా ఆయన సాహిత్య జీవి. సాహిత్య సృజనే ఆయన వృత్తి,  ప్రవృత్తి కూడా. దాని మీద ఆధార పడే బ్రతుకుదెరువును కల్పించుకోవాలనుకున్నారు అందువల్లే అనేకరకాల ఉద్యోగాలు చేసినా తృప్తినివ్వక వాటికన్నిటికీ తిలోదకాలిచ్చారు. ఆయన జీవనం కంటే కూడా విలువల కోసం పరితపించారు. అందువల్లే ఆయన కధానాయకులంతా రచయితలే.. వాళ్లు దేనితోనూ రాజీపడలేరు.

తన రచనలు చదివి మానసిక సంస్కారం పొందాలనే దృక్పథం, సంస్కారం పొందిన మనిషే సమాజంలో విలువలను ఎత్తి పట్టగలడని, అది సంఘానికి మేలు చేస్తుందని నమ్మారు. తనకు తానై నెత్తికెత్తుకున్న ఈ బాధ్యత వల్ల నిజాయితీగా జీవిత వాస్తవికతను ప్రతిబింబించేటట్లు రచన సాగించారు. ఒక కథకుడికి రచనా సామర్ధ్యం లేకపోయినా సరిచెయ్యవచ్చును గానీ.. జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవరివల్లాకాదు” అన్నది ఈ దృష్టి తోనే.

ఆయన కమ్యూనిష్టు సానుభూతి పరుడు కాక ముందు కాపిటల్ చదవక ముందు రాసిన కథల్లోనూ హేతు దృక్పథమూ, సంస్కరణాభిలాషా  వుండటంవల్ల  రోజూ వారి సంఘటనల నుండి కూడా ఎంతో విలువైన కథలు రాయగలిగారు. 1947 లో  రాసిన “ఆడబ్రతుకే మధురం” లో  “అమ్మకి ఆదివారాలు లేవు. పని ఎగ్గొట్టటానికి వీల్లేదు… ఎందుకంటే మరి అమ్మకు జీతం లేదుగా”  అనిపించగలిగారు. 1940 ల్లో   రాసిన “తాతయ్య” కథల్లో…” మనుషులందర్లోకి బ్రాహ్మ లెక్కువ. బ్రాహ్మల్లో నియోగుల కంటే వైదికు లెక్కువ…” అంటూ ఏఏ కులాల గురించి తన తాత ఏమనుకుంటాడో పిల్లవాడితో ఎంత వ్యంగం గానో  చెప్పించారు. ఈ కథలో, ఆనాడు  బ్రాహ్మల్లో వున్న  కుహనా విలువలను ఎత్తి చూపి నిరసించారు.

దత్తపుత్రుడు, మాయ రోగం, పెంపుడు తల్లి, తల్లి లేని పిల్ల, పోయిన సొమ్ము, నిలవనీరు, నిజమైన అపచారం వంటి కథల్లో మధ్యతరగతి బ్రాహ్మల్లొ కుటుంబాల్లో సడలి పోతున్న పాత విలువలు… కొత్తగా సంతరించుకుంటున్న ధనస్వామ్య విలువలు నిలువ నీరు వంటి సంప్రదాయాలను ఎట్లా కుదిపి కల్లోలం సృష్టించిందో చూపించారు.

ఇక్కడ మనమో విషయం తప్పక మాట్లాడుకోవాలి. ” జీవితమే నాకు పరమ ప్రమాణమని… నాకు తెలిసిన జీవితం గురించీ మాత్రమే రాస్తున్నానని” ఆయన చెప్పిన మాటలు.. ప్రతి ఒక్కరూ ఔదల దాల్చినట్లు పదే పదే చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన రచనల గురించి మాత్రమే కొ.కు. ఆ విషయం చెప్పారు. ఆయన ఈ విషయం పై ఇంకో సంధర్భంలో… “జీవిత వాస్తవికతను దర్శించగలిగే నేర్పు వుంటే… తన వర్గం కాని వాళ్ళ రచనలయినా చెయ్యవచ్చునని… అట్లా రాసి  ప్రపంచాన్ని మెప్పించిన “టాల్ స్టాయ్” ని ఉదహరిస్తూ, పాలగుమ్మి పద్మరాజుతో  సాగిన రేడియో టాక్ లో స్పష్టంగా చెప్పివున్నారు. అంటే  ఇతర వర్గాల గురించి రాయకపోయినా పరవాలేదన్నది కాదు ఆయన ఉద్దేశ్యం. కానీ దీనిని తలకిందులుగా అర్ధం చేసుకోవడమే గాక…  వాళ్ళకి తెలిసింది రాసి వూరుకోవడమే గొప్ప సుగుణంగా భావించుకుంటున్నారు.  పైగా అట్లా రాసే ప్రయత్నం చేస్తున్న వాళ్లపట్ల అపహాస్యపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు.

నిజానికి “శ్రామిక వర్గంలో ఇంకా కళా చైతన్యం రాలేదు. కాని వస్తుంది. జీవిత సత్యం తాలూకు కీలకం వారి చేతిలో వుంది. వారిలో మంచి కథకులూ, నవలాకారులూ బయలుదేరి తమజీవితాన్ని, దానివెనక దాగివున్న సత్యాన్నీ చిత్రించడం ప్రారంభించాక యీనాడు మనం చూసి మురిసే సాహిత్యం పేలపిండిలాగా గోచరిస్తుంది” అని అట్టడుగు వర్గాల సాహిత్యం రావాలని కోరుకున్నారు.

అయితే ఆయన తనకు తెలిసిన జీవితమే రాయాలనుకున్నది ఆయన పరిమితులను గుర్తించడం వల్లనే. కొ.కు తను పుట్టిన తెనాలిలో వున్నది 30 ల దాకానే. అక్కడి నుండి దాదాపు  పదిహేనేళ్ళూ పిల్లి తిరిగినట్టూ దేశమంతా తిరిగాడు. చివరకు 48 ల నుండి మద్రాసులో వుండి పోయారు. దానితో తెలుగుదేశమంతా సన్నిహిత సంబంధాలు తక్కువయ్యాయి. ఎప్పుడైనా ఆంధ్రదేశానికి వచ్చినా చుట్టం చూపుగానే, తల్లిదండ్రులు చిన్న నాడే పోవడం.. అన్నదమ్ములు మధ్యలోనే అంతర్ధనమవడం, ఒకరూ, అరా బంధువులున్నా వారంతా పొట్టూనెల్లూనే. దాని వల్ల పుట్టినగెడ్డమీద ప్రేమవున్నా గాఢమైన ఆత్మీయ అనుబంధాల పగ్గాల్లేవు. దానితో ఆయన శరీరమూ.. మనసూ మద్రాసు నగరాన్ని సొంతం చేసుకున్నది. దీనితో మద్రాసులో వున్న తెలుగు కుటుంబాలే ఆయనకు పరిచయం. ఆంధ్రదేశం విడిపోయి చాలా మంది తెలుగు వారు వచ్చేయగా మద్రాసులో మిగిలినవారు పరిమిత సంఖ్యలోనే వున్నారు. అందువల్లే తనను తాను ఆ పరిమితి విధించుకున్నారు. వారి జీవితాలను మాత్రమే ఆయన చూడగలరు. విశ్లేషించగలరు. దీనికితోడు ఇంకో పరిమితి తోడైంది. ఆయన తన సాహిత్యంలోని కథానాయకులను పోలిన వాడే. తన చదువు.. కథలూ, కాకరకాయలు రాసుకోవడం.. ఖాళీగా వుంటే నాటక బృందాల చుట్టూ తిరగడం. అంతే తప్ప స్వగ్రామం పోయి తమకున్న ఆ కొద్దిపాటి పొలం ఎలా వుందో.. దాని మీద ఆధారపడీ ఏమైనా బతుకుదెరువు ఏర్పాటు చేసుకోవచ్చా! అన్నది తలంపులో కూడా రాలేదు. ఈ రెండూ ఆయనకు తెలుసు.

అందుకే యాభైల తరువాత రాసిన నవలల్లోనూ, కథల్లోనూ చిత్రించిందంతా యాభైలకు ముందు జీవితమే. అదే ఆయనకు ప్రత్యక్ష పరిచయం. అరవైలనుండి తెలుగు సమాజాన్ని గురించి తనకు తెలుసునని చెప్పడం, సాహిత్య లోకానికి అబద్ధం చెప్పుడమనుకున్నారు. అందుకే అప్పటి నుండి సృజన సాహిత్యం రాయడం ఆపి వేశారు. కానీ అక్కడితో ఆయన ఆగిపొలేదు. సంఘం మీద సాహిత్యం యొక్క ప్రభావాన్ని గుర్తెరిగిన వ్యక్తి కనుక చివరి క్షణం వరకు గతితార్కిక దృష్టితో తెలుగు దేశంలోని పరిణామాలను గమనిస్తూ – తన అనుభవాన్ని జోడించి, బుద్ధిజీవులకు తెలుసుకోదగ్గవి చెప్పాలనే అభిప్రాయంతో వ్యాస పరంపరను సాగించారు. జీవిత సమస్యలను గురించి రాయడం ఆపివేశారు. దాని కంటే మరింత బాధ్యతగా జీవితసమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించే వాళ్లగురించి చిత్రించాలనుకున్నారు. మానవ ప్రయత్నాలను మంటగలిపే రచనలను, రచయితలను ఈ దృష్టితోనే నిరసించారు.
ఆయన వ్యాసాలు కూడా తాత్వికతను చర్చిస్తూ జుట్టు పీక్కునేట్లుగా గాక మామూలుగా మాట్లాడుకున్నట్లుగానే వుండి పాఠకులకు చదవాలనే కుతూహలాన్ని కలిగిస్తాయి. నిజానికి ఆయనకు మరింత సరళమైన భాష అబ్బడానికి గానీ,లేదా కుటుంబ సంబంధాలను అంత హేతు దృష్టితో చూడగలగడం గాని  ఆయన నేపథ్యం మళ్ళీ ఆయనకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. కోస్తా మధ్యతరగతి బ్రాహ్మణకులంలో వుండే ఆడ, మగ కలివిడి తనం… దైనందిన సంస్కృతి ఇందుకు దోహదపడింది. అందువల్లే ఆయన భాషకు అక్కడి నేటివిటీ అంశ, నాటకీయతా అద్దుకున్నాయి.

మరోవైపు ఈ సన్నిహిత కుటుంబ సంబంధాల వల్ల, ఆ కుటుంబాలలో  లోలోపల ఏం జరుగుతుందో తెలియడం వల్ల ఆయన్ను అమిత సంఘర్షణకు గురిచేశాయి. నిజానికి ఆయన ఒక సందిగ్ధ, సంక్షుభిత కాలం మధ్యలో నిలబడినవాడు, మనకేకాదు, ఆకాలమంతా ప్రపంచ చిత్రపటానికే కల్లోల కాలం. రెండవ ప్రపంచయుద్ధం, సోషలిస్టు రష్యాకు స్టాలిన్ నాయకత్వం.. హిరొషిమాలో అణు బాంబు విస్ఫోటనం.. విశ్వమానవుడు  ఓ విధ్వంస  ప్రారంభాన్నీ… ఓ సోషలిస్టు పురిటి గుడ్డునూ,  రెంటినీ చూస్తూ ఓ ఆనంద భయ విహ్వలత చెంది వున్నాడు.

అయినా ఆ కల్లోల మానవుడి ఆంతరంగిక విషాదాన్ని, భయాన్ని ఆయన్ను ఏ మేరకు కదిలించిందన్న ప్రశ్న వుండనే వుంది. అయితే లోకం  అంత కల్లోల భరితంగా ఉన్నా, వ్యక్తిగా కొ.కు మరింత కల్లోలంగా ఉన్నాడు. అందుకే ఆయన్ను  కుటుంబ సంబంధాలు కదిలించినంతగా సామాజిక సంక్షోభం కదిలించలేదు. అందుకే అన్ని ఉద్యమాలను చరిత్రలో భాగంగా ప్రేక్షకుడిగా వర్లించారు గాని మనసును పట్టినట్టుగా అనిపించవు. ఆయన కథానాయకులు ఏ ఉద్యమంలోనూ నాయకులు కారు.

అయితే ఈ ప్రపంచ పరిణామాలు, ఆర్ధిక మాంద్యం మూలంగ అన్నింటికీ కరువు వచ్చి ఎవరి స్వార్ధం వాళ్లు చూసుకునే ఒక దుర్మార్గం.. అప్పటికి కనక కొత్తగా వుండి వుంటుంది. కనుకనే విచ్చిన్నమవుతున్న మనుషుల సంబంధాలు కొ.కును కలచి వేసాయి. అందువల్లే ఈ పరిణామాల తాకిడికి కుటుంబాల జీవన విధానం,  ఆర్ధిక స్థితి గతులు ఎట్లా మార్పులు చెందాయో చూస్తుండగానే, ఒక చారిత్రక సన్నివేశం ఎట్లా రూపాంతరం చెందిందో ఆయన తన కథల్లో సమర్ధవంతంగా చిత్రించారు. దుక్కిటెద్దు, పంచరత్న తిండి దొంగ, ఐశ్వర్యం వంటి కథలు ఇందుకు నిదర్శనం.

ఆయన రాసింది మధ్య తరగతి గురించే కానీ ఆయన ప్రేమించింది కింది కులాల, వర్గాల వారినని ఆయన రచనలు చదివితే తెలుస్తుంది. కులంగాడి అంత్యక్రియలు, కులంలేని మనిషి, పని మనిషి వంటి కథలే గాక, సమాజపు నిర్లక్షానికి గురైన వేశ్యల పట్ల ప్రేమతో “గడ్డు రోజులు” లో, హైమమతి, “నీకేంకావాలి” లో కస్తూరిని సృష్టించారు.

ఇట్లా మానవ జీవితాల్లోని అనేక కోణాలను  స్పృశిస్తూ రచనలు చేస్తారు. మొత్తంగా ఆయన రచనల్లో మనిషి చైతన్యానికి ,అతని వునికికి సామాజిక కారణాలు ఎట్లా ప్రేరకమవుతాయో, ఆయన పాత్రల ద్వారా వాటి మధ్య సంబంధాలను నిరూపించడం ద్వారా స్పష్టం చేశారు. ఆయనే పాత్రల ద్వారా “నాకు పాత్రల కన్నా, పాత్రల మధ్య వుండే సంబంధాలను  గురించిన శ్రద్ధ జాస్తి” ఆని చెప్పారు. ఆయన మాటలు ఎంత నిజమంటే కథల్లో పాత్రలు సంవత్సరాలు కూడా తామే చెప్తుంటారు.(ఇదంతా నియంత్రణ లేని కథకుడి ప్రవేశం వల్ల)

కొ.కు. ప్రధానంగా భార్యాభర్తల, తల్లిబిడ్డల సంబంధం గురించే ప్రస్తావించారు. పిల్లల పెంపకంలో, కుటుంబ బాధ్యతల తండ్రి పాత్ర పెద్దగా చెప్పలేదు. ఇక అన్నా తమ్ములు, అక్కాచెల్లెళ్లయితే లేనేలేరు. “సవతి తల్లి” లో మేనత్త పాత్ర పచ్చి దుర్మార్గురాలిగా ముగుస్తుంది. అయితే  ఆయన రాసేనాటికి పెత్తం దారులయిన అత్తగార్లు వున్న సమాజమే వున్నా అత్తా కోడళ్ళ తగాదా లంతగా లేదు.

ముఖ్యంగా కొ.కుని భార్యభర్తల సంబంధం ఎంతగా ప్రభావం చూపిందో.. తల్లిబిడ్డల సంబంధం కూడా అంతగా కలత చెందించింది. అనుభవం, చదువు, సవతి తల్లి  కథల్లో ఇది కనిపిస్తుంది.

“అనుభవం”లో పార్వతి భర్త కాంతయ్య పెళ్ళినాటికి  రకరకాల వ్యసనాలకు లోనై వుంటాడు. అట్లా వుండటం తప్పని అతని తల్లి మందలించపోగా అది వారి హోదాకి తగిందనుకుంటుంది. కాంతయ్య తండ్రిది కూడా అటువంటి ప్రవర్తనేనని పార్వతికి తెలుస్తుంది. దానితో పార్వతి, తన కొడుకు నారాయణ పై తాత, తండ్రుల ప్రభావం పడరాదనుకుంది. కాంతయ్య విలాసాలకు ఆస్తిని హారతి కర్పూరంలా కరగేస్తుంటాడు. పార్వాతి తన చిన్నన్న వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో తండ్రి అప్పులకు, తన కొడుకు బాధ్యుడు కాడని దావా వేస్తుంది. వ్యాజ్యం జరుగుతుండగా కాంతయ్య పంపిన పెద్ద మనుషులు వచ్చి రాజీ పరిచి కొంత పొలం నారాయణకు ఇస్తారు. అప్పటినుండి పార్వతి పుట్టినింటనే వుండి పోతుంది.

తన కొడుకు ప్రవర్తన పారదర్శకంగా ఉండాలని అనుకుంటుంది. పార్వతికి సగటు మధ్యతరగతి లో వుండే శీల సుగుణాల కొలతలే  ప్రమాణం. తన కొడుకు మనసులో పడే ప్రతి ఆలోచనా, వాడికి ముందు ముందు పనికి రావాలి. వడి మనస్సు  అడివల్లే తయారు కారాదు. తీర్చిదిద్దిన తోటలాగా వుండాలి. అండులో ప్రతి అంగుళమూ  తనకు అర్ధమవుతూ వుండాలి”.. ఇదే ఆమె పట్టుదల.

కానీ తల్లి అట్లా అనుకోవడం వల్లే నారాయణకు చిక్కు వస్తుంది. హైస్కూల్లో చేరిన నారాయణకు రకరకాల స్నేహితులు ఏర్పడతారు. వాళ్లు ఏదో సంధర్భంలో వాడి ఇంటికి రావడం తటస్థపడుతుంది. కానీ ఆ వచ్చిన వాళ్లను తల్లి అలగాజనమని, అస్పృశ్యులని అనుమానపడీ..” సూద్దరాలను కూడా ఇంటికి తెస్తావేమిరా! అంటుంది.” అప్పుడే తొలిసారిగా తల్లిని తరచి చూడడం మొదలు పెడతాడు. నారాయణకు ఎప్పుడూ ఏం  ప్రమాదం జరగబోతుందో నన్న భయంతో కాచి పెట్టుకునే పార్వతి ఆంక్షలు వాడి పాలిట శాపంగా మారుతాయి. దీని వల్ల మరింతగా తల్లిని దూరమవుతుంటాడు. ఇది పార్వతికి గ్రహింఫుకే రాదు.

ఇంతలో సహాయనిరాకరణ వచ్చింది. కాంతయ్య తన మిల్లు పంచెలన్ని కాల్చేసి, ఖద్దరు కట్టుకున్నాడని.. మీటింగుల్లో తిరుగుతున్నాడని చిన్నన్న వెంకటేశ్వర్లు వార్త తెస్తాడు. కాంతయ్య పాల్గొన్న ఆ జాతీయోధ్యమం ఏ పాటిదోనని పార్వతికి అనుమానం కలుగుతుంది. భర్త అరెస్టయ్యాడని తెలిసినా.. ఆమె తనకి సంబంధించిన వార్తగా అనుకోదు.

జైలు నుండి వచ్చాక దేశ భక్తులు  మీటింగులు పెట్టీ “కాంతయ్యను మాట్లాడటానికి పిలుస్తారు. మేనమామ ప్రోత్సాహంతో తండ్రిని చూడటానికి వెళతాడు నారాయణ .మీటింగు అయ్యాక కొడుకుని పలకరించిన కాంతయ్య “ఏం చదువుతున్నావురా? అని వాడు చెప్పే సమాధానం కూడా పట్టించుకోకుండా …..”వడ్డీ లెక్కలు కట్టగలవా? అవి నేర్చుకో బాగు పడతావు” అంటాడు.అదంతా భార్య మీద వెక్కిరింపు.నారాయణకు  తండ్రి  జ్ఞాపకం అంత వరకే.

నారాయణకు చదువు కంటే సంగీత సాహిత్యాల మీద ఎక్కువ ఆసక్తి వుండేది.ఇంటి వారమ్మాయితో పాటు సంగీతం నేర్చుకోవాలనుకున్నా,  పద్యాలు సాధన చేయాలన్నా తల్లిగాని ,మేన మామ గాని ప్రోత్సహించరు.

నారాయణ ఇంటర్ కు గుంటూరులో చేరతాడు.ఇక తల్లి నుండి కొంత స్వేచ్చ లభిస్తుందనుకున్న వాడికి తల్లి గుంటూరు లో కాపురం పెట్టటంతో ఆ ఆశ పోతుంది.తన స్వేచ్ఛకు తల్లే పెద్ద శత్రువుగా మారినట్లు భాధపడతాడు.అందువల్ల విజయనగరంలో డిగ్రి చదువుకోవడానికి తల్లిని తీసుకు పోక హాస్టల్లో వుండి పోతాడు.

ఈలోపు  ఆర్దిక కాటకం.  ఆ ఆర్దిక కాటకం లో తనకు రావాల్సిన  అప్పుకింద వారి ఇల్లు బదలాయింపు  చేసుకుంటుంది పార్వతి.ఆ ఇంటికి సంబందించిన  లావాదేవీల్లో ఆమె బేరసారాలు చిన్నన్నకు  నచ్చవు.

ఆ ఇంట్లోకి అద్దెకు దిగిన వారి అమ్మాయి మీద మీద నారాయణకు ప్రేమ పుడుతుంది. కానీ వాడు ఎవరికీ ఈ విషయం చెప్పడు. తల్లి తరువాత చెప్పిన సంగతి విని ఆ పిల్ల మీద మాత్రం సానుభూతి చూపకుండా,  వాడు  తల్లి మీద ఏవగింపును పెంచుకుంటాడు. కానీ తల్లితో మాత్రం ఘర్షణ పడడు, ప్రేమించి పెళ్ళాడాలనుకున్నా,  ప్రేమించలేక, తల్లి  చేసిన పెళ్ళే చేసుకుంటాడు. అంతక్రితం ఉద్యోగం చెయ్యాలని వుండేది కాదు. తనకింత తినడానికి ఉన్నప్పుడు ఎందుకని.. కానీ మనిషికి ఆర్ధిక స్వేఛ్ఛ ముఖ్యమని ఉద్యోగం చేయడానికి భార్య సావిత్రిని తీసుకుని నారాయణ నగరం పోతాడు.

ఏ ఉద్యోగమైనా తనకు రచనా సంబంధమైనదే కావాలని అతని పట్టుదల, కథకుడిగా నేనుండాలని నిశ్చయిచుకుంటాడు. తన సాహిత్యానికి “స్త్రీ”ని కేంద్ర బిందువుగా నిర్ణయిచుకుంటాడు. ఆడదాన్ని మొగవాడు అణగదొక్కుతున్నాడని ఆడదాన్ని వెనకపడనిచ్చి తనెంత ముందుకు పోగలడూ! అని నారాయణ అనుమానం . తల్లులుగానూ, పెళ్ళాలగానూ మగవాళ్లమీద వారి ప్రభావం వుండక తప్పదనుకుంటాడు.

తను రాసే కథల్లో స్త్రీలను చలం చూపించనట్లు చూపించకూడదనుకుంటాడు. చలం స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి వొదిలేస్తాడు గానీ.. ఆడది మగవాడిని అందుకునేటందుకు సంఘంలో ఎటువంటి మార్పులు జరగాలో చెప్పలేదనుకుంటాడు. “సంఘానికి ఎడంగా నిలబడి సామాన్య ప్రజలను హీనంగా చూసేవాడు తన సంస్కారానికి తను మురిసిపోవచ్చు గాని.. సంఘానికి చిన్న యెత్తు ఉపకారం చెయ్యలేడు” అని చలం మీద విమర్శగా కూడా అనుకుంటాడు, నారాయణ.

తాను అట్లా కాక మగవాడితో సమంగా చదువుతూ, వివేకమూ ,సరైన దృక్పథం గల ఆడపాత్రను సృష్టించి.. అటువంటి వారి వల్ల భర్తకూ, పిల్లలకూ ,కుటుంబానికి ఎంత ఉపయోగమో చెప్పాలనుకుంటాడు.

ప్రచారం ద్వారా సాధ్యం కానిది సాహిత్యం ద్వారా సాధ్యం కావాలని; సంఘంలో నీతి గురించి, సంస్కరణ గురించి ఏనాడో పెద్దలు చెప్పినా అవి అమలు కాకపోవడానికి, మానసిక పరివర్తన కలిగించడానికి సరైన సాహిత్యం లేకపోవడమేననుకొని, వితంతు వివాహాల మీద కథ రాయాలనుకుంటాడు.
రెండోకథ వడ్డీ వ్యాపారుల మీద రాస్తాడు. వాళ్లను జలగలతో పోలుస్తాడు అదృష్టవశాత్తు ఆ కథ తల్లి చదువుతుంది. దాని మీద వాళ్లిద్దరికీ మాటా మాటా జరుగుతుంది. దానితో “నారాయణ తనకెందుకు అర్ధం కాకుండా  పోతున్నాడోననిపార్వతి విచారపడుతుంది. అప్పటికీ తల్లీ కొడుకుల  ఆంతర్యాలు రెండు మార్గాలుగా చీలివుంటాయి.

సావిత్రి కాపురానికి రావడం. సావిత్రితో  కొడుకు చూపిస్తున్న చనువు, ఆదరణ – పార్వతికి ఆశ్చర్యంగా వుంటుంది. తన భర్త ఎలా వుంటే బావుండునని ఆమె అనుకుందో – అలా కొడుకు కోడలుతో వుండటాన్ని అర్ధం చేసుకోలేక పోతుంది. పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతున్నాడని ఈ సడించుకుంటుంది.
మద్రాసులో ఉద్యోగం చేసుకుంటున్న నారాయణ – తల్లి ఒక్కతే వుందని – తన దగ్గరకు తీసుకుపోతాడు. కానీ అక్కడ కోడలి కంటే  కొడుకు నిర్లక్ష్యంగా వున్నాడని బాధపడుతుంది. దానికి కోడలే కారణమనుకుంటుంది.  మేనకోడలు సీత  ఆమెకు ప్రతిదానిలో అడ్డుపడుతుంది. క్రమంగా తనకు  సంబంధించి ఇక్కడ ఏమీ లేదని నిశ్చయించుకుంటుంది పార్వతి.

తిరిగి తెనాలి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి మానసికంగానో, శారీరకంగానో ఒంటరిగానే వుండి – చనిపోతుంది. ఇది పార్వతి, నారాయణల జీవితానుభవాలు. పార్వతి చనిపోతూ ” నిన్ను ఎట్లా పెంచాలో చాతకాక దూరం చేసుకున్నా. మన అద్దెవాళ్లబ్బాయి,ఆ తల్లీ కొడుకులు ఎంత ప్రేమగా వుంటారూ.. వాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. ” అని విచారపడుతుంది.

ఈ నవల ఓ కుటుంబంలోని తల్లీ కొడుకులు, భార్యాభర్తలు, అత్తాకోడళ్ళ మధ్య సంబంధాలను చర్చిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తల్లీ కొడుకుల మధ్య సాగిన అనుభవాలని చెప్పాలి. వాళ్ళిద్దర్ని చూపించడానికి ఉపయుక్త మైనవే  సావిత్రి గానీ, మరేపాత్ర గానీ ఇందులో పార్వతి పాతతరం, మధ్యతరగతికి ప్రతీక. అందులో ఉండే చాదస్తాలు, మూర్ఖత్వాలు- అదే సమయంలో కొన్ని విలువలు.. బతుకుభయం. నారాయణ కొత్త తరం. చదువుకున్నవాడు. సమాజంలోకి వచ్చిన అన్ని చలనాలను వీక్షించిన వాడు, జాతీయోద్యమం నుండి కమ్యూనిజం దాకా. ఒక దశ దాకా తన వెంట పరిగెత్త గలిగిన భార్య సావిత్రి కూడా కమ్యూనిజం  అనేటప్పటికి వెనకబడిపోతుంది. అంటే కాలం వెంట నడవగలిగిన చైతన్యం అందరికీ వుండటం లేదు. ఇక్కడ నారాయణ కాలం వెంట నడవగలిగినాడు. కానీ దానివల్ల ఎవరికి,  దేనికి, ఏ వ్యవస్థకు ప్రయోజనం కలిగిందో చూద్దాం.

నారాయణ చిన్నప్పటి నుండి తల్లి చేసే పనులను ఎదిరించి ఎరుగడు. తప్పించుకు తిరిగాడు. తనకు స్వేచ్ఛ లేదనుకుంటాడు గానీ.. స్వేచ్చను తీసుకోవడానికి చిన్నయెత్తు ప్రయత్నం చెయ్యడు. పైగా “పిరికి వాళ్లు సంఘ ద్రోహులు- తానెంత పిరికివాడో” ననుకుంటాడు. అట్లా అనుకునే చైతన్యముంది. కానీ ఆ చైతన్యం ఆచరణ రూపంలోకి రాకపోవడం వల్ల వాడికీ- వాడి వల్ల తల్లికీ  నష్టం జరిగిపోతుంది.

తొలిదశలో తనకు తినడానికి సరిపడా వున్నప్పుడూ ఇక ఉద్యోగమెందుకనుకున్నాడు. తరువాత కాలంలోగాని మనిషికి “పని” ఎంత ముఖ్యమో అర్ధం గాదు. ఉద్యోగం వద్దనుకున్నవాడు, విజయనగరం పోయి ఎందుకు చదువుకున్నట్టు!  వడ్డీ వ్యాపారులు “జలగలు” అని రాసాడు తప్ప.. తల్లిని ఆ పని చెయ్యవద్దని చెప్పలేదు. పైగా బంధువుల దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినప్పుడైన ఆమెను సరిచేసే ప్రయత్నం చెయ్యలేదు.

ఆ కథ చదివో పాఠకుడు.. “తను అట్లాంటి తండ్రి సంపాదన మీద అధారపడి వున్నానని – తండ్రి చేసిన ఈ పాపంలో తను భాగస్వామి కాకుండా వుండాలంటే ఏం చెయ్యాలని “.. జవాబు కావాలని రాస్తాడు. ఆ ఉత్తరానికి,  ఈ పాపిష్టి సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియదు.. నా తలమీద చూడు, నా బాకీదారులనుంచి ఒడుసుకున్న నెత్తురే నంటూ..” సమాజం ఆమోదించే దురభ్యాసాలను వ్యక్తులం సంస్కరించలేం.. సమాజమే సంస్కరించాలి” – అని జవాబు రాస్తాడు.

అప్పటికదైతే రాశాడు గానీ.. దాని గురించి ఆలోచించలేదు. కాని తాను రాసిన వాటికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందనుకున్నాడు గానీ.. సొంత బాధ్యత మీద బతుకుదెరువు ఏర్పరచుకోవాలనుకోడు. అతను మార్పువైపు ఆలోచన చేస్తాడు. గానీ చదువూ, సంధ్యా లేని పాత తరానికి చెందిన తల్లికి – అది ఎట్లా అర్ధమవుతుందీ?. ఆ లోకంలో వడ్డీవ్యాపారం చేసే వాళ్లు వున్నారయ్యే  – తప్పెట్లా అవుతుందన్నదే ఆమె భావన.. కానీ అది తప్పని నిద్రలోకూడా పెరిగేది వడ్డీ యేనని అర్ధం చేయించలేదు. పైగా ఆమెను చిన్నచూపుచూస్తాడు.  ఇది నారాయణ స్థాయికి తగిన పనేనా?

పార్వతి భర్తనుండి విడిపోయి జీవితమంతా ఒంటరిగా బతికినా ఎన్నడూ దిగులు పడి ఎరుగదు. కానీ ఆమెను డొల్ల చేసింది నారాయణ వైఖరే. “వాడు తన జీవితాన్ని, తన ప్రేమనూ, తన తపస్సునూ వ్యర్ధం చేశాడు.. వాటిని అవమానించాడు. ద్రోహం చేశాడని” ఏళ్ళతరబడీ మనసులొ గిలగిలా కొట్టుకుందామె.
చినతనంలో నారాయణ  ఈత గొట్టాడని తెలుసుకొని నానా రభస చేస్తుంది. అది వాడి స్వేచ్ఛకు అడ్డంకిగా మారిందని.. తల్లి వైఖరికి ఖిన్నుడవుతాడు. వాడి నిరసనలో ఎంత న్యాయముందో ఆమె భయంలో అంతకంటే మరింత న్యాయముంది. వాడి మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న అమెకు వాడేమన్నా అయితే? ఈ  భయం తీర్చేదెవరూ?

అట్లాంటి పార్వతి.. నారాయణకు  వైరల్ ఫీవర్ వచ్చి  జ్వరం తీయకుండా వుంటే మరింత కంగారు పడదా? అయితే అప్పటికి నారాయణ పెద్దవాడై పెళ్లికూడా చేసుకుంటాడు. నారాయణ వైఖరిలో మార్పు ఆమె గ్రహిస్తుంది. అందువల్లే భయపడూతూనే పలకరిస్తుంది రెండు సార్లు. దాన్ని వాడు అర్ధం చేసుకున్న తీరు.. ఆమె కించపడేటట్టు.. జబ్బుగా వున్న వాడిని న్యూసెన్స్ చెయ్యకూడదు. చీటికి మాటికి వచ్చి ఎట్లా వుందీ తలనొప్పా! దాహంగా వుందా? మంచినీళ్లివ్వనా! ఏమన్నా తాగుతావా!ధారకం లేకుండా ఎట్లా వుంటావూ! కాళ్లతీపులా!  ఈ విధంగా తగులుకుంటే ఎట్లా వుంటుంది అని పరోక్షంగా ఎద్దేవాగా మాట్లాడుతాడూ. ఆమె మాటలకు నొచ్చుకుంటుంది. నారాయణ పెద్ద వాడై ఇంగిత జ్ఞానం సంపాదించాడు. పార్వతి మాత్రం వాడి చుట్టూనే తిరుగుతో గాను గెద్దులాగా ఉంటుంది. మరి ఆమెకెట్లా జ్ఞానం వస్తుందీ.

పైగా అదే నారాయణ చిన్నప్పుడు జబ్బుచేస్తే తల్లిని మంచం వొదిలి అవతలికి పోనిచ్చేవాడు కాదు. రెండు నిమిషాలు కనబడకపోతే -” అమ్మా! అమ్మా! ఎంతసేపటికి రావేం!” ఆని కేకలు పెట్టేవాడు. అది తలచుకుంటూ – తన కొడుకు ఇలా మాట్లాడటం కోడలివల్లనే అనుకుంటుంది. నిజానికి సావిత్రి ఆమె గురించి చాలా సానుభూతిగా మాట్లాడుతుంది కూడా, తన పరిధిలోతాను.” తల్లికోసం నమ్మకం లేని పనులు చేస్తేనే అంటుంది..” ఏమన్నా చెప్పండి. మీకు ఆపేక్షలు తక్కువ” అంటుంది. అత్తని తమ దగ్గరికు తీసుకు రమ్మని నారాయణను ప్రొత్సహించింది ఆమే. నారాయణ చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాల్సిన సమయంలో ఏమి చెప్పకుండా.. తనకు జ్ఞానోదయం కల్గాక ఇలా చెప్పడం వల్ల అంతిమంగా ఆ ప్రభావానికి , కోడలు లక్ష్యమై పోతుంది. పార్వతి తెలియని తనం వల్ల పసి బిడ్డ విషయంలో పాత పద్ధతులు అనుసరిస్తుంటే సావిత్రికి కష్టంగా వున్నా సర్ధుకు పోతుంది.

అయితే మేనకోడలు సీత మాత్రం మేనత్తను పడనిచ్చేదికాదు. అన్నిటికీ అడ్డుపడేది. అయినా వాళ్ళిద్దరూ శత్రువులల్లే కాలేరు. “తల్లిగదా! అయినా ఆమె దగ్గర తనకు సీతకున్న చనువుందెకు లేకుండా పోవాలి? నేనా చనువును ఏవిధంగా పోగొట్టుకున్నానూ!” అని, అప్పటికిగానీ నారాయణకు తను ఏం చేసి వుండాల్సిందో అర్ధం కాలేదు. “తప్పును సహించడం కంటే , ప్రతిఘటించడం తప్పు చేసిన వాడి దృష్టి నుండీ కూడా మంచిదే”.. అనుకుంటాడు. మొదటి నుండీ తాను తల్లి తప్పులను ఎత్తి  చూసి సరిచెయ్యాల్సిందనుకుంటాడు. ఆమాట అనుకునే నాటికి తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగిపోయింది. దానితో పార్వతి తనకి సంబంధించి అక్కడేం లేదనుకుని తిరిగి సొంత గ్రామం చేరి చివరకు అక్కడే చనిపోతుంది.

చివరలో ఆమె ఇంట్లో అద్దెకున్న తల్లీ కొడుకులను చూస్తూ ,తనూ తన కొడుకు అలా ఎందుకుండలేక పోయామని పశ్చాత్తాప పడుతుంది. ఈ పశ్చాత్తాపం పార్వతికి మాత్ర్రమే సంబంధించినదా? తన చాదస్తాలతో, ఆచారాలతో గిడసబారిపోయి చిన్న వాళ్లను అర్ధం చేసుకోలేక దూరమయ్యాననుకుందా? ఏమిటి? అలా అయితే అద్దెకున్న వాళ్ల మధ్య  తరాల అంతరం లేదా? వుంటే ఎలా అధిగమించారు? మనం దీన్నెట్లా చూడాలి?

నారాయణ స్థితి పరుడు, పొలం పుట్రా తండ్రి నుండి వచ్చింది. నిశ్చింతగా విజయనగరం పోయి చదువుకున్నాడూ. తరవాత కూడా తినడానికి వుంది కనక ఉద్యోగం చెయ్యనక్కరలేదనుకున్నాడు. మేనమామ “లా” చెయ్య మంటే – లాయరు, బడిపంతులు – ఏం ఉద్యోగాలూ?  అనుకుంటాడు. వీడిపై జాతీయోధ్యమం ప్రభావం వుంది. పైగా రచయిత – కుహనా  దేశ భక్తుల మీద,వితంతువివాహాల మీద కథలు రాసి వున్నాడు. ఆలోచనా పరుడూ.
కానీ, ఇంటివారబ్బాయి మామూలు బడిపంతులు- బతుకు సుఖంగా ఈడ్చడ మెట్లా అన్నదే  వాళ్ల సమస్య. అందువల్ల అతనికి పెద్ద పెద్ద ఆలోచనలు లేవు. అక్కడ తల్లికీ, అతనికీ భావసారూప్యం కలిసింది. ఒక్కడే కొడుకు. ఉమ్మడి కుటుంబాల్లో అప్పటీకి అత్తగారిని అనుసరించడమే రివాజు కనుక కోడలి పేచీలేదు. పైగా పెద్ద  సైజు పల్లెటూరు వాళ్లు వుండేది. కనుక వాళ్ల పరిధిలో వాళ్లకు ఆప్యాయతలకు కొదవ లేదు. పార్వతికి కావల్సింది  ఇది.

కానీ, నారాయణ పెద్ద చదువు చదివి..  అభ్యుదయ భావాలు ఏర్పరచుకున్నాడు కమ్యూనిజం వైపు కూడా చూపు సారించాడు. అప్పుడూ భార్య కూడా వెనకడుగు వెయ్యసాగింది. పైగా నగరంలో నివాసం. ఇంత వ్యత్యాసం, నారాయణకూ పార్వతికీ వున్నది. దీన్ని అధిగమించడం సాధ్యమెలా?ఇది ఎవరి తప్పూ కాదు. నిజమే కానీ అయితే ముందుకు పోతున్నామనుకున్న వాళ్ళకే దీన్ని సమన్వయం చేసుకోవలసిన బాధ్యత ఉంటుంది. అయితే నారాయణకు అంత ఇంగితం లేదు. ఆమె మీద తగినంత ప్రేమ లేకపోవడంవల్ల కూడా అతను తల్లిని ఎడంగానే చూశాడు.

తల్లి జీవితమంతా ఒంటరిగా పడ్డ ఘర్షణ పట్ల సానుభూతి లేదు. తన తాత తండ్రుల్లాగా కాకుండాలనే ప్రయత్నంలో అతని చుట్టూ కంచెలు కడుతున్నానని కూడా అర్ధం కాని తల్లి పట్ల వైరుధ్యం పెంచుకున్నాడే కానీ, ఆమెకు అర్ధం చేయించే ప్రయత్నం చెయ్యలేదు. ఆ పని సీత చేసింది.  సావిత్రి కొంత వరకు చేసింది.

అయితే కొ.కు. ఇక్కడ నారాయణ మీద సానుభూతిగా ఎందుకున్నాడంటే ” అయితే పరిస్థితి అర్ధం చేసుకుని ఎవరిపైనా గాని దయ చూపించడానికి కొంత మేధా శక్తి  కావాలి. జాలి ,కోపం మొదలైనవి హృదయానికి సంబంధించిన ఉద్రేకాలు. వాటికి మనస్సుతోనూ, బుద్ధితోనూ, ఏమీ సంబంధం లేదని చాలా మంది బాగా తెలిసిన వాళ్లు కూడా అపోహపడూతుంటారు. ” ఆయనే చెప్పినట్టూ తల్లి మీద జాలి చూపించే మేధా శక్తి  అప్పటికి నారాయణకు లేదు. ఇది కొ.కు. నారాయణ పాత్ర మీద చేసిన వ్యాఖ్య. కనుక నారాయణలాగా తల్లుల పట్ల ఉండొద్దని చెప్పడమే ఆయన లక్ష్యం.

“అనుభవం”లో నారాయణ వంటి వాడే “చదువు” లో సుందరం కూడా. సుందరం అక్షరాభ్యాసంతో నవల ప్రారంభమయ్యి అతని కొడుకు అక్షరాభ్యాసంతొ నవల ముగుస్తుంది.  “చదువు” లో కూడా సుందరం తండ్రి  కూడా పెందలాడే  కాలం చేస్తాడు. అప్పటి నుండి సీతమ్మ పొదుపుగా బతుకుతూ అతని చదువు సాగిస్తుంది. అయినా ఇతరత్రా రాబడీ వెసులుబాటు లేకుండా ఆ పొలం మీద వచ్చేదానిని సర్ధుబాటు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అది సుందరానికి అర్ధం కాదు. పైగా ఆర్ధిక కాటకం సుందరం చదువు సాగాలంటే పెళ్ళి చెయ్యక తప్పదనుకుంటుంది సీతమ్మ. పైగా మొగదిక్కులేని సంసారం కనుక మామగారి వైపు వాళ్ళు సలహా సంప్రదింపులకైనా ఉంటారన్న మరో ఆశ. ప్రేమించి గాని, పెళ్ళి చేసుకోకూడదనుకునే  సుందరానికి బాల్యవివాహమే జరుగుతుంది. సుందరం మామ గారు స్థితి మంతులేం కాదు. ఆయన కూతురి పెళ్ళి చేసి, కట్నం ఇచ్చి. ఇల్లు ఖాళీ చేసుకున్నంత పని చేసుకుంటాడు.

తల్లి పాతకాలపు ఆలోచనలతో వితంతు వివాహాలను వ్యతిరేకించడం సుందరానికి నచ్చదు. జానకి అత్తగారింటికి  పోతుంది. తల్లీ సుందరమే మిగులుతారు. అప్పుడుగాని తల్లీ కొడుకులమధ్యనున్న బంధమేదో అర్ధంకాదు. ఒకరి మాటపట్ల మరొకరికి ఆదరణ ఉండదు. సుందరానికి డబ్బుల చిక్కులు ,రాబడి ఖర్చులు, బాకీలు, వడ్డీలు మాట్లాడాలంటే ఇష్టం లేదు. వినాలంటేనే బాధ, చుట్టాలంటే విసుగు అట్లానే తల్లితో తన చదువు, ఆలోచనలు పంచుకోవడం అసలే ఇష్టం ఉండదు. అతనిది నలుగురితో కలిసే స్వభావంకాదు.

అతను బాహ్య  ప్రపంచంలో, యధార్ధ వ్యక్తుల మధ్య ఉండలేక పోయే వాడు. మనుషులంతా తప్పు దోవ పోతున్నట్లు సంఘం అంతా అగమ్యగోచరంగా పోతున్నట్టు అనిపింఛేది. వాడికి పుస్తకాలలోనూ , కథల్లోనూ ఊపిరి సలిపినట్టుగా మనుషులమధ్య సలిపేది కాదు. ఆ స్వభావమే సుందరాన్ని సాహిత్యం వైపు మళ్ళించింది. ” మానవ సమాజంతో ఆట్టే పరిచయం లేని లోపాన్ని ఈ సాహిత్యం అద్భుతంగా తీర్చింది. కనీసం తీర్చినట్టూ కనబడిందతనికి.” ఆ పుస్తకాల మధ్యనే ఉండడం వల్ల నిజ జీవితంలో అమలు కాని ఆదర్శాలు సుందరం మనస్సులో తిరిగేవి కులాలు, మతాలు, ఆచారాలు పోవాలి. మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలుండాలనుకునే వాడు.

ఏతా వాతసుందరం చదువు ఆర్ధిక ఇబ్బంది వల్ల ఆగిపోతుంది. అతనికి చెయ్యడానికి ఏపనీ లేదు. అప్పుడప్పుడూ కథలు రాయడం తప్ప. ఇదీ “చదువు” లో సుందరం జీవితం. జీవితంలో సంఘర్షణ ఉన్నదని దాన్ని ఎదుర్కొన్నవాడే దక్కుతాడని సుందరం  ఎరుగడు బతుకుదెరువు కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచన లేదు. అతను చదివే పుస్తకాలలో ఈ మహత్తర విషయాలేవీ లేవు. గొప్ప పనులు సాధించేవారు  ప్రపంచంలో ఉన్నారు. పడక కుర్చీలో కూర్చొని కూడా మానసికంగా వారిని ఆరాధించడం సుందరం దృష్టిలో ఒక ఆదర్శమే.

అందువల్లే సుందరనికి పెళ్ళైనప్పటీకి తల్లి పెద్దదైపోయినా ఇంకా అతని బాధ్యత తల్లి మీదే ఉన్నట్టు, కాశీపోయి చదువుకోవాలని తల్లినే డబ్బు అడుగుతాడు. అంతే కాని, చదువు ఎప్పుడవుతుందో నాలుగు రాళ్ళు ఎప్పుడు సంపాదిస్తాడో, అప్పు ఎలా తీరుతుందోనన్న తల్లి ఆందోళన అతనికి అర్ధమయ్యేది కాదు. అందుకే ఏదైనా పని చేసి కుటుంబాన్ని గట్టెక్కించాలనుకోడు. పైగా ఏరాఅబ్బాయ్ ఉద్యోగంలో ఎప్పుడు చేరతావురా! అని అడిగితే వాళ్లకు సరైన సంస్కారం లేక అలా అడిగారనుకుంటాడు. చదవాలనుకున్నంత వరకు చదవగలగడమే ఉత్తమ సంస్కారం అని సుందరం అభిప్రాయం.

అయితే కాశీ వెళ్ళాక  ఈ ధోరణిలో కొంత మార్పు వచ్చింది. విశ్వ విద్యాలయం మార్పును తెచ్చింది. రాజకీయ వాతావరణం, విద్యార్ధులు, టెర్రరిస్టులు, ఉప్పు సత్యాగ్రహం అన్నీ అతన్ని పుస్తకాల నుండి జీవితం మీదికి మరలించాయి. అయితే జాతీయోద్యమం మూలంగా కాలేజీ మూతపడీ  హాస్టల్ నుండి మధ్యంతరంగా వచ్చేయాల్సి వస్తుంది. తిరిగి కాలేజీ తెరిసేనాటికి కుటుంబ పరిస్థితుల్లో మార్పు  వచ్చి మళ్ళీ బెనారస్ వెళ్ళ లేకపోతాడు. చదువు మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుల కింద పొలం పోతుంది. ఇల్లు పోతుంది. ఇంట్లో వస్తువులు అమ్ముకుని తినాల్సివస్తుంది. మూడు రూపాయల అద్దెకు కిరాయి ఇంట్లో ఉంటూ ఏ పనీ చేయకుండానే కాలం వెళ్లదీస్తుంటాడు సుందరం. అతనికి చింత లేదు. ఏదైనా చేసేటందుకుండి  చేయక పోతే చింత. సుందరానికి చేసేటందుకు ఏమీ లేదు. అందుకే నాకు ఏ చింతా లేదు అంటాడు. ఇది సుందరం జీవితం. బతుకు దాని దారిన అది పోతుంటే అటు పోనివ్వడమే. అందులో మానవ యత్నం ఏదీ లేదు. నిష్పూచీ మనస్తత్వం. అందుకే తల్లి పట్లనే కాదు. భార్య పట్లకూడా చూపించాల్సినంత శ్రద్ద చూపించలేదు. చదువు కోసం పోతుంటే భార్య బాధ పడుతుంటే గోరంత ఉంటే కొండంత చేస్తుందని ఆమె  ప్రేమను కూడా శంకిస్తాడు.

తనకు తాను గొప్ప, ప్రతి వాళ్ల ప్రేమను శంకించడం.. తనను తాను ప్రేమించుకోలేడు. ఇక ఇతరులను ఏమి ప్రేమిస్తాడు. తల్లి పొదుపు చేస్తుందని, లెక్కలేస్తుందని చులకన. ఎంత చేసినా మొత్తం ఆస్తి ఇంటితో సహా అప్పుల పాలే అయిపోయాయి.  జానకి మొగుడు నాటకాలు వేసిఅయినా భార్యా పిల్లలని బతికిస్తాడు. కానీ, డిగ్రీ చదివి సుందరం విధికి వదిలేశాడు భవిష్యత్తును. పైగా వాడి చదువుకు జానకి మొగుడు డబ్బివ్వకుండా పెళ్ళానికి బంగారం చేయించుకున్నాడని మనస్సులో తిట్టుకుంటాడు. ఇంతకూ సుందరం తల్లికి గానీ, భార్యకు గానీ చేసిందేమీ లేదు. “అనుభవం” లో గాని,” చదువు”లో గాని, పిల్లల పెంపకంలో తండ్రుల ప్రమేయం ఏమీ ఉండదు. ఈ ఇద్దరి పరిణామంలో తల్లి పాత్రే ప్రధానం అయినా రెండు నవలల్లోను ఒంటరి జీవితంతో తల్లులు పడ్డ ఘర్షణను కొడుకులు అర్ధం చేసుకున్నట్టు కనబడదు.పైగా వారి పట్ల చిన్న చూపు ప్రదర్శిస్తారు.

ఎందుకో కొ.కు.కు తల్లి పాత్రల పట్ల సహానుభూతి తక్కువుందనిపిస్తుంది. దానికి సామాజిక కారణాలతో పాటు వ్యక్తిగా కొ.కు జీవితానుభవాలు కూడా ప్రతిబింబించాయా? అన్న చిన్న అనుమానమేస్తుంది. చిన్ననాడే తల్లిదండ్రి దూరమవడంతో హృదయగత మమకారపు అంచులు ఆయన తెలుసుకోవడం కష్టం. పై వాళ్ల పెంపకం- ఎంత ప్రేమతో పెంచినా తల్లి స్పర్శ ఎరుగని మనస్సు – అది ఎప్పటికీ లోటుగానే ఉంటుంది. ఆయన తరచుగా తండ్రి పట్ల సానుభూతి పాత్రలు రాయగలిగారు. కానీ తల్లి పట్ల ఓ కించెత్తు నిరసనే ధ్వనిస్తుంది. బహుశా ఎవరైతే ఏం? దూరపు తల్లి చేరికలో ఆదూరం అనుభవించి ఉండవచ్చు. బిడ్డల పెంపకంలో తండ్రి నిమిత్తమాత్రుడేగా ఏనాడైనా!  కొ.కు.ను కూడా ఆ పెంచిన తండ్రి తన బాధ్యతగా అడిగింది కాదనకుండా ఇచ్చి ఉండవచ్చు. ఇంటెడు చాకిరీ చేసే అవసరం లేని పుణ్య పురుషులు ఎప్పుడూ మంచివారే.

“అనుభవం” లో గాని “చదువు”లో గాని తల్లుల డబ్బు యావ మీద వ్యగ్రత ఉంటుంది కానీ, ఆ తల్లులకున్న అభద్రతను పోగొట్టడానికి కొడుకులు ఏమీ చెయ్యరు. పిసరంత ధైర్యం చెప్పిన పాపాన పోరు. మేము మూటలు మోసి అయినా రూపాయి సంపాదిస్తామన్న భరోసా యివ్వరు. అయినా ఆ తల్లులు, కొడుకులను ఇంట్లోనుంచి పొమ్మనలేదు. వారే అవతలికి వెళ్లి పోయారు. “సవతి తల్లి ” లోనూ దాసు తల్లిని, అక్కని ఏమీ మందలించడు. ఆమె చాదస్తానికి పిల్లలు బలైపొతున్నారని విచారపడూతుంటాడు తీరిగ్గా.  తల్లితో ఘర్షణ పడడు . ఆమె పెత్తనాన్ని యధేచ్చగా అనుమతిస్తాడు. ఇక రెండో భార్య రాజ్యం రావడంతో ఘర్షణ మొదలవుతుంది. పైగా రాజ్యాన్ని, ” ఆమె కు చదువులేనివాళ్ళంటే చిన్న చూపు ” అని ఓ మాటతో పరిచయం చేస్తాడు.
దాసుకు భార్యా భర్తల సంబందం మీద మంచి అభిప్రాయాలున్నట్టు పరిచయం చేస్తూనే, “ఈ పెళ్ళాలు సుఖపడనిస్తారా!” అని ఓ విసురు విసురుతాడు. అంత తెలివి ఉన్న దాసు తల్లిని మందలించి ఆమెను సంస్కరించేప్రయత్నం ఎందుకు చేయలేదు? చేసినా తల్లి మారదు అనుకుంటే ఆ ఘర్షణేదో తల్లీ కొడుకు పడక, రాజ్యానికి, తల్లికి ఎందుకు షిఫ్టు చేసినట్టు? చివరికి రాజ్యం పిల్లల్ని బాగు చేసే ప్రయత్నం అత్తకు సవతి తల్లి చర్యగా, వెంకమ్మది అత్త దాష్టీకంగా మిగిలిపోతుంది. ఇది అత్తాకోడళ్ళ తగాదాగా, దాసు భార్య వైపు నిల్చోవడం, భార్యను గౌరవించే ముందు చూపు వైపు సాగినట్లు , ప్రజాస్వామ్య భర్తగా మనం గుర్తిస్తాము. .. ఎంత హాయి.

చేసే హింస చేస్తూ అహింసను గూర్చి కబుర్లు చెబుతుంటే పసిపిల్లలు చూసింది నేర్చుకుంటారు తప్ప చెప్పేది నమ్మరని, పిల్లలకట్లా అబద్దాలు చెప్పి వారిని మానసికంగా దెబ్బ తీయరాదని ” పిల్లల పెంపకం” గురించి చెప్తారు కొ.కు. పిల్లల్ని పెంచడం రెండు రకాలు ఒకటీ – చావగొట్టీ చెవులు మూసి చెప్పిన మాట వినేటట్టు చేయడం, లేకపోతే వాళ్లని గారాబం చేసి వాళ్లు ఆడినట్టు ఆడడం…. అని లోక రీతి గూర్చి చెప్తారు.

నల్లుల్ని చంపడం పాపమని, నల్లుల కోసం మంత్రం, తేళ్లను  కొండి కత్తరించి వదిలేయడం చూసి కిష్టుడికి అన్నింటిమీద జాలి కలుగుతుంది. దానితో బాటు కాకులను, పిచ్చుకలను, కుక్కలను వీలైనప్పుడల్లా మేపడం అలవాటవుతుంది. అయితే తల్లి చెప్పేది వట్టిదని తల్లి ప్రవర్తన వల్ల, లోక రీతి వల్ల అర్ధం చేసుకుంటాడు. జీవ హింస చేయరాదని చెప్పే తల్లి కాకులకు అన్నం పెడితే  తిడుతుంది. పిల్లి ఏమో ఎలుకలను చంపుతుంది. మున్సిపాలిటీ వాళ్లు కుక్కల్ని చంపుతారు,  తప్పు లేదు.

దానితో వాడు తేళ్లని, నల్లుల్నే కాదు. ఏది కనబడ్డా చంపసాగాడు. చివరికి తండ్రి మీద కూడా కోపంవచ్చి పలక విసిరేస్తాడు. కిష్టుడెంతగానో ప్రేమించిన కుక్కపిల్లను మున్సిపాలిటీ వాళ్ళు చంపిన కోపం ఈ రకంగా పరిణమించిందని అందుకే, లేని “దయ ” ను నటించి పిల్లల్ని మానసికంగా దెబ్బ తీయకూడదంటాడు కొ.కు. అతి భయం ,అతిజాగ్రత్త పేరుతో పిల్లలకు ప్రవర్తనంటే తెలియకుండా చేసే మూర్ఖపు తల్లిదండ్రులగురించి “వరప్రసాదం”లో చూపారు. వెంకట నారాయణ పెరిగే కొద్దీ తల్లీ తండ్రీ ఎవరికి వాళ్లు తమ వైపుకు లాక్కు పోవలన్న దుగ్ధ తో చేసిన నిర్వాకం వల్ల ఎట్లా ప్రవర్తించాలో తెలియకుండా పోతుంది.

వాడిని ఎవరన్నా పలకరిస్తే భయపడతాడు. తనుమాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా వింటున్నారనుకుంటే మాట్లాడటం ఆపేస్తాడు. పాపం నవ్వినా వాడి మూతి పక్కకి తోసుకుపోతుంది. వాడు తన్ను తాను మరిచిపోలేని జబ్బుతో బాధపడుతూ , రోగిష్టిలా మారటానికి తల్లిదండ్రులు బాధ్యులంటాడు కొ.కు.
పెంచడం చేతకాని తల్లిదండ్రుల వల్ల ఎంత నష్టమూ… సంస్కారవంతమైన తల్లిదండ్రుల దగ్గర పెరిగితే పిల్లలు ఎలా వుంటారో? చిట్టీ, నరుసులను గురించి “తల్లిలేని పిల్ల” లో చెప్పారు.

శివయ్యా, జానకమ్మ సంస్కారవంతమైన దంపతులు. వాళ్లు పిల్లలని ఎన్నడూ కొట్టరు. .. తిట్టరు.. వాళ్ల పిల్లలు మంచి తోటమాలి పెంచిన తోటలోని పువ్వుల్లా వుంటారు. కానీ హఠాత్తుగా జానకమ్మ చనిపోతుంది. కొన్నాళ్లకు తిరిగి లక్ష్మిని పెళ్ళాడతాడు. లక్ష్మి సంస్కారంలో – సవతి పిల్లల్ని ప్రేమించరాదు. సొంతపిల్లల్ని ప్రేమించాలి. అనే ధోరణిలో ఉంటుంది. అసలు పిల్లల్ని పెంచడంలోనే ఆమె బాణీ వేరు. అయితే శివయ్య లక్ష్మి సంస్కారాన్ని పెంచే బాధ్యత తీసుకోడు. లక్ష్మికి ఆమె సంస్కారం మీద గొప్ప ఆత్మవిశ్వాసం. శివయ్య చివరికి తన సంస్కారం మీద ఆత్మ విశ్వాసం కోల్పోయి ఆమె సంస్కారానికి తలొగ్గుతాడు.” తమకన్నా తక్కువ సంస్కారం వున్న వారినైనా  క్షమిస్తారు గానీ ఎక్కువ సంస్కారం వున్న వారినిబొత్తిగా క్షమించరు” అంటాడు కొ.కు.
అక్కడి నుండి శివయ్య లక్ష్మి చెప్పేవి వినడం.. ఆమె కొడుతుంటే చూస్తూ  వూరుకోవడమే కాక ..  చివరికి తను కూడా చెయ్యి చేసుకుంటాడు. దానితో పిల్లలు దూరమవుతారు ఆయనకు. నరసు తన ఇష్టం మీద  త్వరగా పెళ్ళి చేసుకుని చెల్లెల్ని తన అత్త వారింటికి తీసుకెళతాడు. శివయ్యని  వెళ్ళి “చంటి”ని రమ్మంటే రానంటుంది. నరుసు దాని మీద – “ముందు ఆ ఇంటిని బాగు చెయ్యి… అది పశువుల పాక లాగా వుంది”.. మీ కంటే మాకు ఇక్కడ ఎక్కువ వాళ్ళూ లేరు. కానీ వాళ్ళు మమ్మల్ని తమ  వాళ్ళను  చేసుకోవాలనుకుంటున్నారు. మీరేమో దూరం చేసుకున్నారు అని తండ్రికి కళ్లు తెరిపిస్తాడు.
నరసుకు అంతజ్ఞానం కూడా – తల్లి జానకమ్మ వుండగా ఆ ఇంటిలో నేర్చుకున్నదే. అటువంటి పిల్లలుండటం, ఆ తల్లి దండ్రుల అదృష్టం అని ఒకప్పుడు లోకం అన్న మాట – శివయ్యను చివరికి కలిగిన జ్ఞానోదయం చూస్తే  నిజమేనని పిస్తుంది.

అయితే పిల్లల పట్ల ప్రేమగా వుండటం ఎంత అవసరమో వారికి మనుషుల పట్ల బాధ్యత నేర్పడం అంతకంటే ముఖ్యమని దుక్కిటెద్దు, పంచరత్నాలు కథల్లో చెప్తారు. బాధ్యత నేర్వని పెంపకం వల్ల తామే ముఖ్యమన్న స్వార్ధాన్ని పెంచి  పరమ స్వార్ధ పరులుగా చేస్తుందని చెప్పడం ఈ కథల లక్ష్యం.
“దుక్కి టెద్దు” లో కిష్టయ్య తల్లి చనిపోవడంతో మారుటి తల్లి అనాదరణ వల్ల – తండ్రికి కూడా దూరమైపోయి.. చిన్నతనం నుండి నానా కష్టాలు  పడి పైకి వస్తాడు. దానితో తనలాగా తన పిల్లలు కష్టపడకూడదని, వాళ్లు ఆడింది ఆటగా, పాడింది పాటగా చేసి  బాధ్యత  తెలియకుండా పెంచుతాడు. ఇక పిల్లలు తండ్రిని కోరిందే తడువుగా డబ్బిచ్చే యంత్రం గా భావిస్తారు. ఆయన సంపాదన కోసం రాత్రుల్లూ పగళ్ళూ బయటనే తిరుగుతుంటే.. ఇంట్లో వాళ్లు దానికి అలవాటు పడి, ఏ రోజన్నా అతడు  నలతగా వుండి ఇంట్లో వుంటే ఆశ్చర్య పోయేవాళ్లు.

చివరికి కిష్టయ్య తను సంపాదించేయంత్రాన్నే కానీ, వాళ్లల్లో ఒకడిగా లేకుండా పొయానని పశ్చాత్తాపడి లోలోపల బాధపడతాడు. ఇదంతా కిష్టయ్య చిన్న కొడుకు పద్యాలు రాసి పత్రికను పంపి “దుక్కిటెద్దు” అని పేరు పెడతాడు. అది కిష్టయ్య చదివి తన గురించే ననుకుంటాడు.

“పంచరత్నా”ల్లో రామకృష్ణయ్యకు రత్నాల వంటి ఐదుగురు కొడుకులు. తన కొడుకులు తనలాగా బతకలేని బడిపంతులుగా కాకూడదని, వాళ్లను “పందెం గుర్రాల్లా” పోటీ చదువులు చదివిస్తారు. ఒక్కొక్కడూ డాక్టరు, లాయరు, ఇంజనీరులుగా  స్థిరపడతారు – కానీ ఒక్క కొడుకూ – తమ తండ్రి జాగ్రత్తవల్లే మేమింత వాళ్లమయ్యామని  అనుకోకపోగా- ఆయన చెప్పినట్లు వింటే- మేం ఆయన లాగానే తయారయ్యే వాళ్లమంటారు.

ఒక్క కొడుకు మాత్రం కమ్యూనిష్టు అవుతాడు. అతన్ని తండ్రి హర్షించడు. పనికిరాకుండా పోయాడనుకుంటాడు. అయితే  ఆ కమ్యూనిష్టు కొడుకూ ఆయన్ను పట్టించుకోడు. పిల్లలైతే రత్నాలేగానీ- బేసిక్ గా అవి రాళ్ళే గదా!

ఇవన్నీ పిల్లల పెంపకంలో చేయకూడని పద్ధతులని చెబితే, ఇంకోవైపు   అదే పిల్లలు తమకు డబ్బు పెరిగితే ఎట్లా  ప్రవర్తిస్తారో చెప్పే కథ “తిండిదొంగ”. అన్న కుటుంబం ఆకలిచావులకు గురవుతుంటే.. చెల్లెలు కనీసపు సహాయం చెయ్యకపోగా.. అల్లుడు ఎంత ఎగతాళిగా మాట్లాడతాడో చూపించిన కథ.
“తిండి దొంగలంటే జ్ఞాపకం వచ్చింది. మొన్న మాఅత్తగారు ఏం చేసిందనుకున్నారూ?.. ఎవరితోనూ చెప్పకుండా పెద్దగిన్నెలో అన్నమూ, కూరలూ పిండి వంటలూ అనీ పెట్టుకుని కొడుకు దగ్గరుకు వెళ్ళిపోయింది.”.. ఇది అత్తగారి పట్ల అల్లుడి వ్యాఖ్య.

వెంకాయమ్మ తాహతుకి మించి కూతురికి అప్పుచేసి మరీ పెళ్ళి చేసింది. అప్పు తీరలేదు. కొడుకు ఎక్కి వచ్చాక పొలం అమ్మి అప్పు తీర్చాడు. రమణయ్య సహజంగానే మంచివాడు. అందుకే చెల్లెలి పెళ్ళికి అప్పుచేసి.. నన్ను ఒట్టి వాడిని చేశావని తల్లిని నిందించలేదు. అలాగే భార్య పట్లకూడా చాలా ప్రేమగా వుండేవాడు. వాళ్ళిద్దరి దాంపత్యం చూస్తుంటే వెంకాయమ్మకు – తన భర్త ప్రవర్తన గుర్తుకువచ్చి కోడలూ- కొడుకు మీద ఎంతో ఆపేక్ష పుట్టేది. భవిష్యత్తుల్లో దంపతులట్లా వుంటారనే  ఒక ఆశ కలిగేదామెకు.

అయితే దరిద్రం మనుషుల మంచితనాన్ని  మన్నించదు. తమతో పాటు తల్లిని దరిద్రానికి గురిచేయడమెందుకని చెల్లెలి దగ్గరకు పంపుతాడు రమణయ్య . కానీ ఒక్క వారం రోజుల్లో కూతురింట తాను పనికి రానిదని తేలిపోతుంది వెంకాయమ్మకు. ఒక రోజు కూతురింట్లో విందు జరుగుతుంది. అప్పుడే కొడుకు దగ్గర నుండి ఉత్తరం వస్తుంది మూడు రోజులుగా కోడలు మంచం దిగలేదని, డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళలేదని – ఆకలి రోగానికి డాక్టరు మాత్రం చేసేదేముందని – రాస్తాడు. ఆ ఉత్తరం చూసి విందు భోజనం కాదు గదా గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేకపోయింది వెంకాయమ్మ.
ఆ విందులో విస్తళ్ళలో ఎక్కువై పారవేశారు చాలా మంది . ఇంకా మిగిలి పోయిన పదార్ధాలు మరో విందు చేసేటంతవుతాయి. అక్కడ కొడుకు ఇంట్లో అకలి చావుకు ఎదురు చూస్తున్నారు. ఆ స్థితిలో పెద్ద గిన్నెలో తిండి పదార్థాలు పెట్టుకుని అర్ధరాత్రి కొడుకు ఇంటికి పోతుంది. వెంకాయమ్మ.

తన బావమరిది గర్భ దరిద్రం వల్ల తన అత్తగారు అలా చెయ్యాలని వచ్చిందని మనిషిగా ఏ మాత్రం కించపడకపోగా – అదో పెద్ద హాస్యం కింద డాక్టరు అల్లుడు క్లబ్బులో చెబుతాడు. నిజానికి ఈ డాక్టరు అల్లుడికి తలకి మించిన కట్నం ఇవ్వడం వల్లే – వాళ్లు గర్భ దరిద్రులయ్యారు. ఈ కథలో కుటుంబ వ్యవస్థ ఎంత నీచ స్థాయిలో వుందో- డబ్బు ఎంత హీన స్థితికి మనుషులను దిగజార్చుతుందో చెప్పడమే దీని ఉద్దేశ్యం.

వెంకాయమ్మ నోరు తెరచి కూతుర్ని “కొద్దిగా డబ్బుంటే అన్నకు పంపరాదుటే” అంటే.. “నా కిట్లాంటివి అసహ్యం” అంటుంది కూతురు. డబ్బుకు దారిద్ర్యం మీద గల నిర్లక్ష్యానికి నిదర్శనమే  కుటుంబ సంబంధాలలోని డొల్లతనం. నిరూపించడానికి ఇంతకంటే ఏం కావాలి?.. అవి రక్త సంబంధాలైనా సరే!
ఇటువంటిదే “అంతరాత్మ” కథ.  తండ్రి చనిపోతే తల్లికి ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. అప్పటిదాకా భర్త, భావలను గౌరవిస్తూ పూజలకు, చాదస్తాలకు దూరంగా వున్న భార్య – కొత్తగా పూజలు మొదలు పెడుతుంది. పిల్లలు తల్లిని డబ్బున్న తల్లిగా, ఎవరికి కావలసినవి వాళ్ళు కోరుతుంటారు. తల్లి అందరికీ వరాలిస్తుంది. చివరకు ఓ అల్లుడు ఉద్యోగం మానుకొని భార్యతో సహా  కాపురం తెచ్చి అత్తగారింటిలో పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళూ చేరతారు.
ఇదంతా చిన్న కొడుక్కీ, చిన్న కూతురికీ నచ్చదు. అసలు డబ్బు వచ్చాక తల్లి ప్రవర్తించే తీరునే చీదరించుకుంటుంటారు. ఆ నిరసనతో చిన్నకూతురు తన పెళ్ళి తనే చేసుకుంటుంది. తల్లి కట్నమిస్తానన్నా వద్దంటుంది. చివరకు ఆ డబ్బు వల్ల అందరూ ఏదో ఒక దానికి నిరంతరం గొడవలు పడుతూ ద్వేషించుకుంటూ ఉంటారు. ” ఆ కొంపలో ఎవరికి ఎదురుదెబ్బ తగిలినా మిగిలిన వారంతా ఏకగ్రీవంగా నవ్వడానికి సిద్ధంగా వుంటారు.”  అన్న మాటతో కథ ముగిసిపోతుంది. ఇంతకంటే కుళ్ళు ఇంకేం వుంటుందీ? ఇవి మన కుటుంబాలకు ప్రతీకలు.

అయితే ఇంత కుళ్ళిపోయిన వ్యవస్థను పట్టుకుని వేళ్ళాడటం ఎందుకుమరి? యుగాలుగా ఈ తపన దేనికీ? అసలు కొ.కు. కూడా ఈ వ్యవస్థ అంతమవ్వాలనే కోరుకున్నారా? అది తరువాత చూద్దాం

అయితే ఈ వ్యవస్థ ఇంతకుళ్ళిపోయినా.. ఇది సమాజానికి ఎంతో అవసరమయింది. కుటుంబమే లేకపోతే రాజ్యం ఎక్కడ వుంటుందీ? ఎవడికి ఎవడూ? అందుకే ఈ పెట్టుబడి, ఈ రాజ్యమూ, ఈ కుటుంబాన్ని నిలబెడుతుంది, నిలబెడతాయి . అందుకోసం వారసులను కనమంటుంది. వాళ్లు నీకే పుట్టకపోతేమాత్రమేం? ఇది “వారసత్వం” నవలలో చెప్పిన జీవితసత్యం. కుటుంబ వ్యవస్థలోని “మేడిపండు” జీవితాలకు ఇదో మచ్చు అవుతుంది.
భానుమతి భర్త చనిపోతాడు. తండ్రిలేని అనాధామె. ఆమె బాధ్యత మీద తమ్ముడు కూడా ఆమె దగ్గరే వుంటుంటాడు. భానుమతి భర్త వైపు చుట్టం సుదర్శనం. ఆమెను పెళ్ళిలో చూసినప్పటినుండి ఆమె మీద అవ్యాజమైన ప్రేమను పెంచుకుంటాడు. భర్త చనిపోయి నిస్సహాయురాలైన భానుమతిని ఆ ఆరాధనలోనే చేరదీస్తాడు.

అయితే సుదర్శనం కుటుంబం భానుమతిని దెబ్బతియ్యాలని ఎదురు చూస్తుంది. సుదర్శనం కొడుకు “రామదాసు” భానుమతితో ఆమెకు కట్టించిన ఇంటి కింద అప్పు తెచ్చి తండ్రికి తెలియకుండా ప్రామిసరీనోటు రాయించి అట్టి పెట్టుకుంటాడు. తల్లి దుర్గాంబ  భానుమతితో ప్రేమ నటిస్తూ ఆమెకు గర్భస్తావం చేయిస్తుంది.

దాసు నపుంసకుడూ, భార్య బల, భాను తమ్ముడు “శాస్త్రి”ని చేరదీసి- పిల్లల్ని కంటుంది. ఈ విషయం దాసుకీ తెలుసుకానీ బైటపడడు. భాను కూతురు “పద్మ”ను తన వ్యాపార అవసరాల  కోసం ఇతరులకు తారుస్తాడు దాసు. పైగా అది తప్పు కాదని నీతి బోధ చేస్తాడు. తన చెల్లెలు ఇలాంటివి పట్టించుకోదని – మెడికల్ అవసరాలుంటే తను తీరుస్తానని చెప్తాడు.

దాసు మెల్లిగా వ్యాపారాన్ని కంట్రోల్ కి తెచ్చుకుని, తండ్రిని నామ మాత్రం చేస్తాడు. చివరికి వ్యాపారం పేరుతో దొంగ ఖద్దరు అమ్మి శాస్ర్ర్త్రి ని ముంచుతాడు. భాను ఇల్లు అప్పుకింద “బాల “పేరుతో రిజిష్టరు చేయించుకుంటాడు.

ఈ స్థితిలో సుదర్శనం కట్టుబట్టలతో “భానుమతి”తో బయటకు వస్తాడు. పద్మకు ఎవరి ద్వారానో గర్భం వస్తే – తాను ప్రేమించిన అమ్మాయిని వొదిలి పద్మను చేసుకుంటాడు శాస్త్రి.  అట్లా పద్మ గర్భంలో  వున్న ఎవరో బిడ్డకు తాను తండ్రి అవుతాడు.

ప్రేమించకుండా డబ్బుకోసం దుర్గాంబను పెళ్ళాడిన సుదర్శనం ప్రేమించిన భాను కోసం డబ్బును వొదిలి వచ్చేస్తాడు. నిజానికి డబ్బు అతని జీవితంలోకి ప్రవేశించగానే.. తాను జీవితంలో ఏం కోల్పోయాడో అర్ధం చేసుకుంటాడు. ప్రేమించిన దానితో రంకుపోవడం పై బాధపడతాడు.

దాసు డబ్బుగల వ్యాపారవేత్తగా చలామణి అవుతాడు. సంఘంలో గొప్ప కుటుంబాల్లోకి చేరిపోతాడు. అయితే ఆ కుటుంబం ఎట్లా వుందో.. మేడిపండు లాంటి కుటుంబాన్ని గురించి నిరసనతోనే రాశారిది కొ.కు.

ఇటువంటి కుటుంబాల్లో ఏ ఇద్దరిమధ్యనైనా మానవ సంబంధాలుండటం సాధ్యం కాదని డబ్బు చుట్టు తిరుగుతుంటారని నిరూపించారు. పాత భూస్వామ్య విలువల్లో వుండే ఎంతోకొంత మానవీయత  ధన స్వామ్యం విలువల్లో ఎట్లా మంటగలిసి పోతుందో.. తండ్రి సుదర్శనం – కొడుకు రామదాసుల ద్వారా నిరూపించారు .సుదర్శనం తను రెండో భార్యగా తీసుకొచ్చిన భానుమతి మీద నిజంగా ప్రేమ చూపిస్తాడు. ఆమెను కష్టపెట్టకుండా చూడాలనుకుంటాడు. కానీ”దాసు”కు అన్నీ వ్యాపారంలో భాగమే. దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు.
డబ్బు చుట్టూ తిరిగే కుటుంబాలు ఇవి. డబ్బుముందు అన్ని సంబంధాలు బలాదూర్.

“ఐశ్వర్యం”లోనూ – నర్సు తల్లిదండ్రుల దగ్గర చాలా ఆదర్యంగా పెరుగుతుంది. తాత నర్సింహయ్య తన తల్లిని వితంతు వివాహం చేసుకున్నాడని తండ్రిని బహిష్కరించిన వాడు. అయితే చివరిదశలో నరసింహయ్య ప్రేమలేక తన వాళ్లనే వారు లేక తపన బడతాడు. ఆయినా కొడుకుని, కోడలిని చేరదీయ్యకుండా సూర్యం ద్వారా నర్సుని చేరదీస్తాడు. తాత దగ్గరికి వెళ్ళిన “నర్సు” ఆయన ఆస్థిని చూసి – తన తండ్రి దగ్గర ప్రతి దానికి పేదరికం అనుభవించడానికి వ్రతం చేస్తున్నట్టు వుండటం – తాత దగ్గర  దర్జా వెలగబెట్టడానికి అవకాశముండటం నర్సుని మార్చివేస్తుంది.

చివరకు తల్లికి తిరిగి గర్భం వచ్చిందని తెలిసిన ఆమె పుట్టబోయే వాళ్ళు ఈ ఆస్తిలో భాగం పంచుకోకుండా వుండాలంటే మొత్తం తన పేరుతో రిజిష్టరు చేయించమని సూర్యాన్ని ప్రోద్భలం చేస్తుంది.  ఆస్తి మరెవరికీ దక్కకుండా చూసుకుంటుంది.

ఆస్తి ముందు తల్లీ లేదు. చెల్లెలూ లేదు. వీటన్నిటిలో తామిట్లా ప్రవర్తిసున్నామని.. ఇంత నీచంగా వుండటం సరైంది కాదని అనుకోరు. డబ్బుకోసం పైపైకి ఎగబాకడం లోకంలో సహజ నీతి . సంఘం ఆమోదించేది. కాని “అనామిక” లో అలా కాదు. వాళ్లిద్దరిదిఎంతో అన్యోన్యమైన దాంపత్యమని  లోకం అనుకుంటుంది అట్లా ఆనందంగా ఉన్నామని ఆనందరావూ, సీతా లోకాన్ని నమ్మించడానికి ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇది మరింత విషాదం.  ఆ విషాదాన్ని భరించలేక “సీత” ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక్కడ డబ్బున్న వాళ్ల  పైపై జీవితాల్లో వుండే చీకటిని చూపించడమే కాదు. తాను ఎట్లాంటి  కృత్రిమమైన బతుకు బతుకుతున్నామో తెలుసుకున్న ఆడది జీవితాన్ని భరించలేదు. “అజ్ఞానం వరం” అంటారు. అది తిరగ తిప్పి “జ్ఞానం శాపం” కింద మారడం “అనామిక”లో చూడవచ్చు.

పై కథల్లో నవలల్లో కుటుంబాల పేరుతో, భార్య భర్తల పేరుతో పెళ్ళిళ్ళ పేరుతో  అమలయ్యే కుహనా విలువలు ఎలా వుంటాయో చూపితే – అసలు కుటుంబాల కవతల వేశ్యలన్న పేరుతో సంఘం వెలివేసిన మనుషులు – డబ్బు ప్రమేయం లేక, స్వేచ్చ ఆత్మాభిమానంతో ఎలా వున్నారో “ఎండమావులు”, నీకేంకావాలి”, “చెడిపోయిన మనిషి”లలో చూపించారు.

కొ.కు కు భోగం వాళ్ల పట్ల  నైతిక విలువలు అతిక్రమించిన వాళ్ళ పట్ల.. సమాజం నుండి వెలివేయబడ్డ వాళ్ల మీద అపారమైన గౌరవం, ప్రేమ వున్నదని – “నీకేంకావాలి” “ఎండమావులు” ద్వారా తెలుస్తుంది. “నీకేంకావాలి”లో కస్తూరికి డబ్బుకంటే కూడా “స్వేచ్ఛ” ముఖ్యం. అందుకే పదివేలు ఇచ్చేవాడు వచ్చినా అంగీకరించదు. “వాడు ఘోష పెట్టి చంపుతాడని తిరస్కరిస్తుంది. అయితే భావనారాయణ మిత్రుడిని ఇష్టపడ్డాక.. అన్నీ మానేయడానికి సిద్ధ పడుతుంది.” వచ్చిన వాళ్ళకు ఏం చెప్పమంటావు” అంటుంది “నేనీ మధ్య చెడి పోయినానని” చెప్పమంటాడు భావనారాయణ మిత్రుడు.

ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది గనక పెళ్లాడదామని ప్రపోజల్  పెడతాడు. కానీ కస్తూరి పెళ్ళికి “నో”అంటుంది. “పోనీ మాఇంటికి వచ్చి వుండు” అని అడుగుతాడూ. “కుక్కకంటే హీనమై పోనా” – అని అడుగుతుంది.

“నా యిల్లు నాకుండి, నా కులం నాకుండి, నన్ను ఒకడు అదుపు చేయడానికి లేకుండా వుంటే నన్నేం చేసినా ఇష్టమే. అంతే కాని తెనాలి రామలింగడు నల్లకుక్కను గంగిగోవు చేసినట్టు నన్ను బానిసదాన్ని చెయ్యాలంటే మాత్రం అక్కర్లా!.. నేనెవరికీ పెళ్ళాన్ని కాను, భోగం ముండను”.. అని తన స్వేచ్ఛను ప్రకటిస్తుంది.

ఒకడిని పెళ్ళాడి, వాడికే పిల్లల్ని కని, వాడు పెట్టే తిండి కోసం కనిపెట్టుకుని వుండే వాళ్లకు స్వేచ్ఛగా బతకడం సాధ్యంకాదని కస్తూరి నమ్మకం.
అట్లాగే “ఎండమావులో” రంగారావు, సుందరంలు కలిసి వుంటుంటారు. పెళ్ళి వద్దంటుంది. రంగారావుకు  సినిమా ఛాన్సులు తగిలాక సుందరం ఎక్స్ ట్రా వేషాలను వద్దంటాడు. కానీ సుందరం ఒప్పుకోదు. నీకు ఈ సినిమా ఛాన్సులు తగ్గి నిన్ను నువ్వు పోషించుకోలేని కష్టంలో వుంటే.. నిన్ను అడుక్కోవాలంటే ఎట్లా? నీకు భార్యనయి నీతో పాటు సీతలాగా అడవికి పోయి కష్టాలు పడేకంటే.. నేను సుందరంగానే వుంటే, ఆ రోజూ సంపాదించి పెట్టగలుగుతాను కదా!” అంటుంది.

ఇందులో కస్తూరికీ, సుందరానికీ కూడా ఏమైనా చిన్నపాటి తేడా వుందేమో ననిపిస్తుంది. కస్తూరి స్వేచ్ఛకోసం, అభిమానం కోసం, పెళ్ళి తిరస్కరిస్తుంది. డబ్బుకోసం కాదు. అందుకే, ఎవరైనా వస్తే ఏం చెప్పమంటావు అంటుంది.  కానీ సుందరం డబ్బు సంపాదించే వెసులు బాటు కోసం పెళ్ళి వద్దంటుంది. ఆతను  సంపాదించలేని నాడు ఆమె సంపాదించడానికి. “ఒకడితో పెళ్ళయితే పాతి వ్రత్యం పాటించాలి గదా!.. అటువంటప్పుడు డబ్బు అవసరమైతే ఎట్లా? అంటుంది… దీన్నెట్లా ఆలోచించాలి?

నిజానికి ఈ రకమైన జీవితంలో ఆత్మరక్షణ గాని, ఆత్మాభిమానం గాని ఎంతవరకు? యవ్వనం చేజారిపోయాక ఏరకమైన రక్షణ వుంటుంది? అందుకే మధురవాణితో కాపు భార్యనై వంగతోటలో పని చేసుకుంటే బాగుండుననిపించాడు గురజాడ. శ్రమ శక్తి యొక్క విలువను ప్రతిపాదించాడాయన.
అసలు శరీరాన్ని పనిముట్టుగా భావించడం సరైనదేనా? ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక అయిన వేశ్యావృత్తిని ఎలా చూడాలి? నిజానికి స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధాన్ని వొట్టి లైంగిక క్రియగానే చూడాలా? లేక ఇద్దరి మనసుల కలయిక వల్ల ఉద్భవించే సంతోషం లో భాగంగా ఈ క్రియను చూడాలా? ఆ స్థాయికి తీసుకుపోవడానికి సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది.

అంతే గాక మానవ సమాజాభివృద్ద్దికి మూలమైన స్త్రీ పురుష సంబంధాలను, పునరుత్పత్తి ప్రక్రియను అంత తక్కువగా చూడవచ్చా? ఇప్పటీకి కూడా ఈ సమాజం చేస్తున్న పనినే మనం కూడా పరోక్షంగా అంగీకరించవచ్చా? అలా అయితే కొ.కు నే ప్రేమ లేని చోట లైంగిక సంబంధాలు పశుప్రాయం కదా అని  ఎందుకన్నట్టు?

అయితే పెళ్ళికాకుండా కలిసిఉండటంలో తప్పు లేదు . అది ఆ ఇద్దరి మానసిక పరిణితికి చెందింది. ఏ ఇద్దరికైనా, ఓ తాత్విక స్థాయికి వాళ్ల ఆలోచనలు, ఆచరణ చేరి అలా ఉండలనుకోవడాన్ని సమాజం అహ్వానించాలి. అట్లా ఆవైపుగా సమాజం పయనించడానికి అభ్యుదయ వాదులంతా ప్రయత్నించాలి. కొ.కు “చెడిపోయిన  మనిషి”లో ఈ మాటే చెప్పాడు. అయితే ఇక్కడ కూడా ఇంకో అనుమానం వస్తుంది. అంత చైతన్యం లేని చోట ఈ ” కలిసి ఉండటం” అనేది అంతిమంగా ఎవరికి ఉపయోగపడుతుంది ? అప్పుడు దాన్ని సార్వత్రిక స్లోగన్ చేయవచ్చా?

పార్వతీశం పట్టుదలకి మారు పేరు. కూతురు వర్ధనికి వయస్సు దాటి పోతుంది. కట్నం ఇచ్చే సంబంధాలు చెయ్యనంటాడు. నిజానికి ఆ కట్నం ఇచ్చే సరకులేదని తండ్రికి కూతురికీ కూడా తెలుసు. వర్ధని తన పెళ్ళి తానే చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది తండ్రికి నచ్చదు. పడుపు కూడు అని వర్ధని పెట్టిన భోజనాన్ని కూడా తిరస్కరించి ఇంటినుండి బయలు దేరి మద్రాసు మెయిల్ ఎక్కుతాడు. అప్పటికి రెండు రోజులుగా తిండిలేక రైళ్ళోనే స్పృహతప్పి పడిపోతాడు. అదే రైళ్ళో డాక్టర్ స్నేహలతారావు ఉంటుంది. గుంపు మధ్యలో పడీ వున్న పార్వతీశాన్ని తన క్లినిక్ కు తీసుకుని వెళ్ళి నయం చేస్తుంది. అతనికి ఉద్యోగం చూపించమని ఆమె స్నేహితుడికి రెకమెండ్ చేస్తుంది. పార్వతీశానికి ఆ డాక్టర్ దేవత లాగ కనిపిస్తుంది. కానీ డాక్టర్కి, స్నేహితునికి ఉన్న సంబంధంమీద పార్వతీశానికి అనుమానం కలుగుతుంది. తను ఏ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ కూతురు నుండి దూరంగా వచ్చేశాడో ఇక్కడా అటువంటిదే తటస్థ పడుతుంది దానితో అతనిలో ఆలోచన మొదలై డాక్టరికి తన కథంత చెప్తాడు. అది విని “మీరు మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోండి. ఆవిడ మానాన ఆవిడను బతకనివ్వండి. ఆడది పెళ్ళి చేసుకుని గృహిణిగా, పిల్లల తల్లిగా బతకడం తప్ప మరో మాదిరి జీవితాన్ని మీరు ఊహించలేకుండా ఉన్నారు. మీరు ఆమె జీవితానికి ఏమేలూ కలిగించలేనపుడు అందులో జోక్యం ఎందుకు కలిగించుకుంటారు.” అంటుంది.  “మరి  కట్టుబాట్లుండొద్దా” అన్న పార్వతీశంతో “మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత ఎక్కువ ఉపకారం, సాధ్యమైనంత తక్కువ అపకారం జరిగేట్టు చూడడమే సరియైన ప్రవర్తన. మిగిలిన  బూటకపు నియమాలను నమ్మకండి” అంటుంది.

మరి “కొత్త పద్ధతి”లో కట్నమిచ్చి పెళ్ళి చేసుకున్న  పెళ్ళికూతురు మీద కొ.కుకు సానుభూతి ఎందుకు లేకుండా పోయిందో ? పాపం…
అదలా ఉంచితే డాక్టర్ స్నేహలతా , ఉద్యోగస్తురాలు వర్ధని బతుకు భద్రత ఉన్నవారు అది లేని వారి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ నిజమే కాని సమాజానికి ఓ అడుగు ముందుండేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వారు “గీతలు” దాటక  తప్పదు. అట్లా దాటిని వాళ్లను “చెడిపోయిన వాళ్ళు” అనకూడదన్నదే కొ.కు చెప్పదలిచింది.

“తార”లోను “నీతి”ని ఎదిరించి  బతకడమే మనిషి కర్తవ్యం అంటుంది శ్యామల. అయితే ఇదంతా చెప్పిన కొ.కు నిజంగా కుటుంబ వ్యవస్థ లేకుండా పోవాలనుకున్నాడా? చూద్దాం…

“జీవితం”లో  కుటుంబమే అతన్ని నిరుద్యోగి కాకుండా కాపాడిందని ముగింపునిచ్చాడు. “గడ్డురోజుల్లోను” జానకి అజ్ఞానానికి చింతిస్తూనే జీవితం అట్టడుగున పడ్డప్పుడు కుటుంబమే “రక్షణ కవచం” లా పని చేసిందంటాడు. అసలు కొ.కు  కథానాయకులు సోమరిపోతులు. వాళ్లు జీవితం పట్ల బాధ్యత పడరు. అందువల్ల పెళ్ళాన్ని, పిల్లల్ని పోషించడానికి కష్టపడాల్సి వస్తుందన్న ఏడుపు వుందేమోననిపిస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదని, “చదువు”లో సుందరం,   “జీవితం”లో ప్రకాశం, “గడ్డురోజులు”లో సత్యం -  అన్నినవలల్లోనూ దాదాపు అందరూ కథానాయకులు అనుకుంటారు. కానీ ఒక్కడూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న పాపాన పోలేదు అయినా ఒకరికొకరికి సరి పడని భావాల తో అందరి మనసులూ బాధ పడుతున్నాయనుకుంటారు .ప్రేమ , అవగాహనా మాత్రమే ప్రాతిపదికగా పెళ్ళిల్లు జరిగేకాలం, సమాజం రావాలని కొ.కు ఆశ.

సత్యం నాటకాల్లో, తన తోటి నటి హైమావతి నటన చూసి, ఆమె బతుకున్న తీరు మేధోపరమైన ఆలోచనలు చూసి ఆమె మీద గౌరవం పెంచుకుంటాడు. ఒక రకంగా ప్రేమిస్తాడు. కాని అతనే “ఆ మనిషే నాభార్య అయిందంటే ఆ ప్రేమ దక్కుతుందన్న నమ్మకంలేదు”,  అనుకుంటాడు.  అయితే కొ.కు చెప్పినట్టు, మనిషి సంస్కారం వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి పెరుగుతుందంటే, తమ మామూలు అవసరాలు తీర్చలేని భర్తకున్న సంస్కారం జానకిమీద ఏం ప్రభావం చూపిస్తుంది? తమ జీవితానికి భరోసా ఇవ్వగలిగితే అతని మీద గౌరవంతో అతను చెప్పేది వింటుంది. నిజానికి సత్యానికే ఏ లక్ష్యం లేదు. మరుసటి రోజు ఏం కానున్నదో ఆలోచన లేదు. అతను హైమావతి సంస్కారంగురించి ఆలోచిస్తాడు తప్ప ఆ సంస్కారం ఆమెకెట్లా వచ్చింది,  ఏస్థిరమైన ఆర్ధిక పునాధివల్ల కలిగాయో  ఆలోచించడు.

కుటుంబ సంబంధాలు, పెళ్ళిల్లు, దాంపత్యాలూ, కపటంగా ఉన్నాయి – నిజమే కాని  అప్పటి సమాజం లో కుటుంబ పోషణలో మగవాడి పాత్ర ప్రధానం ఆ పాత్రను సరిగా పోషించేవాడేడీ? వట్టి పలాయనంతప్ప..  అయితే “జీవితం”లో మాత్రంకుటుంబం గురించి ఇటువంటి అసంతృప్తులేమీ పెద్దగా ప్రదర్శించడు. పైగా పిల్లనిచ్చిన మామ అతనికి ఉద్యోగాన్నిప్పించి  నిరుద్యోగి కాకుండా కాపాడతాడు. అడపా దడపా తల్లి దండ్రుల భిన్నాభిప్రాయాల వల్ల వచ్చే కొట్లాటల గురించి మాత్రం చికాకు పడుతుంటాడు. ఇందులోనూ ప్రకాశం ప్రేమించి పెళ్ళాడాలనుకుంటాడు. కానీ, మొదట ప్రేమించిన రజనీని పెళ్ళాడలేడు.. రజనీకి డబ్బు ఉంది. ఆమెతండ్రి ఒప్పుకోడనుకుంటాడు.కానీ, రజనీని నిన్ను చేసుకుంటానని అడగలేడు. రెండోసారి సినిమా కమలను చేసుకోవాలనుకుంటాడు. కానీ, కమల తల్లి ఇంతకంటే డబ్బున్న ప్రొడ్యూసర్ కు కమలను రెండో భార్య కింద ఉంచుతుంది. చివరకు తల్లి దండ్రులు చూసిన అమ్మాయిని చేసుకుంటాడు. శకుంతలతో జీవితం పర్వాలేదన్నట్టుగా ఉంటాడు.

ఈ లోగా రకరకాల ఉద్యోగాలు చేసి మానేసి చివరకు రచయితగా స్థిరపడతాడు.కుటుంబం అతనికి రక్షణనిస్తుంది. ఆ కుటుంబంలో భార్య మాత్రమే కాదు. తల్లీ తండ్రి కూడా ఉంటారు. వారు అతనికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు.

ఇంతచెప్పాడు  కొ.కు – మానసిక చైతన్యం అన్నాడు, సంస్కారం అన్నాడు. స్వేచ్ఛ అన్నాడు. ఆత్మ గౌరవంకావాలంటే ఆర్ధిక స్థోమత కావాలన్నాడు. (కానీ అదెట్లా వస్తుందో తెలియనట్టు చేష్టలుడిగి చూస్తారు ఆయన కథానాయకులు) మరి డబ్బున్న వాడికి ఇవన్నీ ఉంటాయి ఎలాగూ. మరి ఇవి ఎవరికి కావాలి? వాళ్లకెట్లా వస్తాయి? అసలు కొ.కు మనసు ఈ కులాలు లేకుండా పోయి, ఈ ధన స్వామ్యం లేకుండా పోయి, ఈ దేవుని బెడద వదిలి పోతే ఎవరైనా బాగు పడతారని ఆశించాడు. ఆయన మనసెక్కడ? ఇది చూడాలంటే” ప్రేమించిన మనిషి” చదవాలి. మంగి, పద్మ, సరోజా, గోపాలానికి పరిచయమైన వాళ్లు. మంగి పనిపిల్ల , సరోజ ఇంటి వాళ్లమ్మాయి, అందగత్తె, సరోజ స్నేహితురాలు పద్మ ను చూడగానే ఉతికి ఆరేసిన జంతు చర్మం  గుర్తుకొస్తుంది.

సరోజ పట్ల ఆకర్షణ కలుగుతుంది. కొంత హాస్యంగా కూడా మొదలుపెడతాడు.  కానీ మంగి ఏదో దొంగతనంగా తిన్నదని సరోజ కూడా వాళ్ల అమ్మా నాన్నలతో పాటుగా మంగిని కోప్పడుతుంది. ఇది గోపాలం మనస్సులో వైమనస్యం ఏర్పరుస్తుంది. ఇదంతా మంగి ద్వారా విని ఆమె మీద జాలిపడి, ఆమెకు ఇడ్లీలు తినే ఏర్పాటు చేస్తాడు. అతని పరిధిలో చేయగలిగింది అదేకనుక. మంగి మీద తనకు కలిగిన జాలిని, దయను కూడా గోపాలం సరిగా అర్ధం చేసుకోలేడు.  మంగిని ముద్దు పెట్టుకుంటాడు కానీ పెళ్ళి చేసుకోవాలనుకోడు నిజానికి పెళ్ళి పెటాకులే కదా. అయినా అదసలు ప్రేమకాదు. జాలిని ఎలా చూపించాలో తెలియనిస్థితి . చర్యలే మన ప్రతిస్పందననూ తెలియజేస్తాయనుకుంటే మంగికి అతని జాలి తెలిసేదెట్లా? అయితే అతని చూపిన చర్య మరో అర్ధానికి దారి తీస్తుంది.

అనుకోకుండా పద్మ అతను చేసే సినిమా కంపెనీలో చిన్న వేషం వెయ్యడానికి వస్తుంది. అక్కడ వాళ్లిద్దరూ సన్నిహితమవుతారు. అప్పుడు పద్మ ఎలాంటిదో అర్ధమవుతుంది . వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడతారు. చివరకు “ప్రేమించిన మనిషి” పద్మ. అయితే గోపాలాన్ని ప్రేమించిన మనిషి ఎలాంటిది? ఏది చూసి గోపాలం పద్మను ప్రేమించాడు? ఈ కథలో ఉన్నదదే.

మంగిని అన్న కొడితే దెబ్బతగిలి ఆస్పత్రిలో చేరుతుంది.  మంగిని చూసి వచ్చి పద్మతో ఆ విషయం చెప్తాడు. మరోసారి పద్మ గోపాలంతో పాటు మంగి గుడిసెకు పోయి మంగి వదినను పరామర్శించి వస్తాడు. పద్మతో జరిగిన విషయాలన్ని చెప్పి, సరోజ పట్ల తానెందుకు వైమనస్యం  పెంచుకున్నాడొ చెప్తాడు. మన ప్రవర్తనను మంగి పట్ల మనం చూపే వైఖరే నిర్ణయిస్తుందంటూ, ” నాకు జీవితం అయోమయంగా కనిపించినపుడల్లా మంగి జీవితంకేసి చూస్తాను. వెంటనే అర్ధమైపోతుంది. మనందరి జీవితాలకు మంగి స్కేలుబద్దగా ఎందుకుండాలో నాకైతే తెలియదు గాని అది నిజంగా స్కేలు బద్దే. లేక మన జీవితాలకు పరమాణువనాలో “అంటాడు గోపాలం. అట్లా మంగిని ప్రేమించడం ద్వారా పద్మ గోపాలం హృదయాన్ని గెలుస్తుంది. గోపాలం హృదయం పేదల దగ్గరుంది. అతను మధ్యతరగతి వాడే కావచ్చు.

ఇది కొ.కు కు వర్తిస్తుంది. అయితే సృష్టించిన పాత్రలు గోపాలం, ప్రకాశం, సత్యం , నారాయణ ఎవరైనా గాని వాళ్లను చూసి ఏం నేర్చుకోమన్నారు?వాళ్ళు వుట్టికి స్వర్గానికి కాని వారు.  ఆ కథా కాలమంతా ఉద్యమాలు వెల్లువఎత్తిన కాలం కాని ఆ కథల్లో ఉద్యమాలను బయటి వ్యక్తిగా వర్ణించాడే గాని వాటి ఆంతరింగిక ఘర్షణనూ చూపించలేదు. ఒక్క చదువులోతప్ప అదీ శేషగిరీ పాత్ర వల్ల.

అన్ని నవలల్లోనూ ఉద్యమాలనుండి దూరంగా ఉండడంవల్ల ఉద్యమాల్లో ఉండే లోటు పాట్లను చెప్పారు తప్ప, తప్పో ఒప్పో అడుగు ముందుకు పడాలంటే ఆసరా అవసరమని వారెవరికి అనిపింప చెయ్యలేదు. ఇటువంటి పాత్రలు ఎవరికి చైతన్యాన్ని కలిగిస్తాయి? ఎవరికి ఆదర్శంగా ఉంటాయి? ఆయా కథల్లో , నవలల్లొ ఏ పాత్రా ,కథానాయకులను చూసి ఉత్సాహపడ్డ దాఖలాల్లేవు. మనం ఇప్పుడూ చదువుకుని ఆనందపడడం తప్ప.

అప్పటికి వృత్తిని , వ్యవసాయాన్నివదిలి ఇంగ్లీషు చదువులకు , కొలువులకు బ్రాహ్మణ వర్గం దారి పట్టి ఉంది. దానివల్ల ఆ కులంలో చోటు చేసుకున్న కొత్త మార్పులను స్వాగతించలేక ,పాతది వదల్లేక నడిసముద్రం మధ్యనిల్చున్నట్టుగ ఓ సంక్షోభ, సందిగ్ధ సమయంలో ఆయన కథా నాయకులు, నిశ్చేష్టులై , ఎటు గాలికొడితే అటు దారి తీసారు. జీవితం ఎలా పోతే అలా పోనిచ్చారు. అదే చెప్పారు కొకు తన రచనల్లో. సరిగ్గా మధ్య తరగతి మానసిక స్థితిని పట్టుకున్నారు. సాహిత్యలోకం ముందు ఆవిష్కరించారు.  కొ.కు. ఆయారచనల్లొ  దేన్ని ఉద్దేశించి రాసినా దానిలో మానవ సంబంధాలను గురించి రాసారన్నదే గుర్తించాలి. ఆ సంబంధాలను విశ్లేషించేటపుడు మగవాడిగా ఆయన పరిమితి, మధ్య తరగతి జీవితం, పుట్టిన నేపథ్యం వంటీ ఎన్ని పరిమితులైనా పని చేసి ఉండొచ్చు గాక. ఆయన ఆడవాళ్ల పక్షపాతేనన్నది మర్చిపోలేము అందుకు  “ఆడ జన్మ”లొ ఆయన రాసిందే తార్కాణం.

” పగవాడికి కూడా తెలియనివ్వని మా కుళ్ళు నీ యెదుట సిగ్గులేకుండా ప్రదర్శిస్తాం.. మీ పట్ల మేమంతా మతానుశాసకులమే అందరమూ గట్టి సామ్రాజ్య వాదులమే .. ఇన్నిబందో బస్తులు చేసినా చివరకు నువ్వే గెలుస్తావూ? అప్పుడు నిన్ను ఆకాశానికెత్తుతాం, నీకీర్తి ఆలకిస్తాం”
ఇది  ఈ సమాజం స్త్రీలకిచ్చే స్థానమని కొ.కు ఈ సమజంపై నిరసనతో తన సాహిత్యాన్ని ఎక్కుపెట్టాడు.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో