తెలంగాణ చరిత్రలో ఒక మొహొంజొదారో

ఈ పుస్తకాన్ని చదివి గొప్ప ఎక్సైట్ మెంట్ ఫీలయ్యానని ఈ పుస్తకావిష్కరణ సభలో వరవరరావు సముచితంగా చెప్పిండ్రు. నేను కూడా దీన్ని చదివి అంతే ఎక్సైట్ అయినాను. పై శీర్షిక పెట్టటానికి ఆ ఎక్సైట్ మెంటే కారణం.

ఆర్యులు సింధునాగరికతను భౌతికంగా ధ్వంసం చెయ్యడమే కాక బౌద్ధికంగా కూడా దాని ఆనవాళ్ళు లేకుండా సమాధి చేసినారు. చేసి భారతదేశ చరిత్ర ఆర్యులతోనే మొదలయినట్లు చరిత్రను వక్రీకరించినారు. అందరమూ ఆ భ్రమల్లోనే శతాబ్దాల కాలం ఉంచబడినాం. ఈ భ్రమల్ని పటాపంచలు చేసింది హరప్పా, మొహొంజొదారా తవ్వకాలు.

ఆంధ్ర వలస వాదులు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని సమాధి చేసినారు. చేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతోనే (అంటే వారి రాకతోనే) తెలంగాణలో వెలుగులు మొదలయినట్లుగా చరిత్రను వక్రీకరించినారు. ఈ వక్రీకరణ మాయలో మనవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఈ వక్రీకరణను బద్దలు చేసి తెలంగాణను సరిగ్గా నిలబెట్టే ఒక పుస్తకం ఇది. వాళ్లు చేసిన సమాధిని తవ్వి ఈపుస్తకాన్ని బయటపెట్టినారు. తెలంగాణ విద్యావంతుల వేదిక, రచయితుల వేదికవారు. తెలంగాణ సుదూరగత, సమీప గత చరిత్రను సాక్షాత్కరింపజేసే ఈ పుస్తకాన్ని మొహొంజోదారోతో పోల్చుతున్నాను.

దీనికంటే ముందు గడియారం రామకృష్ణశర్మ సంపాదకత్వంలో “సుజాత” పత్రిక “తెలంగాణనా” ప్రత్యేక సంచిక 1953 లో వెలువడింది. బహుశా తెలంగాణా విభిన్న రంగాలకు చెందిన చరిత్రను ఒక చోట క్రోడీకరించిన మొదటి పుస్తకం కావచ్చు అది. అది హరప్పా తవ్వకం అయితే, ప్రస్తుత పుస్తకం మొహొంజొదారో తవ్వకం.

ఈ పుస్తకం ముందుమాటలో సిధారెడ్డి “తెలంగాణ చరిత్ర” తెలిపే పుస్తకాలే లేవు అన్నాడు. నూటికి నూరు పాళ్ళూ నిజం. ఆ కొరతను కొంత తీర్చే పుస్తకం ఇది. వట్టికోట ఆళ్వారు స్వామి నవలాకారుడిగా, ప్రచురణకర్తగా, ఉద్యమోపజీవిగా, కధారచయితగా, కవిగా తెలుసు. మంచి సంపాదకుడు కూడానని ఈ పుస్తకం ద్వారా తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ “ఏర్పాటు” తర్వాత తెలంగాణ చరిత్రను మరుగున పడేస్తారని వట్టికోట ముందే ఊహించినాడేమో, అప్పటివరకు ఉన్న చరిత్రను “మమ్మీ” లాగా ఈ పుస్తక రూపంలో భద్రపరచి పోయినాడు. ఇది ఆయన క్రాంతదర్శిత్వానికి నిదర్శనం. 1956 నాటికి గల తెలంగాణ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రాజకీయ, ఆర్ధిక, పారిశ్రామిక రంగాలతో సహా మొత్తం సమగ్ర తెలంగాణ చిత్రాన్ని అందివ్వడానికి ఒక విజన్ తో పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు ఇందులో వచ్చిన వ్యాసాల పేర్లు, సకాలంలో అందకపోవడంవల్ల రాని వ్యాసాల పేర్లు తెలియజేస్తున్నవి. ఇది ఆయన సంపాదక సామర్ధ్యానికి నిదర్శనం.

సంపాదకుడు లేదా సంకలన కర్త అంటే ఏవో కొన్ని వ్యాసాలనో, కథలనో, కవితలనో ఒక్క చోట గుది గుచ్చి వేసేవాడు అనే అర్ధం. అనేక పనికి మాలిన సంకలనాలు వేసిన సంకలన కర్తలా నేపథ్యంలో అగౌరవస్థానం నేడు చలామణిలో ఉంది. నిజానికి ఒక నాటకంలో, ఒక సినిమాలో ఎక్కడా కనిపించకుండా అంతర్లీనమైన పాత్ర పోషించే దర్శకుడి స్థాయి సంపాదకుడిది. సంకలనంలో ఎక్కడా కనిపించకుండానే అంతర్లీనంగా ఉండే రచయిత, దర్శకుడు సంపాదకుడు. ఇలాంటి గొప్ప సంపాదకుడు వట్టికోట ఆళ్వారు స్వామి.

ఈ సమ్యగ్ దృక్పథంతో వట్టికోట సంకలించిన పుస్తకమిది. అందుకోసం ఆయన తెలంగాణ చరిత్రను రెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఒకటి ప్రాచీన చరిత్ర రెండు ఆధునిక చరిత్ర.

ప్రాచీన చరిత్రను అందించడం కోసం తెలంగాణ పుట్టు పూర్వోత్తరాలు, ప్రాచీన వాఙ్మయం (ఈ రెండు వ్యాసాలు సకాలంలో అందనందునో అందినా తృప్తికరంగా లేనందువల్లనో ఇందులో లేవు) తెలంగాణము, కెయిరనులు కథనము, నాణెములు, శాసనములు, తాళపత్ర గ్రంథములు, దేవాలయములు, కాకతీయ రాజవంశము, కాకతీయ సాంఘిక చరిత్రము పాకల సరస్సు, గోలకొండ పట్టణము (ఇవి ఆదిరాజు వీరభద్ర రావు గారివి) సర్వాయి పాపడు, మంత్రి మాదన్న (చొల్లేటి నృసింహరావు), మాదన్నగారి విదేశాంగ నీతి (కె.వి. భూపాల రావు), తెలంగాణ జానపద గేయాలు (డా.బిరుదురాజు రామరాజు), ఆదివాసులు (బి.బాబురావు వర్మ) అనే వ్యాసాల్ని ఎన్నుకున్నాడు. ఇవి తెలంగాణ ప్రాచీన చరిత్రను ఆయా కోణాల్నించి తెలియజేసే సమర్ధక వ్యాసాలు.

పైన్నే చెప్పుకున్నట్టు ఇంతవరకు తెలంగాణ చరిత్రను చెప్పే పుస్తకాలసలే లేవు. వ్యాసాలు మాత్రం మూడు కనిపిస్తున్నవి. ఒకటి సురవరం ప్రతాపరెడ్డి గారి “తెలంగాణ చరిత్రము” (గోలకొండ పత్రిక – 27-7-1941) , రెండు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి “తెలంగాణ చరిత్ర” (సుజాత -15-11-19), మూడోది ఈ సంకలనంలో వీరభద్ర రావు రాసిన “తెలంగాణము” అనే వ్యాసం. ఈ వ్యాసం చాలా విలువైనది. తెలంగాణ ప్రాచీన చరిత్రను (సంక్షిప్తంగానే అయినా) విశిష్టతను తెలియజేసే వ్యాసమిది.

ఈ వ్యాసంలో “అసలీ తెలంగాణమే తెలుగు వారికి ఆదినివాస భూమిగా నుండెను. ఇచ్చటి నుండియే వారు పలు ప్రాంతములకు విస్తరిల్లి” అనే ఆదిరాజు గారి మాటలు పరిశోధనా నైశిత్యానికి నిదర్శనం. ఈ అభిప్రాయాన్ని తరువాతి పరిశోధనలు కూడా ధ్రువపరిచినవి. (“తెలంగాణ ప్రాచీన సాహిత్యం” అనే నా పరిశోధన గ్రంధంలో దీని గురించి విపులంగా చర్చించిన ఆసక్తి గలవారు దాన్ని చూడొచ్చు) కృష్ణా జిల్లా నుంచే ఆంధ్రులు పలు ప్రాంతాలకు విస్తరించినారు. అని చెప్పే ఆంధ్రా దురహంకారానికి చెంపపెట్టు ఈ వ్యాసం. చెంప పెట్టు ఈ అభిప్రాయం.

“మౌర్య చక్రవర్తుల కాలమునాటికే తెలంగాణమున ఆంధ్ర రాజన్యులు ప్రబలులై యున్నట్లు తెలియుచున్నది.” అనే ఆయన మరొక పరిశీలన కూడా కాలపరీక్షకు నిలబడినది.

అయితే ఈ వ్యాసంలోని కొన్ని పరిశీలనలు అనంతర పరిశోధనల్లో తప్పని తేలినది. ఉదాహరణకు “శాతవాహనుల తర్వాత క్రీ.శ మూడవ శతాబ్దము మొదలుకొని రెండు మూడు వందల సంవత్సరముల వరకు తెలంగాణ చరిత్ర తెలియ లేదు.” అని ఆదిరాజు రాసినారు. కాని ఆ చరిత్ర తెలిసినది. అట్లాగే, “చాళిక్యులకు ఓరుగంటి కాకతీయులు మొదట సేనాపతులుగా, పిమ్మట సామంతులుగా నుండి అనుమకొండ విషయమును ఏలుచుండిరి” (పేజి 141) అని ఆయన రాసినారు.

చాళిక్యులలో కోస్తాంధ్రను పాలించిన తూర్పు చాళుక్యులు, తెలంగాణ పాటు (కోస్తాంధ్ర కాక) ఇతర ప్రాంతాలను పాలించిన బాదామి చాళిక్యులు, కల్యాణి చాళిక్యులున్నారు. ఈ తేడాని గమనించకుండా బహుశా ఈ అభిప్రాయాన్ని ఆసరా చేసుకొని ఆరుద్ర కాకతీయులు తూర్పు చాళిక్యులని రాసాడు. కానీ అది సరి కాదు. కాకతీయులు మొదట రాష్ట్ర కూటుల సేనానులు. తర్వాత కల్యాణీ చాళిక్యుల సేనానులు, సామంతులు. కాకతీయులకు, కోస్తాంధ్రను పాలించిన తూర్పు చాళిక్యులకు సంబంధమే లేదు. ఇలాంటి సందర్భంలో, ఇంకా చాలా సందర్భాలలో, ఈ పుస్తకాన్ని పునర్ముద్రించిన సంపాదకులు foot notes రాస్తే బాగుండేది.

సరే అది అట్లా ఉంచి, ఆదిరాజు గారి మిగతా తొమ్మిది వ్యాసాలు కూడా చాలా విలువైనవి. తర్వాతి చరిత్రకారులకు ఉపయోగపడినవి.

కరీంనగర్ జిల్లాలో లభించిన నాణాలు భారతదేశంలోనే మొదటివి అని “నాణెములు” అనే వ్యాసం తెలుపుతుంది. నాణాల మీద అద్భుతమైన పరిశోధన చేసిన డా.డి.రాజా రెడ్డి. ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.

కాకతి రుద్రమదేవి గణపతి దేవుని భార్య అని చాలామంది తప్పుగా రాసినారు. “కొలనపాక శాసనాలలో రుద్రమదేవి గణపతి దేవుని కూతురు అని స్పష్టంగా ఉన్నది.” అని ఆదిరాజు “శాసనములు” అనే వ్యాసంలోను ఇతరులు పై అభిప్రాయం అసత్యమని తేల్చినారు. కాకతీయ సాంఘిక చరిత్రము” అనే వ్యాసంలో ఆనాటి అనేక సాంఘిక విశేషాలను వెల్లడించినారు. తర్వాతి చరిత్ర కారులకు ఇది గొప్ప వనరుగా ఉపకరించినది.

జానపద సాహిత్యానికి శిష్టసాహిత్యంలో పీఠం కల్పించినవాడు. డా. బి. రామరాజు. ఆయన రాసిన “తెలంగాణ జానపద గేయములు” అనే వ్యాసంలో తెలంగాణ విశిష్టతలను అనేకం తెలియజేసినాడు. ఉదాహరణకు “ఆంధ్రదేశమున నితర ప్రాంతములందు లేనిది తెలంగాణమున విశేష ప్రచారమునందున్నది బ్రతుకమ్మ పండగ” “తెలంగానమున కాముని పున్నమ సందర్భమున జాజిరాడుట పరిపాటి” ఇప్పటికి ఇవి తెలిసిన విషయాలనే అనిపిస్తవి. కాని 1956 నాటికి ఇవి చాలా కొత్తవిషయాలు.

మిగతా పద్దెనిమిది వ్యాసాలు తెలంగాణ ఆధునిక చరిత్రను, విభిన్న రంగాల్లో తెలంగాణ స్థితిగతులను తెలియజేసేవి.

“తెలంగాణ కవులు” అనే వ్యాసంలో ప్రముఖ కవి వానమామలై వరదాచార్యులు 1920 ల నుంచి 1956 వరకు గల 70 – 80 మంది ప్రతిభావంతులైన తెలంగాణ కవుల్ని పరిచయం చేసినారు. ఇందులో తొంభైశాతం మంది కవుల గురించి ఏ సాహిత్య గ్రంధము పేర్కొనలేదు. అందువల్లనే ఈ తరానికి ఈ కవుల గురించి తెలియనే తెలియదు. కళ్ల ముందరే మరుగున పడుతున్న చరిత్రను ఈ పుస్తక పునర్ముద్రణ ద్వారా వెలుగులోకి తెచ్చినట్లయింది.

ఆధునిక చిత్రకళను ఆపోశన పట్టిన చాలా మంది తెలంగాణ చిత్రకారులగురించి తెలియజేసే వ్యాసం ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరి రావు రాసిన “తెలంగాణములో చిత్రకళ” ఇందులో తెలంగాణ చిత్రకళ గురించి, ముఖ్యంగా దక్కన్ చిత్రకళ గురించి కూడా ఉంది.

1920ల నుంచి తెలంగాణ రాజకీయ పరిణామాన్ని తెలియజేసే రెండు కీలకమైన వ్యాసాలున్నవి. ఒకటి ప్రముఖ కమ్యూనిష్టు యోధుడు రావినారాయణ రెడ్డి రాసినది. రెండోది ప్రముఖ గ్రంధాలయోధ్యమ నేత కోదాటి నారాయణ రావు రాసినది. ఒకే అంశం మీద కమ్యూనిష్టు కోణం నుంచి, కాంగ్రేసు కోణం నుంచి, రాయించడంలో వట్టికోట ఉద్దేశం ఆనాటి సమగ్ర చిత్రాన్ని అందించాలన్నదే.

1956 నాటికి గల కార్మికుల సంఖ్య, వారి స్థితిగతులు, భూదానోద్యమ ఆవిర్భావ వికాసాలు, భూసంస్కరణల వైనం, కౌల్దారీ సమస్య, స్థానిక స్వపరిపాలన విధానం, కుటీర పరిశ్రమల సంఖ్య, వాటి స్థితిగతులు, మొత్తం దక్షిణ భారతదేశానికంతటికీ ఉన్న ఒకే ఒక బొగ్గు పరిశ్రమ అయిన సింగరేణి బొగ్గు గనుల స్థితిగతులు మొదలగు వాటిని సమగ్రంగా తెలియజేసే విలువైన వ్యాసాలు మిగతావి వరవరరావు గారన్నట్టు వీటన్నింటికీ కొనసాగింపు వ్యాసాలు రాయిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే ఈ వ్యాసాల్లో నాకు అభ్యంతరకాంగా అనిపించిన వ్యాసం ఒకటుంది. దాని గురించి రాసి ముగిస్త. ఆ వ్యాసం పేరు “నిజాము రాష్ట్రంలోని యాంధ్రులు”. దీనిని రాసింది మామూలు వ్యక్తి కాదు. ఆంధ్ర పితామహ అనే గౌరవాన్ని పొందిన మాడపాటి హనుమంతరావు. ఇది ఈ పుస్తకం కోసం రాసింది కాదు. 1914 లో ఆంధ్ర పత్రికలో రాస్తే ఈ పుస్తకంలో పునర్ముద్రించినారు. నిజాం రాష్ట్రంలో అంతా శూన్యమన్న పద్ధతిలో సాగిందీ వ్యాసం. ముస్లింల పట్ల వ్యతిరేకత అడుగడుగునా కనిపిస్తుంది. బ్రిటీషాంద్ర కళ్లద్దాలతో ఇక్కడి స్థితిగతులను చూసినట్లు కన్పిస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలు “విద్యాస్థితి ఇట్లుండ వీరిలో గ్రంథకర్తలు గానీ పత్రికా సంపాదకులుగానీ లేనే లేరని చెప్పనేల” (అప్పటికి గ్రంథకర్తలున్నారు. సంపాదకులున్నారు) అన్నమాటలు తెలంగాణ భాష కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలమయం అని చెప్పుతూ “ఇక తూర్పున అదృష్ట వశమున ఉత్తర సర్కారుల వారి సంసర్గము బాగు చేసినది” (అంటే కోస్తాంధ్ర భాష తెలంగాణ భాషను రక్షించినదని రచయిత భావం) అన్న మాటలు తరువాతి కాలంలో తెలంగాణలో కవులు “పూజ్యము” తెలంగాణ తెలుగు “తౌరక్యాంధ్రము” అన్న అవహేళనలకు ప్రాతిపదిక అయినవి. ఇంకా ఈ వ్యాసం చుట్టూ పెనవేసుకున్న అంశాలను, పర్యవసానాలను గురించి చాలా రాయొచ్చు. వాటి గురించి తర్వాతెప్పుడైనా.

ఏది ఏమైనా ఈ పుస్తకాన్ని వెలికి తీసి ముద్రించిన తెలంగాణ రచయితల వేదికను, విద్యావంతుల వేదికను మరోసారి అభినందిస్తూ ప్రతి తెలంగాణా ప్రేమికుడు ఈ పుస్తకాన్ని కొని చదవాలని కోరుతున్నా.

8 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

8 అభిప్రాయాలు

  1. Praveen Aug 11, 2009 1

    అయ్యా..మీరు ఏ పుస్తకం గురించి వ్రాసిండ్రో పేరు కూడా చెప్తె బాగుండేది కదా? ఎక్కడ దొరుకుతదో కూడా చెప్పండి!

  2. sreepal Aug 16, 2009 2

    పుస్తకము పెరు చెప్పండి….

  3. Pasunoori Ravinder Aug 18, 2009 3

    పుస్తకం పేరు: తెలంగాణం (వ్యాససంకలనం)
    First Edition :1953, Second Edition :2009
    రచయిత : వట్టికోట ఆళ్వారుస్వామి
    ప్రచురణ :తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల వేదిక
    పుస్తకం దొరికే స్థలం : నవోదయ, సహచర తదితర బుక్ హౌజ్ లతో పాటు శ్రీధర్ దేశ్ పాండే గారిని సంప్రదించగలరు
    (రచయిత తరుపున పాఠకుల సౌలభ్యం కోసం……. ఈ వివరాలు)
    పసునూరి రవీందర్
    సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

  4. ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Sep 5, 2009 4

    [...] తెలంగాణ చరిత్రలో ఒక మొహొంజొదారో : సుంకిరెడ్డి నారాయణరెడ్డి [...]

  5. sridhar deshpande Sep 25, 2009 5

    ప్రాణహిత పాఠకులకు నమస్కారములు
    తెలంగాణం వ్యాసాలు రాసినది వట్టికొట కాదు.ఆయన సంపాదకుడు మాత్రమె
    సెప్తెంబరు 20 న వార్త లో ఈ పుస్తకం పై కే పి అశొక్ కుమార్ అనే సమీక్షకుడు దుర్మార్గమైన దాడికి పాల్పడినాడు.మీరు చదివి వార్తకు మీ స్పందన రాయండి
    శ్రిధరరావు దేశపాండె

  6. kothapalli ravibabu Feb 16, 2010 6

    ఈ పుస్తకము ఇప్పటి వరకు బయటకురాకుండా ఎవరు అడ్దుపడ్దారొ?

  7. Tirunagari Satyanarayana Feb 17, 2010 7

    కొత్తపల్లి రవిబాబు గారు తెలియకుండా అడిగారో లేక తెలిసే అడిగారో కానీ – తెలంగాణ భాషను, సాహిత్యాన్ని చులకన చేసి, తెలంగాణ సాహిత్య చరిత్ర ను పట్టించుకోకుండా చిన్న చూపు చూసింది, ‘తెలుగు’ సాహిత్య చరిత్ర రాస్తున్న ‘ఆంధ్రా’ చరిత్రకారులు కాదా?

  8. హెచ్చార్కె Feb 17, 2010 8

    శ్రీధరరావు దేశపాండె, కెపి వ్యాసం బాగా పాతది కాబట్టి, విమర్శ కోసం, ఇక్కడ లింకు ఇవ్వడం మంచిదేమో. ఇంత ఆలస్యంగా ‘వార్త’లోనే విమర్శించడానికి వీలుండకపోవచ్చు. ఇటువంటి విషయాలపై తగిన చర్చ జరగడం మంచిది. లేకుంటే ప్రజ-ల మధ్య అగాధాలు సృష్టించే రెటరికల్ స్టేట్ మెంట్లు అలా ప్రభావం చూపిస్తూ ఉండిపోతాయి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో