Jul2009
వ్యవహారం
కావిలించుకుంటే ఏంది?
కడుపులో లేనిది వొస్తదా?
యియ్యాల్లటికైనా
కపటం బయటపడింది
కండువలు మార్చుకోగలవ్
నుదుటిమీద గుర్తులు మార్చుకోగలవ్
కూర్చిమీద కూచోని కూసేకూతలు మార్చుకోగలవ్
కడుపుల లేనిదెట్లా వొస్తది
ప్రతిజ్ఞలు పాదరక్షలంత
కాలం గడిచిన కొద్దీ అరిగిపోతయ్
మరువగలనా
ముద్దాడి ముద్దాడి
గుండెలమీద తన్నినవు
జెండాకు ప్రాణమద్ది రెపరెపలాడిన
నా ఆత్మను తునకలు తునకలు చేసినవు
రాతలు నీటి అలలంత
గాలి వీచినకొద్దీ పాతబడుతయ్
మరువగలనా
నడిఎండలో
పడిపడీ పాదయత్ర చేస్తే
మనిషిని నమ్మాలెగద నమ్మిన
పాదాలకు కళ్ళుంటయంటరు
పాదయాత్ర చూపంతా
భూముల ఆక్రమణ వ్యూహమని
గుర్తించలేదు
నమ్మాలెగద నమ్మిన
తానమాడెతందుకు నది దించిన
నీ పాపిష్టి నయనాలు
నా జీవనదుల మీద సంధించావని
గుర్తించలేదు
మనిషిని గద
మనిషిని నమ్మాలెగద
బంగారు చంచతో పుట్టినవట గద
వొడలి పోయిన ముఖంతో వొగరుస్తుంటే
పాపమని తలిచాను
అలిసిన దేహానికి
నామామిటతోట తడి బట్టలతో
సపర్య చేసి అన్నం వడ్డించాను
అన్నం పెట్టిన చెయ్యిని మరువొద్దంటరు
నా చెయ్యి నరికి
అన్నం నీ కోటకు తరలిస్తానని
గుర్తించలేదు
ఏదో దేవిపెడతవని ఎదురుచూసిన
ఓపిక పట్టాలెగద
నాదేదో నాకు పంచి
నాకల సాకారం చేస్తవని ఓపిక పట్టిన
కుర్చీ ఎక్కినవుగద
ఐదేండ్లు ఆరొక్క గోసపెట్టినవ్
కనబడని సొరంగాలు జలతరంగాలు మలిపినయి
నీళ్లు రాని కాలువలు నా ఖజాన కొల్లగొట్టినయి
వృత్తులు ఆత్మహత్య చేసుకొంటే
వెటకారపు నవ్వులు నవ్వినవు
మనిషిని గద
నువ్వు మనిషివి కావని గుర్తించాను
నా కలలు కూల్చిన
నీ వెర్రినవ్వు గుర్తించాను
మనిషికి ఓపిక నశిస్తుంది గద
నశించింది
కోపం వొస్తదిగద
ముక్కోటి హృదయాల కోపం
వెటకారపు నవ్వుకు బదులు తీర్చుకుంటుంది