40 ఏళ్ల ఉద్యమ సాహిత్యం – కళింగాంధ్ర వస్తు – శిల్పాలపై దాని ప్రభావం

ఉత్తరాంధ్ర భౌగోళికంగా నేటి ఒరిస్సా రాష్ట్రంలో కొంత భాగం అనగా తెలుగు అధికంగా మాట్లాడే ప్రాంతాలను కలుపుకుని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరాలతోపాటు కళింగాంధ్రగా పిలువబడుతోంది. ఎందుచేతనంటే ఈ మూడు ప్రాంతాలకు సరిహద్దులుగా వున్న ఒరిస్సా ప్రాంతాల వారి సంస్కృతీ, సాంప్రదాయాలతో అనుబంధం విడదీయరానిదిగా వుంది. అలాగే ఈ జిల్లాల సరిహద్దుల వెంబడి వున్న గిరిజన ఆదివాసీ ప్రాంతాలపై ఒరియా భాషా సంస్కృతుల ప్రభావం అధికమే. కళింగాంధ్రలో తెలుగుతో పాటు సవర, జాతాపు. రెల్లి, పైడి, ఎరుకలి, గదబ, పాకీ మరియు ఒరియా భాషలు వాడుకలో వున్నాయి. తెలుగులో శ్రీకాకుళ మాండలీకం ప్రత్యేకంగా ఉంటుంది.

ఉద్యమాల విషయానికొస్తే ఆదివాసీ పోరాటాల నుండి, 1947కు ముందు ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా సాగిన జమిందారీ పోరాటాలు, జమిందార్లకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటాలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన ఆదివాసీ పోరాటాలు ఈ ప్రాంత పోరాట సాంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. అలాగే తెలుగు భాష సజీవంగా నేటి రూపాన్ని సంతరించుకొనడానికి సంస్కృత, ఆంగ్ల భాషల ప్రభావం నుండి కాపాడి సామాన్యుని చెంతకు సాహిత్యాన్ని తీసుకువెళ్ళేందుకు విరామమెరుగని పోరాటం చేసిన గిడుగు వారి వాడుక భాషోద్యమం మరియు గరిమెళ్ళ వారి జాతీయోద్యమ ప్రభావం ఇక్కడ ఉన్నాయి.

అధికార మార్పిడి తర్వాత వసంత మేఘగర్జనగా కొనియాడబడిన శ్రీకాకుళ ఆదివాసీ రైతాంగ పోరాటం ఆంధ్రదేశంలో మార్క్సిస్టు లెనినిస్టు ఆలోచనా విధానంతో సాగిన పోరాటాలకు ముఖ్య భూమికగా, ఆలంబనగా సాగింది. సుమారు మూడు సంవత్సరాలపాటు ఆదివాసీ ప్రాంతమంతా గెరిల్లా బేస్ గా, విముక్తి ప్రాంతంగా ఉద్యమం కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. మొత్తం రాజ్యం సాగించిన దమనకాండకు ప్రత్యామ్నాయంగా ఆదివాసీలు తమ నెత్తుటి త్యాగాలతో దేశ రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేసారు. ఈ మహోత్తర పోరాటంలో అన్ని సెక్షన్ల ప్రజలు పాల్గొనడం నాటి రాజకీయ వ్యవస్థపై ప్రజల ఏహ్యాభావాన్ని తెలియజేస్తుంది.

సాహిత్య రంగంలోని ప్రధాన మలుపులన్నింటికి కళింగాంద్ర ఆద్యురాలిగానే వుంది. తెలుగు కధానికకు తొలి అడుగు “దిద్దుబాటు” కథ గురజాడ వారిదే. ఎన్ని వాదవివాదాలు వున్నా ఆధునిక కథ లక్షణాలు కలిగినది గురజాడ వారి కథే. ఇందుకు పోటీగా కొంత మంది తేదీ వివాద కారులు ముందుకు తెస్తున్న సాంఖ్యాయన శర్మ గారిది కూడా ఉత్తరాంద్రే.

ఉద్యమ ప్రభావానికి ముందు కళింగాంధ్ర నుండి రాస్తున్న ఆకుండి నారాయణ మూర్తి, బంకుపల్లి రామోజీరావు, వలితేటి బాలకృష్ణ, గంటి పుండరీ కాక్షయ్య, వేమకోటి సీతారామ శాస్త్రి, మసూనా, ఘండికోట బ్రహ్మాజీ రావు, చాగంటి సోమయాజులు, పూసపాటి కృష్ణం రాజు, తులసి, పతంజలి, పి.సరళాదేవి, భూషణం, బీనాదేవి. వీళ్లలో ఎక్కువ మంది సంఘ సంస్కరణ వస్తువుగా చేసుకున్నారు.

అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడేదాక జనం వ్యక్తిగత, కౌటుంబిక జీవితాల గురించి కథలు వచ్చాయి. అరసం ఏర్పడినాక మార్క్సిస్టు అవగాహనతో, కుటుంబంలో మరియు వ్యక్తుల్లో పరిణామాలని ఎనలైజ్ చేయడం మొదలయ్యింది. కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో ధనిక, పేద వర్గాలు, కార్మిక, కర్షక, భూస్వామ్య వర్గాల గురించి రాయడం మొదలయ్యింది. మనకు పరిశ్రమాధిపతులు-కార్మికులకథలు తక్కువ. భూస్వామ్య-కూలీలు కథలు ఎక్కువగా వచ్చాయి. పూర్తిగా నలుపు – తెలుపులుగా వుండేవి. ఒక పక్క మంచి _ఒక పక్క చెడు.ఎక్కువ గా లైంగిక పీడన మీదే వచ్చాయి, దోపిడీ మీద కాదు. అరసం ప్రభావం తగ్గిన తర్వాత వచ్చిన కథల్లో యివి లేవు. ఇందుకు కొంత మినహాయింపు కొ.కు. ఆయన వ్యక్తి గత, మానసిక, సామాజిక సమస్యల వెనుక ఆర్ధికాంశం చోదక శక్తిగా చిత్రీకరించారు. కల్లా కపటం లేని ప్రేమను ఆయన ఇష్టంగా రాసారు. అలాగే చాగంటి సోమయాజులు (చాసోగా ప్రసిద్ధులు) కథ అల్లిక బాగా తెలిసిన వ్యక్తి. కథా నిర్మాణం ఆయన నుండే నేర్చుకోవాలి.. తెలుగు చెహోవ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో కథా రచయిత గురించి చెప్పుకోవాలి. ఆయన బలివాడ కాంతారావు. ఈయన నైతికతను వస్తువుగా తీసుకొని కథా రచన చేసారు.

ఉద్యమ ప్రభావంతో రచనలు చేసిన వారు:

రావి శాస్త్రి: రావి శాస్త్రి నుంచే కథానిక స్పష్టంగా ఏర్పడింది. ఆయన వామపక్షం వైపు తిరిగిన తర్వాత ఆయన ప్రభావంతో తర్వాతి రచయితలందరూ రాసారు. దోపిడీ శ్రేణుల్ని ఎండగట్టడం ఆయనలో వుంది. వి.వి. గారన్నట్లు “రావిశాస్త్రి సాహిత్య దృక్పధం అంటే ఒక్క మాటలొ చెప్పాలంటే అది మార్క్సిస్టు దృక్పథం, రావిశాస్త్రిది సాహిత్యంలో చాలా స్పష్టంగా వర్గదృక్పథమని చెప్పవచ్చు. విరసం ఏర్పడినాక ఆయన “వేతన శర్మ” కథ రాసారు. రావిశాస్త్రి వర్గ దృక్పథానికి – కఠోర వర్గ దృక్పథానికి “పిపీలికం, “వేతన శర్మ” రెండు కొండగుర్తులు” అంటారు. ఉద్యమ ప్రభావం స్పష్టంగా “బెదురు” కథలో కన్పిస్తుంది. శక్తి వున్న వాళ్లు గెలుస్తారు. సాధనాలు ముఖ్యం కాదు అనే థీం తో రాసినవి “బెదురు, రవ్వ” కథలు.

కా.రా.: రావిశాస్త్రి గారిని గురువుగా అభిమానించే కాశీపట్నం రామారావు మాస్టారు శాస్త్రి గారి రచనల ప్రేరణతోను, ఆయనతో కొనసాగించిన మితృత్వం వలన రచనలలోని కిటుకులను, రచనా దృక్పథాన్ని గ్రహించానని చెప్తారు. శాస్త్రిగారు నగర జీవితం గురించి రాస్తే కారా మాస్టారు గ్రామీణ జీవితం గురించి రాసారు. ఆయన పీడన గురించి రాస్తే, కారా గారు ఆర్ధిక విషయాలు చెప్పారు. ఆనాటి నెహ్రో మార్కు సోషలిజంలోని డొల్లతనాన్ని, ప్రణాళికల వైఫల్యాన్ని, గ్రామీణ జీవితంలో వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో వాటి వెనుక గల కార్యకారణ సంబంధాలు గురించి కొనసాగిన ఆలోచనల మద్య పుట్టిన కథ “యజ్ఞం”. యిది ఆయన జీవితంలోనే గాక తెలుగు సాహితీ చరిత్రలోనే ఓ ప్రముఖ అధ్యాయం. యజ్ఞానికి ముందు గ్రామీణ జీవితం సాహిత్యంలో ఉన్నప్పటికీ అది గ్రామీణ స్వచ్చత, అమాయకత, వారి కష్టాలు మీదనో సాధారణంగా కేంద్ర్రీకృతమయ్యేవి. దీనికి భిన్నంగా ధనిక రైతులూ, పేద రైతులకూ మద్య సంబంధాలు, ఇరుపక్షాల అవసరాలు వేరని, ఇరు పక్షాలకు మద్య రాజీ సాద్యపడదని ఎడం ఒకటి ఏర్పడి పోవడం గమనించవచ్చు. ఉద్యమ ప్రభావంతో మాస్టారు రాసినవి “భయం, శాంతి, జీవధార, కుట్ర” కథలు చెప్పుకోతగినవి, విరసం సభ్యుడిగా “కుట్ర” కథ రాసారు.

భూషణం మాస్టారు: ఉద్యమం ఆరంభంకాక ముందే కథలు, కవితలు రాసారు. ఉద్యమంతో పాటు మమేకమైన రచయిత భూషణం మాస్టారు. వర్గ శతృ నిర్మూలన ప్రధానంగా కథలు రాసారు. ఉద్యమంతో వున్న సామీప్యత దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికణంగా మారుతున్న వైనాన్ని “అడివంటుకుంది, కొండ గాలి” రచనలలో ప్రతిబింబించాయి. సాయుధ పోరాట అవసరాన్ని ప్రతిబింబించే “పులుసు” లాంటి కథలు రాసారు. చివరిగా శ్రీకాకుళ పోరాటాన్ని రచనల ద్వారా రికార్డు చేసింది భూషణం మాస్టారే.

అట్టాడ అప్పల్నాయుడు: రావిశాస్త్రి, కా.రా., భూషణంల ప్రభావంతో ఈయన కథలు రాస్తున్నారు. ఈయన మొదటి సంపుటి “పోడు- పోరు” కథలు పోరాట కథలు. ఆ తర్వాత సాగిన రచనల్లో ప్రపంచీకరణ, ఆర్ధిక సంస్కరణలు మొదలైనటువంటి వాటి దుష్ప్రభావం సామాజిక జీవితంపై పడిన క్రమాన్ని వివరిస్తూ “ప్రత్యామ్నాయం”, “క్షతగాత్రగానం” కథాసంపుటాలు వచ్చాయి.

పతంజలి: రావిశాస్త్రిలొని నిశితమైన వ్యంగ్యం, శ్రీశ్రీలో వుండే ఎమోషనల్ కమిట్ మెంట్, పేదల పట్ల వుండే అమితమైన ప్రేమ, చాసోలో వుండే నిరాశావాదం కలగలిసిన రచయిత. “పిలకతిరుగుడుపువ్వు, గోపాత్రుడు, వీరబొబ్బిలి, చూపున్న పాట” కథల ద్వారా ఫ్యూడలిజం యొక్క అవశేషాల్ని ఎండగడుతూ నేటి రాజకీయ, న్యాయ, పోలీసు విభాగాల అన్యోన్య సంబంధాలను, వాటి వికృత పోకడలను ఉత్తరాంధ్రకే సాధ్యమైన సహజ వ్యంగ్య ధోరణిలో రచనలు చేసారు.

సువర్ణముఖి: శ్రీకాకుళ ఉద్యమం దారుణ అణచివేత తర్వాత రాజ్యం ఆదివాసి ప్రజలను పోరాటబాటనుండి తప్పించడానికి అనేక తాయిలాలు ప్రకటిస్తూ, ఐ.టి.డి.ఏ. లాంటి సంస్థల ద్వారా ఆదివాసీల నెత్తుటి గాయాలను పలాస్త్రీలతో మాన్పే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి ప్రత్యామ్నాయంగా వెల్లువెత్తిన తెలంగాణా జగిత్యాల జైత్రయాత్రకు కొనసాగింపుగా 1985 తర్వాత శ్రీకాకుళం మరింత ఎర్రబారుతున్న క్రమంలో సువర్ణముఖి, భూషణం మాస్టారి కొనసాగింపుగా ఉద్యమంతో మమేకమై ఆదివాసీ జీవితాలను ప్రత్యక్షంగా చూసి తనదైన నుడికారంతో సజీవ గ్రామీణ, ఆదివాసీ భాష – యాసలకు దగ్గరగా “సావుకర్చు, తగువులు, సికాకొలం, మళ్ళీ నచ్చలైట్లు, సుక్కి” కథలు రాసాడు. కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులు, షావుకార్లు చేస్తున్న మోసాలు, వారిపై జరుగుతున్న ఆర్ధిక దోపిడీ, ఆదివాసీ స్త్రీలపై జరుగుతున్న లైంగిక దోపిడీలను, వాటినెదుర్కొనే క్రమంలో వారు ఉద్యమాలవైపు వస్తున్న క్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్తాడు. అలాగే “గోరపిట్ట” కథలో ఆదివాసీ జీవితాలలో నేటి ఆధునికత పోకడ, క్రైస్తవ మత ప్రభావం, రాజ్య నిర్భంధం, రాజకీయ పార్టీల ప్రభావం, ఉద్యమ ప్రభావం కన్పిస్తాయి.

బజరా: ఉద్యమ ప్రభావంతోనే కథలు రాయడం ప్రారంభించాడు. స్త్రీల సమస్యలపై చాలా బలమైన కథలు రాసాడు. “రెక్కలగూడు” కథతో పాటు ఆ సంపుటిలోని కథలలో స్త్రీలపై అమలవుతున్న హింస, వివక్షతల గురించి, వాటి నెదుర్కొనే క్రమంలో వారి ధైర్యం, శక్తి ఎంతగొప్పవో చెప్పగలిగాడు. అలాగే రైతుల చితికిపోతున్న బ్రతుకులు, వారి సాంఘిక జీవనం, అనుబంధాలపై బలంగా రాసిన కథ “మట్టితీగలు”.

వీరిద్దరికీ ముందు ఎన్నెస్ ప్రకాశరావు రాసిన “పేపర్ టైగర్, రగులుకునే రాక్షసిబొగ్గు, పగ, డబ్బు” కథలు ఉద్యమ ప్రభావంతో రాసినవే. అలాగే బి.టి. రామానుజం, రాజేశ్వర రావు, అర్నాద్ ల కథలపై కూడా ఉద్యమ ప్రభావం ఉంది.

ఇంకా కూర్మనాధ్, గంటేడ గౌరునాయుడు, బి.వి.ఏ.రామారావు నాయుడు, కమలకుమారి, ఏ.వి.రెడ్డి శాస్త్రి, దాసరి రామచంద్రరావు, బగాది వెంకట్రావు, కొప్పర భానుమూర్తి, చింతా అప్పల్నాయుడు, జగదీష్, యిలా ఇప్పుడు రాస్తున్న రచయితలందరిపై ఉద్యమ ప్రభావం సంలీనంగా కొనసాగుతుంది.

శిల్పం: ఉద్యమ ప్రారంభ దశలో శిల్పం ప్రధానం కాదని వస్తువే ప్రధానమంటూ భావించటం జరిగింది. ఇది రచయితలందరి తొలి రచనలలో కన్పిస్తుంది. కానీ కథల పరమార్ధం చదివించగలగాలి, ఆలోచింప చేయగలగాలి అంటే తీసుకున్న వస్తువును కొత్త కోణంలో బలంగా చెప్పాలంటే మంచి శిల్ప నైపుణ్యం కూడా అవసరమని కా.రా. మాస్టారంటారు. ఇది చాలావరకు నేటి ఉత్తరాంధ్ర కథకుల కథలల్లో ప్రతిబింబిస్తుంది.

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 Responses to “40 ఏళ్ల ఉద్యమ సాహిత్యం – కళింగాంధ్ర వస్తు – శిల్పాలపై దాని ప్రభావం”

  1. 1
    దుప్పల రవికుమార్ Says:

    ఈ వ్యాసం బాగుంది. కానీ బలివాడ కాంతారావుగారి సాహితీ కృషిని మరికాస్త వివరించాల్సింది. భూషణం మాష్టారు చిక్కని కవిత్వం కూడా రాశారు.

  2. 2
    kcubevarma Says:

    రవికుమార్ గారికి అభిప్రాయం తెలియచేసినందుకు థాంక్స్ . వ్యాసం ఉద్యమ నేపథ్యంగా గల కథల కథారచయితలకు మాత్రమే పరిమితమయ్యాను. కాంతారావుగారు సామాజిక సమస్యలపై దృష్టి గల కథలను రాయలేదు. భూషణం మాస్టారి గురించి రాసిన పేరా మొదటి వాక్యంలోనే ఆయన కవితలు రాసిన విషయం రాసాను .

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో