దళిత జీవితాన్ని ఉదాత్తంగా చిత్రించిన గురజాడ

గురజాడ గొప్పకవితలన్నీ 1910-12ల మధ్య వచ్చాయి. అవి ఆధునిక సమాజానికి కావలసిన సంస్కరణ భావజాలాన్నందించాయి. “ముత్యాల సరములు” భూస్వామ్య వ్యవస్థ నేర్పిన మూఢనమ్మకాలను, మూఢాచారాలను ఖండించింది. “కన్యక” స్త్రీని పురుషుడు బలవంతంగా లోబరుచుకునే దుర్మార్గాన్ని నిరసించింది. “పూర్ణమ్మ” బాల్యవివాహంలోని అసంబద్ధతను విమర్శించింది. “కాసులు” స్త్రీ, పురుష సంబంధాలలో రావలసిన మార్పును ప్రతిపాదించింది. “మనిషి” మానవ వాదాన్ని మానవతావాదాన్ని మనిషే చరిత్ర నిర్మాత అనే భావాన్ని ఆవిష్కరించింది. “దేశభక్తి” దేశభక్తిలోని మానవీయకోణాన్ని, సామాజిక పార్శ్వాన్ని ప్రదర్శించింది. “డామన్ పితియస్” స్నేహ సౌందర్యాన్ని స్నేహ మాధుర్యాన్ని ప్రదర్శించింది. “లవణరాజుకల” దళిత జీవితాన్ని ఉదాత్తంగా చిత్రించింది.

ప్రాచీన భారతీయ సాహిత్యంలో అత్యధికభాగం అనేక సామాజిక వివక్షల్ని, అసమానతల్ని దైవ సిద్ధాంతంతో, కర్మ సిద్ధాంతంతో సమర్ధించింది. నిచ్చెన మెట్ల సమాజానికి మద్దతునిచ్చింది. వర్గ సమాజం బలపడడానికి వేదిక అయ్యింది. మధ్యయుగాలలో ఆ నిచ్చెన మెట్ల సమాజాన్ని ప్రతిఘటించే సాహిత్యం వచ్చింది. భక్తి సాహిత్యోద్యమం దైవ విశ్వాసాన్ని కలిగి ఉంటూనే, అనేక సామాజికాంశాలను విమర్శకు పెట్టింది. అంతేకాదు సాహిత్యంలోకి కొత్తవస్తువుల్ని తీసుకొచ్చింది. బ్రిటీష్ వాళ్లు వచ్చి రాకనే భారతదేశంలో సంఘ సంస్కరణలు మొదలయ్యాయన్నది నిజం కాదు. అదివరకే దేశంలోని అనేక ప్రాంతాలలో మొదలైన కొనసాగుతున్న సంఘసంస్కరణ ప్రయత్నాలు వలసపాలనలో సంఘటితంగా రూపుదిద్దుకుని వేగవంతమయ్యాయి. సంఘసంస్కరణోద్యమం అనేక మూఢ విశ్వాసాలను, మూఢాచారాలను నిర్మూలించే క్రమంలో చాలా వివక్షల్ని ప్రశ్నించింది. ఆధునిక భారతీయ సాహిత్యం సంఘ సంస్కరణోద్యమంలోంచి పుట్టుకొచ్చి భారత జాతీయోద్యమంలో వికసించి అభ్యుదయోద్యమాల్లోంచి పురోగమించి ఇవాళ అనేక వాదాలుగా కొనసాగుతున్నది.

అనాదిగా మన దేశంలో జ్ఞానాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆధిపత్యం చెలాయించిన శ్రామిక జనాన్ని నియంత్రిస్తూ వచ్చిన సామాజిక వర్గ వారసులే వలస పాలనలో సంఘసంస్కరణకు పూనుకోవలసి వచ్చింది. వాళ్లకు మధ్యయుగాలలో శ్రామిక, శ్రామికేతర వర్గాలలోంచి వచ్చి లౌకికతత్వభావాలను ప్రచారం చేసిన వాళ్లు ఆధారమయ్యారు. ఆధునిక కాలంలో అగ్రవర్ణ మేధావులే తమ పూర్వీకుల మతిలేనితనాన్ని దుయ్యబట్టవలసివచ్చింది. ఇతర కులాల మేధావులు తమ మార్గంలో వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ అభివృద్ధి నిరోధకత్వాన్ని తూర్పారబట్టి ఉద్యమించారు. అందువల్ల ఆధునిక భారతీయ సాహిత్యం తొలిదశలో అగ్రవర్ణ రచయితలే తమ వర్గం భారతదేశ పురోగతికి చేసిన నష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మారవలసిన ఆవశ్యకతను గుర్తు చేశారు. తమ వర్ణ, వర్గ జీవితంలోని అమానుషాంశాలను బహిర్గతం చేస్తూ, కింది కులాల వర్గాల పట్ల ప్రదర్శింపబడుతున్నవివక్షల్ని కూడా నిర్ధాక్షిణ్యంగా విమర్శకు పెట్టారు. ఆధునిక భారతీయ సాహిత్యం మూఢనమ్మకాలను, మూఢాచారాలను విమర్శించే క్రమంలో రెండు వివక్షల్ని ప్రధానంగా ప్రదర్శించి వ్యతిరేకించింది. 1. స్త్రీ వివక్ష 2. దళిత వివక్ష.

ఫ్రెంచి విప్లవం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్ర త్రయం ఆధునిక సాహిత్యానికి స్ఫూర్తినిచ్చింది. జండర్ వివక్షనుంచి, కుల వివక్షనుంచి స్త్రీలను, దళితులను రక్షించుకునే ప్రయత్నం ఉద్యమంలోనూ, సాహిత్యంలోనూ మొదలయ్యింది.

భారతదేశంలో సంఘసంస్కరణోద్యమ సాహిత్య నిర్మాణంలో తెలుగు నేలనుంచి కృషిచేసిన వారిలో కందుకూరి, గురజాడలు ఆద్యులు. గురజాడ ఒకవైపు గడ్డకట్టిన చాదస్తం వంటి బ్రాహ్మణ జీవితంలోని అసంబద్ధ మానవ సంబంధాలను తీక్షణమైన విమర్శకు పెడుతూ, మరోవైపు ఆ బ్రాహ్మణ్యం సాటి సామాజిక వర్గ ప్రజల పట్ల ప్రవర్తించే తీరును తీవ్రంగా అదిక్షేపించారు. గురజాడ మిగతా భారతీయ సంఘసంస్కరణోద్యమ రచయితలతో పాటు, ఒక నాగరికమైన భారతదేశ నిర్మాణానికి కృషిచేశాడు. ఆధునిక భారతీయులను తన సాహిత్యంలో సృష్టించే ప్రయత్నం చేశాడు. కులమత ప్రసక్తిలేని జ్ఞానమయ భారతదేశం ఆయన స్వప్నం ప్రేమకు అందులో అగ్రస్థానం.

“యెల్లలోకములొక్కయిల్లై

వర్ణభేదములెల్లకల్లై

వేలనెరుగని ప్రేమబంధము

వేడుకలు కురియ

మతములన్నియు మూసిపోవును

జ్ఞానమొక్కటి నిలిచివెలుగును

అంతస్వర్గసుఖంబులన్నవి

అవని విలసిల్లున్”

ఇది గురజాడ ఆశించిన ఆధునిక భారతీయ సమాజం. ఈ స్వప్నం సాకారం కావడానికి ఏయే అంశాలు అడ్డంకులుగా ఉన్నాయో వాటినన్నిటినీ గురజాడ విమర్శకు పెట్టారు. ఆయన విమర్శకు పెట్టిన అంశాలలో దళిత సమస్య ఒకటి. అస్పృశ్యతను గురజాడ పూర్తిగా తిరస్కరించి దళిత జీవితాన్ని ఉదాత్తీకరించి, కులాంతర వివాహాన్ని ప్రతిపాదించి లౌకిక సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా ప్రకటించాడు.

డా.బి.ఆర్.అంబేద్కర్ 1936 లో కులనిర్మూలన ప్రసంగపత్రం రాశారు. భారతదేశంలో మొదట సాంఘిక విప్లవం రావాలని, అది రానిదే ఆర్ధిక రాజకీయ విప్లవాలు రావని, వచ్చినా అవి వక్రంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. సాంఘిక విప్లవమంటే కుల నిర్మూలన, అది జరిగితే గాని భారతీయుల మధ్య సోదరభావం అభివృద్ధి చెందదు. కుల నిర్మూలనకు వనభోజనాలు మార్గం కాదు. కులాంతర వివాహమొక్కటే మార్గం, ఇది ఆ ప్రసంగ పత్ర సారాంశం. గురజాడ 1910 లో సూచన ప్రాయంగా ఈ ఆశయాలను ఆవిష్కరించారు. “ముత్యాలసరములు” కవితలో సహపంక్తి భోజనానికి వెళ్ళొచ్చిన సంస్కరణవాది అయిన భర్త ఇంటికి తిరిగి వచ్చి తన భార్యకు ఆ విశేషాలను చెప్పాడు.

“మొన్న పట్టణమందు ప్రాజ్ఞులు

మొట్టమొదటిది మెట్టుయిదియని

పెట్టినారొకవిందు జాతుల

జేర్చి; విననైతో”

ఆ భార్య మార్పుకు వ్యతిరేకి. అత్తమామలభయం ఉంది. భర్తమాటలు విని చాలా కోప్పడుతుంది. ఆధునిక విద్య వచ్చి బ్రాహ్మణ్యాన్ని చెడగొట్టిందని తిడుతుంది.

“కోటపేటలనేలగలరని

కోటి విద్యలు మీకు కరపిడి

పొట్టకూటికి నేర్చు విద్యలు

పుట్టకేట్లు కదల్చెనా?

అని భూస్వామ్య బ్రాహ్మణీయ విద్యా విధానం మీద మొకాలే పట్టుబడిదారీ విధానం సాధించిన విజయాన్ని ఆమె గుర్తించి దెప్పిపొడిచింది. ఆమె అక్కడితో ఆగలేదు. భర్త ఉత్సాహంతో చెప్పిన సహపంక్తి భోజనం మీద కూడా ఒక విసురు విసిరింది.

“కలసి మెసగిన యంతమాత్రనే

కలగబోదే యైకమత్యము

మాలమాదిగ కన్నెనెవతనో

మరులుకొనరాదో”

ఆమె నిష్టూరంగా అయినా, వనభోజనాల వల్ల లాభంలేదని కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని వాదించినట్లైంది. అయితే ఆమె కులాంతర వివాహాలకు అనుకూలం కాదు. పైగా వ్యతిరేకి. కులాంతర స్త్రీ పురుష సంబంధాలు కుదిరితే ఉన్న ఆకాస్త బ్రాహ్మణ్యం కూడా పోతుందనే దెప్పి పొడుపు మాత్రమే ఆమెది. “ముత్యాలసరములు” కవిత ఇక్కడితో ఆగిపోయింది. అలా ఆగిపోతే గురజాడ మనకేమి చెప్పినట్లు? బహుశా గురజాడకే ఈ ప్రశ్న కలిగిందేమో! 1911 లో “లవణ రాజుకల” కవిత రాశాడు. ఈ కవితలో ప్రేమ పునాదిగానే కులాంతర వివాహం చేసి దళిత జీవితాన్ని ఉన్నతంగా ఉదాత్తంగా చిత్రించాడు. అస్పృశ్యతలోని అమానుషత్వాన్ని తర్కబద్ధంగా విమర్శించాడు.

“యోగవాశిష్ట”మనే కథను తీసుకుని సమకాలిక పరిస్థితులకు అనుగుణంగా కల్పనలు చేసి గురజాడ ఈ కవితను రచించాడు. సంస్కృతంలో చిత్తభ్రమను చిత్రించే ఈ కథను తీసుకొని మడికిసింగన జ్ఞానవాశిష్ట రామాయణమనే శృంగార కావ్యాన్ని రచించాడు. గురజాడ సంస్కృత కథలోని అసంబద్ధతను తెలుగు కావ్యంలోని బూతును తొలగించి, పాత కథను కొత్త భావాలు చెప్పడానికి వినియోగించుకున్నాడు. శృంగార రసాన్ని ఉదాత్తంగా చిత్రించడమెలాగో గురజాడ రుజువు చేశాడు. బహుశా ఆధునిక తెలుగు సాహిత్యంలో మొదటి పునర్మూల్యాంకన కథ ఇదేనేమో!

లవణుడనే రాజు కొలువు తీరి ఉండగా ఒక జాలికుడొచ్చి ఒక గుర్రాన్నిస్తాడు. అది ఆశ్చర్యకరంగా ఉండే, అతివేగంగా పరిగెత్తే గుర్రం. రాజు ఆ గుర్రాన్ని చూచి సంభ్రమాశ్చర్యాలకు లోనౌతాడు. కాసేపటికి తేరుకుంటాడు. ఆ సమయంలో ఆయనకు పూర్వజ్ఞానమేదో గుర్తుకు వస్తుంది. “జాలికుడేడి? గుర్రమేది? చాలా యేళ్ళు గడిచి పోయాయ్” అంటాడు. అక్కడున్న సేవకులు ఏడునిమిషాలే కదా అయ్యింది అని అంటారు. అప్పుడు రాజు ఏడు ఏళ్లుగా గడిచిపోయిన ఏడు నిమిషాలలొ తనకు కలిగిన అనుభూతిని ఒక కథగా చెప్తాడు.

ఒక రాజు ఒక మాయగుర్రమెక్కగానే అది అతివేగంగా పరిగెత్తింది. అది పరుగెత్తి పరుగెత్తి ఒక్క మనిషి కూడాలేని ఒక మరుభూమికి చేరుకుంది. సాయంకాలమవుతుండగా దాని వేగం తగ్గింది. వెంటనే రాజు ఒక చెట్టుకొమ్మను పట్టుకున్నాడు. గుర్రం ముందుకు వెళ్ళిపోయింది. రాజు నేలకు దిగాడు. కాలికినేల తగలగానే రాజు బాగా అలిసిపోయి ఉండటంవల్ల వెంటనే నిద్రపోయాడు. నిద్రలో ఆయనకు సాయంకాలం పూట ఒక వింతలోకం కన్నులకెదురుగా నిలిచింది. అక్కడ ప్రకృతి మనోజ్ఞానంగా ఉంది. నయనానందకరంగా ఉంది. పక్షులు గూటిని చేరాయి. చంద్రుడు ఉదయించాడు. తాటి చెట్ల తూర్పుదిక్కున ఎత్తిన గొడుగుల్లాగా ఉన్నాయి. చల్లని గాలులు వీస్తున్నాయి. గాలికి పువ్వులురాలుతున్నాయి. మనసుకు హాయిగా ఉంది. రాజును ఆకలి మాత్రం బడబాగ్నిలా కాల్చేస్తున్నది.

అప్పుడు ఒకవింతగానం ఆయనకు వినిపించింది. అది దగ్గరదగ్గరగా వినిపించింది. ఆ పాత చెవిని సోకగానే రాజుకు పూర్వ వాసన పిలుస్తున్నట్లనిపించింది. ఆకలిమరిచిపోయాడు. కష్టాలు మరచి పోయాడు. పాతవినడంలో లీనమయ్యాడు. పాట దగ్గరకు వచ్చేసింది. రాజు చూసింది ఒక శ్యామలాంగి అయిన యువతి. ఆమె కూటి కడవను భుజం మీద పెట్టుకొని చెట్లు చేమల కోసం పాటపాడుతూ వస్తున్నది. ఆమె పాటలు చెట్లు చేమలు వింటున్నాయి. తాటివనంలో చంద్రుడు చెవియొగ్గి వింటున్నాడు. ఆపాటలో లవణుడనే మాట వినిపించింది రాజుకు.

రాజు ఆమెను చూసాడు. ఆమె తనను పలకరించకుండా వెళ్ళి పోతుందేమోనని రాజే ఆమెను పలకరించాడు. “నిన్నటి నుండి అన్నం దొరకని ఆకలొకటి, ఇప్పుడిదొక వింత ఆకలి అతనిని పీడిస్తున్నాయి. అందువల్లనే నీ వెనుకే వచ్చాను.” అన్నాడు. ఆమె కన్నులు మెల్లగా విచ్చి చూసింది. మరలా కన్నులు దించుకొంది. ఏదో ఆలోచించుకొని తన దరిన తాను పోయింది. అమె నడక మారింది. పాట ఆగింది. ఆమె ముఖంలో ఏదో చింత కనిపించింది. అప్పుడు రాజు “ఆకలిగొన్న వాళ్ళకు అన్నం పెడితే పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. నీ సౌందర్యానికి నేను భృత్యుడనయ్యాను. ఇప్పుడు నీకే భృత్యుడను. మృత్యుముఖంలో పడబోతున్న నాకు అన్నం పెట్టరాదా!” అన్నాడు. అప్పుడామె నడక వేగం కొంత తగ్గించి, తలవంచుకొని”నన్ను తెలియక నాస చేసెద వయ్యొ! మాలిత నేన్” అంది. తన తండ్రికోసం కూడు తీసుకుపోతున్నానని, నీకు అన్నం పెట్టలేననే మాట తన హృదయాన్ని ముక్కలు చేస్తున్నదని, తన దురదృష్టానికి ఎవరినేమనగలనో నని చెప్పివాపోయింది.

“అయ్యకోసము కూడుకుండను

ఇయ్యలేనను మాట హృదయము

వ్రయ్య చేసెడు నాదు భాగ్యము

కెవరినేమందున్”

అప్పుడు రాజు ఆమె కళ్లలో నీళ్ళు కమ్మడం చూశాడు. ఖిన్నుడయ్యాడు. కొన్ని నిమిషాలు తాను విన్నవి తనకు తెలిసినవి ధర్మాలనన్నిటినీ నెమరువేసుకున్నాడు. అన్ని ధర్మాలగురించి ఆలోచించి ఒక పరమ ధర్మాన్ని కనుగొన్నాడు. ఆమెకు బదులు చెప్పాడు.

“జనులు తెలియక పలుకు మాటకు

జనదువగవంగన్

మంచి చెడ్డలు మనుజులందున

యెంచి చూడగ రెండెకులములు

మంచియన్నది మాలయైతే

మాలనే అగుదున్”

అని చెప్పి ఆమె సౌందర్యాన్ని కీర్తించాడు. అంతేకాదు.

మాలయను వారున్న వారల

మందబుద్ధికి వగవవలె తన

యందులేని కొరంత కలదని

వగవగానేలా?

అని మానవ సంస్కారాన్ని, గుర్తు చేశాడు. తన మాట నమ్మమని, భయం వదులుకోమని, తనకు అన్నంపెట్టి తన హృదయ రాజ్యాన్ని నిస్సపత్న్యంగా చేకోమ్మని చెప్పాడు. అంతా ఆమె ముఖంలో సిగ్గు, విస్మయం అలుముకున్నాయి. ఆమె కనులు ఎత్తుతూ దించుతూ తన తండ్రి కోసం తెచ్చిన కూటిని ఇతరులకు, తన పెనిమిటికి తప్ప ఇంకెవరికీ పెట్టడం ధర్మం కాదంది.

“తండ్రి కోసము తెచ్చుకూటిని

తిండికై యెరుకెట్టులిత్తును?

పెండ్లియాడిన పెనిమిటొకనికి

పెట్టధర్మం బౌ”

అని చెప్పి ఆలస్యమైపోయింది తన తండ్రి ఆకలితో తల్లడిల్లుతూ తనకోసం ఎదురు చూస్తుంటాడని పలికి తొలగి పోవాలనుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అప్పుడు రాజు ఆమె చేయి పట్టుకొని, కౌగలించుకొని ముద్దుపెట్టుకొని, కురులు దువ్వాడు. ఆడబోయిన తీర్ధం ఎదురైందని, వేడబోయిన వరం దక్కిందని “పెండ్లి యాడెద చంద్రు సాక్షిగా పెట్టు కూడని” అభ్యర్ధించాడు. ఆమె అన్నం పెట్టింది. అది పాలసముద్రాన్ని చిలికినప్పుడు విష్ణువు దేవతలను వడ్డించిన అమృతం కన్నా రుచిగా అనిపించింది.

ఇద్దరూ కలిసి ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎలా ఉన్నాడు?

పండుగెడ్డము నిండుకన్నుల

నిండశాంతరసంబు పలుకుల

కడలి గాంభీర్యంబు, యొడలిని

దివ్యతేజంబున్

కలిగి కూచునె రాజఋషివలె

రావి కిందను రచ్చశిలపై

కొమ్మలను జారి చంద్రకాంతులు

మేన చెదరంగన్”

ఈ యిద్దరినీ చూడగానే ఆ పెద్దాయన ఇద్దరినీ ఆశీర్వదించాడు. తన కూతురిని మెచ్చుకొని తన జీవిత నేపథ్యాన్ని లోకం తీరును వివరించాడు. మాల కులమైనా గురువు దయవల్ల మలినవృత్తులు మానుకున్నాడు. పొలంలో పశువుల్ని మేపి పొట్టనింపుకుంటన్నాడు. మాల ప్రజల్ని మలిన వృత్తులు మాన్పించి ఆ వనంలోకి తీసుకొచ్చాడు. అదొక పల్లెఅయింది. ఆ ప్రజలు ప్రాజ్ఞులయ్యారు. అక్కడ పాడిపంటలు పుష్కలంగా ఉన్నాయి. పశువుల మందలు దండిగా ఉన్నాయి. అక్కడ ఎవరూ ఇప్పుడు జంతు హింస చేయరు. భూతదయ అక్కడి మతం. అయినా మనుషుల బుద్ధిలో మాత్రం తన మేలును ఇతరుల కీడును కోరుకునే లక్షణం పోలేదు. ఆయన కత్తి కోతలు మాన్పగలిగాడు గాని, మాట కోతలు మాత్రం మాన్పలేకపోయాడు. కత్తి ఒకేసారి చంపుతుంది. మాటవాత ఎన్నటికీ మానదు. అయినా ఓపిక అన్నిటికీ మందు ఆపెద్దాయన ఇదంతా చెప్పి

“మేలుకొను దొండొరుల సిరులకు

మిట్టిపడకుడు కీడు మూడిన

నాడుకుంగకు డొరులమేలుకు

పాటు పడుడెపుడున్”

అని ప్రభోదించాడు. ఇద్దరి చేతులు కలిపాడు.

కొన్నేళ్ళు గడిచిపోయాయి. వాళ్లకు పిల్లలు పుట్టారు. పల్లెలొ మళ్ళీ మార్పులొచ్చాయి. మాట కట్టుబడిపోయింది. వ్యవసాయం తగ్గిపోయింది. ఉన్నదంతా తినేశారు. ఉన్న పశువుల్ని తినేశారు. చెల్లాచెదురై పోయారు. ఉన్నకొంచెం పొలాన్ని రాజు, పిల్లలు పండిస్తున్నారు. తెల్లవారింది మొదలు వాళ్ల పాట్లేపాట్లు. అడవిలో కాయి పసురులు తినలేక పిల్లలు బలహీన పడీపోయారు. ఒకరోజు రాజు భార్య అతనిని పిలిచి నవ్వు ముఖంతో ఇలా చెప్పింది. ఇంకమనం చేసే పనిలేదు. ముందు జరగబోయేది చూడాలి. ఈ జన్మ ఇలా గడిచి పోయింది. రాబోయే జన్మ ను గురించి ఆలోచిద్దాం. ఆ జన్మలో జ్ఞాన సంపద కోసం శ్రమిద్దాం. మన పిల్లల్ని కాపాడుకొగలిగితే మన సత్యవర్తనే మనల్ని కాపాడుతుంది. దిగులు మాని చితినెక్కుదాం ఇంతకన్నా భాగ్యముందా! జీవితాంతంలో మన ఆలోచనలు ఎలా ఉంటే మన గతి అలా ఉంటుంది.రాబోయే జన్మలు కూడా నీతోనే కలిసి జీవించి ముక్తి పొందుతాను. నీ ప్రణయాతిరేకం కన్నా నాకు మరో సద్గతి లేదు” అంతే ఇద్దరూ దిగులు వదులుకొని చేయిచేయి జత చేసుకొని చితిలోకి ప్రవేశించారు.

లవణ రాజు ఈ కథంతా శాస్త్రజ్ఞులకు చెబుతాడు. వాళ్ళ మధ్య అనుభవానికి అధ్యయనానికి సంబంధించిన చర్చ జరుగుతుంది.

అనంతమైన కాలగమనాన్ని కాల పరిమాణాన్ని ఒక చిన్న కథలో ఇముడ్చుకున్న కథా కవిత “లవణరాజు కల” “ముత్యాల సరములు” కవితలో భార్య సహపంక్తి భోజనాలను దెప్పిపొడుస్తూ “మాలమాదిగ కన్నె నెవతినొ మరులుకొన రాదో” అందని చెప్పుకున్నా. గురజాడకు స్త్రీ పురుష సంబంధాలలో మరులు కన్నా ప్రేమ ఉండడం ఇష్టం. “కన్యక కవితలో రాజుది మరులు మాత్రమే, ప్రేమే కాదు.” కాసులు” కవితలో గురజాడ స్త్రీ పురుష సంబంధాలలో మరులును తిరస్కరించి ప్రేమకు ప్రాధాన్యమిచ్చాడు.

“మరులు ప్రేమని మది దలంచకు

మరులు మరలును వయసుతోడనె

మాయమర్మము లేని నేస్తము

మనువులకు మగవారి కొక్కటె

బ్రతుకు సుకముకు రాజమార్గము

ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును

ప్రేమనిలిపిన ప్రేమనిచ్చును

ఇంతియె”

ఈ అవగాహనతోనే “లవణ రాజుకల”లో గురజాడ ప్రేమపునాదిగా గల దాంపత్యాన్ని చిత్రించాడు. ఆ ప్రేమకు, ఆ దాంపత్యానికి కుల వైరుధ్యం అడ్డుకాకూడదన్నారు. ప్రేమ విషయంలో వివాహం విషయంలో కులం పాత్రను గురజాడ నిర్ద్వంద్యంగా ప్రకటించాడు. సందేహాలెవరికైనా ఉంటే అది వాళ్ల మానసిక వైఫల్యం తప్ప గురజాడ తప్పుకాదు.

భారతదేశంలో ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా, నాలుగు వేలకు మించిన కులాలున్నాయి. కులం లక్షణం మనుషుల్ని ఒక ఇరుకు గదిలో బంధించడమే. విస్తరణ కలుపుగోలుతనం కులానికి తెలియవు. సారాంశంలో కులం ఒక అప్రజాస్వామిక సరిహద్దు. భారతదేశంలో కులం ఒక నమ్మకమే కాదు. మౌఢ్యం కూడా. కులం జనాన్ని కలపదు. పైగా విడదీస్తుంది. నన్ను ముట్టుకోకు అంటుంది. దానివల్లనే భారతీయ సమాజం అభివృద్ధి చెందవలసినంతగా చెందలేదు. పాల్కురికి సోమన, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం వంటి ప్రాచీన కవులు కులాన్ని ఎంత విమర్శించినా, అది నిర్మూలింపబడలేదు. బ్రిటీష్ పాలనా కాలంలో కొత్తగా ఏర్పడబోయే సమాజంలో కులమతాల ప్రసక్తి ఉండరాదని తొలితరం రచయితలు భావించారు. వాళ్ళలో గురజాడ ఉన్నాడు. డా.బి.ఆర్.అంబేద్కర్ మాటల్లో కులవ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా. ఒకకులం వాళ్ళు మరో కులం వాళ్లతో కలిసి తినరాదు, పెళ్ళి సంబంధాలు నిషిద్దం. హద్దుదాటితే చెడిపోయినట్లే. చెడినవాళ్లకు శిక్ష, కుల బహిష్కరణ. మనుస్మృతి ఈ కులవ్యవస్థను శాశ్వితం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆ మనువాద వ్యవస్థను సాంఘిక పార్శ్వం నుండి పగలగొట్టే బాధ్యత ఆధునిక కాలంలో మనువాద వర్గ వారసులుగా పుట్టిన ఆధునికులపైన బడింది. తద్భిన్నమైన సామాజిక వర్గీయులు ఫూలే, అంబేద్కర్ లాంటి వాళ్ల ఉద్యమాలు ఈ ప్రక్రియను బలోపేతం చేశాయి. గురజాడ ఈ ఉద్యమంలో సాహితీ కర్తవ్యం నిర్వహించాడు.

గురజాడ వేలకొలదిగా ఉన్న కులాలను కృత్రిమాలుగా భావించి తిరస్కరించి, మనుషుల్లో రెండే కులాలున్నాయని, అవి మంచి చెడులని, ఈ రెండిటిలో అన్ని కులాల జనాలు ఉన్నారని నిర్థారించాడు. మంచివాళ్లను కూడా పుట్టుకను బట్టి మాలలుగా నిర్ణయించేటట్టయితే తానుకూడా మాలనవుతానన్నాడు. ఇక్కడ గురజాడ తనను తాను నిజాయితీగా అవర్ణీకరించుకున్నారు. ఆదిపర్వం ఉదంకోపాఖ్యానంలో “నిండు మనంబు నవ్యనవనీతసమానమే” అనే పద్యంలోని కులనిర్ధారణను గురజాడ తిప్పికొట్టాడు. 1909 లో మాలవాండ్రపాట వచ్చింది. 1910,11 లలో గురజాడ ముత్యాల సరములు, లవణరాజు కల రాశాడు. ఆ తర్వాతనే ఇతర కవులు రచయితలు దళిత సమస్యను స్వీకరించారు. నిజానికి తెలుగు సాహిత్యంలో కులాంతర వివాహ ప్రసక్తి “శ్రీరంగరాజచరిత్రము”లోనే వచ్చింది. ఆ నవలలో రాజు ఒక లంబాడి అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడతాడు. అయితే చివరికి ఆమె రాజు మేనకోడలేనని తెలుస్తుంది. దానివల్ల ఏమి ప్రయోజనముంది?

లవణ రాజు కలలో రాజు తాను ప్రేమించిన దళిత అమ్మాయికి మంచి చెడు కులాలను గురించి చెప్పేముందు వర్ణవ్యవస్థను గురించి బాగా ఆలోచించాడు. దాని సారాంశాన్ని గురజాడ మూడు చరణాలతో చెప్పాడు.

“మలినవృత్తులు మాలవారిని

కులము వేర్చిన బలమురొకదే

శమున కొందరి వెలికిదోసిరి

మలినమే మాల?

కులములేదట ఒక్కవేటున

పసరముల హింసించువారికి

కులము కలదట నరుల వ్రేచెడి

క్రూరకర్ములకున్

మలిన దేహులమాలలనుచును

మలిన చిత్తుల కధికకులముల

నెలవొసంగిన వర్ణధర్మమ

ధర్మధర్మంబే”

ఇది రాజు అంతర్మథనం రూపంలో భారతీయ సమాజంలోని సాంఘిక నిరంకుశత్వరూపమైన కులవ్యవస్థమీద అందులో ప్రత్యేకించి అస్పృశ్యతే సమస్య మీద గురజాడ చేసిన చర్చ. ” మలినమేమాల?” అనే ప్రశ్న మనువాదవ్యవస్థమీద ప్రజాస్వామిక వాది అయిన ఆధునిక కవి వేసిన ప్రశ్న.” వర్ణ ధర్మ మధర్మ ధర్మంబే” అన్నది ప్రాచీన సమాజవ్యవస్థమీద ఆధునిక కవి చేసిన పునర్మూల్యాంకనం. అంతేకాదు ఒక మేధావిగా చేసిన సూత్రీకరణ. ఒక్కదెబ్బతో పశువును చంపేవాడికి కులంలేదు. నిరంతరం మనుషుల్ని పీడించే వారికి కులం ఉంది అనడంలోని సామంజస్యాన్ని గురజాడ నిలదీశాడు. వీళ్లను క్రూర కర్ములు అని నిర్వచించడంలోని గురజాడ దళిత పక్షపాతం గుర్తించాలి. ఆ మాటలో కల్తీలేని గురజాడ కంఠస్వరం వినిపిస్తున్నది. శరీరం మురికిగా ఉండే వాళ్లను మాలలంటూ, మనసే మలినంగా ఉండే వాళ్లకు అధిక కులమిచ్చే వర్ణ ధర్మం అధర్మ ధర్మమే” అని తీర్పునివ్వడం గురజాడ న్యాయమూర్తి వ్యవహరించడమే. శరీరం మురికి కావడానికి పేదరికం కారణం, మనసు మురికి కావడానికి ఆలోచనా దారిద్య్రం, అగ్రవర్ణ దురహంకారం, లోపించిన మానవత్వం కారణాలు. ఇంత ఆలోచించి ఆరాజు ఆ అమ్మాయితో మంచితనం, మానవత్వం లేనివాళ్లకు అధిక కుల హోదా ఎలా వస్తుందని వివేచించి, మనుషులంతా రెండేకులాలని చెప్పాడు. మంచివాళ్లను మాలలనేటట్లయితే నేను మాలనవుతానన్నారు. గురజాడ రాజునోటితో తనను తాను అవర్ణీకరించుకొని మాట్లాడించాడు. గురజాడ దళిత పక్షపాతం అనుమానాలకు ఆస్కారమేలేని విధంగా ఉండి ఆ తర్వాత కూడా గురజాడ మరొక చరణం రాజుతో చెప్పించాడు.

మాలయనువారున్న వారల

మందబుద్ధికి వగవవలె తన

యందులేని కొరంతకలదని

వగవగానేల!

ఈ చరణం విభజిత సమాజంలో పైనున్నవాడు కిందనున్నవాళ్ళపట్ల ఎలా వ్యవహరించాలో స్పష్టం చేస్తున్నది. దళితుల పట్ల అగ్రకులాల కుండవలసింది మానవతా దృష్టితప్ప, నీచ దృష్టికాదని సూచించారు.

“నా కావ్యకళ నవీనం. కావ్య యితివృత్తం భారతీయం. కవితలో నేనుత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను. జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా, కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను.” అని చెప్పుకున్నాడు గురజాడ. ఈ కవితలో గురజాడ ఆశించిన ప్రయోజనం జగత్తు మిధ్య కాదు వాస్తవమని చెప్పడం, వాస్తవ ప్రపంచంలో మానవసంబంధాలు వాస్తవికంగా ఉండాలని చెప్పడం, అందులో భాగంగా అస్పృశ్యతను తిరస్కరించడం, నాగరిక శృంగారాన్ని పోషించడం.

రాజు పాత్ర ద్వారా గురజాడ దళిత సమస్య మీద తన అభిప్రాయాలను చెప్పించడం ఒక ఎత్తైతే, దళిత స్త్రీ పాత్ర చిత్రణలో ఆయన అనుసరించిన సంస్కారమైన మార్గం మరోఎత్తు, సౌందర్య వర్ణన పేరుతో అంగాంగ వర్ణనకు పూనుకోకుండా, శృంగారం పేరుతో పడకటింటి రహస్యాలను వర్ణించకుండా సహజ మానవ సౌందర్యాన్ని, మానవానుభూతులను గురజాడ చిత్రించాడు. ప్రభంధనాయికలకు బుద్ధి వచ్చే పద్ధతిలో దళిత స్త్రీ పాత్రను ఉదాత్తంగా శిల్పించాడు.

తనను కోరుకుంటున్నవాడు రాజైనా ఆమె వెంటనే అతనికి స్వాధీనమైపోలేదు. ఆమెకు భారతీయ సమాజంలోని కులం ప్రాథాన్యం గురించి బాగా తెలుసు. అందుకే రాజు మాటలన్నీ మౌనంగా విని ” నన్ను తెలియక నాసచేసెదవయ్యొ! మాలిత నేన్” అని తనకులాన్ని తెలియజేసింది. ఎందుకంటే మనది “మీరేవుట్లు” సమాజం. డా.బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్లు అవతలి వాడికులం తెలిస్తే తప్ప గౌరవించాలో వద్దో నిర్ణయించుకోలేని సమాజం. ఇది తెలిసిన వ్యక్తి గనుక ఆమె రాజు తన శరీర సౌందర్యాన్ని చూచి వ్యామోహపడుతున్నాడేమోనని మొదటనే తనకులాన్ని తెలిపింది. అది ఆమె గాంభీర్యం. వెంటనే

అయ్యకోసము కూడుకుండను

ఇయ్యలేనను మాటహృదయము

వ్రయ్యచేసెడు నాదు భాగ్యము

కెవరినేమందున్.

అని తన ధార్మిక సంస్కారాన్ని బయటపెట్టింది. అదే సమయంలో ఆకలిగొన్నవానికి అన్నం పెట్టలేని నిస్సహాయతకు బాధపడుతూ తన మానవత్వాన్ని చాటుకుంది. గుండెనిండా ఆర్ద్రత, తడి వున్నవాళ్ళే ఇలా మాట్లాడగలరు. తిండి తీసుకుపోతున్నది తన తండ్రి కోసం. ఎదుట ఉన్నది ఆకలిగొన్న వ్యక్తి. తండ్రిని నిర్లక్ష్యం చెయ్యజాలదు. ఎదుటి వ్యక్తిని నిరాదరించలేదు. ఆ దురదృష్టానికి తనను తానే తిట్టుకున్నది. ఆ తర్వాత రాజు ఆమె సౌందర్యాన్ని కీర్తించి తనను నమ్మమని, భయాన్ని వదలమని చెప్పి నమ్మునా హృదయంపురాజ్యము నిస్సపత్న్యముగన్” అని మాట ఇచ్చాడు. అప్పుడామె మొకంలో వ్రీడ, విస్మయం జంటగా కనిపించాయి. కొంతచలనం మొదలైంది అయినా నిగ్రహాన్ని కోల్పోకుండా

“తండ్రి కోసము తెచ్చుకూటిని

తిండికైయెదుకెట్టులిత్తుమ

పెండ్లియాడిన పెనిమిటోకని

పెట్టధర్మంబౌ

తడవు ఆయెను తల్లడిల్లుచు

తండ్రి నాకై యెదురుచూచును”

అంటూ పక్కకు తొలగి పోవాలనుకుంది. తండ్రికోసం తీసుకుపోయే తిండిని మరో మగవాడికి పెట్టాలంటే అతడు పెండ్లాడిన పెనిమిటి భర్త, అయ్యిండాలి తప్ప మరో మగవాడికి పెట్టటం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఆమె మనస్సు, ఆమె అభీష్టం రాజుకు అర్ధమయ్యాయి. తన సౌందర్యంతో ఆకర్షితుడయ్యే మగవాని ఆకర్షణలో తాను పడకుండా తన ఇంద్రియ ఆత్మనిగ్రహాలను ఆమె చాటుకుండి. ఆమె తన ధర్మ బుద్ధిని ఇష్టపడే వాడినే ఇష్టపడుతుందని రాజుకు అర్ధమైంది. వెంటనే ఆమెను తనలోకి చేర్చుకున్నాడు రాజు. అన్నం పెట్టించుకున్నాడు.

దళీత స్త్రీ పాత్రను ఎంతో ఉదాత్తంగా చిత్రీకరించిన గురజాడ ఆమె తండ్రిపాత్రను, పౌరాణిక చట్రంలో సామాజిక స్వభావంతో ఉన్నతంగా మలిచారు. దళిత స్త్రీకి తన తండ్రి మీద ఎంత గౌరవముందో ఆ తండ్రికి తన కూతురు మీద అంత ఆదరముంది. రాజుకు తనకూతురి గురించి ఇలా చెప్పాడు ఆ తండ్రి.

” ఇహము లోపలి మంచియంతయు

యిమిడియున్నది దీని ఆత్మను

ముక్తికాంతై తుదకు నీకిది

ముందు గతిచూపున్”

గురజాడ “మంచి” అనే మాటను తన కవిత్వంలో ఉపయోగించిన తీరును జాగ్రత్తగా గమనిస్తే ఆయన నిజాయితీ మీద అటు సంప్రదాయవాదులకు గానీ, ఇటు ఆధునికులకు గానీ అనుమానాలు కలగవు.

“దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా” అన్నాడు. లోకంలో మంచి, చెడు కులాలు మాత్రమే ఉన్నాయని, తాను మంచివైపు మొగ్గుతున్నట్లు చెప్పాడు. “లవణరాజు కల”లో పాటపాడుతూ కూటికడవ భుజం మీదపెట్టుకొని వస్తున్న స్త్రీని రాజు చూశాడు. ఆమె ఎవర్ని గురించి పాడుతున్నదో అని ఆలోచిస్తూ ఉండగానే ఆమె నోటి నుంచి లవణుడనే పేరు బయటి కొచ్చింది. వెంటనే రాజు ఆమెను అనుసరించాడు. అప్పుడు గురజాడ “మంచివలెనిది మాయమగువని యెంచి” అన్నాడు. ఇప్పుడు ఆమె తండ్రి ఆమెలో భౌతిక ప్రపంచంలో ఉండేమంచి అంతా ఆమెలో ఉంది అని అనడం ఎంతో ఉదాత్తంగా ఉంది. మంచికి కులం లేదు అన్నది సారాంశం. పాత్ర చిత్రణలో ఇది గురజాడ అనుసరించిన అపురూప మార్గం.

ఆ తర్వాత ఆ పెద్దాయన తన చరిత్రనంతా రాజు ముందు కుమ్మరిస్తాడు. ఆయన ఒక దళిత అమ్మాయికి తండ్రి మాత్రమే కాదు. దళిత జాతిని తనదైన పద్ధతిలో సంస్కరించిన వ్యక్తి. ఒక గురువు ప్రబోధంతో మలిన వృత్తులను మానుకున్నాడు. పశువుల్ని మేపుకుంటూ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాడు. సాటిమాలల్ని మలిన వృత్తులనుంచి విముక్తం చేసి ఒక వనంలో అందరికీ నివాసం ఏర్పాటు చేశాడు. అది ఒక పల్లె అయింది. పాడిపంటలు, పశు సంపద సమృద్ధిగా ఉన్నాయి. జంతుహింస మానేశారు. భూత దయ వాళ్ల మతమైంది. ఇలా ఆయన తన జాతిలో తీసుకొచ్చిన పరివర్తనను అల్లుడైన రాజుకు వివరించి చెప్పాడు. “పాడిపంటలు పొంగి పొరలేదారిలో నువు పాటుపడవోయి” అన్న ప్రబోధానికి ఆదర్శప్రాయుడు ఈ పెద్దాయన.

శ్రామిక శక్తికి సంకేతమైన ఆ తండ్రి ఇంతమాత్రమే చెప్పి ఉంటే ఆ పాత్రకు తాత్వికత సిద్ధించేది కాదు. తాను మారినా, తానెంత పాటుపడినా మనుషుల బుద్ధులలో మార్పురాలేదని ఆవేదన చెందాడు.

“కాని మనుజుని బుద్ధిలోపల

కలవు తనమేలోరులకీడుకు

తలచువృత్తులు కానబొయిన

కలచునెవ్వాడిన్

మాన్పగలిగితిని కత్తికోతలు

మాన్పవశమే మాట కోతలు

కత్తి చంపును మాటవాతలు

మానవేనాడున్”

కిందికులాలను పై కులాల నీచంగా చూచే, హీనంగా మాట్లాడే దుర్మార్గం ఇంకా కొనసాగుతూ ఉండడం మీద కలిగిన ఆవేదన ఇది. ఇంత చెప్పి ఆయన చివరికి ఇచ్చిన సలహా

“ఓరిమి యేటికైనను మందు

కలిగిన కలుగు సౌఖ్యంబులో”

మాలపల్లి నవలలో రామదాసుకు ఈయన పూర్వరూపంగా కనిపిస్తాడు.

అ తండ్రి మరణిస్తాడు. రాజు దంపతులు పెద్దలైపోతారు. ఆ పల్లె మాడిపోయి శిధిలమైపోయింది. ఈ పరిణామాలను గ్రహించిన భార్య

“చింత మురుగుడు చితిని జూత్తము

యింత కన్నను భాగ్యమున్నది”

అని ప్రబోధించింది. ఆమె తండ్రి చెప్పినట్లే ఆమె ముక్తికాంత అయింది రాజు కూడా ఆమె ప్రబోధాన్ని స్వీకరించాడు.

కలుగుభవములు కూడనీతో

కలిసి గడుపుచు ముక్తి జెందెద

కలదె నీ ప్రణయాతిరేకము

కన్నసద్గతియున్”

చివరికి ఇద్దరూ “చింతలు వేసి కెకై చేర్చి” చితిలోకి వెళ్ళిపోయారు. అని లవణుడు చెప్పి శాస్త్రజ్ఞులతో ఆ కల మీద చర్చ చేశాడు.

లోకమంతా చెడు అనుకుంటున్న దానిలోని మంచిని చూచే కన్నీళ్ళకు కులం లేదని భావించే గురజాడ లవణుడి కలలో కులాల కతీతంగా మంచి, మానవత్వం, హృదయ సంస్కారం, సంస్కరణ నిబద్ధత ఎలా ఉంటాయో వాస్తవికంగా ఆవిష్కరించాడు. పంకుగుణాలు అగ్రవర్ణాలు సొత్తుగా అగ్రకులాలు భావిస్తాయో అవి దళితులలోనూ ఉన్నాయని చాటి చెప్పాడు. “నరుల చెమట” లో నేల తడవాలన్న గురజాడ దళిత తండ్రిని అలా చిత్రించాడు. అయన రావి చెట్టు కింద రచ్చపైన కూర్చొని ఋషిలాగా కనిపిస్తాడు గానీ సోమరిపోతుకాదు, మెట్టవేదాంతం చెప్పలేదు. ఆయనొక సంస్కర్త. ఆయన కూతురొక సంస్కారపు ముద్ద. ఇది గురజాడ సంస్కరణ ముద్ర.

గ్రామికకులాల జీవితాన్ని ఉదాత్తీకరించిన గురజాడ సాహిత్యోద్యమం అప్పటినుండి అనేక ఉద్యమాలలో అనేక భావజాలాలతో ఆవిష్కృతమౌతూ వస్తున్నది.

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. tara Aug 10, 2009 1

    E VYASAM Krupakar madiga lanti varu chadivethai baguntundhi.

  2. ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Sep 5, 2009 2

    [...] దళిత జీవితాన్ని ఉదాత్తంగా చిత్రించి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో