చవిటి నేల

గత శతాబ్ది చివరిలోనేనో అధ్భుతవ్యక్తిని చూశాను.

అతని వయసు – అప్పుడు అరవై ఐదు దాకా ఉండొచ్చు.విశ్రాంతిగా బతకాల్సిన ఆ వయసులో అతని నిర్విరామ శ్రమ, నిబద్దత, ప్రతిఫలాపేక్ష లేని ఔదార్యం, ప్రేమ – నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఒక జాతీయస్థాయి ఉద్యోగిగా – సిమెంటు రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక యిచ్చేందుకు, నాకు లభించిన అవకాశంతో, మిగతా యిద్దరు సహచరులతో కలిసి, పదిరోజుల క్రితం ఆ ప్రాంతానికి బయలుదేరినప్పటి నుంచి, నా ఆలోచనా స్రవంతిని ఆక్రమించుకున్నాడా అధ్బుత వ్యక్తి!

గత శతాబ్ది చివరిలో……………..

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా కొరకు నాకు కేటాయించిన ‘ఆధునిక వ్యవసాయం – చౌటినేలలకు అనువైన పంటలు’ అను అంశం పై – నా పరిశోధనలో భాగంగా – క్షేత్ర పర్యటన చేస్తూ, చౌటి నేలలను పరిశీలిస్తూ, ఆ మట్టి నమూనాలు సేకరించి, యూనివర్శిటీ ప్రయోగశాలలో పరిశోధించి, ఆ ఫలితాలను నమోదు చేయాలి! ఎందుకూ కొరగాని చౌటి నేలల్నిపంటల కనువైన నేలలగా మార్చడానికి, ఏ ఏ చర్యలు చేపట్టాలో ప్రయోగాత్మకంగా స్థిరీకరించడం నాకివ్వబడిన కార్యక్రమం.!

ఆ మట్టి నమూనాలు సేకరించడంతో పాటూ, అక్కడుండే ప్రజల అభిప్రాయాల్ని, అనుభవాన్ని క్రోడీకరిస్తూ, రైతులకు వ్యవసాయంలో ఎదురౌతున్న సమస్యలు, తెగుళ్ళవల్ల పడిపోతున్న ధాన్య దిగుబడి, రసాయనిక ఎరువులపై వారి అవగాహన – స్వయంగా పరిశీలించక పోతే . పరిపూర్ణత గల పరిశోధకుని గా మిగలననీ …. అందుకోసం చౌటినేలలున్న ప్రాంతాల్లొ రెండుమూడు దినాలైనా ఉండక తప్పదని – నా ‘గైడ్’ సూచనల మేరకు ఆ ఊరి పొలిమేరల్లో బస్ దిగాను.

ఊరు – రోడ్ నుంచి రెండు ఫర్లాంగుల దూరంలో ఉంది. కనుచూపు మేర పచ్చదనం పెద్దగా కన్పించడం లేదు. అక్కడక్కడా ఒకటీ రెండూ జిల్లేడు చెట్లూ. ఎంప,చెట్లూ ఉత్తరేణిమొక్కలు, ఒకటీ అరా గడ్డి దుబ్బలు తప్ప, గుర్తించదగిన చెట్టంటూ లేదు. కొంత దూరంలో ఉన్న ఆముదపుచెట్లే అచ్చటి మహావృక్షాలు, ఆహారపంటలకు అనువుగాని ఆ నేలలోని లవణాల్ని, ఖనిజాల్ని గుర్తించి నమోదు చేసుకోవాలి . నా వెంట తెచ్చుకున్న ‘ప్లాస్టిక్ – కవర్’ లో కొంత మట్టిని నింపుకొని, ఊరికేసి బయలుదేరాను.

డొంకబాట,బాటకు కుడిగా పలుగు రాళ్ళ గోడ …. ఎడమవైపు వాగుజాడ ఉందిగాని, నీళ్ళు లేవు. అక్కడక్కడా చెలమల్లాటి నీటిగుంటల్లోని నిల్వనీరు – చెడు తెట్టతో ఈగలూ,దోమలూ ముసిరి, ముట్టుకుంటే చర్మవ్యాధులు సోకేలా ఉన్నాయి . బాట కిరువైపులా పేడదిబ్బలు, నడవడానికి ఇబ్బంది పడేలా మరుగుకుప్పలు, గాలి వాలున ఎగసే కంపువాసన….. నాగరికత అలా చావనీ ….. కనీసం ఆరోగ్య గురించీ – అవగాహాన లేని పల్లెలా అనిపించింది.

ఒట్టిపోయిన వాగుకావల నుంచి డొంక బాటకు మళ్ళిన గేదల మంద, అడవిమేత ఆరగించిన నడకేం నడవడంలేదు. బక్కచిక్కిన ఆకారాలతో, ఎండినడొక్కలతో, నీరసంగా కాళ్ళీడుస్తున్నాయి. చివరగా కాళ్లీడ్చే దున్నపోతుపై కూచున్న నవ్వుబుగ్గల బోడిగుండు కుర్రాడు నన్ను చూస్తూనే, సిగ్గుతో కిందకు దూకి, ” పంతులుగారి ఇంటికాండీ? ….నా కెరికే… దాండి, సూపిత్త.” అంటూ ముందుకు కదిలాడు.

ఆ పంతులుగారెవరో నాకు తెలీదు. ఆ కుర్రాడి నడిగి వివరాలు తెలుసుకుందామనుకొన్నా, అతను నా మాటకు అందుబాటులో నడవడం లేదు. ఊరిలో అడుగుపెడుతూనే – నా వెంటబడి మొరిగే కుక్కల్ని తరుముతూ, ఐదారు దిసెమొలల బాల్యాలు!

ఊరు చాలా చిన్నది. రెండు వరసల్లో ఎదురెదురుగా ఉన్న శిధిలావస్థలోని పూరిండ్లు. వాటి మధ్యనే కోళ్ళ గూళ్ళు. కొన్ని చోట్ల పందుల గూళ్ళు. ఆ ఇళ్ళకు దాపునే ఉత్తరంగా పలుగురాళ్ళ గుట్ట. మనుషుల జాడ పల్చగా ఉంది.

“అగ్గగ్గో …. అదే బడి, ఆడ్నే ఉంటడు పంతులుగారు. ” అంటూ, దూరాన్నుంచి అల్లంత దూరంలో కన్పించే మారపాకను, వేలెత్తి చూపించి, వెనుతిరిగి పరుగందుకున్నడా నవ్వుబుగ్గల కుర్రాడు. నా వెనక నడిచిన దిసెమొలల బాల్యాల జాడా లేదు.

మారపాకలో వెదురుబొంగుల మంచంలో కూచున్న వృద్ధుడు – కళ్ళ జోడును సవరించుకొంటూ, తన ముందున్న నోటు పుస్తకాలను ఒక్కొక్కటే చూస్తున్నాడు. నా ఉనికిని గమనించినట్టుగా లేదు.

చిన్నాగా దగ్గి, ఆ వృద్ధుడు తలెత్తేలా చేసి, ” నమస్కారమండీ ” అన్నాను.

అతను మౌనంగా తలూపి, ప్రతి నమస్కారం చేశాడు

” నాపేరు చిన్నా రెడ్డి, హైదరాబాద్ నుండి వస్తున్నాను.”

ఆ వృద్ధుడు నోరిప్ప లేదు . కూచో మని సైగ చేసి, తిరిగి తన పనిలో మునిగిపోయాడు. ఓ పావుగంట నోటుపుస్తకాలను చూసి, వాటిని కట్టగట్టి, పక్కనుంచుకొని, ” ఇప్పుడు చెప్పండి” అన్నాడు చిన్నగా.

నా వివరాలన్నీ తలాడిస్తూ విని, ఓ నిముషం ధ్యానంలోకి జారిపోయినట్టుగా ఆలోచనలో గడిపి ” ఇక్కడుండడానికి నా అభ్యంతమేమిలేదు. కాని మీరు ఉండగలరా? ” అన్నాడు.

” ఏం? ”

“గమనించారనుకుంటాను. ఇది దళితవాడ. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఊరు. ఏ వస్తువు కావాలన్నా అక్కడి కెళ్ళాలి ….. పోనీ, మీరక్కడుండకూడదూ ? ….. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ” అన్నాడు.

నాకతన్ని వదలి వెళ్ళాలనిపించలేదు. అతని ముఖంలో తేజస్సుతో కూడిన గంభీరత ఉంది. నా పుస్తక పరిఙ్ఞానానికి అందని ఏదో అనుభవఙ్ఞానం అతనిలో దాగున్నట్టనిపించింది. ఆ అనుభవాన్ని నమోదు చేసుకోగలిగితే …. నా గైడ్ సూచనలు గుర్తొచ్చాయి.”నా పనిలో పడితే, అవసరాలేవీ గుర్తుకు రావులేండి” అన్నాను.

“మీకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పాను. మీ ఇష్టం ” అంటూ, లేచి,పక్కనే ఉన్న చుట్టు గుడిసెకేసి నడుస్తూ ” రండి” . అన్నాడు.

చుట్టు గుడిసె – బొమ్మరిల్లులా ఉంది . పరిసరాలు పేదగా ఉన్నా, పరిశుభ్రంగా ఉన్నాయి. పేడ నీళ్ళు చల్లి, ముగ్గు లేసిన వాకిలి – ముచ్చటగా ఉంది.

గుడిసె ముందున్న పీటకుర్చీ చూపించి, నన్ను కూర్చోమని చెప్పి, అతను గుడిసెలోకి వెళ్ళి, ఏదో పనిలో మునిగిపోయాడు. నేనతన్నే గమనిస్తున్నాను. అతని చేతల్లోముదిమి తనంవల్ల చురుకుదనం కాస్త లోపించినట్టనిపించినా, అడుగుల్లోఓ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది.

“రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. మీకేమైనా అభ్యంతరమా?…. టీ కప్ అందిస్తూ అన్నాడు.

“అభ్యంతరమే ….” కొన్ని క్షణాలాగి, ” ఈ వయసులో మీరు …!

“వయసును గుర్తుచేసుకుంటూ బతకడం నాకు నచ్చదు “. నెమ్మదిగా నా భుజం తాకి. మరీ నెమ్మది స్వరంతో అన్నాడు.

రాత్రి భోజనాలయ్యాక, మార్పాక దాటి వీధిలోకి నడిచాను. నగరవాసినైన నాకు అంతగా పరిచయం లేని పుచ్చపువ్వులాంటి వెన్నెల ! ఆహ్లాదంగా ఉంది. ఆవెన్నెల్లో తడుస్తూ, ఆ పరిసరాల్ని గమనిస్తున్నాను. ఎదురుగా ఉన్న పూరింటి ముందు వెన్నెల్లో కూచుని,బోలుగిన్నెల్లో తింటున్న ఇద్దరు పిల్లలు. పూరింటిలో దీపం లేదు. చీకటిగా ఉంది. నాలుగైదు యిండ్ల కావల తగువాడుతున్న స్త్రీ స్వరం! ఇద్దరు యువకులు నాకు దగ్గరగ వచ్చారు. నా వివరాలు తెలుసుకునేందుకు ఏవేవో తిరకాసు ప్రశ్నలు వేస్తుంటే వారికి అవసరమా ? … అనుకుంటూనే అన్నిటికీ సమాధానాలిచ్చాను. నగరాలకు, పల్లెలకూ ఉన్న వ్యత్యాసాల్లో అదీ ఒకటి ! పొరుగువాన్ని పలుకరించి, అవసరాన్ని బట్టి సహకరించే నైజం . పల్లెల్లో ఉన్నంతగా నగరాల్లో ఉండదు. మా మాటల మధ్య ‘పంతులుగారి’ ఊసోచ్చేసరికి, ఆ యువకులు ఉత్సాహంగా ఊగిపోతూ, అనేక విషయాలు చెప్పారు. అతనిపై వారికున్న గౌరవాభిమానాలకంటే ఎక్కువగా – ఆ వృద్ధుని వ్యక్తిత్వానికే, ఆలోచనా ధోరణికీ అబ్బురపడ్డాను.

ఆ యువకులు చెప్పినట్టుగా – ఆత్మ విశ్వాసంతో కూడిన నిర్విరామ శ్రమతో ఆ దళితులకు జీవితం పట్ల అవగాహననూ, అభిరుచినీ కలిగించేందుకు, అక్షరం మీద అపారమైన నమ్మకంతో అతను చేస్తున్న కృషికి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది.

ప్రభుత్వ విశ్రాంతోపాధ్యాయుడైన ఆ వృద్ధుడు – తన ఉద్యోగ విరమణానంతరం – ఆ దళితవాడకు చేరి, పగలంతా పిల్లలకూ, రాత్రి పెద్దలకూ విద్యాబోధన చేస్తున్నాడు. అతని భార్య కాలంచేసి పదేళ్ళపైగా అయిందట ! ఉన్న ఇద్దరు పిల్లలూ అతని ఉద్యోగ విరమణాంతర ఆర్థిక లావాదెవీలన్నీ పూర్తయ్యాక, తమ వాటా పుచ్చుకొని, ఎక్కడెక్కడో నగరవాసం చేస్తున్నారట ! అయినా అతను కృంగిపోలేదు. తన పిల్లల కొసం బెంగ పడనూ లేదు. ఆ దళితవాడలోని చిన్న పిల్లల్ని దగ్గరగా తీసుకుని, ఆనందించడం అలవాటు చేసుకున్నాడు.

మనలోని సద్గుణాలు గానీ, దుర్గుణాలు గానీ మన దైనందిన కార్యకలాపాల ద్వారానే బయల్పడతాయి. ‘మధర్ థెరిస్సా’ ప్రవర్తనలా – మన ప్రవర్తన ఏ విధమైన భేషజాలు అహంకారాలు లేనిదై, మనలో సహజంగా అంతర్లీనంగా ఉండే ఔదార్యంలో కూడిన ప్రతిఫలాపేక్ష లేని – లక్ష్యం కలిగి ఉంటే, మన చూట్టూ ఉన్న సమాజం పై ఒక ప్రత్యేక ముద్ర ను ముద్రించగలరు ! ఆ వృద్ధుడే అందుకు తిరుగులేని ఉదాహరణ !

పడకను సిద్ధం చేసుకునే అతని దగ్గరగాచేరి, సహాయపడేందుకు నేను ప్రయత్నించినా, అతను అడ్డుపడుతూ, ” మీరిలా నిల్చోండి. ఒక్క నిమిషం. అన్నాడు.

ఎందుకండి… ఈవయసు లో మీకీ శ్రమ ?….

తన పనిలో నిమగ్నమై,అతను వెంటనే తలెత్తలేదు.

వృద్ధాప్యంలో ఎవరైనా తమ పిల్లల దగ్గరో,లేదా ఏవృద్ధాశ్రమంలోనో విశ్రాంతి తీసుకుంటూ గడుపుతుంటారు…కానీ,మీరు…!

అతను తలూపుతూ, కొన్ని క్షణాలు గడిచాక, తలెత్తి, మరణించాక చేసేది అదే పని గదా? వత్తి పలికాడు. స్వరం మామూలుగా లేదు.

ఏ పని?

అతను నొచ్చుకున్నట్టుగా అన్పించింది”.క్షమించండి.మిమ్మల్మి నొప్పించాలని కాదు.నాతండ్రి వయసున్న మీరు కష్టపడటం నచ్చక”.. తలొంచుకుని అన్నాను.

అతను చిరునవ్వులాంటిది జారవిడుస్తూ,నాభుజం నిమురుతూ, పడుకోండి…అలసిపోయారు. అని,మారపాక లోకి నడిచాడు.

మరికొంత సేపటికి పాతిక మంది దాక యువకులు, కొందరు పెద్దవాళ్లూ అక్కడికొచ్చారు. ఆ వృద్ధుడు కొంతసేపు వడ్డీ లెక్కలూ, ఆ పై వ్యవసాయ సంబంధిత విషయాలు,కొన్ని శారీరక ఆరోగ్య సూత్రాలు చెప్పి, చివరగా జాతీయ పతాకపుచరిత్రా,దానిని గౌరవించాల్సిన రీతినీ వివరించాడు.కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టాడు.సారాయి తాగి వచ్చి, చికాకు పరిచే ఓ యువకున్ని దగ్గరగా తీసుకుని, అతను కన్నీళ్ల పర్యంతమయ్యేదాకా హితబోధ చేశాడు. నిద్రపట్టని నేను_అతను చేసే ప్రతీ పనీ గమనిస్తున్నాను. అతను వారిని పంపించాక, ఏవోమాత్రలు మింగి, అలసటగా తన మంచం పై చేరాడు.

అలసిపోయిన అతన్ని నాప్రశ్నలతో విసిగించాలన్పించలేదు. మౌనంగా ఉన్నాను.

అతనే పలకరించాడు. నిద్రొస్తుందా? అని.

ఊహు…కొత్త స్థలం కదా!

రెండు నిమిషాలు గడిచాక, అతను_రెడ్డీ, ఒక మనిషి తన జీవితాన్ని జయించడానికీ, లేదా కోల్పోడానికీ అతని స్వయంకృతాలే కారణమవుతాయి.. ఎందుకు చెపుతున్నానంటే..,మనిషి తనలోని అలసత్వాన్ని వదిలేసి, కృషి చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. రాళ్లలో రత్నాల్నీ, సముద్రగర్భంలో ముత్యాల్నీ దొరికించుకోవచ్చు. ఎందుకూ కొరగాని ఈ చౌటి నేలలో బంగారం పండించొచ్చు ! కావాలసింది నిబద్దత, అవగాహన ! ” ఆంటూ, ఆ ప్రాంత ప్రజల ధోరణి గతంలో ఎలా ఉండేదో చెపుతూ . ” నిరక్ష్యరాస్యత ఒక రాక్షసిలా యీ ఊరి ప్రజలనో ఆటాడించింది. ఈ నేలే కాదు ఇచ్చట మనుషులూ శిధిలమైపోతున్న తీరు గమనించావా ? ” అన్నాడు.

“ప్లీజ్ వివరంగా చెప్పండి సార్ “.

” ఏం లేదు – రెడ్డీ … భూసారాన్నికాపాడుకొనే పద్ధతులు తెలియకపోతే, జరిగే నష్టం_ఓ తీరున ఉండదు. ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం వ్యవసాయంలో చెప్పుకోదగినదైనా,అతివృష్టి పరిస్థితుల్లో భూసారాన్ని కాపాడుకొనే విధం తెలియక, తెలుసుకునే దారులూ తెలియక, తమ భూమూలు చౌటి భూములుగా మారడం చూస్తూ, తలపట్టుకున్నారే తప్ప, నివారణోపాయాల్ని గుర్తించలేదు. ప్రతికూల వాతావరణాలకూ, ప్రకృతి వైపరీత్యాలకూ, బెంబేలెత్తి, దేవతలకు ముడుపులు కట్టారే తప్ప, శాస్త్రీయంగా ఆలోచించలేకపోయారు. నకిలీ రసాయనిక ఎరువులూ కొంత నష్టపరిచాయి. ఏది ఏమైనా మారుతున్న భౌగోళిక పరిస్థితుల కనుగుణంగా మన ధోరణీ నీ మార్చుకోలేని రోజున – మన ప్రపంచమూ శిధిలమై,ఒక అవశేషంగా మిగిలిపోతుంది.మనం ఆకాశంలోకి చూస్తూ,దాన్ని శోధించడానికి చూపే ఆసక్తిలో కొంత,మన భూమిని మరింత ఫలవంతం చేసుకొనేందుకు ఉపయోగించ గలిగితే,మనిషి మరింత ఉన్నతంగా రాణిస్తాడని నా స్వీయాభిప్రాయం!” అని,ఆ పక్కనే చెంబులోని నీళ్ళు తాగి,చెంబును యధాస్థానంలో ఉంచేక-

“రెడ్డీ….ఇవాళ ఈ గ్రామస్తులకు ఏం మిగిలింది? అదిగో,ఆ రాళ్ళ గుట్ట తప్ప.ఆ గుట్టను ఆశ్రయించి,రాళ్ళు కొడుతూ,అమ్ముకు బతికే వాళ్ళు తప్ప,ఎక్కువ మంది వలసల పాలై పొయారు.సన్నకారు రైతులు పట్టణాల్లో కూలీలై శ్వాసిస్తున్నారు. దెబ్బతగిలి,రక్తం కారుతుంటే మట్టి చల్లుకునే మూర్ఖ జీవన ధోరణులు,తెచ్చిపెట్టుకున్న ఆకలి వ్యాధులు,పూనకాలు రావడం,దెయ్యాలు పట్టడం,అనేకానేక మానసిక రుగ్మతలు ఈప్రజల్ని పీడిస్తున్నాయి.చాల దుఃఖపూరితమైన దుర్భర జీవితాలు! ఆ దుఃఖాన్ని మింగలేక, మద్యానికి బానిసలై పొయేవారు కొందరు….నిత్యం కీచులాటలు,దెబ్బలాటలు ….దొంగతనాలూ,కిరాయి హత్యలూ చేసి ఏళ్ళ తరబడి జైళ్ళలో గడుపుతూ ఉన్నారు.ఇంత హీనంగా,ఘోరంగా,ఈ ప్రజలు మురికి గుంటలోని కప్పల్లా ఉండడానికి కారణమేమిటో తెలుసా?”అని ఆగాడతను.

“చెప్పండి”

“నేల పచ్చగా ఉంటేనే మనిషి పచ్చగా ఉంటాడు.అన్నికోణాలలో అర్ధవంతమైన అభివృద్ధిని సాధిస్తూ,ఆనందంగా జీవిస్తాడు.తన ఆశలు చిగురిస్తాయని నమ్మకం ఏర్పడితే మనిషి ఎంతయినా శ్రమిస్తాడు. ఆ భావనతోనే ఈ అక్షరయజ్ఙం ఆరంభించాను.

క్షమించాలి.అక్షర జ్ఙానంతో ఈ చౌటి నేలనెలా సాగులోకి తేగలరు.? మీ కార్యరంగం భూమి కానప్పుడు అదెలా సాధ్యం ? నా అనుమానాన్ని తొలగించుకునేందుకు అన్నాను.

నా ఉద్దేశం లో ఈభూమి చౌటిదై పోడానికి వీరి అజ్ఙానమే కారణమనిపించింది.భూసారాన్ని కాపాడుకోవడానికీ.,ఉన్న వనరులతో మరింత మెరుగైన రీతిలో బతకడానికీ, అవసరమైన జ్ఙానం అందుబాటులోకి వస్తే వీరి జీవితాలు పైరగాలి లా ఉండవా? ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టేబదులు,దానిని స్వయంగా సంపాయించుకొనే మార్గాలు కావలసిన వనరులు కల్పిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది గదా మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండాలి. నిర్వేదం ఉండకూడదు.తన బలహీనతలే తన దుస్తితికి కారణం అని గుర్తించాలి. అలా గుర్తించాలంటే జ్ఙానం కావాలి. ఆ జ్ఙానం సంపాయించడానికి అడ్డ దారులేం లేవు. అక్షరం మాత్రమే ఆపని చేయగలదు. స్పష్టంగా అన్నాడతను.

అక్షరం మీద అతనికున్న అపారమైన నమ్మకానికి మ్రాన్పడి పోయాను. నా నోట మాట కరువైంది. అవగాహన రాహిత్యం వల్ల ఆనేల చౌటిదై పోయిందని అతని అభిప్రాయం శిధిలమైపోయిన ఆ నేలను పునరుజ్జీవింప జేయడానికి అతను ఆనేలను కాకుండా ఆప్రజల్ని అక్షరంతో వెలిగించి, చైతన్య పర్చడంద్వారా తన లక్ష్యాన్ని చేరుకోవాలని చేస్తున్న కృషికి తలవంచి నమస్కరించాలనిపించింది.తాను మరణించే లోపు పూర్తి చేయాల్సిన కార్యం అదొక్కటే అన్పించేలా, తన వయసు నూ అశక్తతనూ పరిగణించకుండా నిర్విరామంగా,స్వచ్చందంగా శ్రమిస్తూ ..మనిషి మాయమై,వస్తువుగా మారిపోతున్న ఈ రోజులలో ఆ వృద్దుని ఆలోచన ధోరణి_అద్బుతం అన్పించింది.

మరో రోజు అక్కడే అతని తో గడిపి కొన్ని మట్టి నమూనాలతో పాటు మరిన్ని అతని అనుభవాల్ని, అభిప్రాయాన్నినమోదు చేసుకొని సెలవు తీసుకొన్నాను.

మళ్లీ నేనాప్రాంతానికి గత తొమ్మిదేళ్లుగా వెళ్లలేక పోయినా ఆవృద్ధున్ని మాత్రం మర్చిపోలేదు. అతని కృషి నా మనస్సు పై బలంగా ముద్రించబడింది.

అతని ఆలోచనలు ఆశలు ఫలించాయా? ఆచౌటి నేల చిగురించిందా?..సారవంతమై పచ్చదనాన్ని పులుముకుందా? ..అక్షరం జయించిందా?… ఆప్రజలు ఆనందంగా జీవిస్తున్నారా? అతన్ని కలుసుకొని తెలుసుకోవాలని ఆరాటపడుతూ …నాసహచరులతో కలసి ఆప్రాంతానికి బయలు దేరినప్పటినుంచి నా ఆలోచనా స్రవంతి లో ఒక ఉద్వేగం.

***

మా జీప్ ఆప్రాంతానికి చేరినా నేనా ఊరిని గుర్తించలేక పోయాను.కంకర రోడ్ తారు రోడ్ గా మారింది రకరకాల వాహనాలతో రోడ్ సందడిగా ఉంది. కరెంటు స్తంబాలు స్వాగతం పలికాయి.రోడ్ ప్రక్కనున్న వాగు నిండా నీళ్లు.వడగాలి స్థానే మలయమారుతంలా చల్లని గాలి.ఎటు చూసినా పచ్చదనం. రోడ్డుకిరువైపులా ఏపుగా పెరుగుతున్న చెట్లు. పేడదిబ్బలూ, మరుగు కుప్పలూ కంపు వాసనాలేని వాతావరణాన్ని చూస్తూ విస్మయానికి లోనయ్యాను. ఊరి పేరును బట్టి నేను ఆ వృద్ధున్ని కలుసుకున్న ప్రాంతమదేనన్న నమ్మకం ఏర్పడింది.

జీప్ నాపి క్రిందకు దిగి చుట్టూ చూస్తూ హిప్ హిప్ హుర్రె అని మూడు నాలుగు సార్లు అరచినట్లు గా అన్నాను.

అతను జయించాడు….జయించాడు…. అక్షరం సాక్షిగా అతను జయించాడు.అక్షరంతోసాధించాడు. నాసహచరులతో ఆనందం పంచుకుంటూ అన్నాను.

ఎందుకూ పనికి రాదనుకున్న ఆ నేలలో రకరకాల ఖరీఫ్ పంటలు….నీడనిచ్చే, ఫలాల నిచ్చే రకరకాల చెట్లు …పైగా గుట్టపక్కగా ఓ సిమెంటు ఫ్యాక్టరీ!

జీప్ ని దళిత వాడకేసి మరల్చాను. ఆవృద్ధున్ని కలిసి అభినందించాలని,ఆనందంతో అతనికి పాదాభివందనం చేయాలని నా మనసు ఆరాటపడుతూంది.

రోడ్ కిరుప్రక్కలా ఉన్న భూముల్లో_అక్షరం చూపిన వెలుగులో, ఆశలు చిగుర్చి, తమ జీవితాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న రైతుల్ని చూస్తుంటే కన్నుల పండుగలా ఉంది. అపరిమిత ఆనందంతో హృదయం తేలిపోతూంది.

ఊరు గతంలో లా లేదు. సిమెంటు రేకులతో కప్పిన ఇండ్లు, రకరకాల కూరగాయలతో, పూలతో, కళకళ లాడుతున్న పెరళ్లు! జనసాంద్రత కిక్కిరిసి ఉంది. ఎందుకూ కొరగాదనుకున్న ఆచౌటి నేల ఒక వృద్ధ విశ్రాంతోపాధ్యాయుని కృషి తో నేడు వ్యవసాయక్షేత్రంగా, ఆరోగ్యవంతమైన వతావరణంతో, జన జీవాలతో వెల్లివిరుస్తూంది.

గతంలో మారపాక ఉన్నచోట సెకండరీ స్థాయి పాఠశాల ! చూట్టూ ప్రహరీ ! పచ్చని గరికతో, రకరకాల క్రోటాన్స్, పూలమొక్కలతో నిండి ఉంది. ఆ చౌటినేలను సారవంతమైనదిగా ఎలా మార్చగలిగాడో ఆవృద్ధుని అడిగేందుకు అప్పటి చూట్టూ గుడిసె కోసం చూశాను!

అక్కడ – చుట్టు గుడిసె లేదు !

ఆ అద్భుత వ్యక్తీ లేడు !!

రెండు సంవత్సరాలుగా అతను లేడని తెలిసి కదిలిపోయాను .కళ్ళు చెమ్మగిల్లాయి.!

ఆ నేలలో, గాలిలో, ఆ పచ్చదనంలో, అచట నివసించే ప్రతివారి శ్వాసలో అతను ఉన్నాడు. ఈ భూమ్మీద జీవించే ప్రతి మనిషీ, ఎంత ఉన్నతుడైనా ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరణించాక కూడా బతకడం కొందరికే సాధ్యం.

జన చైతన్యమే నిజమైన, శాశ్వైతమైన అభివృద్ధిగా …. అక్షరం ద్వారా మాత్రమే దానిని సాధించగలమనే ఆ వృద్ధ విశ్రాంతోపాధ్యాయుని కార్యాచరణ్ను ఒక సందేశంలా స్వీకరించగలిగితే ……

- మానవుడు మరణాన్ని తప్ప, ప్రతిదీ సాధించగలడని, అందుకు అవసరమైన చైతన్యాన్ని అక్షరం మాత్రమే అందిస్తుందనే విశ్వాసంతో ఆ అద్భుత వ్యక్తికి మనసులోనే – చేతులెత్తి నమస్కరించాను.

ఒక అభిప్రాయం »కథలు

ఒక అభిప్రాయం

  1. Rajesh Sep 19, 2009 1

    జాతశ్రీ గారు, ఇటువంటి ఒక మంచి కధకి ఒక్క “అభిప్రాయం” కూడా రాకపోవడం నిజంగా విచారకరం. ఇప్పుడు మంచి చెబితే వినేటట్లుగా ప్రజానీకం లేదనుకుంటాను……! అవును నేను కూడా ఇది నమ్ముతాను. అక్షర జ్ఞానాన్ని అడ్డ దారుల్లో సంపాదించలేము. ఇలాంటి ఒక మంచి కథని మాకందిన్చినందుకు గాను అభినందనలు. కృతజ్ఞులం.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో