Sep2009
ఇది కవి నివాసం
హైద్రాబాద్
ఒక చాందినీ మహల్
పండగ సందడిగా వెలిగే
ఒక మహిఫిల్
ఆకాశం మతిపోగొట్టే
తారల ముజ్రా
హైద్రాబాదంటే
పురాతన మట్టిలోంచి
ప్రేమగా వీచే
సుగంధ సమీరం
మిత్రులు మాట్లాడుకుంటే
గజల్ గురించే
గల్లీలో కలుసుకుంటే
దోస్తానా గురించే
సలాం చేసి కుశలమడిగితే
దావత్ గురించే
హైద్రాబాదంటే
సాసర్లో పోసుకొని
ఊదుకుంటూ తాగే
గరంచాయి
ఇది వ్యాపారం చేసే
బజారు కాదు
ఆప్తులు తప్పిపోయే
“మేళా” కాదు
అత్తరు చల్లుకునే
కమ్మని ఆలింగనం
“బతాసులు” దొరికే
స్వప్నలోకం
హైద్రాబాదంటే
రాఖీలు పేర్చిన
దీపాల షామియానా
కలిసుండే బతుకుల్ని
కబ్జాచేయడం తెలియదు
మరిచిపోయి కూడా
ధోకాయివ్వడం రాదు
అతిథులకోసం
ఇల్లమ్ముకోవడం తెలుసు
ఇచ్చిన మాటకోసం
పస్తులుండడం తెలుసు
హైద్రాబాదంటే
గ్లాసెడు నీళ్ళడిగితే
గండిపేటనే దానం చేయడం
హైద్రాబాదీలు
దిల్ దార్ ఇన్సాన్లు
నిలుచున్న నీడను త్యాగం చేసి
గోల్కొండను రాసిస్తారు
మూసీనది ఎండిపోయినా
గుండెను తోడిపోస్తారు
హైద్రాబాదంటే
నిన్నూ నన్నూ కలిపే
చార్మినార్ పరిమళం
పూలనూ ముళ్లనూ
పాన్ తో నమిలే
ఒక షాయర్ నివాసం
October 12th, 2009 at 7:18 am
[...] ఇది కవి నివాసము – రాజా హైద్రాబాదీ [...]
July 2nd, 2010 at 3:00 am
అవునండీ,
> హైదరాబాద్..అంటే
పురాతన మట్టి లోంచి
ప్రేమగా వీచే
సుగంధ్ సమీరం..
అభినందనలు..
e-mail:ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in