Aug2009
తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవిత చిత్రణ పై కేంద్రసాహిత్య అకాడమి సదస్సు
తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవితం ఎలా చిత్రించడమైనది, ఇంకా ఏయే అంశాలను కథాసాహిత్యం పట్టుకోవలసి వుంది, ఇంతవరకు చిత్రించిన సాహిత్యపు బలాలు, పరిమితులు ఏమిటి అనే అంశాలపై చర్చించేందుకు గాను కేంద్రసాహిత్య అకాడమి తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సహకారంతో రెండు రోజుల సదస్సును జులై 13, 14 తేదీలలో నిర్వహించింది. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుండి వివిధ కథా రచయితలు, విమర్శకులు పాల్గొన్నారు.
కేంద్రసాహిత్య అకాడమి ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా వివిధ సామాజికాంశాలపై వివిధ ప్రాంతాలలో సమావేశాలను, సదస్సులను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జులై 13, 14 తేదీలలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖతో కలసి తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవిత చిత్రణపై సదస్సును నిర్వహించింది. రైతు జీవితానికి సంబంధించి నిర్ధిష్టతను అధ్యయనం చేసేందుకు, దానిని మరింతగా సాహిత్యంలో నమోదు చేసేందుకు తోడ్పడేందుకు గాను ఈ రెండు రోజుల సదస్సు ఉద్దేశింపబడింది. ఈ సదస్సు ఆరు సెషన్లు గా జరిగింది. ప్రముఖ కథా రచయిత ప్రొ. కేతు విశ్వనాధరెడ్డి, సాహిత్య అకాడమి ప్రాంతీయ కార్యదర్శి ఎ.యస్. ఇళంగోవన్, అకాడమి సలహా సభ్యులు మధురాంతకం నరేంద్ర ఈ సదస్సును పర్యవేక్షించారు.
ప్రారంభసమావేశంలో ఎ.యస్. ఇళంగోవన్ స్వాగతోపాన్యాసం చేస్తూ సమాజంలో రైతు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనదని, అందువలన వారి తక్షణ సమస్యలను కథారూపంలో నమోదు చేయడం ఎంతో అవసరమైనదని అన్నారు. ఆయన వివిధ ప్రాంతీయ భాషల మధ్య సాహిత్య, సాంస్కృతిక సంపర్కపు అవసరము ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ కృషిని సాహిత్య అకాడమి నిర్వర్తిస్తున్నదని దీనికి రచయితలందరూ తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్య అతిధి యూనివర్శిటీ ఉపాధ్యక్ష్యలు ప్రపంచీకరణ నేపథ్యంలో రైతు జీవితం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, ఈ సందర్భంగా వారి ఆలోచనలకు, ఉద్వేగాలకు సాహిత్య రూపం ఇవ్వాల్సిఉన్నదని అన్నారు.
కేతు విశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ విభజనల వల్ల ఒక భాషా సాహిత్యంలో ఏమి జరుగుతున్నదో, అక్కడి రచయితలు ఏమి ఆలోచిస్తున్నారో మరో ప్రాంతపు రచయితలకు తెలియడంలేదని, దీనివలన మన ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో ఏమి జరుగుతున్నదనే సమాచారం మనకు అందడం లేదని ఆయన అన్నారు. దీనిని బద్దలుకొట్టేందుకు గాను వివిధ భాషా సాహిత్యాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగాలని, అందుకు గాను ప్రతిభాషా, మిగతా భాషలకు తలుపులు తెరవాలని, అప్పుడు మాత్రమే సాహిత్య, సాంస్కృతిక సయోధ్య సాధ్యపడుతుందని అన్నారు. రచయితలకు కేవలం సాహిత్య పరిచయమే కాక సామాజిక శాస్త్రాల పరిచయం కూడా ఉండాలని, అప్పుడు మాత్రమే రచనలలో సమాజ ప్రతిఫలనం సమగ్రంగా జరుగుతుందని దీనికి రచయితలు కృషి చేయాలని అన్నారు.
ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ, తెలుగు కథ 1910 లో పుట్టినప్పటికి 1960ల వరకు రైతు జీవితాన్ని పట్టించుకోలేదని దీనికి కారణం రచయితలు రైతు జీవితం నుండి రాకపోవడమేనని అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో రైతు జీవితాన్ని చిత్రించిన తొలి రచయిత కె.సభ గా ఆయన ప్రకటించారు. 1960ల తర్వాత వచ్చిన కథా సాహిత్యంలో కూడా రైతు జీవితాన్ని అమూర్తంగా చిత్రించారని వివిధ ప్రాంతాల, వివిధ వర్గాల, వివిధ అస్తిత్వాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించినపుడే రైతును గురించిన కథాసాహిత్యం మరింత నిర్ధిష్టతకు చేరుకుంటుందని అన్నారు. ఈ సమావేశానికి తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు జి. దామోదర నాయుడు అధ్యక్ష్యత వహించారు.
ఈ సదస్సులో తెలంగాణా కథల్లో రైతు జీవితం, కోస్తాంధ్రా కథల్లో రైతు జీవితం, ఉత్తరాంధ్రాకథల్లో రైతు జీవితం, రాయలసీమ కథల్లో రైతు జీవితం అనే అంశాలపై వరుసగా నాలుగు సమావేశాలు జరిగాయి. తెలంగాణా కథపై జరిగిన చర్చకు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి అధ్యక్ష్యత వహించారు. తెలుగులో రైతు జీవితాన్ని చిత్రించిన మొదటి కథ “యజ్ఞం” అని ఆయన అన్నారు. తెలంగాణా కథ ఉద్యమ కేంద్రంగా ఉంటుందని రాయలసీమ కథ రైతు జీవితాన్ని గురించి మరింత ఎక్కువగా పట్టించుకుందని ఆయన భావించారు. చర్చలో వి. శ్రీదేవి, వి. త్రివేణి పాల్గొన్నారు. వి. శ్రీదేవి, అంపశయ నవీన్, బుర్రా రాములు, ననుమాస స్వామి, అనిశెట్టి రజిత కథల్లో చిత్రించిన రైతు జీవితాన్ని విశ్లేషించారు. వి. త్రివేణి తెలంగాణా రైతు జీవితంలో ఉద్యమాల పాత్రపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ సమావేశంలో పెద్దింటి అశోక్ కుమార్, కాసుల ప్రతాపరెడ్డి తమ కథలను చదివారు.
కోస్తాంధ్రా కథల్లో రైతు జీవితంపై జరిగిన చర్చకు కొండవీటి సత్యవతి అధ్యక్ష్యత వహించారు. వాడ్రేవు వీరలక్ష్మీదేవి, వి. ప్రతిమ, నండూరి రాజగోపాల్ పాల్గొన్నారు. కొండవీటి సత్యవతి మాట్లాడుతూ రైతు జీవిత చిత్రణలో పునరుక్తి అనివార్యం అని అన్నారు. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గోదావరి జిల్లాల కథలపై ఎక్కువగా దృష్టి నిలిపి తెలుగు కథా సాహిత్యంలో గిరిజనులపై కథలు లేవని దీనికి కారణం గిరిజనులనుండి కథకులు లేకపోవడమే అన్నారు. గోదావరి జిల్లాలలో ముఖ్యంగా కోనసీమలో అదనపు ఉత్పత్తి, అదనపు సమస్యలకు కారణమైందని వివరించారు. భూమి సరుకుగా మారి రొయ్యల పెంపకం, చేపల పెంపకం వంటివి దేవదానం రాజు, తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి కథల ఆధారంగా సారవంతమైన భూములను ఎలా ధ్వంసం చేసింది ఆమె వివరించారు.
నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ గాట్ ఒప్పందాల నేపథ్యంలో తెలుగు కథ మౌళిక మార్పుకు గురైందని అన్నారు. వర్తమాన సందర్భంలో పోలవరపు కోటేశ్వరరావు, వి.చంద్రశేఖర రావు లాంటి వాళ్ళు ధ్వంసం అయిన రైతు జీవితాన్ని చిత్రిస్తున్నారని అభిప్రాయపడ్డారు. చివరగా వి. ప్రతిమ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం, సెజ్ లు, ప్రపంచీకరణ వంటివి విధ్వంసానికి ఎలా కారణమవుతున్నది వివరించారు. జి. కళ్యాణ రావు, నల్లూరి రుక్మిణి, కాట్రగడ్డ దయానంద్ వంటి కథకులు శక్తివంతంగా రైతుల జీవితాన్ని చిత్రించారని అన్నారు. ఈ సమావేశంలో కాట్రగడ్డ దయానంద్ “పెద్దపండుగ” అనే కథను చదివారు.
ఉత్తరాంధ్రా కథల్లో రైతు జీవితంపై జరిగిన చర్చకు ఎ. యన్. జగన్నాధశర్మ అధ్యక్ష్యత వహించారు. ఉత్తరాంధ్రా జీవితాన్ని అర్ధం చేసుకుంటే మిగతా ప్రాంతాల రైతు జీవితం కూడా అర్ధం అవుతుందని ఆయన అన్నారు. మిగతా ప్రాంతాలలో రైతుల ఆత్మహత్యలు విరివిగా జరుగుతూ ఉన్నప్పుడు కళింగాంధ్రలో రైతుల ఆత్మహత్యలు లేవని దీనికి కారణం అక్కడ భూమి సరుకు కాదని కేవలం జీవనాధారం మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంలో గంటాడు గౌరునాయుడు, కె. యన్. మల్లీశ్వరి, జి. యస్. చలం మాట్లాడారు. గౌరు నాయుడు, గురజాడ “దిద్దుబాటు” మొదటి కథ అని అన్నారు. సంస్కరణోధ్యమం కథను పట్టించుకోలేదు అని ఆయన అభిప్రాయ పడ్డారు. మల్లీశ్వరి మాట్లాడుతూ రైతు సమస్య పురుషులకు మాత్రమే సంబంధించి మాత్రమే కాదని, అది స్త్రీల జీవితాలను మరింతగా తాకుతుందని వివరిస్తూ కాళీపట్నం, అప్పలనాయుడు, గౌరు నాయుడు కథల నుండి విశ్లేషించారు. బమ్మిడి జగదీశ్వరరావు తొలి స్త్రీవాద కథారచయితగా ప్రకటించాడు. జి. యస్. చలం మాట్లాడుతూ 1980కు ముందు రైతులకు అదనపు అవసరాలు లేవని, ఆ తర్వాత సమాజం రైతులకు అదనపు అవసరాలు కల్పించి వారి జీవితం చిద్రం కావడానికి దోహదపడిందన్నారు. సమావేశంలో చాగంటి తులసి, గొరుసు జగదీశ్వర్ రెడ్డి తమ కథలు చదివారు.
రాయలసీమ కథల్లో రైతు జీవితంపై జరిగిన చర్చకు నందలూరు కథా నిలయం నిర్వాహకులు అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష్యత వహించారు. స్వామి, వి.ఆర్.రాసాని, జి.వెంకట కృష్ణ ప్రసంగించారు. రాయలసీమకున్న ప్రత్యేకత, ఇక్కడి సమస్యలు అనివార్యంగా రైతు జీవితాన్ని కేంద్రంగా ఉండేందుకు దోహదపడ్డాయని అన్నారు. స్వామి మాట్లాడుతూ వ్యవసాయం, మిగతా ఇతర రంగాలకు దోహదపడితే, ఆ రంగాలు మాత్రం వ్యవసాయం ధ్వంసం కావడానికి కారణమయ్యాయన్నారు. సింగమనేని, కేతులు రాయలసీమ మాండలికాన్ని పాత్రల సంభాషణకే పరిమితం చేసారని అన్నారు. వి. ఆర్. రాసాని చిత్తూరు జిల్లా కథాసాహిత్యానికి పరిమితమై మాట్లాడుతూ రైతు జీవిత చిత్రణలో వివిధ తరాల రచయితల రచనలను విశ్లేషించారు. జి. వెంకట కృష్ణ రాయలసీమ రైతు జీవితాన్ని ప్రభావితం చేసే కరువు, ఫ్యాక్షన్, వివిధ సామాజిక వ్యవస్థలు, అభివృద్ధి విధనాలు, ప్రపంచీకరణ వంటి అంశాల నేపథ్యంలో రాయలసీమ కథలను విశ్లేషించారు. సుంకోజు దేవేంద్రాచారి, వేంపల్లి గంగాధర్, జి. ఆర్. మహర్షి తమ కథలు చదివారు.
ముగింపు సమావేశంలో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, బి. తిరుపతి రావు పాల్గొన్నారు. 107 సంవత్సరాల తెలుగు కథా చరిత్రలో రెండు లక్షలకు పైగా కథలు వెలువడినప్పటికీ రైతుల గురించి కథలు వందలలో మాత్రమే ఉన్నాయన్నారు. రైతు జీవితాన్ని ఆరాధనా స్థాయిలో కాకుండా, రైతే దళితుల పట్ల, స్త్రీల పట్ల వివక్షతను చూపడాన్ని గురించి ఆలోచించాల్సిన, రాయాల్సిన అవసరం ఉందని రాచపాళెం అన్నారు. బి. తిరుపతి రావు మాట్లాడుతూ ఆధునికత సారాంశంలో రైతు అంతాన్ని ఉద్దేశించిందని, పెట్టుబడి కేంద్రంగా నడిచే సమాజము రూపొందించడం దాని లక్ష్యం అనీ, కాబట్టి రైతును గురించి ఆలోచించేటప్పుడు ఆధునికతపై మన వైఖరి ఏమిటి అనేది ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు.
సదస్సు మరింత అర్ధవంతంగా నడవడానికి కొన్ని సూచనలు వచ్చాయి. వివిధ సమావేశాలకు అధ్యక్ష్యత వహించినవారు నేపథ్యాన్ని వివరించాలని, చర్చలో సీరియస్ విమర్శకులు పాల్గొంటే బాగుండేదని, చర్చల ఆధారంగా కొన్ని సూత్రీకరణలు చేసి ఉండాల్సిందని, అభివృద్ధి అనే దాని గురించిన తాత్విక అవగాహన చర్చలో పాల్గొన్నవారిలో సరిగా ఉన్నట్టుగాలేదని అభిప్రాయాలు వచ్చాయి.
5 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు
August 7th, 2009 at 5:30 am
రిపోర్ట్ ఇచ్చి మంచిపని చేశారు. అంతా చదివాక, సమావేశం నుంచి అప్పుడే వచ్చి జరిగిందంతా మననం చేసుకున్నట్టయింది. ఇలాంటి సదస్సులకు హాజరుకాలేని నాలాంటి వాళ్లకు ఇలాంటి రిపోర్టులే ఆధారం. థాంక్యూ.
August 8th, 2009 at 7:46 pm
రవికుమార్ గారి అభిప్రాయమే నాదీను. కథలు రాసేవాళ్ళకు ఉపరితలాంశాల పట్ల ఉన్న ప్రేమతోనే రాస్తున్న కథకులు వుంటున్నారు. సాహిత్యంవేరు, రాజకీయం వేరు అన్న ధోరణి ప్రబలి విధ్వంసానికి మూలాలను గుర్తించకుండా జరుగుతున్న రచనల వలన కన్నీళ్ళు వస్తాయి తప్ప మార్పునకు దోహదం కాదు. నేడు కొత్తగా వస్తున్న సహకారవ్యవసాయం్ పేరుతో జరగబోతున్న పెట్టుబడుల తుఫానును బక్కరైతు ఎంతవరకు తట్టుకోగలడు. కథలలో వ్యక్తమవుతున్న సానుభూతి ఆ కథకు పేరుతేవచ్చుకాని రైతుకు ఉపయోగపడదు. అలాగే రాస్తున్న రచనలను సామాన్యుల్ చెంతకు తీసుకుపోయే కృషి లేదు మన వద్ద. అకాడమీల చర్చలు వలన రచనకు సాన పట్టవచ్చుకాని అది చేరాల్సిన చోటుకు చేరితే బాగుంటుందని నా అభిప్రాయం.
August 9th, 2009 at 9:21 am
అరున గారి రెపొర్త్ చదివీను. వివరాలు తెలిసాఅయి.
చాల వరకూ సదస్సులు విమర్సలకు గురిఅవుతూనె వుంతాఈ. ఆసించిన ప్రయొజనాలు వుందవు.ఎది నాఅనుభవము.
మరిన్నివిషయాలు తెలియ చీయంది మిగతా సదస్సులగురించి. అరునగారికి
అభినందనలు.
అన్నపూర్న
September 10th, 2009 at 2:25 pm
[...] తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవిత చిత
October 13th, 2009 at 9:44 am
ఈనెల సంచిక చదివాను. ప్రజల మనిషె రాజగూపాల్ నిరి లూతొ తీర్చలీనిది.
అన్నపూర్న