తరగని దూరం

“ఇటు వైపెందుకూ??”

అచ్చం జేబుదొంగని పట్టుకున్నట్టే అడిగింది ఆవిడ.

నా మొహం మళ్ళీ నల్లబడింది. స్కూటరు ఎక్కిన దగ్గన్రుంచీ ప్రతి మలుపు దగ్గరా ఇటెందుకు? అటెందుకు.. అని ఆవిడ సతాయిస్తూనే వుంది.

“ఇటు వన్ వే ట్రాఫిక్కండీ…”

“అటు పెళ్ళి పందిరి వేశారు కదండీ….”

“ఆ వైపు కంకర వుంది…”

“అదిగో అక్కడ గోతులు తవ్వారు చూశారా…”

ఎప్పటికప్పుడూ ఓపిగ్గా జవాబిస్తూ శీల పరీక్షకి తట్టుకుంటున్నాను..

అసలు దీనికంతటికీ కారణం మా సరళ. తనే తగిలించింది నాకు ఈవిడ్ని.

జున్ను వండాను, తిందువుగాని రారా అంటే ఎరక్కపోయి వచ్చాను. ఈ మహాతల్లి బాధ్యత అప్పజెబుతుందని నాకేం తెలుసు?

“హమ్మయ్య వచ్చేశావా.. (చచ్చావన్నమాటే) సమయానికి దేవుడల్లే వచ్చావు. (కా.కా చూడూ) ఈవిడ పాపం, (అవును ఆవిడే ఒక పాపం) చుట్టాలింట్లో పెళ్ళికని వచ్చిందట. (ఎందుకట) మా తోటికోడలు పెద్దమ్మకి స్వయానా వేలు విడిచిన మేనత్తకూతురు.. (అబ్బో ఎంతదగ్గరిచుట్టమో కదా) ఏమండీ, అంతేనా.. (ఋజువులూ సాక్ష్యాలూనా) అడ్రసంతా కార్డులో వుందిట గాని కార్డు ఇంట్లోనే మర్చిపోయిందట.. (ఎంత మంచిపని చేసింది). మా ఇంటి ఫోను నంబరు వుండబట్టి ఫోను చేసింది. పొద్దున్న మీ బావ స్టేషన్ కి వెళ్ళి తీసుకొచ్చాడు. (తేకపోతే నువ్వూరుకుంటావా..?) సాయంత్రం దిల్ సుక్ నగర్ లో

దింపుతాననే అన్నారనుకో, అయినా ఎందుకింక, నువ్వెలాగూ వచ్చావూ కదా. (హు.. దేవుడా) ఓ పక్క వానొచ్చేలా వుంది. బాబ్బాబూ.. మంచివాడివి కదా, (నిజంగానా) కాస్త దింపేసి రారా..(అదీసంగతి).”

“ఇదిగో వకుళ గారూ, వీడు మా తమ్ముడూ. ఇక్కడికి దగ్గర్లోనే హైదరగూడలో వుంటాడు. సినిమా బిజినెస్సు చేస్తున్నాడు. ఏరా అంతేనా. ఆ కంపెనీలోనే వున్నావా? మళ్ళి మారిపోయావా? (తమ్ముడి పరువు తియ్యడం కంటే అక్కకి కావలసినదేముంది) అంటు నవ్వి, సరే పద పాపం ఆవిడ ఎదురుచూస్తోంది.” తొందర పెట్టింది. సరళ ఎప్పుడూఇంతే. సుడిగాలిలా చుట్టేస్తుంది. దిక్కుతోచనివ్వదు. ప్లేటులో జున్ను ముక్క నోటికి రుచించలేదు. ఓ పక్క అర్జెంటుగా నేను వాసవిని కలవాలి. ఇవాళ ఆరు గంటలకల్లా మేము ఎప్పుడూ కూచునే ట్యాంకుబండ్ మీద వుండమంది. చూసి నెలనాళ్ళయ్యింది. పొద్దుట్నించీ తహ తహలాడుతున్నాను. చిరు జల్లులో వాసవి నడుంచుట్టు చెయ్యేసి కూచునే అదృష్టం లేకుండా అక్క ఈ పనిలో ఇరికించింది. అసలిక్కడికి రాకుండా వుండాల్సింది. హు.. జున్నుకోసం ఎగబడి వచ్చేసాను.

“బావ వస్తాడేమో చూద్దాం సరళా..” అన్నాను ఏం చెయ్యలేక.

“అబ్బే రాడు, లేటవుతుందని పొద్దున్నే చెప్పాడు…” నవ్వుతూ అంది.

దుర్మార్గురాలు. తను మాత్రం బావతో హాయిగా ఇంట్లో కూచోదల్చుకుంది. ఎటొచ్చీ నేనొకడ్ని దొరికాను కదా, పెళ్ళి పెటాకులు లేని ఒంటి పక్షిని. మీదు మిక్కిలి మగవెదవని .. చ చ..

ఆవిడ వంక చూశాను. నలభై కి, ఏభైకి మధ్య ఎంతయినా వుండొచ్చు వయసు, కొరకంచు లాంటి మొహమూ, చూపులో చిట్లింపూ… అపరాధ పరిశోధనకి బాగా పనికొస్తుంది… పైగా నాతో కదలడానికి ఆవిడ ఏమంత తొందర పడుతున్నట్టు లేదు.

సవాలక్ష సందేహాలు బైట పెట్టింది.

“సొంత తమ్ముడేనా?” అందిమొదట.

తమల పాకులా మెరిసిపోతున్న అక్కకీ నాకూ పోలిక కట్టడం ఆవిడ వల్ల కావడం లేదు.

“సొంత అంటే సొంత కాదు లేండి. మా మేడమీద గదిలో వుండేవాడూ. అయినా బంధుత్వానిదేముందండీ. మనసు మంచిదవ్వాలి కానీ” సరళ సంజాయిషీ చెప్పడం నాకేం నచ్చలేదు.

ఆ మాటకొస్తే ఆవిడకీ నచ్చినట్టు లేదు.

అసలు బంధుత్వమే లేకుండా బంధాలేమిటి వెర్రిగోల అనుకుని వుంటుంది.

చేసేదేం లేక బండి స్టార్ట్ చేశాను.

హేట్ ఎట్ ది ఫస్టు సైట్ లాగా తొలిచూపు నుంచీ నన్ను ఆవిడ ద్వేషించడం మొదలుపెట్టింది. అందులో నా తప్పు కూడా వుండచ్చు. ఇదిగో ఈ బవిరి గడ్డం గీక్కుని, జుట్టు బరుక్కుని, తెల్ల చొక్కా తొడుగితే కొంచెం మర్యాదస్తుడిలా వుండేవాడ్నేమో గానీ, ప్రస్తుతం రాత్రంతా నిద్ర లేక ఎర్రబడ్డ కళ్ళతో నలిగిపోయిన నల్ల చొక్కాతో అప్పుడే జైల్లోంచి పారిపోయి వచ్చినట్టుగా వున్నాను. ఆవిడ చూస్తే వొంటినిండా నగల్తో వుంద్. అంతకంటే ముఖ్యంగా ఆడమనిషై వుంది. ఆ రెండు భయాలు ఆవిడ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళూ ఆడవాళ్ళుగా పుట్టినందుకే అంత నిస్సహాయులెందుకవుతారో నాకు అర్ధం కాదు.

“పేరేమిటి? కిరణా?” అడిగింది. కిరాతకుడా అన్నట్టు వినిపించింది.

ఔనన్నట్టు తలూపుదాం అనుకున్నా కాని నా తల అటు ముందుకు తిరిగి వుంది కదా అందుకని “ఊ” అన్నాను.

“ఏం చదివావు?”

ఓ యబ్బో గంట ప్రయాణానికి నా బయోడేటా, కాండక్టు సర్టిఫికెట్టూ మొత్తం పుచ్చుకునేలా వుంది. జవాబు చెప్ప దల్చుకోలేదు.

“ఏం పని చేస్తుంటావు సినిమా ఏజెంటా…?” అడిగింది.

“కాదు అది మానేశాను. ఇప్పుడూ కాల్ సెంటర్ లో చేస్తున్నాను.” అన్నాను ఓపిగ్గా…

“ఏమి సెంటరూ..అని రెట్టించి, నేనేదో చెప్పేలోపే మళ్ళీ అంది.”ఓహో రాత్రిళ్ళు చేస్తుంటారే ఆ పనా..???”

నాకు నవ్వొచ్చింది. బలవంతాన ఆపుకుంటూ, “ఔనండీ, తెల్లవార్లూ చేసే పని!!”

ఆవిడకసలు నా మొహమే కాదు, ఉద్యోగం కూడానచ్చలేదు. అసలే మోసకారి పట్నంలో, అంతకంటే మోసగాడిలా కనిపించే నాలాంటి కిరాతక, రాత్రి డ్యూటీ గాళ్ళతో, ఒంటెడు నగలు పెట్టుకున్న ఒక భద్ర మహిళ ప్రయాణం.. వామ్మో… ఎంత ప్రమాదం..! ఆవిడ నిస్సహాయత మొత్తం నాకు అర్ధమవుతూనే ఉంది. ఆవిడ భయానికి తోడు వాన పట్టుకుంది.

అప్పట్నుంచీ మొదలు.. “అటెందుకు.. ఇటు తీస్కెళ్ళు.. ఇటెందుకు అటు సెంటరులోంచి తీస్కెళ్ళు..”

ఆవిడకు వూరు కొత్తని అక్క చెప్పనే చెప్పింది. తెలిసినట్టు ఫోజులు ఎందుకు? నిలువెల్లా అనుమానం కాకపోతే.. చిరాకేసింది.

ఆవిడ అనుమానంలాగే ఈ ముసురు ఒకటి. బురదలో ముందు చక్రం కూరుకుపోతోంది. ఇద్దరి మద్యా ఆవిడ పెట్టిన సూట్ కేసు ఏమిటో గానీ అందులోంచి ఒక గట్టి వస్తువేదొ వీపుమీద చచ్చేట్టు గుచ్చుకుంటోంది. చోటు చాలకో ఏమో వెనక్కి జరిగిపోయి మాటిమాటికీ కదులుతుంటే అసలే ఇరుకు బండి బ్యాలన్సు తప్పుతొంది. బ్యాగు వొళ్ళోపెట్టుకుని, దగ్గరికి జరిగి కూచుంటారా? అని అడగాలి. జరీ చీర కొంగు కిందికి వేలాడుతోంది పైట కొంచెం జాగ్రత్త. అని చెప్పాలి. తల్లీ నువు కొంచెం ఓపిక పట్టావంటే నేను జాగ్రత్తగా దింపేస్తాను. అని ధైర్యం నూరిపొయ్యాలి. ఈ మాటలు బావున్నాయా? బూతులేమైనా వున్నాయా..? అబ్బ ఆడవాళ్లతో ఏం మాట్లాడితే ఏం మునుగుతుందో తెలీదు. ఆలోచిస్తూ బండి నడుపుతున్నాను. ఎదురు గాలికి చలేస్తోంది. వేడిగా కొంచెం టీ తాగాలనిపిస్తోంది. ఆ మాటే అడిగాను….

“వద్దు” అంది.

సరే మీరు రోడ్డు మీదే వుండండి. నేను తాగి వస్తాను అనలేను.. బూర్గులభవనం దాటి వచ్చేసి హుస్సేను సాగరం చూస్తుంటే మనసు మూలిగింది. వాసవి వచ్చేసిందేమో.. టైము తెలీడంలేదు.. వాచీలో అంకెలు కనిపించడం లేదు. వాన కళ్ళ మీద పడుతోంది. టోపీ మర్చిపోయి వచ్చాను. “కిరణూ..” చప్పట్లు కొట్టి పిలిచీంది. పిలిచిన శాల్తీ వైపు నడిచాను. అరె. వాసవి చీర కట్టుకుంటే గుర్తు పట్టలేక పోయను. ఎప్పుడూ సల్వారు డ్రస్సులోనే చూశాను కదా…

“హెలో.. వసూ..వస్తాను.. రూముకెళ్ళీపో.. వానలో తడవకు. ఈ విడ్ని దింపేసి..” అరిచాను.

వూహు.. వినదు కదా,

“ఆవిడెవరు?” కళ్లతోనే అడిగింది వాసవి.

“ఏమో తెలీదు.”

“అదేమిటి..”

“అదంతేలే..”

“సస్పెన్సులో పెట్టకు చెప్పు ముందు..” బండి పట్టుకుని ఆపింది.

“ఇది ఒక విషాద గాథ.. సరేనా..” హ్యాండిలు మీదున్న వాసవి చేతిని పక్కకి తోస్తూ వారించాను. నా చెయ్యి గట్టిగా పట్టుకుంది వాసవి. “దయచేసి నా మాట విను. గడ్డం పట్టుకుందామనుకున్నాను.” వెనకాలే ఈ విడొకర్తి. వాసవి మొండిది, నన్ను కొత్త వాళ్ల ముందు ఇబ్బంది పెట్టడమంటే భలే సరదా.. “చిటపట చినుకులు పడుతూ వుంటే..” అంటూ, పాడుతూ కొన్ని నీళ్ళు నా మీద చిలకరించింది.

భయం భయంగా ఆవిడ వైపు చూసాను. ఆవిడ క్రూరాతిక్రూరంగా మా వంక చూస్తోంది.

“వాసూ ఒక్కసారి నాపరిస్థితి అర్ధం చేసుకో..” అన్నాను

వాసవి ఇంక మాట్లాడలేదు. మొహం ముడుచుకుని తన బండి స్టార్టు చేసుకుని వెళ్ళిపోయింది.

అబ్బ. . ఇద్దరు ఆడవాళ్ల మధ్యా నేను వెధవని అయిపోయాను.

“మేడమ్ మిమ్మల్ని ఆటో ఎక్కించనా? అదిగో ఆ అమ్మాయి నా దోస్తు తనతో నాకు పని వుంది.” నావెనక వున్న శాల్తీని అడిగాను.

“వద్దు.”

వద్దుట, వద్దు ఏమిటి వద్దు, అన్నీ ఈవిడ ఇష్టమేనా? అనుకున్నాను. అప్పుడు మెల్లిగా గొణుక్కుంది.

“ఏమిటి అంటున్నారు? నాగొంతు నాకు తెలీకుండానే కరుగ్గా మారింది.

“ఏమీ లేదు.” అంది

“నాకు వినిపించింది.” అన్నాను. “తెలియని దేవత కంటే తెల్సిన భూతం మేలు అన్నారా.. లేదా.. నాకు చెముడు లేదు. బాగానే వినిపించింది..”

“కాదు అలా అన్లేదు.” దబాయించింది.

ఆవిడతో వాదించి లాభం లేదు. నెత్తికి చుట్టుకున్నది నేనే కనక ఎలాగోలా ఇంటి దగ్గర దింపేస్తే ఒక పని అయిపోతుంది. ఒక పని ఏమి ఖర్మ. నా పని పూర్తిగా అయిపోతుంది. వానలో ఇప్పుడు వాసవి చచ్చినా తలుపు తియ్యదు. అసలే కోపంలో వుంది. స్టేషనుకు వెళ్ళి తీసుకు రాకపోగా తనే పిలిచి పలకరించినా కాదని వచ్చేశాను.

“అమ్మా మహాతల్లీ.. ఇది చైతన్య పురి బస్టాపు.. ఇప్పుడు చెప్పండి.. మీ ఇల్లు ఎటు..?

“ఆ.. ఔను.. ఇక్కడ వంతెన ఏదో వుండాలి.”

“ఏ వంతెన?”

“ఏ వంతెన అంటే వంతెన కాదు.. అలాంటిది అంటున్నాను.”

ఆమూల నుంచి, ఈ మూల దాకా అంటే సాయిబాబా గుడి దగ్గర్నించీ, పండ్ల మార్కెట్టు దాకా ఓపిగ్గా తిప్పాను. ఇద్దరం తప్పగా తడిసిపోయాం.

“అన్నట్టు ఫంక్షను హాలు పేరేమిటన్నారూ?” అడిగాను.

“అదేనండీ పేరు గుర్తులేదు.. కానీ దానికి దగ్గర్లో వంతెన లాంటిది వుంటుందట.. అక్కడిదాకా వెడితే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపించక పోరు.” అంది. “ఇప్పుడు లైట్లు లేవు, చీకటి ఒక గోల, లేకపోతే గుర్తు పట్టేదాన్ని.”

“అడ్రస్సు తెలేదనే విషయం ముందే చెప్పచ్చు కదండీ” అన్నాను. నాకు నీరసం వచ్చేస్తోంది. ఆవిడ యాతన తెలుస్తోంది.

“పోనీ ఒక పనిచేద్దాం. ఇంకొక అరగంట వెతికి మళ్ళీ మిమ్మల్ని మా అక్కా వాళ్ళింట్లో దింపేస్తాను. రేపు తెల్లారాక కూడా సత్యనారాయణ వ్రతాలు ఏవో వుంటాయి కదా, మా బావతో కలిసి పగలు వద్దురు గాని, సరేనా” అన్నాను.

“మరి మీ అక్క పుట్టింటి బండెక్కేస్తుందేమో ఈ పాటికి” అంది.

“అదేమిటి, నాకు చెప్పలేదే..” అన్నాను ఆశ్చర్యంగా..

“ఔనట. నాకు చెప్పింది. వాళ్ళ పెద్దన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడని అన్నది నాతో, ఎలాగోలా మీ బావతో ప్రయాణం కట్టించాలని తన ప్లాను.”

“మరి ఇప్పుడేమిటి దారి…? పోనీ నారూం కొచ్చి ఈ పూటకి” అనబోయి ఆవిడెలా అర్ధం చేసుకుంటుందో తెలీక మానేశాను. ఉన్న పళాన కదలనని బండి మొరాయించింది.

“చూడండి మేడమ్.. (ఆంటీ అని పిలిచి ఈ మధ్యనే ఒక మహిళతో చివాట్లు తిన్నాను.) ఇప్పుడు బండి కూడా ట్రబులిస్తోంది. ఇక్కడెక్కడైనా హోటల్లో మిమ్మల్నిదింపి.. తెలిసిన మిత్రుడిదే వుంది.. భయపడక్కర్లేదు. నేను రేపు పొద్దున్నే వచ్చి తీసుకెడతాను..” ఆవిడ ఏమీ అన్లేదు. నిస్సహాయంగా చూసింది. నేను మౌనంగా నుంచుండి పోయాను. బండి తోసుకుంటూ నేనూ, నా వెనకే ఆవిడా ఒక పచారి దుకాణం ముందున్న షెడ్డు కింద చేరాం. దుకాణం మూసేసి వుంది.

“రోడ్డుకి అవతల ఎక్కడైనా చిన్న టీ బండి వుందేమో చూస్తాను. వేడిగా ఏమయినా తాగుదామండీ కొంచెం బుర్ర పనిచేస్తుంది. ఇందాకా అక్క ఇచ్చినా కూడ మిమ్మల్ని తీసుకువచ్చే తొందరలో మర్చిపోయాను”

“ఇల్లు దొరకనివ్వండి. భోజనం కూడా పెట్టిస్తాను.” అంది ఆపద మొక్కులవాడ్ని ప్రార్ధించి. నాకు కూడా భజన చెయ్యడం మినహా ఇంక దిక్కులేదు. దేవుడు ఆవిడ మొర ఆలకించినట్టున్నాడు.

“ఏమిటి వదినా ఇక్కడున్నావూ?” ఒక ఇరవై యేళ్ళ కుర్రాడు లోపలి సందులోంచి వస్తూ గొడుగులోంచి అరిచాడు.

“ఒరేయి ఆగు.. అరిచినట్టు ఏడిచిందో.. ఏడిచినట్టు అరిచిందో గాని వాడు ఆగాడు.

“ఎక్కడ్రా పెళ్ళి, వూరుకాని వూళ్ళో ఒక్కదాన్నె వెతుక్కుని, వెతుక్కుని నానా యాతనా పడుతున్నా..” అంటూ వెనక్కి తిరిగి, వెడతానండీ అని కళ్ళతోనే చెప్పి, వాడితో నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. నడవని బండిని ఈడ్చుకుంటూ.. చలిలో, ఆకలిలో… ఒక్కడ్నీ నేను.. ఎవరికోసం ఇంత కష్టపడ్డానో ఆవిడ నోటి వెంట ఒక్క మంచిమాటలేదు. ఆ సతాయింపేమిటో, అనుమానమేమిటో… ఏమిటో ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారతారో తెలీదు. వెనక్కి కూడా చూడకుండా ఎలా పోతుందో చూడు. అక్కడ వాసు కూడా ఆడదే కదా. పైగా నేను బండి మీద ఈవిడతో కనిపించి తనని ఇంటికి పొమ్మన్నాను కదా అంచేత ఇంక రానివ్వదు. కక్ష తీర్చుకుంటుంది. అందులోనూ ఇప్పుడు వాన కదా, మగాడ్ని కదా, పక్కింటి వాళ్ళూ, ఎదిరింటి వాళ్ళూ, వెనకింటి వాళ్ళూ ఏమైనా అనుకుంటారు కదా.. రాత్రంతా వానలో స్నేహితుడూ బురద కొట్టుకుపోయినా సరే.. పిడుగులు పడి చచ్చినా సరే.. తెల్లారి పలకరిస్తుందేమొ.., తీరిగ్గా.. మర్యాదగా.. ఎవరూ ఏమీ అనుకోకుండా…

7 అభిప్రాయాలు »కథలు

7 Responses to “తరగని దూరం”

  1. 1
    purna Says:

    ఏమిటి ఈకథ పరమార్థం?

  2. 2
    bindu Says:

    I had fun ….

  3. 3
    yasasvi Says:

    ఎంత నాసిరకం కధనం!! కనీసం పాఠకురాలిగా ఈ కధని కొండేపూడి నిర్మ ల ఆస్వాదించగలుగుతుందా?? రాయాలన్న తాపత్రయమే తప్ప ఆ రాస్తున్న అంశం లో పస ఏమన్నా ఉందా అన్నది చూసుకోనఖ్ఖర లేదా?? చదివించేగుణం లోపించాకా ఇంక నిర్మ ల ఏం రాస్తే మాత్రం రాణకు వస్తుందీ? నాలుగు రకాల మంచి కధల్ని చదవనన్నా చదవలేరా ? రాయడం ఇటుపై మానుకుందుకో..లేదా బాగా రాయాలన్న సంకల్పానికో అది దోహదపడుతుందేమో!! కొండేపూడి నిర్మ ల కవిత్వం రాయడమే నయం. ఎంతోకొంత పదునుంటుంది. ఇలాంటి “తరగని దూరాల్ని” తన రచనా నైపుణ్యంలో పెంచుకోవడం కన్నా!!
    యశస్వి.

  4. 4
    nagalakshmi Says:

    సరళమైన ప్రత్యేకమైన శైలి,అంతర్లీనమైన హాస్యం, ఆపకుండా చదివించే గుణం తో పాటుగా ఎపుడో ఒకపుడు మనకే అయిన అనుభవం లా తోచే కథ. కథకుడి స్వగతం గా అల్లిన ఈకథ చదువుతుంటే నా ఎదురుగా జరిగిన సంఘటన లా తోచింది.
    రచయిత్రికి అభినందనలు.

  5. 5
    R.Santha Sundari Says:

    కథలోని హాస్యం చాలా సహజంగా ఉంది.ఎక్కడా అతిశయోక్తి అనిపించకుండా హాయిగా సాగిపోయిన కథనం .భూమిక మాసపత్రిక లో నెల నెలా వ్యంగ్యం ప్రధానంగా నిర్మల రాసే వ్యాసాలు ఆమెలో గంభీరమైన సమస్యల గురించి రాసే కవయిత్రితో బాటు హాస్యాన్ని సున్నితంగా పండించగల హాస్యప్రియత్వం కూడా ఉందని నిరూపించాయి. అప్పుడప్పుడు ఇలాటి కథలు చదివితే కాసేపు నవ్వుకోటానికి అవకాశం దొరికినట్టు ఉంటుంది.రచయిత్రికీ, ప్రాణహితకీ అభినందనలు.

  6. 6
    ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Says:

    [...] తరగని దూరం : కొండేపూడి నిర్మల [...]

  7. 7
    roshni Says:

    బావుంది రా.అభినందనలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో