Aug2009
అచ్చమైన మనిషిలా మిగిలిపోతాం
ఉద్యోగ రీత్యా బదిలీ అయి గత ఏడాది డిసెంబరు 8 న ఉదయం హైదరాబాదుకు వచ్చాను. నేరుగా మిత్రుడు గోపిని కరుణాకర్ ఇంటికి వచ్చాను. తర్వాత జూబ్లీహిల్స్ లోని మా ఆఫీసు కార్యాలయానికి వెళ్ళాను. నేను హైదరాబాదులో రైలు దిగినప్పటినుంచీ ఆఫీసుకు చేరే వరకు కనీసం ప్రతి అరగంటకోసారైనా కోకిల పాటలు వినిపించాయి. నా సెల్ రింగ్ టోన్ కూడా అదే!
ఈ హైదరాబాదు మహానగరంలో కోకిల గానాలేంటని చాలా ఆశ్చర్యమేసింది. హైదరాబాదుకు నేనొస్తానని కలలో కూడా అనుకోలేదు. అయినా జరిగింది. ఇక ఈ వాతావరణానికి అలవాటు పడాలి కదా? దూరంగా వున్నప్పుడు చాలామంది చాలా చాలా దగ్గరగా అనిపించారు. పల్లెనుంచి తిరుపతికి వచ్చి పదిహేడేళ్ళు ఉన్నాను. తిరుపతి కూడా పెద్ద పల్లెలాంటిదే. ఏ వీధిలోకి పోయినా పలకరించే మనుషులుంటారు. దిగులుగా ఉంటే పరామర్శించే వాళ్ళూ ఉంటారు. లక్షలాది జనంతో కిటకిటలాడే ఈ హైదరాబాద్ నగరంలో ఆప్యాయంగా పలకరించే మనుషులు కరువయ్యారు. ” మా ఇంటికి రా” అని కనీసం మాటసామెతకు కూడా పిలిచేవాళ్ళూ లేరు. పల్లెనుంచి వచ్చిన నాకు ఈ కఠిన వాస్తవం చాలా బాధ కలిగించింది. అలాంటి సందర్భంలో నేను హైదరాబాదుకు వచ్చానని తెలిసి ఓ రోజు వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఫోన్ చేశారు. “ఏమ్మా, హైదరాబాద్ కు వచ్చినట్టు నాకు చెప్పనేలేదు. ఆత్మబంధువును ఉన్నాను కదా. “మా ఇంటికి రా” అన్నారు.
అది నాకు కోకిల ప్రవేశించిన కాలమే.
వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసిన కవితలు మే 7 వ తేదీన “కోకిల ప్రవేశించే కాలం” గా పుస్తక రూపం దాల్చినా ముందు వాలాయి. అందులోని పుటలు తెరచుకుంటుంటే కోకిలలు తమ సుస్వర గీతాలాపనతో నన్ను బాల్యలోకాలకు తీసుకుపోయాయి.
కొన్ని అనుభవాలకు మాటలుండవు. అలాంటి అనుభవాలు ఎక్కడో చాలా అరుదుగా ఉంటాయి. లేదూ నిత్యం మన అనుభవంలోనూ ఉంటాయి. అయితే అవి మాటల్లేని అనుభవాలని మనం గుర్తించలేమంతే. అలాంటి అనుభవాలను గుర్తించి చెరువులో ఈదుకుంటూ పోయి తెచ్చుకున్న ఎర్రతామరల్లాంటి కవితలను కోకిలలుగా మార్చి మన మనసు ముంగిళ్లలోకి పంపించాడు కవి.
పిల్లవాడినై గాలిపటాన్ని ఎగురవేసి ఆకాశాన్నందుకున్నాను. కాగితాలు పరచుకుని హేమంతధూళినంతటీనీ మూట గట్టుకున్నాను. “ఒకరి జీవితానందం మరొకరి సంతోషంలో వుందని” ఎప్పటికి తెలుసుకుంటాం? అలా తెలుసుకుంటే ఇంతటి స్వార్థమే ఉండదు! కాలం కబళించకముందే మనం మేల్కొంటున్నామా? “మెలకువ వచ్చిన క్షణం తటాలున లేవడం మంచిది” అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడుగారు.
మనం నగరాల్లో జీవిస్తున్నాం కానీ/ ఎవరి పల్లెల్ని వాళ్ళం తడుముకుంటూనే ఉన్నాం.” అంటూ మనకు పల్లెలకు పడివున్న విడదీయలేని ముడిగురించి చెప్తాడు. అంతటితో ఆగకుండా “కిక్కిరిసి జీవించవలసి వస్తున్నందుకు/ఖేదించడం లేదన్నట్టు నటిస్తూనే/ ఆ బాల్య కాల వైశాల్యాల్నే/ పునః స్మరిస్తున్నాం.” అంటాడు కవి. కొండలు, కోనలు, చెట్లూ, పుట్టలూ ఉండే స్వేచ్చా ప్రకృతిలోంచి వచ్చిన మనం నగరాల్లో భద్రజీవనం కోసం “ఋతువులకు అతీతంగా/ కాంక్రీటు గోడలు కట్టుకుంటున్నాం.” అయితే ఆరుబయట పొలాల దగ్గర కళ్ళు మూసుకుని గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రించినట్టు ఇక్కడ నిద్రిస్తున్నామా? అందుకే కవి “కాని, ఒక ఎండుటాకు చప్పుడైనా/ఒక్కసారి ఉలిక్కిపడుతున్నాం” అంటూ నగరాల్లో మనం జీవిస్తున్న వైనాన్ని చూసి బాధపడుతాడు.
ఇక ఇప్పటి కవులు తమ కవితలకు కాదేదీ అనర్హమన్నట్టు ఎడాపెడా రాసేస్తుంటారు. అలా కాకుండా “గొంతెత్తి కోకిల చెప్పేదిదే, నువ్వు/పాడవలసిన పాట నువ్వే పాడాలని, నిన్ను రమ్మని పిలిచిన విందుకు/నీ బదులు మరొకరు పోలేరని” అంటాడు కవి.
చిన్నతనంలో పొద్దున్నే గోడల మీంచి లేదా ఇంటి చూరు రంధ్రాల్లోంచి పాకే సూర్యకాంతిని చేతితో పట్టుకోవాలని ప్రయత్నించేవాడిని. మాఘమాసంలో నింగి తలుపులు బార్లా తెరిచి చంద్రుడు ఆనందరహస్యాన్ని అందరికీ వెల్లడి చేసేవేళ ఆటలాడుకునే వాళ్ళం. “కోత కెదిగిన పంటను కాపు కాచుకుంటూ/ వడిసెల కర్రను రాయికట్టి విసిరినట్టు /మాటను ప్రయోగించే హాలికుల మధ్య పెరిగిన వాణ్ని. తూనీగ, ప్రేమ, కవిత్వం/ ఇవి వూరకనే/చేతులు చాస్తే వచ్చేవి కావు/లాక్కుంటే అసలే రావు” అని తెలీని వయసులో వెర్రిగా వాటికోసం పరుగులు తీసేవాడిని. మధురమైన స్నేహాలు, బంధుత్వాలు సైతం తప్పనిసరైన నా యాచనతో చేదెక్కాయి. పూలు రాలుతున్న చెట్లకింద కూర్చుని ఎన్ని కవితలల్లుకున్నానో?! చిగురిస్తున్న చెట్టును చూస్తూ, విచ్చుకుంటున్న మొగ్గలను చూస్తూ అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యేవాడిని. ఏమీ తెలియని వయసులో ఏమేమో కావాలనుకునే వాళ్లకు “జీవించడమెలాగో” చెప్పేవాళ్ళెవరు?
వాడ్రేవు చినవీరభద్రుడుగారి “కోకిల ప్రవేశించే కాలం” చదివాక ఎవరైనా సరే “రాత్రంతా బావుల్లో నీళ్ళూరినట్టు/ పూల కడుపుల్లో తేనెలు చేరినట్టు/పొలాల్లో కంకులు పాలు పోసుకున్నట్టు”గా తమకు తెలీకుండానే గత స్మృతుల్లోకి వెళ్ళిపోతారు. తమలోకి తొంగి చూసుకుంటారు. తమను తాము ప్రక్షాళన చేసుకుని అచ్చమైన మనిషిలా మిగిలిపోతారు. ఈ సంపుటంలో సంగీతం, సాహిత్యం, పచ్చటి ప్రకృతి, ఋతువులు కవిత్వంలా మారి ఒకదానితో మరొకటి కలిసిపోయి మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
4 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు
kurmanath Aug 23, 2009 1
Dear్ Sunkoji,
Pustakam meeda review chaala bagundi. poetry nenu kooda chadivenu chala bagundi. konni expressions chala bagunnayi.
ayithe, Hyderabad manushula gurinchi nuvvu prasthavinchindi choosi konchem rayalani pinchindi. Pallello dorikedi antaa premena? kapatam lene leda? nenu kooda pallelni (patnam kante) ishta padathanu.
Oka pootantha Uma daggara gadipi, kalisi bhojanam chesi, maa intiki vachchem kada? Familyni shift cheyyaka mundu, shift cheseka maa intiki teesuku rammani anna kada?
Citylo kalusuleka povadame kaani, kalavoddani yevariki vuntundi?
Yevvaru rammanaledani nuvvante… rayaalanipinchindi. Adi kooda chaala rojulu rayaalaa, vadda ani alochinchi!
ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Sep 10, 2009 2
[...] అచ్చమైన మనిషిలా మిగిలిపోతాం : సుంకోజి దేవేంద్రాచారి [...]
manchikanti Nov 9, 2009 3
సమీక్ష చాలా బాగున్నది.
sreenivas Nov 11, 2009 4
గొంతెత్తి సెల్ ఫోనులో కోకిల చెప్పేది ఇదే. అంతా మాయ. నాకు నువ్వు – నీకు నేను