సజీవదహనం

“కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ
కొడవండ్లు చేపట్టవే చెల్లెమ్మ
పొద్దంతా జేసినా పొద్దూకలేదంటడు
పసిపిల్ల ఏడుస్తుంటే పాలియ్య పోతానంటే
మట్ట గడియారం జూసి టైముకాలేదని చెప్పె
పసిపిల్ల ఏడ్చినా పాలియ్య దోలలే
ఒడ్డు మీద నిలవడి వంగి నారు పీకుమంటడు
యాళ్ల కాలేదంటడు ఇగ పోతువు సైసంటడు…”
గొల్ల రామవ్వ పాటెత్తుకుని రాగం తీత్తుంటే వంతపాడుతూ దన దన నారు పీకుతుండ్రు శంకరవ్వ, ఎల్లవ్వ, రాజవ్వ, సత్తెవ్వ.

మూడెకరాల పొలం అయిలయ్యది . రెండు మూడేండ్ల నుంచి బీడు పడే వుంది. ఈ యేడే కాలం మంచిగై బాయిలకు నీళ్ళచ్చినయని  ఇంత నారు పోసిండు. పొలం బీడు వడ్డ కాన్నుంచి కూలీ పనులు చేసుకుంటనే సంసారం ఎల్లదీసుకత్తుండు అయిలయ్య. “బిడ్డ పెండ్లికి చేసిన అప్పు దినదినం పెరుగుతనే వుండే. ఈ కూలీ మీద అప్పెట్లా తెంపుకని” బాధ పడుతున్న అయిలయ్య ముఖంల కాలం మంచిగయి వర్షాలు పడుతుంటే సంతోషం నిండింది. ఉత్సాహం లోని  మరింత అప్పుజేసి రెండెడ్లను కొని  నాగలి కట్టి పొలం సాగుచేసుడు మొదలుపెట్టిండు. “ఈ యేడు ఎట్లయినా బాకీ తీర్చాలనే” పట్టుదల అయిలయ్యను క్షణం తీరికగా కూసుండనిస్త లేదు.
అయిలయ్య తెచ్చిన మందు బస్తాలను బండి మీదినుంచి కిందికి దించుటానికి సాయపడి మళ్ళీ వచ్చి “ఎమాయెనుల్లా పొద్దుదగ్గర పడుతుంది ఇంకా సగమన్నా కాలేదు నారు పీకుడూ” అని తొందర పెట్టింది అయిలయ్య భార్య బూదవ్వ.
“ఎంత అన్నాలమే బూదవ్వా! ఓదిక్కూ నడుము పడీపోతున్నా చెయ్యికి రికాము లేకుంట నారు పీకుతనే వుంటిమి ఇంకా అనవడితివి” గుణిగంది రాజవ్వ.
” ఆ …. నువ్వేళ పీకితివి మేమేడ కుప్పలేత్తిమి” బూదవ్వ.
“ఊకుండత్తా ఆమె గట్లే అంటది గని నువ్వు మునుము ఎల్లకపోతే నేను ఎదురువడూతతియ్యి” అన్నది సత్తవ్వ రాజవ్వను చూసినవ్వుకుంట.
” మాసాలురియ్యే పొద్దెం ఉసల్దాన్ని చూస్తే అందరికీ ఎచ్చార్కే” మల్లోసారి గుణిగింది రాజవ్వ.
అందరూ నవ్వుకుంట ముందు ముందుకు పోతాండ్రు…
పొద్దు వంగి పోయింది.
పొలం కాన్నుంచి ఇంటికి పోయే సరికి ఇంటి ముందట సూట్కేసు పట్టుకొని నిలవడ్డ బిడ్డను చూసి బూదవ్వకి అయిలయ్యకు చల్ల చెమటలు పుట్టినయి. అత్తగారింటికి పొయ్యి వారమన్నా కాలేదు సూట్కేసు పట్టుకొని  వచ్చిన బిడ్డను చూసే సరికి ఇద్దరి గుండెల్ల ఏమైందోనని బుగులు జొచ్చింది.
బూదవ్వను చూసే సరికి బిడ్డ పద్మ సూట్కేసు కిందపెట్టి బూదవ్వను పట్టుకొని గట్టిగా ఏడ్చింది.
“ఏమైంది బిడ్డా పద్మా? ఏమైంది? ఎందుకేడుత్తున్నవే? అత్తగారింట్ల లొల్లయిందా? ఏడ్వకు ఎట్లయితే గట్లయితది” అనుకుంటూ బిడ్డను ఊకుంచింది బూదవ్వ.
ఏడుపు నుంచి తేరుకుని ముగ్గురూ ఇండ్లకు పోయిండ్రు కాళ్ళు, చేతులు కడుక్కొని బిడ్డకు చెంబుల నీళ్ళిచ్చింది బూదవ్వ. మొగురానికి ఆనుకొని కూసోని
“ఏమైందే పద్మా ఆలుమగలు లొల్లి పెట్టుకున్నారా? లేకపోతే అత్తతోని జౌడమైందా?” అడిగింది బూదవ్వ.
“అదేం లేదే ఆటో నడుస్తలేదట. మీ అల్లుడు ఆటో అమ్మి మస్కట్ పోతడట లక్ష రూపాయలు పట్టుకరమ్మన్నడు. తీసుకచ్చేదాకా ఇండ్లకు రాకుమని ఎళ్లగొట్టిండే” అంటుండంగనే పద్మ కండ్లల్ల  నీళ్ళు తిరిగినయి.
“ఇదేం అన్నాలకు పెండ్లికి చేసిన బాకీ ఇంకా తీరనే లేదు. మళ్ళా లక్షరూపాయల ఎక్కడి నుంచి తెస్తమే” అంటూ బూదవ్వ సోకం పెట్టింది.
ఏడుపు విని చుట్టు పక్కల అమ్మలక్కలంతా జమైండ్రు. విషయం తెల్సుకుని అయ్యో! బిడ్డకు ఎంత గోస వచ్చిపడిందని ముక్కు మీద వేలేసుకున్నరు.
అయిలయ్యకు ఏంజెయ్యాల్నో  అర్ధం గాలే. గుండెల్నిండా బాధ నింపుకొని ఎడ్లకు గడ్డి వేద్దామని దొడ్లోకి పోయిండు.

* * *

“అయ్యజేసిన అప్పుకిందికి దొరోల్ల జీతగడ
ఆరేండ్లకే జీతమంటివా దొరోల్ల జీతగాడ
ఆకలాయి ముక్క కంకిరో దొరోల్ల జీతగాడ
ఇర్సుకొని కాల్సు కుంటెరో దొరోల్ల జీతగాడ
ముక్కులిరుగ కొట్టవట్టిరి దొరోల్ల జీతగాడ
దున్నే హక్కుందిగానీ దొరోల్ల జీతగాడ
తినే హక్కు లేనే లేదనే దొరోల్ల జీతగాడ……”
కుమ్మరి పోచవ్వ పదం పాడుతుంటే ఎన్కన్కకు అడుగులేసుకుంట. వేగంగా కదులుతున్న చేతులు నాట్లెత్తున్నయి…
బూదవ్వ ముసి ముసినవ్వు నవ్వుకుంటనే ” ఎమాయెనయ్యా! మా నాటైతందిగని నీ కుప్పలే అందుతలేవు ” అని భర్త అయిలయ్యను గదమాయించింది. అయిలయ్య జెప్పజెప్పనారు కుప్పలేసుకుంట పోతుండూ… శ్రమ జీవుల పని పాట చూసి పొలం పులకించి పోతోంది… వారి పాదాల కింద నలిగిపోతున్న తన అదృష్టానికి లోలోపల సంబరపడిపోతోంది…
“సాకలి లచ్చి కోడలు రూప ఎంకట్రావు దొరకు మరిగిందట కదా!” మెల్లగా ముచ్చటను ఊళ్లో విషయాలకు తీసుక పోయింది శంకరవ్వ.
“నీకెప్పుడు గవ్వే ముచ్చట్లు వదినె నీకేడేర్పడుతుంది. ఏంజెయ్యి మంటవ్ మరి? మొగడు మస్కటు పోయి మూడేండ్లయింది. ఇది వరకు దమ్మిడీ పంపలేదు. ఊళ్లో సాకలికి తిరుగుదామంటే ఇప్పుడూ ఎవల బట్టలు వాళ్లే పిండుకోవట్టిరి. సంసారమెట్లెల్లాలే? పోరగాండ్లకు సదువెట్లా చెప్పియ్యాలే? తనెట్లా బతుకాలే? సర్కారోడు ఒక్క బియ్యమిత్తే అయిపయెనా? ఎన్నిగావాలే ముద్ద నోట్లెకు పోవాల్నంటే? నూనె పాకెట్ కు ఎనభైరూపాయలు, పప్పు కొంటె అరవైరూపాయలు ,పాలు ముప్పైరూపాయలు, అరొక్క వస్తువు ధర మనకందకుంటనే పోవట్టే ఎట్లెల్లతది వదినె నువ్వు దీర్ఘం తీత్తున్నవు గని” ఇగురమంతా జర కోపంగనే చెప్పింది బూదవ్వ.
“అట్లగాదు వదినె పోరడు నమ్మి మస్కట్ పోతే అత్తామామల మీద ఏరువడి గిట్లజేసుడు మంది ముందట జారి పడ్డట్టు కాదా! అని” మళ్ళా దీర్ఘం తీసింది శంకరవ్వ.
“ఎన్నన్న చెప్పు వదినె బల్సి ఎవతి చెడిపోదు, దాని కష్టాన్ని ఆసరగా తీసుకొని ఎవడన్నా లొంగదీసుకుంటే తప్పా” ఇంకింత వివరంగా చెప్పి “పా… పా… ముచ్చట సంబురానా మునుము ఎన్కవడితిమి పురమాయించింది బూదమ్మ.

* * *

నెత్తి మీది తట్టదించి ఇంట్లకు పోయే సరికి, అల్లుడు కనిపించిండు బూదవ్వకు.
“ఏమయ్యా సంపతి ఎప్పుడచ్చినవు? అమ్మానాన మంచి గున్నారా?” అడిగింది.
“అ … మంచిగనే వున్నరు”
చెంబుతోని అల్లునికి నీళ్ళిచ్చి “చాయిపెట్టె పద్మా” అని బిడ్డకు చెప్పింది.
“ఆటో పురాతా నడుస్తలేదనయ్యా అమ్మినవట? మెల్లగా విషయాన్ని  బయటపెట్టాలని అడిగింది బూదవ్వ.
“నడుస్తే లేదనే అమ్మి మస్కట్ పోదామని ఆ పైసలు వీసాకు కట్టిన. ఇంకా లక్షరొపాయలు కావాలే. పైసలు పట్టుక రమ్మనే మా నాయిన మీ దగ్గరికి పోయిరమ్మన్నప్పుడు. లేకుంటే నాకు వేరే పెండ్లి జేత్తారట”
“అదేంది బిడ్డా గట్లంటవు? మా సంసారం గుట్టు మీకు తెలువందేమునది? పెండ్లిజేసి యాడాదన్నా కాక పాయే, పెండ్లికి చేసిన బాకీ అట్లనే వుండే ఎగుసమని మొదలుపెడితే అది ఎటూ మొదలైతలేదమే.”
“గవన్ని చెప్పకుండ్రి పైసలిత్తరా? ఇయ్యరా?”
“సైసు బిడ్డా తొందరపాటు వద్దు ఇప్పటికిప్పుడూ లక్షరూపాయలు మేమెక్కడదెత్తం? నువ్వు కూడా కొంచెం ఆలోచన చెయ్యి.” “సరే! నేను పోయెస్తామరి” అనుకుంటూ లేచినిలవడ్డడు సంపతి
“అయ్యో! ఇప్పుడే వస్తివి, ఇప్పుడే పోతానంటే ఎట్లా? మీ మామ వచ్చేదాకనన్నా ఆగవా?”
“మామ వచ్చి చెప్పినా గిదే ముచ్చట గదా! దానికి ఆగుడెందుకు? అనుకుంటూ వెళ్ళిపోయిండు.
బూదమ్మ నెత్తిపట్టుకొని కూసున్నది. పద్మ తెచ్చిన చాయి గిలాసల కన్నీటిబొట్టుపడి కల్సి పోయింది.

* * *

“అక్క రాయె అక్కా రఘు మెల్లెలో రామా
అక్కరా బుచ్చవ్వ రఘు మల్లెలో రామా
కొత్త బాయికాడ రఘు మల్లెలో రామా
వరి కలుపుకచ్చిందే రఘు మల్లేలో రామా
వాడవాడ తప్పకుండా రఘు మల్లెలో రామా
కడప కడప తప్పకుండా రఘు మల్లెలో రామా
కైకిళ్ళు ఎయ్యక్కా రఘు మల్లెలో రామా
మందికంతా ఒక్కటేత్తే రఘు మల్లెలో రామా
రాధవ్వకు రెండెయ్యి రఘు మల్లెలో రామా….”
వజ్రవ్వ నోట్లకేలి జోరుగా పాడ్త్తుంటే “రఘు మల్లెలో రామా” అని కొనకు అందుకుంటూ పల్లె పడుచులందరూ కలుపు తీత్తుండ్రు. కలపు తీస్తున్న బూదవ్వ లేచి నిలవడి భర్త అయిలయ్య కొరకు నొసటీకి చెయ్యి అడ్డం పెట్టి దూరంగాచూసింది. దూరంగా ఎక్కడా అయిలయ్య జాడకనబడలేదు. వంగి మళ్ళా కలుపు తీసుట్ల పడిపోయింది.
అయిలయ్య ఎడ్లను కొట్టుకొచ్చి చెట్టుకు కట్టేసి ఒడ్డు మీద నిలబడి “ఎమాయె ఇంకా మూడు మనుములన్నా ఎళ్లలేదా? సగం పొద్దు గడిచి పాయె” అన్నడు.
“మా ఎళ్లుతం గని పొలంల నీళ్లెవ్వయ్యా? పురాత తక్కువైనయి? బాయిల నీళ్ళు అయిపోయినయా ఏంది?” అన్నది బొదవ్వ. పొలం చుట్టూ చూసుకుంటూ
“బాయిల నీళ్లు మత్తుగున్నయి గని పెడదామంటే కరంటేది? మబ్బుల గంటసేపు పారిచ్చినా, అప్పుడు పోయిందంటే ఇది వరకు రాలే”
“వరి మంచిగ పెరిగే యాళ్లకు గిట్లయితే ఎట్లనయ్యో! పొలానికి బలానికి యూరియా చల్లాలే, పురుగుల పొయ్యేటట్టు స్ప్రే కొట్టాలే”
“నన్నేం జెయ్యిమంటవు? ఏతం పొత్తునా? మోట కడుదునా? కరెంటు రావాలె నీళ్లు పెట్టాలె”
“అది సరే గని పద్మ ఇంట్లేం జేత్తంది? రమ్మన పోయినవు ఓ మనుమన్నా పట్టూ”
“రాదట ఏడ్సుకుంట కూసున్నది అత్తగారింటికి పోతనని”
“ఆడపిల్ల గుండెల మీద కుంపటి అంటే ఏమో అనుకున్నా” అనుకుంటూ బూదవ్వ పొలంల వంగింది.
“ఏమయ్యో పన్నవా? నీ నిద్ర పాడుగాను నాకేమో కంటిమీద కునుకు పడుతలేదు. నువ్వేమో మంచిగనే గుర్రు కొడుతున్నవు?” అనుకుంట అయిలయ్యను నిద్ర లేపింది బూదవ్వ.
“ఏందే? చిరాకుగా లేచి కూసున్నరు అయిలయ్య “ఏందంటవు? రాత్రి ఒంటిగంటయింది. కరంటచ్చింది. పొయ్యి పొలానికి నీళ్ళు పెట్టిరాపో. పొలమంతా నీళ్లులేక ఎండి పోవట్టే” సరే!” అనుకుంటూ లేచి తువ్వాల నెత్తికి సుట్టుకొని ముళ్లు కట్టె పట్టుకొని బయలుదేరిండు.
“పయిలం మరి చూసిపెట్టు కరంటు షాక్ కొట్టగల” అన్నది బూదవ్వ వెనకనుంచి
అయిలయ్య వేగంగా పొలం కాడికి చేరుకొని మోటరు బటన్ ఒత్తిండు జయ్యన నీళ్లు పోసినయి… నీళ్లు సరసర పాకుతూ వెళ్తుంటే పొలం అమృతం తాగినట్టు తాగుతోంది… మూడూ, నాలుగు గంటలకల్ల పొలమంతా పుష్కలంగా నీళ్లతో నిండి పోయింది. అయిలయ్య మనసంతా తృప్తిగా వుంది. వరి ఈనుటానికచ్చింది. పున్నమి నాటి వెన్నెల రాత్రి గాలికి వరి అటు ఇటూ కదులుతుంటే ఆకుపచ్చని చీర గాలికి రెపరెపలాడినట్టూగా వుంది. వరి గొలుకులు పెట్టి అక్కడక్కడా బంగారు రంగులోకి మారుతోంది… “ఇంకా నెల రోజులు కరెంట్ సరిగా వచ్చి పంట చేతికి వచ్చెనా ఈ సారి సగం బాకీ తెంపవచ్చు” అనుకుంటూ అయిలయ్య ఇంటికి బయలు దేరిండు.

* * *

పట్టపగటేల తెల్లని ఎండ వెండిలా మెరిసిపోతోంది… పొలంకాడ నిలవడ్డ అయిలయ్యకు గుడ్డల్ల నీళ్లు తిరిగినయి. గుండెల రాయి పడ్డట్టయింది. ఈడికి వారం రోజులాయె కరెంటు రాక పొలమంతా ఎండిపోయి వరి కిందికి వాలి పోయింది. “కోతకొచ్చే టైముకు దేవుడూ గిట్ల జేయవట్టె. ఆరుగాలం  కష్టపడి తీరా గింజలు ఇంట్ల పడే సమయానికి నమ్మినానవోత్తే పుచ్చు బుర్రలైనట్టు వరి అంతా పశువుల దాణా కింద మారిపోయె. ఇగ పాత అప్పులెట్ల గట్టాలే? కొత్త బాకీలెట్ల తీరాలె? పోరిని అత్తగారింటికి ఎట్ల పంపియ్యాలె? ఈ పంటకు అగ్గితగులు పండినట్టూ కాదాయె, పండనట్టు కాదాయె. నన్ను నట్టేట్ల ముంచిన ఈ పంటకు నిజంగనే అగ్గిపెడుతూ ఇంకెందుకిది? అని అగ్గిపుల్ల తీసి వరికి ముట్టిచ్చిండు. ఎర్రటి ఎండకు మంట క్షణాల్లో పొలమంతా పాకింది. అందులోంచి ఓ నిప్పురవ్వ లేచి పక్కనే వున్న గడ్డివాము మీద పడి అదీ అంటుకుంది. “ఇంకా నేనెందుకు బతికి? ఏం సుఖపడుతా?” అనుకుంటూ అయిలయ్య పెద్దగా మండుతున్న గడ్డివాముల దుంకీండు. దూరం నుంచి వస్తున్న బూదవ్వ, పద్మ ఉరికిచ్చి అయిలయ్యను బయటికి గుంజిండ్రు. అప్పటికే అయిలయ్య ప్రాణం అనంతవాయువుల్లో కల్సిపోయింది.
“నాయినా మీ అల్లుడు మల్లో పెండ్లి చేసుకున్నడటనే కండ్లు తెరువే” అని పద్మ మీద పడి ఏడ్చేది ఏడ్స్తుంది… బూదవ్వ నెత్తి నోరు కొట్టుకుంటోంది.. పొలమంతా కాలి బూడిదైంది.

అభిప్రాయాలు లేవు »కథలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో