Jul2009
ఇదీ… కవిత్వం!
కవిత్వాన్ని అనుభూతి చెందాలే తప్ప ఎవరూ నిర్వచించలేరు. జీవితంలో నుంచి స్వీకరించిన అనుభవాలే, గుండెను కదిలించగల కవిత్వం అవుతుంది. తాను దర్మించిన జీవిత పార్శ్యాల్ని కవిత్వీకరించి “ఇదీ జీవితం” అంటూ సంపుటీకరించారు కవి పి.శ్రీనివాస్ గౌడ్.
గుండె క్రింద తచ్చాడందే
ఏ అనుభూతినీ ఆవిష్కరించలేను” అంటున్న ఈ కవి ఈ పుస్తకం పొడుగూతా అలాంటి కవితల్నే… అలాంటి అనుభూతినే పొందుపర్చాడు. “అతడు – విలుకాడు” , “పిట్టలూ – ఆకాశాలూ.”.. “దిగులు నక్షత్రం”,” నీకేం?” మొదలగు కవితలు ఇందుకు సాక్ష్యం.
“యాంత్రిక జీవన రాజ్యంలో నిషేధించిన
నైతిక విలువల మనస్సాక్షి ముందు
ముద్దాయినౌతుంటాను.”
“ఆవిరి పట్టించిన గుండెల్లోని
మలిన స్వేదాన్నిక
రాల్చేసుకుంటాను!!”.. అంటూ ఏదో ఒకనాటి రాత్రి ఒంటరి ఆకాశం మీద దిగులునక్షత్రమయ్యే వాళ్ల ప్రతినిధిగా మాట్లాడుతాడు, “దిగులు నక్షత్రం” కవితలో.
గాయపడటం అనివార్యం. జీవన సత్యం. గాయపడిన స్త్రీ హృదయంలోకి చొరబడి
“నువ్వు నన్ను గాయాలుగా చీరే కొద్దీ
జీవితం లోలోతుల్లోకి
చిగుర్చడమెలాగో తెలిసింది”
“నేను ప్రశ్నల్ని పదును పెట్టడమెలాగో
తెలిసింది”
“మీ మగమద నిరంకుశ అధికారం మీద
విచ్చుకత్తై విరుచుకుపడటం ఎలాగో
తెలిసింది” అంటూ, స్త్రీ పక్షం వహించి వారి స్వరంతో ధిక్కరిస్తాడూ.
తాను కవిత్వీకరిస్తున్న వస్తువును ఏ దూరం నుండి చూడాలో, ఏ దృష్టితో చూడాలో శ్రీనివాస్ గౌడ్కి బాగా తెలుసు.
చీకట్లో “మర్రిచెట్టు” ఎలా వుంటుందో చెప్తూ
“సెలవని సంధ్య వెళ్ళిన తర్వాత
చిరు చీకటి తెరల వెనుక ఇది
ఎంతకీ అంతుచిక్కని మగువ మనసులా
భయద సౌందర్యంలా
గుబులు రేపుతుంటుంది.” అంటాడు. పగటి వేళ ఆ మర్రిచెట్టులో తల విరబోసుకున్న తల్లినీ, పల్లె ముఖచిత్రాన్నీ దర్శిస్తాడు.
అపార్ట్ మెంటుల జీవితాల ఉదయాస్తమయాలు “అనాధ దృశ్యాలనీ, వాళ్లవి “అంతరాత్మలు ఖాళీ చేసిన మొండి దేహాల”నీ, వాళ్ళ “హృదయాల మోకుకి “అసంతృప్తి” వేలాడుతుంటుందనీ చెప్తాడూ “అస్తమయ దృశ్యాల ఆలాపనల్లో…” కవితలో. పాలిపోయిన నగర జీవితాల్లోని శూన్యత్వాన్ని పట్టి చూపుతుందీ కవిత.
పిల్లల్ని బళ్ళో వదిలిపెడుతున్నప్పుడూ ఆ తల్లుల పిల్లల మనః స్థితిని వర్ణిస్తూ-
“ఒకరి ప్రాణం మరొకరిగా చీలి
ఒకరు తరగతి గదిలోకి
ఇంకొకరు తరగతి బయటికి నడుస్తారు
అన్యమనస్కంగా ” అంటాడు. ఎంతటి ఆర్ధ్ర భావన!
“ఉత్తరాన్ని” వాన జల్లుగనూ, వానజల్లు లాంటి ఉత్తరాన్ని రాసిన ఆమెను వసంతంగానూ వర్ణిస్తూ రాసిన “నీ ఉత్తరం – ఒక వసంతం” అనే ఖండికలో బింబ – ప్రతిబింబ భావన హృద్యంగా తోస్తుంది. అర్ధం, పరమార్ధం లేని పదబంధాలతో,గజి బిజి ప్రతీకలతో శబ్ద ప్రధానంగా సాగుతూ, పాఠకుల సహనానికి పరీక్షపెట్టే అకవిత్వాన్ని ప్రశ్నిస్తూ రాసిన వచన పద్యం’.,”మో”యలేక మౌనంగా……..”
ఇవాల్టి యువత ప్రేమల్లోని డొల్లతనాన్ని, ధనం, కులం ప్రభావాన్ని తేటతెల్లం చేస్తుంది ” దెబ్బకి వొదిలే దెయ్యం” ఖండిక.
వృధ్ధాప్యపు చీకటి కోణాల్ని అవిష్కరిస్తూ…
“నిశ్చింతల గుండెల మీద వాలి
నిదురపోవాల్సిన అతని చేతులు
భిక్ష పాత్రలై దీనంగా చాస్తాయి” అంటూ మనసుని కరుణరసాత్మకంగా చేస్తాడు “అవసానం” అనే కవితలో…
“ఇదీ జీవితం” కవిత్వాన్ని శ్రద్ధగా చదివితే.. “ఈ కవి నాలుగు రోడ్ల కూడలి లో ఉన్నట్లు కనిపిస్తాడూ. అనేక వస్తువులు, అనేక అభివ్యక్తులు, అనేక మంచిముద్రలు.. వీటన్నిటి నుండి తన దోవ తాను వెతుక్కొని సాగవలసి వుంది. అందుకు తగ్గ చైతన్యం అతని దగ్గర ఉందనడానికి ఈ కవితా సంపుటి సాక్ష్యమిస్తుంది.” అని ముందుమాటలో అన్న అద్దేపల్లి మాటల్తో ఏకీభవిస్తాము మనం కూడా.
అలాగే శివారెడ్డి గారి ముందుమాటలో ప్రస్తావించిన విషయాలు ఆలోచనాత్మకం.. ఆసక్తిదాయకం.
“ఇదీ జీవితం” కవితా సంపుటి చదివితే.. “ఇదీ కవిత్వం” అని కూడా అనిపిస్తుంది. పుస్తకానికి ముఖ చిత్రాలంకరణ కూడా అందంగా తానే చిక్కుముళ్ళు గీసుకున్నాడీ యువకవి. అరుదైన విషయం కదా…! ముందు ముందు ఎదురయ్యే చిక్కుముళ్ళు విప్పుకుంటూ, మరింత చిక్కనైన కవిత్వం మనం శ్రీనివాస్ గౌడ్ నుండి ఆశించవచ్చు.
అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు