Jul2009
మా నేల కోసం
కంఠం కొరికి రక్తాన్ని తాగలేను
ఉసిళ్ల పుట్టలాంటి చేతుల్ని జోడించి
మోకాళ్లమీద భూమిని తాకలేను
మెడలో పాడువడ్డ నేలని వేలాడదీసుకున్నం
నీటి పాయల్ని గాయాలమీద వంపుకోనివాళ్లం
కాలాన్ని గొంతులోకి విషాన్ని మింగినట్టు మింగి
కరువు నేలపై తచ్చాడుతున్న వాళ్ళం
ఉప్పు పొరల్ని, కొబ్బరి గాలి కెరటాల్ని
కండ్లతోని చూడని వాళ్లం
పెదవులతోని ఉచ్చరిస్తున్న భాషల
కన్నీళ్లను వెతుక్కుంటున్న సంధర్బం మాది
దాహం తీర్చని నది ఒడ్డుమీద తలపెట్టి
తల్లడిల్లుతున్న మనుషులం మేము
త్యాగాల్ని ఇంట్లోని ఫోటోలకు పూలదండల్లాగా వేసి
ఎండిపోయిన వరిచేన్లో తలలు దించుకొని
నడుస్తున్న జీవితాలు మాయి
మా నీళ్ల బొట్లన్ని కొబ్బరి నూనె చుక్కలై
మమ్మల్ని మా నేలమీదనే జారిపడేటట్లు చేస్తున్న వేళ
ఏ బంధాన్ని ఆత్మీయంగా కౌగలించుకోమంటరు
విద్వేషాల్ని కాదు
వివేకాన్ని నెత్తిమీదికి ఎత్తుకుంటున్నం
మట్టిపొరల్లో దాచి పెట్టబడిన చరిత్ర ఆనవాళ్లను
భూమ్మీద బలమైన అడుగులేస్తున్నం
మా నడక స్వచ్ఛమైన పదాలొలికే
మేము పరిపాలించుకొనే మా నేలదాకా
venugopal.b Jul 20, 2009 1
చాలా బాగుంది.
రవిచంద్ర Sep 3, 2009 2
చాలా బాగుంది మీ కవిత