Jul2009
చలి కొండల నుంచి కొన్ని మాటలు

Hanshan
వొకరు తూర్పు, మరొకరు పడమర. కానీ… ఎటు నించి ఎటు వెళ్లినా ఆలోచనా ధార వొక్కటే. వెతుకులాట వొక్కటే. నాకు గేరీ స్నైడర్ నీ, హాన్ షన్ ని పరిచయం చేసిన నా విద్యార్ధి మిత్రుడు, అమెరికన్ కవి ఆలెక్స్ డేవిడ్ మిల్లర్ కి ఈ అనువాదాలు స్నేహంతో ఓ చిరు కానుక. వొక ఏడాది పాటు నేను చెప్పిన ప్రతి కోర్సులోనూ విద్యార్థిగా వున్నఆలెక్స్ కొత్త ఉద్యోగంలోకి వెళ్లబోతూ గేరీ స్నైడర్ కవిత్వ పుస్తకాల్ని నాకు కానుకగా ఇచ్చాడు, “అందమైన భాష అందంగా నేర్పినందుకు, అద్భుతమైన దక్షిణాసియా కవిత్వాన్ని నాకు పరిచయం చేసినందుకు, ఆకుపచ్చని ఆలోచనల్ని నా జీవితంలో భాగం చేసినందుకు, అఫ్సర్ గారికి ….” అంటూ అతను తెలుగులో రాసిన వాక్యాలు ఎప్పటికీ నేను మరిచిపోలేను. ఆశ్చర్యంగా, హాన్ షాన్ లాగా, గేరీ స్నైడర్ లాగానే ఆలెక్స్ కూడా ప్రకృతి వొడిలోనే కొలువుకి కుదిరాడు. అతను వొక పెద్ద పూల తోటకి వనమాలి ఇప్పుడు. ప్రకృతీ, కవిత్వం అతని రెండు కళ్లు. ఈ ముగ్గురూ వొక వరసలో తెలుగు పదాలై మిమ్మల్ని పలకరిస్తారు తరవాత)
చిక్కు ముడుల్లాంటి కొండల నడుమ
కాసింత చోటు దొరికింది
పక్షులు ఎగిరే దారుల్లో
మనిషి కాళ్ల కింద నలగని దారుల్లో.
ఏముందీ దీని ఆవల?
అస్పష్టమైన రాళ్లని పట్టుకు
వేలాడుతున్న తెల్ల మబ్బులు తప్ప.
ఇక్కడ కొన్నాళ్లు బతికాను. ఎన్నాళ్లు?! ఏమో!
కొన్ని చలికాలాలూ, కొన్ని వసంతాలూ కావచ్చు.
అది చాలు ఇప్పటికి.
పో……వెళ్లి , వొక్కటంటే వొక్క మాట
అడుగు నీ వాళ్లందరినీ
వెండి పాత్రల మధ్యా
ఇనప వాహనాల మీదా బతికే వాళ్లందరినీ .
“అంత డబ్బూ….ఆ రణగొణ ధ్వనులు ఏం చేసుకుంటారూ? అని”
* * *
2
ఈ ఇంటికి దూలాలూ గోడలూ లేవు.
కుడి ఎడమల వున్నాయే
ఆ ఆరు తలుపులు
అవి ఎప్పుడూ తెరుచుకునే వుంటాయి.
నీలాకాశం నా మధ్య గది.
మిగతా గదులన్నీ ఖాళీ
తూర్పు గోడ పడమటి గోడకి
ఎప్పుడూ బాదుకుంటూ వుంటుంది
మరి మధ్యలో ఏమీ లేదు కదా.
అప్పుల వాళ్ళ బాధ లేదు
చలి కాలంలో అంటావా,
కాసింత నెగడు పెట్టుకుంటాను
ఆకలి వేసిందా,
కాసిని ఆకులూ అలములూ తెచ్చుకుని మరిగేస్తాను.
పాపం, అక్కడ నా రైతు బిడ్డ
ఆ మైదానాల్లో, ఆ కొట్టంలో
ఖైదీలా పడి వున్నాడు
స్వయం ఖైదు
వొక సారి లోపలికి వెళ్తే
ఇంక బయటి దారి లేదు
ఆలోచించు కాస్త
నీ గతీ అంతేనేమో?!
* * *
౩
నా పైలా పచ్చీస్ బతుకులో
కొన్ని వేల మైళ్ళు చుట్టేసి వుంటాను, దిమ్మరిలా.
ముదురాకు పచ్చ గడ్డి వీపుల
నదులెన్నో చూసాను.
సలసల మరిగే ఎర్ర ధూళి నగరాల్లో
తిరిగాను.
మందులూ మాకులూ రుచి చూసాను
ఏవీ నన్ను అమృతుడ్ని చెయ్యలేదు
పుస్తకాలు చదివాను
చరిత్ర మీద కవిత్వాలు రాసాను
ఇవాళ
ఈ చలి కొండ చేరాను
ఈ తోపులో నిద్రపోతాను
నా చెవుల్ని శుభ్ర స్నానిస్తాను.
July 7th, 2009 at 1:18 am
మంచి కవిని, గొప్ప కవిత్వాన్ని పరిచయం చేసారు. ధన్యవాదములు.
బొల్లోజు బాబా
July 7th, 2009 at 10:14 am
బాగుంది. హాన్ షన్ గురించిన జీవిత విశేషాలు కొన్ని చెప్పండి.
July 7th, 2009 at 10:28 pm
(1) లో ప్రస్తావించిన దారుల్లోమొన్ననే నడిచి వచ్చాను. నా చెవులకు ప్రకృతి సడిలో హాయి నాకు పూలవొడిలో పడక. నేనూ ప్రకృతివొడి వెదుక్కునే ప్రాణినేను. ఈ కవితల్ని గురించి సమాచారం అందించిన బాబా గారికి కృతజ్ఞతలు. మంచి కవుల్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
July 9th, 2009 at 7:38 am
అఫ్సర్ భయ్యా
మంచి కవిత్వాన్ని రుచి చూపించావు. ధన్యవాదాలు.
July 9th, 2009 at 5:54 pm
డియర్ మాధవ్ :
చాలా కాలం అయ్యింది నీతో మాట్లాడి.
ఈ అనువాదాలు మనల్ని మళ్లీ కలిపినందుకు సంతోషంగా వుంది.
బాబా: మీ అనువాదాలు చూసి, ముచ్చటేసే, నేను సైతం కొంత ఇటు మొగ్గాను.
కొత్తపాళీ గారికి: అవును, వచ్చే నెల నించి మీ సూచన పాటిస్తాను. ధన్యవాదాలు.
ఉష గారూ: మరిన్ని మంచి కవితలు పరిచయం చెయ్యాలని ఆశ.
చూద్దాం, వచ్చే నెల… ఏ దర్వాజ మీద దస్తకత్ చేస్తానో?
అఫ్సర్
July 10th, 2009 at 12:59 pm
అఫ్సర్ గారు,
విధ్యార్ధులలో కూడా గురువులుంటారనే సంగఠనలు ఇలాంటి వారిని చూస్తే నిజమే ననిపిస్తుంది.
మీ అమెరికా విధ్యార్ధి తెలుగు నేర్చుకుని మరీ మీకు సంతకం చేసి ఇచ్చాడంటే.. అతనికి మాతరుఫున ఓ పెద్ద ఓ వేసుకోండి
ఏది ఏమైనా, “అంత డబ్బూ….ఆ రణగొణ ధ్వనులు ఏం చేసుకుంటారూ? అని” ఈ ప్రశ్న నన్ను చిక్కుల్లో పడేశింది.. ఆలోచనల పురుగుని మది పెట్టిలోకి నెట్టి ఏమి ఎఱుగనట్టు భలే ముగించారే
July 10th, 2009 at 1:37 pm
అఫ్సర్ గారు,
భాష ఎదైనా అంతరంగాన్ని అర్ధము చేసుకోడానికి చక్కటి మనస్సు ఉంటె చాలని చక్కగా చూపించారు… మీ అనువాదం బాగుంది.
-రామరాజు
July 10th, 2009 at 8:30 pm
ఓ మంచి అనువాదం ద్వారా మా చెవులను శుభ్రస్నానించారు. షుక్రియా సాబ్.
July 13th, 2009 at 5:40 am
అఫ్సర్ భాయ్ విశ్వేశ్వర రావు గారు చెప్పారు. నా మెయిల్ ఐ డి అడిగావని. umamhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=tqXaPu-CnmS0rd3hc9hz5IXtH84G07oZE0bTz5r7ta4=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@gmail.com కు మెయిల్ చెయ్యగలవు.
July 16th, 2009 at 11:37 pm
Dear Afsr, July 17
Thanks for introducing me a great poet. Your translations also carry the
pleasure and feeling of the Original poet. As he rightly said, what should we do
with that plenty of money? Does it gives me the sinsitive feeling of playing in the lap of nature? Back to nature is the need of the hour. Your translations
strongly convinced that
Yours
Vamsy
July 17th, 2009 at 1:13 am
అఫ్సర్ గారు,
ఒక్కదాటున చలికొండల్లోకి తీసుకువెళ్ళిపోయారు. దూలాలు, గోడలూ లేని నీలాకాశపు మధ్య గదిలో నిద్రించడమన్న మాట ఎంత గొప్పగా వుంది. హాన్ షన్ కవిత్వాన్ని మీకు, మీ ద్వారా మాకు పరిచయం చేసిన మీ విద్యార్థికి ధన్యవాదాలు. అంతటి లోతైన తాత్విక వివేచనకి తేలిక పదాలతోనే హృద్యంగా అమరింది మీ అనువాదం. మరొకసారి ధన్యవాదాలతో,
-పసుపులేటి గీత
July 17th, 2009 at 9:54 am
అఫ్సర్ గారు,
మీరు పరిచయం చేసిన కవితా ,దానికి ముందు రాసిన పరిచయ వాక్యాలూ చదివి చాలా ఆహ్లాదం పొందాను.మీ శిష్యుడు సృష్టించిన ‘ఆకుపచ్చని ఆలోచనలు’ అన్న మాట చాలా నచ్చింది.
July 20th, 2009 at 4:32 am
ఆకుపచ్చ ఆలోచనల్ని జీవితంలో భాగం చేసుకోవడం… మనకిప్పుడు చాలా అవసరం.
మంచి ప్రయత్నం.
July 20th, 2009 at 6:45 pm
అఫ్సర్ గారు – అర్ధవంత మైన కవిత, అద్ధ్బుత మైన అనువాదము.
ప్రసాద్ తోటకూర
July 25th, 2009 at 2:42 am
అప్సర్ గార్కి ముందుగా నమస్కారాలు,
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు ఒక శీర్షికను నిర్వహించదలచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారం వారం ఆంద్రభూమిలో మీరు రాసే శీర్షిక ఎంతో బాగుండేది. ఇలా మళ్ళీ మీ చేత రాయిస్తున్నందుకు ప్రాణహిత వారికి కూడా అభినందనలు.
మీ
దార్ల
July 28th, 2009 at 5:12 pm
మీ విద్యార్ధి ఆలెక్స్ తెలుగు లో కవిత రాస్తె ప్రాణ హిత లో చదవాలని చాలా కోరికగా వుంది అఫ్సర్ గా(గు)రూ!!