Jul2009
బొమ్మలాటలు: కొయ్యబొమ్మలాట, తోలు బొమ్మలాటలు
జానపద రూపకాలలో బొమ్మలాటలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొని వున్నాయి. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఈ రూపకాలు ప్రజలు నీరాజనాన్ని అందుకున్నాయి. దీనిని ప్రదర్శించేవారు, దీనిలో నటించేవారు ఎంతో కీర్తి ప్రతిష్టల్ని కలిగి ఉండేవారు. నాడు బహుళ ప్రచారంలో వున్న ఈ జానపద రూపకం నేడు కనుమరుగై పోతుండడం అత్యంత బాధాకరమైన విషయం. అయినా వీటి వైశిష్ట్యం ఎన్నటికీ చెదిరిపోనిది. ఈ జానపద రూపకాలలో ప్రాశస్త్యం పొందిన బొమ్మలాటలను గురించి తెలుసుకోవడం అవసరం.
బొమ్మలాటలు అత్యంత ప్రాచీనకాలం నుండి ప్రదర్శింపబడుతున్న జానపద రూపకం. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహనుల కాలం నాటికే బొమ్మలాటలు ప్రచారంలో వున్నాయి.
ప్రపంచంలో బొమ్మలాట పుట్టింది భారతదేశం అని కొందరు , చైనా దేశమని కొందరు భావిస్తున్నారు. ఎలాగైతేనేం బొమ్మలాటలు పుట్టింది ఆసియా ఖండంలోనేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా బొమ్మలాటలు భారతదేశం నుండి ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి “యూనీమా” అనే పేరుతో ప్రపంచబొమ్మలాట సంఘం ఏర్పడేంత వరకు ఎదిగింది.
సంస్కృత సాహిత్యంలో అనేక గ్రంధాల్లో బొమ్మలాటల ప్రసక్తి ఉంది. అదేవిధంగా శాసనాల్లో కూడా బొమ్మలాటల ప్రసక్తి వుంది. ఇక తెలుగు సాహిత్యంలో బొమ్మలాట ప్రస్తావనను పరిశీలిద్దాం. పాల్కురికి సోమనాధుడి “పండితరాధ్య చరిత్ర”లో మొదటగా బొమ్మలాటల ప్రసక్తి ఉంది.
“భారతాది కథల జీఱమఱగుల
నారంగ బొమ్మల నాడించువారు;
కడునద్భుతంబుగ గంబ సూత్రంబు
లడరంగ “బొమ్మల నాడించువారు”
అని తోలు, కొయ్య బొమ్మలాటలను గూర్చి పేర్కొనబడి వుంది.
శ్రీనాధుడు పల్నాటి చరిత్రలో_
“ప్రతిమలాడగ బట్టినయట్లు”
అని ప్రస్తావించాడు. అలాగే నాచనసోముడు ఉత్తర హరివంశంలో _
“యంత్రకుడాడించి యవని ద్రోచిన వ్రాలు
బొమ్మల గతి రధ పూగములను”
అని పేర్కొన్నాడూ. ఇలా తెలుగు సాహిత్యంలో కొయ్యబొమ్మలు, తోలు బొమ్మలు, జంత్రపు బొమ్మలు, కీలు బొమ్మలను గూర్చి ప్రస్తావించబడి వుంది.
విదేశాలలో బొమ్మలాటలు:
బొమ్మలాటలు ప్రపంచప్రసిద్ధిని పొందాయి. ఇవి భారతదేశం నుండే ఇతరదేశాలకు వ్యాపించాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తోలుబొమ్మలాటలు తెలుగు వారి సొత్తు. ఇవి మన కళా వైభవాన్ని విదేశాల్లో చాటి చెప్పాయి. ఇది ఆంధ్రులకు గర్వ కారణం. పల్లవ కాకతీయుల కాలంలో వారు యువ ద్వీపాలను జయించి అక్కడ మన నాట్యంతో పాటు, తోలు బొమ్మలను కూడా తీసుకుపోయారు. జావాలోని తోలుబొమ్మల ప్రదర్శన పద్ధతులకు మన ప్రదర్శన పద్ధతే పునాది. ఆంధ్రదేశం నుండి ఇండోనేషియా, కొలంబో, మలేషియా, థాయిలాండ్,బర్మా వంటి ఆగ్నేయాసియా దేశాల్లొకి ప్రవేశించి జనాదరణ పొందింది. అలా పర్ష్యా, టర్కీల మీదుగా గ్రీసువరకు పాకింది. ఆ విధంగా వెళ్ళిన ఈ కళకు కొత్త అలంకారాలు చేకూరాయి. అలా బొమ్మలాటలు అక్కడి నుండి ఉత్తర ఆఫ్రికా దేశాలకు వెళ్ళింది. ఇవి 17 వ శతాబ్దానికే ఇటలీ, ఫ్రాన్స్, పారిస్ లలో ఆదరణ పొందింది. “పాలైన బెన్టన్” అనే అమెరికా పరిశోధకురాలు తోలుబొమ్మలాట మీద క్రీ.శ. 1921 ప్రాంతంలో విస్తృతంగా పరిశోధన చేసింది. ఈమె వారి సంప్రదాయాల్ని అమెరికా వాళ్లకు చెప్పడానికి కృషి చేసింది. ఈమె తన జీవితాంతం ఈ పరిశోధనకే అంకితమైంది. రష్యాలో బొమ్మలను తయారు చేయడం, ఆడించడం వంటి వాటిని కూడా పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. ఇలా బొమ్మలాటల ద్వారా విద్యార్ధులకు పాఠాలను నేర్పిస్తున్నారు. బొమ్మ లాటలకు ప్రత్యేక ప్రదర్శనశాలలున్నాయి. రష్యాలో ప్రత్యేకంగా వంద కేంద్రాలున్నాయి.
బొమ్మలాటలు _ రకాలు:
బొమ్మలాటలు రెండురకాలున్నాయి.
-
కొయ్య బొమ్మలాట
-
తోలుబొమ్మలాట.
ఇవి కాకుండా మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో రకరకాల బొమ్మలాటలున్నాయి. అయితే ఆంధ్రదేశం తోలుబొమ్మలాటలకు, ఉత్తరభారతదేశం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధం. కర్నాటకలో రెండురకాల బొమ్మలాటలు ప్రాముఖ్యాన్ని సంతరించుకొని వున్నాయి. ఇకపోతే తోళ్ల బొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, ఊచ బొమ్మలాటలు వంటి మిగిలిన రకాల బొమ్మలాటలు అంతప్రచారంలో లేవు.
1. కొయ్యబొమ్మలాటలు: ఇవి భారతదేశమంతటా వ్యాపించివున్నాయి. కొయ్యబొమ్మలాట రాజస్థాన్ లో పుట్టింది. కొయ్యబొమ్మల్ని “కట్పుత్లీ” అని అంటారు. అయితే కొయ్యబొమ్మలాట ఆంధ్రదేశంలో అంత ప్రసిద్ధి చెందలేదు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలొ హిందూపురం సమీపంలో ఈ కొయ్యబొమ్మల్ని తయారు చేసి ఆడించే బృందాలు కొన్ని వున్నాయి. అలాగే చిత్తూరు జిల్లా సంతవేలూరులో ఎన్నో సంవత్సరాల నుండి కొయ్యబొమ్మలాటను ప్రదర్శించే బృందం ఒకటుంది. ఇటీవల ఐదేళ్ళకు ముందు వరంగల్లు జిల్లాలో ఒక కొయ్యబొమ్మలాట ప్రదర్శన బృందాన్ని వరంగల్లు తెలుగు విశ్వవిద్యాలయం వారు గుర్తించడం జరిగింది. ఇలా ఆంధ్రదేశంలో రెండు, మూడు కేంద్రాల్లో తప్ప కొయ్యబొమ్మలాటను ప్రదర్శించే వారు లేరనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లా లోని హిందూపురం లో కొయ్య బొమ్మలాటల్ని నేడు ప్రదర్శిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే సంతవేలూరులో మాత్రం నేడు కొయ్యబొమ్మలాటను ప్రదర్శిస్తున్నారు. అలాగా వరంగల్లులో కూడా.
సంతవేలూరులో కొయ్యబొమ్మల ద్వారా ప్రదర్శించే కథ పోరు “రామనాటకం” దీనినే సంతవేలూరు కుశలవుల నాటకం అని కూడా అంటారు. పైగా అనేక గ్రంధాల్లో సంతవేలూరు రామనాటకం ప్రస్తావించబడి వుంది. ఇది గ్రంధరూపంలో కూడా ప్రచురించడం జరిగింది. దీనిని బట్టి చూస్తే మిగితా రెండు కేంద్రాలలోని కొయ్యబొమ్మలాటకన్నా ఇదే ప్రాశస్త్యమైందని చెప్పవచ్చు. హిందూపూర్,వరంగల్ కొయ్యబొమ్మలాటలలో ప్రదర్శించే కథను గూర్చి ఇప్పటికీ సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లొ ఎవరికీ తెలియదు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంతవేలూరు “రామనాటకం” కొయ్యబొమ్మలాట దాదాపు 110 ఏళ్ళుగా ప్రదర్శింపబడుతోంది. బాగా పరిశీలించి చూస్తే ఇది ఇంకా ప్రాచీనమైందిగా తెలుస్తోంది.
సంతవేలూరు రామనాటకం రెండు భాగాలు. ఒకటి రెండవది కుశలవుల నాటకం. సీతారాములు లంక నుండి అయోధ్యకు వచ్చి కొలువు దేరినప్పటి నుండి కథ ప్రారంభమై సీతమ్మ వారి అగ్నిప్రవేశంతో కథ ముగుస్తుంది. మొట్టమొదటి నాటకం వినాయకుని పూజతో మొదలౌతుంది. వినాయకుని పూజారి, పండారం(దేవస్థానం కావలి) పూజించాక ఎలుకవచ్చి ఒకసారి కొబ్బరి చిప్పల్ని, మరోసారి అరటిపళ్ళను ఎత్తుకొని వెళ్ళడం, పండారం ఎలుకను తరుముకోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తాయి. తర్వాత రాములవారి కొలువు కూటం, కొలువు కూటంలో నర్తకి మణులు కోలాటం వేయడం చూపరులకు చిత్రమైన అనుభూతినిస్తుంది. కోలాటం పాటకు అనుగుణంగా చిన్న బొమ్మలు టిక్కుటిక్కు శబ్దంతో కోలాటం వేయడాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తారు. ఆ తర్వాత సీతను అడవిలో వదిలిపెట్టడం, వాల్మీకి ఆశ్రమానికి సీత చేరుకోవడం, లవకుశలు జన్మించడం, వశిష్టుడూ రామునితో అశ్వమేధయాగం చేయమని చెప్పడం, లవకుశులు అశ్వాన్ని బంధించడం, అశ్వం కోసం శతృఘ్నుడితో యుద్ధం, లవకుశులు శ్రీరామునితో యుద్ధానికి పూనుకోవడం, తర్వాత వాల్మీకి లవకుశ శ్రీరాములను కలపడం, ఆ తర్వాత సీత అగ్నిప్రవేశంతో కథ ముగుస్తుంది. సంతవేలూరు రామ నాటకం సంగీత సాహిత్యాలతో కూడుకున్న రూపకం. ఇందులో పద్యాలు, వచనాలు, సంభాషణలు, పాటలు, జానపద గేయాలైన నాలుగు పాటలు, పాటలు, సంవాద దర్వులు, చూర్ణికలు, కందార్ధాలు, ద్విపదలు ఎన్నో సంగీత రాగాలు, జానపద విజ్ఞనాంశాలు వంటివి వున్నాయి.
ఉదాహరణకు: రాముడు లవకుశులపై యుద్ధానికి వచ్చే దర్వు
స్వామి వచ్చెను రఘుస్వామి వచ్చెను
స్వామి వచ్చెమునిజన సూత్రా మాదిత్యస్తోమా మెంచ
హేమాద్రి ధీరుడై మత్త సామజాము నెక్కివేగా||స్వామి||
భేరి భాంకారాశబ్దములు బోరున మ్రోయగ పెక్కు
వీర భటులు గొల్వగ విస్తార శౌర్య విక్రయముల ||స్వామి||
రంగూగ మాతంగ హయ శతాంగ మంత్రి విహితరాజ
పుంగవూల తోడ మరులు పొంగు శృంగారాంగుడగుచు ||స్వామి||
ఇమ్ముగా మునిసుతులచే తన తమ్ములు మూర్ఛిల్ల విని కోపమ్మునా
సేనాతో విలుబాణంబులు ధరించామించ ||స్వామి|
|వచనం: ఇట్లు వచ్చి వాల్మీక్యాశ్రమంబు జొచ్చి యుద్ధ భూమి యందు నిలిచి తమ్ములంజూచి ఇట్లనియె.
అటతాళం – పున్నాగరాగం:
హాసు మిత్ర కుమార హానగ ధీర పారావార గుణ గంభీరుడ ధీరశ రధిగ భీరుడ ||
భాసురాద్భుత మొప్ప గహన నివాసముగ శయనింపక్షత్రియ ధర్మమా పూర్వకర్మమ ||
యీసుచే శూర్పనఖ కర్ణనాశికము తెగగోసి వైచిన శ్రీకరా సమర భీకర ||
యింద్రజిత్తు జయించినట్టయిన కులాబ్ధి శశాంకదరిగెను రూపము బృగుముని శాపము ||
భోగి పాశము చేత బలకులేగుదెచుక మూర్ఛవేసిరి చిత్రమొ మరియు సూత్రమొ ||
యుద్ధరంగము నందు అపజియవ్యర్ధులై బాలురకు జిక్కిన సోదరా య్టులనే బోదురా ||
ఉప్పుకై యిటవచ్చి కర్పూర తిప్పనే పోగొట్టుకొంటి గణాకర కటిక శేఖరా ||
-రాముల వారు కుశలవుల నడుగుట
ఉ|| ఎవ్వరి వాడవు నీవు స్తలమెయ్యది నీదగు తల్లిదండ్రులుం
యెవ్వరు నీ కులంబు మరి యెయ్యది పేరు వచింపుబాలకా ||
శకుని వాక్యం :-
ఉ || ఎవ్వరి వాడవీవనుచు యేటికి మాటికి బల్కరించగా
చివ్వకు వచ్చి జాగులిటు జేసిన నవ్వరే ధాత్రి భూవరా ||
రాముల వాక్యం :-
ఉ || చెప్పకయున్న మానెకడు శీఘ్రముగా నిదె వేసెదన్ శరం
బిప్పుడు నిల్పునా యెదుట బీరము దప్పక మౌని బాలకా ||
లవుని వాక్యం :-
ఉ || బీరము దప్పనట్టి పటు భీషణ మూర్తివి నీవు గమ్మువో
ధారుణి నాధ నీ శరీరము తాలిమి నింతియు లేకద్రుంచెన్ ||
* * *
రాజు:- కానీ కానీ బాలకా నీ గర్వమణంచెద బాలకా
బాలురు:- మంచిది మంచిది రాజా నిన్నుమడియ జేసెదము రాజా
రాజు : బాలకా నీదే వూరు నీ కేలర నా తోను పోరు
బాలురు: రాజుననుచు నిక్కుకుర నీరాజసమణగించెదర
లవుడు : బహ్మాస్త్రంబును చాల నీపై వైచెదా నిటులీలా
వచనం : ఇట్లు బ్రహ్మాస్త్రంబును శ్రీరాముల చుట్టుకుని మూర్చ నొందజేసిన హనుమంత జాంబవంతులం బట్టుకొని సీత కడకు వచ్చిన సీత హనుమంతుం జూచి యిట్లనియె
ఈ విధంగా కొయ్య బొమ్మలను ఆడిస్తూ రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఈ కొయ్య బొమ్మలు మూడు నుండి నాలుగున్నర అడుగుల ఎత్తువరకుంటాయి. తేలికైన కొయ్యలతో వీటిని చెక్కుతారు. నడుం, కాళ్లు, చేతులు కదిలేటట్లు కీళ్ళు అమర్చుతారు. చేతులకు సన్నని దారాలను కట్టి వాటిని కర్రపుల్లలకు కట్టుకొని బొమ్మలను ఆడిస్తుంటారు. బొమ్మలను ఆడించేవళ్లు తెరముందు బొమ్మల్ని పెట్టి తెర వెనుక ప్రేక్షకులకు కనిపించకుండా వుండి ఆడిస్తారు. నాటకం ప్రదర్శించే ముందు బొమ్మలన్నింటినీ మంచి దుస్తులతో పట్టు చీరలతో ముస్తాబు చేస్తారు. తర్వాత కిరీటాలు నగలు, హారాలు, భుజ కీర్తులు వంటి వాటిని అలంకరిస్తారు. ప్రదర్శన అయ్యాక అలంకారాలను తీసేసి పెద్ద కొయ్య పెట్టెలో ఉంచుతారు.
2. తోలు బొమ్మలాటలు : తెలుగువారి ఖ్యాతిని భారతదేశం లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపింపజేసింది. తోలు బొమ్మలాట. ఇది జానపద రూపకాలలో ఎంతో ప్రాశస్త్యం పొందింది. కవిత్వం చిత్రలేఖనం, సంగీతం, నాట్యకళల సమాహార రూపమే ఇది. సినిమా కళకు మొట్టమొదటి రూపం తోలు బొమ్మలాటే.
తోలుబొమ్మలాట ఆవిర్భావ వికాసాలు: తోలు బొమ్మలాట పుట్టుక విషయంలో రెండు అభిప్రాయాలున్నాయి. తోలుబొమ్మలాట పుట్టింది మహారాష్ట్రలోనని ఒక అభిప్రాయం వుంది. అలాగే ఆంధ్రదేశంలో పుట్టిందని మరో అభిప్రాయం వుంది. ఈ రెండు అభిప్రాయాలను బలపరిచే ఆధారాలున్నాయి. ఆంధ్రదేశంలో తోలుబొమ్మలాడించే వాళ్లలో అత్యధికులు మరాఠీ వాళ్లే కావడం, అలాగే తోలుబొమ్మల్లో కనిపించే దుస్తులు, అలంకారాలు తంజావూరి మహారాష్ట్ర రాజుల కాలం నాటికి చెంది వుండటం, శాసనాలలో కనిపించే కొమ్మోజు, బ్రహ్మోజు అనే పేర్లు మహారాష్ట్రులది కావడం వల్ల ఈ రూపకం మహారాష్ట్రులదిగా భావించారు.
అయితే ఆంధ్రదేశంలో ప్రతిజిల్లాలొ తోలు బొమ్మలాట ప్రదర్శించే బృందం కనీసం ఒకటైనా ఉండడం, తూర్పుగోదావరి జిల్లాలో మహారాష్ట్రులకు ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రులే తోలుబొమ్మలాడించే వారుగా ప్రఖ్యాతి చెందివుండడం, పైగా తెలుగు గడ్డ నుండే ఈ కళారూపం తూర్పుదేశాలకు విస్తరించినట్లు ఆధారాలుండడం వల్ల ఈ కళారూపకానికి పుట్టిల్లు ఆంధ్రదేశమేనని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే మట్ట వెంకటరమణ మూర్తి బొమ్మలాటల పైన పరిశోధన చేసి ఈ రూపం పుట్టింది. ఆంధ్రదేశంలోనేనని తేల్చి చెప్పారు. క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలంలో దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళ క్రీ.శ. 15-16 శతాబ్దాల్లో మహారాష్ట్రుల చేతుల్లో పడి, మహారాష్ట్రకు వ్యాపించి తర్వాత క్రమంగా తెలుగు దేశానికి వలస వచ్చి ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనలిస్తూ ఆంధ్రదేశంలో స్థిరపడిపోయారు. ఇలా ఈ తోలుబొమ్మలాట మళ్ళీ వెలుగు చూసింది. అలా తోలుబొమ్మల దుస్తులు, అలంకరణలో కొత్త పద్ధతులు ప్రవేశించాయి.
తోలుబొమ్మల్ని తయారు చేసే విధానం: తోలుకు పారదర్శక గుణం, మన్నిక ఉండడం వల్ల తోలుతో బొమ్మలను చేస్తారు. తోలు బొమ్మలను తయారు చేయడానికి జింక, దుప్పి, మేక, గొర్రె, గాడిదల చర్మాన్ని ఉపయోగిస్తారు. మొదట తోలును పారదర్శకంగా చేసి రేఖలను గీచి అక్కడికి కత్తిరిస్తారు. రంగులు అనేక దశలలో వేసుకుంటూ వస్తారు. ప్రధాన పాత్రలకు జింక చర్మాన్ని, మిగిలిన పాత్రలకు మేక మొదలైన చర్మాల్ని ఉపయోగిస్తారు. బంక పూసి దారం పురిపెట్టి బొమ్మల అవయవాలను, కీళ్ల దగ్గర కలిపి కుడ్తారు. జింక చర్మాన్ని వాడడానికి కారణం అది ఎక్కువ పారదర్శకంగా వుండడమే. రంగులు కూడా దానికి బాగా పడుతుంది. తోలుబొమ్మల తయారీ లో మంచి చిత్రకళానైపుణ్యం కనిపిస్తుంది. వీటిని తయారు చేసేటప్పుడూ శిల్పులు శిల్ప సమయాల్ని పాటిస్తారు. ఒక్కొక్క పాత్రకు సమయానుకూలంగా ప్రదర్శించడానికి నాలుగైదు బొమ్మలుంటాయి. రాజ్యారూఢుడైన రాముడు, అడవుల్లో సంచరించే రాముడు, పట్టాభిరాముడు, యుద్ధం చేసే రాముడు వంటి కావలసిన రధాలు, గుఱ్ఱాలు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం వంటి వాటిని కూడా వీరే చేసుకుంటారు. బొమ్మల అభినయం కోసం, నాట్యం కోసం చేతులు, కాళ్లు, తలల కదలికలను చూపించాలి. కాబట్టి ఈ బొమ్మల భుజం దగ్గర మోకాళ్ల దగ్గర కదిలేటట్లు అతుకులు పెడ్తారు. నాట్యకత్తె ముఖం తప్ప మిగిలిన బొమ్మల ముఖాలు ఒకే వైపుకు తిరిగి ఉండేటట్లు చేస్తారు.
ప్రదర్శన: తోలుబొమ్మలాటను ప్రదర్శించేవారు చాలావరకు సంచార జీవులే . కొందరు అక్కడక్కడ స్థిరనివాసాలేర్పరచుకొని వున్నారు. ప్రదర్శనకు ముందు వీరు ఊరిలోనో, గ్రామంలోనో ప్రవేశించి గ్రామపెద్దల్ని కలుసుకొని ప్రదర్శనకు స్థలాన్ని నిర్ణయిస్తారు. చాకలి దగ్గర్నుండి తెల్లటి చీరల్నీ, గ్రామస్తుల దగ్గరనుండి ఆముదపు నూనెను సేకరిస్తారు. తెరమీద బొమ్మలుంచి దానివెనుక పెద్ద పెద్ద దీపాలు వెలిగిస్తే చీకట్లో ఉండే ప్రేక్షకులకు పారదర్శకంగా ఉండే తోలుబొమ్మలు బాగా కనిపిస్తాయి. పందిర్ని మూడుపక్కలా మూసేస్తారు. లోపలిపక్క తెరను ఆనుకొని ఒక పెద్ద కొయ్య బల్లను వేస్తారు. ఆ బల్ల మీద వరుసగా దీపాలు వెలిగిస్తారు. వాటికాంతి తగ్గకుండా వత్తి ఎగజేస్తూ, ఆముదం నూనెపోయడానికి ఒక మనిషిఉంటాడు. ఆ ఆముదపు నూనె దీపాల కాంతి ప్రదర్శనకు చాలా అవసరం. కాంతి తగ్గితే బొమ్మల రంగులు మసకబారినట్లు కనిపిస్తాయి. పాటలు పాడే వాళ్లు, తాళం వేసేవాళ్లు, ప్రదర్శకుల సంతానం అంతా లోపలే కూర్చుంటారు. రధాల పరుగులు, గుర్రపుడెక్కల శబ్దాలు, యుద్ధంలో వినిపించే వివిధ రకాల శబ్దాలు ఆ చెక్కల టకటకలు భ్రమను కల్పిస్తాయి. నగారా మోతలకు ఖాళీ డబ్బాలను వాడ్తారు. తోలుబొమ్మ లాట ప్రదర్శనకు విఘ్నేశ్వర ప్రార్ధనతో ప్రారంభిస్తారు. సూత్రధారుడు తెరలోపలుండి ప్రదర్శనను వరుసక్రమంలో నడిపిస్తాడు. ఈయన కథను చాలా వివరంగా, చాకచక్యంగా, ఆసక్తి దాయకంగా చెప్తాడు. సూత్రధారుడు పద్యాలను, గేయాలను మృధుమధురంగా పాడ్తాడు. వచనాన్ని కూడా రాగయుక్తంగా చెప్తాడు. సందర్భానుసారం పాత్రలకు తగినట్లు గొంతులు మారుస్తుంటారు. రాత్రి పదిగంటల నుండి తెల్లవార్లూ ప్రదర్శన కొనసాగుతుంది.
ఆటలో విసుగులేకుండా ఉండడానికి మధ్యలో జుట్టు పోలిగాడు, బంగారక్క, అల్లాటప్పగాడూ, కేతిగాడు వంటి హాస్యపాత్రలు వుంటాయి.
ఉదాహరణకు: బంగారక్క వస్తూనే-
బంగారక్క వచ్చీనాదీ భామలారా
సుందరముగా చూపరార సుజనులారా
పసిడి వన్నెల రెయికా దొడిగీ అమ్మాలారా
నీలిరంగు చీరెకట్టి అమ్మలారా
నీటుగానూ వచ్చినారే అమ్మలారా…….
బంగారక్క : అబ్బబ్బ ! వళ్లంతా ఈ వూరి నీళ్లు తాగి జిల పుట్టింది.
పక్కవాళ్లు : చవుడు, సున్నం పెట్టుకో తగ్గిపోతుంది
బంగారక్క : చవుడు సున్నమా! చవుడూ సున్నం నేను గాదు పెట్టుకోవాల్సింది ఎవరికి పెట్టాలంటే వసే, తసే అనే వాళ్లకూ, వరే తరే అనే వాళ్లకూ, అన్నంపెట్టేదాన్లో మన్ను పోసేవాళ్లకూ ఆట ఆడించి, పాటపాడించి సంభావన ఎగగొట్టి పోయేవాళ్లకు చవుడు సున్నం పెట్టాలిరా!
వంత :సరేగాని బంగారక్కా! కెవరైనా తోడున్నారా
బంగారక్క : తోడు లేకపోవడమేమిటి? దేశంలోకెల్ల అందగాడు. జుట్టుపోలిగాడున్నాడు, వాడ్ని చూస్తే మూర్చపోతారు జనమంతా, పిలవమంటారా? “ఓ … మొగోళ్ళూ… ”
వంత : ఇంతమంది మగవాళ్లలో ఏ మొగోళ్లు రావాలమ్మా?
నీ మగడెవరో ఆయన పేరుతో పిలువమ్మా
బంగారక్క: ఓ… గాంధోడీ….
రార వోరీ గాంధోడీ
రాకు లేల ఔర ఓరీ
కొర వెనకా వచ్చినావూ
కోర చూపూ కుందావదనా
ఏంది జుట్టూ దువ్వూకోనీ
పొలిమేర దయ్యాలవాడ ||రార || (పోలిగాడి ప్రవేశం)
బంగారక్క : మొగుళ్లకు దండాలండీ
పోలిగాడు : కాలుదొక్కి తాళీగట్టిన నా పెళ్లానికి పదివేలు దండాలు. ఆడదాని కాళ్లకు దండం పెట్టి ప్రదక్షిణ చేసి టెంకాయ కొడితే ఏడాదికి మూడీతలీనుతుంది.
బంగారక్క: వెళ్ళివస్తా మొగోళ్ళు (అని వెళ్ళి పోతుంది. అప్పుడు చిన్న పోలుగాడ్ని ప్రవేశపెడతారు)
చిన్నపోలిగాడు : దాని మొగుడూ దాన్నెత్తకపోతే, నేనెవర్నెత్తకపోనూ
పోలిగాడు : ఒరేయ్ ఎవరినో తీసుకరమ్మంటే ఎత్తకపోతానంటావేరా ఇంతకీ ఎవరెవర్ని తీసుకవచ్చావురా!
చిన్నపోలిగాడు : రెడ్డిని, కరణాన్ని, పెదకాపుని… (ఇలా ఊర్లో వాళ్ల పేర్లందరివీ చెప్తాడు. వాళ్లకు దండం పెట్టమంటాడు పోలిగాడు)
పోలిగాడు : కథకు పొద్దుపోతుంది మరలా వద్దాం పదరా
చిన్న పోలిగాడు : అట్లాగే పోదామ్ పద ఇలా హాస్య పాత్రలు తోలుబొమ్మలాటలో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకొని, వాళ్లను నవ్విస్తుంటాయి.
సాహిత్యం తోలుబొమ్మ లాట వారు రామాయణ, భారత, భాగవత కథలను ప్రదర్శిస్తుంటారు. ఒకప్పుడు బొమ్మలాట వారే రచనలు కూడా చేసేవాళ్లు. అయితే బొమ్మలాట వాళ్లు యక్షగానాలనే ఉపయోగిస్తారు. బొమ్మలాట ప్రదర్శనకు, గోనబుద్దారెడ్డి రాసిన రంగనాధ రామాయణం, శ్రీరామనాటకం, సంతవేలూరు రామనాటకం లేదా కుశలవుల నాటకం, ఉత్తరగోగ్రహణం, విరాట పర్వం, యక్షగానమైన కిరాతార్జునీయం వంటి వాటిని తోలు బొమ్మలాట ప్రదర్శనకు ఉపయోగిస్తారు. బొమ్మలాటను ఆడించడం వల్ల గ్రామాల్లో వానలు పడ్తాయని విశ్వసిస్తారు. ఇలా వానల కొసం ఉత్తర గోగ్రహణాన్ని ప్రదర్శిస్తారు. బొమ్మలాటను ప్రదర్శించే వారు ఒకప్పుడు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వాళ్ళే. అయితే రాను రాను బొమ్మలాట వారి పరిస్థితులు చాలా అధ్వాన్నంగా మారి పోయాయి. సినిమాలు వచ్చాక బొమ్మలాటలు చాలవరకు కనుమరుగైపోయాయి. అక్కడక్కడ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బొమ్మలాటను బ్రతికించుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగు వాడి మీద వుంది.
అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు