Jul2009
మా నాన్నగారి సైన్సు రచనలు
మా నాన్నకు చిన్నతనంనుంచీ సైన్సులో ఆసక్తి ఉండి ఉండాలి. ఈ రోజుల్లో ముంబయివంటి పెద్ద నగరాల్లోకూడా లేని కొన్ని సదుపాయాలు ఆయనకు చిన్నతనంలో తెనాలి స్కూళ్ళలో లభించాయి. ఫ్రెంచ్‌లో జూల్‌వెర్న్, ఇంగ్లీషులో ఎచ్.జి.వెల్స్ గొప్ప సైన్స్ ఫిక్షన్ రచనలు చేశారు. అవన్నీ ఇంగ్లీషు పత్రికలద్వారా మానాన్నకు స్కూలురోజుల్లోనే అందుబాటులో ఉండేవి. మనోవికాసం పొందటానికి తహతహలాడుతున్న ఆ దశలో ఇవన్నీ ఆయనను ప్రభావితం చేసి ఉంటాయి.
ఆయన విజయనగరం కాలేజిలో బి.ఏ. ఫిజిక్స్ చదివారు. అప్పట్లో బి.ఎస్.సి. ఉండేది కాదు. అప్పట్లో ఎ.ఎల్.నారాయణగారు అక్కడ ఫిజిక్స్ ప్రొఫెసర్. మానాన్నకు భౌతికశాస్త్రంలో ఆసక్తి ఉండడం వల్ల బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి ఎం.ఎస్.సీ.లో చేరారు. అక్కడ సి.వి.రామన్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వస్తూ ఉండేవారట. రేడియోలు లేవు. ప్రొఫెసర్ సేఠీ అనే ఆయనొకడు ఉండేవాడట. ఆయన పొద్దుపోయాక తన ఇంటో ఉన్న అరుదైన రేడియో సెట్‌ను మోగించి వినడానికి విద్యార్థులను పిలిచేవాడట. జర్మనీనుంచి ప్రసారమవుతున్న ఒక ప్రోగ్రాములో అనౌన్సర్ తక్కినవారితోబాటు సేఠీ గారిని ప్రత్యేకంగా సంబోధించేవాడట. అది పూర్తయాక సేఠీ స్టూడెంట్లను ‘ఇక మీరు వెళ్ళవచ్చు’ అనేవాడట! ఇదంతా మా నాన్న చదువుకున్న రోజుల్లోని నేపథ్యం.
అప్పటికి అణువిజ్ఞానం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. 1932దాకా న్యూట్రాన్లను ఎవరూ కనిపెట్టలేదు. ఆయనకు ఫస్ట్‌క్లాస్ మార్కులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో డిప్రెషన్ దెబ్బ కొట్టడం, పరీక్ష ఫీజుకూడా కట్టలేని పరిస్థితిలో చదువు మానుకోవడం వగైరాలన్నీ జరిగాయి. అప్పట్లో ఆయనకు రిసెర్చ్ చెయ్యాలని ఉండేది. ఆయన ఎన్నుకున్న అంశం ‘పాజిటివ్ రే ఎనాలిసిస్’. 1897లో జె.జె.థామ్‌సన్ ఎలక్ట్రాన్‌ను కనిపెట్టడానికి ఉపయోగించిన పరికరంలో లోహంతో చేసిన కేథోడ్ యొక్క సహజలక్షణాలను సూచించే అయాన్లు ఎలక్ట్రాన్‌లకు వ్యతిరేకదిశలో ప్రసారం అయేవి. వాటినే ‘పాజిటివ్ రేస్’ అనేవారు. ఏది ఏమైనా చదువు దెబ్బతినడంతో ఈ ఆశలన్నీ బూడిద పాలైపోయాయి.
మానాన్న యువకుడుగా ఉన్నప్పుడే ఐన్‌ష్టయిన్ సాపేక్షసిద్ధాంతం, అణుశక్తి ప్రయోగాలూ అన్నీ వార్తల్లోకెక్కి, సైన్సుతో సంబంధం లేనివారిని కూడా ఒక్క కుదుపు కుదిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో సైన్సుకు ప్రాముఖ్యత పెరిగింది. మార్క్సిస్టు భావాలూ, సోవియట్ రష్యా తదితర దేశాలు సాధించిన విజయాలూ అన్ని కలిసి, జీవితం, సమాజంపట్ల భౌతికవాద దృక్పథమూ వికసించేందుకు ఆ తరంవారికి ప్రేరణనిచ్చాయి. ఆ తరవాత జపాన్‌మీద వేసిన అణుబాంబులతో ప్రజల్లో సైన్సు గురించిన భయం, ఏవగింపుతోబాటు కొంత ఆసక్తి కూడా పెరిగింది.
పాప్యులర్ సైన్స్ పుస్తకాలు మటుకు సోవియట్ ప్రచురణల ద్వారానే తెలుగువారికి విశేషంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రజల్లో సైన్సును ప్రజాస్వామికపద్ధతిలో వ్యాప్తి చెయ్యడానికి ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. మార్క్సిజంవంటి శాస్త్రీయసిద్ధాంతంపై ఆధారపడిన తొట్టతొలి ప్రభుత్వం సైన్సుకు అపారమైన గౌరవాన్నిచ్చి, దానికి ప్రజాదరణ కలిగించే భారీ ప్రయత్నాలు చెయ్యడం అప్పటి అభ్యుదయవాదులకు చాలా ఉత్సాహాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. ఈ విషయంలో తెలుగునాట ఒక చిన్న స్వర్ణయుగం మొదలయింది. మహీధర రామమోహనరావు, తదితరులతోబాటు మా నాన్న గారుకూడా విశాలాంధ్ర కోసమని ఎన్నో సోవియట్ రచయితల వ్యాసాలూ, పుస్తకాలూ అనువాదం చేశారు. తెలుగువారికి పాప్యులర్ సైన్సును ఆధునిక పద్ధతిలో అందించిన మొదటి పెద్ద ప్రయత్నం ఇదే. సామాన్య తెలుగు పాఠకులకు సైన్సు విషయాలు అందుబాటులోకి రాసాగాయి. చంద్రుడి మీద మనిషి బరువు తక్కువగా ఉంటుందనీ, అక్కడికెళ్ళినవారు ఈకల్లా తేలిపోతారనీ ఇలా రకరకాల భావాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
తెలుగు సాహిత్యంలో రాజకీయధోరణులు కాస్త మందగించిన 1955-65 మధ్యకాలంలో మా నాన్న ఎన్నో సైన్సు రచనలు చేశారు. స్పూత్నిక్, యూరీ గగారిన్ మొదలైన పేర్లు తక్కిన ప్రపంచంతో బాటుగా తెలుగు పాఠకులకు కూడా పరిచయం అయాయి. ఆయనకు సైన్సుపట్ల సహజంగా ఉండిన ఆసక్తీ, క్లిష్టమైన అంశాలని కూడా తేలికభాషలో వివరించగలిగిన నేర్పూ ఈ సందర్భంలో ఉపయోగ పడ్డాయి. రెండు మూడేళ్ళు మాత్రమే నడిచిన కినిమా మాసపత్రికలోకూడా ఆయన సినీటెక్నాలజీ గురించి సామాన్యపాఠకులకు అర్థమయే పద్ధతిలో వ్యాసాలు రాశారు. చందమామలో ఆయన మొదలుపెట్టిన సైన్సు పేజీలో నిర్వాహకులకు ఆసక్తి లేకపోవడంతో అది త్వరలోనే మూతపడింది. ఆ రోజుల్లో మీడియా గనక ఆయనను మరింత బాగా ఉపయోగించుకుని ఉంటే ఇంకా ఎన్నో రచనలు వచ్చి ఉండేవి.
మా నాన్న సైన్సు రచనలు చేసేనాటికే కథారచయితగా పేరు పొందారు. జర్నలిస్టుగా ఆయనకున్న అపారమైన అనుభవంకూడా అందుకు తోడయింది. అందుచేత తన సైన్సు రచనల్లో ఆయన మితిమీరిన వివరాలనివ్వకుండా, పాఠకుల ఆలోచనను రేకెత్తించేవరకే ప్రయత్నిస్తూ వచ్చా రనిపిస్తుంది. సామాన్య పాఠకుల్లో ఒక శాతం మాత్రమే సైన్సు చదువుతారని ఆయన అంటూ ఉండేవారు. అలాగే సైన్సు రచనలకు అవసరమయే పరిభాష గురించి కూడా ఆయనకు రచయితగా స్పష్టమైన అవగాహన ఉండేది. డిక్ష్నరీల పద్ధతిలో కాకుండా కొత్త విషయాలనూ, భావాలనూ వివరించేందుకు ఆయన సీదాసాదా శైలినే వాడుకున్నారు. సైన్సులో పాప్యులర్ రచనలు చేసేవారికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఎదురౌతూనే ఉంటుంది. పారిభాషికపదాలను అతిగా వాడితే ప్రామాణికగ్రంథం అనిపించుకుంటుంది కాని సామాన్య పాఠకులకు సైన్సుపట్ల విముఖత పెరిగే ప్రమాదం ఉంటుంది.
నండురి రామమోహనరావుగారు ఆంధ్రజ్యోతి వీక్లీలో మొదలుపెట్టిన విశ్వరూపం సీరియల్ పాఠకులను విశేషంగా ఆకర్షించడంతో ఆయనకు వారు పంపే సందేహాలు ఉత్తరాల రూపంలో కుప్ప తెప్పలుగా వచ్చి పడసాగాయి. వాటికి జవాబులిచ్చే భారాన్ని ఆయన మా నాన్నమీద పెట్టారు. చందమామలో ఉద్యోగం, వివిధ సామాజిక, సాహిత్యపరమైన అంశాలమీద వ్యాసాలు పంపమనేవారి అభ్యర్థనలూ, కాల్పనికసాహిత్యం, ఇలా అన్నిటితోబాటు ఆయన ఇన్ని సైన్సు రచనలు కూడా చేశారంటే అది ఆయనకుండిన ప్రగాఢమైన ఆసక్తినీ, కమిట్‌మెంట్‌నూ సూచిస్తుంది.
మార్క్సిస్టుగా ఆయన ఆలోచనావిధానంలో సైన్సు గురించిన అవగాహన నిర్దుష్టంగా ఉండేది కనకనే సైన్సుకూ, సమాజానికీ ఉండే సంబంధాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఏదీ రాయలేదు. ఇక విషయాల మాటకొస్తే ఆయన వ్యాసాల్లో చాలామటుకు ఇప్పటికీ రెలవెన్స్ కలిగినవే. వాటికి ఇప్పుడప్పుడే కాలదోషం పట్టదు. ఆయన సైన్సు వ్యాసాల సంకలనం చూస్తే ఆయన ఎన్నుకున్న విషయాల పరిధి ఎంతో విస్తృతంగా అనిపిస్తుంది. గురుత్వాకర్షణ, కాంతి, ధ్వని, బరువు, ద్రవ్యరాశి, జీవపరిణామం, అణువులు, పరమాణువులు, విద్యుచ్ఛక్తి, సాపేక్షసిద్ధాంతం మొదలైన అనేక విషయాలను ఆయన సులభశైలో వివరించారు. ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేని ఆ కాలంలో ఆయన విషయసేకరణకు విదేశీ పుస్తకాలమీదా, పత్రికల్లో వచ్చే వ్యాసాలమీదా ఆధారపడ్డారు. మా ఇంట్లో బుక్ ఆఫ్ పాప్యులర్ సైన్స్ అనే పది అమెరికన్ సంపుటాల సంకలనం ఒకటుండేది. అది 1950ల్లో వెలువడింది కనక వాటిలోని కొన్ని వివరాలకు కాలదోషం పట్టినట్టే అనిపిస్తుంది. అయితే వాటిలోని కొంత సమాచారం ఆయనకు ఉపయోగపడి ఉండాలి.
వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను సైన్సు రచనలు మొదలుపెట్టాక ఆయన వ్యాసాల పుస్తకం నాకు అందుబాటులో లేకపోవడంతో ఆయన వేటి గురించి ఏమేం రాశారో నాకు వివరంగా గుర్తుండేది కాదు. ఇప్పుడు తిరిగి చూస్తే సూక్ష్మజీవులూ వగైరాల గురించి ఆయన ఆ రోజుల్లోనే చాలా రాశారని నాకు గుర్తొచ్చింది. అమెరికాలో ఉంటున్న నాదగ్గర ఆయన రచనలన్నీ లేవు. ఈ కారణంగా ఆయనను అనుకరించగలిగే అవకాశంకూడా నాకు కలగలేదు.
మా నాన్న బుద్ధికొలత వ్యాసాల గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయనకు అభిమాన రచయిత అయిన సర్ ఆర్థర్ కోనన్ డాయిల్ ఇంగ్లండ్‌లో 1930లలో అతీంద్రియ శక్తుల గురించి భౌతికదృక్పథంతో చేసిన ప్రయోగాలూ, రచనలూ మానాన్నను ప్రభావితం చేశాయి. 1960ల దాకా వివిధ దేశాల్లో పారాసైకాలజీ గురించిన విశేష ఆసక్తి ఉండేది. మానాన్నకు వ్యక్తిగతజీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను వివరించేందుకు ఆయన బుద్ధికొలత అనే ప్రతిపాదనను లేవనెత్తారు. అతీంద్రియవిషయాలేవీ ఉండవనీ, వాటికి మరొక డైమెన్షన్‌ను ఊహించు కోగలిగితే భౌతికవాద వివరణ ఇవ్వగలమనీ ఆయన విశ్వాసం.
అయితే మెదడు, మనసు మొదలైనవాటి గురించిన పరిశోధనలు 1990 తరవాతనే ఎక్కువగా జరిగాయి. కలలు కంటున్నప్పుడు కాలం వెనక్కెళుతుందేమోననే ఆయన అనుమానం కూడా నా లెక్కన సరికాదు. నిద్ర లేచీ లేవగానే మనం కల గురించి కొంతసేపు ఆలోచించినమీదట కలలోని సంఘటనలకు ‘వివరణ’వంటిది మనకు తోస్తుంది. ఇటువంటి సబ్జెక్టివ్ భావనల ఆధారంగా కాలం వెనక్కెళుతుందని ఊహించడం చాలా పెద్ద సాహసం అవుతుంది. అలాగే జన్మాంతర స్మృతులూ వగైరాలేవైనా తటస్థపడితే వాటి వివరణ ప్రస్తుతానికి లభించలేదనే ఊరుకోవాలిగాని తొందరపడి ప్రతిపాదనలు చెయ్యకూడదు. భౌతికవాదాన్ని బలపరచని ఉదంతాలు ఏవీ కనబడవు కనక ఇటువంటి విషయాల్లో చింతకులు చాలా జాగ్రతగా ఉండాలని నా ఉద్దేశం. అయితే ఈ విషయంలో ఆయన నిజాయితీని శంకించడం, ఆయనేదో ఆధ్యాత్మికవాదంలో పడిపోయారని ఫిర్యాదు చెయ్యడం చాలా తప్పు.
నాకు ఈ విషయాల గురించి రాసిన ఉత్తరాల్లోకూడా వీటి గురించి ఆధునికవిజ్ఞానం అసందిగ్ధ పరిస్థితిలో ఉన్నందుకు ఆయనకు ఆరాటం వెలిబుచ్చేవారు. సైన్సు అనేది నిరంతరమూ ముందు కెళుతూనే ఉంటుంది. ఇటీవల జరుగుతున్న అంతరిక్షపరిశోధనల్లో ఇతర నక్షత్రాలచుట్టూ తిరిగే గ్రహాలూ, వాటిమీది పరిణామాలూ అన్నిటి గురించీ తెలుస్తోంది. విశ్వమంతటా ఒకే రకమైన భౌతిక సూత్రాలు వర్తిస్తాయని రుజువౌతోంది. వాటికి ఎదురీదే ప్రతిపాదనలు చెయ్యడానికి చాలా నిర్దుష్టమైన ఆధారాలు కావాలి.
ఇవన్నీ పక్కన పెడితే ఈనాటి పరిస్థితి ఏమిటి? 50 ఏళ్ళ క్రితమే మొదలైన ఆరోగ్యకరమైన సైన్సు రచనల సంప్రదాయం ప్రస్తుతం ఎలా ఉంది? ఆధ్యాత్మికభావాలనీ, మూఢవిశ్వాసాలనీ నిర్ద్వంద్వంగా ఖండించే ఏకైక వేదిక తెలుగులో ఏదైనా ఉందా? ఈ విషయంలో ఒక్క తాటిమీద నిలవ వలసినవారందరూ గ్రూపులుగా, ముఠాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది. నాస్తికవాదులు, హేతు వాదులు, రాయిస్టులు, మార్క్సిస్టులు (వీరిలో మళ్ళీ ఎన్నెన్నో కులాలు, గోత్రాలు!) ఇలా ఎవరికివారు వేరు కుంపట్లు పెట్టుకుని బలహీనమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అవతల దేవాలయాల్లో రద్దీ పెరుగుతోంది. పత్రికల్లో ఆధ్యాత్మిక పేజీలు బ్రహ్మాండంగా అచ్చవుతున్నాయి. ఈ వైఫల్యానికి పైవా రందరూ కారణం. వెనకబడ్డ కులాలను సామాజికంగా, రాజకీయంగా విడదీస్తున్న పాలకవర్గాలు పబ్బం గడుపుకుంటున్నట్టే ఆధ్యాత్మికత జోరుకూడా ఎదురుచెప్పేవారి బలహీనతల కారణంగా పెరుగుతోంది.
సైన్సు అనేది ఒక స్లోగన్, లేదా పాశ్చర్‌గా మిగలకూడదు. దేవుడు లేడనే కాదు, ఉన్నాడని ఎందుకనిపిస్తోందో కూడా విజ్ఞానం ఈనాడు చెప్పగలదు. మతంలోని సాంస్కృతికపరమైన అంశాలు ఏమిటో, వెనక్కులాగే విషయాలు ఏమిటో దేవుణ్ణి నమ్మనివారంతా ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పలే నన్నాళ్ళూ ఇటూవంటి పరిస్థితే కొనసాగుతుందని నాకనిపిస్తుంది. శాస్త్రీయదృక్పథాన్ని పెంపొం దించడంలో, సామాన్యప్రజలని జాగృతం చెయ్యడంలో లెఫ్టిస్టులు విఫలమైతే అందుకుకూడా కేపిటలిస్టులు నడిపే డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ మొదలైన మాధ్యమాలమీదనే ఆధారపడడం తప్పనిసరి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సైన్సు మ్యూజియంలూ, ప్లానెటేరియంలూ, స్కూళ్ళలో తెలుగులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లూ ఏర్పాటుచెయ్యాలి. హేతువాదం, భౌతికవాదం బలపడేందుకు అవకాశాలెన్నో ఉన్నాయి. తెలుగులో సైన్సు రచనలు విరివిగా రావాలి. ఈ విషయంలో ఎవరు అడిగినా నావంతు సహకారాన్ని అందించడానికి నేను తయారే.
ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
February 17th, 2010 at 4:40 pm
ఆలస్యంగా అయితేనేమి ఒక్ మంచి వ్యాసం చదివాను. ఔను, కొకు సైన్సు వ్యాసాలు చాల్ గొప్పగా ఉంటాయి. గొప్పగా చదివిస్తాయి. విరసం ప్రచురించినదే అనుకుంటా (ఐ యామ్ నాట్ ష్యూర్) , చలసాని ప్రసాదు అప్పగిస్తే కొకు సైన్సు వ్యాసాల పుస్తకాన్ని అరుణతార కోసం రివ్యూ చేసి, నాతో అంత మంచి పని చేయించినందుకు ఆయనకు థాంక్సు చెప్పాను. కొకు బుద్ధికొలత వ్యాసాల గురించి వినడమే గాని చదవలేదు. చదవాలని మస్సు. ఇటీవల డాన్ బ్రౌన్ ‘ది లాస్ట్ సింబల్’ నవలలో, ‘ఆలోచనలకు మాస్ ఉంటుందని, కొలతలకు అందుతుంద’నే ఊహ(?)ను చదువుతూ, ఎలాగైనా కొకు బుద్ధి కొలత వ్యాసాలు సంపాదించి చదవాలని అనుకున్నాను.