Sep2009
బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి-
దూరం నించి నిన్ను చూసి కుంచెదిద్దిన చిత్రపటాని వనుకున్నాను
దగ్గరికి రాగానే
ఆకాశం నక్షత్రాలన్నీ ఒక్కసారి రాల్చినట్టు
నీ మేలి ముసుగు
తుంపరై దూకే జలపాతమైంది
ఒళ్ళు గగుర్పొడిచే సౌందర్యం
వెనక్కి అడుగేయలేని సంభ్రమం
బ్రైడల్ వైల్ ! ఎంత ఉత్సాహం నీకు!
యూసోమిటీ లోయలోకి దభాలున దుముకడానికి!
నిన్ను చూస్తే ఉవ్వెత్తున రకం విస్తరించి నీతో పాటూ ఎగిరి గంతేయాలనిపిస్తుంది
జారే నీటి ప్రవాహమ్మీద జారుడు బల్లాడాలనిపిస్తుంది
బ్రైడల్ వైల్ !
నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి
ఆశగా పూలు తురమాలనుంది
అడవి ముంగిట్లో తీగెలై పాకే వెన్నెలంతా తీసి నీకు నలుగులద్దాలనుంది
నీ జల్లుల హర్షాతిరేకాన్ని నింపుకోవడానికి
మా దగ్గర తగినన్ని హృదయాలు లేవు
ఉక్కుమ్మడిగా ముంచెత్తే వేల జల శరాల్ని ఒడిసి పట్టుకోవడానికి
మా దగ్గర తగినన్ని చేతుల్లేవు
వెల్లువై వేల నవ్వులు పూయించే నీ ముందు పెను బాధలేపాటి?!
నిన్ను నిలువెల్లా కప్పుకున్న సంతోషం ముందు ఏ ప్రపంచమైనా ఏ పాటి!!
చుట్టూ పర్వతాలు పహారా కాసే నీ ప్రవాహం పక్కనే గడ్డి మైదానమై
బల్ల పరుపుగా పర్చుకోవాలనిపిస్తూంది
ఒత్తిగిల్లి నీ కళ్ల్ల్లోకి చూస్తూ
గలగలా చల్లగా నీలాగే నవ్వాలనిపిస్తూంది
September 12th, 2009 at 5:04 am
nice chala bagundi
September 12th, 2009 at 7:03 am
పద్యం చాల బాగుంది. ‘అడివి ముంగిట్లో తీగలై పాకే వెన్నెలంతా తీసి నీకు నలుగులద్దాలని వుంది’ చాల అందమైన ఊహ.అతి డెకొరేషన్ లేకుండా, ఏదో ఉందని భ్రమ కల్పించే ‘పిశాచ నారికేళ పాకం ‘ కాకుండా, పద్యమంతా హాయిగా నడిచింది. ఒక సూచన. బ్ఫ్రైడల్ వెల్ ఒక జలపాతం లేదా నది అనుకుంటా. నా ఊహ తప్పేమో అని చిరు అనుమానం. ఆ మాట ముందుగా చెప్పాల్సింది… హెచ్చార్కె.
September 13th, 2009 at 10:53 am
బ్రైడల్ వీల్ జలపాతం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం లోని యోసొమిటీ వ్యాలీ లో వుంది.
అహ్వహ్నీచీ అనే తెగ ఈ వ్యాలీ పొహొనొ అనే ఆత్మ కు నిలయం అని , పొహొనొ ఆత్మ ఈ లోయ ముఖద్వారం లో కాపలా కాస్తుంది అని అందుకే ఈ యొసొమిటీ వ్యాలీ ని చూసి వెనక్కు వెళ్ళేప్పుడు నేరుగా జలపాతాన్ని చూస్తే శాపగ్రస్తులవుతారని , అలాగే ఈ జలపాతపు నీటి తుంపరలు పీలిస్తే పెళ్ళి అయ్యే అవకాశాలు మెరుగవుతాయని నమ్ముతారు.
October 1st, 2009 at 3:38 pm
చాలా బాగ ఉంది.వీరగొని
October 4th, 2009 at 1:46 am
నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి
ఆశగా పూలు తురమాలనుంది
ఎలా
October 4th, 2009 at 2:18 am
జనార్దన్
“నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి – ఆశగా పూలు ముడవాలని ఉంది” ఎంత ఆశ. అవును జారే ప్రవాహం పై జారుడు బల్లలాడడానికి ధైర్యం చేసే మనసుకు ఇది సాధ్యమే. ఈ ఆశకు అర్హులే. పకృతిని ఆస్వాదించే మనసుకు ఇది సాధ్యమే. ఏ.జనార్దన్ ఫీచర్ సబ్ ఎడిటర్ ఆంధ్రజ్యోతి టి.వి చానల్
November 14th, 2009 at 6:15 am
చాలా బావుంది
January 17th, 2011 at 11:22 pm
[...] http://www.pranahita.org/2009/09/bridal_veil_geeta/ This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink. ← వైరుధ్య ఉగాది సరిహద్దు ప్రేమ → LikeBe the first to like this post. [...]