Jul2009
ఒక ధృవతారకు నివాళి
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరి పోతే
నిబిడాశ్చర్యం తో వీరు!
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె!
1958వ సంవత్సరం – ఆగస్టు నెల 29 వ తేది – అమేరికా లోని ఇండియానా రాష్ట్రంలోగల గేరీ అనే చిన్న పట్టణంలో ఎవరూ ఊహించి ఉండరు ఆరోజు ఒక తార జన్మించబోతోందని, రాబోయే యాభై సంవత్సరాల్లో సంగీతప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందని – ఎవరూ అనుకుని ఉండరు ఆ రోజు జన్మించబోయే తార భవిష్యత్తులో అనేక సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువౌతుందని – ఒక సంగీత వ్యవస్థనే సృష్టిస్తుందని… ఆ తార పేరే మైఖెల్ జాక్సన్! ప్రపంచంలోని ప్రతీసంగీతాభిమాని ఇంట్లో, హృదయంలో అనుదినం వినిపించే పేరు. లక్షలాది సంగీత కళాకారులకు స్పూర్తినిచ్చిన పేరు. ప్రత్యేక కధనాల ద్వారా మీడియా సంస్థలకు మిలియన్లకొద్దీ డబ్బు సంపాదించిపెట్టిన పేరు.
ఒక సామాన్య ఉద్యోగస్తుల కుటుంబంలో తొమ్మిదిమంది పిల్లలలో ఒకడిగా పుట్టిన జాక్సన్కు చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల ద్వారా సంగీతంలో ప్రవేశం లభించింది. అయితే అదేమీ నల్లేరు మీద నడకలా సాగలేదు. తండ్రివల్ల జాక్సన్ తన బాల్యంలో చాలా బాధలనే అనుభవించాడు. తలక్రిందులుగా నిలబెట్టి చావబాదడం, కిటికీ లోంచి ముసుగేసుకుని దూకి భయపెట్టడం (కిటికీ తలుపులు తెరిచి నిద్రపోతున్న జాక్సన్కు బుధ్ధి చెప్పడానికి)లాంటి తండ్రి వికృతచేష్టలు జాక్సన్ను మానసికంకా చాలా క్రుంగదీశాయి. 1993 లో ఓప్రా వింఫ్రే తో జరిగిన సంభాషణలో మైఖెల్ జాక్సనే స్వయంగా ఈ మాటలు చెప్పారు. 2003 లో మరో ఇంటర్వ్యూలో తన చిన్నతనాన్ని తలచుకుని దు:ఖాన్ని ఆపుకోలేక ముఖానికి చేతినడ్డంపెట్టుకుని జాక్సన్ విలపించిన తీరు ప్రేక్షకులని నిశ్చేష్టులను చేసింది. కానీ – ఆయన మాటల్లోనే చెప్పాలంటే – ఊపిరిసలపని రిహార్సళ్ళతో, మందలింపులతో తనని తన తండ్రి చాలా ఇబ్బంది పెట్టినా ఆయన నేర్పిన క్రమశిక్షణ తన తరువాయి జీవితంలో తనకి ఎంతో ఉపయోగపడింది.
అయితే బాల్యం సుఖంగా గడవని వారు ఎన్ని పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నా తరువాయి జీవితంలో మానసికంగా ఎన్నో ఇబ్బందులనెదుర్కుంటారు అనేదానికి మైఖెల్ జాక్సనే ఉదాహరణ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు, మొదటిసారి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేనాటికి జాక్సన్ వయసు కేవలం అయిదేళ్ళు. తన అయిదోబిడ్డలో ఏదో చెప్పలేని ప్రతిభ ఉంది అన్న తన తల్లిమాటలు నిజమయ్యాయి. ఏడేళ్ళ వయసులో తన సోదరుల “మ్యూసిక్ బేండ్” లో చేరిన మైఖెల్ తన ఎనిమిదవ ఏటనుండే నృత్య ప్రదర్శనలివ్వడం మొదలు పెట్టాడు. “రోలింగ్ స్టోన్” పత్రికచే ఒక “ప్రాడిజీ” గా కీర్తించబడ్డాడు. జాక్సన్ 5 అనబడే జాక్సన్ సోదరుల గ్రూపు పాటల ప్రాముఖ్యతని నిర్ణయించే బిల్ల్బోర్డ్ 100 పట్టికలో తన నాలుగు “సింగిల్స్” తో ప్రధమ స్థానానికి ఎగబ్రాకి రికార్డు సృష్టించింది. ఆ నాలుగు సింగిళ్ళను ఈ లంకెల ద్వారా చూడవచ్చు.
I want you back
ABC
The Love you save
http://www.youtube.com/watch?v=kfLQ5RgHUD0
I’ll be there
1975 తరవాత జాక్సన్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలకీ వ్యాపించాయి. సీబీయస్ రికార్డులతో జరిగిన ఒప్పందం తరువాత జాక్సన్స్ 5 “ద జాక్సన్స్” గా రూపాంతరం చెందింది. ఒక పాటల రచయితగా కూడా మైఖెల్ ప్రాచుర్యం పొందాడు. రాడ్ తెంపర్టన్, స్తీవీ వండర్, పాల్ మెక్కార్ట్నీ లాంటి దిగ్గజాలతో కలిసి “ఆఫ్ ద వాల్” అనబడే ఆల్బమ్ని నిర్మించాడు. ఆ ఆల్బం ప్రపంచవ్యాప్తంగా 20 మిల్లియన్ ప్రతుల అమ్మకాలను సాధించింది. దాంతోపాటుగా మైఖెల్కి ఎవార్డులను, అత్యున్నతమైన గ్రేమీ పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది. ఇక ఆయన కొన్నాళ్ళపాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు.
1980వ దశకంలో జాక్సన్ కీర్తి తన జీవితపు అత్యున్నత పర్వత శిఖరాలనధిరోహించింది. “ఈ టీ” అనబడే స్పీల్బర్గ్ చిత్రంకోసం ఆయన నిర్మించిన “సంవన్ ఇం ద డార్క్” కు గ్రేమీ లభించింది. ప్రపంచ సంగీత చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిన ఆయన ఆల్బం “థ్రిల్లర్” నిర్మించబడింది కూడా ఈ దశకంలోనే. 80 వారాలపాటు టాప్ టెన్ లోనూ, అందులో 37 వారాలపాటు మొదటి స్థానంలోనూ నిలిచినా ఈ ఆల్బం అమ్మకాలు 109 మిలియన్ ప్రతులని దాటి రికార్డు సృష్టించాయి. ఈ రికార్డు ఇప్పటికి కూడా పదిలంగానే ఉంది. “బిల్లీ జీన్”, “బీట్ ఇట్” పాటలు ఒక సంచలనాన్ని సృష్టించాయి. ఆయన అభిమానుల సంఖ్య లెక్కకు మించి పెరిగింది. ఈ ఆల్బం నష్టాలను చవిచూస్తున్న ఆల్బం నిర్మాతలలో నూతనోత్సాహం నింపింది. ఎంటీవీకి లాభాలని ఆర్జించి పెట్టింది. ఆంగ్ల వికీపెడియా పేర్కొన్నవిధంగా మైఖెల్ జాక్సన్ తన ఒంటిచేత్తో సంగీత పరిశ్రమని బ్రతికించాడు. 1984 లో రికార్డు స్థాయిలో మైఖెల్ జాక్సన్ కి వచ్చిన ఎనిమిది గ్రేమీ పురస్కారాలలో రెండు “బీట్ ఇట్” పాటకే వచ్చాయంటే దీనీ ప్రాముఖ్యతని అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రింది లంకెలో బీట్ ఇట్ పాటని చూడవచ్చు. ఓటమి, ధైర్యం, మానవ ప్రవృత్తి, హింస పై వ్యతిరేకత ప్రధానంశాలుగా సాగే ఈ పాటలో తన బాల్యదశలో పడిన కష్టాలని కూడా పరోక్షంగా జాక్సన్ ప్రస్తావించాడని విమర్శకుల అభిప్రాయం. ప్రఖ్యాత రాక్ కళాకారుడు ఎడ్డీ వేన్ హేలన్ ఈ పాటలో కొంతభాగానికి గిటార్ వాయిద్య సహకారమందించడం విశేషం. (సాధారణంగా రాక్ అభిమానులకి జాక్సన్ లాంటి పాప్ గాయకులంటే పడదు. ఒక రాక్ & మెటల్ అభిమానినైన నాకు ఈ విషయం విదితమే. లంకెలో వేన్ హేలన్ గిటార్ను ప్రస్ఫుటంగా 3:10 నుండి 3:40 వరకు వినవచ్చు. నేను ఈ పాట మొదటిసారి విన్నప్పుడు ఈ భాగంలో “హార్డ్ రాక్” శైలి వచ్చిందేమిటా అని ఆశ్చర్యపోయా. తరవాతెప్పుడో దానిని కూర్చింది వేన్ హేలన్ అని తెలిశాక విషయం అర్ధం అయ్యింది)
http://www.youtube.com/watch?v=Uqxo1SKB0z8
1983 లో ఆయన మొదలుపెట్టిన మూన్వాక్ నాట్యం ప్రపంచవ్యాప్తంగా యువతని ఉర్రూతలూగించింది. పాశ్చాత్య నృత్యానికి ఒక పర్యాయపదంగా మైఖెల్ జాక్సన్ ఎదిగాడు. మన భారతదేశంలో కూడా ప్రతీ కళాశాలలో విద్యార్ధులు చేసిన మూన్వాక్ నృత్యాలు ఆ దశకంలో కళాశాలలకు వెళ్ళినవాళ్ళందరికీ గుర్తుండేఉంటుంది. ముందుకి నడుస్తున్న శైలిలో వెనక్కి నడిచే ఈ నాట్యం అంత సులభమేంకాదు. ఈ క్రింది వీడియోలో 00:12 మరియు 00:16 మధ్య దీనిని చూడవచ్చు.
1987 లో విడుదలైన “బేడ్” కూడా చాలా అమ్మకాలని సాధించింది. ఈ ఆల్బంలో ఏకంగా అయిదుపాటలు బిల్బోర్డ్ 100 లొ మొదటిస్థానానికి చేరాయి. ఈ క్రింది వీడీయోలలో “బేడ్” మరియు “ద వే యూ మేక్ మీ ఫీల్” పాటలని చూడవచ్చు.
http://www.youtube.com/watch?v=uG5NhkxQJQc
http://www.youtube.com/watch?v=sEU9Q8NlOiY
“కింగ్ ఆఫ్ పాప్” గా ప్రాచుర్యం పొంది, 1989 లో స్నేహితురాలు ఎలిజబెత్ టేలర్ చేతులమీదుగా “ఆర్టిస్ట్ ఆఫ్ ద డీకేడ్” పురస్కారం అందుకున్న జాక్సన్కు అప్పటి అమేరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కూడా వైట్హౌస్ తరపున “ఆర్టిస్ట్ ఆఫ్ ద డీకేడ్” పురస్కారం అందజేశారు. ఇక 1990 వ దశకంలో విడుదలైన “డేంజరస్” ఆల్బం ప్రపంచాన్ని ఉర్రూతలూపింది. “బ్లేక్ ఆర్ వైట్”, “రిమెంబర్ టైం”, “హీల్ ద వర్ల్డ్” లాంటి పాటలు బిల్బోర్డ్ లో అగ్రస్థానాలలో నిలిచాయి. “బ్లేక్ ఆర్ వైట్” పాటలో ఒక భారతీయ శైలి నృత్య కళాకారిణితో కలిసి జాక్సన్ నృత్యం చేసిన వైనం భారతదేశం లో చాలా ఆదరణ పొందింది. క్రింది వీడియోలో “బ్లేక్ ఆర్ వైట్” పాటని చూడవచ్చు. ఈ పాటలో మరో రాక్ బేండ్ “గన్స్ ఎన్ రోసెస్” పాలుపంచుకోవడం విశేషం.
http://www.youtube.com/watch?v=ZI9OYMRwN1Q
ఆ తరవాత విడుదలైన “హిస్టరీ” ఆల్బంలో “దే డొన్ట్ కేర్ ఎబవుట్ అస్” పాట ప్రాచుర్యం పొందింది. క్రింది వీడియోలో దానిని చూడవచ్చు.
http://www.youtube.com/watch?v=gCqQ2JcQWGs
2000వ దశకంలో జాక్సన్కు పేరు తెచ్చిన పాటలేవీ పెద్దగా లేవనే చెప్పాలి. విడుదలైన “ఇన్విన్సిబుల్” ఆల్బం అభిమానుల్లోకి చొచ్చుకుపోలేకపోయింది. సంగీతంకన్నా జాక్సన్ వివాదాలకి లభించిన ప్రాముఖ్యత కూడా దీనికి కారణం కావచ్చు.
వర్ణవివక్ష పై స్పందన:
వర్ణవివక్ష పై జాక్సన్ కాస్త ఘాటుగానే స్పందించాడు. “బ్లేక్ ఆర్ వైట్” పాట పై రికార్డింగ్ కంపెనీ ఇచ్చిన వివరణ “a rock ‘n’ roll dance song about racial harmony” అని ఉంది. “But, If You’re Thinkin’ About My Baby It Don’t Matter If You’re Black Or White” అనే పదాలు ఆ రోజుల్లో అందరినోళ్ళలో నానుతుండేవి “They don’t care about us” పాటలో “Jew me, sue me, everybody do me/ Kick me, kike me, don’t you black or white me” అనే పదాలు పెద్ద వివాదాన్నే లేపాయి. అది యూదులని కించపరిచేలాఉందని న్యూయార్క్ టైంస్ పత్రిక విమర్శించింది. Anti Defamation League (ADL) కూడ గళం కలిపింది. ఆ తరవాత ఆ పదాలని జాక్సన్ మారుస్తానన్నా చాలా కాలం పాటు వివాదం సద్దుమణగలేదు.
చాలామందికి తెలియని మరో కోణం – సేవా దృక్పధం:
మైఖెల్ జాక్సన్ సేవాసంస్థలకు అందించిన సహాయసహకారాల్ని గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆల్కహాల్ మరియు మాదకద్రవ్యాల వ్యాప్తికి వ్యతిరేకంగా కృషిచేసే సంస్థలకి జాక్సన్ అందించిన సహాయానికి గుర్తింపుగా 1984 లో రొనాల్డ్ రేగన్ వైట్హౌస్ లో ఒక ప్రత్యేక పురస్కారంతో జాక్సన్ను సత్కరించారు. అదే సంవత్సరంలో ఒక ప్రమాదంలో తన తలకు నిప్పంటుకుంటే దానికి పరిహారంగా పెప్సీ కంపెనీ చెల్లించిన 1.5 మిలయన్ డాలర్ల మొత్తాన్నీ తనకు వైద్యం అందించిన ఆసుపత్రికి విరాళంగా ప్రకటించడం ఆయన ఔదార్యాన్ని చాటుతుంది. ఆ డబ్బే ఆ ఆసుపత్రికి కాలిన గాయలకి చికిత్సచేసే సరంజామా అంతా సమకూర్చి మరెందరో రోగులకి చికిత్స అందించడానికి కారణమైంది. ఆయన సేవాప్రవృత్తిని చాటే అనేక ఉదాహరణలలో ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే.
చీకటికోణం – వివాదాలు,అనారోగ్యం:
భగవంతుడు (హేతువాదులూ! నామీద రాళ్ళేయకండి. భగవంతుడు అనేమాట మీకు నచ్చకపోతే ప్రకృతి అని చదువుకోండి. మరేం ఫరవాలేదు) ఎవరీకీ సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వడు. ఇన్ని పేరు ప్రఖ్యాతులు, అంచనాకు మించిన ధనం సమకూరిన జాక్సన్ జీవితంలో ఉన్న పెద్ద లోటు – ప్రశాంతత లేకపోవడం. చర్మవ్యాధితో, ఊపిరితిత్తుల రుగ్మతతో చాలా బాధపడిన జాక్సన్కు బాల్యదశలో తనపై జరిగిన అత్యాచారాలు కూడా మానసికంగా కృంగదీశాయి – తన జీవితంలో చీకటికోణాలని వెలికి తీసి ప్రపంచానికి చూపాయి. చిన్న పిల్లలతో అసభ్య ప్రవర్తనపై అభియోగాలు, అసాధారణ మనస్తత్వం పై మీడియావారి గోల, చింపాంజీని పెంచుకోవడం లాంటి వివాదాలు జాక్సంకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. రేపు విచారణలో 50 యేళ్ళ వయసులోనే మరణానికి దారితీస పరిస్థితులపై పైవాటి ప్రభావంకూడా ఉందని తేలినా ఆశ్చర్యపడక్కరలేదు. అనతికాలంలోనే అతివేగంగా నింగికెగసిన తార అంతేవేగంగా తన జీవితాన్ని వదిలి, కోట్లాది అభిమానులని దు:ఖసాగరంలో ముంచి 2009 జూన్ 25 వ తేదీనాడు నింగికెగసింది. ఇది సంగీత ప్రపంచానికి తీరని తీవ్రమైన లోటు. సంగీతం బ్రతికున్నంత కాలం ఫ్రేంక్ సినాట్రా, ఏల్విస్ ప్రెస్లీలతో సమానంగా మైఖెల్ జాక్సన్ పేరుకూడా వినబడుతూనే ఉంటుంది.
స్ఫూర్తిని పొందిన భారతీయ కళాకారులు: కోట్లాదిమంది భారతీయ కళాకారులు మైఖేల్ జాక్సన్ నుండి స్ఫూర్తిని పొందారు. ఆయన బాణీలని కాపీచేసిన మన భారతీయ సంగీత దర్శకులు కోకొల్లలు. చిన్నచితకా వారిని వదిలేస్తే, మచ్చుకి కొన్ని ఉదాహరణలు:
ఇది మైఖెల్ జాక్సన్ థ్రిల్లర్ పాట వీడియో:
http://www.youtube.com/watch?v=9Xs9OQHpwDE
ఇది మన మేగస్టార్ చిరంజీవి పాట. ఈ పాటే కాకుండా చిరంజీవి వేసిన మిగాతా “స్టెప్పులు కూడా” చూడండి ( ఘరానామొగుడు, త్రినేత్రుడు, యముడికి మొగుడు, యమకింకరుడు గట్రా – ముఖ్యంగా ప్రభుదేవా కోరియోగ్రఫీ చేసినవి – చాలామటుకు అందులో మీకు జాక్సన్ స్టెప్పులే కనిపిస్తాయి)
ప్రభుదేవా జెంటిల్మేన్, ప్రేమికుడు పాటల నృత్య భంగిమలు చూడండి. అందులో జాక్సన్ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక మన ఆస్కార్ దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్. ఆయన సంగీత దర్శకత్వం వహించిన “బాంబే” సినిమాలోని “హల్లా గుల్లా” పాట, మైఖెల్ జాక్సన్ “డేంజరస్” పాట క్రింది వీడియోలలో చూడండి. ముఖ్యంగా 2:00 నుండి 2:14 వరకూ రెండు వీడియోలలో ఉన్న ట్యూన్ని శ్రధ్ధగా వినండి – నేను చెప్పేది మీకు అర్ధం అవుతుంది :))
అలాగే క్రింద ఇచ్చిన “భారతీయుడు” సినిమాలో “మాయా మశ్చీంద్ర” వీడియోని, జాక్సన్ “రిమెంబర్ టైం” వీడియోని పరిశిలించి చూడండి. విషయం మీకే అర్ధం అవుతుంది.
మొన్నామధ్య నాకొకసారి జాక్సన్ డేన్సుకు మన తెలుగు పాటలు బేక్గ్రౌండ్లో పెడితే ఎలాఉంటుందోనన్న ఆలోచన వచ్చింది. దాని పర్యావసానమే నా ఈ వీడీయోమిక్సు. ( “లొట్టా చెంపలదాన” ప్రైవేట్ పాటకి జాక్సన్ స్టెప్పులు)
http://www.youtube.com/watch?v=Fs-Jzh5KBvM
అలాగే “ఖుల్లంఖుల్లా” అనే తెలుగు ప్రైవేట్ పాటకి జాక్సన్ స్టెప్పులు ఇక్కడ.
http://www.youtube.com/watch?v=qXf8laRxt_o
కృతజ్ఞతలు: వికేపీడియా వారికీ మరియు యూట్యూబ్ వారికి
7 అభిప్రాయాలు »వీడియో / ఆడియో, సంస్మరణ
July 6th, 2009 at 11:42 am
అత్యంత సమగ్రమైన వ్యాసం. మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత ఇంత సమగ్రంగా రాసిన వ్యాసం ఇదే అనిపిస్తోంది. అతని జీవిత విశేషాలతో పాటు అతడి వీడియోలనుంచి “స్ఫూర్తి “పొందిన మన వారి ఘనతను కూడా వీడియోలతో సహా వివరించడం అద్భుతంగా ఉంది.
కళ, పేరు, డబ్బు,కీర్తి ,ఎన్ని ఉన్నా ప్రశాంతత లేని జీవితానికి అతడొక ఉదాహరణగా మిగిలిపోయాడు. అతడి డబ్బే టార్గెట్ గా అతడిని చుట్టుముట్టిన వివాదాలు అతన్ని గెలిచాయి. అతడిని చంపాయి కూడా!
నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరిన అతడికి విధంగా నివాళి అర్పిస్తే అతడి ఆత్మ శాంతిస్తుందో!
July 11th, 2009 at 10:27 pm
మైఖెల్ జాక్సన్ జీవితాన్ని చాలా చక్కగా వివరించారు.
July 12th, 2009 at 1:07 am
Interesting, Boss.
Good narration.
July 12th, 2009 at 6:21 am
చాలా బావుందీ వ్యాసం. అన్ని విషయాల్లోకీ, రెహ్మాన్ పాటలకీ, మైకేల్ మ్యూసిక్కీ ఉన్న పోలికలు నేను కాలేజీ లో ఉన్నపుడే గుర్తుపట్టి, వాదించేదాన్ని. సో, ఈ విషయం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సుజాత గారన్నట్టు సమగ్రమైన వ్యాసం. మీరు ఏ జర్నలిస్టో అవ్వాల్సింది. మీరు రాసే విధానంలో స్పష్టత బావుంటుంది. :D
July 12th, 2009 at 7:21 am
చాలా బాగుంది అంటే అది చాలా చిన్న మెచ్చికొఎలు.
July 13th, 2009 at 12:27 am
చాలా బాగుంది.
ప్రపంచ వ్యప్తంగా మైఖెలు మ్యూజిక్ ప్రభావం చాల ఉన్నది.
ఇక చిరంజీవి, ప్రభుదేవ, రెహమాన్ లుకు లైఫు మైఖెలు.
July 14th, 2009 at 6:44 pm
Thanks everyone