Sep2009
భావ వ్యాకరణం – అమరీ బరాక
ప్రతీ కవిత్వానికీ భాష, భావం బాహ్య రూపాలయితే, అంతర్లీనంగా కనిపించే భావ స్వరూపాలు అసలు పదచిత్రాలు. చూసీ చూడగానే కొన్ని కవితలు వేంటనే స్పృశిస్తాయి. మరికొన్ని మనతో కొంతకాలముంటాయి. ఇంకొన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. మొదటి రెండింటిలోనూ కాలక్రమేణా అక్షరాలు అడుగున పడి, భావమొకటే గుర్తుంటుంది. మూడోదాంట్లో భాషా, భావమూ ఒకదానికొకటి అతుక్కుపోయి హృదయాన్ని హత్తుకుంటాయి. పదాలూ, పదచిత్రాలూ పదికాలాలపాటూ గుర్తుండాలంటే ఆ కవిత్వంలో భావ సాంద్రతెక్కువగా వుండాలి. భాష లో గాఢత ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వం కలకాలమూ నిలుస్తుంది. చదివిన ప్రతీ సారీ ఒక్కో కొత్త రూపాన్ని చిత్రీకరిస్తాయి. శ్రీ శ్రీ మహాప్రస్థానమయినా, తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రయినా, ఇప్పటికీ కొత్తగానే వుండడానికిదే కారణం. రేపు చదివినా ఇంకో కొత్తదనం కనిపిస్తుంది. ఈ కవిత్వం జలపాతం లాంటిది. నిన్న చూసినప్పుడున్న అందాలు ఇవాళ ఇంకో కొత్త రూపంలో కనిపిస్తాయి. రేపు చూసినా, మరికొంత కాలం తరువాత సందర్శించినా ఇంతకుముందు లేని నవ్యానుభూతులు కలుగుతాయి. అందుకే తరాలు మారినా శ్రీ శ్రీ, తిలక్‌ల కవితా జలపాత ఝరి ఇప్పటికీ స్వచ్ఛంగా, కొత్తగానే వుంటుంది. వీరి కవిత్వాన్ని ఇంకా అందరూ స్మరించుకోవడానికి ఇవే కారణాలు.
భాషని ఒక పనిముట్టుగా వాడుకొని భావాన్ని చెక్కితే దానికొక మంచి రూపమొస్తుంది. అలాగే క్లుప్తత అన్నది కూడా కవిత్వానికి ఆరో ప్రాణం. వాక్యాలు రాసేటప్పుడు భావ స్పష్టతకోసం వ్యాకరణ సూచికలు ఎలా వాడుతామో అలాగే కవిత్వంలోనూ అవి వాడుతూ ఉంటాం. అన్నీ కాకపోయినా కొన్నయినా తప్పని సరిగా కనిపిస్తాయి. సూచకాలు అంటే ఇక్కడ గుర్తులు. వాక్యం పూర్తయినట్లుగా చుక్క (.)ని వాడుతాం. అలాగే కామా, ప్రశ్నార్ధకం (?), ఆశ్చర్యార్ధకం(!) ఇవన్నీ కవిత్వంలో భావ ప్రకటనికి సూచకాలుగా వాడడం చూస్తూ ఉంటాం.
చాలా మంది కవులు వీటిని వృధా చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏవి ఎక్కడ వాడాలో తెలీదు. కవిత్వంలో ప్రతీ వాక్యం ముగియగానే ఒక చుక్క పెట్టరు. రెండు మూడు చుక్కల పెట్టి వదిలేస్తూ ఉంటారు. ఆ చుక్కల స్థానంలో మీ ఇష్టం వచ్చింది పూరించుకోమన్నది ఆ కవిహృదయమని భావించాలి. అలాగే చాలా కవితల్లో మనకి విరివిగా కనిపించేవి ఆశ్చరార్థకాలు. ఎందుకు వాడారో చదివిన పాఠకులకి తెలీదు. రాసిన ఆ కవులకి అసలే తెలీదు. వ్యాకరణం అనేది కవిత్వాన్ని మరో మెట్టు తీసుకుళుతుందని చాలా మందికి తెలీదు. నాకు తెలుసున్నంత వరకూ వ్యాకరణ సూచికల్ని కవిత్వంలో అర్థవంతంగా వాడినట్లుగా అనిపించదు. ఈ ఊకదంపుడంతా ఎందుకంటే ఈ మధ్యన ఒక కవిత చదివాను. కవి హృదయ వేదన్ని స్పష్టంగా ఒక కొత్త పద్ధతిలో ఎలా చూపించగలమో తెలిసింది. అది వెంటాడ్డమే కాదు, తలుచుకున్నప్పుడల్లా మనసుని గుంజిపడేస్తోంది.
మా అబ్బాయి హైస్కూల్లో ప్రధాన పాఠ్యాంశంగా ఇంగ్లీషు లిటరేచర్ తీసుకున్నాడు. మేమిద్దరం అప్పుడప్పుడు కథల గురించీ, కవిత్వాల గురించీ చర్చించుకుంటూ ఉంటాం. ఈ మధ్యన న్యూయార్కర్ పత్రికలో ఒక ఇంగ్లీషు కవిత చూసాం. మావాడు చాలాబావుందంటే, నాకసలు నచ్చలేదని చెప్పాను. గట్టిగా వాదించుకున్నాం. ఆ సందర్భంలో నాకొక వేరే కవితని చూపించి చదవమన్నాడు. చదివాను బానే ఉందని తేల్చేసాను. బానే ఉందా? అంటూ తేలిగ్గా అనేసానని మావాడు నా మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. నాకసలు కవిత్వాన్ని ఆస్వాందించడం చేతకాదన్నాడు. నాకేమీ అర్థం కాలేదని తీసి పారేశాడు. ఆ వాదనలో ఆ కవితని సరిగ్గా లోపలకి చూడమని చెబుతూ, మరోసారి చదవమన్నాడు. ఓ పది సార్లు చదివాకకానీ అసలు విషయాన్ని గ్రహించలేకపోయాను.
ఆ కవిత పేరు “ది లయర్”. రాసింది అమరి బరకా అనే కవి. భాషా,భావమూ,వ్యాకరణమూ పుష్కలంగా వాడిన అత్యద్భుత కవిత. అదెందుకు అత్యద్భుతమో వివరణిచ్చే ముందు నా ఈ క్రింది స్వేఛ్చానువాదం చదవండి.
ఇన్నాళూ నాలో ఉన్న ప్రేమ ఒక
భ్రమ, వేయి ముఖాల
భయం. ( చెట్టు నీడలా
కుర్చీని కావలించుకొని, దూరంగా ఓ సంగీతం
చలికి ఘనీభవించిన తీతువు పిట్టల రొద.
ఎక్కడికెళ్ళినా నాదనుకునే
నా మాంసపు ముద్ద, లోపలి గవాక్షాల్లో
ఒక ఆత్మ. దాని సౌఖ్యాలన్నీ
ముడుచుకుపోయిన అవసరాలని బాధతో నేను
అర్థం చేసుకుంటాను.
నేనొక పురుషుణ్ణి
గట్టిగా అరుస్తూ
పుట్టుక మీసం మెలేసే
బాటసారిని. ప్రపంచానికి పునఃనిర్వచిస్తూ
నా అంతరాత్మ మార్పుల్ని, ముందే ఊహించినట్లుగా
వాటిని,
బైబిల్ సాక్షిగా లబ్ధి పొందుతూ
బరువెక్కిన స్తుతిలో
తుడుచుకుపోయిన పరిచయాల్లా
నా ముఖం మీద.
అదొక ప్రశ్న,
ఒక జవాబు; ముందున్న
ప్రతీ క్షణాన్నీలెక్కిస్తూ
నువ్వు పోయేదాకా,
అందరూ ఘోషిస్తారు, "రాయ్ పేరుతో
ఇతను ఉండేవాడు?" ఆశ్చర్యచకితుణ్ణవుతాను
ఎవర్ని ఉద్దేశించని?
పై కవితలో కావాలనే వ్యాకరణ సూచకాలని ప్రత్యేకంగా చూపించాను. ప్రతీ కవితకీ నేపథ్యమున్నట్లుగానే దీనికీ ఒకటుంది. ఈ వ్యాకరణ సూచకాల గురించీ, అందులో వున్న అంతర్లీన భావాన్ని తెలుసుకోడానికి ముందుగా అమరి బరాక గురించి కొంచెం తెలుసుకోవాలి.
ఎమరీ బరాక అసలు పేరు లీరోయ్ జోన్స్. తన భావజాలం మారినప్పుడల్లా పేరు కూడా మార్చుకుంటూ వచ్చాడు. కయోటీ లీరాయ్ జోన్స్, అన్న లూయిస్ జోన్స్ ఇతని తల్లితండ్రులు. న్యూజెర్సీలో 1934 లో పుట్టాడు. కాలేజీ చదువు ప్రారంభంలో రట్జర్స్ యూనివర్శిటీ నుండి హార్వర్డ్ యూనివర్శిటీకి మారేముంది మొట్టమొదటి సారి పేరు లీరై జోన్స్ ( ఫ్రెంచి పేరు ) గా మార్చుకున్నాడు. 1953 నుండి 1963 కాలంలో చాలా పుస్తకాలే ప్రచురించాడు. మొదట రాసిన కవిత్వంలో ఎక్కడా జాతి గురించి ప్రసక్తే లేదు. అతని కవిత్వానికి అతని జాతి అడ్డొచ్చింది. ఆ తరువాత అతని మూలాలు తెలుసుకున్నాడు. తను ఆఫ్రికన్ నీగ్రో జాతికి చెందిన వాడని గ్రహించాకా నల్లవాళ్ళ తరపున ఉద్యమించాడు. అప్పుడే ఆఫ్రికన్ పేరుకి దగ్గరగా ఉండేట్లా “బరాక” గా మార్చుకున్నాడు. కొంత కాలమయ్యాక మార్క్సిజం ప్రభావం పడి, నల్ల వాళ్ళ ఉద్యమాన్ని వదిలేసాడు. 1975 లో మార్క్సిజంపై కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. కొంతకాలం తరువాత ముస్లిం మత ప్రభావంతో తనపేరులో అమీర్ అనే అర్థం వచ్చేలా “అమరీ బరాక” గా మారాడు. అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల తరువాత ఇతను రాసిన ఒక కవిత “సమ్ వన్ బ్లూ అప్ అమెరికా” అతి పెద్ద వివాదాలకి దారి తీసింది. అంతవరకూ ఎంతో పేరు తెచ్చుకున్న అతని కవిత్వం ఒక్కసారి ఛీదరింపులుకు గురయ్యింది. ఆ కవిత గురించి మరో సారి ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. ఇదీ ఇతని పేరు వెనుకున్న కథ. ఇప్పుడు ఆ కవిత గురించి చూద్దాం.
పుట్టిన ప్రతీ మనిషీ ఒక గుర్తింపు వుంటుంది. వుండాలని కోరుకుంటాడు కూడా! పలానా పేరుతోనో, వూరు పేరుతోనో, వారి వారి విద్వత్తుతోనో ఒక గుర్తింపు వుండాలనే అనుకుంటాడు. ఈ గుర్తింపనేది వ్యక్తుల్ని బట్టీ, వారి వారి అభిరుచుల్ని బట్టీ మారుతూ వస్తుంది. బరాకా తన అస్థిత్వాన్నీ, జాతినీ తెలుసుకునే ప్రయత్నంలో రాసిన కవితది. తన చుట్టూ ఉన్న సమాజంపై ఉన్నది ప్రేమ కాదని, భయమని అనుకున్నాడు.ఇది మొదటి రెండు వాక్యాల్లోనూ చిన్నగా చెబుతాడు. మూడో వాక్యం వచ్చే సరికి అతను మెల్లగా చెప్పిన విషయం కదల్లేదు. ఆగిపోయింది. అనుమానం వైపు చూసింది. అది అతన్ని ఆలోచింప చేసింది. మూడో వాక్యంలో అతను కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. “చలికి ఘనీభవించిన తీతువు పిట్టల రొద”లా అతని ఆలోచనలు గడ్డకట్టుకుపోతున్నాయని చెబుతాడు. ఒక్కసారి తనెవరూ అన్న ప్రశ్న తనే వేసుకుంటాడు. పురుషుణ్ణంటూ అహం ప్రదర్శిస్తాడు. తనని కేవలం ఒక పురుషుడిగానే ప్రపంచం గుర్తిస్తుందా అన్న ఆలోచన మొదలవుతుంది. కేవలం పురుషుడేనా? తన గుర్తింపుకి మతం కూడా సహకరిస్తుందా? అన్న అనుమానం వేధిస్తుంది. అందులోనే అస్పష్టమైన ఆలోచనలు. తుదీ మొదలూ లేని భావాలు. మధ్య మధ్యలో శూన్యం. ఇవన్నీ ప్రతిబింబించేలా వాక్యాల ముందు జాగా ఉంచి జరుపుకుంటూ వచ్చాడు. అలా కాలాన్ని జరుపుకుంటూ వచ్చి మరణం అంచుకి వస్తాడు. ఆ తరువాత? తెలీదు. ఆలోచిస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు. చివరికి మరణం తరువాత అతన్ని రాయ్ అనే గుర్తిస్తారు. అది తననా లేక తన జాతినా అన్న ఆశ్చర్యంతో ముగిస్తాడు.
ఇప్పుడు అర్థం తెలిసాక మరోసారి పై కవిత చదివితే వ్యాకరణ సూచకాలు ఎందుకు, ఎప్పుడు ఎలా వాడాడే స్పష్టంగా తెలుస్తుంది. వాక్యాలు రాసేటప్పుడు కనిపించే ; ఈ గుర్తు కవిత్వంలో అరుదుగా చూస్తాం. అంతే కాదు ఈ కవితలో మూడో లైనులో “(” (left paranthesis) వాడాడు. సాధారణంగా ఏ పదం లేదా వాక్యం ముందయినా ఈ గుర్తు “(” వాడితే, చివర్లో “)” (right paranthesis) తో ముగిస్తాము. కవిత చివర వరకూ చూస్తే, ఎక్కడా ఈ గుర్తే “)” కనిపించదు. ఒకసారి తనలోకీ, మరోసారి సమాజంలోకీ దూకుతున్నాడు. ఏమిటన్నది ఇదమిత్థంగా తెలియడం లేదు. తన ఆలోచనలు ఇంకా పూర్తికాలేదు కాబట్టి చివర్లో “)” వాడకుండా వదిలేసాడు. అదెప్పుడు ముగుస్తుందంటే సర్వజాతి సమానత్వమొచ్చినప్పుడు. అదెప్పుడొస్తుందో తనకి తెలీదు. అతనికే కాదు ఎవరికీ తెలీదు.
గమనిక: నా అనువాదంలో అక్షరాలు జారిపోయుండచ్చు. భావం చెడకూడదని గట్టిగా ప్రయత్నించి రాసాను.
7 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
September 7th, 2009 at 2:08 pm
నాకు కవిత్వం గురించి అంత అవగాహన లేదు. చాలావరకూ కవితలు అర్ధమవవు. అంత లోతుగా ఆలోచించే ఓపిక లేకపోవటం కారణమేమో. అమరీ బరాక పద్యం, ఆ తర్వాత మీ వివరణ చదివాక అనిపించినదిది: ఒక పద్యంలో భావం అర్ధమవ్వాలంటే అది రాసినాయన చరిత్ర, ఇంకా అనేకానేక విషయాలు తెలుసుకు తీరాలంటే ఆ కవి విజయవంతమైనట్లా, విఫలమైనట్లా? మీ ఉదాహరణలోని శ్రీశ్రీ, తిలక్ స్థాయిలో మిగతా కవులు విజయవంతం కాకపోవటానికి ఇదే కారణం అని నా ఉద్దేశం.
September 14th, 2009 at 11:10 am
కవిత్వానికెప్పుడూ ఒక నేపథ్యం ఉంటుంది. ఒక్కసారి చదవగానే అది తేటతెల్లమవుతుంది. కవిత్వం అర్థం అవ్వడానికి కవి జీవిత చరిత్ర, నమ్మిన సిద్ధాంతాలూ పూర్తిగా కాకపోయినా కొంత వరకూ దోహద పడతాయి. విడిగా చదివినా కవిత్వం నిలబడినప్పుడే ఆ కవి గురించీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కవిత్వాన్నీ, కవి నమ్మే ఇజాలనీ వేరుచేసి ఒక్కోసారి చూడలేం. ఏదైనా చదినప్పుడు ముందు రాసిన దాన్నీ, తరువాత కవినీ చూస్తాం. కవులని బట్టి కవిత్వం నిలబడదు. కవిత్వాన్ని చూసే కవులను గుర్తుంచుకుంటాము.
September 16th, 2009 at 10:51 pm
ఈ కవిత చాల బాగుంది. అర్ధం తెలిసిన తరువాత చదవడానికి, తెలియక ముందు చదవడానికి చాల తేడా ఉంది. కవిత చాల బాగుంది.
September 17th, 2009 at 12:31 am
కొంతమంది మిత్రులు అసలు పద్యాన్నడిగారు. వారి కోసం…
This is the original poem “The Liar” by LeRoi Jones / Amiri Baraka
What I thoguht was lov
in me, I find a thousand instances
as fear. ( Of the tree’s shadow
winding around the chair, a distant music
of frozen birds rattling
in the cold.
Where ever I go to claim
my flesh, there are entrances
of spirit. And even its comforts
are hideous uses I strain to understand.
Though I am man
who is loud
on the birth
of his ways. Publicly redifining
each change in my soul as if I had predicted
them,
and profited biblically, even tho
their chanting weight,
erased familiarity
from my face.
A question I think,
an answer; whatever sits
couting teh minutes
till you die.
When they say, “Is it Roi
who is dead?” I wonder
who will they mean?
September 17th, 2009 at 12:35 am
పైన చూపించిన కవితలో ఎడమ వైపు రూలుగా రాసినట్లుండదు. ప్రతీ పాదానికీ పైన అనువదించిన రీతిలో జాగాలుంటాయి. వ్యాఖ్య రాసేటప్పుడు అలాగే రాసినా, సమర్పించిన తరువాత చూస్తే అవన్నీ ఎగిరిపోయాయి. గమనించ గలరు.
October 11th, 2009 at 6:15 pm
[...] భావ వ్యాకరణం – అమరీ బరాక – సాయి బ్రహ్మ… [...]
April 7th, 2010 at 9:09 am
hellow dear fellows,
evadu enni vaesaalu vaesina naa aksharaallo naenu kanipistanu. eppudyna ekkadynaa– real rajesh- word is my existence.