నూరేళ్ళ గురజాడ “దేశభక్తి”

దేశభక్తి కవిత రాసిన గురజాడని దేశభక్తుడు కాదని నిందించడం తెలుగు వాళ్ళకే సాధ్యమైన పనేమో! మహోన్నత దేశభక్తుడైన అంబేద్కర్నీ దేశభక్తుడు కాదని వాదించే మేధావులున్న భారతదేశంలో, గురజాడను దేశభక్తుడు కాదనే వాళ్ళుండడం సహజం కావచ్చు. సాంస్కృతిక మరుగుజ్జులు ఎంత గొంతు చించుకున్నా గురజాడ “దేశభక్తి” కవిత నూరేళ్ళ నుండి ప్రజలనాలుకల మీదనే కాక, హృదయాలలొ కూడా నాట్యం చేస్తున్నది. బహుశా భారతీయులకు నిజమైన దేశభక్తి అలవడేదాకా గురజాడ “దేశభక్తి” కవిత ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశిస్తూనే ఉంటుంది. నవరసాలతో నాలుకలు కాల్చుకున్నా, చీల్చుకున్నా ఆ కవితకు వన్నెతరగదు.

బకించంద్ర చటర్జీని గొప్ప రచయితగా గుర్తిస్తూనే, భారతీయ నవలా పితామహుడిగా గౌరవిస్తూనే ఆయన “వందేమాతరం” కవిత కన్నా మన గురజాడ “దేశభక్తి” కవిత వేయి రెట్లు గొప్పదని చెప్పడానికి సంకోచించవలసిన అవసరంలేదు. ఆయన వందేమాతరం దేశభక్తి కవిత కాదు, దైవభక్తి కవిత. ఆ పాటలో దుర్గాస్తుతి ఉంది. దైవభక్తి ఆధ్యాత్మికం, దేశభక్తి లౌకికం.

గురజాడ “దేశభక్తి” కవితను 1910 లో రచించారు. అప్పటికి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా నడిచిన వందేమాతరోద్యమం చివరి దశకు రావడంగాని, ముగియటంగాని జరిగింది. ఆ ఉద్యమంలో “వందేమాతరం” పాట ఆవేశాత్మక పాత్ర నిర్వహించింది. బెంగాల్ విభజన ప్రయత్నం నుండి బ్రిటిష్ పాలకులు చేతులు ముడుచుకొని  వెనక్కి పోయేట్టు చెయ్యడంలో ఆ పాత్ర చిన్నదేమీ కాదు. రాజకీయాలకూ సాహిత్యానికీ ఉండే విడదీయరాని సంబంధాన్ని ఆ పాట రుజువు చేసింది. “వందేమాతరం మనదే రాజ్యం” అనే నినాదం తెలుగు నేలలొ ప్రతిధ్వనించింది. వందేమాతరం అన్న వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు, విద్యాసంస్థల నుండి బహిష్కృతులయ్యారు, జైళ్ళకు పోయారు. శత్రువుకు కంపం పుట్టించిన చరిత్ర వందేమాతరానికుంది. అంత స్ఫూర్తివంతమైన ఉద్యమంలో హిందూమత ప్రమేయాన్ని గురజాడ గమనించారు. అలాగే వందేమాతరంలోని హిందుత్వ స్వభావాన్ని కూడా ఆయన పసిగట్టారు. దైవభక్తి, మతభక్తి, దేశభక్తి గా చలామణి కావడాన్ని లౌకిక వాదిగా ఆయన ఆమోదించలేక పోయాడు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో హిందూ ముస్లిములిద్దరూ పాల్గొన్నా, హిందూ దైవ కీర్తన ఉండే పాట ప్రాధాన్యం వహించడాన్ని ఆయన గుర్తించాడు. అందుకే దేశభక్తికి శాస్త్రీయమైన నిర్వచనాన్ని చెప్పాలనుకొని దేశభక్తి కవిత రచించారు. దేశ భక్తి ఒక సంకుచిత భావనగా మారిపోవడం గుర్తించిన గురజాడ దానికి విశాలమైన అర్ధాన్నిస్తూ ఆ కవిత రాశారు. దేశాన్ని, దేశభక్తిని కులమతాల ఇరుకు సందుల్లోంచి రహదారి మీదికి తీసుకురావడానికే గురజాడ దేశభక్తి కవిత రచించారు. ఒక దేశంలో ఉండే మనుషులకు కులాలు ఉండవచ్చు మతాలు ఉండవచ్చు గాని దేశానికి అవి ఉండరాదన్న స్పృహను ప్రజలలో పెంచడానికి ఆయన ఆ కవిత రాశారు. దేశభక్తిని “సుజలాం సుఫలాం మలయజ శీతలాం” అనే సెంటిమెంటునుంచి విముక్తం చేసి మనిషివైపు మళ్ళించారు గురజాడ.

దేశభక్తిని బ్రిటీష్ వాళ్లనుంచి భారతదేశానికి స్వతంత్రం సంపాదించడానికి కావలసిన సాధనంగానే అత్యధికులు భావించారు. గురజాడ దేశభక్తిని కేవలం రాజకీయాంశంగా చూడలేదు. దేశభక్తికున్న రాజకీయ ప్రమేయాన్ని ఆయన కొంత అప్రధానం చేశాడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 1936 లో  డా. బి.ఆర్. అంబేద్కర్ ఏమన్నారు? మనలో మనం ఒకరికొకరం స్వతంత్రమీయకుండా, బ్రిటీష్ వాళ్ళ నుంచి స్వతంత్రం కోరే హక్కు మనకెక్కడుంది? అని ప్రశ్నించారు. రాజకీయ నిరంకుశత్వం కన్నా సాంఘీక నిరంకుశత్వం చాలా క్రూరమైంది. ఆర్ధిక రాజకీయ విప్లవాల కన్నా ముందు సాంఘిక విప్లవం రావాలని కోరుకున్నారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వాళ్ళు తెల్ల దొరల చేతుల్లోంచి నల్ల దొరల చేతుల్లోకి అధికారం మారడం మాత్రమే స్వతంత్రంకాదని, వివక్షలు, అసమానతలు లేని, మనిషిని మనిషి పీక్కుతినే విధానం లేని సమాజ నిర్మాణమే నిజమైన స్వతంత్రం అని అభిప్రాయపడ్డారు. బహుశా గురజాడ వీళ్లందరికన్నా ముందు ఈ మార్గంలో ఆలోచించారు. వీళ్లెవరూ బ్రిటీష్ వాళ్లు శాశ్వితంగా భారతదేశంలో ఉండిపోవాలని కోరుకోలేదు. గురజాడ అయిదవ జార్జి మీద అభినందన గేయం రాశాడని,

“కన్నుగానని వస్తుతత్వము
కాంచనేర్పురు లింగలీజులు
కల్లనొల్లరు; వాది విద్యల
కరచి సత్యమునరిసితిన్”

అని రాసినాడని, ” వెఱ్ఱిపురాణ గాథల నమ్మజెల్లునే పండితుల్” అని అన్నాడని గురజాడను దేశభక్తుడు కాదనడం అజ్ఞానమే కాదు, అహంకారం, జాతీయ దురహంకారంకూడా. యెల్లలోకము వొక్కయిల్లై, అన్నమహాకవి హిందుత్వముసుగు వేసుకున్న వాళ్లకు అందుతాడా? బ్రిటిష్ వాళ్లు వచ్చి మన సంస్కృతీ సాంప్రదాయాలను తిరస్కరించి భారతీయుల్ని ఆత్మన్యూనత లోకి నెట్టేశారట. అలా ఆత్మన్యూనత పడ్డ కవి గురజాడ అట. బ్రిటిష్ వాళ్లు రాకముందు భారతీయ వేదాంతం చేసిన పనేంటి? అత్యల్ప సంఖ్యాకులకు ఆత్మాధిక్యతను, అత్యధిక సంఖ్యాక శ్రామికులకు ఆత్మన్యూనతను కలిగించడం కాదా? బ్రిటిష్ వాళ్లు రాకముందు మనువు భారతీయుల్ని వర్గాల పేరుతో విభజించి ఉన్నాడు. వేదాంతం శ్రామికుల్ని ఆత్మన్యూనతలోకి నెట్టేసి ఉంది. ఈ దుర్మార్గంలోంచి మన సమాజాన్ని గట్టెకించడానికి వేమన,  వీరబ్రహ్మం వంటి వాళ్లు దేశవ్యాప్తంగా మధ్యయుగంలో కృషి చేశారు. వాళ్ల ప్రయత్నాలు ఆధునిక యుగంలో కార్యరూపం ధరించే అవకాశం ఏర్పడింది. అదింకా పూర్తికాలేదు. గురజాడ దేశభక్తిని ఈ నేపధ్యంలో అర్ధం చేసుకోవాలి.

1910 లో గురజాడ “దేశమును ప్రేమించుమన్నా” అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మనం దేశాన్ని ప్రేమించడం లేదు కాబట్టి. తరగతి గదిలో అయ్యవారు సైలెన్స్ అని ఎప్పుడంటారు. విద్యార్ధులు మాట్లాడుకుంటున్నప్పుడు కదా! గురజాడ అలాగే మనం దేశాన్ని ప్రేమించకుండా ఇంక దేనినో, కుల, మతాలనో ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రేమించవలసింది దేశాన్ని అని గుర్తు చేశాడు. ఆయన దేశభక్తుడు కాకపోతే ఇంకెవరు దేశభక్తులవుతారు? 1910 లో  గురజాడ దేశభక్తి కవిత రాస్తే గురజాడ అభిప్రాయాన్ని 1948 లో శ్రీపాద “కొత్తచూపు” కథలో సమర్ధించారు. బ్రిటీష్ వాళ్ళు వచ్చేదాకా మనకు దైవభక్తి, రాజ భక్తి తప్ప, దేశభక్తి తెలియదని ఒక పాత్రలో చెప్పించాడు శ్రీపాద. మనిషి తన రూపంలో తాను సృష్టించిన దేవునికి తానే బానిసై పోయి సాటి మనిషిని రాయి కన్నా హీనంగా చూస్తున్న దశలో గురజాడ దేశభక్తి కవిత రాశాడు. దేశాన్ని ప్రేమించమన్నాడు. మంచిని పెంచమన్నాడు గురజాడ. దేశభక్తికి, మంచికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురజాడకు తెలుసు.

దేశాన్ని ప్రేమించడమంటే సుజలాం సుఫలాం కాదని గురజాడ అభిప్రాయం. అందుకే దేశమంటే మట్టికాదు, మనుషులు అని అన్నాడు. దేశాన్ని  ప్రేమించడమంటే దేశంలోని మనుషుల్ని ప్రేమించడం అని గురజాడ అభిప్రాయం. బంకించంద్ర “సుఫలాం” అన్నాడు గాని “సుజనాం” అనలేదు. ఆ మాట గురజాడ అన్నాడు. మనిషి చేసిన రాయి రప్పలకు సాగమొక్కుతూ సాటిమనిషిని రాయి కన్నా హీనంగా చూసే భక్తిని దేశభక్తిగా గురజాడ ఆమోదించ లేదు. ఆయన మనిషి వైపునిలబడ్డారు. మనిషిని గౌరవించడం మనిషిని ప్రేమించడం ఆయన దృష్టిలో దేశభక్తి. ఆయన దేశభక్తికి మానవీయ స్పర్శ ఉన్నది. జాతీయ దురహంకారానికి ఈ మానవీయ స్పర్శతగలదు. గురజాడ దేశభక్తి ఫ్రెంచి విప్లవం అందించిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనల్లోంచి పుట్టింది. ఇది విప్లవాత్మక దేశభక్తి మనుషుల్ని కులాలుగా మతాలుగా విభజించి పాలించే విధానానికి భిన్నంగా మనిషిని మనిషిగా గౌరవించే దేశభక్తి గురజాడది.

గురజాడ దేశభక్తికి మనిషి, మనిషి శ్రమ, మనిషి ఉత్పత్తి మానవ సంబంధాలు – ఇవీ ప్రమాణాలు. ఆయనది భౌగోళిక, పొలిమేరల దేశభక్తి కాదు. దేశమంటే మనిషి అన్నదందుకే. మనిషి అంటే ఆరోగ్యంగా ఉండేవాడే మనిషి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తిండి కావాలి. తిండి కావాలంటే పాడిపంటలుండాలి. అవి బాగా ఉండాలంటే మనిషి శ్రమించాలి. శ్రమించే మనుషుల మధ్య ప్రేమ పూరిత సంబంధాలుండాలి.

భారతీయ వేదాంతం మనిషిని నిష్క్రియాశీలున్ని చెయ్యగా ఆంగ్ల విద్య భారతీయుల్లో ఉపన్యాస కళను పెంచింది. మాటలు ఎక్కువ చెప్పి పని దగ్గర పసలేని పరిస్థితి వచ్చింది. అందుకే గురజాడ వొట్టిమాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టమన్నారు. దేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చెయ్యడమే ఆ మేలు. మనుషులు, వాళ్లతిండి, వాళ్ల ఆరోగ్యం మీద దేశాభివృద్ధి ఆధారపడిది. అందుకే

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్?

అని ప్రశ్నించాడు గురజాడ. దేశం అభివృద్ధి చెందాలంటే దేశ సంపద పెరగాలి. సంపద పెరగాలంటే ప్రపంచ జ్ఞానమంతా మనిషి అందుబాటులోకి రావాలి. అందుకే కళలెల్ల నేర్చుకోమన్నారు గురజాడ.

భూస్వామ్య వ్యవస్థను కదిలిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. దానిని స్వాగతం పలకడమే అప్పటికి ప్రగతి శీల చర్య. అందుకే గురజాడ పెట్టుబడిదారి వ్యవస్థకు ఆహ్వానం పలికినాడు.

“డబ్బులేనట్టు నరులకు
కీర్తి సంపదలబ్బవోయి”
“దేశి సరుకులునించవోయి”
“దేశి సరుకులనమ్మవలెనోయి”

అన్న గురజాడను దేశభక్తుడు కాదనడం కనులుండీ చూడలేని అంధత్వమూ, చెవులుండీ వినలేని చెవిటి తనమూ అవుతాయి. అమ్మినా కొనినా మన వస్తువులేనన్న గురజాడ నుంచి నేటి ప్రపంచీకరణ జ్వర పీడితులు నేర్చుకోవలసింది చాలా ఉంది.

గురజాడ గతాన్ని తిరస్కరించలేదు. గతంలోనే ఇరుక్కుపోవద్దు అన్నాడు. గతంలో మంచి ఉన్నా అది పరిమితమన్నాడు. అందుకే అడుగు ముందుకెయ్యమన్నారు.” వెనకబడితే వెనకేనోయ్” అని హెచ్చరించాడు. భారత జాతిని అప్పటికి ఇంతకన్నా అవసరమైన హెచ్చరిక ఏమున్నది? ఈ హెచ్చరిక చెయ్యడమే ఆయన దేశభక్తికి నిదర్శనం. సంస్కృతికి గతమే గాని వర్తమానం ఉండదని భావించే ప్రబుద్ధులకు గురజాడ అర్ధం కాడు.
అనేక కారణాల వల్ల భారతదేశంలో సంపద కొంతమంది చేతుల్లో ఉండి పోయింది. గురజాడ సంపన్నులను తమ సంపదను దానం చెయ్యమన్నాడు.

“సొంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్”

ఆర్ధిక అసమానత నిర్మూలనలో గురజాడ ఎందుకో మధ్యయుగంలో అన్నమయ్య , వేమనలాగే ఆధునిక యుగంలో కూడా ధాతృత్వాన్నే (చారిటీ) భోదించాడు. బహుశా అప్పటికి ప్రపంచానికి మార్క్సిజం పరిచయం కాకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.

కుల,మత సంఘర్షణలకు భారతదేశం నిలయం, వీటి వల్ల మన సమాజం కోల్పోయింది తక్కువ కాదు. ప్రజలు మనం మనుషులం అనేది మరిచిపోయి, మనం కులాలం మతాలం అనే గుర్తుపెట్టుకున్నారు. కులమతాలు ప్రజల మధ్య ఆర్ధిక సాంఘిక  అనైక్యతనే పెంచాయి. కులం శ్రమ విభజనే కాదు, శ్రామిక విభజన కూడా అని అంబేద్కర్ అన్నారు. ప్రజల్ని విభజించి పాలించాయి కుల, మతాలు. గురజాడ దీనిని గుర్తించే సంఘసంస్కరణ రచయితగా విగ్రహారాధనను ఖండించాడు. మనువాదులకు విగ్రహం రక్షణ  కవచం. అందుకే వారు ఆయన్ని దేశభక్తులు కాదన్నారు. “మనిషి” కవిత గురజాడ ప్రాపంచిక దృక్పదానికి సంకేతం. కులమతాలు, వాటి వైరుధ్యాలు పుట్టటం సులభమేకాని, వాటి నిర్మూలనం అంత సులభం కాదు. అప్పటిదాకా ఏం చెయ్యాలి. సామరస్య జీవన మొక్కటే మార్గం. అందుకే గురజాడ జాతులు, మతాలు అన్న దమ్ములలాగా బతకాలని ప్రభోధించారు. ఇలా అంటే నిచ్చెన మెట్ల సమాజాన్ని మోసేవాళ్లకు నిస్సందేహంగ కంపరం పుడుతుంది. అందుకే గురజాడ సంస్కృతి విధ్వంసకుడయ్యాడు. మతాలు వేరైనా మనసులు కలవాలన్నారు. పరస్పరం కత్తులు దూసుకొనే మతవాదులకు మతం వేరైతేను యేమోయి? అంటే కోపం రాక చస్తుందా?

భారతీయుల మధ్య కుల మత సంబంధాలను తిరస్కరించి ప్రేమ పునాది, సౌభ్రాతృత్వం రూపంగా ఉండే ఆధునిక మానవ సంబంధాలను ప్రతిపాదించారు గురజాడ. దేశం ఆర్ధికంగా సుభిక్షంగా ఉన్నప్పుడే అది సాధ్యమని ఆయన అభిప్రాయం. ప్రజలకు సంపద ఎలా వస్తుంది. శ్రమ జేసి సృష్టించడం ద్వారానే మిధ్యావాదంతో మాయావాదంతో, సాధ్యం కాదు. మనుషుల్ని సోమరిపోతులుగా చేసే వేదాంతంతో దేశ సంపద వృద్ధికాదు. జనం రకరకాలుగా విడిపోయి అనైక్యంగా ఉంటే సంపద పెరగదు. ఒకవేళ పెరిగినా అది పైనున్న వాళ్ల చేతుల్లోకి పోతుంది. అందరికీ చెందదు. అందువల్ల కుల, మత, లింగ, జ్ఞానాది వైరుధ్యాలను పరిష్కరించుకొని భారతదేశం మానవ దేశంగా మానవీయ దేశంగా రూపొందినప్పుడే జనం సమైక్యంగా కృషి చేసి సంపదను సృష్టిస్తారని ఆశిస్తూ గురజాడ దేశభక్తి కవితను రాశారు. మనిషి కేంద్రంగా శ్రమ ఆయుధంగా ప్రేమ మార్గంగా, సంపద సృష్టి లక్ష్యంగా దేశాభివృద్ధి గమ్యంగా ప్రయాణించమని దేశభక్తి సారం. రాయి కేంద్రంగా ఆలోచించే వాళ్ళకు ఈ కవితలొ దేశభక్తి కనిపించదు.

ఒక్క దేశభక్తి కవిత మాత్రమే కాదు, ఆయన సాహిత్యమంతా దేశభక్తి సాహిత్యమే. దేశభక్తిని రాజకీయ ఆయుధంగా మాత్రమే భావించే వాళ్ళకు గురజాడ సాహిత్యం అవగాహనకు రాదు. కుల వ్యవస్థను ప్రత్యేకించి దళిత సమస్యను ఎంత కఠినంగా విమర్శించాలో అంతకఠినంగా విమర్శించాడు” లవణరాజు కల”లో.

“కులము లేదట వొక్క వేటున
పసరములహింసించువారికి
కులము కలదట నరుల వ్రేచెడి క్రూర కర్మలనున”

ఎవరి శ్రమలేకుండా మన సమాజం ముందుకు నడవదో వాళ్ల పక్షాన వకాల్తా పుచ్చుకొని “మంచియన్నది మాలయైతే మాల నేయగదున్” అనడం కన్నా దేశభక్తి ఉందా! స్త్రీ పురుషుల మధ్య భూస్వామ్యం సృష్టించిన యజమాని సంబంధాలను తిరస్కరించి

“మగడువేల్పన పాత మాటది
ప్రాణ మిత్రుడ నీకు నేను”

అని భార్యాభర్తల్ని స్నేహితుల్ని చెయ్యడం విప్లవాత్మక దేశభక్తి కాదా? మూఢ నమ్మకాలన్నీ నశించినా వాటికి మూలమైన మతాలన్నీ నశించి “జ్ఞాన మొక్కటి నిలిచివెలుగును” అని ఒక ఆధునిక నాగరికత వ్యవస్థను కోరుకోవడం దేశభక్తి కాదా?

దేశభక్తి కవిత వచ్చి నూరేళ్ళు వచ్చిన సందర్భంగా ఒక్కసారి వెనక్కి చూస్తే భారతదేశంలో “దేశభక్తి” భావన ఎలా పరిణమించింది? మనం ఇంకా “సుజలాం సుఫలాం మలయజ శీతలాం” దగ్గరే ఉన్నాం. ఇరుగు పొరుగు దేశాల పట్ల శత్రుభావం కలిగుండడమే దేశభక్తిగా చలామణి అవుతున్నది. ఇరుగు పొరుగు దేశాలు అలాగే అఘోరిస్తున్నాయి. దేశభక్తి కేవలం భౌగోళిక, రాజకీయ మత సాధనంగానే ఉపయోగపడూతున్నది. దేశభక్తి పదనిందా సాధనంగానే తప్ప, ఆత్మవిమర్శ సాధనంగా ఇంకా గుర్తింపు పొందలేదు.

మూఢ నమ్మకాలు పాతవి కొనసాగుతుండగా కొత్తకొత్తవి వచ్చి చేరుతున్నాయి. సూర్యచంద్ర గ్రహణలకు ఇంకా గంగా స్నానాలు కొనసాగుతూనే ఉనాయి. గుళ్ళు మూతలు పడుతున్నాయి. స్త్రీ పురుషుల మధ్య గురజాడ కోరుకున్న స్నేహసంబంధాలు ఇంకా ఏర్పడవలసే ఉంది. దళితులు రాజకీయోన్నత పదవుల్లోకి కొందరు వస్తున్నా, దళితవాడలు ఇంకా ఊళ్ళకు దూరంగానే ఉంటున్నాయి. హిందూ ముస్లిం సంఘర్షణలకు గోధ్రాలే నిదర్శనాలు. మతోన్మాదులు అన్ని మతాలలో ఆధిపత్యం వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ దేశభక్తి కొలమానమవుతున్నది. కొత్త కొత్త గుడులు వెలుస్తున్నాయి. క్రొంగొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. బైరాగి, సిద్ధాంతి వారసులకు కొదవలేదు. రాజకీయాలలో వీళ్ళ పెత్తనం ఎక్కువవుతున్నది. స్త్రీ ఇంకా అంగడి సరుకుగా ప్రదర్శింపబడుతూనే ఉంది. అసలు దేశభక్తే ఒక కమోడిటిగా మారిపోతున్నది. ప్రచార ప్రసార సాధనాలు ఒకవైపు మత భావాలను మరో వైపు వ్యాపార భావాలను జనం ముఖాన చిమ్ముతున్నాయి. అసలు మతమే ఒక వ్యాపార వస్తువైపొతున్నది. దేవుడు కూడా వస్తువైపోతున్నాడు. సొంతలాభాలే జీవిత పరమావధిగా మారుతున్నది. ఆదాయ పన్ను ఎగగొట్టడానికి ధార్మిక వేషం వేస్తున్నారు తప్ప, పొరుగు వాడికి సాయపడే దృష్టితో కాదు.

దానం కూడా అంగడి సరుకౌతున్నది.
దేశం ఇంకా దొడ్డ వృక్షం కావలసే ఉంది.
దేశంలో ప్రేమలను పూలెత్తవలసే ఉంది.
జాతులు మతాలు అన్నదమ్ములింకా కావలసే ఉంది.

ఇవన్నీ సాధ్యం కావాలంటే గురజాడ దేశభక్తిని మనం అందుకోవలసి ఉంది. దేశభక్తిని సెంటిమెంటుగా, మతవాదంగా భావించడం మానాలి. “దేశభక్తి” ఒక లౌకిక సాధనంగా శాస్త్రీయ ఆలోచనగా భావించి సరి కొత్తగా యువతలొ నిజమైన దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చెయ్యాలి.
దేశభక్తిని సుజలాం సుఫలాం నుంచి మళ్ళించి దేశమంటే మట్టికాదు, దేశమంటే మనిషి అని జనం ఆలోచనను మార్చాలి. కవి, ప్రవక్తా, కాలం కన్నా ముందుంటారన్నాడు గురజాడ. అలా అని కవులందరూ, ప్రవక్తలందరూ కాలం కన్నా ముందుంటారు. గురజాడలాంటి వాళ్ళే ముందుంటారు. వాళ్ళను సరైన పద్ధతిలో అనుసరించడమే మనం చెయ్యవలసిన పని.

గురజాడ “దేశభక్తి” కవితలోని సారాన్ని అన్ని రాజకీయ సాంఘిక శక్తులు గ్రహించి సమాజంలో వ్యాప్తి చెయ్యాలి. దేశభక్తి కవితను కనీసం రాష్ట్ర గీతంగా గుర్తించి, అన్ని సంస్థలలోనూ తప్ప పాడేట్లు శాసనం చెయ్యాలి. గురజాడ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలి. దేశభక్తి కవితను అన్ని భారతీయ భాషలోని అనువదించి ప్రభుత్వమే ఆయా భాషా పాఠకులకు అందించాలి.

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

4 Responses to “నూరేళ్ళ గురజాడ “దేశభక్తి””

  1. 1
    sowmya Says:

    చాలా బాగా రాసారండీ

    గురజడ దేశభక్తి మాట అటుంచి, ఆయన కవిత్వం లోని మానవత్వం, మనిషికిచ్చిన గౌరవం, పరస్పర సమభావం అయినా గ్రహించారో లేదో ఈ సాంస్కృతిక మరుగుజ్జులు

  2. 2
    satyadarshana Says:

    please stop old radio. gurajada is great. forever.

  3. 3
    madhurasree Says:

    వ్యాసం బాగుంది

  4. 4
    madhurasree Says:

    వ్యాసం బాగుంది మధుర శ్రీ

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో