Jul2009
దృశ్యరాగం
ఎక్కడో ఎందుకో…. ఎలాగనో
దృశ్యం ఒకటి తప్పిపోయింది
ఒక్కొక్కటిగా పేర్చుకున్న జ్ఞాపకాలలోంచి
అది చాలా సున్నితంగా జారి
దాని జాడల తడిని మాత్రమే మిగిల్చి
దారి తెలిసో తెలియకోమరి
ఒక దృశ్యం తప్పిపోయింది
నాలోకి నేను ఒదిగిపోయి
నన్ను నేను ఓదార్చుకుంటున్నప్పుడు
అది నా ముందు దోషిలా నిలబడేది
ఈ దేహంలోంచి దుఃఖాన్ని
బరువుగా కిందికి దించుకుంటున్నప్పుడు
ఎవరివో కలల్ని తీసుకువచ్చి
నా కళ్లముందు కుమ్మరించేది
ఎక్కడ పారేసుకున్నానో తెలియదుకానీ
నా నుంచి
చాలాఅలవోకగా అదెక్కడో జారిపోయింది
నీకేం తెల్సు
పోనీ అంటావు నువ్వు
అది నా కళ్ళలోని ఆఖరిబిందువు
నేను ముక్కలు ముక్కలుగా నరకబడినప్పుడూ
నన్ను పునర్జీవిగ చేసిన పదార్థం అది
చివరిసారిగా దాన్ని
నా గుండె అంచునే ఉంచిన జ్ఞాపకం
దాన్ని ఈ చలనమున్న చేతుల్లోకి తీసుకుని
ప్రేమగా లాలించుకున్నసందర్భం
నన్నింకా ఒడ్డుదాటనివ్వకుండా వేధిస్తోంది
దాని చూపులో నన్ను దహించి
నవ్వులా అలా గాలిలో కదిలిపోయేది
నాకు గట్టి నమ్మకం
ఏదో ఒక రోజు
ఒక వేకువ పరిమళమై
ఖచ్చితంగా వచ్చి తీర్తుంది.
July 17th, 2009 at 5:10 am
చాల బాగుంది
July 25th, 2009 at 1:18 pm
Is it the same shareef who is in somasila!!!???
i think so…
How you dropped into this web?