Jul2009
తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (మూడో భాగం)
- సి.కాశిం
ఉద్యమ పాట జీవిత చిత్రణ
తెలంగాణ ప్రాంతం గుండె గొంతుకలో నుంచి పాట ఉబికి వచ్చింది. ఇక్కడ బాధ ఉంది. చెరబడ్డ జీవితాలున్నాయి. మగ్గిపోయిన బతుకులున్నాయి. ఇట్లాంటి మూగ రోదన నుంచి సన్నని గొంతు రాగానికి చేరువైంది. ప్రకృతిలో లీనమైంది. పని పరికరాలే వాద్యాలయ్యాయి. పల్లెరు గాయాలపై నడిచిన పాదాలు పాటతో ఉపశమనం పొందాయి. దొరగడీల్లో బందీ అయిన బాల్యంకు ముల్లు కర్ర పాట తోడైంది. కుత కుత ఉడికిన జీవితం నుంచే పాట పుట్టింది.
“భారత దేశంలో మరే ప్రాంతంలో తెలంగాణా రైతాంగ పొరాటం వంటి పోరాటం 1940లకు ముందు ఎక్కడా జరగలేదు. అందువల్ల ఏ భారతీయ భాషలలోనూ తెలంగాణ రైతాంగ పోరాట చైతన్యం వంటి చైతన్యంతో సాహిత్యం రాలేదు.” (కేతవరపు రామకోటిశాస్త్రి-ప్రజాసాహిత్యం.పుట.1) ఈ ప్రాంతంలో వచ్చిన సాహిత్యమంతా రైతాంగ పోరాట పాట సాహిత్యమే. తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటంలో పాల్గొన్న వాళ్లంతా ఆయుధం ధరించి పని చేశారు. అట్లా ప్రజలతో పనిచేయటం వలన పొందిన అనుభవం నుంచి జ్ఞానం వికసించి పాట పుట్టింది. ఈ పాటలు ప్రజల జీవితాలను పోరాట భావజాలాన్ని వ్యక్తం చేసేవిగా ఉన్నాయి. బ్రిటీష్ వారి పరిపాలన వలన తెలుగు నేలలో రైతాంగం చితికిపోయింది. మధ్యతరగతి నడ్డి విరిగింది. గ్రామీణ పేదలు ఆకలి మంటలలో కాలిపోయారు. మరోవైపు ఎగువ మధ్యతరగతిపై ఇంగ్లీష్ ప్రభావం పడింది. తద్వారా తమ మూలాలు మర్చిపోయేస్థితి వచ్చింది. కాని తెలంగాణ ప్రజలపై బ్రిటీష్ వారి ప్రభావం ఏరకంగా పడలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు నైజాం పాలనలో బానిస సమాజపు ఆనవాళ్లు చవిచూశారు. ఉర్ధూ అధికార భాషగా ఉన్నప్పటికి పేద ప్రజల సంస్కృతిపై అంతగా ప్రభావం చూపలేకపోయింది. అందుకే ఇక్కడి ప్రజల మౌఖిక సాహిత్యం సజీవంగా బతికింది. ఆంధ్ర ప్రాంతపు ప్రజాసాహిత్యం కొంత మేరకు మరుగున పడింది. తెలంగాణ ప్రాంతానికుండే ఈ అనుకూల పరిస్థితి వలన నైజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలవ్వగానే మౌఖిక కళారూపాలన్నీ ఉద్యమ కళారూపాలుగా మారాయి. అందుకే ఉద్యమ పాట ఈ ప్రాంతంలో సజీవంగా ఉంది.
“చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటంలోకి గ్రామీణ ప్రజానీకాన్ని సమీకరించడానికి సాహిత్య ప్రక్రియలు జానపద కళారూపాలు ఇతోధికంగా తోడ్పడినాయ”ని ప్రొఫెసర్ ఎస్వీ. సత్యనారాయణ చెప్పారు.(ఉద్యమ గీతాలు.పుట.156) ప్రజలు ఉద్యమాన్ని గుండెకు హత్తుకున్నట్లే సేలల్లో, సెలకల్లో పాడుకునే పాటలను ఉద్యమానికి అనువుగా మార్చారు. ప్రజా పోరాటం మరోవైపు రాసే కవులను ఉత్తేజపర్చింది. ఈ పోరాటంలో ఒక చేత్తో గన్ను మరో చేత్తో పెన్ను పట్టుకున్న కవులు పాటలను రాశారు. మరోవైపు నిరక్షరాస్యులైన ప్రజలు పాటను అల్లుకున్నరు. ఈ కాలంలో వేలాది పాటలు వచ్చాయి. కాని పోరాట విరమణ కాలంలో వచ్చిన సిద్ధాంత భేదాల్లో కొట్టుకుపోయిన నాయకత్వం పాటలను సేకరించకపోవటం వలన ఇపుడు కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి. అయితే నేను ఈ పత్రంలో వస్తువులో, శిల్పంలో వచన కవిత్వానికి ఏ మాత్రం తీసిపోని పాటలను మాత్రమే ప్రస్తావిస్తాను. ఎందుకంటే పాటలు రాసేవాళ్లు, పాడేవాళ్లంటే మన పండిత కవులకు చిన్న చూపు ఉంది. వాళ్లను కవులుగా గుర్తించడానికి చాలామంది సంశయిస్తారు. ప్రజల అల్లికనే కవితాత్మకంగా ఉంటుంది. ఆ కవితా గుణమే పాటగా ముందుకొస్తుంది. అందుకే వచన కవిత్వానికి దీటుగా నిలబడే పాటలనే ఇక్కడ చెబుతాను.
19 జూలై 1950న ఒడ్డు గ్రామనికి చెందిన పదిహేడు మందికి ఆనాటి ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. దీనికి స్పందించి ‘ఉరికంబం కదులుతుందీ’ అని ఒక గీతం వచ్చింది.
“పదిహేడుగురు తల్లులు / కదలకుండా కిటికీల వద్ద నిల్చోని
కంటనీరు పెడుతున్నరు / కాళరాత్రి తెలంగాణలో
కటిక చీకటిని పూసింది” (ఉద్యమ గీతాలు –పుట.158)
1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన సభ యువతను ఉత్తేజపరిచింది. పోరాటంలోకి దుమికేటట్లు చేసింది. ఈ ప్రభావంతోనే తిరునగరి రామాంజనేయులు పోరాటంలోకి వచ్చి పాట రాశారు.
“ఎక్కు బాబా! పడవెక్కుబాబా!
ఆంధ్ర మహాసభయను పడవెక్కుబాబా!
చుక్కాని బట్టె రావి నారాయణ రెడ్డి
పెద్ద తెరచాపబట్టె బద్దం ఎల్లారెడ్డి” (ఉద్యమ గీతాలా. పుట.165)
చక్కటి ప్రతీకలతో రాసిన ఈ పాట ఆ కాలంలో ప్రజలను ఉర్రూతలూపింది. అందరి నోళ్లలో నానింది. తెలంగాణ కవులకు తెలుగు రాదు, భాష తెలియదని కొందరు ఆంధ్రకవులు హేళన చేసిన కాలమిది. కవిత్వం రాయటం చేతగాదన్నారు. రాజమండ్రి పురవీధుల్లోనే కవిత్వం తోరణాలుగా వికసించిందని జబ్బచరుచుకున్నారు. వీరికి జవాబుగా సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ కవుల సంచిక’ను ప్రకటించారు. ఇది పండితులకు మధ్య జరిగిన గొడవ. కాని తెలంగాణలో ప్రతి మట్టిపెళ్ల కవిత్వాన్ని గానం చేస్తుందని సుద్దాల హన్మంతు చూపించారు. వింత ప్రతీకలతో, పోలికలతో పాట రాశారు. పల్లెటూరి పిల్లగాని కన్నీళ్లకు పాటను తగిలించాడు.
“పల్లెటూరి పిల్లగాడా
పసులగాసె మొనగాడా
పాలు మరిచి ఎన్నాళ్ళయింది
ఓ … పాల బుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్లయింది
… … … … … …
తాటి జగ్గల కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటతో పనిలేకుండయిందా
ఓ … పాలబుగ్గల జీతగాడా
చేతికర్రతోడై నిలిచిందా” (సుద్దలహన్మంతు – ప్రతిధ్వని)
కరుణ రసంలో రాసిన ఈ పాట తెలంగాణలో ప్రతి పిల్లవాడి నోటిలో నానింది. విన్నవారిని కన్నీళ్లు పెట్టించింది. తాటిజగ్గలతో చెప్పులను పోల్చిన తీరు చక్కటి కవితాత్మకంగా ఉంది. ప్రజల బాణీ, ప్రజల శిల్పం, ప్రజల వస్తువుతో కలిసి కోస్తాంధ్ర పండిత కవులను మించిన కవిత్వం రూపొందింది. పశుల పిలగాని కన్నీళ్లను పెన్నులో ఒంపుకున్న సుద్దాల ప్రజలను పోరాటానికి సిద్ధం చేస్తున్నడు. “చేయెత్తి జైకొట్టు తెలుగోడా” బాణీలో…
“రణభేరి మ్రోగింది తెలుగోడా
రావోయి ముందుకు మొనగాడా
ఆంధ్ర వీరులు బాలచంద్రులై లేవాలి
మగువలందరు రుద్రమాంబలై కదలలి” (ఉద్యమ గీతాలు.పు.167)
అక్షరాలు రాని బండి యాదగిరి యుద్ధగీతాన్ని అల్లాడు. తెలంగాణను మండించాడు. ముందుకు ఉరికించాడు. బండ్లు కట్టించాడు. బారులు తీయించాడు. ఉద్యమమే అతని పాటకు జీవమైంది. నైజామును పైజామ ఊడతీసి పరిగెత్తించిన ఘనత అతని పాటదే.
“చుట్టు ముట్టు సూర్యపేట
నట్టనడుమ నల్లగొండ
అవలా హైద్రాబాదు
తరువాత గోలకొండ
గోలకొండా ఖిల్ల కిందా నీ
గోరికడ్తం కొడకో
నైజాము సర్కారోడా!”
(బండి యాదగిరి – తెలంగాణ పోరాట పాటలు.పుట.96)
పాటకు తీసుకున్న వస్తువే కాకుండా ఎన్నుకున్న శిల్పం కూడా ప్రజలది కావటం వలన విశేష ప్రచారం పొందింది. ఆ కాలంలోఇలాంటి మిలిటెంట్ పాట మరొకటి లేదు. పాటంతా ప్రతీకలతో ఉంది. ఇదే కాలంలో పోరాటంలో ఒరిగిన అమరులపై కూడా పాటలొచ్చాయి.
“అమరజీవివి నీవు కొమురయ్య!
అందుకో జోహార్లు కొమురయ్య!
న్యాయమన్నది లేని నైజాం రాజ్యాన
విశ్వ రాక్షసుడైన విసునూరు దేశముఖు
… … … … … …
ప్రజల హక్కుల కొరకు కొమురయ్యా!
ప్రాణాలనిచ్చావు కొమురయ్యా!”
(రాంభట్ల కృష్ణమూర్తి – అదే పుట.212)
తెలంగాణ రైతాగ సాయుధ పోరాట కాలంలో పాట ప్రధానమైన సాహిత్య రూపంగా వచ్చింది. 1951 అక్టోబర్లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. విప్లవ శక్తులు బాధపడ్డాయి. నైరాశ్యం వచ్చింది. 1966 కాలంలో ప్రపంచమంతా తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చింది. ఈ ప్రభావం తెలుగు కవులపై పడింది. ఇంకోవైపు శ్రీకాకుళ గిరిజన పోరాటం తీవ్ర అణచివేతను అనుభవించటం, సుబ్బారావు పాణిగ్రాహి వంటి కవులు అమరత్వం పొందటం తెలంగాణ కవులపై ప్రభావం వేసింది. “శ్రీకాకుళ విప్లవోద్యమం సాహిత్యరంగంలో నూతన సంప్రదాయాల్ని ప్రవేశపెట్టింది…… ఈ ఉద్యమ పాటలు , గేయాలు, కథ, నవల మొదలైన ప్రక్రియల రూపాల్లో కూడా వెలువడింది” (రాందాస్ – శివసాగర్ ఉద్యమ నెలబాలుడు పరిశీలన-పుట7) శ్రీకాకుళ పోరాటం తాత్కాలికంగా అపజయాన్ని పొందాక 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘం ఏర్పడింది.ఈ సంస్థ ఏర్పాటులో తెలంగాణ కవుల పాత్ర అద్వితీయమైనది. శ్రీకాకుళంలో ఆగిన నక్సల్బరి పోరాటం తెలంగాణలో ప్రారంభమైంది. ఈ పొరాట ప్రభావంతో విప్లవ రచన తెలంగాణలో ఊపందుకుంది. ఈ ప్రాంతంలో విప్లవ రచనకు ముఖ్యంగా పాటకు పునాది వేసినవాడు చెరబండరాజు. ‘చెర పాటలలో అతి తేలికైన మాటల్తో రాసిన పల్లవులే క్రమంగా నినాదాల రూపాన్ని సంతరించుకుని ఈనాటికీ గోడల మీద దర్శనమిస్తుంటాయి.”(అదే.పుట.10)
“విప్లవాల యుగం మనది
విప్లవిస్తే జయం మనది”
పాట ప్రసిద్ధి పొందింది. దిగంబర కవిగా ప్రారంభమైన చెర ప్రతిభావంతమైన వచన కవి కావడం వలన పాటను అంతే ప్రతిభతో రాశాడు. శివసాగర్ విప్లవ పాటకు పునాది వేశాక ఆ ప్రభావంతో ప్రజల వద్దకు వెళ్లాలంటే పాట బలమైన సాధనమని భావించాడు.
“కొండలు పగిలేసినం
బండలను పిండినాం
మా నెత్తురు కంకరగా
ప్రాజెక్టులు కట్టినాం
… … … … … …
మగ్గాలను పెట్టినాం
పోగు పోగు వడికినాం
మా నరాలే దారాలుగా
గుడ్డలెన్నో నేసినాం
… … … … … …
కారణాలు తెలిసినాం
ఆయుధాలు పట్టినాం
మా యుద్ధం ఆపకుండా
విప్లవాలు నడిపెదాం:(చెరబండరాజు పాటలు)
పాటలో విప్లవ ప్రజల వస్తువుంది. జీవితముంది. సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మార్గం ఉంది. ఇంత స్పష్టంగా ప్రజల బాణీలో పాట రావటం ఉద్యమ పాటలలో బండి యాదగిరి తరువాత చెరబండరాజుదే. ఇద్దరు నల్గొండ జిల్లావాసులు కావటం యాదృచ్ఛికం.
“రాయిరప్పకు
చెప్పనా నాగోడు
నేనే రాయై పోదునా
కూలీ కోసం తాను ఎదురు తిరిగితేనే
నక్సలైటువాని కాల్చిచంపినారు” (అదే)
అంటూ శ్రమజీవుల బాధలను చెర గానం చేశాడు. ప్రకృతిలోని ప్రతీకలను తీసుకొని రాయటం వలన శ్రమజీవుల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పాడు.
చెర పాటల ప్రభావంతో చాలామంది పాటగాళ్లు తయారయ్యారు. గద్దర్ ఈ ప్రభావం లో వచ్చిన వాడే “ఆపుర బండోడా /బండెంట నేనొస్తా “అనే పాట”ఆపుర రిక్షోడా /రిక్షెంటా నేనొస్తా” అని మార్చటానికి చెర ప్రభావమే కారణం. అంటే ప్రజల పాటను విప్లవ పాటగా మలిచే క్రమాన్ని గద్దర్ నేర్చుకున్నాడు. కొన్ని వందల పాటలు రాశాడు. ఏ సమస్యను వస్తువుగా స్వీకరించిన దానిని ప్రజల్లోకి పంపించడానికి తపనపడి గొప్ప కళాఖండంగా మలిచేవాడు. అమరవీరులపై రాసిన పాట దుఃఖ రసంలో అందరినీ ఏడ్పిస్తుంది.
“కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం
ఎవ్వరొస్తరొ చెప్పుమాని తొవ్వచూస్తూ నిలుచుంటం
మీరు కాకమ్మలయ్యి వస్తరా మా బిడ్డలూ
మా కడుపు తీపి తీర్చిపోతారా” (జననాట్యమండలి.పుట.182)
ఈ పాటలోకి తల్లి తర్జుమా అయింది. కాకి, ఆవు, కోడిపుంజు, కుక్కపిల్ల, జొన్నకంకి ప్రతీకలుగా గద్దర్ చిక్కటి కవిత్వాన్ని అల్లాడు. పిల్లి అడుగులై కొడుకులు తల్లితో దోబూచులాడటం అందరిని కరిగిస్తుంది. ఇట్లా పాటకు పర్యాయపదమాఇన గద్దర్ నడుస్తున్న పాట. కథాపురుషుడు (లెజెండ్). వెన్నులో తూట కదులుతున్న రాగాన్ని రాజేస్తాడు. శరీరాన్ని పాటగా మార్చి పాలకవర్గాలపైకి ఎక్కు పెడుతున్నాడు. మధ్యతరగతి, పేదలకు, ధనవంతులకు అన్ని సెక్షన్ ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో పాటలు రాసి తెలంగాణను మండించిన వాగ్గేయకారుడు.
“నీ కన్నీరు నా కాన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయె
ఒంటిగా ఓ శోకం బెట్టే చిన్నితమ్మయ్య
నీజంటగా నేనుంటా రారా చిన్ని తమ్మయ్య….
నీళ్ల పంపె తల్లయిసాకెనా చిన్నితమ్మయ్య”(అదే.పు.93)
బాల కార్మికుడి జీవితాన్ని ఆవిష్కరించిన సాహు తెలంగాణ పాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన రాసిన ఒకే ఒక పాటతో హృదయాల్లో గూడుకట్టుకున్నాడు. విప్లవోద్యమానికి ఉండే విస్తృతి వలన పాట ప్రజలలోకి చొచ్చుకెళ్లింది. హోటలల్లో, రోడ్డుమీద, పార్కులల్లో, రైల్వే ఫ్లాట్ ఫాంపై బిక్కమొహం వేసుకొని అమాయక ఆకలిచూపులు చూసే పసిపిల్ల జీవితానికి ఆ పాట దృశ్యరూపం.
తెలంగాణలో విప్లవోద్యమ ప్రభావంతో సమాజంలోని ప్రజా సమూహాలు ప్రశ్నించటం నేర్చుకున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో దళితులపై దుర్మార్గ దాడులు జరగనప్పటికి స్పందించే గుణమున్న కవులు దళిత పాటను అందుకున్నారు. దళిత ఉద్యమానికి కూడా పాటనే ప్రధానమైన వాహికగా మారింది. ఒకవైపు విప్లవోద్యమ పాట విస్తృతమగా సాగుతుంటే మరోవైపు పాటను బలంగా వినిపించిన వాడు మాస్టార్జీ. దళిత కళామండలిని స్థాపించి వందల పాటలను వెలుగులోకి తెచ్చాడు.
“దేశం నీదన్నాగాని
రాజ్యమడగమన్నానా
దళితుడ ఈ దేశాన్ని
నిన్నేలొద్దనా” (మాస్టార్జీ పాటలు)
అంటూ అగ్రకుల పాలకనీతిని ప్రశ్నించాడు. ఊళ్లో దళితుడు చదువుకోని శుభ్రంగా ఉంటే అగ్రకుల దొర సహించడు. వీడెవ్వడని ప్రశ్నిస్తాడు.
“ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు
ఏడికెళ్లి వచ్చిండు ఏమైతడు నీకీడు
ఈని కోసమే నిన్ను ఇంట్ల కెళ్లి పిలిపిస్తి”(అదే)
దొరల సహించరాని తనాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగితే దళిత యువకుడిని మాస్టార్జీ సృష్టించాడు. దళిత ఉద్యమ ప్రభావంతో అంబేద్కర్ ఆలోచన విధానంతో చాలామంది కవులు పాటలు రాశారు. కలేకూరి ప్రసాద్, గోరటి ఎంకన్న లాంటి వారు దళిత జీవితాన్ని చిత్రిస్తూ వందల పాటలకు జీవం పోశారు.
1951లో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది. 1969లో తెలంగాణ విద్యార్ధి ఉద్యమం అణిచివేయబడింది. ప్రజల ఆకాంక్షలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రత్యేక తెలంగాణ ఎజండా మీదికి ప్రతీసారి వస్తూనే ఉంది. 90 వ దశకంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది. 1946లో ఎట్లైతే విస్తృత ప్రజాసాహిత్యం వచ్చిందో ఇపుడు అంతకు రెట్టింపుగా వాసిలో రాసిలో పరిపక్వత సాధించింది. వందల మంది కొత్త కవులు పుట్టుకొచ్చారు. వందల గొంతులు పల్లవిని అందుకుంటున్నాయి. ఉద్యమం కూడా స్థిరంగా అభివృద్ధి చెందుతున్నది. ఒకప్పుడు తెలంగాణలో వచ్చిన విప్లవ, దళిత ఉద్యమాలలో ప్రముఖ రచయితలుగా, కవులుగా వెలుగొందిన వారందరూ తెలంగాణ డిమాండ్పై పాటలు రాస్తున్నారు. ఈ దశకంలో కొత్తగా పుట్టుకొచ్చిన పాట రచయితలు అందెశ్రీ, నాగరాజు, దయానర్సింగ్, మిత్ర మొదలైనవారు.
విప్లవ వాగేయకారుడు గద్దర్
“నా తల్లి తెలంగాణరా!
తిరగబడ్డ భూమిరా” అంటూ తెలంగాణ బాధను గాధను
“ధగాపడ్డ మా తెలంగాణమూ
గుండె సప్పుడినుడో మాయ్న్నలారా”
(ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు – పుట.46)
అంటూ వినిపించాడు. ప్రముఖ తెలంగాణ వచన కవి నందిని సిధారెడ్డి తెలంగాణ కోసం పాటను రాశాడు.
“నాగేటి చాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ
నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ
పారేటి నీళ్లల్ల పానాదులల్ల
పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల
కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ” (అదే.పు.35)
కవిత్వమే పాట. పాటే కవిత్వం. ఇదే అసలైన ప్రజాసాహిత్యం. అట్లాంటి పాటను రాసినవాడు సిధారెడ్డి. ఈ పాట గత పదేండ్లుగా తెలంగాణంతటా నాగేటి చాళ్లలో విత్తనమై మొలకెత్తుతున్నది.
‘ఊరుమనదిరా/ ఈ వాడ మనదిరా’ అంటూ దేశమంతా మారుమ్రోగిన గూడ అంజయ్య
“ఏముంది ఏముందిరా నా తెలంగాన పల్లెల్ల
మన్ను మూడు కుప్పలింకేమి మిగిలిందిరా….
ప్రాణహిత పెనుగంగ – మానేరు మంజీర
కృష్ణమ్మ గోదావరి – పరవళ్లు తొక్కంగ
నారుమడి తడువదాయె నా తెలంగాణ
నోరెండి పోతుందిరో” (అదే పు.7)
అని నెర్రెలు బారిన భూమి బాగోతం చెప్పాడు. రెండు జీవనదులు పారే ఈ నెలలో జీవగంజికి నీళ్లు లేకపోవటాన్ని చిత్రించాడు. అయితే తెలంగాణ ఇపుడు ‘పొలికేక పెడూతున్నదనీ తొడగొట్టాడు.
గోరటి ఎంకన్న ఈ కాలంలో ఊరే పాటల ఊట. పశుల సంతలో తప్పిపోయిన లేగదూడ లాంటి తెలంగాణను మనస్సు నిండా నింపుకొని గల గల పాడుకుంటూ తిరుగుతున్న ప్రజాపాటగాడు. తెలంగాణ చెదిరిపోయిన పక్షుల వలె ఉందంటున్నాడు.
“రేలా దూలా తాలెల్లేలాడెనేలో నా తెలంగాణ
సుడిగాలికి సెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ” అని బాధపడి ఒకప్పటి తెలంగాణ అందాలను ఆరబోశాడు.
“కొట్టమెక్కి కోడిపుంజు – కొక్కరొకో అని కూతలు పెడ్తది
కొమ్మల సివర కూసిన కోయిల – కమ్మని రాగాలనిపిస్తుంటది
గంటలూపుతూ బాలసంతలు – ఇంట ముంగిట దీవెనలియ్యగ
సెంగు సెంగున లేగదూడలు – అంబా అంటు పరుగులు పెట్టగ”
మనుషుల, పక్షుల, పశువుల, వాగుల , వంకల సమష్టి జీవనం కలిగిన పల్లెను ఎంకన్న ఆవిష్కరించాడు. కాని ఆంధ్ర పాలన వలన ఆ పల్లె రూపం మారిపోయిందంటాడు.
“ఊటబావి మోట గిలకేది – నా పల్లెలోన
దాపటి వొలుపటెద్దుల తల్లారేది నా పల్లెలోన” అని ఆవేదనతో ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. పాలకులను నిలదేస్తున్నాడు. బుద్ధి జీవులను ఆలోచించమంటున్నాడు.
అందెశ్రీ. దండోర కూత లాంటి గొంతు. వేల సంవత్సరాలుగా మాట్లాడనివ్వని వ్యవస్థపై తిరగబడి ఒకేసారి వెయ్యిగొంతులు కలిసి ప్రశ్నించినట్లు పాటను ఎక్కు పెడుతాడు. సంస్కృత పద బంధాలతో పోలికలతో పాటను అల్లుతో పండితులతో పోటీ పడుతాడు.
“చూడు తెలంగాణ చుక్కనీళ్లు లేనిదాన
నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైనవీణ” నీళ్ల కోసం ఆరాటం. పోరాటం. నేటి తెలంగాణ అవసరం. మానవ ఉనికికి జీవధార నీరే లేకపొతే బ్రతుకెట్ల?
“రెండు జీవనదులు కలిసి నిండుగ ఇల పారిన స్వర్ణాంధ్ర సాకులతో తెలంగాణ మారెనా” (అదే.పుట.65) అని ప్రశ్నించి గుండె పగిలి కన్నీళ్లతో మండే ఆకలి కేకలు వేశాడు.
ఎపుడో విప్లవ ప్రచారం కోసం పాటలు రాసి ఆపేసిన వరవరరావు చేత కూడా తెలంగాణ పాట రాయించింది. కంచు కంఠంతో వినేవారిని మంత్రముగ్ధులను చేసే ఆయన పాడలేకున్న రాయగలడు. నలభై సంవత్సరాలుగా తెలంగాణ చరిత్రకు ఆయనొక సాక్షి. తెలంగాణ దోపిడికి సాక్ష్యం చెప్పటమే కాదు. ఆయన బాధితుడుగా కూడా మాట్లాడుతున్నాడు. రాస్తున్నాడు.
“బీడుపడ్డ భూముల్లో జీవనదులు మళ్లించి
ఆకలి దప్పులుతీర్చే తెలంగాణ కావాలే… …
సింగరేణి గనుల్లోన చిందిన చెమటే సింగిణి
రంగుల బతుకై వెలుగగ తెలంగాణ తేవాలి” (ప్రజాకళామండలి పాటలు- పుట. 103)
భౌగౌళిక కాదు. ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని వి.వి.స్పష్టంగా చెప్పాడు. దొరలు మారితే ప్రజలకు ఒరిగేది శూన్యమని 40 ఏండ్లుగా మాట్లాడుతున్నాడు. ఇపుడు గాత్రమై మొత్తుకుంటున్నాడు.
మిత్ర. ఈ పేరు వినగానే ఒక కవి, గాయకుడు గుర్తుకొస్తాడు. గత అయిదేళ్లుగా తెలంగాణను విమల డప్పుల దరువు వేయిస్తున్నది. ఆమె లయబద్దమైన గొంతులో, అడుగులో, మిత్ర రాసిన
“ఆడుదాం డప్ప్పుల దరువేయరా
తల్లి తెలగాణ పాట పాడుద్దాం…
ఎటు చూసినా ఈటీవీల లొల్లే గదరా
మన పని పాటలన్నిటిపై దాడేగదరా ”
(ధూం ధాం దరువు క్యాసెట్ నుంచి)
ఒక సంస్కృతిని మరో సంస్కృతి ఎట్లా మింగుతుందో ఈ పాట చెప్పింది .ఆధిపత్య సంస్కృతే రాజ్యమెలుతుందని చెప్పింది.
బహుశా తెలంగాణా ఉద్యమం సృష్టించినన్ని కలాలను-గళాలను విప్లవోద్యమం తరువాత మరే ఉద్యమం సృష్తించలేదు. ఈ ఉద్యమానికి ఉన్న సాంఘిక,ఆర్ధిక,రాజకీయ కారణాలు చాలా బలమైనవి కావటం వలననే ఇది సాధ్యమైనది.
అయితే 1940ల నాటి తెలంగాణ సాయుధ పోరాటం నాటి పాటలకు ఈనాటి పాటలకు వస్తువు, శిల్పం, రూపం రీత్యా చాల తేడా ఉంది. ఆనాడు పద్య శైలి నుంచి చాలా మంది కవులు బయటపడలేదు. సుద్దాల, బండి యాదగిరి, తిరునగరి మినహాయిస్తే అందరు పద్య, సంస్కృత పదాలతో పాటలు రాశారు. కాని ఇవ్వాల అందెశ్రీ మినహాయిస్తే ఎవ్వరు కూడా పద్య వాసనలకు పొవటం లేదు. సంస్కృత పద సంబంధాల్ను ముట్టుకోవటం లేదు. వదిలేసిన పోలికల జోలికి వెళ్లటం లేదు. ప్రతి కవి కొత్త డిక్షన్ తో, పోలికలతో బలంగా రాస్తున్నాడు. ఇది మౌలికంగా నేటి పాటకున్న తేడా.
ఉద్యమ పాటలపై వచ్చిన పరిశోధనలు
ఇప్పటి వరకు ప్రజాసాహిత్యం – ఉద్యమ పాటిలపై పరిశొధనలు చాలా పరిమితంగా వచ్చాయి. అకాడమిక్ రంగంలో విశ్వవిద్యాలయాలు, సామాజిక రంగంలో సంస్కృతి, రచయితల సంఘాలు కొంత మేరకు పాటపై పరిశోధనకు అవకాశం కల్పించాయి. ఉద్యమ పాటల్లో పాండిత్యాన్ని ఆశించే ఇప్పటి వరకు అకాడమిక్ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. అధికార పీఠాలలో ఉన్నవారికి పాట పట్ల చిన్న చూపు ఉండటం కూడా పరిశోధనలు రాకపోవడానికి కారణం. ప్రజల కోసం – ప్రజల సాహిత్యం అనే సంస్థలు మాత్రమే ప్రజాసాహిత్యం పట్ల నిజమైన పరిశొధనలు చేస్తున్నయి. వాటికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏస్థాయిలో జరిగే పరిశోధనైనా సామాజిక ప్రయోజనాన్ని ఆశించి జరిగితే బాగుంటుంది. ఉద్యమ సాహిత్యం లేదా పాట అనేసరికి ఆ భావజాలంతో పడనివాళ్లు వాటి పరిశోధనంటే ఇష్టపడటం లేదు. ఇన్ని పరిమితులలో కొంత మెరకు పరిశోధనలు జరిగాయి.
-
తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజాసాహిత్యం(సిద్ధాత గ్రంధం)
- జయధీర్ తిరుమలరావు(ఓ.యు.1988) -
తెలంగాణ పోరాట పాటలు
సంకలనం – జయధీర్ తిరుమలరావు -
తెలుగులో ఉద్యమ గీతాలు (సిద్ధాంత గ్రంధం)
డా”ఎస్వీ సత్యనారాయణ(ఓ.యు) -
గద్దర్ పాటలు – పరిశీలన (సిద్ధాంత వ్యసం)
- కె.సురేశ్ కుమార్ (సెంట్రల్ యూనివర్సిటి 1990) -
శివసాగర్ ఉద్యమం నెలబాలుడు పరిశీలన (సిద్ధాంతవ్యాసం)
- రాందాస్ కె. (సెంట్రల్ యూనివర్సిటి 1990) -
మాస్టార్జీ దళితగీతాలు – మూల వాసి సిద్ధాంతం (సిద్ధాంత వ్యాసం)
- మద్దెల రాజు (తెలుగు విశ్వవిద్యాలయం – 1997) -
వంగపండు జానపద పాటలు (సిద్ధాంత వ్యాసం)
- పిడతల అప్పారావు ( అంధ్ర విశ్వవిద్యాలయం – 1999) -
తరగని గని
- గద్దర్ (జననాట్య మండలి 1992)
ప్రజల పాటలు -పరిశోదన అవకాశాలు
“ఉత్పత్తి పరాయిదైనప్పుడు శ్రమ ,శ్రమ సృష్టించిన సామాజిక సంబందం నుంచి పుట్టిన కళలు,విజ్ఞానం,సాహిత్యం,సంస్కృతి కూడా భూస్వామ్య పెట్టుబడి దారుల సొత్తుగా మారుతాయి” (జయధీర్ తిరుమలరావు -ప్రజాసాహిత్యం పుట.2)ప్రజా సాహిత్యం,పాట పరాయీకరణ చెందింది.
-
ప్రజల పాట పరాయీకరణ చెందిన పద్దతిని పరిశోదించాలి.
-
ప్రజల పాటలలో విశ్రాంతి వర్గాల పాటలు ఒక విధంగా ఉంటాయి.శ్రామిక వర్గాల పాటలు మరోవిధంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని చెప్పి పరిష్కరించే పరిశోధనలు జరిగాలి.
-
ఆర్ధిక,రాజకీయ,సాంస్కృతిక రంగాలలో ఆధిపత్య వర్గాల భావాలే చలామణి అవుతుంటాయి.ఈ మూడు రంగాలు వీరి ఆలోచనల మేరకే నడుస్తుంటాయి. అంటే మెజార్టీ ప్రజల సాంస్కృతిక విలువలు బయటకు రాకుండా ఉంటాయి.ఈ ప్రత్యామ్నాయ సంస్కృతిని శోధించి పెట్టాలి.
-
శ్రమజీవుల పాటల బాణీలను తీసుకొని నోములకు,వ్రతాలకు,వినోదానికి,ఉద్యమాలకు అనువుగా మార్చుకుంటారు.ఇట్లా మారటం వలన ఉద్యమాలు మినహాయిస్తే మిగతా రంగాలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. లిఖిత సాహిత్యానికి,పాటకు మూలమైన ప్రజల బాణీలను,పాటలను విశ్లేషించవలసిన అవసరం ఉంది.
-
ప్రజలు అల్లిన ప్రతి పాటలో కవితావాతావరణం వుంటుంది.చుట్టూ ఆకులు కదలటం,చెట్లు ఊగటం మొదలైన ప్రకృతి పాటలోకి ఎట్లా వస్తుందో పరిశీలించాలి .
-
జానపద సాహిత్యంలో పరిశోధనలు చేసినవారు స్త్రీల పాటలన్నింటిని ఒకేవిధంగా చెబుతారు. కాని శ్రామికస్త్రీల పాటలు వేరు,విశ్రాంతి వర్గాల స్త్రీల పాటలు వేరు. శ్రామిక వర్గంలో కూడా కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి పాటలుంటాయి. వారి చైతన్యాన్ని బట్టి వస్తువు ఉంటుంది.వీటన్నింటిని ఒకేమూసలో చూడటం వలన ప్రజాసాహిత్యంలో కొత్తచూపు రాలేదు .ఈ ఏరియాలో పరిశోధనకు అవకాశం ఉంది.
- ఉద్యమ పాటలు పుట్టడానికి ప్రతిపాటకు ఒక కథ ఉంటుంది. చరిత్ర మరుగున పడిపోయిన ఆ కథలను పరిశేలించి వెలుగులొకి తెస్తే చరిత్ర రికార్డ్ అవుతుంది.”శ్రమజీవుల పాటనుండి చరిత్రను తవ్వి తీయడం తప్పనిసరి అంశమైంది.” (జయదీర్ తిరుమలరావు-ప్రజాసాహిత్యం-పుట.క్షీ)ఈ తప్పనిసరి పనిని నేటి పరిశోధకులు చేపట్టాలి.
- పాలమూరు జిల్లాలో ఉండే ప్రజల పాటలకు-ఇతరజిల్లాల్లో ఉండే పాటలకు తేడా ఉంటుంది.ఈ తేడాను సూక్ష్మంగా పట్టుకొని పరిశోదించాలి.అక్కడి పాటలపై కర్నాటక ప్రభావం శైవమత ప్రభావం ఉంటుంది.కరువు,వలసలు,సంస్థానాలు ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుంది.వాటి నుంచే పాటలు పుడతాయి.ఇట్లా వాటి వెనక ఉండే సామాజిక,ఆర్ధిక,రాజకీయ కోణాలలో విశ్లేషణ జరగాలి.
- మిగ్ పాప,చిర్రా,చిటికెన పుల్ల,బండ పరుపు మొదలైన పదాలు నిఘంటువులలో లేవు.ప్రజల పాటలను ఈ కోణంలొ పరిశీలించాలి
- పురాణ ఇతిహాసాలలో ఉండే గొప్ప పాత్రలు ప్రజల పాటలలో విలన్స్ గా ఉంటారు.విలన్ పాత్రలు హీరోలుగా ఉంటాయి.ఈ తలక్రిందులైన చరిత్రను పునర్ మూల్యాంకనం చేయాలి
ఉదా: “ఇంటివే రావణా రాంబాణము
అన్నకు తమ్ముడు అందించే బాణము”పాట రాముడికి వ్యతిరేకంగా రాసింది. రావణాసురునికి అనుకూలమైంది.
“రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
వాలి సుగ్రీవులు యుద్దమాడరాంగ రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
ఎనక నుండి రాముడు ఏసెను బాణము రావణ ఉయ్యాలో దేవణ ఉయ్యాలో”
“ఆయుధమును వేసితి
జానకి శిరము అధ్భుతముగా
దృంచితి”(గోరటిఎంకన్నతో సంభాషణ ద్వారా)సీతను చంపి రమ్మని రామాయణంలో లేదు. అడవిలో వదిలి రమ్మని ఉంది. కాని జానపదుల పాటల్లో చంపినట్లు ఉంది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించే పరిశోధనలు జరగాలి.
రాగాలుతీస్తుంటే
ఆ కంచు గొంతుకు
ఆకాసాన పొయే కాకి చెవ్వెట్టినే
యాపకొమ్మలు కదలాడు”
ప్రజా సాహిత్యం సముద్రం లాంటిది. ఈ ప్రజలు, వారి సాహిత్యం లేకపొతే మానవ నాగరికత, సంస్కృతి వికసించేవి కావు. చరిత్ర తెలిసేది కాదు. మట్టి చేతులతో మల్లె పువ్వులాంటి మెతుకులను అందించినట్లే, కంచు కంఠాలతో చెవులకు ఇంపైన పాటను వినిపించారు. ఆపాటలో జీవితమున్నది. ఉత్పత్తి ఉన్నది. ఆరాటమున్నది. పోరాటమున్నది. చదువుకున్న మనమంతా జ్ఞానం పొందామని అనుకుంటూ అజ్ఞానంలో జీవిస్తాం.వారు అజ్ఞానులమనుకుంటూ విజ్ఞానంలో జీవిస్తారు. మనకున్న కొద్దిపాటి జ్ఞానానికి మూలం ఆ శ్రమజీవులే. “కనిపించని శక్తులేవో నడిపిస్తే నడిచే మనుషులం.” జ్ఞానం సృష్టించి అజ్ఞాతంగా జీవిస్తున్న ఆ మనుషులగురించి తెలుసుకోవడానికి పరిమిత జ్ఞానంతో రాసిన నా వ్యాసం పనికొస్తే సంతోషం. మట్టి చేతులకు నమస్కరిస్తూ ……..
జ్ఞాపికలు
-
తరగని గని-గద్దర్
-
తెలంగాణ రైతాంగ పోరాటం-ప్రజాసాహిత్యం-జయధీర్ తిరుమలరవు
-
గద్దర్ పాటలు-పరిశీలన-కె.సురేష్ కుమార్
-
శివసాగర్ ఉద్యమం నెలబాలుడు పరిశీలన -రాందాస్.కె
-
తెలంగాణాపోరాటపాటలు-జయధీర్ తిరుమలరావు
-
తెలుగులో ఉద్యమగీతాలు-డా:ఎస్వీ సత్యనారాయణ(ఓ.యు.)
-
జననాట్యమండలి పాటలు-1990
-
ప్రజా కళామండలి పాటలు-2007
-
ప్రత్యేక తెలంగాణా పోరాటపాటలు-ప్రజా కళామండలి
-
ప్రజా కళామండలి పాటలు-2003
-
గోరటి ఎంకన్నతో సంభాషణ
-
జయధీర్ తిరుమలరావు తో సంభాషణ
(సమాప్తం )
-
సి.కాశిం: లెక్చరర్, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఓరియంటల్ కళాశాల, తిలక్ రోడ్, హైదరాబాద్.
4 అభిప్రాయాలు »వీడియో / ఆడియో, సాహిత్య వ్యాసాలు
pentaiahveeragoni Nov 20, 2009 1
కాసీమ్ రాసిన తెలంగాన్ ఉద్యమం పాట్ చదివిన తర్వత అతడు తెలుగు సహిత్య ఉద్యమం ళో ఛేశీన క్రుషి అర్థం అవుతున్నది.చా లా బాగా ఉంది.ఎటువంటివి ఇంకా రావాలి.పెంటయ్య వీరగొని
pentaiahveeragoni Nov 20, 2009 2
ఒక సూచన; రచయితల మెయిల్ అడ్ర్ స్ ఉంటె బాగా ఉంతుంది.డెయ్ర్క క్ట్ గా వాల్లతొ మాటాలాడవచు.పెంటయ్య
satish kumar Mar 27, 2010 3
చాలా బాగా సమాచారము సీకరించారు.తెలుగువారిని చారిత్రకముగా విభజన చెయుము కానీ తెలుగు వారి బాన్ధవ్యాలను వేరుగా చూపొద్దు.దయచేసి తెలుగువారందరు ఒకతేనని చాతుదాము.జై తెలుగు తల్లి.
సతీష్ కుమార్
9290578092
chittoor.s.Murugeshan Jun 23, 2010 4
1.తెలంగాణ వస్తే ప్రభుత్వాల ఆదాయంలో ఏ మార్పూ ఉండదు. కాని ప్రభుత్వాలు రెండవడం చేత ప్రభుత్వ నిర్వహణా వ్యయం మాత్రం రెట్తింతలవుతాయి.
2.ఇంత కాలం రాజదానిగా ఉన్న హైదరా బాదు పై రాష్ఠ్ర్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులు ఒక రాష్ఠ్ర్రానికి స్వంతమై ఇతర ప్రాంతాలవారికి అన్యాయం జరుగుతుంది.
3..రాష్ఠ్రాలు రెండైతే ఆల్ కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ( తెలంగాణా మరియు సీమాంద్ర ) ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా
5.తెలంగాణ వచ్చిన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టి విపరీతమైన భలం పొంది ఇతర పార్టీల పరిస్థితి నేటి ప్రజా రాజ్యంలా అవుతుంది (తెలంగాణా శాఖ). ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు
6…ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే ఆంథ్రుల ఆత్మగౌరవం ఇక కల్లే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ప్రభుత్వ ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాణ ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి, తమ నిర్ణయాన్ని అడుగడుగున మార్చుకునే నైజం గల నేత కాబట్టి కాంగ్రెస్లో విలీనమైనప్పటికి మళ్ళీ విడి పడవచ్చు, దీంతో ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలు కూలడం, ఎన్నికలొచ్చి అదనపు భారం పడటం వంటివి జరిగే ప్రమాదం ఉంటుంది
11.తెలంగాణ ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గుగ్గి పాలే. ఇప్పటికే పొరుగు రాష్ఠ్ర్రాలతో జలవివాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సుప్రీం ఆదేశాలను సైతం అవి లెక్క చెయ్యడం లేదు. ఈ పరిస్థితిలో కొత్తగా ఒక రాష్ఠ్ర్ర్రం , ఆ రాష్ఠ్ర్రం తోను జల వివాదాలు అవసరమా అని ఆలోచించాలి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు తలపెట్టే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని ఆ కార్యక్రమ నిర్వాహకులు తల పట్టుకునే పరిస్థితి వస్తుంది.( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరినీ పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14విపరీతమైన ద్వేషం, వైరంతో విడి పోతున్నారు కాబట్టి .తెలంగాణాలో తయారైన వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది.
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, జడివానలు మొదలైతే 4 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత పాలనలో వై.ఎస్. అమలు చేసిన సంక్షేమ పథకాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలు గాలిలో కలిసి పోతాయి.