కథకు కొత్తబాట వేసిన మొట్టమొదటి ప్రయోగం

కథ శతవసంతాల పండగ జరుపుకుంటున్న వేళ. పాశ్చ్యాత్య పోకడలతో ప్రవేశించి, దేశం నడకను సంతరించుకొని కాంతులీనుతున్న సమయం. వంద సంవత్సరాల ప్రాభవాన్ని నెమరు వేసుకుంటున్న తరుణం. సామాజిక వాస్తవికతతో మొదలై మాంత్రిక వాస్తవికత వరకు ఎదిగిన వైనం ఒకవైపు అంతరార్ధ కథనపు జ్ఞాన తృష్ణను, చైతన్య స్రవంతి ప్రయోగశీలతను మేళవించుకొని ఇంటలెక్చువల్ కధగా మన్నన్నల్ని పొందిన విధం మరోవైపు. అప్ టు డేట్ అన్ని రకాల రీతులలో ఒరుగుతూ, కొనసాగుతూ కథ తనను తాను సంపద్వంతం చేసుకుంటున్నది. గ్రాంధిక, ప్రామాణిక, మాండలిక భాషలతో మమేకమై ఆయా ప్రాంతాల, పాత్రల సంస్కృతీ, స్వభావాలను తేట తెల్లం చేస్తున్నది. పాఠకులకు తనదైన శైలిలొ విజ్ఞాన, వికాసాలను అందిస్తున్నది.
ఆకారంలో అనేక పరిణామాలను సాధించింది. లక్షలాది ఇతివృత్తాలను గర్భస్తం చేసుకుంది. వస్తుమార్పిడి కాలం నుంచి వినిమయ మార్కెట్ వరకు వచ్చిన మార్పులను గ్రంధస్తం చేసింది. జాతీయ, అంతర్జాతీయ సింహాసనాలపై సింగారించుకొని కూర్చుంది. కిరీటాలు ధరించింది. తనను అమ్ముకొని బ్రతికే వారి చేతుల్లో పడి కార్డు కథగా మిగిలింది. తనను నమ్ముకొని బ్రతికే వారి చేతుల్లో పడి పెద్దకథగా విలసిల్లింది. ఉనికి కోసం స్థితి స్థాపకత్వాన్ని సంతరించుకొని మిగిలింది. సామాజిక మార్పులకు, సాంస్కృతిక విశేషాలకు, ఆర్ధిక రాజకీయ, అనివార్యతలకు ఆలంబనగా నిల్చి చారిత్రక సాక్షిగా రూపుదాల్చింది. కథా సాహిత్య చరిత్రలో శోభనే కాదు క్షోభ కూడా ఉంది. ఏది మొదటి కథ, ఎవరు  మొదటి కథకులు అనే మీమాంస కథా సాహిత్య చరిత్ర పునర్నిర్మాణానికి పునాదులు వేసింది.పునర్మూల్యాంకనానికి దారులు పరిచింది.
కథ చెప్పడం నుండి రాయడం వరకు సాగిన ప్రయాణ పరంపరలో కాగితం ప్రముఖ పాత్ర వహించింది. ప్రింట్ తన ప్రభావాన్ని కథా సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో ముద్రించింది. ఈ రెండు శక్తులు కథను సమూహం నుండి ఏకాంతానికి తరిమాయి. రచ్చబండపై నిలిచిన కధ, రెండు చేతుల్లో ఒదిగిపోయింది. అపరిమితమైన శ్రోతల మధ్య నుండి పరిమితమైన చదువరుల మధ్యకు కథ వచ్చి చేరింది. ఇదొక సమకాలీన పురోగమన వాస్తవం. ఫ్యూడల్ విలేజీలో సమూహాన్ని సంతృప్తి పరచిన కథ, ఆ తరువాత ఒంటరి వ్యక్తిని ఓదార్చింది. మొత్తానికి మనిషికి నీడనిచ్చింది.
గ్లోబల్ విలేజ్ లో ప్రతిదీ హైటెక్కే. పాతదానిలో జతకట్టే బదులు, దాన్ని మింగి కొత్తది కుదురుకోవడం రివాజయింది. నేల విడిచి ఆకాశంలో విహరించడం అలవాటయింది. శాటిలైట్ ఛానల్ విజువలైజ్ చేసిన దృశ్యాలు ప్రేక్షకులనుతయారు చేశాయి. ఎలక్ట్రానిక్ మీడియా వీరిని బంధించింది. దాంతో వ్యక్తి ప్రింట్ కు దూరమయ్యాడు. శ్రోతగా, చదువరిగా ద్విపాత్రాభినయం చేసిన వ్యక్తి, టి.వి. ముందు ప్రేక్షకుడిగా మారి కూర్చునాడు. ఈ సంధర్భాన్ని కథ తనకు అనుకూలంగా మలచుకోవాలి. కాగితానికి పరిమితమైన కథ, తిరిగి తన ప్రాచీన రూపమైన మౌఖిక గాధగా అవతరించి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రేక్షకుడిని పలకరించాలి. అలా కథ ఆవిష్కరింపబడటానికి ఆలంబనగా నిలిచిన వ్యక్తి తుమ్మేటి రఘోత్తమ రెడ్డి.
కథా రచయితగా రఘోత్తమ రెడ్డి సుపరిచితులు. కథ సాహిత్య చరిత్రలో ఇతని కథా సంపుటికి సముచితమైన స్థానం ఉంది. పల్లీయ వ్యవసాయ సమాజానికి చెందిన రఘోత్తం మంచి శ్రోత. వ్యవసాయిక సమాజంలో ఒక్కో మనిషిది ఒక్కో బాధ. అనేక వెతల్ని, కథలుగా చెప్పుకోగా విన్నాడు. కార్మికుడిగా అందరి బాధలు ఒకే రకంగా ఉన్నవనే నిర్ధారణ కలవాడు. సంఘటితంగా, సమ్మెతో వాటిని తీర్చుకోవచ్చనే స్పృహ కలవాడు. బొగ్గుబాయి పని చేస్తూ ఏకాంతంగా కథలు రాశాడు. తన అనుభవాల్ని కథలుగా పండించాడు. పది కాలాలు నిలిచేవిగా మలిచాడు. పెన్ను పక్కకు పెట్టి పది సంవత్సరాలు మౌనం వహించాడు. VRS తీసి కొని తన పురిటిల్లు అయిన పల్లెకు పోయాడు. అక్కడి మార్పుల్ని విన్నాడూ. పరిస్థితుల్ని చూశాడు. ఊహించని విషయాలు అనుభూతుల్ని కుమ్మరించాయి. దాంతో కథలు చెప్పడానికి పూనుకున్నాడు.
ఈ సారి రఘోత్తమ్ ఏడు మౌఖిక కథల్ని వీడియో కథ రూపంలో చెప్పాడు. సూటిదనం, సరళత్వం ఈ కథల లక్షణాలు. అల్లం రాజయ్య, ముళ్ళపల్లి సుబ్బారావుల ముందు మాటలు ఈ కథల విశిష్టతను తెలిపాయి. కథకుడు కథ చెప్పిన తరువాత, ఒక్కొక్క కథను ఒక్కక్కరు వ్యాఖ్యానించారు. చివరలో పాణి చేసిన సమీక్షా ప్రసంగం కథలకు ఒక తాత్విక నేపధ్యాన్ని అందించింది. మధ్య మధ్య రవి మాటలు ఖాళీలను పూరించాయి. ఇదీ ఈ వీడియో కధ నిర్మాణ చట్రం.
రచయితగా రఘోత్తమ్ చేయితిరిగిన శిల్పి. ప్రారంభం, కొనసాగింపు, ముగింపులు ఒక దాన్లో నుండి ఒకటి ఊడిపడ్డట్లుగా, సహజంగా వీరి కథల్లోఉంటవి. కథ కోసం ముగింపులు ఉండవు. మౌఖిక కథల్లో మాత్రం ముగింపు పట్ల అత్యంత శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ శ్రద్ధ ఖాళీలను ఏర్పరిచింది. వాటిని వ్యాఖ్యాతలు పూరించారు. రఘోత్తమ్ ఆలోచన, ఆచరణ, మాట, వాక్యం, భావోద్రేకాలు చాలా స్పష్టంగా ఉంటాయి. పామరులకు సైతం చెప్పిన అర్ధం అవుతాయి. అటువంటి వాటికి వ్యాఖ్యానం అవసరం కావడం ఒక వైచిత్రి. ఒకటి, రెండు కథలు వ్యాఖ్యానం వల్లనే అర్ధం కావడం మరొక పరిణామం. అర్ధాంతరంగా కథను  ముగించడం వీటన్నిటికి కారణం. బహుశ ఇదంతా ప్రయోగం కోసమే ఉండొచ్చు.
ఇవ్వడం, తీసుకోవడం అనే రెండు క్రియలు పైకి మామూలుగా కనిపించినా, వాటి ఆచరణలో మనిషి తాత్వికత, ప్రాపంచిక దృక్పధం తేటతెల్లం అవుతాయి. “ఏదైనా ఉచితంగా ఇస్తే తీసుకోవద్దు” అనే అభిప్రాయం పై నిలబడి బతుకును సాగించిన వ్యక్తి, నైతిక బలాన్ని వ్యవస్థ తూట్లు పొడవడాన్ని ఈ కథలు కళ్ళకు కట్టినట్లు చూపించాయి. అవసరం లేకున్నా, అందివచ్చినదాన్ని కాదనడం మూర్ఖత్వం అనే దశకు వ్యక్తి నెట్టబడడం దేనికి సూచిక? అని ఈ కథలన్నీ ప్రశ్నిస్తాయి. నిరామయంగా, నిరలంకారంగా, తడి ఆరని గొంతులో కథకుడూ చెప్పే ఈ కథలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తయి. రఘోత్తం కు నటించడం తెలియదు. కానీ అతనిలో మంచినటుడు ఉన్నాడని వీడియో కథలు నిరూపించాయి.
అంటే కోపం వస్తది కావచ్చు, కాని ఈనాడు “ఉల్లిగడ్డశాస్త్రం” చాలా అమలులొ ఉంది. గ్లోబలైజేషన్ ను వ్యతిరేకించే మేధావి వర్గం, దాని ద్వారా అందే ప్రయోజనాలను గబుక్కున అందుకోవడం చూస్తున్నదే. గ్లోబలైజేషన్ బారిన పడ్డ వారిని, దాని ఫలితాలను అందుకోకుండా వీరే అడ్డుపడం సెజ్ కథలో చూస్తాము. ఒక మహా అస్తిత్వ ఆకాంక్ష కోసం పోరాడే వ్యక్తి, తన వారి ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడాన్ని కథలో తప్పుపడతాడు. మానవ సంబంధాల్లోని వెలితిన కథల్లో పట్టిచ్చాడు. తన అనుభవాలను ఎటూవంటి దాపరికం లేకుండా చెప్పడం వల్ల, ఆ అనుభవాలు చాలా మంది జీవితాల్లో చోటు చేసుకొని ఉండడం వల్ల కథలకు విశ్వసనీయత అబ్బింది. ఆ విధంగా ఇవి అందరి కథలు అయ్యాయి. విలువల ప్రాతిపదిక మీద జరిగిన సంఘర్షణలో నుండి పుట్టుకొచ్చిన కథలివి. చివరికథ రచయిత ఆలోచనా సరళికి అద్దం పట్టింది.
కథ రచనలో రచయిత టోన్ తెలుస్తుంది. దాని కోసం కథనాన్ని, శైలిని గమనించాలి. మౌఖిక కథలొ కథకుడూ ఎదురుగా ఉండి నేను అని చెప్పడం మూలాన అతని కంఠస్వరం వెంటనే పట్టేయవచ్చు. ఇదొక వీలు.కథకుడి హావభావాల వల్ల కథ ఎటువంటి కష్టం లేకుండా అర్ధం చేసుకొవచ్చు. కెమరా ముందు రకరకాల స్టైల్స్ పోకుండా, కుదురుగా కథ చెప్పాలని రఘోత్తం ఆచరించి చూపాడు. ఇవన్నీ కూడా భావి వీడియో కథలకు మార్గదర్శకాలు. అన్నీ కథలు ఒకే గదిలొ కూర్చుని చెప్పడం ఒక పరిమితి. ఇదొక ప్రయోగం అని చెప్పడం మూలాన వచ్చేకథలు ఈ పరిమితిని దాటి నడుస్తాయని ఆశించవచ్చు. పిక్చరైజేషన్ లోని నీట్ నెస్ ప్రేక్షకులను అలరించేదిగా ఉంది.
ఇంతకు పూర్వం కథలను దృశ్యీకరించారు. బుల్లితెరకెక్కించారు. వెండి తెరకు పరిచయం చేశారు. కథను రంగులతో మేళవించి, స్క్రీన్ ప్లే సహాయంతొ చిత్ర్రీకరించారు. కాని అచ్చుకు ముందుగల మౌఖిక కథ పురావైభవాన్ని, శ్రోత పై కథ కురిపించే అత్మీయత వర్షాన్ని, వీటికి కారణభూతుడైన కథకుడి వచో నైపుణ్యాన్ని ఇంతకు ముందెన్నడూ కెమరా బంధించలేదు. మౌఖిక కథ  జానపదుల కళారూపం. ఆ రోజుల్లో ప్రతి ఒకరు కథా స్వభావాన్ని ఒంట పట్టించుకున్నా వారే,. అందుకే నలుగురి నాలుకై కథ నడిచింది. మౌఖిక కథలో భాష, సామెత, నుడికారం, ప్రజల వెతలకు వాహికలుగా పని చేస్తాయి. తమ్ముతాము సేదతీరడం కోసం జానపదులు మౌఖిక కథను ఆశ్రయించేవారు. అటువంటి కథ కెమరా ముందుకు రావలసి ఉంది. అందుకు “రఘోత్తమ రెడ్డి ఏడు మౌఖిక కథలు” అనే వీడియో కథ బాట వేసింది. బుక్ కల్చర్ తగ్గి, లుక్ కల్చర్ పెరుగుతున్న ఈ రోజుల్లో కథను బ్రతికించుకోవడానికి ఇటువంటి వీడియో కథలు మరిన్ని రావాలి.
రాత కథకు వందేళ్ళు నిండిన చారిత్రక సందర్భం ఇది. ఈ సమయంలో “తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఏడు మౌఖిక కథలు” రూపంలో వీడియో కథకు నాందీ ప్రస్తావన జరిగింది. ఇది కథా సాహిత్య చరిత్రలో ఒక మూలమలుపు. గతంలో తెలుగు కథకు రక్త మాంసాలందించిన తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు కొత్త జీవితాన్ని వీడియో కథ రూపంలో ప్రసాదించింది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరిన్ని కొత్త పుంతలు తొక్కే కథకు జవ జీవాలు అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో