కొ.కు. చరిత్ర వ్యాసాలు

సృజనాత్మక, శాస్త్ర సాంకేతిక, మేధో రంగాలలో జరిగే అభివృద్ధి ఎవరికి చెందాలి అన్నప్రశ్నకు అది ప్రజలకోసం అని జవాబు చెప్పడం ఒక రకంగా తేలికే. కాని దాని కోసం గాను గొప్ప పూనికతో, బాధ్యతగా కృషి చేస్తూ, ఆ కృషిని సమాజపరం చేసేందుకుగాను నిరంతరాయంగా తెలుగు సమాజం ముందు వినమ్రంగా నిలబడిన వారిలో కొ.కు. కంటే ముందుగా వేరొకరినెవరినైనా చెప్పడం సాధ్యం కాదు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో సంభవించిన మార్పుల కనుగుణంగా తాను మారుతూ, ఆయా సందర్భాలలో తన వైఖరినీ తను నిర్వహించవలిసిన పాత్రనూ స్పష్టంగా నిర్వచించుకుంటూ ముందుకే కొనసాగిన అరుదైన వ్యక్తులలో కొ.కు. ఒకరు. తెలుగు సమాజపు బౌద్ధిక సంప్రదాయ పరంగా చెప్పవలసి వస్తే మేధోపరంగా కూడా కొ.కు. అరుదైన వ్యక్తే. ఆయన అవగాహన, ఆయన అడుగిడిన రంగమూ ఏదో ఒక్క అంశానికే చెందింది కాదు. శాస్త్ర – సాంకేతిక విషయాలు, చరిత్ర, సాహిత్యమూ, కళలు, సంస్కృతి, రాజకీయాలు, తత్వ శాస్త్రం – ఇలా అనేక రంగాలలో ఆయన కృషి యూరోపియన్ సంప్రదాయంలోని అరుదైన వ్యక్తులను, వారి కృషిని గుర్తుకు తెస్తుంది. ఆయా రంగాలలో ఈ కృషిని ఆయన తన పాండిత్య ప్రదర్శన కోసం చేయలేదు. అలా అయినట్లయితే ఆయన లావుపాటి పుస్తకాలకే పరిమితమై ఉండేవాడు.

మధ్య తరగతిలో భాగంగా ముందుకు వచ్చి దాని ఉద్ధాన పతనాలతో తన విమర్శన వెల్లడిస్తూ ప్రగతికి దారులు వేయడం కోసమే కొ.కు. తన రచనావ్యాసంగాన్నంతటినీ కొనసాగించాడు.తను రూఢీచేసుకున్న విషయాలను వెల్లడించడం కోసం ఆయన పదే పదే చేసిన కృషి, విభజనలను దాటుకుంటూ అనేక అంశాలకు ప్రవహించింది. దీని కోసం గాను ఆయన తన కాలపు సామాజిక ఉద్యమాలు, చరిత్ర, తత్వశాస్త్రం రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధులను అధ్యయనం చేస్తూ వచ్చాడు. ఈ అధ్యయనాన్ని ఆయన తన కాలపు వాస్తవికతను విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించడానికి ఉపయోగించాడు. కొ.కు. చేసిన ఈ కృషి ఎంత విశిష్టతను కలిగిందంటే – అనేక రంగాలకు సంబంధించిన పరిశోధనలు, వాటి పరిణామాలు తెలుగు పాఠకులు కొ.కు. నుండే తొలిసారిగా తెలుసుకున్నారు. అయితే ఈ కృషినంతటినీ ఆయన తెలుగు సమాజంలోని ప్రగతిశీల ఉద్యమాలలోభాగమవుతూ కొనసాగించాడు.వివిధ సామాజిక ఉద్యమాల ప్రభావము, వాటితో భాగమవుతూ కొ.కు. చేసిన కృషి పారస్పరికమైనది. కొ.కును వ్యక్తిగా గానీ, రచయితగా గానీ అంచనా వేయడానికి ఈ పారస్పరిక సంబంధాన్ని తప్పని సరిగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటూంది.

నూతన సహస్రాబ్ధిలో నిలబడి కొ.కు. కృషి అంచనా వేయడానికి ఆయనలోని రెండు అంశాలు ఎంతగానో ఉపయేగపడతాయి. మొదటిది ఆయన రచనలలోని జీవిత వాస్తవికత. ఏ రచయితకైనా గుర్తింపునిచ్చేది వాస్తవికతే అయినా కొ.కులో ఇది ఎంత విస్తృతంగా సాగిందంటే వర్తమానాన్ని అవగాహన చేసుకునేందుకు అది ఒక భూమికగా నేడు ఉపయెగపడుతున్నది. కొ.కు. నవలా సాహిత్యాన్ని సమీక్షిస్తూ కె.వి.ఆర్, తనది ” సంకుచిత పరిధి ” అని చెప్పినప్పటికీ సమాజ బౌద్ధిక అభివ్యక్తికి ప్రధాన వాహిక అని చెప్పదగిన ” మధ్య తరగతి ” గురించి సుమారు నాలుగు దశాబ్దాల పాటూ అనేక పార్శ్వాలుగా, ఒక్కోసారి పునరుక్తి అనిపించేలా విమర్శనాత్మకంగా రాస్తూపోవడం వల్ల తెలుగు సమాజపు సామాజిక చరిత్రను అర్థం చేసుకునేందుకు కొ.కు. పరోక్షంగా దోహదకారి అయ్యాడు. ఇలాంటి అరుదైన విశిష్టత కొ.కు. ఒక్కడికే దక్కుతుంది. కొ.కు. చేసిన ఈ కృషి వర్తమానంలో నిలబడి చూసినప్పుడు ఈ రోజుటి ‘మధ్య తరగతి ‘ గురించి అనేక విలువైన అవగాహనలకు దోహదకారిగా కన్పిస్తుంది. ‘ మధ్య తరగతి ‘ గా పిలువబడే ఒక సెక్షన్ ప్రజానీకంలో నేడు కన్పిస్తున్న విలువల పతనం, వినిమయ సంస్కృతి, మత మౌఢ్యం, బాధ్యతా రాహిత్యం, దళారీతనం వంటి అనేక దుర్లక్షణాలను అర్థం చేసుకొనేందుకు కొ.కు. ఎంతగానో ఉపకరిస్తాడు.

కొ. కు. సమకాలీనతను ఎత్తి చూపే మరొక అంశం సమాజ గమనం పట్ల ఆయన వైఖరి. రెండవ ప్రపంచ యుద్ధకాలానికి ముందరి ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు నేపథ్యంగా మార్క్సిస్టు భావజాలం వైపుకు ఆయన పయనించినదాదిగా ఆయన రచనలన్నింటిలోనూ ‘మార్పు’ పట్ల స్థిరమైన, శాస్త్రీయమైన వైఖరే కన్పిస్తుంది.ఇది స్థిరంగానూ, శాస్త్రీయంగానూ ఉండడం వల్లనే అనేక సంక్షోభాలకు ఎదురీదుతూ, సమాజాన్ని ముందుకు నడిపించగలరని ఆయన భావించిన ప్రజానీకానికి ఉపయోగపడే రీతిలొ తన రచనా వ్యాసంగాన్ని నిరంతరాయంగా కొనసాగించగలిగాడు. సమాజాన్ని ఒక అడుగు ముందుకు తీసుకొనిపోగల మధ్యతరగతిలోని సంక్షోభాన్ని అర్థం చేసుకుంటూనే, అది క్రమేపి దిగజారుడుగా మారుతున్నపుడు దాని అనేక వ్యక్తీకరణలపై ఆయన విమర్శనాత్మకంగా వ్యాఖ్యానిస్తూ పోయాడు.చారిత్రకంగా ఇక అది దళారీ స్థితికి దిగజారిందని అర్థం కాగానే, సమాజ గతిని మార్చే నూతన శక్తుల వైపుకు ఆయన పయనాన్ని కొనసాగించాడు. ఈ సందర్భంగా కొ. కు పై సురా అంచనాను కూడా గుర్తుచేసుకోవాలి . కొ.కు. రచనా వ్యాసంగమూ, దానికి గానూ ఆయన ఎన్నుకున్న ప్రక్రియలూ అన్నీ కూడా ఆయన ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా రూపొందినవే కానీ ఏదో యాంత్రికంగా పాఠకుల ముందుకు వచ్చినవి కావు. తన పాఠకులకు ఉపయోగపడగలవని భావించిన ప్రక్రియలో మాత్రమే కొ.కు. రచనలు చేసాడు. ‘మధ్య తరగతి ‘ ప్రధాన వస్తువుగా అరవైల దాకా కొనసాగిన కొ.కు. సృజనాత్మక సాహిత్యం అరవైల చివరినాటికి ఆగిపోవడం ‘మధ్య తరగతి’ పై కొ.కు. అవగాహనకు ఒక గుర్తుగా మనం భావించవచ్చు. ముందుకు తీసుకొని పోగల శక్తిగా మధ్య తరగతిపై సమాజానికి ఉన్న నమ్మకం విచ్చిన్నమవడం, ఆధునికతపై, దానికి సంబంధించిన అన్ని నిర్మాణాలపై విమర్శ పెల్లుబికిన కాలం కూడా ఇదే. ఈ కాలంలోనే కొ.కు. సృజనాత్మక రూపాలను విడిచిపెట్టి బౌద్ధిక రచనా వ్యాసాంగాన్ని ముమ్మరంగా కొనసాగించాడు. చిట్టి చిట్టి వ్యాసాల నిడివి పెరిగింది. వివిధ రంగాలకు సంబంధించిన ప్రజోపయోగకర విషయాలను సమకాలీన జీవితానికి అన్వయించి ఈ వ్యాసాలలో విమర్శనాత్మకంగా పరిచయం చేయడం జరిగింది.

కొ.కు.ను నూతన సహస్త్రాబ్ధిలోనికి నడిపించగల ఈ రెండు అంశాలను పారస్పరికంగా అర్థం చేసుకొవలసిన ఉంటుంది. అప్పుడే కొ.కు. రచనా వ్యాసాంగాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలం. కొ.కు. సృజనాత్మక సాహిత్యమైనా, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, తత్వశాస్త్రం, సాహిత్యం, కళలు – ఏ ఒక్క అంశాన్ని పరిశీలించినా సమకాలీన వాస్తవికత, జీవితానికి సంబంధించిన వివిధ వ్యక్తీకరణలుగా అది ఏమి ప్రతిబింబిస్తున్నది ? సామాజిక గతిలో దాని ప్రాధాన్యత ఏమిటి ? అన్న ప్రశ్నలే కొ.కు. .రచనా వ్యాసాంగాన్నంతటికీ జీవధాతువులుగా మనకు కన్పిస్తాయి.

కొ.కు. చరిత్ర వ్యాసాలకూ ఈ అవగాహనే వర్తిస్తుంది. అయితే చరిత్ర అనేది వర్తమానంలో నిలబడి చేసే సంభాషణ కాబట్టి, ఎటువంటి సందర్భంలో ఈ సంభాషణకు దిగవలసిన వచ్చింది అనే ప్రశ్నను వేసుకోవలసి ఉంటుంది. అంతేకాక అన్ని విషయాలకూ తమవైన ప్రత్యేక అధ్యయన పద్ధతులున్నట్లే, చరిత్రకూ ప్రత్యేక అధ్యయన పద్ధతులున్నాయి. పరస్పరం విభిన్నంగానూ, ఒకోసారి విరుద్ధంగానూ కనిపించే వీటిలో కొ.కు. శాస్త్రీయమైనదిగా గుర్తించి, పాఠకులకు పరిచయం చేసిన అధ్యయన పద్ధతి ఏది, చరిత్రలో ఆయన చర్చించిన అంశాలు ఏమిటి, వాటి వల్ల ఆయన ఆశించిన ప్రయోజనం ఏమిటి, మొత్తంగా ఈ వ్యాసాల వల్ల కొ.కు. ప్రతిబింబించిన సామాజిక వాస్తవికత ఏమిటి అన్న ప్రశ్నలను కూడా వేసుకోవలసిన ఉంటుంది.

కొ.కు. చరిత్ర వ్యాసాలను పరిశీలిస్తే ఆయన వ్యాస ప్రపంచంలో అధిక భాగం రూపు తీసుకున్న అరవైలు, డెబ్భైలలోనే – చరిత్ర వ్యాసాలలో చాలా భాగం రాసినట్టుగా కన్పిస్తుంది. కులం, మతం, ఆచార వ్యవహారాలు, మూఢ విశ్వాసాలు, స్త్రీ పురుష సంబంధాలలోని అసమానత వంటి నిత్యమూ మన కళ్ళ ముందర కన్పించే అంశాలకు మూలాలను వెతకడం కోసం కొ.కు. చరిత్ర అధ్యయనంలోకి ప్రవేశించినట్లుగా ఈ పుస్తకాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది. చరిత్ర అధ్యయనంలోనికి ప్రవేశించడానికి నిస్సారమైన అకడమిక్ పద్ధతికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనది. మానవ సంబంధాలలోనూ, మనిషి విశ్వాసాలలోనూ, ఆచరణలోనూ ఉండే అపసవ్యత నుండి – అంటే మొత్తంగా మనం దేనినైతే సంస్కృతిగా పిలుస్తామో అటువంటి సంస్కృతికి మూలం ఎక్కడుంది అది ఇప్పటి స్థితికి ఎట్లా చేరింది, మొత్తం ఈ పరిణామంలో ఆధిపత్య శక్తుల ప్రమేయం ఏమిటి; ఇలాంటి సంస్కృతికి సమాజ గతిలో ఉండే ప్రాధాన్యత ఏమిటి వంటి అంశాలను కొ.కు. తన చరిత్ర వ్యాసాలలో పరిచయం చేసాడు. సంస్కృతిగా కళ్ళ ముందర కనిపించే జీవితానుభవాలనుండి చరిత్రలోకి ప్రవేశించడం అనే ఈ పద్ధతి పొరలుపొరలుగా పారస్పరిక సంబంధం కల అనేక అంశాలను పాఠకులకు సులభంగానూ, ఆసక్తికరంగానూ చెప్పడానికి దోహదపడింది. కొ.కు. ఈ వ్యాసాలను పాఠకులకు అందించడానికిగాను శాస్త్రీయమైన పరిశోధనా పద్ధతులతో చరిత్ర రచనకు పునాదులు వేసిన కోశాంబి పద్ధతిని అనుసరించడం కనిపిస్తుంది. కోశాంబీ సమాజం పొరల్లో ఇంకా సజీవ శిలాజాలుగా ఉన్న జీవన విధానాలు, సాంస్కృతిక అంశాలను ఆధారంగాచేసుకొని భారత చరిత్రకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అధ్యయన పద్ధతిని యాభయ్యవ దశకం నాటికే అభివృద్ధి చేసి ఉన్నాడు. దీనికి ఒకటి, రెండు దశాబ్దాల ముందుగా పురావస్తు పరిశోధనా పద్ధతుల్లో గొప్ప అభివృద్ధి జరిగింది. పురావస్తు ఆధారాలను గుర్తించి, వాటి కాలాన్ని నిర్ణయించడంలో వచ్చిన సాంకేతిక అభివృద్ధి చరిత్ర అధ్యయనానికి శాస్త్రీయతను జోడించింది. ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులనుపయోగించి చేసిన పురావస్తు పరిశోధనల ద్వారా మనదేశంలో అతి ప్రాచీనమైన సింధూనాగరికతను గుర్తించి వెలికి తీయగలిగారు. కోశాంబీ నాటికి అందివచ్చిన ఈ అభివృద్ధిని దేశంలోని సామాజిక స్థితిగతుల నిర్ధిష్టతకు సరిగా అన్వయించడం ద్వారా చరిత్రను అర్థం చేసుకొనేందుకు ఒక దారి ఏర్పడింది. చరిత్ర అధ్యయనానికి దోహదపడే ఈ కృషి తాలూకు శాస్త్రీయతను కొ.కు. గుర్తించాడు. వీటితోపాటుగా ఆర్యుల జీవిత విశేషాలను గురించి విస్తృతంగా పరిశోధనలు చేసిన రాహుల్ సాంకృత్యాయన్ రచనలు, దేవిప్రసాద్ ఛటోపాధ్యాయ, ఇంకా రోమిల్లా థాపర్ వంటి వారి నుంచి కొ.కు. విస్తృతంగా ఆధారాలను సేకరించాడు. చరిత్రకు సంబధించిన ఆధారాలతో పాటుగా సోషల్ ఆంథ్రోపాలజీలో జరిగిన పరిశోధనలు, అధ్యయన విధానాలను కూడా చరిత్ర అవగాహనకు కొ.కు. కు ఉపయోగపడ్డాయి. ప్రాచీన సామాజిక జీవనం గురించి మోర్గాన్ లాంటి పరిశోధకులు చేసిన కృషి కొ.కును అమితంగా ఆకర్షించింది. ఆర్యుల సామాజిక జీవితం, ప్రాచీన సాహిత్యంలో తరుచుగా ఎదురయ్యే వివిధ వర్ణాల సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికీ, వాటిని పాఠకులకు విమర్శనాత్మకంగా వివరించడానికీ కొ.కు. కు ఇవన్నీ ఎంతగానో దోహదపడ్డాయి.. ప్రాచీన సామాజిక జీవనం గురించి తాపీ ధర్మారావులంటి ఒకరిద్దరు రచయితలు కొంత కృషి చేసినప్పటికీ వారికీ కొ.కు. కు ఉన్న మౌలిక తేడా సామాజిక శాస్త్ర అధ్యయనాలకు చారిత్రక భౌతిక వాదాన్ని జోడించడంగా చెప్పాలి.

చరిత్రను శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయడానికి, దానిని పాఠకులకు బాధ్యతగా పరిచయం చేయడానికి బహుశా అన్నింటికన్నా ముందుగా ఆయనకు ప్రేరణ కలిగించిన సందర్భం, బహుశా రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలోనే ఎదురై ఉండాలి.చదువుకొని మేధోరంగంగా గుర్తింపు పొందుతూ, సమాజం మీద ప్రభావాన్ని చూపుతూ ఉన్న ‘మధ్య తరగతి’ హిట్లర్ లో తమ సంస్కృతిని రెపరెపలాడించిగల వారసుడిని చూడాలనుకోవడం ఆయనలో ఆసక్తిని రేకెత్తించి ఉండాలి. కాలానుక్రమణిక ప్రకారం చూసినా కొ.కు. చరిత్రను సవ్యమైన పద్ధతిలో చూడడం ఆరంభమైన కాలం కూడా ఇదే. ఇంతకు ముందు ఒకటి, రెండు వ్యాసాలు రాసి ఉన్నా వాటిలో స్పష్టమైన అవగాహన ఏదీ మనకుకనిపించదు. రెండవ ప్రపంచయుద్ధాన్ని ఆదిగా చేసుకొని ఆయన చివరి రోజుల వరకూ సంస్కృతి, చరిత్ర, మానవసంబంధాల పట్ల మధ్యతరగతిలో బలంగా ఉన్న భావజాలపై ఆయన నిరంతరాయంగా చేసిన విమర్శలో సామాజిక వాస్తవికతను గురించిన ధార కనిపిస్తుంది. ఇది తెలుగు సమాజంలో ‘మధ్య తరగతి’ గురించి, దాని ప్రభావం గురించి అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది.

తెలుగు సమాజంలో ‘మధ్య తరగతి’ ఆధిపత్య కులాల నుండే మొదటగా ఆవిర్భవించింది. పట్టణాలు ఏర్పడుతున్నప్పుడు తమ సంపదతో పాటుగా అక్కడకు చేరిన ఈ ప్రజానీకం జాతీయోద్యమ ప్రభావానికి లోనయింది. తమతో పాటుగా తెచ్చుకున్న సంపదను ‘పెట్టుబడిగా’ మార్చేందుకు వీలులేని పరిస్థితులలో ముందుకు పయనించలేక గతానికి సంబంధించిన గ్రామీణ భూస్వామ్య ఆధిపత్య సంస్కృతినే కొత్త పరిస్థితులకు జత చేసి దానిని కొనసాగిస్తూ వచ్చింది. సంపద ‘పెట్టుబడి’ గా మారే క్రమం సహజంగానే ఉత్పత్తి సంబంధాలలో మార్పును తీసుకుని వస్తుంది. కానీ ఈ పరిస్థితి మన సమాజంలో లేకపోవడం వల్ల ఇటువంటి మార్పులను ఆశించడానికి వీలులేకపోయింది. ఇలాంటి పరిస్థితులనుండే జాతీయోద్యమంలో మతతత్వ ధోరణులు చోటు చేసుకున్నయి. ఇవి ‘మధ్య తరగతి’ పై ప్రభావాన్ని చూపాయి. వీరి వద్ద పోగుపడివున్న సంపద అనుత్పాదక రంగాలయిన పత్రిక, సినిమా వంటి రంగాలకు మారింది. పెరుగుతూ ఉన్న అక్షరాస్యత కూడా వీరి వ్యాపారాలకు దోహదపడింది. ఈ పరిణామాలు వారి భావజాలాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొని వచ్చాయి. ఇటువంటి నేపధ్యంలో భావజాల రంగంలో ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా కొకు చరిత్రలోకి ప్రవేశించాడు.

కొ.కు. చరిత్ర వ్యాసాలు భారత దేశ చరిత్ర అధ్యయనానికి దోహదపడే అతి మౌలికమైన అవగాహనను అందించగల శక్తిగలవి. సమాజపు రూపు రేఖలు మొగ్గ తొడుగుతున్న ముఖ్యమైన దశకు సంబంధించిన విలువైన చరిత్రను, శాస్త్రీయమైన పద్ధతిలో పరిశోధన చేసిన రచనలను కొ.కు. తన వ్యాసాలలో పాఠకులకు అందించాడు.కొ.కు. చరిత్ర వ్యాసాలు భారత దేశ చరిత్రకు సంబంధించిన అభివృద్ధి పరిణామాలకు వర్తించే చారిత్రక గతితర్కాన్ని అంతర్లీనంగా పాఠకులకు వివరించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇది ఒక వాదన పద్ధతిగా వర్తమానం నుండి చరిత్రకు సంబంధించిన పొరలలోకి అతి నేర్పుగా ప్రవహించింది. ఖండాతర అవధులను దాటి ఎక్కడో సుదూరాన హిట్లర్ ప్రవచించే ఆర్యరక్తపు ఉన్నతిని, ఈ నేల మీద తలకెత్తుకొని తిరిగే ఉన్మాదపు సంస్కృతికి సంబంధం ఏమిటి, అసలు దాని మూలాలు ఎక్కడ ఉన్నయి, ఘర్షణ – ఐక్యత సూత్రపు ప్రాతిపదికగా సాగిన సమాజ పరిణామంలొ ఏ జాతి అయినా తన ‘ స్వచ్ఛత’ను అలాగే ఉంచుకుంటూ కొనసాగడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని కొ.కు. చరిత్రను విశ్లేషిస్తాడు. మన సంస్కృతికి మూలాలు వేదాల్లో ఉన్నయన్న ప్రచారానికి బదులుగా అసలు వేదాల్లో ఏమి ఉందో వివరించేందుకు పూనుకున్నాడు.

గతాన్ని అధ్యయనం చేయడానికి పనికి వచ్చే ఆధారాలు ఏమిటి అన్న ప్రశ్నకు కొ.కు. ఇచ్చిన జవాబు చరిత్ర అధ్యయనానికి ఎంతగానో ఉపకరిస్తుంది. మనదేశానికి సంబంధించి చరిత్ర గుదిబండగా మారడానికి కారణం చరిత్రను పురాణాలు, ఇతిహాసాలు, వేదాలలొ వెదకడం. చరిత్ర అధ్యయనానికి ఎటువంటి లిఖిత ఆధారాలు ఉపయోగపడతాయో చెప్పడం కోసం పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వాటి ప్రామాణికతను గురించి కొ.కు. చర్చించాడు.నిర్దిష్టమైన సామాజిక దశలకు సంబంధించిన వాస్తవికతకు సుదూరంగా ఉండే కట్టుకథలు, చరిత్ర అధ్యయనానికి ఏ మాత్రమూ పనికిరావని ఆయన స్పష్టం చేసాడు. ఇట్లాంటి ప్రామాణికత చాలావరకు వేదాలలోనూ, కొంత పురాణాలలోనూ కన్పిస్తుంది కానీ రామాయణంలాంటి కట్టుకథలలో దర్శించే ధోరణిపై కొ.కు. పెద్ద ఎత్తున విరుచుక పడ్డాడు.చరిత్ర మూలాలను వెతకడం, వాటిని తన కాలపు భావజాలానికి జోడించి చూడడం ద్వారా కొ. కు చరిత్రకు సంబంధించిన మహత్తరమైన సత్యాన్ని కనుగొన్నాడు. ఆధారాలతో, వాస్తవాలతో నిమిత్తం లేకుండా చరిత్రను విశ్వాసాలలో భాగంగా చూడడమనే ఈ సత్యాన్ని కొ.కు. మొదటి సారిగా ఒక సంస్కృతిగా గుర్తించాడు.దీనికి మూలాలు కుల ఆధిపత్య స్వభావం ఉన్న పాలకవర్గాల కుట్రలో ఆయన దర్శించాడు. అందుకే ‘ రామాయణంలో దాగిన నిజం ఫాసిజం’ అని స్పష్టంగా చెప్పగలిగాడు. కొ.కు. చేసిన ఈ పరిశీలన సంఘ్ పరివార్ శక్తులు ముందుకు తెచ్చిన ‘ సాంస్కృతిక జాతీయ వాదం’ సారాన్ని అర్థం చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. కొ.కు. చరిత్ర వ్యాసాలను చదివినప్పుడు ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా మనకు కన్పిస్తుంది. దీన్ని ఆయన స్వయంగానే కనుగొన్నాడు.నలభైల చివరలో కొ.కు. చేసిన ఈ విశ్లేషణ, ఉనికిలో ఉన్న భావజాలంపై ఆయన అవగాహనను తెలియజేస్తుంది. గతాన్ని అగ్రవర్ణ ఆధిపత్యానికి ఒక శ్లాఘనగానూ వేదాలు, పురాణాలు, స్మృతులు వారి గొప్పదనానికి ప్రతిబింబాలుగానూ ప్రచారం కావడాన్ని ఆయన పదేపదే ఖండిస్తూ విశ్వాసాల స్థాయి లో చరిత్ర ను చూసే ఈ రకమైన భావజాలంపై పోరాడుతూ ఆయన ఈ నిర్ధారణకు చేరుకున్నాడు. చరిత్రను పైనుండి చూసే పద్ధతికి భిన్నంగా మానవ సంబంధాలు, విశ్వాసాలు, ఆచరణల స్థాయి నుండి మొదలై లోతుల్లోకి అధ్యయనానికి దిగడంవల్ల ఒనకూరిన ప్రయోజనమిది . చరిత్ర పట్ల కొ.కు. కున్న ప్రత్యేకతగా దీన్ని చెప్పుకోవాలి.

దీనితో పాటుగా కొ.కు. చేసిన మరికొన్ని పరిశీలనలను కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. వర్ణ వ్యవస్థ ను కుల వ్యవస్థతో సమానంగా భావించడాన్ని ఆయన ఇలా వివరించాడు. ‘వర్ణాలు ఆర్ధిక వర్గాలుగా మారాయి. సమాజ అభివృద్ధిలో భాగంగా అనేక కులాలు ఏర్పడ్డాయి. న్యాయంగా ఇవి శ్రేణులు. కానీ వాటిలో జాతి లక్షణాలే ఉన్నాయి. స్వపంక్తి భోజనాలు, తమలో తామే పెళ్లిళ్లు చేసుకోవడం వంటి జాతి లక్షణాలు అమలులో ఉండడంవల్ల వర్ణ వ్యవస్థే అమలులో ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. కానీ నిజానికి వర్ణ వ్యవస్థ ఏనాడో పోయింది.[ పేజి121]. ‘హిందూమతం’లో కుల వ్యవస్థను ప్రాచీన వర్ణ వ్యవస్థతో సమంగా, రెండిటిని ఒకటిగానే భావించే సంప్రదాయం ఉంది. గాంధీ లాంటి వారు ఈనాటి కుల వ్యవస్థను తొట్ట తొలి వర్ణ వ్యవస్థతో సమానంగా, ఇంకా అదే కోనసాగుతోందన్న విశ్వాసంతో, దాన్ని శ్రమవిభజనలో భాగంగా వివరిస్తుంటారు.సంఘ్ పరివార్ కూడా కులవ్యవస్థను ఇదే పద్ధతిలో వివరిస్తుంది.అసలు ఈనాటి కుల వ్యవస్థను శ్రమ విభజనతో ముడిపెట్టి చూడడమే దుర్మార్గమైన అవగాహన. ఈనాటి కులవ్యవస్థను శ్రమ విభజనలో భాగంగా చూడడమంటే పరోక్షంగా కుల వ్యవస్థను భుజానికెత్తుకోవడమే అవుతుంది. కమ్యూనిష్టులుగా పిలవబడే వాళ్లుకూడా తెలిసో తెలియకో కులాన్ని ఈ విధంగా అవగాహన చేసుకోవడం ఈనాటికి కొనసాగుతోంది. కానీ డెబ్బయిల నాటికే, శ్రమ విభజన కారణంగా కుల వ్యవస్థ ఏర్పడిందన్న పాత కాలపు సిద్ధాంతాన్ని ఈనాడు ఎవరూ ఆమోదించరు అని కొ.కు. రాసాడు. ఇలాంటి భావజాలం వెనుక బ్రాహ్మణీయ కుట్ర ఉందని ఆయన అన్నాడు. ఈరోజు ‘హిందూ మతంగా పిలవబడే దానిని కొ.కు. తన వ్యాసాలలో బ్రాహ్మణీయ మతమనీ, వైదిక మతమనీ సందర్భం దొరికిన ప్రతీసారి వివరిస్తూ పోయాడు.ఈ అవగాహన సంఘ్ పరివార్ ప్రచారాన్ని అడ్డుకునేందుకుగాను ప్రగతిశీల శక్తులు విస్తృతంగా ఉపయోగిస్తున్నదే.సంస్కరణలు సామాజిక దోపిడిని అరికట్టలేకపోవడం, వాటికుండే పరిమితులు గురించి కూడా కొ.కు. కు అవగాహన ఉంది.అవి కొంత వరకు మాత్రమే మార్పును తీసుకు వస్తాయని దోపిడికి ఉండే మూలాలను మాత్రము తొలగించలేవని ఆయన అంటాడు. మత భావజాలం పుట్టుక, వాటి అభివృద్ధి గురించి కొ.కు. ది గత తార్కిక అవగాహనే . మధ్య యుగాలలో వచ్చిన మత సంస్కరణలను గురించి ఆయన వివరిస్తూ, సామాజిక గతిలో ఉత్పత్తి-ఉత్పత్తి సంబంధాలలో వచ్చిన మార్పులు వివిధ కులాలలో వచ్చిన చలనంగానూ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా వివిధ కులాల మధ్య ఘర్షణలుగానూ వ్యక్తమయ్యాయి. అయితే వాటికి మరో దారి ఏదీ లేకపోవడం వల్ల ఆధ్యాత్మికంగానూ మతంగానూ, రూపు తీసుకున్నాయని అంటాడు.ఇవన్నీ కొ.కు. కు చరిత్ర పై ఉన్న సాధికార అవగాహనను తెలియజేసే అంశాలు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రాచీన సామాజిక జీవనం గురించి కొ.కు. కున్న ఆసక్తి మరొక ముఖ్యమైన అంశంగా చరిత్ర వ్యాసాలలో మనకు కనిపిస్తుంది. ప్రాచీన సామాజిక జీవితానికి సంబంధించిన పరిణామము, ఆ క్రమంలో అభివృద్ధి చెందుతూ వచ్చిన మానవ సమూహాలు, వాటి స్థాయి, పరస్పరం ఉండే సంబంధాల గురించి ఎంతో ఆసక్తిగా తెలుగు పాఠకుల ముందుకు తీసుకొని వచ్చిన రచయితలలో కొ.కు. తప్ప మరొకరు ఉండి ఉండరు. కొ.కు. మోర్గాన్ లాంటి వారి పరిశోధనలను, ప్రాచీన భారతీయ సాహిత్యం నేపథ్యంగా వివరించడం ఈ వ్యాసాలలో కనిపిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు పురాణాలలో వినవచ్చే వివిధ వ్యక్తుల పేర్లు, సంఘటనల ఆధారంగా కొ.కు. తన వ్యాసాలలో ప్రాచీన మానవ సమూహాల నడుమ ఉండే సంబంధాలను పాఠకులకు వివరించాడు. వీటిని వివరించడం వెనుక కొకు ఉద్దేశం మానవ పరిణామంలోని సార్వజనీనతను ఎత్తి చూపుతూ, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సమర్ధించే కట్టుకథలను బట్ట బయలు చేయడమే. కొ.కు. ఆసక్తి ఇంతటితో ఆగలేదు. వివిధ సందర్భాలలో ఎటువంటి ఉపయోగమూ లేకపోయినా కేవలం తంతుగా పాటించే వివిధ ఆచారాలను గురించి కూడా ఒక పరిశోధకునిలాగా వాటి మూలాలను వెదకడం ఈవ్యాసాలలో కనిపిస్తుంది. మానవజీవితంలో ఆహారసేకరణ, ఆవాసం, పెండ్లి, పుట్టుక, చావు వంటివి అతి ముఖ్యమైన సందర్భాలు.అయితే మానవ పరిణామంతో పాటుగా వాటిని గురించిన అవగహన, ఆచరణ కూడా మారుతూ వచ్చాయి. మానవ ప్రగతిశీలత కారణంగా ఒక దశకు సంబంధించిన ఆచరణ, అవగాహనలు- మరొకదశ నాటికి తమ ప్రాసంగికతను కోల్పోతాయి. ఇలా ప్రాసంగికతను కోల్పోయిన అనేక ఆచారాలను గురించి కొ.కు. తన చరిత్ర వ్యాసాలలో విస్తృతంగా రాసుకుంటూ పోయాడు. సమాజంలో ఉనికిలో ఉండే నమ్మకాలకు ప్రాసంగికత ఉంటుందనీ, ప్రాచీన కాలంలో ప్రకృతికి, మనిషికి, సమాజానికి మధ్య ఉండే సంబంధాన్ని అర్ధం చేసుకునే క్రమంలో అనేక నమ్మకాలు ఏర్పడ్డాయనీ, కానీ సమాజం ఆ దశను దాటి మరికొంచెం ముందుకు పోయాక ఇక ఆ నమ్మకాలు తమ ప్రాసంగికతను కోల్పోతాయని కొ.కు. వివరించాడు. సమాజంలో చెలామణి లో ఉండే నమ్మకాలు ప్రాసంగికతను కోల్పొవడం అంటే అవి ఇక మూఢ నమ్మకాలుగా మారడమేనని కొ.కు. అంటాడు కొ.కు. చేసిన ఈవిశ్లేషణ భావజాలం పుట్టుక, దానికుండాల్సిన శాస్త్రీయతలను గురించి వివరిస్తుంది.

కొ.కు. రాసిన ఈ రచనలు “మధ్యతరగతి” లో విస్తృతంగా వ్యాపించి ఉన్న భావజాలం గురించిన విమర్శగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అధికార మార్పిడి తరువాత కూడా నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. కొ.కు. దీనిని సంస్కృతి పరంగా సంకర సంస్కృతి అనీ, రాజకీయాలవైపు నుండి ఓట్ల ప్రజాస్వామ్యమనీ, చారిత్రక పాత్ర పరంగా దళారీ అనీ, సరిగానే గుర్తించాడు. కానీ ఆయన చరిత్ర వ్యాసాలను పరిశీలిస్తే తానుగా గమనించిన మధ్య తరగతి విలువల పతనాన్ని ఏ నేపథ్యం నుండి అర్థం చేసుకోవాలన్న విషయాన్ని ఆయన వివరించలేదు దీనికి కారణం ఆయన అనుసరించిన మెథడాలజిలో ఉంది. అయితే ఈ పరిమితి ఆయన వ్యక్తిగతమయింది కాదు ఆయన కాలపు మార్కిస్టు అధ్యయనానికి, దాని అన్వయానికి సంబంధించింది. కొ.కు. తన వ్యాసాలలో ఉపరితలానికి సంబంధించిన వివిధ అంశాల నుండి పునాది వైపుకు పయనించడాన్ని మనం చూస్తాం. కానీ ఆయన కాలపు మార్కిస్టు అధ్యయనము, దాని అన్వయము పూర్తిగా భిన్నమైనది. కొ.కు. తన పద్ధతి ద్వారా నిర్ధిష్టమైన స్థల కాలాలలో వాటికుండే ప్రత్యేకతల నుండి చరిత్రను పాఠకులకు వివరించాడు. కానీ ఆయన కాలపు మార్కిస్టు అవగాహన కొన్ని సాధారణ సూత్రాల ద్వారా సమాజాన్ని పైనుండి చూడడానికి మాత్రమే పరిమితమయ్యేది. ఇది స్థూలంగా సమాజ గమనాన్ని అధ్యయనం చేసేదే తప్ప దానికుండే ప్రత్యేకతలను నిర్ధిష్టంగా పట్టుకోగలిగేది కాదు. పరస్పరం భిన్నంగా కనిపించే ఈ రెండు పద్ధతుల పర్యవసానం కొ.కు. అనుసరించిన మెథడాలజిపై పెద్ద ప్రభావాన్నే వేసింది. ఫలితంగా ఉపరితలానికి సంబంధించిన వివిధ అంశాల నుండి ఆయన బయలు దేరినప్పటికీ, వాటిని పునాదితో గతి తార్కికంగా సమన్వయించడాన్ని వదలి వేశాడు. తన కాలంలో ఇలాంటి సంవిధానం ఉనికిలో లేనందున, ఉన్నా అది ప్రభావశీలంగా లేనందున కొ.కు. ఈపరిమితికి గురి కావలసి వచ్చింది.

ముఖ్యంగా మధ్యతరగతి లోని దిగజారుడు తనాన్ని తన కాలపు వాస్తవికతగా ఈవ్యాసాలలో ప్రకటించినప్పటికీ అది ఎందుకు జరిగింది, దాని వెనుక ఉన్న రాజకీయార్ధిక నేపథ్యం ఏమిటి అన్నప్రశ్నలకు ఆయన వెళ్ళలేక పోయాడు. తన కాలపు సమాజంలోని వివిధ వ్యక్తీకరణలను పట్టుకోగలిగినప్పటికీ, వాటినన్నిటినీ సమన్వయించి వివరించే పనికి పూనుకోలేకపోయాడు.చరిత్ర వ్యాసాలనే పరిశీలించినట్లయితే సుదూర చరిత్ర కు సంబంధించిన అనేక అంశాలను ఆయన ఎంతో నైపుణ్యంతో వివరించగలిగాడు. అదే సమయంలో ఈ చరిత్ర, వర్తమానంతో కలగలసి కొనసాగుతూ ఉండడం కూడా గమనించి వాటిని తన వ్యాసాలలో నమోదు చేశాడు. ఈ వైరుధ్యాన్ని వివరించడం ఆయనకు సమస్యగా తయారయింది. ఈ వైరుధ్యం కారణంగా ఆయన విశ్లేషణంతా తన కాలపు వాస్తవికత నుండి మొదలై దాని మూలాలను వెదకుతూ పోయి, చివరకు అది ఎంత ప్రగతి వ్యతిరేకమో వివరించడంతో ఆగిపోయింది ప్రాసంగికత కోల్పోయిన అనేక అంశాలు సామాజిక జీవనంలో సంకర సంస్కృతి గా కొనసాగుతున్నాయని ఆయన విమర్శ.

ఇట్లా ప్రాసంగికత కోల్పోయిన అనేక విశ్వాసాలూ, ఆచరణా సామాజిక జీవనంలో ఎలా భాగమై కొనసాగుతూ ఉన్నాయన్న ప్రశ్నకు కొ.కులోనే మరో వైపు నుండి జవాబు కనిపిస్తుంది.కొ.కు. సృజనాత్మక సాహిత్యం దీనికొక దారిని ఏర్పరుస్తుంది.కొ.కు. సృజనాత్మక సాహిత్యమంతా ప్రగతిశీల విలువలకు, జీవిత వాస్తవికతకు మధ్య జరిగే ఘర్షణలో మనిషి చోటును గురించి చర్చిస్తుంది.మొత్తం ఈ ఘర్షణలో మనిషి చోటును గురించి చర్చిస్తుంది.మొత్తం ఈ ఘర్షణలో మనిషి చోటును గురించే ప్రముఖంగా చిత్రించినప్పటికీ దళారులు, తార్పుడుగాళ్ళు, డబ్బు కోసం ఏ అవతారాన్నయినా ఎత్తే వాళ్ళూ కూడా లేకపోలేదు. మధ్యతరగతిలోనే ప్రబలతున్న ఈ పార్శ్యాన్ని కొ.కు. తన సాహిత్యంలో ఒక నీడగా చిత్రించాడే కానీ దానినే ప్రముఖం చేయలేదు. చెడుకు ప్రచారం ఇవ్వకూడదన్న వైఖరే దీనికి కారణం. అలాగని ఈ చెడును కొ.కు. ఏదో నామమాత్రంగా చెప్పి వదిలివేయనూ లేదు. తన సాహిత్యాన్ని సమగ్రం చేయడం కోసం దానిని ఆయన ఒక ప్రత్యేకమైన సామాజిక వాతావరణం నేపథ్యంగా పాఠకులకు అందజేసాడు. పారిశ్రామికీకరణకు అవకాశం లేని రాజకీయార్థిక పరిస్థితులను ఆనాటి సామాజిక జీవితంతో ఆయన సమన్వయించాడు. నవలలలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి సామాజిక జీవితంను చిత్రిస్తూ, ఈ రాజకీయార్థిక పరిస్థితిపై విస్తృతంగా వ్యాఖ్యానాలు చేశాడు. ఈ పరిస్థితులలో ఎదిగి వస్తున్న దళారీలు, సంపాదనే ప్రధానమనే రకం మనుషులను ఆయన సాహిత్యంలో చిత్రించాడు.

కొ.కు. సృజనాత్మక సాహిత్యానికి ప్రధాన దినుసు వలస కాలపు సామాజిక వాతావరణంలో ఎదిగి వస్తున్న మధ్యతరగతి. దీనిని గురించి ఆయన శక్తివంతంగా చిత్రిస్తూ పోయాడు. కానీ వలస పాలన అనంతర సమాజంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తను రాస్తూ వచ్చిన మధ్యతరగతే తనకు అంతుచిక్కనిదిగా తయారయ్యింది. తను తెలుగు నేలకు ఎంతో కొంత దూరంగా ఉండడం, అదే సమయంలో సమాజపు కింది స్థాయిలోని వివిధ పొరలనుండి అనేక సెక్షన్ల ప్రజానీకం మధ్యతరగతిలో కలిసి పోవడం వంటి మార్పుల వల్ల కొ.కు. కు క్రమేపి పరిమితులు ఏర్పడుతూ వచ్చాయి.. దీనిని కొకు కూడా గమనిస్తూ వచ్చాడు. అరవైల నాటికి అది ఇంకా విస్తృతమై సాహిత్య, సాంస్కృతిక రంగాలలో సరికొత్త వ్యక్తీకరణలను ముందుకు తెచ్చింది.ఈ నేపథ్యంలో అరవైల నాటికి కొ.కు. సృజనాత్మక రచనలకు పూర్తిగా దూరం కావలసివచ్చింది. దానికి ఒక పూరకంగానూ, నూతనంగా ముందుకు వస్తున్న సామాజిక శక్తులకు మద్దతుగానూ కొ.కు. కళలు, సాహిత్యం, రాజకీయాలు, చరిత్ర, తత్వ శాస్త్రం వంటి విషయాల మీద విస్తృతంగా రచనలు చేసాడు.

అయితే తిరిగి ఈ రచనలలోనూ కొ.కు. ఎంత మేరకు సఫలమయ్యాడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ పరిశీలించవలసి ఉంటుంది. ఒకప్పుడు తనకు తెలిసిన, పరిమితమయిన మధ్య తరగతిని చిత్రిస్తూ, సాహిత్యంలో చేసిన కృషిని, బౌద్ధిక రచనా వ్యాసంగంలో నిర్వహించడానికి ఆయనకు తగిన శక్తి సమకూరినట్టుగా మనకు అనిపించదు. బౌద్ధిక రచన వ్యాసంగమంతటిలోనూ కొ.కు. తన కాలంలో ముందుకు వచ్చిన సమస్యలను ఎత్తి చూపుతూ వాటి మూలాలను అన్వేషిస్తూ పోవడం కన్పిస్తుంది. ఉపరితలం నుండి పునాదికి, నిర్దిష్టత నుండి సార్వజనీనతకు చేసే ఈ ప్రయాణానికి, వాటి మధ్యగల పరస్పర సంబంధాన్ని వివరించే ఈ ప్రయత్నానికి కుటుంబరావుకు సంవిధాన ( మెథడాలజీ) పరంగా పరిమితులు ఏర్పడ్డట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది పైకి కుటుంబరావుకున్న పరిమితిగా కనిపించినప్పటికి నిజానికి అది కుటుంబరావుకు కాలం విధించిన పరిమితి. ఈ పరిమితిని నక్సల్బరి తరం బద్దలు కొట్టింది.గతిశీలకమైన సమాజంలోని వివిధ ఉపరితలాంశాలనుండి దాని పునాదిని వివరించగల అధ్యయన పద్ధతికి చేరుకోగలిగింది.

మధ్య తరగతిలోని దిగజారుడుతనం వెనక ఉన్న రాజకీయార్థిక నేపథ్యాన్ని తన బౌద్ధిక రచనా వ్యాసంగంలో కొ.కు. సమన్వయించక పోవడం వల్ల ఆయన చరిత్ర వ్యాసాలలో హేతువు(reason)కు సంబంధించిన తర్కం అనివార్యంగా చోటు చేసుకుంది. హేతువుకుండే పరిమితిని, చారిత్రక గతితర్కానికుండే బలాన్ని ఆయన రాజకీయ వ్యాసాలలో రాసినప్పటికీ కొ.కు. కు ఇది దాటశక్యంకాని పరిమితే అయింది. వర్తమానంపై విమర్శగా గతానికి చేసే ప్రయాణంలో గతం గురించిన అవగాహన, దానికి సంబంధించిన ఆధారాలు, కాలానుగతిలొ వచ్చిన మార్పులు స్థూలంగా చరిత్రకు సంబంధించినంత వరకూ ఆయన అవగాహన గతితార్కికంగానే ఉన్నప్పటికీ, దానిని వర్తమానంతో సమన్వయించలేకపోవడంవల్ల, వర్తమానంలో సమస్యలుగా ముందుకొచ్చిన మతం, కులం, భావజాల సంబంధ సమస్యలను గురించి, సంస్కృతి గురించి ఆయన చేసిన చర్చ, వాటికున్న ప్రాసంగికతను గురించిన ప్రశ్నలతో ఆగిపోయింది. వర్తమానంలోని భావజాల సమస్యలను వివరించేటప్పుడు తన కాలపు విశ్వాసాలు, ఆచారాలు మొదలైనవాటిని హేతువుకు సంబంధించిన తర్కంతో ఆయన తరచు అవహేళన కూడా చేసాడు. ఇది చూడడానికి బాగానే కనిపించినప్పటికీ హేతువాదానికి ఉన్న పరిమితివల్ల ఒకసారి దాని చట్రంలోకి కూరుకపోతే దాని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉండడమే కానీ దాని నుండి బయటకు రావడం కష్టం. తన కాలానికి చెందిన మతతత్వ భావజాలాన్ని ఆయన ఈ పద్ధతిలోనే చూసాడు. కులాన్ని కూడా కొ.కు. ఈ పద్ధతిలోనే చూసాడు. దీనివల్లనే ‘ఆధునికత’ జీవితంలోని అన్ని రంగాలకు విస్తరిస్తూ ఉన్న సందర్భంలో కులం బలహీనపడక పోగా, అది మరింతగా బలపడుతూ ఉండడాన్ని ఆయన ఆవేదనాయుతంగా తన వ్యాసాలలో రాసాడు. తన జీవిత కాలంలో ఆయన ఆచరించిన విలువల దృష్ట్యా, కుల రహిత సమాజం రావాలని ఆశించి- ఆయన విశ్వసించిన సిద్ధాంత దృష్ట్యా ఆయన విమర్శలోని ఆవేదనను అర్థం చేసుకోవచ్చు గానీ, ఆయన అంతకే పరిమితమవడం చారిత్రక గతితర్కాన్ని సవ్యంగా అన్వయించలేకపోవడమే అవుతుంది.

కొ.కు. ను కేవలం చరిత్ర వ్యాసాల రచయితగానో లేకుంటే మరో అంశానికి సంబంధించిన రచయితగానో విడివిడిగ మాత్రమే చూడకుండా సమగ్రంగా, తన కాలపు సామాజిక ఉద్యమాల అభివృద్ధిలో భాగంగా అధ్యయనం చేయాలని సురా అంటాడు. సురా చేసిన ఈ ప్రతిపాదన చాలా విలువైనది. కొ.కు. గొప్పదనాన్నే కాకుండా, కాలం ఆయనకు విధించిన పరిమితులను కూడా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. కొ.కు. చరిత్ర వ్యాసాలు పరోక్షంగా మార్స్కిస్టు అవగాహన మునుపటి కన్నా ఎట్లా సమగ్రమవుతూ వచ్చిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తాయి. సమాజ బౌద్ధిక చింతనలో భాగంగానూ., అదే సమయంలో ఒక ప్రత్యేకమయిన ఆలోచనాధారగానూ అది ఎట్లా అభివృద్ధి అవుతూ వచ్చిందో తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు దోహదపడతాయి.

“మధ్యతరగతి”లో భాగంగా తలెత్తె అది నిర్వహించవలసిన బాధ్యతను గురించి నిరంతరాయంగా గుర్తుచేస్తూ, దానిలో వస్తున్న మార్పులను విమర్శనాత్మకంగా నమోదు చేస్తూ, కొ.కు. నిర్వహించిన పాత్ర అనితరసాధ్యమైనది. తన తరంలో తానుగా అందిపుచ్చుకున్న వెలుగును తన తర్వాతి వారికి ఆరిపోకుండా అందివ్వడానికిగానూ ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయేది.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో