Jul2009
నేనీతరం సావిత్రిని
మధ్యాహ్నం పని నుంచి ఇంటికి వచ్చిన సావిత్రిని చూడగానే ఆమె కూతురు ఏడేళ్ళ చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి,
“అమ్మా… మరేమో మనింటికేమో పోలీసులొచ్చారే” ఈ విషయం అమ్మకెప్పుడు చెప్పాలా అని ఎదురుచూసిన చిన్ని సావిత్రి రాగానే గబగబా చెప్పేసింది.
“పోలీసులా! ఏం మాట్లాడుతున్నావే. అమ్మతో ఇలాంటి సరదాలేంటే నీకు?” అంటూ కూతుర్ని కసురుకుంది సావిత్రి.
సావిత్రి వచ్చిన అలికిడి విని సీతమ్మ (సావిత్రి వుండేది సీతమ్మగారి ఔట్ హౌస్ లోనే) “చిన్నీ అమ్మ రాగానే ఏం చెప్పద్దన్నానా” అంటూ మందలించింది.
“నిజమేనా! అమ్మగారూ పోలీసులెందుకొచ్చారు. నాకే అర్ధంకావడంలేదు” అంది ఆందోళనగా.
“అవునమ్మా నిజంగానే పోలీసులొచ్చారు” అంది చిన్ని మళ్ళీ.
అవునులే గానీ, చిన్నీ నువ్వెళ్లి ఆడుకో నేను అమ్మతొ మాట్లాడుతాను” అని చిన్ని పంపించేసింది సీతమ్మ.
“కంగారు పడకు సావిత్రీ, నీకు నేనున్నాను కదా!” విషయం నేరుగా చెప్పకూడదనే ఉద్దేశ్యంతో ఆగింది సీతమ్మ.
ఏదో జరిగిందని మాత్రం అర్ధమైన సావిత్రికి గుండెల్లో అలజడి మొదలైంది.
“ఏం పర్వాలేదు చెప్పండమ్మా. ఇన్ని కష్టాలనుభవిస్తున్న నేను దేన్నయినా విని తట్టుకోగలను” విషయం తెల్సుకోవాలనే ఆత్రం సావిత్రిలో ఎక్కువైంది.
“రాత్రి మెయిన్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది సావిత్రీ, ఒకతను బాగా తాగి రోడ్డు మీద పడివుంటే, లారీ గుద్దేసి వెళ్ళిపోయిందంట. ఆమనిషి అక్కడికక్కడే చనిపోయాడంట. ముఖం సగభాగం నుజ్జయిపోయిందంట. చాలా మంది అతను మీ ఆయన రాంబాబు లాగా వున్నాడని అంటున్నారు. అందుకే ఒకసారి నువ్వు చూస్తే… “సీతమ్మ మాటల్లో ఓదార్పూ, సానుభూతీ ధ్వనించాయి.
తన భర్త పేరు వినగానే సావిత్రి స్థాణువులా వుండిపోయింది. ఆమె శరీరం సన్నగా కంపించసాగింది.
“అతనిక్కడెందుకుంటాడు? ఇంటినుంచి వెళ్ళిపోయి నాలుగున్నరేళ్లయింది కదా! ఇక్కడికొస్తే ఇంటికి రాకుండా ఎక్కడుంటాడు? దేవుడా అతను రాంబాబు కాకూడదు.” సావిత్రి మనసులో పరిపరి విధాల ఆలోచనలు.
“అమ్మగారూ, ఇప్పుడేం చేయను??” ఆమె కంఠం వణుకుతోంది. దుఃఖం గొంతులో కొచ్చిందామెకు.
“సావిత్రీ, నువ్వేం కంగారు పడకు. అతనిక్కడెందుకుంటాడు మన పిచ్చిగానీ, మనిషిని పోలిన మనుషులు అనేక మంది వుంటారు కదా” అంది సీతమ్మ అనునయంగా.
“ఒకవేళ అతనే అయితే…” ఆ ఊహ రాగానే దుఃఖం తన్నుకొచ్చి ఉన్న పళాన నేలపైనే కూలబడి ఏడ్వసాగింది సావిత్రి.
“అసలేం జరిగిందో తెలియకుండా నువ్వు ఇలా ఏడ్వడం ఏం బాలేదు, అయినా అతను నీ జీవితంలో ఒక్క రోజైనా నిన్ను భార్యగా చూశాడా చెప్పు ,ఎందుకింత దుఃఖంనీకు?” ఊరుకో. సావిత్రి బాధని చూళ్ళేక.
ఇంతలొ అక్కడి కొచ్చిన చిన్నికి తల్లి ఎందుకేడుస్తోంది అర్థంకాలేదు ,చిన్నికూడా ఏడుపు తన్నుకొచ్చొంది.”
“కొంచెం ఓర్చుకో సావిత్రి, నిన్ను చూసి చిన్ని కూడ ఏడుస్తొంది చూడు.” అంటూ ఇంట్లో కెళ్ళి మంచినీళ్లు తెచ్చింది సీతమ్మ.
కొద్దిగా తేరుకున్న సావిత్రి చిన్నిని దగ్గరకు తీసుకుని తల నిమిరింది.
“చిన్నీ, నా తల్లీ! నేను రాత్రిలోగా ఇంటికొచ్చేస్తాను గానీ నువ్వు సీతమ్మగారి దగ్గరే వుండమ్మా. అమ్మగార్ని విసిగించకూడదు. బువ్వతిని నిద్రపో.” అంది చిన్నితో.
“ఆ .. నేను వస్తా! ” అంటూ తల్లిని చుట్టేసింది చిన్ని
బొడ్డులో దాచుకున్న డబ్బులోంచి రూపాయిబిళ్ళ తీసి చిన్ని చేతిలో పెట్టీ, నేనెళ్ళేచోటికి పిల్లల్ని రానివరమ్మా నువ్వు ఆడుకుంటూ వుండు ఈ లోగా నేను వచ్చేస్తా.” అంది కూతుర్ని సముదాయిస్తూ.
రూపాయి చూడగానే చిన్ని ఊరుకుంది. సీతమ్మకి పాపని అప్పజెప్పి బయల్దేరింది సావిత్రి. తల్లి కన్పించేంత వరకూ చూస్తూ నిలబడింది చిన్ని.
జనరల్ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. ఎవర్ని కనుక్కోవాలో తెలీక సెక్యూరిటీని అడిగింది, ఎంక్వయిరీ దగ్గర కనుక్కోమని చెప్పి, అక్కడికెలా వెళ్ళాలో చూపించాడతను. అతనికి కృతజ్ఞతగా నమస్కారం పెట్టి వెళ్ళి ఎంక్వయిరీలో కనుక్కుంటే. ఆ యాక్సిడెంటు కేసును చూస్తున్న పోలీసులున్న చోటు చెప్పారు. కాళ్ళీడ్చుకుంటూ అక్కడికెళ్ళిన సావిత్రి ఇంకా పోస్టుమార్టం పూర్తికాలేదనీ, మరో గంటన్నర సేపు పడుతుందనీ చల్లగా చెప్పారు. ఆస్పత్రి ఆవరణలోనే ఓ చెట్టు కింద కూలబడింది సావిత్రి. అసలే పనిచేసి అలిసిపోయివున్న శరీరానికి కూర్చోగానే కాస్తంత ఉపశమనం దొరికినట్లైంది.
భర్తకి సంబంధించిన జ్ఞాపకాలు ఒకటొకటీ సావిత్రిని గతంలోకి తీసుకెళ్ళాయి.
నలుగురు చెల్లెల్లూ, ఒక తమ్ముడూ సావిత్రికి. తండ్రి చిన్న టీ దుకాణం నడుపుతున్నాడు. పెద్ద కుటుంబం కావడం వల్ల సావిత్రి తల్లి రెండుమూడిళ్ళలో వంటలు చేస్తూ భర్త సంపాదనకి చేదోడు వాదోడుగా వుంటోంది. పెద్దకూతురు కాబట్టి ఆర్ధిక బాధలన్నీ సావిత్రి పైనే పడ్డాయి. ఏడో తరగతితోనే చదువుకు మంగళం పాడాల్సివచ్చిందిఇల్లు చూసుకొనే పని సావిత్రి పై బడింది .పది హేడేళ్ళ వయసు రాగానే గంతకు తగ్గ బొంతన్నట్లు గా టైలరింగ్ చేసే రాంబాబు కిచ్చి పెళ్ళి చేసేశారు.అప్పట్నుంచి మొదలయ్యాయి సావిత్రి కి కష్టాలు.
రాంబాబు పేరుకి టైలరేగానీ పని చేసేది చాలా తక్కువే. పేకాటకి బానిస. తాగుడూ కూడా అలవాటుంది. ఒక సారి డబ్బు చేతిలో పడగానే ఆ డబ్బయిపోయే వరకూ పేకాట. తాగుడూ. ఇదీ రాంబాబంటే. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం వల్ల ఇద్దరు పిల్ల్లల్నీ పూలమ్ముకుంటూ గారాబంగా పెంచింది మణెమ్మ. కూతురు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఉన్నది ఒక్కడే కొడుకు. అందుకే అతనెలా ఆడినా అడ్డు చెప్పలేదా తల్లి . అందరూ “పెళ్ళిచేస్తే మారతడని” అనడంతో ఆ కార్యం కాస్తా కానిచ్చింది. ఆమె ఆశించిన మార్పు రాకపోగా రాత్రిపూట తాగిరావడం, ఆలస్యంగా రావడం ఎక్కువైంది. దాంతో సావిత్రిని నానా మాటలూ అనడం, కాపురాన్ని చక్కదిద్దుకోవడం చాతకాలేదని ఆడిపోసుకోవడం మణెమ్మకి సర్వ సాధారణంగా మారిపోయింది.
కొన్నాళ్ల తర్వాత ఎవరో సలహా ఇస్తే, ఇద్దర్నీ వేరే కాపురానికి పంపించేసింది.
అప్పటివరకూ తల్లి భయం కాస్తో కూస్తో వుండేది ఇప్పుడు అదికాస్తా లేకపోయేసరికి రాంబాబుకి ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఇంట్ళో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా పేకాటకీ, తాగుడికీ తగలేస్తుండేవాడు. ఇల్లు గడవడానికి సావిత్రికి పాచిపనులు చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. రాంబాబూ అందుకు అడ్డు చెప్పలేదు. తన దగ్గర డబ్బుల్లేనప్పుడు సావిత్రి దగ్గరనుంచి లాక్కునేవాడు. లేవంటే కొట్టేవాడు కూడా. పెళ్లైన ఆర్నెళ్లకి సావిత్రి గర్భవతైంది. ఆమెకు ఐదోనెలప్పుడు ఒకరోజు రాంబాబు రాత్రంతా ఇంటికి రాలేదు, పొద్దున్న రాంబాబు స్నేహితుడోకరు వచ్చి “రాంబాబును రాత్రి పోలీసులు బ్రోతల్ రైడింగ్ లో పట్టూకున్నారని” చెప్పడంతో , హతశురాలైంది. భర్తకి ఇలాంటి అలవాట్లు కూడా వున్నాయని ఆమెకి తెలిసిందప్పుడే. ఎంతైనా భర్తేకదా! ఏం చేయాలో పాలుపోక సావిత్రి తను పని చేస్తున్న సీతమ్మ గారిని రెండొందలు అడిగి తీసుకుని వెళ్ళి భర్తను విడిపించుకొచ్చింది.
ఆ రోజు ఇంటికొచ్చాక రాంబాబుని నిలదీస్తే.
“నేనేమైనా చేస్తాను నా ఇష్టం, ఆడదానివి నోర్మూసుకుని పడివుండు.” అని గద్దించాడు.
“ఆడదాన్ని కాబట్టే కడుపుమండి అడుగుతున్నాను, నువు చేసిందే నేనూ చేస్తే… నువ్వూరుకుంటావా?” రోషంగా అడిగింది.
“నీ…! ఏంటే, బరితెగించి మాట్లాడుతున్నావు?” అంటూ ఆమె జుట్టు పట్టుకుని కిందికి వంచి ఇష్టం వచ్చిన చోటల్లా పిడిగుద్దులు వేశాడు. నొప్పికి తాళలేక పరుగులు పెట్టింది సావిత్రి. బైటికి పారిబోతున్న ఆమె బట్టల్ని చించేశాడు. అర్ధనగ్నంగా వున్న ఆమెతో, “పోవే.. ఇప్పుడెలా పోతావో చూస్తాను. నీ…! అంటూ ఆమెను నానా బూతులూ తిట్టి వెళ్ళిపోయాడు రాంబాబు.
అవమానంతో దహించిపోయింది సావిత్రి, ఆత్మహత్య చేసుకోవలనుకుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపి ఆపాపం మూటకట్టుకోకూడదని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మర్నాడు బట్టలు సర్ధుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. చిన్ని పుట్టేవరకూ అక్కడే వుండిపోయింది. మధ్యలో రెండు సార్లు వచ్చి భార్యని ఇంటికి వచ్చేయమని అడిగాడు, తల్లినీ తీసుకొచ్చి అడిగించాడు, తొలికాన్పు తర్వాతే పంపుతామని సావిత్రి తల్లిదండ్రులు చెప్పడంతో తిరిగి వెళ్ళక తప్పలేదు వాళ్లకి.
తర్వాత మూణ్ణెళ్ల చిన్నిని తీసుకుని ఇంటికి వచ్చేసింది. మొదట్లో పాపని బాగానే చూసేవాడు, క్రమంగా ఆ పాపని అనుమానంతో చూడ్డం మొదలుపెట్టాడు, ఆ పాప తనకి పుట్టలేదేమో అనే అనుమానం అతనికి కలిగేది. క్రమంగా ఇంటికి తరచూ రావడం మానేసాడు. సావిత్రి వీటిని పట్టించుకునేది కాదు, వచ్చినప్పుడు భర్తతో తగవులాడేది కాదు. అతనేం చేసినా మౌనంగా వుండిపోయేది. అతనికి కోరిక కలిగితే రాత్రిళ్లు వచ్చి సావిత్రి పక్కన చేరేవాడు. ఆమె ప్రమేయం లేకుండానే తన దాహం తీర్చుకుని వెళ్లిపోయేవాడు, దానికీ ఆమె ప్రతిఘటించేది కాదు, ఆమె రోజురోజుకీ ఏదో పోగొటుకున్నదాన్లా మారి పోతుంది, ఎంత కష్టపడినా నెలకి వెయ్యిరూపాయల కంటే ఎక్కువ సంపాదించలేకపోవడం ఆమెకు పాప భవిష్యత్తు పై భయం పట్టుకుంది.
అదే సమయంలో సావిత్రి పాలిట దైవంగా కళ్యాణి వచ్చింది. సీతమ్మ ఇంట్లో వంటమనిషి కళ్యాణి. ఒకరోజు సావిత్రిని పిలిచి.
“సావిత్రీ, మా ఇంటికి దగ్గర్లో రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ వుందికదా, అందులో పనిచేయడానికి మనుషులు కావాలంట. అదీ ఆడవాళ్లే, మా చెల్లి చేరతానంటోంది. నెలకి రెండున్నర వేలు జీతం ఇస్తారు. కానీ, పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ ఐస్లోనే పని, నీకు ఆర్ధికంగా బాగానే వుంటుంది గానీ అసలే ఒట్టిమనిషివి కాదు, అయినా నువ్వు చేయగలననుకుంటే రేపు తీసుకెళ్తాను. నువ్వూ మా చెల్లీ ఒకరినొకరు తోడుగ కూడా వుంటారు. నీ కష్టాలూ కొంత వరకూ తగ్గుతాయి.” అంది సావిత్రితో.
ప్రవాహంలో పడి కొట్టుకు పోయేవాడికి చిన్న కట్టె పుల్లకూడా ఆధారమే కదా! అందుకే సావిత్రి వెంటనే ఆ పనిలో చేరాలనే నిర్ణయంచేసుకుంది.సీతమ్మతో మట్లాడి, ఆమె”సరే” అనగానే మర్నాడు వెళ్ళి పనిలో చేరిపోయింది. అప్పటీకే నాలుగిళ్లలో పాచిపనులు చేస్తున్న సావిత్రి సీతమ్మ ఇంట్లో తప్ప అన్ని చోట్లా పని మానేసింది. ఆమెకిప్పుడూ భవిష్యత్తుపై ఆశలు పెరిగాయి.
ప్రారంభంలో ఆ పని చేయడం కత్తిమీద సాములా వుండేది సావిత్రికి. చిన్ని ముఖం జ్ఞాపకం రాగానే ఏమంత కష్టమన్పించేదికాదు.
అనుకున్నంత సులువు కాకపోయినా వున్నంతలో పరిస్థితులు చక్కబడడంతో మునుపుకంటే కాస్త హుషారుగా వుంటుంది. కూతుర్ని అంగన్ వాడికి పంపించి తాను పన్లోకి వెళ్ళేది. భార్య చేతిలో డబ్బులు ఆడడంతో రాంబాబుకి బంగారు గుడ్లు పెట్టే బాతయ్యింది.
తరచూ డబ్బుకావాలని ఆమెని వేధించేవాడు, అసలే కడుపులో బిడ్డ. నెలనెలా ఐదొందలు తీసి, సీతమ్మ ఇచ్చే జీతంతో పాటు సీతమ్మ దగ్గరే దాచడం మొదలుపెట్టింది. సావిత్రికిప్పుడు తొమ్మిదోనెల.
అనుకోకుండా సీతమ్మ అమెరికాలో వున్న కూతురు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమెకి సావిత్రిని ఒంటరిగా వదిలి వెల్తున్నాననే బాధ వున్నా చెసేదేంలేక వెళ్తూ వెళ్తూ సావిత్రికి ఆమె దాచుకున్న డబ్బు ఏడున్నర వేల రూపాయలు ఇచ్చి వెళ్ళి పోయింది. దాంతో కాన్పుకి అవసరమైనవీ, రెణ్ణెళ్ళకి సరిపడా సరుకులూ తెచ్చి, మిగిలిన ఐదువేలూ పురిటీకి ఆస్పత్రి ఖర్చు లూ వగైరా అవసరాలకి దాచిపెట్టింది.
వారం రోజుల తర్వాత ఒకరోజు పనినుంచి వచ్చిన సావిత్రికి ఇల్లు చిందర వందరగా అన్పించి అనుమానం వేసింది. గబగబా వెళ్ళి చూస్తే డబ్బులేదు, లబో దిబో మంటూ ఇల్లంతా వెతికింది సావిత్రి. ఆమెకి దుఃఖం ఆగట్లేదు. అంతలో పక్కింటి మంగ వచ్చి
“మీ ఆయన మధ్యాన్నం వచ్చాడు. ఇల్లంతా ఏదో వెతికి బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బు అతనే తీసుకెళ్ళి వుంటాడు సావిత్రీ, అయినా నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టావు, ఎంత కష్టపడి ఆ డబ్బు దాచినా లాభం లేకపోయింది కదా!” అంటూసావిత్రిని ఓదార్చింది.
ఆ రాత్రికే సావిత్రికి నొప్పులు మొదలైయ్యాయి. ఇరుగూ పొరుగూ ఏకమై సావిత్రిని ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మగపిల్లాడు పుట్టగానే వెక్కిళ్లు పట్టి చనిపోయాడు. అందరూ రాంబాబుని శాపనార్ధాలు పెట్టారు. అతని వల్లే సావిత్రి నెలలు పూర్తవకముందే ప్రసవించిందనీ, ఆ పాపం వూరికే పోదనీ నానా మాటలూ అన్నారు. వాడు తిరిగి వచ్చినా ఇంటికి రానివ్వొద్దని సావిత్రికి సలహా ఇచ్చారు. సావిత్రి శోకానికి అంతులేకుండా పోయింది. ఎవరూ ఓదార్చే ధైర్యంకూడ చేయలేకపోయారు. పాలజ్వరం వచ్చి సావిత్రి పడే బాధకి ఇరుగు పొరుగూ చలించిపోయేవారు. ఆ బాధలోంచి బైట పడడానికి రెండునెలలు పట్టింది. క్రమంగా పనికి పోవడం మొదలుపట్టింది సావిత్రి.
అప్పుడు అలా వెళ్లిపోయిన భర్త ఇప్పటివరకూ భర్త తిరిగిరాలేదు. ఎక్కడున్నాడో తెలీదు. మనసు మారి ఎప్పటికైనా రాకపోతాడా అని అనుకునేది సావిత్రి. చివరికి ఈ కబురు ఆమెలో రకరకాల ఆలోచనలకి తావిచ్చింది.
“ఏవమ్మా! నిన్నే.” కానిస్టేబుల్ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది సావిత్రి.
“పోస్టుమార్టం పూర్తయింది, ఇంక నువ్వు చూడొచ్చు.” చెప్పాడతను.
లేచి కానిస్టేబుల్ ని అనుసరించిందామె.
మార్చురీలోకి అడుగు పెట్టగానే శవాల వాసనకి ఆమె అప్రయత్నంగ ముక్కు మూసుకుంది. చల్లగా వుందా గదిలో
అప్పుడే ఐస్ బండపై పెట్టిన శవం దగ్గరకెళ్ళి ముఖం పైన వస్త్రాన్ని కొద్దిగా తొలగించాడతను. చూడగానే పోల్చింది సావిత్రి. దాదాపు నాలుగున్నరేళ్ళు. అయితే ఎప్పుడూ అతన్ని అంత ప్రశాంతంగా ఒక్కసారి కూడా చూళ్ళేదు తను.
“ఎప్పుడూ చిర్రుబురులాడుతూ వుండే ఆ రాంబాబేనా” అనిపించిందామెకి.
“ముఖంలో కొంత భాగం నుజ్జవడంతో బ్యాండేజి వేసి వుంచారు. ముఖం పై తోలు తప్పితే లోపల డొల్లాగా వున్నట్లుంది. వార్త విన్నప్పుడు కలిగిన బాధ ఇప్పుడు కలగలేదామెకి.
అతను చేసిన మోసం గుర్తొచ్చింది. అతని ముఖం వేపు పరిశీలనగా చూసింది. నిరంతరం మత్తులో మునిగి వుండే అతని ముఖమే తెలుసామెకు.
” ఆ క్రూరత్వం ఏమయింది, తనని చూడగానే బూతులు తిట్టే ఆ కరడు కట్టిన పెదాలేవీ”
“చింతనిప్పుల్లా కణ కణ మండే ఆ కళ్ళేంటిప్పుడు తెరుచుకోవడం మర్చిపోయాయి.”
“జీవితానికి ఇలాంటి ముగింపు ఎవరికీ రాకుడదు” అనుకుంది.
“ఏవమ్మా, మాట్లాడకుండా నిల్చున్నావు, అతన్ని పోల్చావా?” ఆమె మౌనానికి అడ్డు వేశాడు కానిస్టేబుల్.
ఒకసారి రాంబాబు ముఖం పైకి వంగి చూసింది. అతని దిక్కుమాలిన చావుకి జాలిగా ఆమె కళ్ళలోంచి రెండు కన్నీటి చుక్కలు అతని ముఖంపై రాలాయి.
“నీ మనిషేనా” అడిగాడు కానిస్టేబుల్.
ఆ ప్రశ్న అర్ధరహితంగా తోచింది సావిత్రికి. ఏనాడు అతను నా మనిషిగా వున్నాడు? ఎన్నడైనా అతను కనీసం మనిషిలా ప్రవర్తించాడా? కనీసం బంధాన్నైనా గుర్తించాడా, చివరికి చిన్నిని ఎత్తుకున్న సందర్భం కూడా గుర్తులేదు తనకి. అలాంటి వాడ్ని “నా మనిష”ని ఎలా చెప్పగలదు…?
“ఏవమ్మా, అతను నీమనిషేనా, గుర్తు పట్టావా? ఇంతసేపు చేస్తే ఎట్లా.” తొందరపెట్టాడు కానిస్టేబుల్.
లోలోపలే ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకుంది సావిత్రి .
కానిస్టేబుల్ ప్రశ్నకి జవాబుగా తల అడ్డంగ ఊపి వెనక్కి తిరిగి చూడకుండా గబగబ బైటికి దారితీసింది సావిత్రి.