Jul2009
పరిచయం
మూలం: కమలా(దాస్) సురయ్యా
తెలుగుసేత: పసుపులేటి గీత
నాకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు,
కానీ గద్దెనెక్కిన వాళ్ళ పేర్లు తెలుసు
వారాల పేర్లు చెప్పినట్టు, నెలల పేర్లు చెప్పినట్టు,
నెహ్రూ నుంచి మొదలుపెట్టి అందరి పేర్లనీ అప్పజెప్పగలను
నేను భారతీయురాల్ని, మలబార్లో పుట్టాను,
మేనిరంగు చామనఛాయ, మూడుభాషలు మాట్లాడగలను
అందులో ఒకటి కలల భాష, మిగతా రెండింట్లో రాయగలను
నన్ను ఇంగ్లిష్‌లో రాయవద్దన్నారు, అది నా మాతృభాష కాదన్నారు
బంధుమిత్రులు, విమర్శకులు, ఆ మాటకొస్తే మీలో ప్రతి ఒక్కళ్ళూ…
నా మానాన నన్నెందుకు బతకనివ్వరు?
నాకిష్టమైన భాషలో నన్నెందుకు మాట్లాడనివ్వరు
నేనేది మాట్లాడితే అదే నా భాష,
దాని శృతులు, అపశృతులు, అర్థాలు, అపార్థాలు, వింతలూ, వికారాలు
అన్నీ… అన్నీ నావే, కేవలం నావి మాత్రమే!
అది వచ్చీరాని ఇంగ్లిషే కావచ్చు, సంకర భారతీయతే కావచ్చు,
తలతిక్కగానూ ఉండొచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంది
మీక్కనిపించడం లేదా, నేనెంతటి మానవినో అదీ అంతటి మానవాంశే!
ఆ భాష నా ఆశలకీ, ఆకాంక్షలకీ, నా కోరికలకీ, నా ఆనందాలకీ గొంతునిస్తుంది
కాకులకు కావుకావుమనడం ఎలాగో, సింహాలకి గర్జించడం ఎలాగో
ఆ భాష నాకూ అలాంటిదే, అది మానవ భాష,
అది మనసు వ్యాకరణం, చూడగలిగిన, వినగలిగిన,
తెలుసుకోగలిగిన మనోవాక్కు
తుపానులో ఊగే చెట్లలాగా, వానాకాలపు మబ్బుతునకలాగా,
చితిమంటల చిటపటలాగా
అది చెవిటి, గుడ్డి మాట కాదు
నేను పసిదాన్నే, ఎదిగానంటున్నారు
దేహావయవాలు ఒంపులు తీరి పొడవయ్యాయి,
ఒకటి, రెండు చోట్ల నూనూగు వెంట్రుకలు మొలిచాయి
ఏమడగాలో తెలియక నేను ప్రేమని అడిగినప్పుడు
అతను పదహారేళ్ళ యవ్వనాన్ని పడక గదిలో తోసి తలుపేశాడు
అతను నన్నేమీ కొట్టలేదు
కానీ నా స్త్రీదేహం దిగులు, దిగులుగా గాయపడింది
గర్భమూ, రొమ్ముల బరువుకింద నలిగి పోయాను
దీనాతిదీనంగా ముడుచుకు పోయాను.
తరువాత నేను చొక్కా తొడుక్కున్నాను
నా తమ్ముడి లాగూలు వేసుకున్నాను
జుట్టుని పొట్టిగా కత్తిరించేశాను
నా స్త్రీత్వాన్ని మరచిపోయాను
‘చీర కట్టుకో, ఆడపిల్లలా, పెళ్ళాంలా ఉండు’ అని వాళ్ళన్నారు
కుట్లు, అల్లికలు నేర్చుకో, వంట నేర్చుకో
పనివాళ్ళతో పోట్లాడు,
సంసారిలా ఉండంటూ ఎల్లల కాపలాదార్లు మొత్తుకున్నారు
గోడల మీద కూర్చోకు, మా కిటికీల్లోకి తొంగి చూడకు
‘అమీ’లా ఉండు, కమలలా ఉండు, కనీసం
మాధవికుట్టిలానైనా ఉండన్నారు
పేరెంచుకునే వేళొచ్చింది
ఒక పేరు, ఒక పాత్ర…
నటించకు, పిచ్చిదానిలాగానో, అప్సరస లాగానో నటించకు
ప్రేమలో మోసపోతే అసహ్యంగా ఏడవకు
నేనొకతణ్ణి కలిశాను, ప్రేమించాను
అతని పేరెందుకులే, నాలాగే ప్రతి స్త్రీ కోరుకునే మగవాడతను
అతనిలో నదుల ఒరిపిడి, నాలో కడలి నిరీక్షణ
నేను ప్రతి ఒక్కళ్ళనీ అడిగాను
‘ఎవరు నువ్వు?’
అందర్నుంచీ ఒకటే జవాబు… ‘నేను’!
ప్రతిచోటా తనని తాను ‘నేన’ని పిలుచుకునే వ్యక్తినే చూశాను
ఒరలో కత్తిలా ఉన్నాడతను
విచిత్రమైన నగరాల హోటళ్ళలో
అర్థరాత్రి ఒంటరిగా తాగుతూ నేనే
ఒంటరిగా నవ్వుతూ నేనే
ప్రేమించిందీ నేనే, అవమాన పడ్డదీ నేనే
గొంతులో గిలక అడ్డంపడి తన్నుకుంటూ చస్తున్నది నేనే
నేనే పాపినీ, నేనే రుషినీ
నేనే ప్రేయసినీ, నేనే విధివంచితనీ
నీవి కాని మోదాలేవీ నా దగ్గర లేవు
నీవి కాని ఖేదాలేవీ నాకు లేవు
నన్నిప్పుడు నేను కూడా ‘నేన’నే పిలుచుకుంటాను
6 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు
July 11th, 2009 at 9:44 am
గీత గారూ:
కమలా దాస్ గురించి – ముఖ్యంగా అనువాదాల గురించి.
మీ అనువాదాలు కమలాదాస్ కి దగ్గిరగా వున్నాయి.
నేను గతంలో చాలా సార్లు మొదలు పెట్టి, విఫలమయ్యాను ఈ కవితలన్నీ. “ఇవి అనువాదానికి లొంగవు” అని అసమర్ధ సంజాయిషీ చెప్పుకున్నాను. మీ అనువాదాలు చదివాక అది నా మనసులోని లోపమే తప్ప – భాష అసమర్ధత కాదు అని అర్ధమ్ అయ్యింది.
ఇప్పుడు “నా కథ” మీ కోసం ఎదురుచూస్తోంది. వొక ప్రయత్నమ్ చెయ్యండి.
అఫ్సర్
July 12th, 2009 at 7:08 pm
గీ త గారు
అను వాదము చాల బాగుంధి
July 13th, 2009 at 7:17 am
అఫ్సర్ గారు,
ధన్యవాదాలు. ఇప్పుడు “నా కథ” మీ కోసం ఎదురుచూస్తోంది, ఒక ప్రయత్నమ్ చెయ్యండన్నారు, తప్పకుండా చేస్తాను.
-పసుపులేటి గీత
July 13th, 2009 at 7:21 am
బుచ్చి రెడ్డి గారు
ధన్యవాదాలు
పసుపులేటి గీత
August 11th, 2009 at 9:58 pm
గీత గారు
అనువాదంలొ ఎక్కడా క్రుత్రిమత కనిపించలెదు
కమలాదాస్ గారి ఒరిజినల్ చదివినట్లుంది
ఛాలా బాగుంది.
October 27th, 2010 at 2:04 am
మీ అనువాదం చాలా బాగుంది.
“నా కిష్టమైన భాషలో నన్నెందుకు మాట్లాడనివ్వరు.”
ఈ వాక్యం చాలా బాగుంది.
మీకు అభినందనలు..