Jul2009
తన గురించి తాను – కమలాదాస్
2009 మే 31 న కన్ను మూసిన కమలాదాస్ తొలిదశలో “మాధవీ కుట్టి” పేరుతో మళయాళంలో కథలు రాశారు. ఆ తర్వాత కమలాదాస్ గా ఇంగ్లీషు కవిత్వం రాసి అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కవితా కేతనాన్ని ఎగరేశారు. బడికి వెళ్ళి ఏమీ చదువుకోకుండానే, ఇంట్లో కొద్దిపాటి భాషా పరిజ్ఞానంతోనే ఆమె సాహిత్య రంగంలో సంచలనం సృష్టించారు. కేవలం కవిత్వం చదివి వినిపించడానికి ఆమె ప్రపంచ దేశాలన్నీ తిరిగారు. ఆమె ప్రజ్ఞా పాటవాల్ని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా పదికి పైగా విశ్వవిద్యాలయాలు , గౌరవ డాక్టరేట్లు ప్రకటించాయి. కవిత్వానికి అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. నోబుల్ పురస్కారం కోసం ఒకటి రెండు సార్లు అమె పేరు పరిగణలోకి తీసుకున్నారని కూడా చెబుతారు. అహేతుకమైన ఛాందసాల్ని నిర్ధ్వందంగా ఖండించిన సాహసి. ఇండియన్ లిటరేచర్ ( కేంద్రసాహిత్య అకాడమీ న్యూడిల్లీ) నెం: 155 సంచికలో అచ్చయిన కమలాదాస్ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుగులో అందిస్తున్నవారు డాక్టర్ దేవరాజు మహారాజు. ఇందులో అనువాదం, ఫెమినిజం, మతం మొదలైన అనేక అంశాల మీద ఆమె తన అభిప్రాయాలు వెల్లడించారు.
* * *
అనువాదం గురించి చెప్పుకోవాలంటే……. అనువాదంలో నేను చాలా స్వేచ్ఛ తీసుకుంటాను.. పదానికి పదంగా అనువాదం చెయ్యను. మూలంలోని స్ఫూర్తి అనువాదంలో బాగా ప్రతిబింబించేట్లు మాత్రం తప్పకుండా చూస్తాను. అనువాద కవిత్వంలో ప్రతి దానికీ కింద ఫుట్ నోట్స్ ఇవ్వడానికి నేనిష్టపడను. ప్రజల నైతికత సంసిద్ధతల కలనేత అనువాదంలో కనబడాలి కాని కేవలం అనువాదమంటే అనువాదంగా ఉండకూడదు. కేరళ వీరుల ధీరుత్వాన్ని తక్కువగా చూపించే సాహిత్యం నేను అనువదించను. కాని డా. అయ్యప్ప ఫణిక్కర్ అడిగితే సాహిత్య అకాడమీ కోసం “ఉన్నియర్చా” అనే మళయాళ జానపద గీతం ఇంగ్లీషులోకి అనువదించాను.
ఇక నా కథల విషయానికొస్తే మొదట మళయాళంలో రాసిన చాలా కథలు ఇంగ్లీషులోకి అనువదించుకున్నాను. అలాగే “పద్మావతి ద హర్లట్” కథ మాత్రం మొదట ఇంగ్లీషులో రాసి, తర్వాత మళయాళంలోకి మార్చాను. అలాగే మా అమ్మ బాలమణి అమ్మ కవిత్వం అనువదించడము కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక రకంగా నేను చేసేది అనుసృజన. బహుశ నా బ్లడ్ గ్రూపు నా సృజనాత్మకతను నిర్దేశిస్తుంది. నా రచనా శైలిని గాని, అనువాద సరళిని గాని, వ్యక్తిత్వాన్ని గాని మార్చుకోవడం నావల్ల కాదు… నా రచనలు “బాల్యకాల స్మరణక్కాళ్” “వర్షాంగళ్కుముంబు” (కొన్నేళ్ళ క్రితం) “నీర్మథలమ్ పూతకాలం” (దానిమ్మ పూచిన వేళ) ఒక్కో రచన ఒక్కోక్కందుకు ప్రత్యేకమైంది.
బళ్ళో చదువుకోలేక పోయినా, ఇంటి వాతావరణంలో సహజంగా వచ్చిన భాషా పరిజ్ఞానం తో నేను రచయిత్రి నయ్యాను. పండితుల, భాషా వేత్తల వాదనలో అర్ధం లేదనిపిస్తుంది. ఛందస్సు నేర్చుకొమ్మని, వ్యాకరణం నేర్చుకొమ్మని వారు పిల్లల్ని పురమాయిస్తుంటారు. వాటివల్ల సాహితీ వేత్తలు తయరు కావడం కల్ల! భరతనాట్యం నర్తకీమణికి, బాలే నృత్య కళాకారిణికి తేడా గమనించండి. ఆభరణాలు, దుస్తులు ఎక్కువగా ధరిస్తే గాని భరత నాట్య కళాకారిణి రంగం మీదికి రాలేదు. అదే బాలే చేసే నృత్యకళాకారిణికి అవేమీ అక్కర లేదు. సాహితీ వేత్తలు కాదలిచిన వారు సరళమైన , స్పష్టమైన భాష రాయగలిగితే చాలు. వీరు బాలే చేసే కళాకారిణి లాంటి వారు. జనానికి చేరువవుతారు. పండితులు భరతనాట్యం చేసే నర్తకీమణి లాంటి వారు వారికి బరువైన పదాలు ఆభరణాల్లాంటి అందమైన ఉపమానాలు అవసరం.వీరు పండిత కవులవుతారు. జన బాహుళ్యానికి పూర్తిగా అర్ధం కారు. ఏ భాష మీదయినా, ఇతర భాషల ప్రభావం ఉంటుంది. భాష నిరంతరం మారుతూ ఉంటుంది. ఇక పోతే నవల గురించి కూడా ఒక మాట చెప్పాలి. నవల వంటి సుదీర్ఘమైన రచనలు చదివే ఓపిక రాబోయే తరాలకు ఉండదు. నవల గత వైభవం!
ఫెమినిజం గూర్చి నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. మనకూ పడమటి దేశాల వారికి ఆలోచనా విధానంలో చాలా తేడా ఉంది. అక్కడి స్త్రీలు పురుషుల్ని ద్వేషిస్తారు. ఎందుకంటే వాళ్ళంతా లెస్బియన్స్. ఇక్కడి వాళ్ళు కాదు. నేను మగవాడి కండరాల బిగువుల్లో ఆనందాన్ని అనుభవించిన దాన్ని. నేను అబద్దం చెప్పకూడదు. ఈ దేశంలో స్త్రీలు మగవాళ్లను ద్వేషించరు. తమను కూడా వాళ్లతో సమంగా చూడమని మాత్రమే కోరుతారు. నేను నా భర్తను ప్రేమించాను. నా కొడుకుల్ని ప్రేమించాను. ఆ బంధాల్లోని సౌకుమార్యం నిలుపుకుంటేనే అందం.. ఆనందం. ఇంతెందుకు నేను లెస్బియన్ గా మారదామని ఒక ప్రయోగం చేసాను. కాలేకపోయాను. అంటే, సమాజంలో మనకు సరిపడనివి ఏవి ఉన్నా వాటిని పక్కన పెట్టాల్సిందే . కుళ్ళు రాజకీయాలైనా, ఛాందసపు మతాలైనా, స్త్రీని బానిసను చేసే సామాజిక విధానాలైనా మందులు ఎక్స్ పైరీ డేట్ తర్వాత ఎలాగైతే విషపూరితమవుతాయో విషపూరితమై పోయిన భావాల్ని, విధానాల్ని కూడా మనం ఈ సమాజం నుండి తీసెయ్యాలి.
ప్రార్ధన ఎవరికి వారు చేసుకోవాల్సింది. అది వ్యక్తి గతం. జన బాహుళ్యానికి ఇబ్బంది కలిగిస్తూ బహిరంగంగా మతం పేర చేసే ఆర్భాటాల్ని చట్టబద్ధంగా నిషేధించడం మంచిది. ఒకప్పుడు కొన్ని మంచి ప్రయోజనాల్ని ఆశించి మనిషి మతాల్ని ఏర్పరచుకున్నాడు. కాలానుగుణంగా అవి వెర్రితలలు వేసాయి. ఎప్పటికప్పుడు వాటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం అన్ని మతాల వారికీ ఉంది. ఏ సంస్కరణలైన కింది నుండి రావాలి. చెట్టు లాగా నేలను తన్నుకుని రావాలి. వేళ్లలాగా నేలను తొలుచుకుంటూ పోవాలి. అదే సహజం. ఎక్కడో పై నుండి సంస్కరణలు ఊడి పడవు. పైపైన వస్తాయి. లెనినిజాన్ని పునరుద్దరిస్తాననుకున్నాడు గోర్బచెవ్. ఏమైంది? మొత్తానికి బెడిసి కొట్టింది. భారతదేశం లోనూ అదే జరుగుతుంది. గాంధీ విధానాల్ని అందరూ గాలికి వదిలేశారు. ఊరికే పెదాలు మాత్రం గాంధీ సూత్రాల్ని వల్లె వేస్తుంటాయి. సమయానుకూలంగా కొత్త ఆలోచనలు రావాలి. కొత్త విధానాలు రావాలి. పాతవైతే పునరుద్ధరించుకోవాలి. తప్పదు. కాలదోషం పట్టిన విధానాలు ధైర్యంగా వదిలించుకోవడమే మంచిది.
సాహిత్య కళారంగాల్లో కృషి జరగాల్సిందే . కాని దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడూ పేదరికం పెరిగిపోతున్నప్పుడు కవిత్వం, కథలు రాసుకుంటూ కూర్చోగూడదు. ప్రజలు అన్యాయాల్ని ఎదిరిస్తూ ఉండాలి. ప్రపంచ శాంతి సాధించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. ప్రభుత్వాల పనితీరు బాగులేక పోతే ప్రజలే ఏకమై వాటిమీద ఒత్తిడీ తీసుకురవాలి. ప్రజలు నిరంతరం చైతన్య వంతులుగా ఉండడం ముఖ్యం. కవులు, కళాకారులు కూడా మొదట తాము ప్రజలమన్నది. మరువకూడదు.