Sep2009
గుర్తుండని బాల్య స్మృతులు
ఏదైనా నేర్చుకోవడానికి చిన్నతనమే తగిన వయస్సనిపిస్తుంది. మనదేశపు సంప్రదాయంలో ముందు ప్రతిదాన్నీ మంత్రాల్లాగా “భట్టీయం” వేయించడం పరిపాటి. ఆ దశలో ఏం నేర్పుతున్నారో ఏమీ అర్థంకాదు. ఆ పద్ధతిలో కంఠతాపట్టినది మరిచిపోము కనక నేర్చుకున్నదేమిటో ఆ తరవాత సావకాశంగా అర్థమౌతుంది. చిన్నప్పుడు మన మెదడుకు మైనంలా రూపాన్ని మార్చుకోగల మైశీల గుణం ఉంటుంది కనకనే చదువూ, రకరకాల నైపుణ్యమూ చిన్నతనంలోనే త్వరగా అబ్బుతాయి. ఇక్కడ “చిన్నతనం” అంటే అయిదారేళ్ళ వయసు అని అర్థం; అంతకు మునుపటి విషయాలు గుర్తుండవనేది తెలిసినదే. జ్ఞాపకశక్తి వికసించే క్రమంలో ఇదొక విచిత్రమైన పరిణామం. ఒకరకంగా చూస్తే పెద్దయాక మనకు “పనికొచ్చే” చిన్నప్పటి విషయాలే గుర్తుంటాయనిపిస్తుంది. చిన్నప్పుడు ఏ సంవత్సరంలో ఏ పండగనాడు ఏయే మిఠాయిలు తిన్నామో కలకాలం గుర్తుండకపోతే మనకొచ్చే నష్టమేమీలేదు. ఏనాడో కంఠతా పట్టిన ఎక్కాలవంటివి మాత్రం బాగా గుర్తుంటాయి.
పసితనంలో ఏం జరిగిందో మనలో ఎవరికీ జ్ఞాపకంఉండదు. దీన్ని మతిమరుపు అనాలా? వృద్ధాప్యం బాగా ముదిరినప్పుడు మళ్ళీ ఇంకొకరకం మతిమరుపు మొదలవుతుంది. ఎటొచ్చీ వయసు మళ్ళినవారు ఒకప్పుడు గుర్తున్న విషయాలు మరిచిపోతారుగాని, మరీ చిన్నప్పటి సంగతులు ఏ దశలోనూ ఎవరూ జ్ఞాపకం పెట్టుకున్నట్టుగా అనిపించదు. అందరిలాగే పసిపిల్లలుకూడా ఎన్నెన్నో అనుభవాలు పొందుతారుకాని అవేవీ మనసులో నిలిచినట్టుండవు. ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తికి ఆధారం మెదడే కనక ఈ రెండురకాల పరిస్థితుల్లోనూ మెదడు స్వరూపం ఎలాంటిదో తెలుసుకోవాలి.
పసిపిల్లల మెదడులోని కణజాలం అపరిపక్వంగా ఉంటుంది; ఉదాహరణకు దృష్టికి సంబంధించిన మెదడుభాగాలు పుట్టిన తరవాతగాని ఎదగవు. అలాగే మేధోవల్కలంలోని నాడీకణాలకు ఉండే మయెలిన్ కొవ్వుపొర అన్నిటికీ పూర్తిగా రూపొంది ఉండదు. అయితే జ్ఞప్తి విషయంలో కేంద్రంలా పనిచేసే హిపోకేంపస్ మాత్రం పుట్టేసరికే దాదాపు పూర్తిగా ఎదిగి ఉంటుంది. అందుచేత పసివారికి ఏదీ గుర్తుండకపోవడానికి కారణం హిపోకేంపస్ అయిఉండదనీ, వారి మెదడుయొక్క నొసటి, కణతభాగాలు సంపూర్ణంగా వృద్ధి చెందకపోవడం వల్లనేమోననీ కొందరు విశ్లేషకులంటారు. వృద్ధాప్యంలో మతిమరుపు పెరగడానికి మెదడులోని నాడీకణాల సంఖ్య తగ్గడం ఒక్కటే అంత ముఖ్యకారణం కాకపోవచ్చనీ, ఉన్నవాటిమధ్య ప్రక్రియల్లో జరిగే మార్పులే అందుకు దారితీస్తాయనీ పరిశోధనలు తెలుపుతున్నాయి.
పసితనంలో జరిగినవన్నీ గుర్తుండాలంటే భాష రావడం ముఖ్యమని వాదించేవారు మన తొట్టతొలిజ్ఞాపకాలన్నీ మాటలునేర్చే (మూడు, నాలుగేళ్ళ) వయసునుంచే మొదలవుతాయని చెపుతారు. అనుభవాలను మననం చేసుకోవడానికి భాషమీద కొంత పట్టు ఉంటేతప్ప వీలవదు కనక ఇందులో కొంత నిజం ఉండవచ్చు. అయితే నెలలునిండని పసివారుకూడా అభ్యాసంద్వారా కొన్ని చిన్నవిషయాలు గుర్తుంచుకోవడం చూస్తే ప్రతిదానికీ భాష అవసరం ఉండకపోవచ్చుననికూడా అనిపిస్తుంది. అలాగే రెండేళ్ళపిల్లలకు ఆరునెలలకిందటి సంగతులు చెపితే గుర్తుకొస్తాయని రుజువ యింది. ఇంత జరిగినప్పటికీ పెద్దవుతున్నకొద్దీ చిన్నప్పటి సంగతులు గుర్తుకు రాకుండాపోతాయి.
దీనికి మరొక కారణంకూడా ఉండవచ్చని కొందరి అభిప్రాయం. మరీ పసివారంగా ఉన్నప్పుడు మనకు పరిసరాల గురించిన అవగాహన వేరుగా ఉంటుంది; ఉదాహరణకు మన శరీరం ప్రమాణాన్ని బట్టి మామూలు వస్తువులు కూడా పెద్దపెద్దవిగా అనిపిస్తాయి. మనం పెద్దవుతున్నకొద్దీ ఇటువంటి భావనలు తగ్గిపోతూ ఉంటాయి; వస్తువులనూ, పరిసరాలనూ గురించిన గుర్తులేవీ పాతపద్ధతిలో కనిపించవు. ఒకప్పుడు మెదడుకు గుర్తుకుతెచ్చే సంకేతాలన్నీ త్వరలోనే మాయమై, వాటి స్థానే ఎప్ప టికప్పుడు కొత్తరకం చిహ్నాలు ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. మొదట్లో జ్ఞాపకాలకు పనికొచ్చిన తాత్కాలిక ఆధారాలన్నీ రూపాంతరం చెందడంతో తొలిస్మృతులన్నీ వాటితోపాటే మాయమైపోతాయి. మరొక ప్రతిపాదన ఏమిటంటే జరిగినదాన్ని గుర్తుంచుకోవడానికి సంఘటనలను స్మృతులుగా ఒకదానివెంట ఒకటిగా మనసులో పునర్నిర్మించుకోగలిగి ఉండాలి. ఇందుకు సరిపోయేంత అనుభవం మరీ చిన్న పిల్లలకు ఉండదు. మరొక చిక్కేమిటంటే చిన్నపిల్లలు సామాన్యంగా జరిగినవాటిని గురించి తామే చెప్పరు. అటువంటివాటిని గురించి గుర్తుచేస్తూ వారిని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారి జ్ఞాపకాలు ప్రభావితం అయే అవకాశం ఉంటుంది.
చిన్నప్పటి విషయాలన్నీ అంతర్గతంగా గుర్తుంటాయేతప్ప ప్రత్యక్షపద్ధతిలో అవగాహనకు లోనవవు కనక అవి జ్ఞాపకాలుగా నమోదుకాలేవనే సిద్ధాంతమూ ఒకటి ఉంది. ఈ పరిశీలన లన్నిటిలోనూ 2 నెలల వయసునుంచీ పసిపిల్లలపై ఎన్నో ప్రయోగాలు చేస్తారు. చేతితోనో, కాలితోనో కదిలించగానే రకరకాలుగా తిరిగే బొమ్మలను వారికి అందుబాటులో ఉంచి, వాటిని ఎలా కదిలించవచ్చో పిల్లలకు తెలిసేట్టుగా చూస్తారు. ఒకసారి ఈ ప్రక్రియను వారు తెలుసుకున్నాక కాలం గడుస్తున్నకొద్దీ అటువంటి బొమ్మలను మళ్ళీ వారికి అందించి, పాతవిద్యలు గుర్తున్నాయో లేదో పరిశీలిస్తారు. ఇటువంటి సందర్భాల్లో తక్కువవయసున్న పిల్లలు త్వరగా మరిచిపోతారని తేలింది; వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తికూడా పెరిగింది. ఈ ప్రయోగాల్లో పిల్లలను ఎన్నేసి నిమిషాలపాటు బొమ్మలను చూడనివ్వాలో, ఎన్నివారాల తరవాత వారి జ్ఞాపకశక్తిని మళ్ళీ పరీక్షించాలో నిర్ణయిస్తారు. అలాగే రకరకాల బొమ్మలను వివిధక్రమంలో వారికి చూపడం, ఆ తరవాత వాటిని చూపినప్పుడు వారి స్పందనలను పరీక్షించడం చేస్తారు. ఈ ఫలితాలను మతిమరుపు ముదిరిన వృద్ధులమీదా, జ్ఞాపకశక్తి క్షీణించిన మానసికరోగులమీదా జరిపిన పరిశీలనలతో పోలుస్తారు.
పెద్దవారి విషయంలో అంతర్గతజ్ఞాపకశక్తీ, ప్రత్యక్షజ్ఞాపకశక్తీ వేరువేరుగా అనిపిస్తాయి. మొదటిది చెక్కుచెదరదు; రెండోది వెంటనే రాసిపెట్టుకోని టెలిఫోన్ నంబర్‌లాగా తొందరగా మరిచిపోయే రకం. ఆరు నెలల పిల్లల్లోకూడా ఇది కనిపిస్తుంది; కొత్తదేదైనా నేర్చుకున్నాక దాన్ని భంగం చెయ్యగలిగిన మరొక సంఘటన కనక జరిగితే ఆ తరవాతి పరీక్షలో మొదట గుర్తుచేసినది మరిచిపోతారు. తొలి ప్రేరణ ఎక్కువ సమయంపాటు అందిస్తే విషయం పసివారికి అది మరింత ఎక్కువకాలం గుర్తుంటుందని తేలింది.
మొత్తంమీద పెద్దవారి విషయంలోలాగే పసిపిల్లలకుకూడా రెండురకాల జ్ఞాపకశక్తి ఉంటుందని అనుకోవచ్చు. తాత్కాలిక ప్రయోజనాలకు పనికొచ్చేవీ, దీర్ఘకాలికంగా నేర్చుకునేపద్ధతిలో నమోదయేవీ జ్ఞాపకాలుంటాయి. అయితే చిన్నవయసులో మనసును తీవ్రంగా ప్రభావితం చేసే సంఘటనలూ, దుర్ఘటనలూ తొందరగా మరపుకురావు. తెలిసీతెలియని వయసులోకూడా లైంగికహింస వంటివాటికి లోనయితే ఆ మానసిక ఒత్తిడి ప్రభావం కలకాలం పనిచేస్తుందని ఫ్రాయిడ్‌నుంచీ అనేక విశ్లేషకులు అంటూనేఉన్నారు. మరొకవంక పిల్లలు పైకి రావాలనే ఆత్రుతతో వారి జ్ఞాపకశక్తిని పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కంఠతా పట్టేందుకు కొత్త పద్ధతులూ, ఆయుర్వేదం మందులూ, ఇతర సాధనాలూ ఉపయోగించి వారిని ఎలాగో అలా ముందుకు నెట్టాలనే ధోరణి పెరుగుతోంది. నిత్యజీవితంలో సహజవాతావరణం లోపించడం, పసివయసునుంచే పోటీతత్వాన్ని పెంచడం మొదలైనవన్నీ అవాంఛనీయాలుగా అనిపిస్తాయి.
అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్