గుండెలో అలజడి

మరణం……
మరణం అంటే భయమా…..?
నాకా……..! లేదు
మరి ఈ కల్లోలం ఎందుకు …..?
ఏమో!
చావంటే అంత నిర్భయమా…?
నా విషయంలో…… ఊఁ……!
చనిపోయినవాళ్ళంటేనా……?
ఎప్పుడూ చూళ్ళేదు.
చావు తెలియకుండానే అరవై ఏళ్ళు సమీపించాయా?
తెలీకుండా కాదు — చూడకుండా.
ఒక్క సారీ చూడ లేదా.
వెళ్ళాను…… దహనం అయింది…. అయినా జ్వరం.
పిరికితనమా….?
తెలీదు
ఏమో చూడకనే ఎందుకు జ్వరం
………………
ఆ వాతావరణం చూసి ఝడుసుకున్నావా…..?

అర్థం కాని భావన గొంతులో ఉండలు చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేసి కళ్ళలో నీళ్ళు తెప్పించడంతో భారతి ఆలోచనల నుంచి తేరుకుంది, చుట్టూ చూసింది…… చిన్నతనంనుంచి పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న పక్కనే ఉన్నారు.పదిరోజులుగా తనతోనే ఉన్నారు.ఇల్లంతా బంధువులతో నిండి ఉంది.ఎక్కడా చైతన్యం లేదు.దూరంగా కాంపౌండులో కొంచెం సందడి. ఇంట్లో పిల్లల గోల నిశ్శబ్దాన్ని చీలుస్తోంది. వాతావరణం గంభీరంగా ఉంది.

***

అవి పీజి చేస్తున్న రోజులు. కాలేజీ నుంచి వస్తున్న భారతిని శేఖర్ కాలేజీ గేటు దగ్గర కలిసాడు. గత ఏడాదిలో పడ్డ పునాదులకు ఈ ఏడు పెళ్ళి రూపంలో ఫలితం దక్కబోతోంది.తాము కన్న కలలు,చేసుకున్న బాసలు, నిర్మించుకున్న భవిష్యదాశలు అన్నింటిని కలిసి పండించుకోబోతున్నారు. తల్లిదండ్రులు తెలీని భారతిని పెంచిన పెద్దలకు అది ఇష్టం కాలేదు. శేఖర్ కొంత కష్టపడాల్సి వచ్చింది,అంగీకారం పొందటానికి

***

ఆ వయస్సులో గొప్పవే అయిన త్యాగాలతో స్థిరపడి ఎవరి కెరియర్ కు వారు తాపత్రయపడుతూ అంచెలుగా ఎదుగుతున్నారు. భారతి, శేఖర్ల పుత్రుడు ఐదో తరగతి. తల్లి దండ్రులకు ఏమాత్రం తీసి పోని తెలివిని సొంతం చేసుకున్నాడు.చింతలు లేని కాపురం . ఆటంకాలు లేని ఉద్యోగ జీవితం.సంతృప్తికరమైన జీవితం వారిది.

***

కన్నుల పండువగా ఎదుగుతున్న పుత్రుడిని, వాడి అభివృద్ధిని మించిన ఆనందం వారిరువురికి లేదు. వైద్య వృత్తిలో నిష్ణాతుడై పర దేశాన్ని ఉద్యోగ రీత్యా అశ్రయించాడు పుత్రుడు. బదిలీ వల్ల ఉన్న వూరు వదిలి తిరుపతికి వచ్చారు భారతి,శేఖర్. శేఖర్ రిటైర్ అయ్యాడు.భారతి ఉద్యోగపు చివరి ఉన్నత దశలో ఉంది. బిడ్డపైన మమకారం పై బడిన వయస్సు వారిపై ప్రభావం చూపసాగింది. రిటైర్ అయిన శేఖర్లో రోజంతా పుత్రుడిని గురించిన ఆలోచనలే.

***

ఒకరోజు భారతి, శేఖర్ ఇద్దరూ ఇంటి ముందు లాన్ లో ఉన్నారు.’బాబు ఉత్తరం రాశాడు’ చెప్పాడు శేఖర్, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భారతికి.

‘ ఏమిటి విశేషాలు’ ప్రశ్నించింది.

‘ఏమి లేదు ఆరోగ్య జాగ్రత్తలు రాశాడు’ పనివాడు తెచ్చిన కాఫీ డికాషన్ను, భార్యకు కావలిసిన రీతిలో కలిపి ఇస్తూ చెప్పాడు శేఖర్.

కాఫీ తాగుతూ తననే చుస్తూన్న భార్యతో అన్నాడు శేఖర్.

‘వాడికి వయస్సు ముప్పై దాటుతోంది.’

చిరు ధరహాసమే జవాబూ అయ్యింది.

‘పెళ్ళి చేద్దాం’.

‘మీరేగా ఇష్టమైన వాళ్ళని చేసుకోమ్మంది.’ ప్రశ్నించింది భారతి.

“చెప్పాను, నిజమే ముసలివాడయ్యాక అని కాదు నా ఉద్దేశ్యం” స్పష్టం. చేసాడు శేఖర్.

‘ ఈ సమ్మర్ కి వచ్చినప్పుడు చేసేద్దాం’ తిరిగి తనే చెప్పాడు.

‘ఏమిటి బాబు పెళ్ళి గురించి ఇంత పట్టుదల’ఆరా తీసింది భారతి.

‘సమ్మర్ కే కాదు ఇంకా ముందే చేద్దాం’ ఆమె ప్రశ్నకు సమాధానమివ్వకుండానే తన సంభాషణ కొనసాగించాడు

‘బాబుని వదిలి ఉండటం కష్టంగా ఉంది’ చెప్పాడు, తిరిగి.

భర్త కళ్ళలోకి చూస్తూ హృదయాన్ని అంచనా వేస్తూ,శేఖర్ దిగులు చూసి తనూ దిగులు పడింది భారతి

***

అమ్మా!అమ్మా! పిలుపుతో ఉలిక్కిపడింది భారతి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన మొహంలోకి చూస్తూన్న కొడుకుని చూసి తేరుకుంది

తల పై చేయి వేసి ప్రశ్నించింది’ఏమిటి’ అని కళ్ళ తోటే. సుధీర్ఘ ప్రయాణం చేసి వచ్చింది మొదలు అలసట పట్టించుకోకుండా తిరుగుతూ హైరానా పడుతున్న బిడ్డపై జాలి ఒక్క క్షణం లీలగామొదలి మాయమవుతుంది ఆ కళ్ళలో, తిరిగి బిడ్డను చూసి, ఏమిటి ప్రశ్నించింది మౌనంగా భారతి.

క్షణం కూడా నిలవకుండా చలిస్తున్న తల్లి కళ్ళను, భావాలను చూస్తున్న కొడుకు తల్లి మోకాళ్ళపై ఓదార్పుగా చేయి వేసి’ఫర్వాలేదమ్మా’ అన్నాడు. మార్పు కనిపించకపోవటంతో ‘ మైల్డ్ అటాక్ మాత్రమే, సమస్య ఏమీ కాదు. మొదటి సారి కదా ఫర్వాలేదు కోలుకుంటున్నారు’ చెప్పాడు

“భయపడ్డావా?” తిరిగి అడిగాడు.తాను పడ్డ ఆందోళనను గుర్తు చేసుకుంటూ ‘లేదు’ అంటూ తలూపింది.

***

శేఖర్ కోలుకున్న పిమ్మట ఒకనాడు

‘ నాన్న ! నేను రేపు బయలుదేరుతున్నాను’ అంటున్న కొడుకును ఆప్యాయంగా చూస్తూ, ‘వెళ్ళాలా’ అడిగాడు శేఖర్

‘అవును నాన్న ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చాను’ అని, తలొంచుకుని ముందున్న టిఫిన్ ప్లేట్ ను కెలుకుతున్న తండ్రిని చూసి,

‘అమ్మా! నాన్న… ఇంట్లో ఖాళీగా ఉండి ఏవో ఆలోచనలతో సతమతమవుతున్నాడు, ఏదైనా వ్యాపకం పెట్టకూడదు’? అన్నాడు.

అప్పటి వరకు ఆ టేబుల్ దగ్గర శ్రోతలా ఉన్న భారతి

‘అది మీ నాన్నకి మాత్రం తెలీదా? అదే పనిగా ఆ ఆలోచనల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు’ ముచ్చటైన మందలింపు ధ్వనించిందా గొంతులో.

తన గురించి కానట్టే ఉన్న తండ్రిని చూచి, ఆ మౌనాన్ని మాన్పటానికి ఓదారుస్తున్నట్టు చేయిని తాకుతూ, ‘ నాన్న, ఈ సారి వచ్చినప్పుడు నీవన్నట్టు పెళ్ళి చేసుకొనే వెళ్తాను. సరేనా! నమ్మకంగా చెప్పాడు.లీలగా ఆనందరేఖ శేఖర్లో కదలాడటం చూసి తల్లీ పుత్రులు సంతృప్తి పడ్డారు.

***

పుత్రుడు వెళ్ళిన రెండో రోజు’ మీకు బోర్ అనిపిస్తే, నేను ఇంకో రోజు శెలవు పెట్టనా?’ ప్రేమగా అడిగింది భారతి.

‘భలే దానివే బోర్ ఏమిటి? టి.విఉంది.పనివాళ్ళున్నారు. న్యూస్ పేపర్లున్నాయి.పుస్తకాలున్నాయి.నాకేం ఇబ్బందిలేదు, వెళ్ళిరా!’చెప్పాడు, శేఖర్ ధీమాగా ఇచ్చిన జవాబుతో ధైర్యంగా ఆఫీసుకు వెళ్ళింది భారతి.

***

‘ఏమిటి అలా ఉన్నారు? ఆరోగ్యం బాలేదా?’ భర్త ముఖంలో కనిపించిన అర్థంకాని భావాన్నీ, చూపునూ చదవటానికి ప్రయత్నిస్తూ అడిగింది భారతి. ఆఫీసు నుంచి రాగానే భర్త ముఖంలో వేదనను నొక్కిపెడుతున్న భావన గమనించింది. అందుకే ఈ ప్రశ్న….

‘ఏం లేదు’ జవాబు వచ్చింది, కాని బేలగా వుంది.

భారతి కంగారుగా భర్తను సమీపించి తిరిగి అడిగింది. తన ఆలనలో. ఉద్యోగ నిర్వహణ బాధ్యతతో చిక్కిపోతూ సతమవుతున్న భార్యను చూసి తల అడ్డంగా ఊపి, లేచి లోనికి వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిన వైపు దీనంగా చూస్తూ, భర్త ఖాళీ చేసిన కుర్చీలో కూలబడింది భారతి.

***

ఫోన్ రింగు అవుతుంటే తీసింది భారతి.

‘హలో……’

‘భారతిగారా……?’

‘ అవునూ……డాక్టర్, మీరేనా……..!’ నాలుగు కొడ్తున్న గడియారాన్ని చూస్తూ ప్రశ్నించింది.

‘ఊఁ …….హాస్పిటల్ కి ఒకసారి రండి!’ క్లిక్ మంది ఫోన్

గత రాత్రి తిరిగి గుండెపోటు వచ్చింది శేఖర్ కి. ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు.

విపరీతంగా ఉన్న బి.పిని తగ్గించి, నార్మల్ హార్ట్ బీట్ ని తెప్పించటానికి డాక్టర్లు అర్థరాత్రి నుంచి పడుతున్న ఆందోళనకు ప్రత్యక్ష సాక్షిగా అక్కడే ఉంది భారతి.మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గండం గట్టెక్కిందని తెలిశాక తోడున్నవారు భారతిని ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి చేర్చారు. ఆ తర్వాత వచ్చిందే ఈ ఫోను.

***

ఆందోళనగా, కంగారుగా వస్తున్న భారతికి హాస్పిటల్ ముఖద్వారంలో ఎదురయ్యాడు డాక్టర్ . నిశ్శబ్దంగా వెన్నంటిన భారతి, భర్త శరీరాన్ని చూసింది. చూస్తూ ఉంది. చూస్తూనే ఉంది. జీవం పోతున్న చూపుల్ని,వెర్రి చూపుల్ని చూసి డాక్టర్ కంగారుగా కదలబోయాడు. కాని అంతలోనే భారతి కదిలి భర్త శరీరం దగ్గరకు వెళ్ళింది

మూసేసిన కళ్ళను ఏదో పొందాలన్నట్లు చూసింది.ముఖాన్ని ముద్రించుకొంటున్నట్టు చూసింది. ప్రశాంతంగాఉన్న శేఖర్ వదనాన్ని కళ్ళార్పకుండా చూసింది. ఆకారాన్ని తేరిపార చూసింది.నాలుగడుగులు వెనక్కు వేసి డాక్టర్ ని చూసింది.

‘ మూడున్నరకు ……….మళ్ళీ……..’ చెప్పారు.

ఏమీ జవాబు లేకుండా, ఏ స్పందనా లేకుండా శూన్యంగా చూస్తున్న భారతిని కదిపాడు, తూలుతున్న శరీరానికి ఆసరా ఇచ్చి కారు ఎక్కించాడు.

***

నాలుగు రోజుల క్రితమే దేశం విడిచి వెళ్ళిన కొడుకుకి కబురు వెళ్ళింది. రావటానికి రెండు రోజులు పడ్తుందని తెలిసి, శేఖర్ శరీరాన్ని ఏం చేయాలా అని ఆలోచించి మార్చురీలో ఉంచాలని నిర్ణయించారు. నిర్ణయాలు ఎవరో తీసుకుంటున్నారు. పనులు ఎవరో ఒకరు భుజాన వేసుకుని చేస్తున్నారు.

***

తనను చూడడానికి వచ్చిన లతను చూసి మొదటిసారిగా ఏడ్చింది భారతి. వెక్కి వెక్కి ఏడుస్తున్న నేస్తాన్ని ఓదార్పుగా పట్టుకుంది లత.రోజంతా శేఖర్ తో ఉండి మరణ సమయంలో తాను లేకపోవటం, ఆ వార్త ఆలస్యంగా తెలియటం తలుచుకునే కొద్ది భారతీలో ఎనలేని దుఃఖాన్ని కల్గిస్తూ ఉంది. లత నిశ్శబ్దంగానే రోజంతా భారతి వద్దే ఉంది.

***

ఊర్నుంచి వచ్చి, మాటా మంతీ లేకుండా ఎదుట నిలబడ్డ కొడుకును చూసింది . చూసి, మౌనంగా చేతులు చాచి వాటేసుకుంది తన భుజంపై వెక్కిపడుతున్న పుత్రుణ్ణి నిమురుతూ, కన్నీళ్ళు కారుస్తున్న భారతి కొంతసేపటికి తేరుకొంది.కొడుకు కళ్ళు తుడిచింది. తల నిమిరింది. చేయాల్సింది చూడు అని చెమర్చిన కళ్ళతో గద్గద స్వరంతో కొడుకును హెచ్చరించింది. శేఖర్ మరణించిన మూడో రోజున దహనం జరిగింది. బంధువులు వచ్చారు. కాని, తనను చూడటానికి ఎవరిని అనుమతించలేదు.

***

పది రోజులు ……..అప్పుడే…….!

పది రోజులు ? అంతేనా………………!

ఆ రెండు రోజులు నాకు ఎలా గడిచాయి?

నా జీవితంలో ఆ రెండు రోజులూ నాతో ఏమి సంబంధం లేనివి . సంబంధం లేనివి అనే సంబంధం తప్ప.

శేఖర్ పోవటం జీవితంలో ఎంత వెలితి . ఈ పది రోజులే కాదు ఈ జీవితం అంతా వెలితే. నేను ఎక్కడ ఉన్నా, నన్ను వెంటాడే నాతో పక్కనే ఉండే వెలితి,శేఖర్ను ప్రేమించినంతగా దీన్నీనేను ప్రేమించాలా? ఎందుకు ప్రేమించాలి? శేఖర్ స్థానాన్ని ఆక్రమించి భర్తీచేసినందుకా?

అసలు శేఖర్ నన్ను ఒంటరిని చేసి ఎలా వెళ్ళాడు. కొడుకు కోసం అంత బెంగా?

నాగురించి ఏ మాత్రం ఆలోచన లేదా? ఒంటరితనాన్ని నేనెలా భరించగలననుకున్నాడు?

శేఖర్ కు ఇష్టమైన భగవద్గీత కదూ వస్తోంది? అవును, ప్రొద్దుటే ఇది వింటం,సూర్యోదయాన్ని చూడటం శేఖర్ ఎంత బాగా ఆనందించాడు.ఘంటశాల వల్లనే వచ్చింది మాధుర్యం అంటాడు.నిజమే, ఆ కాలంలో ఆ స్వరం.నేడు ఎవ్వరూ అంత చక్కని స్వరాన్ని అందించటం లేదు. ఇప్పుడు సంగీతం అంతా గందరగోళమే. పాటల్లో మాటలెక్కడ, ఒకటే హోరు. ఇక మాధుర్యం ఎక్కడిది.!

అయ్యో! నేనిలా ఆలోచిస్తున్నానేమిటి? ఇలా ఆలోచించోచ్చా?

అంటే, ఈ రోజేనా ఇలా! ఈ పది రోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఎన్ని రాలేదు. ఇది తప్పా! తప్పేనేమో ! శేఖర్ని నేను ప్రేమించలేదేమో!? ప్రేమిస్తే ఇలాంటి ఆలొచనలు ఎందుకు వస్తాయి? ఇలాంటి ఆలోచనలు వస్తే ప్రేమలేనట్టేనా? ఆలోచించే బుర్ర ఆలోచనలేవి లేకుండా ఎలా ఉంటుంది? శేఖర్ని నేను ప్రేమించలేదా?

ష్………….. కొంచెం సేపు ఏమీ ఆలోచించొద్దు’, కళ్ళు మూసుకుంది భారతి

సవ్వడికి కళ్ళు తెరిచి పనామె అక్కడుంచిన కాఫీ తాగింది. శేఖర్ కాఫీ బాగా కలుపుతాడు పెళ్ళికి ముందు తానేగా నేర్పింది? గురువును మించిన శిష్యుడయ్యాడు . కానీ తండ్రిలా కాఫీ కలపటం వీడికి రాదు – తన ముందు నుంచి వెళుతున్న కొడుకుని చూసి అనుకొంది.

వీడి పెళ్ళికి శేఖర్ ఎంత తాపత్రయ పడ్డాడు? చూడకుండానే వెళ్ళాడు – కళ్ళలో కరుగుతున్న కన్నీటిని తుడుచుకుంటూ గదిలోకి దూరంగా కనిపిస్తున్న గేటును చూసింది.నలుగిరైదుగురు – ఏవో చెప్పుకుంటూ వచ్చినట్టున్నరు . ముఖంలో ఆ చిరునవ్వుల వెలుగు తగ్గలేదు . వాళ్ళను చూసింది – బహుశా వాళ్ళ భర్తలు తన దగ్గర పని చేస్తారేమో!

వాళ్ళందరూ గుమ్మంలో ప్రవేశించగానే ముఖాల్లో లాస్యాన్ని లాగేసి ఆమె ఎదురుగా నిలబడ్డారు ఏవో అన్నారు.’వెళ్తాం’ అన్నారు. భారతి తలూపింది వాళ్ళలో వెనకగా ఒద్దిగ్గా ఉన్నామెను చూసింది. ఎంత పొడవు ఆ జడ. ఇప్పుడు కూడా పూలు పెట్టుకు రాకపొతే యేం! ఎక్కడికో వెళ్తూ ఇలా వచ్చిందెమో’ అయినా నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను? అరె ఎవరీమే? ఎక్కడో చూసినట్టుంది . ఉహుఁ గుర్తురావటం లేదు . ఆమె చీర బావుంది. ఆమెకు నప్పినట్టు లేదు. తను కొంత తెల్లగా వుంటే బావుండేది.

తెల్లగా….

‘నాకీరోజు తెల్ల చీర కడ్తారు’ గుండెలు దడ దడ లాడుతున్నయి భారతికి. అంత సేపు భిన్న పోకడలు పోయిన మనస్సులో అర్థం కాని అలజడి.

‘ముత్తయిదువులు నా బొట్టు తుడుపుతారు’?

‘ముత్తయిదువులు………………..’

‘ఇక తర్వాత నేను బొట్టే పెట్టుకోరాదా’?

ఎంత మంది బొట్టు పెట్టుకోవడం లేదు’?

తప్పేం లేదుగా……!

నేనూ పెట్టుకొంటాను.

ఇంత మాత్రం దానికి ఇంత వేధింపు ఆర్భాటం ఎందుకు?

‘ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలన్నా ఈ తతంగం గుర్తు వచ్చి మానేయాలనుకోవటానికా?’

ఈ తెల్ల చీరతో అలంకార హీనంగా ఉండాలా?

ఇలాగే ఆఫీసుకు వెళ్ళాలా?

అందరూ జాలిగా చూస్తూంటే నాలో నేను కుంచించుకుపోవాలా?

ఎంత భయంకరం ఈ హడావిడి

ఇంత ఎదిగి ఈ అనుచితాన్ని అంగీకరించాలా?

శేఖర్ మీద ప్రేమ లేదంటే నేను ఒప్పుకోను.

శేఖర్ ఇంత మానసిక వ్యధను చచ్చినా అంగీకరించడు.

మా యిద్దరికి అక్కర లేనిది ఎందుకు పాటించాలి……!తల విదిలించిది. అంతఃసంఘర్షణ వదిలి హాల్లోకి వచ్చింది భారతి.

ఎవరో ఆమెని కుర్చిలో కూర్చోపెట్టారు. దూరంగా భోజన పంక్తులు కన్పిస్తున్నాయి. ‘ఎంత హడావిడి’ అమ్మా వాళ్ళాంతా అందులో భాగంగానే ఉన్నారు.వాళ్ళు వచ్చింది పెళ్ళికి కాదు కదా! ఈ భోజనాలు సంబరాలు ఎందుకు? నన్ను వెలివేసి వాళ్ళు ఖుషి చేసుకోవటానికా?దుఃఖాన్ని ఇంత ఆర్భాటం ప్రదర్శించటం ఎందుకు?చూపులు మరల్చుకొన్న భారతి తన దగ్గరకు రావటానికి తటపటాయిస్తున్న రాధను చూసింది. పసిబిడ్డతో తెల్ల చీరతో ఉన్న రాధను చూడగానే గుర్తొచ్చింది ఆమె ఎవరో.

‘భర్త ఉద్యోగం తనకిమ్మని ఎంత తిరిగిందో కదా! ఏమీ చదువుకోని రాధ చిన్నతనంలో భర్తను కోల్పోవటం ఎంత వేదనను కల్గించిందో!పోషణ, రక్షణలపై బెంగ ఎంత దిగులు సృష్టించిందో! భర్తపై ఆధారపడి బతికిన జీవితం దుర్బరం అనుకుని ఎంత తల్లడిల్లిందో! నాకు శేఖర్ లేడనే బాధ. రాధకు భర్తా లేడు, జీవనాధారమూ లేదు. అసలు ఇంతకీ ఆఫీసులో ఆర్డర్సు ఇచ్చారో లేదో? ఎడతెగని ఆలోచనలతో భారతి రాధను చూస్తూ ఉంది. రెండు నిమిషాలు పాటు ఉండి నిదానంగా వెళ్ళిపోయింది.

.గుంపుగా నిలబడి ఉన్నవాళ్ళను చూసింది భారతి. ‘కుర్రాళ్ళంతా అక్కడ చేరి ఏం చేస్తున్నారు?’ అంత కులాసాగా ఎలా ఉన్నారు? ఎలా నవ్వుకోగలుగుతున్నారు!’ సమాజ సంబంధాలు పెంచుకోవటానికి వేదికలా ఉన్నట్టుంది వాళ్ళకు. ఎంత మందికిది సమావేశ స్థలి. నేనింత దుఃఖంలో ఉంటే ఎవరూ పట్టించుకోరే?’

‘నేను దుఃఖంలో ఉన్నానా?’

ఉంటే ఇలా ఆలోచిస్తానా?

‘వీళ్ళంతా ఇక్కడ ఉండి కదా ఆలోచన? ఈ పద్ధతుల వల్లే కదా అందరూ ఇక్కడ చేరారు.

ఇవేవీ లేకుండా నాపాటికి నన్న వదిలేస్తే, నన్ను నేను చూసుకొంటాగా….!’

ఊహుఁ…….! వీళ్ళు నా ఒంటరితనాన్ని తగ్గించటానికి రాలేదు.ఒంటరితనాన్ని పని గట్టుకొని కల్పిస్తున్నారు’.

ఈ రోజు వితంతువును చేస్తారు నన్ను. గుండె పట్టేస్తోంది ఆమాట అనుకోంటే. అందరూ కలసి…… భయంకరంగా…. భయానకంగా….. ఒక్కదాన్ని…….’ అనుకోని భావనకు ఒళ్ళు జలదరించింది భారతికి.

చావంటే భయంలేదు.
శేఖర్ మరణమంటే………..?
భయమెందుకు….నా శేఖరేగా!
బాధ లేదా?
ఇప్పుడుంది. జీవితమూ చెప్పాలి…అనుభవించాక.
మరణభయం లేనప్పుడు ఇదేమిటి……?
ఏది………………?
ఈ జలదరింపు…………….!
దీనికి కాదు……………..!
మరి నీ మరణానికా?
కాదు….!
మరి…………………?

చెప్పలేకపోతున్నాను…..! ఇందరు చేరి, బలి పశువును తయారు చేసినట్టు చేసి. ఒక్కదాన్ని….. చూట్టూ చేరి…….అమానుషంగా…. ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా… రూపం మార్చటం……….ఈ సందర్భాన్ని ఇందరు…..ఆనందంగా చూడటం…………. అసహజ భయంకర వెంటాడే వాతావరణం అంటే భయం, జలదరింపు, నిరంతర అంతఃసంఘర్షణ., సతమతం చేస్తున్న ఆలోచనలు భారతి శరీరాన్ని అచేతనం చేయసాగాయి.

ఒక అభిప్రాయం »కథలు

One Response to “గుండెలో అలజడి”

  1. 1
    ప్రాణహిత » సెప్టెంబరు 2009 సూచిక Says:

    [...] గుండెలో అలజడి – డా. కొనకలూరి మధుజ్యోత

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో