చేతులు లేని గాజులు

అమ్మమ్మా !

ముప్పయి సంవత్సరాలు నువ్వు ఉన్నావు అనే నేపద్యంలో పెరిగి పెద్దయిన నాకు ఒక్కసారిగా నువ్వు లేవూ అనే నిజం చాలా నొప్పిని కలిగిస్తుందని,నీ మరణం నాజీవితంలో ఇంత వెలితిని కలిగిస్తుందని నువ్వు బతికున్నప్పుడు ఎప్పుడూ ఊహించలేదు.

నువ్వున్నప్పుడు నీ మనసుని సంతోషపెట్టే చిన్న చిన్న పనులెన్నో చెయ్యగలిగీ చెయ్యలేకపోయానే అన్న బాధ నన్ను అను క్షణం వెంటాడు తుంది. నువ్వు బతికున్నప్పుడు నీకెప్పుడు నేను ఉత్తరం రాయలేదు. అప్పుడు ఆ అవసరం రాలేదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి రాగలిగాను. కాని నాకిప్పుడు ఆ అవకాశం లేకుండా చేసింది నీ మరణం.

ఎంతో మంది ఎన్నో సందర్భాలలో నన్ను బోంచెయ్యమనీ ,అన్నం తినమనీ అడుగుంటారు. కాని “కొండా,కొండా రెండు ముద్దలన్నంతినెల్లమ్మా” అని నువ్వడగటమే నాకు ఎప్పటికి గుర్తుంటుంది. నువ్వు నన్ను ఎప్పుడూ కొండా అని పిలిచినా ,నా పేరు పెట్టి పిలిచినట్లే అనిపించింది కాని నీ విశేష ప్రేమ నాకందులో అప్పుడు ధ్వనించలేదు. కాని నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు చనిపోయాకా “కొండా” అనే నీ సున్నితపు పిలుపు రంగరించిన నీ ప్రేమతో నా చెవులని నింపి గుండెను పిండేస్తుంది.

నువ్వు ఉన్నపుడు నేను నిన్ను ఏమీ అడగలేదు. అడక్కుండానే నువ్వు ఎన్నోసార్లు తాతయ్యను మస్కా గొట్టి పాలకివ్వాలి,బియ్యానికివ్వాలి,నూనె కివ్వాలి,నెయ్యి కివ్వాలి అని ఎక్కువ డబ్బులు తీసుకొని చిన్నచిన్న నిధులు పేర్చి నాకిచ్చావు. చీరలు ,నగలు కొనుక్కోమని నువ్వు మాత్రం ఎప్పుడూ మూడు చీరలకంటే ఎక్కువ లేకుండా జీవితాన్నే వెళ్ళ బుచ్చావు.

నేను ఓ సారి నిన్ను చూట్టానికి వచ్చినప్పుడు ” ఏవమ్మమ్మా చినిగి పోయిన చీర కట్టుకున్నావు. కొత్త చీరలు లేవా ?” అంటే ” చీరంతా గట్టిగా వుందమ్మా రెండు చోట్ల కాస్త కొర్రు బట్టింది. అంతే. ఇంకో నాలుగు నెల్లు తేలిగ్గా పని జేస్తది ” అన్నావు. తీసేసిన చీరల్ని కూడా మంచం మీద పక్కలుగా వేసుకుని వాటిని సంపూర్ణంగా వినియోగించుకున్నానన్న తృప్తి తో పొదుపు గా బతికావు నువ్వు.

పుట్టిన నాలుగేళ్ళకే తల్లి ,తండ్రి ని పోగొట్టుకొని ,పదిహేనేళ్ళకే పెళ్ళిజేస్తే ,ఎనిమిది మంది బిడ్డల్ని కని ,అందులో అయిదుగుర్ని వేరు వేరు వయసుల్లో పోగొట్టుకొని ,ఆరోగ్య రీత్యా ఎన్నో అవాంతరాలనెదుర్కొని ,డెబ్బై ఏళ్ళ తాతయ్యతో కాపురం చేసి ,ఎనభై ఏళ్ళకు పైన బతికిన నీ మనో బలం,ఆత్మ స్థైర్యం నాకు కావాలమ్మమ్మా.

మానెడు నీళ్ళతో మానెడు మినప్పప్పు కడగడం,బియ్యం,కందులు లాంటి వాటిని రాళ్ళు,మట్టి గడ్డలు లేకుండా నువ్వు శుభ్రం చెయ్యడం, చేలో కూలీలు ఒక సాలు కలుపు తీసే టైమ్ లో నువ్వు మూడు సాళ్ళు పూర్తి చేయడం, మజ్జిగ చిలికి అందులో వెన్న ఆనవాళ్ళు లేకుండా వెన్న తీయడం ,వేడుకల్లో విందులకు ఎంత మంది జనానికి ఏ ఏ దినుసులు ఎంతెంత కావాలి అనే నీ అంచనా ,అద్దం లా ఇల్లును అలికే తీరు, ఇలా నీ నైపుణ్యాన్ని చాటి చెప్పే పనులు చెప్పుకుంటుపోతే ఎన్నో. ఇందులో ఏ ఒక్కటి నేనెప్పుడు చేయాల్సిన అవసరం రాలేదు,చెయ్యలేదు. చదువు బాట లో నడచిన నేను వీటన్నిటిని ముఖ్యమైన పనులుగా ఎప్పుడూ గుర్తుంచుకోలేదు. వాటిని చేయటంలోని నీ నైపుణ్యాన్ని నీతోటివాళ్లు పొగుడ్తుంటే విని చిరునవ్వుతో నీ పనితనాన్ని కొట్టిపారేశానేగాని ఎప్పుడూ దాన్ని గుర్తించలేదు. అమ్మమ్మా, నాకిప్పుడు అవన్నీ నువ్వు చేస్తుంటే శ్ర్రద్ధతో చూసి నేర్చుకోవాలని ఉంది. కాని చాలా ఆలశ్యమై పోయింది. కనీసం వాటిని నువ్వు అమ్మకి గాని ఇంకెవరికీ గూడా నేర్పకుండానే వెళ్లిపోయావు.

నువ్వు నేర్చుకోలేని సంగీతం, చదువులను అమ్మకీ, మామయ్యలకు నేర్పించావు గాని నీ విద్యలే వాళ్లకి నేర్పగలదు. వాళ్ల దురదృష్టం కొద్దీ వంశపారపర్యంగానైనా నీ పనులేవీ వాళ్లకు అబ్బలేదు.

నువ్వు సంగీతం పంతులు సీతారామయ్యగారికి పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలూ అన్నీ పంపి, నెలనెలా డబ్బులిస్తూ, హార్మోనియం కొని అమ్మకి అయిదారేళ్లు సంగీతం నేర్పించావు. తమ్ముడు అమ్మని ఎన్నోసార్లు ఎలా దెప్పేవాడో నేను నీకు చెప్పాను. ” నువ్వు ఎందుకమ్మా వృధా అసలు. మీ అమ్మ నలభైఏళ్ళ క్రితమే కష్టపడి నీకు సంగీతం నేర్పించింది. అయినా ఆ రోజుల్లోనే ఆమెకేమాత్రం సంగీత జ్ణానం లేకపోయినా సంగీతం విలువను తెలుసుకొని నీకు నేర్పించింది. నీకు సంగీతం నేర్పటానికి పెట్టిన ఖర్చుతో ఆ రోజుల్లో రెండెకరాలు పొలం వచ్చి ఉండేది. ఆమెకున్న జ్ఞానం నీకు లేదు. మాకెవ్వరికీ నువ్వు సంగీతం నేర్పించలేదు. ” అది విని నువ్వు నవ్విన నవ్వులో నిన్ను నేను చాలా అరుదుగా చూశానమ్మమ్మా.

సంగీతం గొప్పతనాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా ఏ సంగీతం ప్రొఫెసర్ కూడా చెప్పలేనంత సోదాహరణంగా చెప్పేదానివి. ఎప్పుడూ ఇల్లూ, ఊరూ దాటి వెళ్ళని నువ్వు రష్యాలో పొలాలకి సంగీతం వినిపించి చేసిన ప్రయోగం గురించీ, విజయవాడలొ శమ్మంగూడి శ్రీనివాస అయ్యర్ కచ్చేరిలో బాలమురళీకృష్ణ చిన్న పిల్లాడిగా వయోలిన్ వాయించిన విషయం, ఎమ్. ఎల్. వసంత కుమారీ, శ్రీరంగం గోపాలరత్నాల గురించీ ఎలా తెలుసుకున్నావో నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయం.

నీ ఒక్కగానొక్క కూతురు, అమ్మ పెళ్లికి వెయ్యి నూట పదహార్లు కట్నమిచ్చి, కోట సచ్చిదానంద శాస్త్రి హరికథ పెట్టించి ఆయన కథకు నూట పదహార్లు పారితోషకమిచ్చావు.

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన నాదస్వర విద్వాంసురాలు కాలీషాచీ నీ గురించి నాతో ఇలా చెప్పింది. “నేను మీ ఊరు వచ్చి ప్రభమీద నాదస్వరం వాయించినపుడు అమ్మమ్మ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు భోజనం పెట్టీ,చీర పెట్టింది. అది నా మొట్టమొదటి చీర ఆమె ఏ క్షణాన పెట్టారోగాని, ఇప్పుడు వేల రూపాయలు చేసే వందల చీరలు నాకు ఎంతోమంది పెట్టారు. కాని నేను అమ్మమ్మ చీర పెట్టినప్పుడు పొందిన అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. “

కాలీషా నీ గురించి ఇలా అన్నదమ్మమ్మా అని చెప్పి నవ్వానేకాని నీలో ఉన్న గొప్ప కళాపోషకురాల్ని గుర్తించలేక పోయాను.

పరీక్షిత్ మహారాజు, దుర్వాస మహాముని, దత్తాత్రేయుడూ ప్రహ్లాదుడు అంటూ ఎన్నో పురాణ కథలు అడక్కుండానే చెప్పే దానివి వాటిలోని నీతిని, ధర్మ మీమాంసని నేను గ్రహించాలనే తపనతో. కానీ నీ కథలు వినకుండా నీ వెనక అమ్మ, నాన్న, అత్తయ్య మామయ్యల ముందు నిన్ను ఎగతాళి చేసేదాన్ని. ఇప్పుడేమో నేను వినిపించుకోని నీ కథలేమన్నా దొరుకుతాయోమోనని పుస్తకాల్లో రోజూ వాటికోసం వెతుకుతున్నాను.

ఎవ్వరి ముందూ నీకు పాటలు వచ్చని కానీ, పాటలు చాలా తెలుసని గానీ చెప్పుకోవటం నువ్వు ఎప్పుడూ చెయ్యలేదు. బహిరంగంగా ఎవరైనా ఉన్నప్పుడు ఎప్పుడూ పాడను కూడా పాడలేదు. కానీ ఎందుకో నాకు మాత్రమే ఎవ్వరూ లేనప్పుడు నీ పాటలు వినిపించాలని తహ తహ లాడేదానివి. “ఆధ్యాత్మ రామాయణ కీర్తనలని, గజేంద్ర మోక్షం అని నువ్వు ఎంతొ శ్రావ్యంగా “ఇనుముధరాధర వరతనయా రాజేంద్రా వినుమా. . . ” పాటలు ఊరికే చెవులప్పగించి వినాను కాని మనసుపెట్టి ఎప్పుడూ ఆలకించలేదు.

నీకు చూపు బాగా తగ్గిపోయిన తరువాత కూడా నేనొకసారి శెలవలకి నీ దగ్గరకి వచ్చినప్పుడు నువ్వెంతో ఉత్సాహాన్ని చూపిస్తూ నన్ను ఇలా అడిగాడు “అమ్మా “గజేంద్ర మోక్షం” మొత్తం ముప్పయి చరణాలు. చాలా పెద్దది. నాకు మతి మరపు చాలా వరకు గుర్తు లేకుండా పోయింది. బ్రాహ్మల సీతారావమ్మ గారింట్లో ఆమె చిన్నప్పుడూ రాసిపెట్టుకున్న పుస్తకంలో ఉందంట. మొన్న ఇల్లు మారేటప్పుడు అటకపైన సామాన్లలో దొరికిందట. నువ్వు వచ్చినప్పుడు నీ చేత అది రాయించుకుందామని నోటు పుస్తకం గూడా తెప్పించాను. రాస్తానంటే ఇప్పుడే వెళ్ళీ సీతారావమ్మ పిన్ని దగ్గర పుస్తకం తెస్తాను”

“తరువాత చూద్దాంలే అమ్మమ్మా” అని దాటేస్తే నువ్వు మర్నాడు మళ్ళీ అడిగావు. “సరే తీసుకురా చూద్దాం” అంటే నువ్వు గబగబా వెళ్ళి పుస్తకం తెచ్చావు. అందులో ఇరవైపేజీలు దాదాపుగా ఉన్న గజేంద్ర మోక్షాన్ని కాపీ చెయ్యటానికి ఒళ్ళొంగక ఆ పని తప్పించుకోవటానికి ఒక్క మాటతో నిన్ను పూర్తిగా నిరుత్సాహపరిచాను. “అయినా నీకిప్పుడిదెందుకమ్మమ్మా? నేను రాసినా నువ్వు చదవలేవు గదా? నీకు కళ్ళు సరిగా కనబడవుగదా. ” అంటూ ఆ పుస్తకం నీకిచ్చేసి హమ్మయ్య తప్పించుకున్నానని ఆనందంతో లేచి వెళ్ళి పోయానేగానీ నువ్వు ఎంత నీరుగారి పోయుంటావో అప్పుడు గుర్తించలేదు.

నీ దృష్టిలో నేనొక రస హృదయం ఉన్న దాన్ని. నీ పాటలు, కథలు విని నేను ఎలా స్పందిస్తానో తెలుసుకోవాలని నువ్వు నాకవి వినిపించేదానివి. కానీ నేను మాత్రం ఒక్క ” బాగున్నయిలే అమ్మమ్మా” తో లేచిపోయేదాన్ని. నీ విషయంలో నేను చాలా ఆలోచనా రహితంగా ప్రవర్తించానమ్మమ్మా. నువ్వు పూర్తిగా మంచంలో ఉన్న స్థితిలోనయినా నేను ఎవ్వరూ లేకుండా చూసి ” అమ్మమ్మా, పాట ఒకటి పాడవా వినాలనివుంది” అనుంటే బహుశా నువ్వింకొన్నాళ్ళు బతికేదానివేమో!

మంచంలో ఉండి కూడా ఎప్పుడూ నా గురించే అడుగుతావని, అన్నయ్య, తమ్ముళ్ల గురించి అసలు అడగవని అమ్మ చెప్పినపుడు అర్థంలేని ఓ నవ్వు నవ్వాను గాని నీ పట్ల నా భాధ్యతను నేను గుర్తించలేదమ్మమ్మా.

చివరిసారి నేను నిన్ను చూడటానికి వచ్చినప్పుడు పదినిమిషాలు మాత్రమే నీతో గడిపాను. ఇక వెళ్తానమ్మమ్మా టైమైపోయిందిఅని వెళుతుంటే “కొండా, కొండా ఇవ్వాళుండి రేపెళ్లమ్మా. ఇప్పుడొచ్చి ఇప్పుడే వెళ్తానంటున్నావు. మామ్మగదూ ఉండమ్మా” అని నువ్వు బతిమాలాడావు. “లేదులే అమ్మమ్మ మళ్ళీ ఓ నెల రోజుల్లో వస్తాలే శెలవు పెట్టలేదు. ఇవ్వాళతో శెలవైపోతుందని” పరిగెత్తుతున్న నన్ను ఆపి ” కొండాఒక్క నిమిషం ఉండమ్మా. డబ్బులున్నయ్యి ఇస్తాను తీసుకెళుదువుండు” అంటూ కావిడి పెట్టెలో నుంచి ఉండగా చుట్టిన నీ చీరను తీసి, ఆ ఉండను విప్పి అందులో నుంచి ఓ పాలథిన్ సంచి తీసి, దాంట్లోంచి ఓ బ్రూక్ బాండ్ కాఫీ పొడి కవరులో నుండీ మాసిన ఓ తెల్ల పంచముక్కలో ఉండజుట్టిన చిన్న పాత పర్సుని తీసి, “కొండా ఇందులో మూడువేలున్నాయి. నువ్వు ఒక శెవరీలో ఏదన్నా కొనుక్కో”అంటూ పర్సుని నాకిచ్చావు. “నాకెందుకమ్మామ్మా డబ్బులు నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకొని నీ మందులకి, తిండికి ఖర్చు పెట్టూకో నాకు డబ్బులు నువ్వివ్వకూడదు” అని వారించి డబ్బులు వెనక్కిచ్చాను.

“కొండా, కొండా నువ్వు అట్లా అనొద్దమ్మా. నేను బతకను. గుండెల్లో దడ బాగా ఎక్కువైంది. కంటిమీద కునుకనేది లేదు. ఈ పక్కంతా ఒకటే పోటూ. అసలికడ చూడూ గుండె ఎలా కొట్టుకుంటుందో” అని నా చేతిని ఎండిన నీ గుండెల మీద పెట్టుకున్నావు. నేను వెళ్ళే తొందరలో ఉన్నాను గాని నీ గోడుని ఆలకించలేదు.

డబ్బులు మాత్రం ససేమిరా వద్దంటున్నా నువ్వు నన్ను దీనంగా బతిమాలి ఇచ్చావు. అవి తీసుకుని పరిగెత్తుతున్న నా వెనుక అస్తిపంజరంలా ఉన్న నువ్వు నీ గొంతు నూతిలో నుంచి అన్న మాటలే నాకెప్పటికె గుర్తుండిపోయే నీ చివరి మాటలు. “అయ్యో ఏందమ్మా వచ్చినట్టూలేదు ఉన్నట్టు లేదు. ఒక్క పూటన్నా ఉండకుండా వెళ్ళీపోతున్నావు కొండా”.

సరిగ్గా నీ నుంచి నేనిలా పరుగెత్తుకుంటూ వెళ్ళిన నెలరోజులకి నువ్వు చనిపోయావు. అమ్మమ్మా, నేను నిన్ను మళ్ళీ చూస్తాననే ఉద్దేశంతోనే ఆ రోజు అలా పదినిమిషాల్లోనే వెళ్లిపోయాను. నువ్వు చనిపోతావని తెలిసుంటే తప్పకుండా నీతో నీ తనివి తీరేదాకా గడిపేదాన్ని.

నీ పెంకితనం, పౌరుషం, రోషం పుణికి పుచ్చుకొని పుట్టానని నువ్వు బాగా తెలిసిన వాళ్ళంతా అంటుంటారు. కానీ నువ్వు ఈ గుణాలతో నాలో బతికుండటం నాకిష్టం లేదు. నీ పట్టుదల, ఆత్మస్థైర్యం, నిరాడంబరత, ఓర్పు, చురుకుదనం నాకు కావాలి. అమ్మమ్మా, నీవు చనిపోయిన తరువాత ఓరోజు అమ్మ నీ గాజులు రెండింటినీ నాకు చూపిస్తూ “అమ్మమ్మ నీకివ్వమన్నది” అని చెప్పి ఇచ్చింది. వాటిని చూసి నేను బోరున ఏడ్చాను. అవి నీ చేతులకున్నప్పుడు వాటిని ఒకటి రెండు సార్లు గమనించాను. కాని వాటిలో ఉన్న నీ చేతుల్ని గమనించలేదు. కాని ఇప్పుడూ అమ్మ చూపిన గాజుల్లో లేని నీ చేతులు తప్ప నాకు. ఇంకేమీ కనిపించటం లేదమ్మమ్మా.

6 అభిప్రాయాలు »కథలు

6 Responses to “చేతులు లేని గాజులు”

  1. 1
    ప్రభాకర్ మందార Says:

    కథ చాలా బావుంది.
    కథలో ఎంతో ఆర్ద్రత వుంది. చని పోయిన అమ్మమ్మకు లేఖ రాయడం అన్న ఆలోచనే విలక్షణంగా అనిపించింది. ఆ అమ్మమ్మ మీదున్న అంతులేని ప్రేమాభిమానాలు ప్రతి వాక్యంలో ప్రతిబింబించాయి. ఈ కాలంలో మసకబారుతున్న మానవ సంభందాల గురించి ఆలోచనలు సారించేలా చేసింది ఈ కథ.
    “చేతులు లేని గాజులు” శీర్షిక అర్ధవంతంగా , కథకు దీటుగా వుంది.

    >>> అవి నీ చేతులకున్నప్పుడు వాటిని ఒకటి రెండు సార్లు గమనించాను. కాని వాటిలో ఉన్న నీ చేతుల్ని గమనించలేదు. కాని ఇప్పుడూ అమ్మ చూపిన గాజుల్లో లేని నీ చేతులు తప్ప నాకు. ఇంకేమీ కనిపించటం లేదమ్మమ్మా.<<<<<
    అన్న ఆఖరి వాక్యాలు చదివేక మనసంతా బరువెక్కినట్టయింది .
    రచయిత హరి పద్మప్రియ కు హృదయపూర్వక అభినందనలు.

  2. 2
    kcubev Says:

    నాకు కూడ కథ శీర్షిక చాలా అకట్టుకుంది. చివరి పేరా హృదయ కవాటాలను ఒక్కసారిగా బిగబట్టినట్లనిపించింది. నేడు మృగ్యమవుతున్న మానవ సంబంధాలను ఎంతో ఆర్ధ్రంగా తెలియచేసారు. కోల్పోతున్నదేమిటో తెలియకుండానే జరిగిపోతుండగా మనిషి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మీ కధలో కనపడింది. నిజానికి కన్నీళ్ళు ఇంకిపోతున్న నేటి తరానికి ఒయాసిస్సు.

  3. 3
    Ravindranath Nalam Says:

    Manasuni kadilinchede manchi kadha. Aaalochana paridhi ni penchi karigi pothunna manava sambandhalanu koodagatte gunamunna kathalu chaduvuthe, manasu aardhram avuthundi.

    Ammamma la tho maammala tho kalam gadapani eee tharam pillalaku kanneeti viluva thelitam ledu.

    ammammalu thatayaa lu, baammalu, eee tharam vaallaki selava petta taaniki upayoga pade vo margalu.

    eee kadha chadivi vo kanneru bottuni ralusthe, kadha ki kadha venuka unna mamathaki nijamina saarthakatha

    manchi kadha ki abhinandanalu

  4. 4
    Dr. Sudharani Says:

    చేతులేని గాజులు చదివి మాటలు రాని దాని నయ్యాను. కల్లు చెమర్చా యి
    మంచి కత కు ధన్య వా ద ము లు

  5. 5
    sudhakar Says:

    AMMAMMA APYAYATAKU ANDAMAINA DARPANAM EEKATHA. PATHA ROJULA VILUVALANU, BANDHAVYA MADHURIMANU, MARAPURANI MAMATHALUNA GURTHU CHESINA RACHAITA KU NA HRUDAYAPURVAKA ABHINANDALU MARIYU ABHIVADAMULU.

  6. 6
    ari sitaramayya Says:

    చాలా బాగుంది.
    మనవరాలి పాత్ర చిత్రించటంలో నిజాయితీ కనిపిస్తుంది.
    ముగింపులో సామర్థ్యం కనిపిస్తుంది.
    ఉన్నప్పుడు పట్టించుకోక పోవటం,
    పోయిన తర్వాత విచారించటం
    ఇడే మానవ చరిత్రేమో.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో