లోరీన్! నువ్వే వొక కవిత!

Lorine Niedecker
Lorine Niedecker

Lorine Niedecker

ఈ శనివారం మాడిసన్-విస్కాన్సిన్ కి 45 నిమిషాల దూరంలో వున్న ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ ఇల్లూ, సమాధి చూడడానికి వెళ్ళాం నేనూ, నా కవిమిత్రుడు ఆస్టిన్ స్మిత్. మాడిసన్ వచ్చిన కొత్తలో వొక పాత పుస్తకాల షాపులో కవిత్వం పుస్తకాలు చూస్తున్నప్పుడు నా పక్కనే వున్న వొక అమెరికన్ కవయిత్రీ, స్నేహితురాలు “ఈ కవిత్వం చదువు” అంటూ అప్పటికప్పుడు లోరీన్ పుస్తకాన్ని కొని ఇచ్చింది. “1940 ల కవిత్వం కాదు, నేను 2000 తరవాతి కవిత్వం చదవాలి. ఇది నాస్టాల్జియా వాసనేస్తోంది” అన్నాను నేను నవ్వి. “నువ్వు ముందు చదువు. నీ కాలానికి అది నాస్టాల్జియా. ఆ కాలానికి అది విప్లవం” అందామె.

ఎప్పుడో 1903లో వొక మారుమూల పల్లెలో పుట్టి, వొక ఆస్పత్రిలో అంట్లు తోముతూ రోజు కూలీ మీద నిత్య అనారోగ్యంతో కనాకష్టంగా బతుకుతూ “ఈ కాసిన్ని అక్షరాలే నా జీవితంలో కొండంత శాంతీ, వెలుగూ” అనుకొని బతికిన ఆ లోరీన్ ఇంటి చుట్టూ తిరిగి, ఆమె చిన్ని సమాధి దగ్గిర కూర్చునప్పుడు నేనూ, ఆస్టిన్ చాలా సేపు మౌనంగా వుండి పోయాం. ఆమె సమాధి దగ్గిర కాసింత మట్టి చేతుల్లోకి తీసుకొని, కళ్ళకి అద్దుకొని “కవి సమాధి” అంటూ కళ్లు తడి చేసుకున్నాడు ఆస్టిన్. “ఈ పోస్టు మాడ్రన్ అతి చప్పుడులో ఆ పల్లెటూరి గోడు ఎవరు వింటారు?” అని ఆస్టిన్ తిరుగు ప్రయాణంలో అడిగిన ప్రశ్న చెవుల్లో గింగురుమంటూండగా ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను.

లోరీన్ కవిత్వం ఇవాళ ఎమిలీ డికిన్సన్, విలియం కార్లోస్ విలియం లాంటి వాళ్ళ కోవలోకి చేరింది కాని, 1970లో మెదడులో నరాలు చిట్లి చనిపోయే దాకా ఆమె అంతగా పేరూ వూరూ లేని కవయిత్రే! ఆమె నిరుపేద గూటి ముందు కూర్చొని మేము ఆ కరెంటు లేని చీకటి ఇంట్లొ, ఒకే ఒక్క గదిలో ఈ విస్కాన్సిన్ చలిని తట్టుకొని ఆమె ఎలా బతికిందా అనుకున్నాము. ఆ వూరికి దాదాపూ ఆమెది చివరి ఇల్లు; ఎటో విసిరేసినట్టుగా వుంది అది. వెనక అడివి, పక్క నించి నది. పిచ్చుకల నిత్య సంభాషణలు. తనే కట్టుక్కున కలల గూడు.

ఆ కాసింత జాగాని కాపాడుకోడానికే ఆమె రెక్కలు ముక్కలు చేసుకుంది. ఒక పూట తినీ, ఇంకో పూట తినకా ఆ ఇంటిని కాపాడుకుంది. కాని, అంత పేదరికంలోనూ ఆమె సంపాధించుకున్న పుస్తకాలూ, పత్రికలకి కట్టిన చందాలూ (ఇవన్నీ ఇప్పుడు స్థానిక గ్రంధాలయంలో జాగ్రత్త చేశారు) చూసి, ఆమె కవిత్వ ప్రేమ ఎంత గాఢమయిందా అనిపించింది. 1930ల నించి వచ్చిన గొప్ప ప్రపంచ సాహిత్యం దాదాపు చదివింది ఈ పల్లెటూరి పని మనిషి. ఆమె రాసింది నాలుగయిదు పుస్తకాలే. కాని, 1930ల ఆర్ధిక మాంద్యాన్ని వొక పల్లెటూరి స్త్రీ గా అనుభవించి పలవరించి రాసిన కవిత్వం అది. ఆ కాలం ఆకలి చరిత్రని చెప్పే కవిత్వం అది. ఇవాళ అత్యాధునిక కవులు పాద విభజనతో చేసిన అన్ని ప్రయోగాలూ ఇవాల్టి కన్న అర్ధవంతంగా చేసింది ఆమె. మరీ ముఖ్యంగా పట్టణీకరణ, ఆర్ధిక మార్పుల వొత్తిళ్ళ కింద కునారిల్లిపోతున్న పల్లె కన్నీరుని తన ఆత్మకథనంతో కలిపి పాడిన తల్లి ఘోష ఆమె కవిత్వం.

(త్వరలో లోరిన్ వూళ్ళో అనుభవాలతో కలిపి, తెలుగులో పుస్తక రూపం తీసుకోనున్న లోరిన్ జీవిత కథ “ఒక కవిత” నించి )

2

లోరిన్ వూరి నించి వచ్చిన రాత్రి నిద్ర పట్టక, మిత్రుడు ఆస్టిన్ రాసి పంపిన కవిత ఇది. దీన్ని అనువాదం చెయ్యలేక పోతున్నాను. కాని, నెమ్మదించని బాధకీ, నిబ్బరంగా వుండనివ్వని వెల్తికీ, సెగలాంటి అశాంతికీ, నిద్ర పట్టనివ్వని జ్ఞాపకానికీ భాష వుందా?

Looking For Lorine Niedecker

- Austin Smith

Your house is being gutted. The dry
wall has been removed, revealing
the wiring. On the boards
that will be hidden are written
measurements, lengths in
the black, neurological hand
of the contractor. But in the midst
of it all, the red stove remains
rooted, all four of its feet pressed
to the floor like a deer in autumn
woods before the season swings
open like a door. The door
is locked: I tried it: my hand
engulfed the knob like a sudden
spider. I came looking for you,
Lorine, but all I found was this
gutted house. But it has made me
wonder whether a poem is nothing
more than a gutted mind, the wiring
exposed, the door locked, and a fire
built long ago still burning for no one.

* * *

రెండు లోరిన్ కవితలు

నిజమే, నా చెట్టూ!
నిన్ను కత్తిరించాను కాస్త.
మరేమీ లేదు
నా పాత మిత్రుడు సూర్యుడ్ని
కొంత పలకరిద్దామని.

2
పనికొచ్చేదేదొ
నేర్చుకొమ్మా,
అన్నాడు తాతయ్య.

నేనేమో
ఈ పదాలు చెక్కుతూ
కూర్చున్నాను
ఈ బల్ల ముందు కూర్చొని.

ఈ చెక్కుడు పని నించి
‘లే ఆఫ్’ లేదులే, తాతయ్యా!

* * *

14 అభిప్రాయాలు »దర్వాజ

14 Responses to “లోరీన్! నువ్వే వొక కవిత!”

  1. 1
    ramana Says:

    అఫ్సర్ గారూ:

    లోరీన్ గురించి మీ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాను.

    ఆస్టిన్ కవిత సందర్భానికి తగినట్టుగా వుంది.

    అమెరికాలో ఈ తరం కవుల గురించి కూడా రాయండి.

    దర్వాజా నించి కొత్త గాలులు ప్రసరింప జేస్తున్నందుకు థాంక్యూ…

    రమణ

  2. 2
    kcubevarma Says:

    లోరిన్ సమాధి వద్ద మీరు కూర్చొని ఆ మట్టిని కళ్ళకద్దుకున్నామన్న దృశ్యం కనులు మూసుకొని నేను కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను సార్. పేదరికం వలననే ఆమె పేరు అంతగా ప్రాచుర్యం కాలేదా? మీ దర్వాజా కాలం నుండి మరుగున పడ్డ వారి రచనల పరిచయ భాగ్యం కలిగిస్తారని ఆశిస్తూ..

  3. 3
    బొల్లోజు బాబా Says:

    అఫ్సర్ గారికి
    అద్బుతంగా ఉందండీ మీ పరిచయం.
    ఇక్కడ అప్రస్తుతమనుకొన్నప్పటికీ నాకుకలిగిన కొన్ని ఆలోచనలు ఇవి. మనకీ పాశ్చాత్యులకీ కవుల పట్ల ప్రదర్సించాల్సిన గౌరవంగురించి ఇలాంటి వ్యాసాలు చదువుతున్న కొద్దీ ఒకింత అసంతృప్తే మిగులుతూంటుంది. ఆధునిక కాలానికి చెందిన శ్రీశ్రీ, చలం, విశ్వనాధ, బుచ్చిబాబు, రావిశాస్త్రి, జాషువా వంటివారల సమాధులు కానీ, లేదా వారి వస్తువులతో కూడిన మ్యూజియం లు కానీ నెలకొల్పుకొన్న దాఖలాలు మనకు కనపడవు. ప్రయత్నాలు జరుగుతాయన్న ఆశలూ లేవు.

    మీరు ఇలాంటి వ్యాసాలు వ్రాయండి. కనీసం మనసుల్లోనైనా మన కవులకు సముచిత స్థానం ఏర్పడటానికో, పదిలపడటానికో సహకరిస్తుంది.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  4. 4
    afsar Says:

    రమణ గారూ, ఈ తరం కవుల పరిచయం చేస్తాను. వచ్చే నెల కవి ఈ తరం వాడూ, మన దక్షిణాది వాడు కూడా.

    వర్మ: మీ స్పందనకి ధన్యవాదాలు. కవులకి దక్కే పేరూ వూరూ వాళ్లు ఏ వర్గం, ఏ కులం, ఏ ప్రాంతం వారు అన్నదాన్ని బట్టి కూడా వుంటుంది. అది వొక వాస్తవ విషాదం. లోరీన్ న్యూయార్కులోనో ,మరో ఉన్నత స్థాయి కుటుంబంలోనో పుట్టి వుంటె, వొక నిరుపేద జాలరి కూతురు కాకపోయి వుంటే ఆమె పేరు ఇంకొకలాగా మార్మోగి వుండేది. ఇప్పుడే వొక అద్భుతమయిన అమెరికన్ రచయిత్రుల సంకలనం చదువుతున్నా, ఇందులో లోరిన్ పేరు ఎక్కడయినా వుందా అని వెతుకుతూ- లేదు. వివక్ష. చిన్న పల్లెటూరు కవి అని. హైద్రాబాద్ కి భిన్నంగా లేదు ఈ స్థితి!

    బాబా: మనకి రచయితల మీద నిజంగా గౌరవం లేదు. కింది వర్గాల మీద అస్సలు లేదు. అదృష్టం బాగుండి ఆ కవో , మరొకరో అగ్ర వర్ణంలో పుట్టి ఉంటే, కనీసం ఆ పెద్ద కులాల వాళ్లు నూరేళ్ల పండ్గలు చెయ్య వచ్చు. మరో సారి నా “యానామ్ వేమన” చదవండి. నా ఘోష ఇప్పటికీ అదే! బతికి వుండగానే దిక్కు లేదు, పోయాక ఎవరు చూస్తారు?

  5. 5
    Srinivas Chuthari Says:

    మంచి ప్రయత్నం అఫ్శర్ గారు.

  6. 6
    జానీ Says:

    అఫ్సర్ గారు, ఏడారిలొ ఒయాసిస్సు దొరికినంత ఆనందంగా ఉంది మిమంల్ని ఫేస్ బుక్ లొ కలిసినప్పటి నుంచి. మళ్ళీ మీ బ్లాగ్ లింకుల ద్వార తెలుగు సాహిత్యం చదువుతున్నాను . మీ దర్వాజా లోకి ఆహ్వానించి గొప్ప కవులను పరిచయం చేస్తున్నందుకు మీకు, ప్రాణహిత కు ధన్యవాదములు. జానీ

  7. 7
    vibhu Says:

    చాలా బాగున్నాయి ఉదహరించిన లోరీన్ కవితలు.కాలాతీతంగా కూడా ఉన్నాయి.

  8. 8
    himabindu Says:

    అఫ్సర్ గారు,
    నేను చదవడము ఇదే మొదటి వారము , కాబట్టి కొంత వెనుకబడే వున్నాను. నేర్చుకోదగ్గ, చదివి బాగుపడే విషయాలు చెపుతున్నారు. For me it’s a good education. Thank you very much.

  9. 9
    హెచ్చార్కె Says:

    అఫ్సర్,
    చాల మంచి పని చేస్తున్నావు.
    మంచి పని చాల బాగా చేస్తున్నావు.
    కంగ్రాజ్యులేషన్స్.

  10. 10
    Pasunoori Ravinder Says:

    అఫ్సర్ గారు పరిచయ పరిమళం చాలా కాలం వెంటాడేలా వుంది కంగ్రాట్స్ !!

    ”నెమ్మదించని బాధకి
    నిబ్బరంగా ఉండనివ్వని వెల్తికి
    సెగలాంతి అశాంతికి
    నిద్రపట్టనివ్వని భాష వుందా……?”

    లోరిన్ గురించి తెల్సుకొవాలనే ఆసక్తిని కలిగించినందుకు మరీ మరీ ధన్యవాదాలు
    మీ
    పసునూరి

  11. 11
    vrdarla Says:

    అఫ్సర్ గార్కి నమస్తే,
    అమెరికాలోనూ కవులను వారి వర్గాన్ని అధారంగానే ” పరిగణిస్తున్నారా” అనిపించింది.
    మీరు రాసిన ఈ వాక్యాలు:” ఈ పల్లెటూరి పని మనిషి. ఆమె రాసింది నాలుగయిదు పుస్తకాలే. కాని, 1930ల ఆర్ధిక మాంద్యాన్ని వొక పల్లెటూరి స్త్రీ గా అనుభవించి పలవరించి రాసిన కవిత్వం అది. ఆ కాలం ఆకలి చరిత్రని చెప్పే కవిత్వం అది” నన్ను బాగా కదిలించాయి.
    ఆ కవయిత్రి జీవిత వ్యధ మీ కలంలో పలికిన గాథ మాహృదయాల్ని ఏదో తెలియని వేదనపలికించేలా చేస్తుంది. చాలా అలవోకగా అద్భుతంగా రాశారు.
    మీ
    దార్ల

  12. 12
    ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Says:

    [...] లోరీన్! నువ్వే వొక కవిత! : అఫ్సర్ [...]

  13. 13
    సాయికిరణ్ కుమార్ కొండముది Says:

    “ఈ కాసిన్ని అక్షరాలే నా జీవితంలో కొండంత శాంతీ, వెలుగూ” అనుకొని బతికిన ఆ లోరీన్ ఇంటి చుట్టూ తిరిగి, ఆమె చిన్ని సమాధి దగ్గిర కూర్చునప్పుడు నేనూ, ఆస్టిన్ చాలా సేపు మౌనంగా వుండి పోయాం. ఆమె సమాధి దగ్గిర కాసింత మట్టి చేతుల్లోకి తీసుకొని, కళ్ళకి అద్దుకొని “కవి సమాధి” అంటూ కళ్లు తడి చేసుకున్నాడు ఆస్టిన్. “ఈ పోస్టు మాడ్రన్ అతి చప్పుడులో ఆ పల్లెటూరి గోడు ఎవరు వింటారు?” అని ఆస్టిన్ తిరుగు ప్రయాణంలో అడిగిన ప్రశ్న చెవుల్లో గింగురుమంటూండగా ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను.
    ===========
    అఫ్సర్ గారు నమస్కారాలు. చాలా హృద్యంగా వ్రాసారండి. ఇలా చరిత్రకు అందని మరెందరు కవులున్నారో! మీ ‘యానాం వేమన’ ఎక్కడ దొరుకుతుందండి?

  14. 14
    afsar Says:

    డియర్ సాయి:

    ధన్యవాదాలు.
    యానాం వేమన గురించి బాబా రాసిన వ్యాసం చూడండి. అక్కడే పద్యం కూడా వుంది.

    http://pustakam.net/?p=1982

    అఫ్సర్

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో