Sep2009
దేవిప్రియ కవితలు – మూడు
అమూర్తగానం
అల్లకల్లోలంగా వున్న
హృదయం కంటే
బరువుగా వుంటుంది నీ కన్నీటి చుక్క
సౌగంధికా పరిమళాలను
తరలించుకువచ్చే పిల్ల తెమ్మెర కంటే
మృదువుగా వుంటుంది
నీ మేనిస్పర్శ
తాకితే జలదరించే సితారు తీగవవుతావో
మంచుముక్కల రాపిడిలో పుట్టిన
అగ్నికీలవవుతావో..
పొంగుతున్న ఏటి మధ్య
చేతులు కట్టుకుని అడుగందని లోతుల
ఆరా తీస్తున్న నాకూ
ఒడ్డున ఒకే ఒక్క ఆకు మిగిలిన
అమృత వృక్షంలాంటి నీకూ
మధ్య రాయబారం నడుపుతోంది
మార్మిక కోయిల
ఎక్కడినుంచి ఏతెంచావో
తెలియదు నీకు
ఏ సీమకి ఎగిరిపోవాలో
తోచదు నాకు
ఓ నా శిలాచేలాంచల ఆచ్చాదిత
నీటి శిల్పమా
ఓ నా అనూహ్య ఊహాలోకవిహార
అమూర్తగానమా, ప్రాణమా, ఏమి నీకోరిక…?
(3.8.09)
కరువొచ్చినప్పుడు
పాలకడలిలో
పాముపడక మీద చిద్విలాసంగా
శయనించే అఖిలాండబ్రహ్మాండకోటి
ఆపద్బంధవుడి కొండకోనేరు కూడా
కరువొస్తే ఎండిపోతుంది
కడుపు వీపుకి అతుక్కుపోయి
తడబడే అడుగులతో అరకదున్నే
సన్నకారు హాలికుడి పొలంలో
కుంటికి దిక్కెవరు
బీటలువారిన దోసిట
రాలుతున్న నీటి చుక్కలతో
చేను పెదవులయినా తడవవు
అడుగంటిన బోరుబావి పగుళ్లకి
అతుక్కుపోయిందొక నీటికొయ్యకుబుసం
విత్తిన వేరుశనగ
వెలుగుకోసం చేస్తున్న వేడికోళ్ళు
ఏ అల్పపీడనానికీ వినపడవా..
ఏ దూర దేశాలలో ఏ కనిపించని కోనలో
వెతుక్కోవాలో ఇప్పుడు
వాన అడుగుజాడ…
దేవా, ప్రపంచంలో ఉరుముతున్న
భక్తి అంతా ఒక్క వాన చుక్కగ మారగలదా?
( 4.8.09 )
గంధకుటి
కళ్ళుమూసుకుని
చూస్తే శరీరం
నెమలి ఈకలపాక అయిపోతుంది
అమలిన శృంగారాల
ఆలోచనల ఆలయంగా మారిపోతుంది
ఆకలిదప్పులు తెలియని
అజరామరహరిణిలా గెంతుతూ వుంటుంది
నాగులేటి తీరాన
బ్రహ్మనాయుడి త్రిశూలాయుధమై నర్తిస్తుంది
ఎత్తిపోతల మడుగు జలదర్పణంలో
ముఖం చూసుకుని మురిసిపోతున్న
మొసలిపడుచులా ముద్దులొలుకుతుంది
గట్టిగా కళ్ళు మూసుకుని
క్షణాలు అదృశ్యమవడం చూస్తే
శరీరం అశరీరవాణి చేతి
వీణ తంత్రిలా ప్రకంపిస్తుంది
గుడిగోడలమీది
గున్న ఏనుగులవరుస ఘీంకరించినట్టుంటుంది
కలహంసల గుంపు ఒకటి
ఆకాసం పుట్టిన అంచుల నుంచి
రెక్కలు విప్పకుండానే ఎగిరి వస్తున్నట్టుంటుంది
రెక్కలు తెరవని దార్శనికతలో
నా శరీరం అలౌకిక ధ్యాన కుటీరమై
పగటివెలుగు వలె ప్రకాశిస్తుంది.
(గంధకుటి బుద్ధుడు ధ్యానం చేసుకున్న ఒక తపోవన కుటీరం)
(5.8.09)
September 8th, 2009 at 3:31 am
very very nice kavithalu its all touching my heart. i red thease kavithas 5 times and i noted some sentences. very very thanks 4 ur kavithas DEVI GARU.. i dont miss ur kavithas today onwads. BYEEE ANDI.
September 8th, 2009 at 9:33 am
కవితలు చాల బావున్నాయి.మీ
September 17th, 2009 at 11:34 pm
“అముర్తగానం” మరియు “కరువోచ్చినప్పుడు” నాకు చాల బాగా నచ్చాయి. వ్రాసిన వారికీ కృతజ్ఞతలు… :)
January 5th, 2010 at 2:55 pm
ఎమి నీ కొరిక అంతె చెపీస్థె
థత్తుకొగలర,,మీరు ,,సమజము..కుతుమబము్ ఎగరదానికి రెక్కలు వాయువెగాలథొ సరిచెసుకంతున్నము చచూదందిగామా రెక్కల్ ధూలికి కమీ కల్లు మూసుకు పొథె ..మ్మఆ చీర కొంగులె మీకు పనికొచెవి,,గీథంజలి