Jul2009
మాదిగెంకన్న
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే….. అన్నమయ్య సంకీర్తన లౌడు స్పీకర్లలో హోరెత్తిపోతుంది. ఊరిలోని వీధులంతా మామిడి తోరణాలతో, పెద్దపెద్ద పందిళ్లతో, హడావుడిగా తిరుగుతున్న అధికారులతో సందడి సందడిగా వుంది.
అది “అన్నమయ్య” పుట్టిన ఊరు తాళ్లపాక.
అప్పుడే బస్సు దిగిన నాకు ఇదంతా కొత్తగా ఉంది.. ఊర్లో ఎప్పుడూ ఇంత హడావుడి చూడలేదు.
ఊళ్ళో నుంచి నేనుండే దళితవాడకి ఆలోచిస్తూనే అడుగు లేస్తున్నాను. ఊరికి దూరంగా కొంచెం విసిరేసినట్టుగా వుంటుంది దళితవాడ. ఊర్లో అంతా సిమెంట్ రోడ్లు… కాని నేనుండే వాడలో మాత్రం అంతా ఎర్రమట్టి రోడ్డే……
ఎర్రమట్టి రోడ్డు పొడుగూకి అరటి మానులు ఇరువైపులా కట్టారు. సీరియల్ సెట్టు లేశారు. ఇంకా సాయంత్రం కాకముందే బల్బులు వెలుగుతున్నాయి. ప్రతి అడుక్కు “దళిత గోవిందమ్” బ్యానర్లు కట్టారు. వాడ మధ్యలో రోడ్డుపై గ్రీన్ తివాచి పరిచారు. ఆ తివాచి రోడ్డంతా పరచుకొని అప్పుడే మొలిచిన వరినారులా పచ్చగా ఉంది.
రోడ్డు ఆగిపోయే దగ్గర పెద్ద స్టేజి కట్టారు. స్టేజి మొత్తం రకరకాల పూలతో అలంకరించారు. అన్నిపూలు నాజీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత అందంగా వున్నాయి. స్టేజికి స్పీకర్లు పక్కన ఎయిర్ కూలర్లు పెట్టారు.
దళితవాడ యమ సందడిగా ఉంది. ఈ కొత్త వాతావరణంతో కొంచెం ఇబ్బందిగా అనిపించి మా గుడిసెలోకి అడుగుపెట్టాను. గుడిసెలోని గోడలు, నేల పేడతో బాగా అలికిపెట్టారు. ముగ్గు పిండితో ముగ్గు వేశారు. గుడిసెలో ఎవ్వరూ లేరు. బయటికొచ్చి అమ్మ… నాన్న కోసం చూడటం మొదలెట్టా.
పట్నంలోని పోలీసులంతా వాడలో హడావుడిగా తిరుగుతున్నారు.
ఇంతలో నా భుజం మీద ఎవరిదో చేయి పడితే వెనక్కి తిరిగి చూశా….
ఒక పోలీసాయన నువ్వెవరని అడిగాడు.
…. నా ఊర్లో, నా యింటి దగ్గర నాకే ప్రశ్న.
మళ్లీ ఆయనే ” ఓ… మీరు దేవస్థానం నుంచి వచ్చారా..”
ఆ….. పొడిగా అన్నా….
నా జీన్స్ ప్యాంటు… టీ షర్టు అతన్ని కొంత సమాధాన పర్చినట్టుంది.
ఎన్ని గంటలకొస్తాడు “స్వామి” అని అడిగాడు.
తెలీదు….. కొంత చిరాగ్గా అన్నాను.
నాకు…. నీ కన్నా చిరాగ్గా వుంది. మీ దేవస్థానంకి ఇంకేం పన్లేదు. స్వాముల్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకురావడం… మాకు డ్యూటీలెయ్యడం ఇంకా ఏదో గొణుగుతూనే ఉన్నాడు.
ఈ లోగా “బొయ్, బొయ్” అంటూ వస్తున్న కార్ల శబ్ధం వినపడటంతో పోలీసాయన అటుగా పరుగు దీశాడు.
అటుతిరిగి ఇటుతిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళా…..
ఇంట్లో మా నాన్న పాత ట్రంకు పెట్టెలో నుంచి ఎప్పటిదో తెల్లని పంచె తీస్తున్నాడు.
నాన్నా… ఏందీ… ఇదంతా…
“ఒరే… నువ్వా… ఎప్పుడొచ్చావు… డిగ్రీ పరీచ్చలు బాగా రాశావా. మొత్తానికి యాళకొచ్చావ్.రా… తొందరగా తానం చేసి తయారవ్వు.” హడావుడి పడిపోతూ చెప్తున్నాడు.
“ఈ రోజు మన సందిట్లోకి సాములోరి యిగ్రహాలొస్తున్నాయి. సాములోరికి మన వాడలో పెళ్లి చేస్తారంట.”
ఇంతకీ… సాములోరి పెళ్లికి పెద్దమనుషులు ఎవరో తెలుసునా మనమే. నేను … మీ అమ్మా” ఆనందంతో ఆయనకి ఓళ్ళు తేలిపోతుంది.
మధ్యలో ఏదో గుర్తుకొచ్చినట్లు… “ఇంతకీ ఇది ఎక్కడ చచ్చిందో” అమ్మ నుద్దేసించి అంటున్నాడు.
ఇంతలో ఏవండీ… గురవయ్య గారు.. బయట పిలుపుకు నాన్న హడావుడిగా బయటికి పరిగెత్తాడు.
నాకు ఆకలనిపించి ఇంట్లో తినడానికి ఏం ఉందా అని గిన్నెలన్నీ వెతికాను.ఏమీ కనపడలేదు. పక్కన ఐదు కంచాలు, కొత్త లోటాలు, కొత్త చాపలు ఇంకా కొన్ని కొత్త వస్తువులు అగుపించాయి.
“నాకు పంపడానికే డబ్బులు లేవు. ఇదంతా ఎట్టా కొన్నాడబ్బా.” అని ఆలోచిస్తుంటే “ఒరేయ్ తొందరగా కానీయి. ఈ రోజు ఉపవాసం. సాములోరి పెళ్ళి అయిపోయిందాకా మనం ఏమి తినకూడదు. తొందరగా తెమిలి నీళ్ళోసుకు రాపో!” – అంటూ అమ్మ దాదాపుగా అరుస్తోంది.
అమ్మా. ఇన్ని కంచాలెందుకే?
ఒరేయ్ అసలు యిసయం నీకు చెప్పాలి. ఈ రోజు పెద్దోళ్లు వాడకొచ్చి మనింట్లోనే తింటారు.
వాళ్లు తినేది మనం చేయగలమా? అన్నాను.
నీ మొహం. వాళ్లు కూడా మనమాదిరే రాగి సంగటి, అంబలి అడిగినారు. దీని కోసం మీ అత్తలిద్దర్నీ పిల్సినా. మేం మడి కట్టుకొని వండాల. ల్యాపోతే బాపనోళ్ళకి అపచారం చేసినట్టు. మనం వాడేసిన కంచాలలో వాళ్లు తినరని కొత్త కంచలు, లోటాలు, చాపలు తెప్పించినా ఇంకా కొన్ని తీసుకురమ్మని మీ మావకి డబ్బిచ్చి పంపిచ్చినా.
వీటన్నిటికీ డబ్బూ… అంటూ అమ్మ మొహంలోకి చూస్తూ ఠక్కున ఆగిపోయా. అమ్మ చెవులకు కమ్మలు, ముక్కు పుడక… బోసిపోయినట్లున్న అమ్మ మొహం చూసి విలవిలలాడి పోయాను.
అమ్మ ముందుకు వంగి నా గడ్డం పట్టుకొని తొందరగా తెమల్రా! ఇది మన పండగ. నీవు కూడా టేజీ మీద మాతో పాటు కూచ్చోవాల.
అమ్మ వంగినపుడు మెడలో వేలాడుతున్న పసుపు కొమ్మును చూసి అంటే తాళి బొట్టి కూడా…
కడుపులో ఏదో దేవినట్టయింది. గుడిసెలోంచి బయటికొచ్చా తలతిరుగుతున్నట్టుగా అనిపిస్తే పందిరి గుంజకి కాసేపానుకున్నా… కొంచెం నిబాళించినాక స్నానానికి వెళ్ళా.. గుడ్డలిప్పి తడికపై వేసి, సత్తు బక్కెట్లోని సత్తు చెంబుతో తల మీద చిన్నంగ కళ్లు మూసుకొని నీళ్లు పోసుకుంటున్నా… ఎప్పుడో అమ్మ అన్న మాటలు గుర్తోస్తున్నాయ్ రేయ్! నీవు ఇంజనీరింగులో చేరకపోయినా పర్లే, నీ సీటూకోసం మీ నాన్న చెప్పినట్టూ నా తాళిబొట్టు అమ్మను. ఇది కనీసం నీల్లు పోసుకునేటప్పుడూ కూడా దీన్ని తీసిబయటపెట్టను. నే సచ్చినాకే నాతో పాటు దీన్ని కాల్చేయాల. అంటూ అమ్మ కళ్ళల్లో తడి.
ఉన్న పొలం అమ్మి వీడికి డబ్బు కడ్తానే… నీ బొట్టు అవసరంలే. గంజి తాగి బతుకుదాం! అంటూ నాన్న విసురుగా తువ్వాలు విసిరేసి బయటికెళ్లి పోయినాడు.
అంతా నాకళ్ళ ముందు ఇప్పుడే జరిగినట్టే ఉంది. నేను స్నానం చేసి ఇంట్లో కెళ్ళి లోపల ఇంట్లో ఎవ్వరూ లేరు. ప్యాంటూ, షర్టూ వేసుకొని గుడిసె తలుపు దగ్గరికేసి బయటికొచ్చి స్టేజీ మీదకి పోవటం ఇష్టం లేక దూరంగా నిల్చోన్నా.
స్టేజీ మీద బంగారు ఆభరణాలతో, పూల అలంకరణలతో స్వామి వారి విగ్రహాలు ధగ ధగ మెరిసిపోతున్నాయి. పక్కన నున్నగా గుండు గీసుకొని పిలక పెట్టుకొన్న అయ్యోర్లు మైకు ముందర నిలబడుకొని గొంతులో నరాలు చిట్లేటట్లు వేదమంత్రాలు చదువుతున్నారు. మరో పక్క అమ్మా నాన్నతో పాటు అధికారులు కూర్చోనున్నారు.
దూరంగా ఒక పోలీసాయన చిన్న కుక్క పిల్లను చంకలో పెట్టుకొని ఆదరాబాదరాగా వీధి చివర్లో నున్న ఒక గుడిసెలో వేసి మళ్ళీ తలుపులు మూసి తాళం వేస్తున్నాడు. అదీ సంగతి! అప్పటిదాకా ఏదో వెలితిగా కనిపించిన చిత్రం ఇప్పుడూ పూర్తి రూపంతో కనిపించ సాగింది. వీధిలో ఎక్కడా కోళ్ళు, మేకలు, కుక్కలు, పందులు కనిపించడం లేదు. అట్టాంటి క్షుద్ర జంతువులన్నింటినీ కట్టకట్టి ఒక గుడిసెలో పడేస్తున్నారు. అలా చేస్తేగానీ అవి కాళ్ల కడ్డం పడకుండా ఉండవు.
విద్యుద్దీపాలతో దేవుని విగ్రహాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అధికారులు ముందుగా యిచ్చిపెట్టిన పట్టు వస్త్రాలను అమ్మా, నాన్నల చేతుల మీదుగా తీసుకొని, దేవుని విగ్రహాలకు సమర్పించి, మంగళ వాయుద్యాలు మోగుతుండగా తాళిబొట్టును స్వామి వారికి చూపించి ఇరువురు దేవేరులకు కట్టారు అర్చక స్వాములు.
మొత్తానికి స్వామి వారి కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. తమాషా ఏంటంటే… ఊళ్ళోంచి ఒక్క పిచ్చుక కూడా వాడకి రాలేదు.
తితిదే అధికారులు, వేదపండితులు, పూజారులు మా వాడలోనే అన్నం తిని రాత్రంతా అక్కడే పడుకొని తెల్లారే తిరుపతి వెళతామని… అదే దళిత గోవిందమని. ఇన్నాళ్లు అగ్ర వర్ణాల వాళ్లు దళితులకు చేసిన అన్యాయానికి, దగాకి ఇదో ప్రాయశ్చిత్త కార్యక్రమమని… ఇది చరిత్రలో మరపురాని విషయమని తితిదే చైర్మెన్ గారు మైకులో ఊదరగొట్టారు. వాడ జనం తప్పట్లతో అదరగొట్టారు.
కార్యక్రమం పూర్తయింది. గుడిసెలో కొచ్చా… భోజనాలకని మా అమ్మ నాన్న ఇంట్లో కొత్తగా కొన్న చాపలు పరిచి కంచాలు వరుసగా పెట్టారు. ఆ కంచాల్లో సరిగా అమరే అరిటాకులు పరిచి, కొత్త గ్లాసుల్లో నీళ్లు పోసి, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు.
ఎంతకీ భోజనాలకి రాకపోయే సరికి నాన్న, నేను వాళ్లని పిలవడానికి వీధిలోకొచ్చాం. అప్పటికీ అక్కడ బాపనోళ్ళు రకరకాల ప్రసాదాలను ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టూకొని నిలబడే తింటూ బిస్లరీ బాటిళ్ళల్లో నీళ్ళు తాగుతున్నారు.
నాన్న బాపనోళ్ళ దగ్గరికెళ్లి “సామీ… మా గుడిసెలో భోజనం చేస్తామని చెప్పారు.” అని చిన్నగా అడుగుతుంటే, వాడలో అందరు కూడా ఈ విధంగానే ముందుగానే అనుకొన్న ప్రకారం వచ్చినోళ్ళందరికి, గుడిసెకి ఐదు మంది చొప్పున అన్నం పెట్టాలనుకుని వాళ్ళకు పూట గడవకపోయినా…. వున్నవి తాకట్టు పెట్టీ, సిద్ధం చేసి, మా నాన్న మాదిరే పిలవడానికి వచ్చారు.
తాపీగా అర్చక స్వాముల వారు ” ఆ … మీ అందరికి ఇబ్బంది ఎందుకని… మేమే స్వామి వారి ప్రసాదాలతో సర్దుకుంటున్నాం. మేం… సాధ్యమైనంత వరకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టం.” అని తాపీగా నవ్వాడు. ఆ నవ్వు చెప్పకనే చెపుతోంది. ఇది దళిత గోవిందం కాదని “దళిత”… గోవిందం అనీ.
తెల్లవారింది.. పేపరు చూద్దామని టీ కొట్టు కెళ్ళాను. పేపర్లో వైభవంగా జరిగిన దళిత గోవిందం. “అన్నమయ్య పుట్టిన తాళ్ళపాకలోని దళితవాడలో… దళితులు పెళ్లి పెద్దలుగా, శ్రీనివాసుని కల్యాణం” అంటూ ఇంకా ఎన్నో….
* * *
పువ్వులతో అలంకరించిన తితిదే ధర్మ ప్రచార రధం తాళ్ళపాక నుంచి తిరుపతి వైపు నిదానంగా వెళ్తోంది. రధంలో విగ్రహాలు చిరునవ్వుతో గభీరంగా నిలబడి వున్నాయి.
రథంలోని దీక్షితులు గారికి మాత్రం మనసు మనసులో లేదు. అవధానులు గారూ అని నెమ్మదిగా పిలిచాడు.
“ఏమయ్యా…. .దీక్షితులూ ” – అని అన్నాడు అవధానులు ఆవలిస్తూ.
“అది కాదండి. ఈ విపరీత పరిణామాలేంది స్వామి. మీరు పెద్ద అయ్యుండి దీనికి ఎలా ఒప్పుకున్నారు. మన బ్రాహ్మణత్వం మంట కలవదంటారా. మా ఆవిడయితే ఆ మాదిగ పల్లెకి పోతే ఇక ఇంట్లోకి అడుగుపెట్టద్దంది. నేను అబద్ధం చెప్పి మరీ వచ్చా. ఇక ఉద్యోగం కోసం నా కర్మ ఇట్టా కాలి వచ్చాను గానీ అబ్బబ్బా… భరించలేకపోతున్నాను. రాత్రంతా నిద్రే పట్టలేదు” - అని దీక్షితులు విసుగ్గా అన్నాడు.
“మనం కొండ మీద ఎంతో మంది మాల, మాదిగలకు తీర్థం, ప్రసాదం, శఠగోపురం పెడుతున్నాం. దాని వలన మన బ్రాహ్మణత్వానికి నష్టం కలుగలేదంటావా!”
ఇక్కడ అంతకన్నా ఎక్కువేం జరిగింది దీక్షితులు. మనం ఇక్కడ అన్నం తినలేదు. కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. నేనైతే సాధ్యమైనంతవరకు వారికి దూరంగానే వున్నాను. మనం తెచ్చుకున్న ప్లాస్టిక్ చాపల మీద మనం పండుకున్నాం. ఇక తెల్లారే సరికి బయల్దేరి వచ్చాం.”
అయినా సంతృప్తి చెందకుండా దీక్షితులు…” మన సంగతి సరే. ఈ ఉత్సవమూర్తుల సంగతేంటి. ఎన్నో శతాబ్ధాలుగా, శాస్త్రబద్ధంగా, పూజలందుకున్న ఉత్సవ విగ్రహాలను ఇప్పుడు మాదిగ వాడలోకి తీసుకురావడం ఏంటి. ఇంతకు మించిన మహాపాపం ఏమన్నా వుందా.”
“దీక్షితులూ… నీకు తొందరెక్కువయ్యా. విషయాలు తెల్సుకోవు. కొంచెం దగ్గరికిరా… అని దీక్షితులు చెవులో అవధాన్లుకు మెల్లగా చెప్పసాగాడు. ఇది మన కొండ మీద ఉత్సవ విగ్రహాలు కాదయ్యా. దళితుల కోసమే ప్రత్యేకగా తయారు చేసిన విగ్రహాలు. ఇది వాటి డూపు. ఈ విగ్రహాలు కొండ మీద గుళ్ళోకెళ్ళవు. తిరుపతిలో గోడౌన్లోకి వెళ్తాయి. మళ్ళీ…. దళిత గోవిందానికే వాటికీ మోక్షం.”
“ఆ… అయితే దేవుడే అంటరాని వడయ్యాడన్న మాట. ఓహో…. మాదిగెంకన్న….” అనుకొంటూ విగ్రహాల వైపు చూశాడు.
vrdarla Jul 6, 2009 1
ఇందులో దళిరులు ఇంకా స్పష్టంగా చెప్పాలంటె మాదిగల రెండు తరాల ఆలొచన, ఆచరణలు కనిపిస్తున్నాయి. మొదటి తరం వాళ్ళు దైవం పట్ల, ఇతరవర్ణాల వారి పట్ల ఉన్న విధేయత, కలుపుకుపోతే బాగుండుననే ఆశ, వాళ్ళ అమాయకత్వం బాగానే పట్టుకున్నారు. కానీ కథకు కావలసిందేదో మిస్ అయ్యింది.
Pasunoori Ravinder Jul 6, 2009 2
మంచి కథ. ఆధునిక కుల పోకడలను వెతికి పట్టుకొ గలిగారు రచయిత.
అయితే డా.దార్ల గారు అన్నట్టు ఓ విషయం మిస్స్యయ్యింది
అదేమిటంటే కథలో భావ గాఢత దెబ్బతిన్నది.
ఒక దుర్మార్గాన్ని శక్తివంతంగా కాకుండా రచయిత సున్నితంగ చెప్పి పాఠకుడిలోని ఉత్కంఠతను కథ చివర్లో చల్లబరిచారు.
ఏది ఏమైనా రచయిత మరోసారి దీన్ని రీరైట్ చేస్తే బాగుంటంది.
…..పసునూరి రవీందర్
hcuravinder@gmail.com
ప్రభాకర్ మందార Jul 6, 2009 3
కథ చాలా బావుంది.
“మాదిగెంకన్న” శీర్షిక చాలా ఆలోచింపజేసింది.
“హరిజనులు” అన్న పేరుతో… “దళిత గోవిందంతో నాటకాలతో అగ్రకులాలు, పాలక వర్గాలు దళితులను ఎన్ని రకాలుగా వంచిస్తున్నాయో!
“మాదిగ వెంకన్న”, “బాపన వెంకన్న” .భావన వెనక ఎంతో ఆవేదన., ఆక్రోశం వున్నాయి.
కత్తి మహేష్ కుమార్ Jul 7, 2009 4
నిజంగా జరిగిందిదే! జరుగుతున్నదీ ఇదే!! ఆ కటిక నిజానికి కథకుడు తనదైన సృజనాత్మక పట్టం గట్టాడు. అభినందనలు.
amara Jul 30, 2009 5
ఈ రాసినాయన ప్రత్యక్షంగా ఈ కార్యక్రమములో పాల్గొననాదనుకుంటా.కథ గా రాసి మంచి పని చేశాదు.లేకపోతే లోపలి విషయాలు అందరికి తెలియకపోయేవి.కత విష్యానికొస్తె ఇంకా ఏదో తక్కువనిపిస్తుంది.