చిరంజీవి, యజ్ఞం కథల విశ్లేషణ (ఒకే వస్తువు – రెండు సందర్భాలు)

మన రాష్ట్రం కోస్తా, తెలంగాణా, రాయలసీమ, కళింగాంధ్ర అనే రెండు భౌగోళిక  ప్రాంతాలుగా వ్యవహరించబడుతోంది. ఈ నాలుగు ప్రాంతాలలో జీవిస్తున్న అంధ్రుల సంస్కృతి ఒకటే అయినా జీవన విధానంలో తేడాలున్నాయి. నదీ జలాల సమృద్ధి వల్లా కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందినట్లుగా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి నందుకోలేదు. తెలంగాణా ప్రాంతం చాలాకాలం నిజాం నవాబుల పాలనలో మ్రగ్గి పోవడంతో అక్కడ మిశ్రమ సంస్కృతి వుంది. పైగా వెనుకబాటుతనముంది. కళింగాంధ్ర ప్రాంతంలో ఆటవిక సంపద, ఖనిజ సంపదా సమృద్ధిగా వున్నా వాటి ఫలితాలు ప్రజలకు చేరడంలేదు. ఫలితంగా ప్రజలు అభివృద్ధికి నోచుకోక దారిద్ర్యంలో మ్రగ్గుతున్నారు. ఇక రాయలసీమ విషయానికొస్తే, నిరంతర కరువులతో, కక్షలతో జన జీవనం దుర్భరమైపోయింది.

వెనుకబాటుతనంలో కళింగాంధ్రదీ, రాయలసీమదీ ఒకటే స్థాయి అనిపిస్తుంది. కాబట్టే ఈ రెండు ప్రాంతాలలొ ఒకప్పుడు వెట్టిచాకిరీ విధానం బలంగా ఉండేది. ఈ కారణంగానే వెట్టిచాకిరీ కూడా ఈ ప్రాంతపు కథల్లో వస్తువుగా మారింది. అలా వెట్టిచాకిరీని కథల్లో చిత్రించిన కథలు “చిరంజీవి”, యజ్ఞం కథలు. చిరంజీవి కథను రాసినవారు జి.రామకృష్ణ. యజ్ఞం కథను రాసినవారు కాళీపట్నం రామారావు గారు.. చిరంజీవి కథ 1941 లో  16 వ  తేదీన  విజయవాణి పత్రికలో ముద్రింపబడింది. యజ్ఞం కథ 1966″యువ”  దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. యజ్ఞం కథ కళింగాంధ్ర కథా సాహిత్యంలో మొదటి కథ కాకపోవచ్చు కానీ చిరంజీవి కథ రాయలసీమలో మొదటి కథ.

ఈ రెండు కథల్లోనూ ఆ నాడు సమాజంలో వేళ్ళూనికుని వికృతంగా పెరిగివున్న వెట్టితనం పిశాచి విశ్వరూపం దర్శనమిస్తుంది. అయితే యజ్ఞం కథ తెలుగు కథా సాహిత్యంలో ఒక సంచలనాన్ని రేకెత్తిస్తే, చిరంజీవికథ ఉనికి ఇటీవలనే ప్రజలకు తెలుస్తోంది. మరి ఎందుకిలా జరిగింది? ఏమిటి కారణం? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే ఆ కథలు పుట్టిన కాలంలోని పరిస్థితుల్ని బేరీజువేసుకొని కథల్ని  అధ్యయనం చేయాల్సి వుంది.

ఈ రెండు కథల పుట్టుకకు మధ్య పాతిక సంవత్సరల ఎడమ ఉంది. అలాగే ఆ కాల పరిస్థితుల్లో వచ్చిన మార్పుల్లోను ఎంతో తేడా వుంది.
చిరంజీవి కథ రాసేనాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించలేదు. దేశం పరాయి వారి పాలనలోనే వుంది. వారి పాలనలో దేశం సర్వస్వాన్ని కోల్పోయిన అనాధలా వుంది. ఒక వైపు ఆంగ్లేయుల ఆగడాలు, వారి అండదండలతో పెరిగిన భూస్వాములు, ధనవంతుల దాష్టీకాలు పరాకాష్టకు చేరుకున్న సమయం. మరోవైపు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం జనం  గాంధీలాంటి మహామహుల నాయకత్వంలో సత్యాగ్రహాలు, పోరాటాలు చేస్తున్న కాలం. సామాజిక రాజకీయ చైతన్యం, దేశభక్తి జనాల గుండెల్లో ఉరకలెత్తుతున్న పరిస్థితి. దేశంలోని కవులు, రచయితలు ప్రజలలో మూఢత్వాన్ని, జడత్వాన్ని పోగొట్టి, ప్రజల్ని చైతన్య వంతం చేయడానికి ఉద్యమ స్థాయిలో రచనలు చేస్తున్న కాలం. అయితే భారతీయుల్ని ఆంగ్లేయులు బానిసలుగా భావిస్తూ రాచి రంపాన పెడుతుంటే, ఆ ప్రభావాన్ని, వలస వాద భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న భూస్వాములు, ధనవంతులు పేదల్ని జీతగాళ్లుగా, వెట్టివాళ్ళుగా నీచాతి నీచంగా చూస్తున్న దశ. ఈ నేపధ్యంలో సహజంగానే రచయితలు, ఆ పరిస్థితులకు స్పందించి కథా వస్తువుల్ని ఎన్నుకున్నారు. అలా ఎన్నుకోబడిన వస్తువే చిరంజీవి కథలోనూ వుంది.

సాహిత్య పరంగా చూస్తే గురజాడ, చింతాదీక్షితులులాంటి వారు అందించిన ఆభ్యుదయ వారసత్వం వుంది. కొ.కు. ,శ్రీ పాద, సురవరం లాంటి మహామహులు ఆకాలానికి మంచి కథల్ని అందిస్తున్నారు. శ్రీ శ్రీ , శ్రీ రంగం నారాయణ బాబు లాంటి విప్లవ కవుల ఝుంఝా మారుతం రాష్ట్రమంతా వీస్తోంది. వీటి ప్రభావం కా.రా గారిపైన పనిచేసినంతగా రామకృష్ణగారి పైన పని చేయలేదేమోననిపిస్తుంది. అయితే ఏ మాత్రం స్వేచ్ఛలేని బ్రిటిషువారి పాలనాకాలంలో ఆ మాత్రం కథను రాయలసీమ నుంచీ మొదటగా రాయడం గొప్ప స్ఫూర్తి. ఆ విధంగా  సీమ కథా సాహిత్య శకటానికి మొదట సారధ్యం వహించినందుకు రామకృష్ణగారు అభినందనీయులే.

కథా పరంగా చెప్పాలంటే…. నిర్మాణంలో కా.రా గారికున్నంత నైపుణ్యం రామకృష్ణగారికి లేదనిపిస్తుంది. వెట్టిచాకిరీని కథా వస్తువుగా తీసుకున్నప్పుడు, దానికి తగినంత  కాన్వాస్, చెక్కడపు పని యజ్ఞంలో నిర్వహించినంత నైపుణ్యం చిరంజీవి కథలో లేకపోవడం ప్రధానమైన లోపం అయితే శైలీ విషయంలో ఇద్దరిదీ ఒకేదారి. కళింగాంధ్ర గ్రామ్య భాషను కా.రా గారు యజ్ఞంలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. రామకృష్ణగారు రాయలసీమ ప్రాదేశిక భాషను , అందునా అనంతపురం యాసను కథలో పండించారు. కాకపోతే యజ్ఞం కథలో నేపధ్యం విస్తృతంగాను, బలంగాను వుండి, ఆ కథలో మొత్తం కళింగాంధ్ర ప్రాదేశిక జీవితం చిత్రించబడి, అప్పటి సమాజానికి ప్రతిబింబంగా నిలచింది. చిరంజీవి కథ వస్తు నిర్వహణా సామర్ధ్యాన్ని కోల్పోయి, అది ప్రాదేశిక జీవితాన్ని మొత్తంగా ఇమడ్చుకోలేక పోయింది. కాబట్టి ఒక చిన్న కథగా, ఇంకా చెప్పాలంటే కేవలం ఒక సంఘటనగానే అది మిగిలిపోయింది. యజ్ఞం కథలో తరతరాల వెట్టిచాకిరీ విధానంలో కూరుకు పోయి దాన్నుంచీ బయటపడడానికి తన నిరసనను సీతారాముడు తన కొడుకుని నరికేయడంతో తెలియజేసి సమాజానికి ఒక షాక్ నిస్తాడు. తద్వారా తన తర్వాతి తరాలు వెట్టీచాకిరీ బారిన పడకుండా దానికి సమాధి కట్టగలుగుతాడు. అందుకే ఆ కథ సాహిత్య శిఖరాన్నధిరోహించి, అక్కడే తిష్టవేసింది.

చిరంజీవి కథలో అదే తరతరాల వెట్టిచాకిరీలో కూరుకు పోయిన ఒక బాలకార్మికుడి దయనీయ స్థితి చిత్రించబడింది. వెట్టిచాకిరీకి బలైపోయిన వెంకట్రాముడూ తల్లి మరణావస్థలో వున్నందున కాస్తా పెందలాడే రెడ్డిగారి పశువుల్ని ఇంటికి తోలుకొచ్చిన ఫలితంగా, రెడ్డిగారి దగ్గర చావు దెబ్బలు తిని, తల్లి చనిపోయినా ఎలాంటి చైతన్యం లేకుండా, కనీసం నిరసనైనా తెలపకుండాఇంకా కుంచించుకుపోతాడు. అందుకే ఈ కథ కథా సాహిత్య శిఖరపు పదం దగ్గరే కుదేలైపడిపోతుంది. అయితే అదే రామకృష్ణ 9-9-1953  ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన “గంజికోసరం” కథ ఎప్పటీకీ నిలబడగలిగిన కథే.
కథలొ పరిష్కారాల్ని చూపించే ప్రయత్నం చేయడానికి రచయితలు ప్రవక్తలు కాదనీ, సమస్యను చిత్రించి ఆలోచింపచేస్తేచాలని కొందరు విమర్శకులు అభిప్రాయ పడూతుంటారు. ఆ విధంగా చూస్తే తరతరాల వెట్టికి వారసుడైన అప్పల్రాముడు, వాడికి వారసుడైన సీతారాముడు పాత్రలు ఎప్పటీకీ మరచిపోలేనివి. తన తాతల నాటి అప్పుకి తన తండ్రి వెట్టివాడుగా మారితే, ఆ తీరని అప్పుకి తనూ వెట్టివాడిగా మారితే, తనలాగా తనకొడుకు వెట్టివాడిగా మారకూడదని, సీతరాముడు తన కొడుకుని నరికేసి శ్రీరాములునాయుడు పంచాయితీకి మూటగట్టి, ఆ శవాన్ని తెస్తాడు.

చిరంజీవి కథలో వెంకట్రాముడు మరణశయ్యపైనున్న తల్లి కోసరం రెడ్డి వారింటి నుంచీ సంగటి ముద్దలు తీసుకొస్తాడు. కానీ ఆ వేళకే తల్లి మరణించి వుంటుంది. ఆ సంగటి ముద్దలు తేవడానికి వెళ్ళినప్పుడు రెడ్డివారు అతన్ని చితకబాదితే ఒకమూలకు కుంచించుకుపోతాడు గానీ కనీసం పల్లంత మాటనలేదు. అయితే అది వలసవాదుల పాలనా కాలంలో రాసిన కథ కదా, ఆ పాత్రలొ తిరుగుబాటుతనం ఎలా వస్తుందని సమర్ధించే వారుండవచ్చు. కానీ అది సరైన సమాధానం అవదు.

యజ్ఞం కథలో వెట్టిచాకిరీని అంతం చేయడానికి తన వారసున్ని అంతం చేయడం, అంతభీభత్సంగా కథను ముగించడం అవసరమా అనేవాళ్ళూ వుండవచ్చు. సమస్యాపరిష్కారానికి పాత్రల్ని చంపేయడం దేనికి సంకేతం? అలాగయితే వెట్టీచాకిరీలో  కూరుకుపోయిన వాళ్ళంతా తమ బిడ్డల్ని చంపేయాల్సిందేనా? అని నిలదీసేవాళ్ళూ వుండవచ్చు. అదికూడా సరైన మాట అవదు.

నిర్ధిష్టమైన ఒక సామాజిక నిబద్ధత, తద్వరా సాధించదలచుకున్న ఒక సామాజిక ప్రయోజనం యజ్ఞం కథలో వుండి దానికి బలాన్నిచ్చింది అభ్యుదయ దృక్పధం. అంతేగాక మార్క్సిస్టు దృక్పధంతో కూడిన తాత్విక నేపధ్యం కథకు ప్రాణప్రతిష్ట చేసింది.

కానీ చిరంజీవి కథలో  అలాంటి సామాజిక నిబద్ధత గానీ, అభ్యుదయ దృక్పధంగానీ, తాత్త్విక నేపధ్యంగానీ లేకపోవడం వల్లా కథ బలహీనపడింది.
వెట్టిచాకిరీని”చిరంజీవి”గా ఊహించారు రామకృష్ణ. దాన్ని అంతం చేయడమే “యజ్ఞం”గా భావించారు కా.రా.  కాబట్టి  యజ్ఞం కథకు వచ్చినంత పేరు ప్రతిష్టల్ని చిరంజీవి కథ విషయంలో ఎందుకు ఆశించలేమో ఇక వేరుగా చెప్పాల్సిన పని వుండదు. కాకపోతే సమకాలీనమైన మంచి సామాజిక సమస్యతో రాయలసీమ నుంచీ మొదటి కథగా మనముందుకు వచ్చిన చిరంజీవి కథ తెలుగు కథాసాహిత్యంలో తాను పొందాల్సిన గొప్పస్థానాన్ని ఆ విధంగా కోల్పోవడం ఎప్పటికీ వెలితిగానే మిగిలిపోయే అంశం.

అయితే ఈ రెండు కథల్లోను అభివృద్ధి చెందిన రెండు సామాజిక వర్గాల దోపిడీ తనాన్ని, పెత్తందారీ తనాన్నీ చిత్రించాలనుకోవడం మాత్రం యాదృఛ్చికం అనుకోవడానికి వీలులేదు. ఈ విషయంలో కా.రా గారు ఎంత అభినందనీయులో, రామకృష్ణ గారూ అంతే అభినందనీయులు.
(వెట్టిచాకిరీ పైన వచ్చిన కథలగురించి చర్చించేటప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వ్యాసంగా రాయించిన మిత్రులు వి.షణ్ముగం గారికి ధన్యవాదాలతో ఈ వ్యాసం అంకితం)

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో