ఎప్పటిదేముడప్పట్కె

ఎఱ్ఱటి ఎండల రైతుబజారుకు పోదామని బయటిపడ్డది రేణుక. “మే” నెల ఎండలు  మన్సులను చంపుతున్నయ్. మస్తుమంది ఎండల తాపంకు వడదెబ్బతగిలి సచ్చి పోతున్నరు, దవాఖాన్లలో జేర్తున్నరు. ఆల్లంత బీద బిక్కి కుల్నాలి జేస్కునేటోల్ల .. దినాం భుగ భుగ ఎండలల్ల పనిజేత్తరు. సంపాచ్చిందంత ఆల్ల గుల్కోసు కర్సులకు సరిపోతయ్. బస్తీల గా లేబర్లకు జూత్తలేద? అసలు అగొస్తం ఇగస్తమ్ అంటూన్నరు మృగశిరం రాంగనే పడాల. ఎప్పడస్తయో ఏమో జూన్ మైన రానె వచ్చె. పోయిన యేడాది జూనంత ఆనలే లేవు. పంటలే లేవు. ఎట్లస్తయ్? అడవులన్ని కొట్టేపిస్తుంటే. నిన్న జద్వింది పేపర్ల రాష్ట్రం మొత్తంల పదకొండు శాతం అడవులే మిగిల్నయంట. మరి ఆనలేడికెల్లస్తమ్? ఇంగ మీది కెల్లి ఆనలు పడాల్నని పూజలు , రతాలు, అల్లాకాదువాలు, చేపిత్తున్నరంట సర్కారోల్లు. ఎండకు సెమటలు కక్కుతున్న రేణుక సెవన్ సీటర్ ఆటోల ఎక్కింది. హైతనగర్ కెల్లి రైతుబజారు మస్తె దూరం. వడగాలి షురువయ్యింది. రాత్రంత నిద్రనే లేదు. రాత్రేనా మస్తు దినాలకెల్లి రాత్రులు నిద్రపడ్తలేదు. అలోసెనలలోని దినమంత పిసపిసయితున్నది. లలిత పెన్మిటి యాదగిరి ఎందుకురిపోస్కావాల? గింత పిరికితనం ఎందుకుండాలె? భార్య ఇద్దరు చిన్నపోరగాండ్లు ఏంగావాలె పైయీనే! మక్సాన్ మక్సాన్ అనుకుంట ఐడీపిఎల్ కంపెనీ మూసేపిచ్చి విఆర్ యస్ ఇప్పిచ్చి అందరిని ఎల్లగొట్టిన్రు. ఆఖర్కి ఇర్వై యేండ్ల సంది ఉంటున్న గా క్వార్టర్లకెల్లి గూడా పంపిచ్చిన్రు. అందరూ సిటీల ఏదో ఒగ దిక్కుకు ఆగమాగమైపోన్రు. ఆ నాల్గు కమ్రల పెద్దిండ్ల ఉండుడూ అల్వాటైనంక బస్తీల రెండు కమ్రల సుదరాయిస్తలేదు.ఇద్దరు పెర్గిన పిలగాండ్లతోని.

ఎంతేడ్సినమో… క్వార్టర్లు ఖాళీ చేస్తున్నప్పుడు సంత ఇంటికెల్లి పోతున్నట్లే అన్పించింది. “ఇదేమన్న మన జాతీ ఇల్లా గింతగనం ఏడుస్తున్రు నడుండ్రి నడుండ్రి”, అన్నరు మొగోళ్లు బుగులంతా గుండెల్ల దాస్కొని . లలిత, సుజాత, రంగవల్లి, పద్మ, బుచ్చెమ్మ, రాదమ్మ, రుక్సానాబేగం, షాజానా, తను ఎంతగనం ఏడ్సినమో వొగల్లను పట్కొని వొగల్లం. ఎన్నేండ్ల సంధి గా కంపెనీలో పనిజేస్కొంటా ఒక్కూరి మందిలెక్క కష్టమొచ్చినా, సుఖమొచ్చినా గని పంచుకుంట, పెంచుకుంట. ఇంతట్లోనే ఇది! చానా ఏండ్ల సందే బెదిరిస్తున్నరు కంపెనీ మూసేస్తున్నరని. ఇగో బందైతది, అగో బందైతది, అసలు బందేకాదంట అనే పుకార్ల నడ్మ ఒగ దినం సత్యంగనే బందు అయ్యింది. ఆఖరికి ఆ దినం రానే అచ్చె… మూడు వెయ్యిలమంది రోడ్లమీదబడి పొయ్యిరి. గిది అరాయించుకున సాతకాక  లలితమొగుడూ , గాయనకు గుండె పగిలినట్లె అయింది, వురివోస్కున్నడు. అప్పుడామె మరి ఏంజేస్కొని బత్కాలె? యాడ పని దొర్కుతది? పైవేటు కంపినీలోల్లు వీళ్లను తీస్కునేతందుకు తయ్యార్లేరు. ఫికర్ జేసి యాదగిరి చనిపోవుడుతోని మస్తుమంది బయవడ్డరు. ఎట్ల బత్కుడో, ఏం చేసి బత్కుడో అన్కుంట లలితైతే పాపం పిసదాని తీరే తాయిమాయి  అయితున్నది ఎట్లేడ్వాలో ఈ పిలగాండ్లతోని అన్కుంట. నౌకరీ పోయినాంక ఫికర్ తోని బగ్గ తాగుడు షురువెట్టి, దానికే బానసై పోయిండు యాదగిరి. బాదంతా మర్సిపోనీకి ఆఖర్కి బాద తెల్వని జాగలకే ఎల్పోయిండు. ఆయనేనా? ఇంగో రెండేడ్లకు రిటైరైతాన్న అన్కున్న నర్సింకాకకు గుండెపోటచ్చి దవాఖానుకు కొంటబోయేటాల్లకే సచ్చెపోయిండు. అంతె… కాలం ఎట్లా దాపరించింది? రెన్నెల్లాయె గీ బస్తీలకచ్చి. ఆయెన పైవేటు నౌకరీల జేరేపొయ్యిండు తక్వ జీతంకు. ఎన్ని దినాలు రికాంగుంటడు మరి?

పెద్ద కొడ్కు రవి ఇంటరు బందువెట్టి కరెంటు పని నేర్వబట్టిండు చదేం పన్కస్తదని. ఆడే ఖుద్ ఫైస్ల చేస్కున్నడు. ఇద్దరు కొడ్కులు – ఎట్లనోజేసి చద్విపిస్తం తియ్యి అని ఆల్లయ్య. తను ఎంతజెప్పినా ఇన్నాడు? బిడ్డె రజిత పది చద్వుతున్నది. మూడో పిల్లడు తొమ్మిదిల ఉన్నడూ. వీళ్ల చద్వులెట్ల ఎలబార్తాయో ఏందో? ఏమైతదో ఏమో? ఈ పరేషాన్లనే గాయనకు బి.పి ఎల్లింది. దినాం ఒగ బి.పి. గోలి ఏస్కోవాలె. మద్దె మద్దెన డాక్టర్ తాన చెకప్ చేపించాలె. ఫీజులు కట్టాలె. డాక్టర్ సాబ్ రిలాక్స్ కమ్మంటడు. ఆలోసనలొద్దంటడు. గీనేమో పిల్లలమీదికెల్లి సోంచాయించుకుంట పరేషాన్ అయితాండు ఎట్లనో ఏమో అని. తను కాడా పరేషాను? రాత్రిల్లు నిద్ర పడ్తల్లేదు. ఎప్పుడన్న గిట్ల కండ్లమీద రెప్ప బడ్డదంటే ఖతం… పీడకలలస్తయి. లలిత, యాద్గిరి, నర్సింకాక నౌకరీ పోయిందన్కుంట పోయినదోస్తులు, ఆల్ల పోరగాండ్లు వీళ్లంతా  మెల్కొస్తది మల్లింక జాగారమే అనుకోరాదు! ఇంక మీదికెల్లి ఈయెన ఇంగో మూన్నాల్గొందలమంది కంపినీల పన్జేసేటోల్లు జులూస్ లు నిరాహార దీక్షెలు జేస్తున్నరు రోజొకల్లు! ఈనెకు ముందే బి.పి. అద్దంటె ఇనడు. బగ్గమందిని అరెస్టు జేస్తున్నరంట, కొడ్తున్నరంట, గుండెలు గుబ గుబా అంటున్నయ్ – ఈయనెప్పుడు  అరెస్టైతడో అని…అయితే? ఇంగేం…. బత్కు ఇంగింతద్వానమైతదనుకోరాదు. సుగరు బీమారీతోని అత్త సుగా జాగారం జేత్తది. కొడ్కు మీన గుబులు గామెకు గూడంగ, ” ఒద్దుర కొడ్క… పొయ్యిల తీసిందే తిందామురా, పోకురా” అని బత్మిలాడ్తది. ఈనె ఇంటడా?

“రైతుబజార్, రైతుబజారని అర్వ బట్టిండు ఆటో పోరగాడు. రేణుక ఆలోచనలకెల్లి ఒక్క ఝట్కా ఇచ్చినట్లే బయటవడ్డది. పైసలిచ్చి రైతుబజర్ దిక్కు నడ్సింది. కూరగాయల కోసానికి ఈ పరేశానంత. ఈ తాప ఊరగాయలింగ పెట్నే లేదు. యాడ పైసలే లెవ్వు. పతి యేడాది ఈపాట్కి ఎన్ని ఊరగాయలు పెట్టెడ్ది తను? నువ్వులూర్గాయి, అల్లమెల్లిగడ్డ, బెల్లపూర్గాయి, సప్పటూర్గాయి, ఒట్టి ఆవూర్గాయి, అన్ని తను లలిత కల్సి పెడ్దురు. ఇగ వందకాయలన్న గొని ఇర్వై కాయలల్ల ఒక్కోరకం పెట్టెడ్ది. అందర్కీ తన పెద్దాడబిడ్డె, తోటికోడలు, తన అక్కసెల్లెండ్లకు పంపెడ్ది. ఎంత సంబరంగుండెడ్దా కాలం? అందరింటికొచ్చేటోళ్ళు. ఎండలకాలంల కల్సి ఊరగాయి పెట్టూకునేటోళ్ళం. ఇల్లంతా పిలగాండ్ల లొల్లితోని జింగాన జింగానై పోయెడ్ది. ఇప్పుడు తనకె ఒక ఇర్వై కాయలతోను ఊరగాయ పెట్టాల్నంటే చేతిల పైసల్లేవు. అరె అక్కకిట్లైందని  ఒగ సెల్లె పంపలె. ఒగక్క పంపలె. అయినాగానీ పాపం ఆల్లకే లేదు తనకేం పంపుతరగని ఒద్దొన్కొన్నది గీపాలి. ఎండలకాలం అయిపోవట్టె. శాస్త్రానికైనా గింత పెట్టాల్నని అత్త పోరువెడ్తున్నదని ఇగ ఈ దినం బయటబడ్డది సూడు. లేకపోతే గాకోమటోల్లు దుక్నంలో  అవుసరం అచ్చినప్పుడల్లా రూపాయికో రెండ్రూపాయిలకో ఊరగాయ దెచ్చుకుంటే సరిపాయనన్కున్నది. ఊర్లె అత్తోండ్లు, కాకోల్లు, గూడంగ బందువెట్టిన్రంట సేస్కొనుడు. ఇగ కోమటోల్లకు మస్తు గిరాకీ. పోనియ్యి! ఆల్లనన్నా బత్కనియ్యి. గా సర్కారోళ్ళ కన్ను వీళ్ల మీన పడకపోతేమాయె! మల్లపోయిన  నౌకరీ యాదికచ్చి గుబులెక్కింది రేణుకకు.

రైతు బజార్లకు గిట్ల అడుగుపెట్టిందో లేదో పానం హాయిగన్పించింది రేణుకకు. కూరగాలు, మామిడిపండ్లు, ఆక్కూరలు, నిమ్మకాలు, అల్లమెల్లిగడ్డలు, ఎండు మిర్చి, తమ్లపాకులు, పచ్చిమామిడికాలు, మల్లెపూలు, చామంతిపూలు, మరువం కొమ్మలు పచ్చాపలు, ఎండ్చేపలు, ఎండ్రొయ్యలు, ఒకటేంది కమ్మటివాసన. గుమాయించి కొడ్తున్నది. మీదకెళ్ళి భూమ్మీద నీలు జల్లిండ్రేమో… అన్నింటీ వాసన గల్సిపొయ్యి గదేందో గమ్మత్తుగా వాసనొస్తున్నది.

పావుకిల దోరొపా, చారూపా… అగ్వ, చౌక.. అమ్మా, ఆంటీ, ఓసారు, కాకా…. ఇట్రాండి అన్కుంట ఒర్లుతున్నరందరు. ఎండలో కూసున్నరేమో పొద్దుటాలనించి ఎండ్క పోయిన  ఆకుల్లెక్కున్నరు అమ్మేటోళ్ళందరు. ” ఏందంత కోపం… గింత నాజూకు దేనికవ్వా …. అన్నీ ఏరేస్తున్నవు. ఎయ్యి ఇంకిన్ని బెండకాలు బిరాన. ఎండ మాడగొడ్తున్నది.నీకేమి సక్కంగ కూసున్నవు.” ఒగాసామి బెండకాయలమ్మిని బెదిరిచ్చుకుంట అంటాండు. “అవుసారూ…. నువ్వు నీడల ఆఫీసుల పంకకింద కూసోని ఇస్రాన్తంగా గిప్పుడు మోటారు బండి మీనచ్చి బేరమాడబడ్తివి. ఇంటికి వొయ్యి మీ బాయండిన రొట్టెకూర తిని సల్లంగ పండుకుంటరు. మేం పొద్దుట్యాల కెళ్ళి ఎండల కూలబడి అమ్ముకోబడ్తిమి సల్లంగేడ కూసున్నం సామీ. మల్ల గుడ్సెకు పొయ్యి మేమే అండుకోవాల్నాయె, తినాల్నాయె మరి మాకేల సారూ కోపాలు, అన్నీమీకే రావాల, తీస్కో సారూ అగ్వనే సెప్తున్న, మంచియే యిస్తున్న తియ్యి” బెండకాయలమ్మి సిటపట అంటున్నది. “ఓమ్మా, మాటలు మంచిగ రానియ్యవూ? నీతాననే ఉన్నయ్యీ బెండకాయలు” ఆసామి గూడంగ ఇంగింత కోపానికొచ్చి మర్ల వట్టిండు. ” ఓ సారూ జరంతాగు… అగో… గంత కోపానికస్తివి… ఏర్కో, దా తియ్యి నువ్వు ఏర్కో, పొద్దయితాంది…” కాళ్ళబేరానికి అచ్చింది బెండకాయలామె ఇవన్నీ ఇన్కుంట రేణుక నడుస్తున్నది. ఇగోమ్మా సూడు… అగ్వ వూరగాయకాయలు… కొర్రి నాల్రూపాలకొకటీ. ఎంత సక్కదనంగున్నయ్యో సూడరాదు, రాబిడ్డా…” ఒక భారీ ఆడమనిషి ఉర్లెకెళ్ళచ్చినట్లే గొడ్తున్నది. ఎంతోర్మితోని పిలుస్తున్నది అచ్చే పోయేటల్లను!

“అగ్గో… గట్ల పోతవు.. రావు… బేరం సెయ్యి సెల్లె! ఓఅన్న గిట్లరా… ఏర్కో…” అన్కుంట కాయల దిక్కు సూస్కుంట ముందర పోయేటోళ్ళను ఎన్కెకెళ్ళి ఒర్లుకుంట పిలుస్తున్నది. గట్ల ఎన్కకి పిల్సుకుంట ఇగ్గో, గివ్వి రెండున్నరకొగడి… చిన్నంగున్నయి గని, మస్తుపుల్లంగ వుంటది తిను సూడు… గివి మూడ్రూపాలకొగటీ… అన్కుంట చాకుతోని కాయలు తుకడలు కోసి “తిను బిడ్డా” అన్కుంట బేరం చేస్తున్నాల్లను ఏదో మంత్రం వేసినట్లే ఆపేస్తున్నది తన గంపలకాడ.

ఎర్రంచున్న రామచిలక రంగు పచ్చె చీర, ఆడాడ సిర్గులు కానొస్తున్నది.  ముక్కుకు ఎర్ర రాళ్ల  బులాకీ చక్ మని మెరుస్తున్నది. చెవుల్నిండా పైకెళ్ల కింద తమ్మెదాంకా ముత్యాల పోగులు. తమ్మెలకు పెద్దపెద్ద ఎర్ర రాళ్లు, ముత్యాలు గల్సిన దుద్దులు. మెళ్ల బంగారు గుండ్లున్న గొల్సు. చేత్లకు ఎర్రయ్, పచ్చయ్ రాళ్ల గాజులేస్కున్నది. గామె కాండ్లకు మాత్రం కడాలు లెవ్వు, బోసిగున్నయ్. చేతిమీన “మాతయ్య” అని పచ్చబొట్టేపిచ్చుకున్నది. గడ్డం మీన ఆకుపచ్చంగ మూడు చుక్కలు పచ్చ బొట్టు. ఆమె దిక్కే పోయిన రేణుక బేరంజేస్తున్న గామెను పైకెల్లి కిందకు చూస్తున్నది. ఊర్లె ఉన్న పెద్దమ్మ తీరె ఉన్నదనుకున్నది.

” రా బిడ్డా రా.. కూకో… సూడగ్వ నాల్రూపాలకొకటి” అన్నదామె.” ఇప్పుడే మూడ్రూపాలకొగడని అర్వబడ్తివి కదా పెద్దమ్మా మల్లిప్పుడే నాల్గంటున్నవ్” అన్నది రేణుక నగుకుంట

“తీస్కోబిడ్డా మూడ్రూపాలకొగటి…” దిగచ్చినట్లే అన్నది గామె.

“రెండున్నరకియ్యి ఇంకేమి? అదిగూడా పుల్లంగుంటెనే తీస్కుంట లేకపోతే లేదు. పుచ్చుకాయలు, పండుకాయలు పురుగు కొట్టిందంటే  తీస్కోను గిపుడే జెప్తున్న” అన్నది రేణుక.

” మూడుకెన్క దిగనమ్మా… అందరట్లే అమ్మవడ్తిరి” అన్నదామె.

” య్యే, లచ్చుమమ్మా.. యియ్యి .. తీస్కో, తియ్యమ్మా” అక్కన్నే నారసంచులమీన విల్ పీటపెట్కోని  కూసున్న ఒగ నలభై ఏండ్లాయన్ అన్నడు. ” నీకెం దెల్వది పెంటయ్యా. మల్ల సేటు తిడ్తడు” అన్నది లచ్చుమమ్మ ఎర్రబడ్డ మొకంతోని సిర్రసిర్ర పెంటయ్య దిక్కెయ్య చూస్కుంట.

“ఏంగాదె… నువ్వు కూసోమ్మా..” పెంటయ్య మల్లన్నడు. రేణుక కింద కూసోని ఒగ ఇర్వై కాయలు ఏర్కొని విల్పీట కాడూన్న చక్కబల్లమీన కూలవడ్డది. పెంటయ్య కాయలు పలగ్గోట్టుడూ షురూ చేసిండు… లచ్చుమమ్మ చిన్న చాకు చేతిల బట్టుకొని పెంటయ్య పగలకొడ్తున్న కాయలల్ల పుచ్చులేరుడు షురూజేసింది.

“గీపాలి చెట్లు కౌలుకు దీస్కున్నంగని ఇర్వైఏలన్న ఎల్తయో లేవోనే పెద్దమ్మా.. సేటుకేమో మంచిగ నలభై ఏలిస్తిమి. లాభమొస్తదనుకుంటే సూడంగ సూడంగ కాయ ధర పడిపోవట్టె. ఇంగ అప్పెట్లా తీర్చుడో ఏమో…” పెంటయ్య పరేషాన్ల బడ్డట్లే అన్నడూ. “గీ యాడాదేనారా? పతి యాడాదిట్లనే అయితున్నది, ఏంజేసుడు కర్మ ఇట్ల కాలబట్టింది. దునియంత కర్వుల మున్గినట్లే గొడ్తున్నది. లేకపోతే ఈ సారి నీళ్లు లేక ఆ సెట్ల పంట గూడంగ పండకపోవుడేందో మనం  ఈడకొచ్చి గీ రైతు బజార్ల రోజు కూలీలగా మారుడేందోరా, అంతా నసీబు” అన్నది లచ్చుమమ్మ. ఒగ రగమైన వేదాంతంతోని గడ్డెం మీద మూడు పచ్చబొట్లతోను ముద్దచ్చింది లచ్చుమమ్మ రేణుకకు. పెద్దకొప్పేసింది. కొప్పు నడీబట్ల గింత వెండి మువ్వలు సిన్నవి గుచ్చింది. మొగమంతా చమట. నోరంత పాను ఎర్రంగ! ముందే బత్కుగోసల బిత్తిరి బిత్తిరి గున్న  రేణుకకు వాండ్ల మాటలు ఇంటుంటే వీండ్ల బత్కు మీన గూడా ముసురు కమ్మిందేమే తన బత్కు తీరు అనుకున్నది. “ఏవూరు పెద్దమ్మ మీది, యాడకెల్లి వస్తివి” రేణుక అడ్గవట్టింది.

ఈడనే బిడ్డా దండుమైలారం…. రంగ రెడ్డి జిల్లా అన్నది. లచ్చుమమ్మ పన్జేస్సనే. తన పక్కల్నే ఊరుందన్నట్లే చేతులు పక్కకెయి సూపిచ్చుకుంట.

“ఊర్లె యవసాయం బందైందా ఏమి?” అన్నది రేణుక. లచ్చుమమ్మతోని మాట్లాడిపియ్యాల్నని

” యాడి యవసాయం బిడ్డా, గామాటిని ఎన్ని దినాలయ్యింది అంతా బందైంది. మా వూర్లె మా తోటల మస్తు కూరగాలు పండిస్తుంటిమి. తమాటలు , అంకాయలు, ఆకుకూరలు, దోస్కాయలు, గోచిక్కుడు కాయలు , అల్సింత కాయలు, కొత్మీర ఏస్తుంటిమి. ఇపుడూ నీళ్ళే కర్వాయె. నీళ్లుంటేనే అన్నుంటయ్  బిడ్డా! ఆనలు పడకపాయె.. మీదికెల్లి చేన్లపొంటి బోర్లు పట్టలేవు. కరెంటు లేదు. బ్యాంకు లోన్లు చుక్త  చేస్తలేమని కొత్తయిస్తలేరు. యవసాయమెవలుజేత్తరు బిడ్డా… బుగులు బగ్తున్నరు చేయనీకి. అందరు సిటీల కచ్చి బడ్తున్నరు బత్కనీకి, సంతభూమి ఉన్నగని… ఏమీ లేని బికార్ల తీరు అన్నది లచ్చుమమ్మ.

మీకే కిదె పెద్దమ్మ. గిప్పుడు సిటీలో ఉన్న మా అసుంటోల్లం గూడంగ బత్కనీకి పరేషానైతున్నం మీ భూములు మీకు కాకుండెట్లైనయో మా నౌఖరీలు  మాకాకుంటైనయ్.. సర్కారోల్లు నష్టాలున్నయని బల్మికి నౌఖరీలకెల్లి మస్తుమందినే తీసేసింది. అన్నది రేణుక గుండెల్ల బిగదీసినట్లైతుంటె.

“అయ్యో బిడ్డా బాద పడకు… ఏదో ఒగతొవ్వ ఉండనే ఉంటది తియ్యి… మీ కంటే మా హాలత్ మస్తు ఖరాబున్నది బిడ్డా.. ఒగ నక్సలైటు జెండ పాతలె గని మాయదారి కర్వు. దిక్కులేనన్ని బ్యాంకిలోన్లు మా బాయిని మాకు కాకుంట చేసినయ్.. అప్పులు తీర్సెనీకి బాయిలమ్ముకుని బర్బాద్ అయిపోతిమి.. “లచ్చుమమ్మ కసిగ కర్వుని తిడ్తనే పని జేస్తున్నది.

” మస్తు కష్టమైతున్నది గా వచ్చు మీ కూర్లె యవసాయిం బందైనంక ” అన్నది రేణుక.

“కష్టమా బిడ్డా… ఏం జెప్తవు తియ్యి ఆగమాగ మైతున్నం! గిట్లనే ఏదో ఒగ పనిజేసి పొట్టకు ఒగపూటైన ఘట్క గంజి ఎల్లదీస్తున్నం, లేన్నాడెట్లైన లేదు.. ఇగో గీ ఎండలకాలం రైతు బజార్ల గీపని జేత్తలేమా? అమ్మినంక రోజుకు ముప్పై రూపాలు. బస్సు పాసు, ఒగపూట దాల్ చావల్ ఇత్తడు సేటు. పొద్దు గుంకేదంక జేసి సేటచ్చినంక గాయెనకు రోజు కమాలు ఇచ్చినంక ఎవల జూకలకు అట్ల పోతనే వుంటం ” అన్నది లచ్చుమమ్మ.

లచ్చుమమ్మ భారీ మనిషి…, మనిషి ఆరెగ్గెంగనే గొడ్తున్నది.. గని కండ్ల కింద నల్లంగ నీడెల్లెక్క అచ్సినయ్.  ఏం బుగులో మరి.. ఏముంటది బత్కుబుగులు తప్పితే.. అన్నంక ” మరి గీఒయిసుల గింత కష్టం జేస్తున్నవు కొడ్కుల్లేర పెద్దమ్మ నీకు? నీ మగడేం జేత్తడు మల్ల? అన్నది రేణుక. కొడ్కుల సోయి రాంగనే లచ్చుమమ్మ మొకంల ఒక్కసారి కోపం కన్పించబట్టింది.

“ఎందుకులేరు. వున్నరు ఇద్దరు బాడ్కవులు, కొడ్కులేం జేత్తరమ్మ.. మాకేం జేసినవు, ఏం సంపాచ్చినవ్ అని మర్ల వడ్తరు లంజె కొడ్కులు. మూడెక్రాలు అప్పులకయి అమ్మిన, మూడెక్రాలు మిగిలిన భూముండె, నాల్గు కమ్మల పెంకుటిల్లుండె. అయినగని ఇంకా గావాల్నంట. యవసాయిం జేయడు చేతగాక పండని పంటేసి బ్యాంకులోన్లు జేసి గవ్వి తీర్చేతందుకు మూడెక్రాలమ్మినమని గోస ఆల్లకు.. మరేం జేస్తుం? అప్పులేడికెల్లైన జుక్త జేస్కోగని బూమి అమ్మద్దని వాళ్ళ నాయినమీదనే మర్లబడి గొట్టిన్రైతె గాయెనకు చెయ్యిర్గి దనాఖానం నాల్గు అరాలున్నడు. భూమి ఆండ్లదంట, అప్పులు మాయ్యంట.. ఇప్పుడ్కైన ఇంకింత కావాలనే అంటరు. ఏడీకెల్లి దెస్తు జెప్పు? పిలగండ్లని గిట్ల కని గట్ల కోతలకు, కొయ్యలకు అంట లేకుండ పోయిన .. సంపాచ్చిన! గింత ఆరాం దెల్వది. గీ గాండు బత్కుకు అగ్గి దగల..గింజె, గింజె కూడబెట్టిన.. తిన్నరు పెర్గిన్రు. అస్ లీ కొడ్కులైన్రు!.. నా య్న, అమ్మ కష్టంకు గాదు. ఆళ్ల ఆముసంకు ఔలాద్ లైన్రు.. అమ్మ, నాయ్న బారంగయ్యిన్రు. అయినగని.. నాకేం తక్కువయ్యితది తియ్యి. రెక్కల్లల్ల ఇంగ గింత బలమున్నది. ఊకె కూకోవద్దు బిడ్డా గీ ముసల్తనానికైనగని.. ఆల్లతోని మాటబడద్దు. ఆల్ల బేషర్మ జూడన్! మయినకు మేమిద్దరం ఆల్లకాడుంటుంన్నందుకంట మూడొందలియ్యాల్నంట! మాపైస.. మా ఆముసం అంత అనుభవిచ్చుకుంట., మాకింత ఘట్క పొయ్యనీకి గా బాడ్కవు గాళ్ళకు మయినకు మూడొందలయ్యాల్నంట.. బేషరమ్ ఔలాద్ లు! మరిగింతగనమ్ జేస్కుంట ఆల్లకెందుకియ్యాల గిప్పుడైనగని? ఆల్లకురెక్కలచ్చినంక గూడంగ మా కమాయి ఆల్లకెందుకమ్మ? నాది నాకె ఉంచుకుంట గావల్సినవి కొంత. తింట. నా బాగాల నేనే పంట! ఆడెందుకుండాలె, అల్లమాటేందుకు పడాలె? ముసల్తనానికి గింత తక్లీఫ్ ఇస్తాంటే ఆడెందుకుండుడూ? గందుకె ఇంట్లకెల్లి దెంకచ్చిన! నా బిడ్డ తాన ఒక కమ్రల అద్దెకుంట! అల్లుడొద్దంటడు గని నేనే బల్మికిస్త మయిన కొక రెండొందలు! ఏమో.. ఎప్పట్కైన. ఎవర్తో నైనగని, కొడ్కైన, కోడలైన, అల్లుడైన, బిడ్డైన గని మాటెందుకు పడాలి బిడ్డా నువ్వే జెప్పు! మయినకొగ ఎన్మిదొందలస్తయ్.. గవ్వి నెల కర్సు మిగలంగ బాంకిల ఏస్త.. మా ముసలాయన బీపి గోలీల కర్సో లెల్తయ్.. నా కొడ్కులిద్దరు లంగలు.. నాయ్నకు గోలీలు సుగ ఇప్పియ్యరు నాకెరికె.. మా ముసలాయెన ఎట్లుండో ఏమో?” అన్నది లచ్చుమమ్మ పనాపు జేసి పెయిలకున్న బలమంత పోయినట్లె .. పురాగ ముసలాయెన ఖ్యాల్ల పడ్డట్లైంది.

“ఆడేంజేస్తడాయన? మరి నీతోని గొంట రావద్ద ముసలాయెనను?” రేణుక జాలితోని అడ్గింది.

“రాడమ్మ  గా ఊరు ఇల్లు అదిలిపెట్టి గీడకు రమ్మన్న హర్ గీజ్ రాడు! బిడ్డతానవుంటె ఇజ్జత్ ఖచర్ అయిదంట! అడేం జేత్తడంటవ? ఆల్ల పిలగాండ్ల నెత్తుకోనీకి, ఆలేర్గితె ఎత్తి, ముడ్డి కడ్గనీకి పనికత్తడు. రొండు రొట్టె బిల్లలో కోసంత ఘట్కనో ఏస్తే సరిపాయె! “గింత కష్టపడ్కుంట ఎందుకయ్య నాతొని రావయ్య” అన్న గూడంగ రాడు. గా ఊరి మీన మా గొప్ప బ్రెమ గా ముసలాయెనకు.. తను గూడ నా తోని అస్తె .. గా బూమిగూడంగ అమ్మెస్తరవి భయం ఆయెనకు. యాడాది సంది ఆంధ్రకెల్లి ఎవరో సార్లచ్చి అడ్గుతాన్రు, గా చేన్లమ్మ పెద్ద పెద్ద బిల్డీంగులు కడ్త్తరంట… అమ్మమని ఎంటబడ్తాన్రు. మస్తుమంది ఊల్లె తక్కు దరకు అమ్ముకున్రు. నీల్లు లేక యవసాయం బందై అమ్మద్దని నేను, ముసలాయెన తగులుకున్నం. దినాంలొల్లె.. ఇంట్లకెలి ఎల్లిపొమ్మంటరు, గా బాడ్కవులు…ఇట్ల కాదని, గా బాన్ల కాయితాలు నా పేర్మీదనే ఉన్నయ్ తియ్.. గని దీస్కోని దెంకచ్చిన చూడు… గప్పట్కెల్లి గీ బత్కె దిక్కైంది బిడ్డ.” అన్నది లచ్చుమమ్మ కండ్లపొంటి నీల్లు కార్తాంటే. మల్లతనే.. పైస కోసానకు.. పంటిస్తలేదని భూమినమ్ముతనన్నోడు.. కన్న తల్లిని ఇంట్లకెల్లి పోమ్మనడా.. మల్ల పైసస్తే రమ్మనడా.. గని!” కన్నీల్లు కారుక్కుంట, మాట్లాడుతున్న లచ్చుమమ్మ నోట్లెకు పోతున్నయ్.. చెమటలు దారగ కార్తాంటె.. ఇంగ బుగులాపుకొనుడు కష్టమైంది లచ్చుమమ్మకు. కొంగు మొకం మీన కప్పి ఒక్కసారి దుక్కం నిండిన మూల్లు దీసింది.. దెబ్బతల్గిన జీవం అర్పు లెక్క వున్నది గా మూల్గు. ముకం తుడ్చుకున్నది. ముక్కెగ బీలుస్తు, మల్లేమన్కుందో ఏమో. తన కష్టం సుకం గింత ఇవరం తెల్సుకుంటాన్న రేణుక మీన అభిమానమొచ్చిందో ఏమో.. జర్రంత “చా” తాగుతవ బిడ్డా” అన్నది చేత్తోని “చా”కోపు సైగ చెస్కుంట. (కోపు – కప్పు)

“నీ యమ్మ… లంజెదాన కొంచెం అఅడిగితె సాలు భారతం ఇప్పినవు గదె.. ఊకుండు” అంటున్నడు పెంటయ్య. తన దుక్కం మర్సి లచ్చుమమ్మ దుక్కంల పూరాగ మున్గిపోయిన రేణుక,  ఒక్కపాలి గీలోకంలకచ్చి… “ఒద్దు పెద్దమ్మ.. ఏడకు ఊకో.. జర్ర జల్ది కాయలు జూడూ” అని లచ్చుమమ్మ మనసు మల్లించనీకి కోషిష్ చేసింది.” గీ ఎండల కాలం అయినంకెట్ల మల్ల ఏం జేత్తరు? అన్నది రేణుక. నౌఖరి పోయినంక తన బత్కు ఎల్లబార్తున్నతీరు యాదికచ్చి నగింది. లచ్చుమమ్మ రేణుకకెయి చిన్న పోరివి చూసినట్లె.. “ఏం జేస్తం తియ్!” ఎప్పటి దేముడప్పడ్కె” గీయెండల కాలంల మామిడికాలు ఆదుకున్నయా లేవా? ఇగమల్ల ఆనలకాలం, చలికాలం రావా? గప్పుడుబీరకాలు, సొరకాలు ఆక్కూరలు, పొట్లకాలు, గుమ్మడీ, కాకరకాయలు గివ్వన్ని బగ్గస్తయ్, సీరుపండ్లమీదనె చలికాలంల బత్కేస్తమ్ గాదూ? ఎట్లనో బత్కుతం దియ్యు బిడ్డా.. గా కొడ్కులను నమ్ముకొనుడుకంటే గీ బూములను నమ్ముకొనుడూ పోపు!, ఆనల్లేక పోయినగని గింత ఎండు గడ్డైన ఇస్తది.. నాల్గిత్నాలేసి చిన్న పోరడు గింత  ఉచ్చె పోసినగని నాల్గు మూటలన్న ఆక్కూరలన్న ఇస్తది, అవ్వా బత్కవె అమ్ముకొని అన్కుంట.. ఒయసు మల్లిందని కొడ్కులైతె ఎల్ల గొడ్తరు. ఏమీ లేదన్కో, నీ అసుంటి సారమ్మలుండరని, అల్లింత అప్పియ్యర?  ఉప్పియ్యర…? ఇగో సూడు, లచ్చుమమ్మ తన కాల్లు ముందుకు జర్పి.. చూపించుకుంట ఎండి కడాలు అమ్మితే ఐదొందలచ్చినయ్. ఒగ రెండొందలు గా ముసలాయెనకు పంపి కడెంవి నేనుంచుకున్న మైన కర్సులకు. గిట్లనె గీడకు అచ్చిన కొత్తల జర్గక పెండ్లై నల్పై ఏండ్లయ్యింది. గీ ఎండి కాడాలెప్పుడూ తియ్యాలె. నా లగ్గమప్పుడు మా యమ్మ జేపించింది… మల్ల లచ్చుమమ్మ కండ్ల పొంటి నీల్లు తిర్గి గొంతు బరువైంది.

“ఎండికాడాల మీన బ్రెమెక్కువ లచ్చుమమ్మకు ఇగ ఊకోయె.. ముక్కలు సంచిల నింపు” అన్నడు పెంటయ్య. మల్ల తనె” ఒక్కూరోల్లం బిడ్డా… గీమె కత నాకు, నా కత గీమెకు తెల్సు.. లెవ్వె ముసల్దాన లెవ్వు..” అని ఒర్లుకుంట విల్ పీట పక్కకెళ్లి పెట్టి, చెత్త ఏర్కుంట జేరిండు.

“అవ్ బిడ్డా! “చా” తాగక పోతివి.. మరి నీ కెట్లా జర్గుతాంది”! లచ్చుమమ్మ అన్నం ముద్దలు నోట్లె ఏస్కుంటున్నట్లె చేత్తోని నోటికెయి చూపిచ్చుకుంట అడిగి, మల్ల తనె బ్యాంకిల ఏమన్న ఏస్కున్నర లేద? కంపిని ఏమన్న పైసలిచ్చిందా లేద? అయిన మీ సిటిల మందికి గూడంగ తక్వ కష్టాలు లేవులె బిడ్డా.. మీరు సద్వుకున్నోలు. మా లెక్క ఏ పనెంటె గది జేత్తర? అయినా నీకు సుగ ఏదైనా నౌఖరి దొర్కుతదిలె బిడ్డ, చెయ్యాలె గాని. ఫికర్చెయ్యకు తియ్యు! గా ఎల్లమ్మ తల్లిని నమ్ముకో! నీకంతా మంచి అయితది. నీ బిడ్డలను మొగన్ని సల్లంగ జూస్తది ఎల్లమ్మ తల్లి. గీ పాలి బోనాలకు బార్కస్ ల  పసాదం తీస్కపొయ్యి ఒగ మ్యాకను గావు పట్టించు. అన్ని మంచిగ అయితది” అన్కుంట, పెంటయ్య దిక్కెల్లి తిర్గి.. “అరె పెంటయ్య, అమ్మకు ఇంగో రెండు కాయలెక్కువియ్యు పగల గొట్ట కుండ. గింత పప్పుల అండుకుంటది” అన్నది లచ్చుమమ్మ ప్రేమగ రేణుకకెయి జూస్కుంట.. జర్ర దుక్కంల కెల్లి బయట బడ్డట్లె అన్పించింది లచ్చుమమ్మ

రేణుకకు ధైర్నంగన్పించింది గా మాటలకు

“ఆవ్ పెద్దమ్మ, నువ్వన్నది సయె! ఎప్పటి దేముడప్పట్కె, పొయ్యొస్త మల్ల” పైసలిచ్చుకుంట లచ్చుమమ్మ ఇంకోపాలి కర్వుదీర చూస్కుంట బయట పడ్డది రేణుక.

“అవ్.. రామ్మ.. ఊరగాయలు నాల్రూపాలకొగటి అగ్వ రాసెల్లె బిడ్డరావు – ? సారూ ఎటుబోతున్నవు? జర్రంత రుసి సూడరాదు. కొర్రి పుల్లంగ… ఓసారమ్మ ఇసుంటరామా..” లచ్చుమమ్మ ఒర్లుతున్నది. ఎన్కకెల్లి ఆ గొంతుల వున్న ఇస్వాసం తన కెయ్యి వచ్చితనను తాక్కుంట గుండెల్ల దిగబడ్డట్టె అన్పించింది రేణుకకు.. మల్లచ్చె ఆనలకాలంల “సోరకాలు, బీరకాలు అగ్వ చౌక” అన్ని ఒర్లుకుంట గిక్కడ్నె కన్పిస్తదేమో లచ్చుమమ్మ.. బత్కుమీన ఇస్వాసం కల్పించుకుంట.

అవ్. ఎప్పటి దేముడప్పట్కె మరి! ఆయెన ఏదో చిన్న జీతానికైన పని జేస్తలేడ, ఇంటికింత తెస్త లేడ? మల్ల ఆయెన నౌఖరీ ఆయెనకు రాద? వీండ్లు జేసె ధర్నాలకు సర్కారోల్లు దిగిరార?… ముంగట ముంగట ఏమైతదో అని తర్లాడుత.. దిమాఖ్.. ఆరోగ్గెం ఖరాబు చేస్కోనుడు కంటే, ఎప్పటికప్పుడె.. ఇగో గీ లచ్చుమమ్మ తీరు ఇస్వాసంతోని బత్కాలె రేణుక ధైర్నంగ ముందడుగు వేసింది.

3 అభిప్రాయాలు »కథలు

3 అభిప్రాయాలు

  1. Rajesh Sep 18, 2009 1

    ఆహా…! ఈ కదా చాల బాగుంది. దీనిలో ప్రస్తావించిన విషయం అక్షరాల నిజం.

  2. lalitha Sep 24, 2009 2

    కష్టజీవులు జీవితం మీద విశ్వాసాన్ని కలిగిస్తారు. వాళ్ళ నుండి మధ్య తరగతి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. కథ బావుందండీ.

  3. ReddySekhar Mar 8, 2010 3

    కష్టజీవులు జీవితం మీద విశ్వాసాన్ని కలిగిస్తారు. వాళ్ళ నుండి మధ్య తరగతి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. కథ బావుందండీ.దీనిలో ప్రస్తావించిన విషయం అక్షరాల నిజం.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో