Jul2009
తెలంగాణా కథా వేదిక “దస్కత్” ఆవిర్బావం
ఉద్యమాల పురుటిగడ్డ మీద కథా సాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ యువకథకుల ఆద్వర్యంలో తెలంగాణ కథావేదిక “దస్కత్” ఆవిర్భవించింది. తెలంగాణ నేల మీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. మొన్నటి స్వాతంత్రోద్యమమైనా, నిన్నటి సాయుధపోరాటమైనా, ఈనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికైనా అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్. ఇక్కడ పుట్టిన కవిత్వం, కథ, పాట, నాటకం, విమర్శ ప్రక్రియేదైనా తనదైన గొంతుకను వినిపించింది. ప్రపంచ చరిత్ర నిండా ఇక్కడి సాహిత్యం సువర్ణాధ్యాయాల్ని లిఖించింది. ఇది జగమెరిగిన సత్యం.
ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత యువతరం గుర్తించింది. కథ సాహిత్య చరిత్రను, అందులో తెలంగాణకు గల స్థానాన్ని ఒకసారి సమీక్షించుకోవడం కోసం గత నెల చివరి రోజు 31.05.2009 (మొన్నటి ఆదివారం) కరీంనగర్ జిల్లా శనిగరంలో కథకుల సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు వరంగల్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నుండి కథకులు హాజరయ్యారు. చారిత్రాత్మక ప్రాముఖ్యం కలిగిన మోయతుమ్మెద వాగుఒడ్డున 1914 లో నిర్మించిన అతిథిగృహమే ఇందుకు వేదికగా మారింది. ఈ సదస్సుకు యువకథకుడు వేముగంటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. “తెలంగాణ గడ్డమీద కొత్తగొంతుకలు తమ వాణిని కథారూపంలో వినిపిస్తున్నాయి. ప్రపంచ సాహిత్యానికి మొట్టమొదటి కథను అందించిన గుణాఢ్యుడు ఈ గడ్డమీద పుట్టినవాడే . అంతే కాకుండా ఆధునికంగా తెలంగాణా ప్రాంతం నుంచి మంచి కథలు వస్తున్నాయి. ముఖ్యంగా యువతరం కథకులు తమ జీవిత మూలాలను వెతుకుతున్న తరుణమిది. వందేళ్ళ తెలుగు కథ అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి తదితర కథకుల కథలు లేకుండా పరిపూర్ణం కాలేదు. అయినా ఆధునిక విమర్శకులనుకునేవారు మాత్రం తెలంగాణ కథపట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. శిల్ప పరమైన రాద్దాంతాలను ముందుకు తెచ్చి తమ పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఈ సమయంలో తెలంగాణ నేల మీద కథలు రాస్తున్న యువకథలు ఈ దాడిని తిప్పికొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే దళిత బహుజన, ముస్లిం, గిరిజన అట్టడుగు వర్గాల నుండి విస్తృతంగా కథలు రావాలి. ఆ ప్రయత్నంలో భాగంగా కథను మెరుగు పరుచుకోవడంతో పాటు, కథకులు తమ అభిప్రాయాలను పంచుకొని కథా విస్తరణకు తోడ్పడాలి” ఆని సదస్సు ఉద్దేశ్యాన్ని తెలియజేశారు.
తెలంగాణ చరిత్రకారులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు “తెలంగాణ కథా చరిత్ర” అనే అంశం మీద మాట్లాడారు. ఆధునిక కథా చరిత్ర మొదలైందే తెలంగాణ ప్రాంతం నుండే అయినప్పటికి తెలంగాణకు కథ లేదనే విమర్శ ఉంది. కానీ అది సరైంది కాదు. సాయుధ పోరాటకాలం ముందు, తర్వాత కూడా ఇక్కడమంచి కథలు వచ్చినప్పటికి పత్రికల్లో వాటికి ఆదరణ లభించలేదు. అందువల్లనే చాలా కథలు రికార్డు కాకుండా కాల గర్భంలో కలిసిపోయాయి. ఈ విషయం తెలంగాణ తొలితరం కథల సంపుటాలను చూస్తే అర్ధమవుతుంది. కథకు కావల్సిన వైవిధ్యమైన జీవితం ఇక్కడ చాలా ఉంది. దాన్ని కథల్లో చిత్రించేందుకు కథకులు దృష్టి పెట్టాలన్నారు. ఈ తరువాత “తెలంగాణ కథ జీవిత చిత్రణ ” అంశం మీద విమర్శకులు డా. నందిని సిధారెడ్డి గారు ప్రసంగించారు. సామాజిక జీవిత సంవిధానాన్ని తెలంగాణకథ పట్టుకోగలిగింది. ఈ నేపధ్యంలో తెలంగాణ కథను అర్ధం చేసుకోవడానికి వివిధ ఉద్యమ మలుపులు ఆధారంగా ఆయా దశలుగా విభజించి పరిశీలించవచ్చు. సామాజికోద్యమాల ప్రతిబింబంగా తెలంగాణ కథ నడిచింది. అంతే కాకుండా ఆధునికంగా 90ల తరువాత తెలంగాణ కథ అనేక సెక్షన్ లకు అస్తిత్వోధ్యమ స్పృహను అందించగలిగింది.
చివరగా “తెలంగాణ కథా రచన సంవిధానా”న్ని గురించి కథావిమర్శకులు డా.ఎ.కె.ప్రభాకర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యమే జీవితాన్ని నడిపిస్తుందని, జీవితమే వస్తువు, శిల్పాన్ని నిర్దేశిస్తుందన్నారు. ఎక్కడైతో ఉద్యమాలు బలంగా ఉంటాయో, అక్కడ సాహిత్యం కూడా బలంగా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత సాహిత్యం నిరూపించింది. సామాజికపరిస్థితుల సంఘర్షణకు కథ అద్దం పట్టాలి. ఏం చెప్పారన్నది వస్తువైతే, ఎందుకు చెప్పారన్నది దృక్పథం, ఎలా చెప్పారన్నది శిల్పమవుతుంది. ఆంధ్రప్రాంత కథతో తెలంగాణ కథను కొలవడం సరైంది కాదు. రెండు ప్రాంతాల జీవితాలు వేర్వేరు. అందువల్ల తెలంగాణ నుండి గొప్ప కథాసాహిత్యం వెలువడిందని అంగీకరించడంలో ఎలాంటి సందేహం లేదు.
సదస్సులో తెలంగాణ కథావేదిక కన్వీనర్ గా పసునూరి రవీందర్ ను, కో కన్వీనర్ గా వేముగంటి మురళీ కృష్ణను ఎన్నుకోవడం జరిగింది. ఈ సదస్సులొ తెలంగాణ కథకులు బి.వి.ఎన్. స్వామి, స్కైబాబా, పూడూరి రాజిరెడ్డి, ఓదెల వెంకటేశ్వర్లు, కాంచనపల్లి గోవర్ధన్, వఝల శివకుమార్, అన్వర్, తైదల అంజయ్య, షాజహానా, వేముగంటి రఘునందన్, పొన్నాల బాలయ్య, దేశపతి శ్రీనివాస్, నామాడి శ్రీధర్, సిద్దెంకి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కథ విస్తరణ కోసం జిల్లాల వారిగా సంకలనాలు ప్రచురించాలని, కథకుల్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక పత్రిక అవసరమని, తెలుగు ఉపాధ్యాయ, అధ్యాపకుల సహకారంతో కథను విస్తరించాలని సదస్సు తీర్మానించింది.
- కన్వీనర్, పసునూరి రవీందర్,
“దస్కత్” (తెలంగాణ కథా వేదిక)
ఒక అభిప్రాయం »సాహితీ సదస్సులు – రిపోర్టులు
July 20th, 2009 at 4:19 am
మంచి అలొచనతొ ముందుకు పొతున్న మీకు దండాలు,
“దస్కత్” (తెలంగాణ కథా వేదిక) ఎర్ప డిన0దుకు సంతొష0.