మతిమరుపు

ఏదైనా సమయానికి గుర్తుకు రాకపోతే చిరాకుగా అనిపిస్తుంది. అదేగనక ఏ పరీక్ష రాస్తున్నప్పుడో, ప్రేక్షకుల ఎదుట నాటకంలో నటిస్తున్నప్పుడో, ప్రసంగిస్తున్నప్పుడో జరిగితే మరీ కంగారుగా ఉంటుంది. ఉన్న కాస్త మతీకూడా పోయినట్టనిపించడంతో మరిన్ని పొరబాట్లు చేస్తాం. ఎంతో సామర్య్థం కలిగిన మానవమేధస్సుకు మతిమరుపు అనే అవలక్షణం ఎందుకుంటుంది? మహామేధావంతులుకూడా చిన్నచిన్న విషయాలు మరిచిపోయి అభాసు పాలవుతూఉంటారెందుకు?

అయితే ఈ ప్రశ్నలకు ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి. వాటన్నిటినీ పరిగణిస్తే మతిమరుపు అనేది జీవపరిణామంలో ఒక లక్షణంగా ఎందుకేర్పడిందో అర్థంచేసుకోవచ్చు. మొదటి విషయమేమి టంటే జ్ఞాపకశక్తి ఎల్లవేళలా లాభకరం కాదు. కొన్ని జ్ఞాపకాలు బాధాకరంగానూ, తీవ్రమైన మానసిక సంక్షోభాన్ని కలిగించేవిగానూ ఉంటాయి కనక కాలక్రమాన వాటిని మరిచిపోవడం మనసుకు ప్రశాంతత నిస్తుంది. అలా జరగకపోతే ఎల్లకాలం మానని గాయాలూ, శారీరకబాధల్లాగే కొన్నిరకాల స్మృతులు మనకు దీర్ఘకాలికమైన హాని కలిగించగలవు. అందుచేత కొన్ని సందర్భాల్లో మతిమరుపు అనేది శ్రేయస్కరమైన ఏర్పాటు.

ఇందులో మరొక అంశంకూడా ఉంది. మనకు నిత్యమూ అనేక కొత్త అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఇవాళ్టి సంఘటనకన్నా నిన్నటిదీ, అంతకన్నా మొన్నటిదీ పాతబడిందనే అవగాహన వాటి జ్ఞాపకాలు క్రమంగా బలహీనపడడంద్వారానే మనకు కలుగుతుంది. అలాకాకుండా ప్రతిదీ ఒకే స్థాయిలో ప్రస్ఫుటంగా, శాశ్వతంగా గుర్తుండిపోయేటట్టయితే మనకు కాలం గడుస్తున్నట్టుగా అనిపిం చదు. కొందరు పరిశీలకుల లెక్కన కాలవ్యవధిని గురించి సరిగా తెలియకపోతే మనుషులకైనా, ఇతర ప్రాణులకైనా పరిస్థితులకు అనుగుణంగా మారడం కష్టమౌతుంది. ఒకప్పటి తమ ప్రవర్తన ప్రస్తుత కాలానికి పనికిరాదనే సంగతి తెలుస్తూఉండడం జీవపరిణామపు పోటీలో నెగ్గడానికి అవసరమని వారి ఉద్దేశం. మరి కొందరు జ్ఞాపకశక్తి విషయంలో మెదడుకు పరిమితమైన సామర్య్థం ఉంటుందనీ, సమాచారం మరీ ఎక్కువయితే కొన్ని మరిచిపోవడం తప్పనిసరి అనీ అంటారు.

ఏదైనా జ్ఞాపకంగా నమోదయే క్రమంలో నాలుగు దశలుంటాయని పరిశీలనలు తెలుపు తున్నాయి. వీటిలో మొదటిది ఇంద్రియాలద్వారా అందే సంవేదకస్మృతి. మనం వినేవీ, చూసేవీ అన్నీ కొన్ని సెకండ్లపాటు గుర్తుండి అంతలోనే మాయమైపోతాయి. అనుభవాలన్నీ ఒకదాని వెంట మరొకటిగా కలుగుతున్నట్టనిపిస్తాయి. రెండోరకం జ్ఞాపకశక్తి ఆచరణకు సంబంధించినది. ఇది భావి జ్ఞాపకాలకూ, కార్యాచరణకూ మధ్యస్థంగా ఉంటుంది. విషయాలను గుర్తుతెచ్చుకునేందుకుకూడా పని కొస్తుంది. ఇది కొన్ని నిమిషాలసేపే పనిచేస్తుంది. దీని సామర్య్థం పరిమితం; మనం సామాన్యంగా ఒక్కసారిగా ఏడు విషయాలకన్నా ఎక్కువ గుర్తుంచుకోలేమని ప్రయోగాల్లో రుజువైంది. జాబితాకు మరొకటి చేరిస్తే మునుపటి వాటిలో ఒకటి మరిచిపోతాం.
మూడోరకపు జ్ఞాపకాలు స్వల్పకాలికంగా అనిపిస్తాయి; ఇవి ఒకటిరెండు రోజులపాటు గుర్తుం టాయి. ఇవి గుర్తుండడానికి కారణం వీటిని మనం దీర్ఘకాలికస్మృతుల్లోకి నెట్టకపోవడమే కావచ్చు. ఈ జ్ఞాపకాలు కొన్ని ప్రక్రియలకు లోనయిన తరవాతనే దీర్ఘకాలికమైనవిగా గుర్తుండిపోతాయి. నాలుగో రకానికి చెందిన ఈ దీర్ఘకాలికజ్ఞాపకాలేవీ మనం మరిచిపోము. ఎల్లకాలం ఈ పద్ధతిలో ఏవైనా విషయాలు గుర్తుండాలంటే అవి వివరాలవారీగా మస్తిష్కభాండాగారంలో పొందుపరచబడాలి. ఇదెంతో జటిలమైన ప్రక్రియలద్వారా జరుగుతుంది. మెదడులోని లక్షలకోట్ల నాడుల కణజాలంలో ప్రసారమయే సంకేతాలు ఇందులో భాగమే. ఇలా నిక్షిప్తమైన సమాచారం మెదడులోని వివిధభాగాలకు చేరుకున్న ట్టుగా అనిపిస్తుంది. కావలసినప్పుడల్లా విషయాన్ని వెలికితీయడంలో విఫలమైనప్పుడే మతిమరుపు అనే భావన కలుగుతుంది.

పూర్వపురోజుల్లో వృద్ధాప్యపు సహజలక్షణాల్లో మతిమరుపు ఒకటని భావించేవారు. ఈనాటి జీవితవిధానమూ, దృక్పథమూకూడా మారుతున్నాయి. సరైన వైద్యబీమా సదుపాయంలేని అమెరికా వంటి దేశాల్లో 70 ఏళ్ళకు పైబడినవారు సైతం ఉదరనిమిత్తం కార్లునడిపి ఉద్యోగాలు చెయ్యవలసి వస్తోంది. తక్కిన ఇబ్బందులతోబాటు వీరికి తమ ఆరోగ్యం గురించిన ఆందోళనకూడా ఉంటుంది. వైద్యుల లెక్కన ఈ వర్గంలోకూడా అప్పుడప్పుడూ ఏదైనా మరిచిపోవడం ఎవరికైనా స్వాభావికమే కాని వయసుమీరినవాళ్ళలో ఇది మరీ ఎక్కువైతే ఆల్జ్‌హైమర్‌ వ్యాధివంటిదేదైనా మొదలౌతోందేమో పరీక్ష చేయించుకోవాలి. 65 ఏళ్ళు పైబడినవారిలో పది శాతానికి మతిమరుపు ఒక రుగ్మత రూపంలో కనిపిస్తుంది. వీరిలో 65 శాతం ఆల్జ్‌హైమర్‌ వ్యాధికీ, 15 శాతం ధమనుల గోడలు దళసరిగా మారే రోగాలకూ, తక్కినవారు ఇతర రుగ్మతలకూ లోనవడం జరుగుతుంది. అడిగిన ప్రశ్నలే మళ్ళీమళ్ళీ అడుగుతూ ఉండడం, పరిచితప్రాంతాల్లోకూడా అయోమయానికి లోనవడం, స్వంత వస్తువులను తరుచుగా మరిచిపోవడం, సమయాన్ని గురించీ, మనుషుల, స్థలాల గురించీ అవగాహన కోల్పోవడం మొదలైన లక్షణాలన్నీ కొన్ని హెచ్చుతగ్గులతో ఇలాటివారిలో కనబడతాయి.

ఇలా కాకుండా ఆరోగ్యవంతులు ఒక్కొక్కప్పుడు బాధను కలిగించే కొన్ని జ్ఞాపకాలను బుద్ధి పూర్వకంగా మరిచిపోగోరుతూ ఉంటారు. వీరు ఆత్మశక్తిద్వారా అటువంటిది సాధించగలరని ప్రయోగాల్లో తెలుస్తోంది. వీటిలో స్వచ్ఛందంగా పాల్గొన్నవారికి కొన్ని పదాలజంటలనిచ్చి ప్రతి జంటలోనూ ఒక మాటను ప్రయత్నపూర్వకంగా మరిచిపొమ్మని చెప్పారు. అలాగే జరిగిందికూడాను. మెదడును చిత్రీకరించే ఎంఆర్‌ఐ యంత్రాల పర్యవేక్షణలో వారికి ఒక పదం కనబడేట్టు చేసి రెండో పదాన్ని గుర్తు చేసుకోమన్నారు. వారీ పని చేస్తున్నప్పుడు జ్ఞాపకశక్తికి కేంద్రంవంటిదైన హిపోకేంపస్‌లో ప్రక్రియలు తగ్గడం, మెదడు ముందుభాగంలో తీవ్రమవడం గుర్తించారు. సుమారు వందేళ్ళ క్రితం ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన విషయాలకు ఇది శారీరకనిరూపణలాగా అనిపించింది. అవాంఛనీయమైన జ్ఞాపకాలు అణచివేతకు గురిఅవుతాయనీ, అవన్నీ అప్పుడప్పుడూ మనం అప్రయత్నంగా పలికే మాటల్లోనూ, కొన్ని వింత కలలద్వారానూ బైటపడతాయని ఫ్రాయిడ్‌ అనేవాడు. దీన్నిబట్టి చూస్తే మెదడుకు అన్నీ గుర్తుంచుకోగలగడం ఎంత ముఖ్యమో, కొన్నిటిని మరిచిపోగలగడంకూడా అంతే ముఖ్యమని తెలుస్తోంది.

తక్కిన ప్రాణుల్లాగే మనుషులకుకూడా చైతన్యం అనేది ప్రాథమికరూపంలో మొదలై, మెదడు ఎదుగుతున్నకొద్దీ అనుభవాలను సంతరించుకోవడం, అవసరమైనవాటిని జ్ఞాపకాలుగా నిలుపు కోవడం, తక్కినవాటిని మరిచిపోగలగడం వగైరా సంక్లిష్టప్రక్రియల స్థాయికి చేరుకుంటుంది. శ్రద్ధగా వినడం, గమనించడం, అభ్యాసంచెయ్యడం మొదలైనవన్నీ పనికొచ్చే విషయాలను బాగా గుర్తుంచు కునేందుకు పనికొస్తాయి. తెలివైనవారుగా పేరుపొందేవారు ఆ విషయాలను అర్థం చేసుకుని, వాటిలోని వివరాల మధ్యనుండే సంబంధాల అవగాహనద్వారా కావలసినప్పుడల్లా తమ మనసులో ఉన్న సమాచారాన్ని గుర్తుచేసుకుంటూ విజయం సాధించగలుగుతారు. ఇవన్నీ అస్తవ్యస్తంగా జరిగితే స్వతహాగా తెలివితేటలున్నప్పటికీ కొందరు అపజయాలను ఎదుర్కుని బాధ పడవలసివస్తుంది.

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

One Response to “మతిమరుపు”

  1. 1
    ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Says:

    [...] మతిమరుపు : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో