Jul2009
ముగ్గురు కుర్రాళ్ళూ… సాధువూ….
“ముప్పయ్యేళ్ళ పాటు తిరిగిన చోట తిరక్కుండా తిరిగాను. ఈకల్నెరిసి పోయాకా తెలుసుకున్నాను. ఏటీ… సత్యం ఏటీ లేదనీ… సత్యాన్వేషణ అనేది ఒక పనికి మాలిన పననీ…”
కాళ్ళు బారసాచుకొని చెట్టుని ఆనుకొని సగం పడుకున్న సాధువు అన్నాడు.
అతని పక్కనే ముగ్గురు కుర్రాళ్ళు కూర్చొని ఉన్నారు. అందులో ఓ కుర్రాడు చేతిలో ఉన్న గంజాయి నింపిన సిగరెట్ ని పీలుస్తూ
“అంతంత పెద్ద మాటలు మాలాంటి ఎదవలకి ఏమర్ధమైతాయి సోమీ…” అన్నాడు.
మరొకడు అతని చేతిలోని సిగరెట్ ని తీసుకొని పీల్చి దగ్గుతూ…
“గంజాయి తప్ప మరో సత్తెం ఏటో నేదు.” అన్నాడు.
ఉక్కిరి బిక్కిరై సిగరెట్ ని మూడో కుర్రాడికి అందించి కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు.
“లెస్స పలికితివిరా శిష్యా…” అంటూ మూడో కుర్రాడు సిగరెట్ ని అందుకున్నాడు. దగ్గుతున్న కుర్రాడి మాడు మీద రెండు సార్లు తట్టి..
“కాల్చడం రానోడివి నీకెందుకురా యావ..” అంటూ సిగరెట్ ని రెండు వేళ్ళ మధ్య పెట్టుకొని గుప్పిట మూసి పీల్చాడు.
దాని కొస ఎర్రగా వెలిగింది. ఆ వెలుగులో అతనిముఖం నిప్పుల్లో కాల్చినట్టు అనిపించింది.
బాగా పొద్దోలేదు. గోదావరి గట్టు మీద ఇంకా జన సంచారం ఉంది. కానీ ఒడ్డు మీద లైట్లు లేక పోవడం వల్ల అంతా కటిక చీకటిగా ఉంది. దూరంగా కొత్తగా కట్టిన రైల్వే బ్రిడ్జి మీద రైలేదో వెళ్తోంది. గోదావర్లో నీటి మీద ఎక్కడివో లైట్లు పడుతున్నాయి. అలలు లేచిన చోట మెరుస్తూ పడిన చోట ఆరిపోతూ తళుకులీనుతోంది.
“దేసంలో నేను తిరగని చోటు లేదు. బాస వేరు.. వేసం వేరు. కానీ… మనుసులందరూ ఒకటే మచ్చు…” అంటున్నాడు సాధువు.
గంజాయి పీల్చిన కుర్రాడు సాధువు దగ్గరగా చేరి
“సోమీ… నా తెలకడుగుతానూ… యింత తిరిగి తమరు ఏటి సంపాదించార్సామీ.. ” అనడిగాడు.
మరో కుర్రాడు వెంటనే
“ఓరెదవా.. సోముల్ని అల్లా అడుగుతార్రా… ఆల్ల దెగ్గర యిజ్జెలుంటై .. కన్నెత్తి తిన్నగా గానీ సూసేడంటే మసైపోతావ్ నాకొడకా.. “అన్నాడు.
“హే.. అట్టా కాదసలూ…” అని అతనేదో అనబోతుండగా
సాధువు పైకి లేచి సరిగా కూర్చున్నాడు. పద్మాసనం వేసుకొని గడ్డాన్ని ఒక సారి సవరించుకున్నాడు.
“ఏటీ సాధించానంటావా?… ఒక్కటి తెల్సుకున్నాను” అన్నాడు.
ముగ్గురు కుర్రాళ్ళూ చెవులోర పెట్టారు.
“అవును… ఒక్కటి తెలుసుకున్నాను అదేటంటే.. ప్రతి మనిషి దగ్గరా ఒక కత్తుంటుంది. ఎవరి దగ్గరైనా సరే…” అని ఆగి.. “ఇదే నేను తెలుసుకున్నాను” అన్నాడు.
ముగ్గురు కుర్రాళ్ళూ ఓ నిముషం అలా ఉండిపోయారు.
“ఇంటోటి సత్తెం తెల్టాకి బూగోళవంతా తిరగాలా సోమీ .. నువ్ సూత్తానంటే యిక్కడే సూపిత్తా కదా..” అని బొడ్డోంచి పొడుగాటి కత్తొకటి తీసాడు ఓ కుర్రాడు.
అది అంత పదునుగా లేదు. అక్కడక్కడా తుప్పుకూడా ఉంది. దాన్ని గాల్లో అటూ ఇటూ తిప్పి “యిట్టాటి కత్తులేనా సోమీ…” అన్నాడు.
ముగ్గురు కుర్రాళ్ళూ పగల బడి నవ్వారు.
మళ్లీ గంజాయి దమ్ము కొట్టారు.
ఓ కుర్రాడన్నాడు. “ఈ సోమితో మనకేటి గానీ.. యియ్యాల మన కతేట్రా…”
ముగ్గురూ సాధువు నించి దూరంగా వెళ్లి గుసగుసలాడుకున్నారు.
సాధువు అలా కూర్చొని చాలా సేపుండి పోయాడు.
బాగా చీకటిపోయింది. ఎదురుగా ఉన్న మనిషి కూడా నీడలా కనిపిస్తున్నాడు. రోడ్డు మీద మాత్రం కార్లూ… బళ్ళూ తిరుగుతూనే ఉన్నాయి.
సాధువు ఇంకా అలాగే కూర్చున్నాడు.
ముగ్గురు కుర్రాళ్లూ మాట్లాడుకుంటూ వచ్చి సాధువుని చూసి
“సామీ… మేవలా వూళ్ళోకి పోయి కాసింత పులావూ గట్రా తినేసొస్తామ్. నీసు నేక పోతే ముద్ద దిగదు…” అన్నాడొకడు.
సాధువు మాట్లాడ లేదు. వినలేదు. కదల్లేదు.
ముగ్గురూ నవ్వు కుంటూ వెళ్ళి పోయారు.
*** *** ****
తెల్ల వారు జాము…
ఇంకా చీకటి పల్చ బడలేదు.
గోదావరి నల్లగా ఉంది. నిశ్శబ్దం, అదొక గుర్తు తెలియని ఆకారంలా భయపెడుతోంది.
అడుగుల అలికిడికి చెట్టు మీదున్న పిట్టేదో రెక్కలోసారి టపటపా కొట్టుకొని మళ్ళీ కొమ్మ మీద వాలింది.
ముగ్గురు కుర్రాళ్ళూ వచ్చారు. అతి జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ మెట్లు దిగి చెట్టు దగ్గర కొచ్చారు. ఎవ్వరూ మాట్లాడ్డం లేదు.
కాస్సేపు వూపిరి శబ్దం తప్ప ఏమీ లేదు.
ఒకడు గొంతు తగ్గించి “ఏదిరా..” అన్నాడు.
రెండో వాడు జేబు లోంచి తీసి యిచ్చాడు. మొదటి వాడు దాన్ని చేతిలో వేసుకొని అదే మెల్లని గొంతుతొ “పర్లేదు… ఐదారు తులాలుంటదేమో..” అన్నాడు.
చీకట్లో రెండో వాడు బుర్రూపడం లీలగా కనిపించింది.
మూడో కుర్రాడు చెట్టు కిందికి చూసి ఇద్దర్నీ భుజాలు తట్టి
“చూడండ్రా” అన్నాడు.
సాధువు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడూ. వాళ్లు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో అలాగే… మూడో వాడూ కూర్చునే మెల్లగా జరుక్కుంటూ వెళ్ళి సాధువు ముఖంలోకి చూసాడు.
సాధువు కళ్ళు తెరిచే ఉన్నాయి.
కానీ అతను చూట్టం లేదు. బొమ్మలా బిగుసుకొని ఉన్నాడు. చీకట్ళో అతని కంటి తెల్ల పాపలు చిన్నగా మెరుస్తున్నాయి. సన్నటి గాలికి అతడి పొడవాటి గడ్డం మెల్లగా వూగుతొంది.
మూడో కుర్రాడి గుండె దడదడా కొట్టుకుంది.
“వురేయ్… ఈడు సచ్చాడేమోరా బాబూ… నాకు దడొచ్చేత్తంది.” అన్నాడు.
మొదటి వాడు మెల్లగా సాధువు దగ్గర కొచ్చి “సోమీ.. సోమీ..” అని పిల్చి అతని చేతి మీద తట్టాడు.
సాధువు వులికి పడి వాళ్లని చూసాడు.
ఒకసారి కదిలి “ఏం చెపుతున్నాను..” అన్నాడు.
“మెల్లగా మాట్లాడండీ సోమీ.. బీటు పోలీసోల్లొత్తే చికాకైపోద్ది.” అన్నాడు మొదటి కుర్రాడు.
సాధువు ఓసారి చుట్టూ చూసి “తెల్లారొస్తున్నట్టుంది. కంచేపు సాగోరదాం” అంటూనే వెనక్కి వాలి పడుకున్నాడు.
మూడో వాడు “అళ్ళి పోయాన్రా బాబూ… ఆడి కళ్ళు సూత్తే యిప్పటికీ దడొచ్చేత్తంది.”
మొదటి కుర్రాడు మూతి మీద వేళ్ళుంచుకొని ష్. అని “ఏమ్మాట్టాడకుండా పడుకోండి… తెల్లారాకా సూద్దాం” అంటూ పడుకుండి పోయాడూ.
నిద్ర పట్టదు.
ముగ్గురు కుర్రాళ్ళూ అలా కళ్ళు తెరచి ఆకాశం లోకి చూస్తూనే ఉన్నారు.
మెల్లగా చీకటి విరిగి పోతుంది. వెలుగు ఎక్కణ్నుంచి ఎలా అలముకుంటుందో తెలీదు. కానీ అలా చూస్తుండగానే తెల్లారిపోతుంది.
సాధువు నిద్ర పోయాడో లేదో తెలియదు.
గోచీ ఒకటి పెట్టి గోదాట్లో మునిగి పైకొచ్చాడు. ఒళ్ళు తుడుచుకొని మెట్ల మీద చూసాడు. సాధువులందరూ జోలెలు తగిలించుకుంటున్నారు. రాత్రి కుర్రాళ్ళు లేరు. సాధువు తన మాట భుజానికి తగిలించుకొని మెట్లెక్కి వెళ్ళాడు. వూళ్ళోకి…
**** **** ****
సాయంత్రం సమయం…
జనం తిర్గుతున్నారు.
సాధువు బీడీ కాలుస్తూ వచ్చి పోయే జనం వంక చూస్తున్నాడు.
ముగ్గురు కుర్రాళ్ళూ కాస్త పక్కగా కూర్చొని సిగరెట్లు కాలుస్తున్నారు.
“రాత్రి అలాగుండిపోయావేటి సోమీ… మా వోడు నిన్ను చూసి అళ్ళి పోయాడు. నిద్రపట్టలేదంటే నమ్ము.”
సాధువు అరమూసిన కళ్ళతో చూసి….
“కత్తి గురించి ధ్యానంలోకి వెళ్ళాను. అది ధగ ధగ మెరుస్తూ విచలిత సమ్మోహనాకృతితో రా.. రా.. రా.. రమ్మని పిలుస్తోంది. మతోయి నిలబడి పోయాను. కళ్ళు బైర్లు కమ్మాయి. ఏ మాటా… ఏ కదలికా.. ఆనటం లేదు. అదే మెరుపు… అదే పదును… అంచు ఉండీ లేనట్టు అనిపిస్తుంది. చిన్న ఛాయ. అంతే.. అది ఉందని ఎప్పుడూ తెలుస్తుంది? ఒక కంఠం తెగినప్పుడు.. లేక పోతే అది లేదు. ఆ మాయామేయ ధగద్ధగల్లో వశీకరణమైపోయి అలాగుండి పోయాను. కత్తి… మాయో… సత్యమో…. తెల్టం లేదు.”
కుర్రాళ్లు ముగ్గురూ వింతగా చూసారు. వస్తున్న నవ్వును ఆపుకుంటూ మూడో కుర్రాడు చిన్నగొంతుతో పక్క వాడితో అంటున్నాడు. “కత్తి మాయో… సత్తెవో… తెల్టం లేదంట.. ఒక్క పోటు పొడిత్తె అప్పుడు తెలుద్ది.”
మొదటి కుర్రాడు వారిస్తున్నట్టు గా చురుకు చూపు చూసి “పిచ్చేసాలైకొరే… ఆయన ఏటనుకున్నావ్… మగానుభావుడు… యిజ్జెలుంటాయని సెప్పానా…” అని సాధువుతో
“సామీ… తవరికి జోతిష్కం తెల్సా” అనడిగాడు.
సాధువు విన్లేదు. వాళ్ళ వంక చూళ్ళేదు.
“కత్తి అందాన్నే భయం అంటాం… ఆ అందం అందరికీ ఉండాలని అందరూ అంటారు. అనుకుంటారు.” అని వాళ్ల వంక చూసాడు.
అందులో ఓ కుర్రాణ్ణి దీర్ఘంగా చూసి పెదాల్ని మాత్రం కదులుస్తూ..
“ఈ కుర్రాడు బహుశా ఈవేళో.. రేపో.. చచ్చిపోతాడు.” అన్నాడు.
ఆ కుర్రాడు మొదటి కుర్రాడు కొద్దిగా కళ్ళు చికిలించి “నేనా.. సామీ…” అన్నాడు.
సాధువు మౌనంగా బుర్రూపాడు.
“చెప్పండి సోమీ.. నేనెలా సచ్చిపోతాను.” అన్నాడు ఆ కుర్రాడు.
సాధువు మాట్లాడ లేదు. అలా ఉండిపోయాడూ. అతని నల్ల కనుపాపలు కుంచించుకు పోయినట్లయ్యాయి.
కాసేపలా ఉన్నాకా రెండో వాడు “మళ్ళీ యీడు సమాదిలోకి పోయాడ్రా…” అన్నాడు.
మొదటి వాడు సాధువు వంక అలాగే చూస్తూ “ఈడెవడ్రా బాబు… నిల్చున్నోన్ని నిల్చున్నట్లు నువ్ సత్తావనేసాడు. అది శాపనార్ధవా..లేపోతే ఆడే అనేట్టు సత్తెవా..” అన్నాడూ.
మూడో వాడూ “వురేయ్.. ఇంకాసేపిక్కడ గాని కూసుంటే ఈ మాయలోడు మనకి పిచ్చెక్కించేసి పిచ్చే సత్తెం… అంతా మాయ అనేడం గారెంటీ… ” అని నవ్వాడు.
“సత్యానికీ సావుకీ సంబంధం లేదు.” అన్నాడూ సాధువు.
ముగ్గురూ వులికి పడి చూసారు. సాధువు చిన్నగా నవ్వి “సత్యానికీ సావుకీ సంబంధం లేదు” అన్నాడు.
రెండో కుర్రాడు గబుక్కుని పైకి లేచి తటాల్న సాధువు కాళ్ళ మీద పడిపోయి “సామీ .. మాకు మెంటలెక్కించేకండి సామీ… ఏదో యిలా బతుకుతున్నాం సామీ.. మీ బాస అర్తం కాక యిప్పటికే సగం మెంటలొచ్చేసింది సామీ..” అంటూ నాటకీయంగా వెక్కాడు.
మిగతా యిద్దరూ పగల బడి నవ్వారు.
సాధువు అలాగే కాసేపుండి,
“చచ్చిపోయిన మావోడి కతోటి చెపుతాను వినండి. ఇదే రాయమందిరాన్ని పాతికేళ్ళ క్రితం మావోడొకడూండే వాడూ. ఆడు దేవుడూ..
దెయ్యం లేదని వాదిస్తా ఉండే వాడు. ఆడి స్నేయితులు ఒరే దేవుడు లేడంటే సరే… కానీ దెయ్యం లేదంటే మేం ఒప్పుకోం… దెయ్యం ఉంటుంది. అని వాదించే వాళ్ళు. అలా ఓసారి మాటా మాటా వొచ్చి ఆడి స్నేయితులు మా వోడితోటి నీకు దెయ్యం అంటే నమ్మకం లేకపోతే అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలకి గోదారోడ్డు మీద సాకలోల్ల పొయ్య కాడి బూడిదట్రావాలి అని సవాలేసారు. మావోడు సయ్యేనేసాడు.
అనుకున్నట్టే అర్ధరాత్రి యెళ్ళాడాడు. ఏం జరుగుతుందా అని మేవందరం ఎదురు చూస్తున్నాం. తెల్లారిపోయింది. ఆడు రాలేదు. మేవక్కడికెళ్ళి చూసాం. ఒక్క దెబ్బ లేదు. సుక్క నెత్తుర్లేదు.. ఉన్న మడిసి ఉన్నట్టే సచ్చాడు. పొయ్యి కాడి కెళ్ళాడు. గుప్పిట్లో బూడిద కూడా ఉంది. కానీ యిరుసుకు పడిపోయి ఉన్నాడు. గుండాగిపోయింది. సచ్చాడు.”
మూడో కుర్రాడు గొంతు వొణుకుతుండగా అన్నాడు.
“అంటే దెయ్యం మీవోణ్ణి సంపేసిందా…”
సాధువు నవ్వి “నీకు దెయ్యం సంపడం బాగుంటుందా?” అనడిగాడు.
“బాగుంటవేటి సోమీ… దెయ్యం గానీ ఎదురైతే నా గుండె అక్కడే ఆగిపోద్ది. మళ్ళీ అదొచ్చి సంపాలా.. ఏటీ?”
“కానీ సత్యం వేరే ఉంది.” అన్నాడు సాధువు.
“అసలు జరిగిందేటి? సవాలు చేసాకా ఆ రాత్రి ఆడి స్నేయితులు చిన్న పని చేసారు. మా వోణ్ణి ఏడిపిద్దామని. ఏటదంటే… రాత్రి పది గంటలకి ఈళ్ళా పొయి కాడి కెళ్ళి దాని ముందు శుభ్రంగా తుడిచి ముగ్గులేసి నిమ్మకాయలు… మిరగాయలు… యాప మండలూ వేసారు. ఓ కోడిని తీసుకెళ్ళి దాన్ని పీక సగందాకా కోసి ఆ ముగ్గులో పడేసారు. అది కొట్టుకొని కొట్టుకొని ఆగాకా దాన్ని పొయి బూడిదలో పెట్టి మీద కనబడకండా బూడిద పోసారు. వచ్చేసారు. రాత్రి పన్నెండింటికి మావోడెళ్లాడు. ఆడికి దెయ్యం లేదు. ఆడు వీరుడు. ఎల్లాడు. పొయ్యిని చూసాడు. అంతా సీకటి కదా.. మెల్లిగా పొయిలోకి చెయ్యెట్టి బూడిద తీత్తన్నాడు. ఈ అలికిడికి బూడిద ఇంకా సావని కోడి ఒక్కసారి రెక్కలు కొట్టుకొని జమ్మనెగిరి పడిపోయింది. మావోడి గుండాగిపోయింది.”
కుర్రాళ్ళు ముగ్గురూ నోరు తెరుచుకు వింటున్నారు.
“అంచేత దెయ్యం అసత్యమైనా.. భయం ఉంది కదా.. మావోడు అలా సచ్చాడు”
“కాబట్టి సత్యానికీ సావుకీ సంబంధం లేదు.”
మొదటి కుర్రాడు కొంచెం ఆలోచనగా…
“మరింతకీ నేను సచ్చిపోతాననెందుకన్నావు సామీ…” అన్నాడు.
“నువ్ సచ్చిపోతావు కాబట్టి” అన్నాడు సాధువు.
**** ***** *****
మర్నాడు రాత్రి ఏడు గంటల వేళ ఇద్దరు కుర్రాళ్ళు హడావుడిగా వచ్చారు. సాధువు అద్దంలో మొహం చూసుకుంటున్నాడు. కుర్రాళ్లు వచ్చి సాధువు మూటని వెతికి అందులోంచి జేబురుమాలతో కట్టిన చిన్న మూటని పైకి లాగి విప్పి చూసుకొని దాన్ని జేబులో వేసుకొని కెళ్లి పోయారు.
సాధువు అద్దంలో చూసుకుంటూనే ఉన్నాడు.
రాత్రి పన్నెండు గంటల వేళ..
ఇద్దరు పోలీసులొచ్చి నిద్ర పోతున్న సాధువుని తన్ని లేపారు. బరా బరా యీడ్చుకొని జీపులో వేసారు. స్టేషన్ కి తీసుకొని పోయారు.
స్టేషన్లో పొడుగ్గా లావుగా ఎర్రగా గుండ్రటి కళ్ళతో కాస్తంత ఎత్తు పళ్ళతో పెద్ద మీసాలతో ఉన్న ఎస్సై “వీడేనా” అన్నాడు.
తెచ్చిన పోలీసు “సర్” అని “దొరగారికి దణ్ణం వెట్రా గాడిద కొడకా..” అని లాఠీతో కాళ్ల మీద ఒక్కటేసాడు.
సాధువు “అమ్మా” అని కాలు పట్టుకొని కూలబడిపోయాడు.
ఎస్సై “ఆ లంజికొళ్ళిద్దరూ ఏరీ?” అన్నాడు.
సాధువు తలెత్తి చూసి “ఎవరూ?” అన్నాడు.
“ఆళ్లేరా.. నీ దగ్గర కొట్టుకొచ్చిన నగలూ గట్రా దాస్తారూ.. ఆళ్ళు..”
“అలాంటి వాళ్ళెవరూ నాకు తెలియదు.”
కానిస్టేబుల్ మళ్ళా కర్రతో ఒకటిచ్చాడు.
“విష్ణు మాకంతా చెప్పేసాడు. నువ్వు దాచీ లాభం లేదు.”
“విష్ణు ఎవరు?” సాధువు
“విష్ణు తెల్దా.. ఆడు తెచ్చిన నగలు తెల్సా”
సాధువు కాసేపు మౌనంగా ఉండి “నాకు పేర్లూ… వృత్తులూ… వస్తువులూ… బట్టలూ.. వేషాలూ… గుర్తుండవు.. మనుషులే తెలుస్తారు.. మనిషి గురించి చెప్పండి.” అన్నాడు.
కానిస్టేబుల్ కర్రెత్తాడు.
ఎస్సై ఆపి “ఆణ్ణి తీసుకురా” అన్నాడు.
పోలీసు లాకప్ తెరిచి ఒక కుర్రాణ్ణి ఈడ్చుకొచ్చాడు. అతడు నిలబడలేదు. గొంతుకి కూర్చున్నాడు. వొళ్లంతా వాచి పోయి ఉంది మనిషికి సోయిలేదు.
“ఈడు తెల్సా”
సాధువు చూసి “ఆ… రోజూ వచ్చే ముగ్గురు కుర్రాళ్లతో ఒకడు.”
“ఆళ్ళే పని చేస్తారో తెల్సా”
“తెలీదు. అడగలేదు”
“దొంగెదవలాళ్లు.. రోజూ చోరీల్చేసి నీ దగ్గరే కదా దాచేదీ.. మర్యాదగా చెప్పెయ్.. మొత్తం నలభై తులాల వరకూ ఉండాలి బంగారం… అదెక్కడుందే చెప్పు.. నిన్నొదిలేస్తాం…”
సాధువు నవ్వి “ఆళ్లు నా దగ్గరేం దాచలేదు. కానీ ఇందాకనే మిగిలిన ఇద్దరూ వచ్చి నా జోలె లోంచి చిన్న మూటొకటి తీసుకొని వెళ్ళి పొయారు.”
“అంటే నీకు తెలకుండానే నీ దగ్గర దాచారా ఆళ్లు”
“దాచలేదు. పెట్టారు”
“నోర్ముయ్.. ఎదవా.. ఒక్కటిచ్చానంటే గుద్దుకు సచ్చిపొతావ్..” కానిస్టేబుల్.
సాధువు ఏమన్లేదు.
ఎస్సై చూసి “రోజూ ఈళ్లతో కూర్చొని ఈళ్లకి డైరెక్షనిచ్చేది నువ్వే కదా…” అని “ఏరా” అంటూ విష్ణు వంక చూసాడు. అతడేం చూసే స్థితిలో లేడు.
“అవున్సార్.. ఈడు ఈ సాధువ్వేషంలో వెళ్ళి ఇళ్లు సూత్తాడట సార్. రాత్రికి యీళ్ళెల్లి కొట్టుకొత్తారట సార్. ఈడి కాడుంచి అమ్మించి వాటాలేస్సుకుంటార్ట సార్…” అన్నాడు కానిస్తేబుల్.
ఎస్సై సాధువ్వంక చూసాడు.
సాధువు ఏమన్లేదు.
“ఏమంటావు దీనికి” అన్నాడు.
“ఈ సత్యం నాకు తెలియదు.” అన్నాడు.
కానిస్టేబుల్ మళ్ళీ కర్రెత్తాడు.
ఎస్సై ఆపి “ఈ దొంగనాకొడుకులు తెల్సు గాని …ఆళ్ళ పని తెల్దు నీకు. బంగారం నీ మూటలో ఉంటది గాని నీకు సంబందం లేదు.ఈ పిచ్చి మాటల్తో నిన్నొదిలేస్తాననుకుంటున్నావా?”అన్నాడు.
సాధువు “నాకు దొంగైనా పోలీసు సూపరెంటైనా ఒకటే. యీల్ల దగ్గర చిన్న కత్తి ఉంది. మీ దగ్గర పెద్ద కత్తుంది అంతే. నాకు మనుషులే తెలుస్తారు .కత్తులు ,వేసాలు తెలీదు.”అన్నాడు.
“ఈడికి బాగా కొవ్వెక్కినాదిరా తుక్కురేగ్గొడితే గాని నిజం ఒప్పుకోడు .”
సాధువు నవ్వి “నిజం ఒప్పుకోవడమేంటి ?ఒప్పుకోక పోవడమేంటి ? అందుకోసం తుక్కురేగ్గొట్టడమేంటి? మన అవసరాలూ…అధికారాలు…..అవకాశాలను బట్టి నిజం ఉంటుంది.అంటే నిజాన్ని మనం మనక్కావలసినట్టు తయారుచేస్తాం .”
ఎస్సై చూసాడు……..చూసాడు ………చూసాడు………
కానిస్టేబుల్ వంక తిరిగి “ఈడిక్కొంచం పిచ్చున్నట్టుందే …” అని గొంతుక్కూర్చున్న విష్ణుని కాలితో తన్ని “ఏరా బంగారమెక్కడ దాచారు?” అని అడిగారు.
విష్ణు ఆ తన్నుకి నేల మీద వాలి పోయాడు.
“పిచ్చి కాదు… ఎర్రీ…… కాద్సార్……అలా మాట్టాడితే ఎల్లి పొమ్మాంటారని ఆడి ఎదవైడియా.నాలుగు పీకితే ఆడే సెప్తాడు.అంటున్నాడు. కద్సార్ .బంగారం మిగతా యిద్దరికి ఇచ్చి పంపించాడు. ఈడి మా……త్తరం ఎర్రోడ్లా ఉన్నాడు .మనం వదిలేత్తే మల్లీ ఎక్కడో కల్సుకొని మొదలెడతాడు.” అన్నాడు కానిస్టేబుల్.
ఎస్సై సాధువుని చూస్తు “సాముల వేసాలు…… రకరకాల వేసాలేస్కొని వూరు మీదపడి దోచుకుంటార్రా……. మిమ్మల్ని కాల్చి పడేయాల్రా …అప్పుడు గాని మీకు బుద్ది రాదు .”అన్నాడు.
ఈలోగా విష్ణు కదిలి మెల్లిగా లేచి కూర్చున్నాడు .అతని పెదాలు వాచి ఉన్నాయి. సాధువుని చూసి దణ్ణం పెట్టాడు.
సాధువు తల ఊపి దగ్గర కెల్లి అతని వొల్లంతా నిమిరి “బాగా తన్నులు తిన్నావు..”అన్నాడు.
కానిస్టేబుల్ విష్ణు దగ్గరకొచ్చి “ఏరా …..బంగారమెక్కడ దాచార్రా ..మీరు?” అన్నాడు.
విష్ణు కొద్దిగా వెనక్కి జరిగి సాధువును చూపించాడు.
కానిస్టేబుల్ సాధువును ఒక్క తన్ను తన్నాడు.
“చూసారా సార్ .ఈడు ఎదవ్వాగుడంతా వాగాడు. ఇప్పుడు నిజం బయట పడిద్ది… చెప్పరా నాకొడకా… బంగారమెక్కడా..” అంటూ బాదడం మొదలెట్టాడు.
సాధువు మూలుగుతూ మూలుగుతూ ఉన్నాడు.
కాసేపటికి కానిస్టేబుల్ ఆగి రొప్పుతూ “లంజొళ్ళు యిలా చెప్పరు సార్… ఇంకో కోటింగ్ ఇవ్వాలి.”
ఎస్సై తలూపాడు.
సాధువు కూర్చొని విష్ణు వంక చూసి నవ్వాడు.
“సత్యాన్ని యిలా చేసావా?” అన్నాడు.
విష్ణు ఏమనలేదు.
ఎస్సై “ఆడు చేసేదట్రా… ఆడు ఉన్నదే చెప్పాడు. నువ్వాడికి సిగ్నల్సూ గట్రా ఇవ్వకు” అన్నాడు.
కానిస్టేబుల్ “నువ్విలా రారా” అని విష్ణుని సెల్ తలుపు దగరకి ఈడ్చి కర్ర పుచ్చుకుని “చెప్పు బంగారం… ఎక్కడ? ఆళ్ళిద్దరూ… ఏరీ…? అంటూ కొట్టడం మొదలు పెట్టాడు.
అలా కొడుతున్నాడు.
ఈలోగా పైకి లేచి, సామీ…” అంటూ కానిస్టేబుల్ కాళ్ళట్టుకొని “సామీ ఎర్రెదవ సార్.. ఆడికేట్టి తెల్దు… నేనే కావాలనలా చెప్పాను ఆణ్ణొదిలేండి సార్…” అని సాధువుతో “సామీ… నన్ను చెమించండి… దొంగెదవని… నేను తప్పించుకోవాలని నిన్ను యిరికించేసాను” అన్నాడు.
ఎస్సై విష్ణు జుట్టు పట్టుకొని పైకి లేపి
“ఏరా… నీ యిష్టం వొచ్చినట్టు కతలు చెప్తే యినడానికి మేమేమన్నా పిచ్చినాకొళ్ళ మనుకున్నారా…” అని లాగి పెట్టి దవడ మీద ఒకటిచ్చాడు.
ఆ దెబ్బకి విష్ణు బొంగరంలా తిరిగి పోయాడు.
మళ్ళీ ఎస్సై కాళ్ళు పట్టుకొని
“లేదు .. సార్.. కతలు కాద్సార్.. ఆ సామి సాయింత్రం నేను సచ్చిపోతానని చెప్పాడ్సార్.. ఆ కోపం కొద్దీ అలా చెప్పాను గానీ ఆడి కేటీ తెల్దు సార్…” అన్నాడు.
ఎస్సై విష్ణుని వదిలి సాధువ్వంక చూసి,
“ఏరా.. ఈడు.. ఈ వేళ చచ్చి పోతాడా.. నిజమే…” అంటూ నవ్వాడు.
సాధువు ఏమన్లేదు.
ఎస్సై రివాల్వర్ తీసాడు. సరదాగా దాన్ని అటూ ఇటూ తిప్పుతూ.. “దొంగల్ని ఎదవల్నీ అలాటి ఎవరినైనా కాల్చిపడేసే హక్కుంది మాకు తెల్సా… దెబ్బకి దెయ్యం వదిలిందని ఒకణ్ణి చంపితే మిగిలినోళ్ళకి బుద్దొస్తుంది. అలా లొంగుతారు ఎదవలు…” అన్నాడు.
“ఇప్పుడు చూడు ఈడు చచ్చిపోతాడని చెప్పావ్… ఎలా చెప్పావో గానీ సత్యమే చెప్పావ్.. ఈడు చచ్చిపోతాడు. అలా ఎప్పుడో నిర్ణయించేసాం. కానీ ఆ సత్యాన్ని అబద్దం చేయాలని నేననుకుంటున్నా.. చైగల్నా.. లేదా..” నవ్వుతూ అడిగాడు ఎస్సై
సాధువు గడ్డంలోపల చర్మం చిన్నగా వొణికింది.
కానిస్టేబుల్ రెండడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు. అతని మొహం ఆరిపోయింది.
ఎస్సై రివాల్వర్ని తీసి విష్ణు వంక పెట్టి
“ఇలాటి దొంగనాకొడుకుల్ని కాల్చి పడేసినా మమ్మల్నెవరూ ఏమీ పీకే వాళ్ళు లేరు తెల్సా” అన్నాడు.
విష్ణు గడగడా వణికి పోతున్నాడు.
ఎస్సై రివాల్వర్ని గురిపెట్టి పేల్చాడు.
శబ్దానికి కాస్సేపు చీకట్లు కమ్మేసాయి.
విష్ణు విరుచుకు పడిపోయాడు. అతని గుండె ఆగిపోయిందా?
సాధువు వెనక్కి పడిపోయాడు. అతని పొత్తి కడుపులోంచి రక్తం కారిపోతోంది.
కళ్ళు తెరిచే ఉన్నాయి.
కొంచెం నవ్వుతున్నాయి అవి.
B.Ajay Prasad Jul 7, 2009 1
ఈ కథ చాలాబాగుంది. కత్తిని, దెయ్యాన్ని సాధువు భయంతో పోల్చిచెప్పడం అద్భుతంగా ఉంది. సాధువు ధ్యానంలో చెప్పిన మాటలు, అతడి స్నేహితుడిగురించి చెప్పిన కథ కథకు అందాన్నిచ్చాయి.