Jul2009
చెరసాలలోని నేల మీది బొమ్మ
నీదాకా చేరడానికి,
నీముందు… ఎన్ని రకాలుగా వివర్ణమైనాను
నలుపన్నావు, సరె.. కుంచె మార్చుకున్నా
పూర్తి తెలుపయ్యాను…దేహంపై
ఉతికిన చొక్కాను మార్చుకున్నట్లు
మనసునీ మార్చుకున్నా….
అయీనా …. ఎక్కడో ఏ మూలో
ఇంత మచ్చ చూపిస్తావేం…?
నిద్ర లేని రాత్రిళ్ళు… ఏడ్చి ఏడ్చి
చారలు తేలిన నా ముఖపు చిత్రపటం…
నేల మీద… అదృశ్యంగా నువ్వు గీసావా?
నా కళ్ళ కది నీ బొమ్మ గానే కనిపిస్తుందేం?
నిశిరాత్రి.. ఆకాశంలో నక్షత్రాలను కలుపుతూ
పోతే..అది నువ్వేఅవుతావు
తెల్లారాక .. ఆకాశం ఖాళీ అవుతుంది
నా హృదయంలా…
అయినా హృదయం ఖాళీ అవటం వుంటుందా?
నువ్వెప్పుడు రక్తంలా ఊరుతూనే
వుంటావు
అడవిలోకి ఎర్రెర్రెగా ప్రవహించినా
నీ గూటిలోకి మళ్ళిమళ్ళి చేరే
రామ చిలుకనైనా… కన్నెత్తి
చూడవెందుకు?
అవునూ నీకు ఎరుపంటే ఇష్టం కదూ
అడవంటేకూడానూ…
చెప్పు.. నీకు చేరువ కావడానికి
నా కుంచెను రక్తంలోముంచనా?
janardhan Jul 24, 2009 1
చాలా బాగుంది.
కొత్తపాళీ Jul 26, 2009 2
ఆసక్తికరంగ ఉంది.
sudhakar Aug 6, 2009 3
అస్పష్టంగా ఉంది. అడవి, ఎరుపు.. ప్రమ, విరహం, ఎక్కడో లింక్ సరిగ్గా కుదరనట్టుంది.