Sep2009
మతోన్మాదాన్ని నిరసించే మానవతావాదుల ఆక్రందన “లజ్జ”
“మనందరికీ ఒకరినొకరు ద్వేషించుకోవడమే తెలుసు, కొందరికి మాత్రమే ప్రేమించడం తెలుసు,” అనే జొనాదన్ స్విఫ్ట్ మాటలను మననం చేసుకుంటూ, చూట్టూ చెలరేగుతున్న మత మౌఢ్యాలను, మతకల్లోలాలను, వివక్షతలను ఎదిరించాలని తపనపడే కొందరు మానవతావాదుల ఆక్రందన “లజ్జ”. ఈ పుస్తకం సారాంశం — ఆనాడు భారత దేశం నించి పాకిస్తాన్ విడిపోయినపుడు ఎంత నిజమో, ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అంతే నిజం. మత ఛాందసులు వీరవిహారం చేసినన్నాళ్ళు ఇలాంటి ప్రతిస్పందనల ఆవశ్యకత వుంటూనే వుంటుంది.
సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునే ఒకానొక కుటుంబం తాము జన్మతః హిందువులైనా బంగ్లాదేశ్ ను తమ మాతృదేశంగా భావించి,దాన్ని విడిచిపోవడానికి సిద్ధపడలేదు. భారతదేశంలో కొందరు మతోన్మాదంతో చేసిన అరాచకానికి ప్రతిఫలంగా బంగ్లాదేశ్ లో మరొక మతానికి చెందిన మూఢులు జరిపిన అకృత్యానికి ఈ కుటుంబం బలయిపొతుంది. ఎక్కడో ఎవరో జరిపిన దారుణకాండకు ఇక్కడ వీరు తమ మాతృదేశంలో మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. భారతదేశంలో హిందువులు జరిపిన ఆగడాలకు మరెంతమంది హిందువులు నలిగి పోవాలన్నది వీరికి జవాబు దొరకని ప్రశ్న.
బంగ్లాదేశ్ చారిత్రక నేపధ్యాన్ని తడుముతూ, మతోన్మాదం వల్ల ఎన్ని జీవితాలు అల్లకల్లోలమైపోతాయో చెప్తూ, మానవత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని నేర్పే ప్రయత్నమే “లజ్జ”. 1971లో పాకిస్తాన్ పై తిరుగుబాటు చేసి, తూర్పు పాకిస్తాన్ గా వున్న ప్రాంతాన్ని స్వతంత్ర బంగ్లాదేశ్ గా సాధించుకోవడం, ఆనాడు అందరూ కలసి సాధించుకున్న స్వాతంత్రాన్ని నిలుపుకోవడం కోసం కృషి చేయడం హర్షదాయకం. అయితే, 1975లో ముజిబుర్ రహమాన్ ని పడగొట్టిన సైనిక పాలనలో అనేక దురాగతాలు జరిగాయి. 1978 లో ఇస్లాంని జాతీయ మతంగా పేర్కోనడం మత సామరస్యానికి విఘాతం కలిగించింది. 1990లో భారతదేశంలోని రామజన్మభూమి వివాదం వల్ల బంగ్లాదేశ్ లో మతకల్లోలాలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో 1992 డిశెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతతో పరాకాష్టనందుకున్న మతమౌఢ్యాన్ని తస్లీమా నస్రీన్ ‘ లజ్జ’ లో ఎంతో హృద్యంగా వివరించింది. సుధామయి దత్తా కుటుంబం అనుభవించిన ఇక్కట్లు, ఒంటరితనం, భయానక వాతావరణం మధ్య అన్యాయాన్ని ఎదిరించే యువతరం, మత సామరస్యాన్ని కోరుకునే సామాన్య ప్రజానీకం ఆశనిరేకెత్తిస్తాయి.
పాకిస్తాన్ విభజన తర్వాత మన దేశంలో జరిగిన దారుణాలను చెప్పిన మనోహర్ మల్గోంకర్ నవల ‘ బెండ్ ఇన్ ది గాంజిస్’ సరిహద్దుకి ఇరువైపులా జరిగిన మారణకాండని చింత్రించింది. మతకల్లోలాలను ఎదుర్కోలేక అందరూ పాకిస్తాన్ కి పారిపోతుంటే, ఎన్నో కష్టనష్టాలను తట్టుకుంటూ భారతదేశంలోనే వుండిపోయిన బలరాజ్ సహాని కథ ‘ గరమ్ హవా’ ఒంటరి పోరుని చిత్రించింది. ‘లజ్జ’ లో సుధామయి దత్తాది అలాంటి పాత్రే.
ఎన్నో అవాంతరాలు ఎదురయినా సుధామయి బంగ్లాదేశ్ ని విడిచివెళ్ళడానికి అంగీకరించడు. తన పూర్వీకులు తమ ఆస్తిని అమ్ముకుని మైమన్ సింగ్ నించి ఢాకాకి మారినా, దేశం లో మతకల్లోలాలు రేగిన ప్రతిసారీ ముస్లిం పేరు పెట్టుకోవలసివచ్చినా, తన మేనమామలూ బాబాయిలూ ఇండియాకి పారిపోయినా, 1971 లో నిర్బంధానికి గురై చిత్రహింసల బారినపడి జననాంగం దెబ్బతిని సంసారజీవితానికి దూరమైనా, డాక్టరుగా వివక్షకు గురై ప్రమోషన్లను, జీతం పెంపును కోల్పోవలసి వచ్చినా, ఆస్తి విషయంలో అన్యాయానికి బలైపోయినా – ఎన్నో మానసిక ఆందోళనల నడుమ సైతం సుధామయి దత్తా బంగ్లాదేశ్ ని ప్రేమించాడు, తన మాతృదేశాన్ని వదిలిపోవడానికి నిరాకరించాడు.
కానీ తన ఎదిగిన కూతురుని దుండగులు ఎత్తుకుపోతే, ఆ బాధలో తన కొడుకు ధైర్యాన్ని కోల్పోయి తన సామాజిక రాజకీయ దృక్పధాన్ని కోల్పోతుంటే, మానవత్వం మీద నమ్మకాన్ని కోల్పోయి పీడకలలతో సతమతమవుతుంటే – తన నమ్మకానికి వ్యతిరేకంగా, గుండె రాయి చేసుకుని భారత దేశానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఇదే ఈ నవలలోని విషాదం. మాతృదేశాన్ని నమ్ముకున్న మానతావాదిని ఆ దేశమే తరిమికొడితే, అన్యాయం చేస్తే – అంత కంటే గుండె కోత ఏముంటుంది?
అంతా కలిసి 13 రోజుల్లో జరిగిన అనేక సంఘటనల కూర్పు అయిన ‘లజ్జ’ మూడు తరాల అనుభవాలను క్రోడీకరిస్తుంది, ఆ లజ్జాకరమైన దృశ్యాలు చూసి సమస్త మానవాళి తలదించుకునేలా చేస్తుంది. అంతే కానీ, ‘మతానికి మరో పేరు మానవతా వాదం’ అని చాటి చెప్పమంటుంది ‘లజ్జ’.
సుధామయికొడుకు సురంజన్ దత్తా బంగ్లాదేశ్ కమ్యునిస్టు పార్టీ సభ్యుడు. కొన్నాళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేస్తాడు. 1988 – 89 మధ్య కాలంలో పోలీసులు, స్థానిక గుండాలు కలిసి జరిపిన దురాగతాలను తన నోట్ బుక్ లొ నింపుతాడు. వీటిలొ కొన్నిటిని పత్రికలొ అచ్చువేస్తూ, “ధనికులు పేదవారిని ఎప్పుడూ హింసిస్తారు. ఆ బాధితులు హిందువులా, ముస్లిములా అని వారికి పట్టదు. బలవంతులు బలహీనుల్ని పీడించడం పెట్టుబడిదారీ సమాజంలోని సూత్రం” అన్న పత్రిక ఎడిటర్ మాటలు మతకల్లోలాలను వర్గదృష్టితో చూపుతాయి.
సురంజన్ ఎన్నడు దేముడుకి మొక్కలేదు. కానీ ప్రజల నమ్మకాలను అతను గౌరవిస్తాడు. అందుకే అతను బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించినట్టే దేవాలయాల కూల్చివేతను కూడా వ్యతిరేకించాడు. తన దేశాన్ని సోషలిజం వైపు నడపడం కోసం అనేక సభలకు వెళ్ళాడు, ఉపన్యాసాలిచ్చాడు. రైతు కూలీ సమస్యపై పోరాడాడు. ఇతరుల కోసం పాటుపడుతూ తన గురించి, తన కుటుంబం గురించి పట్టించుకోని అతన్ని సైతం ‘హిందువు’ అని వేలు చూపి వేధించాలని చూసింది మత మౌఢ్యం !
సుధామయి తన కొడుకు సురంజన్ ని ఆదర్శవంతంగా పెంచాడు. తన తోటి పిల్లలు కొత్త ఫ్యాషన్లకు బానిసలవుతుంటే సురంజన్ మాత్రం ఐన్ స్టీన్, న్యూటన్, గెలీలియొల జీవిత చరిత్రలను, ఫ్రెంచి విప్లవంపై, రెండవ ప్రపంచ యుద్ధంపై రచనలను, గోర్కీ, టాల్ స్టాయిల కథలను చదివాడు. తండ్రికి బంగ్లాదేశ్ మీద అచంచల విశ్వాసం. ఎన్నటికీ దేశాన్ని విడిచిపోరాదనే దృఢ సంకల్పం. కానీ 1992 లో జరుగుతున్న సంఘటనలు చూస్తూంటే కొడుకు దృక్పధంలో మార్పు రాసాగింది. ఎప్పటికీ తాము మైనారిటీలుగానే గుర్తింపబడతామని అతనికి అర్థమయింది. తనని ప్రేమించిన పర్వీన్, తను మతం మార్చుకోనందుకు వేరే పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ భావం బలపడింది. తన ప్రియమైన చెల్లెలు దుండగుల చేతిలో బందీగా చిక్కినపుడు ఆమె కోసం వెతికి వెతికి వేసారిపోయినపుడు, తన స్నేహితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇండియాకి పారిపోయినపుడు, మిగిలిన స్నేహితుల మధ్య కూడా మతమే రాజ్యమేలుతుందేమో అనుకున్నప్పుడు అతను నిరాశకు లోనై, సోషలిస్టు గ్రంధాలను తగలబెట్టి నిద్రలో భయంతో కేకలు పెట్టినప్పుడు – తన కొడుకు ధైర్యం బీటలు వారడం చూసిన తండ్రి లజ్జతో తల వంచుకుని, ఇండియాకి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. మానవత్వం మీద వున్న అతని నమ్మకానికి అది విఘాతంగా పరిణమించింది.
సురంజన్ గత ఙ్ఞాపకాలు వేధించసాగాయి. తన చెల్లెలు మాయని చిన్నతనంలో ఒకసారి ఎవరో మాయం చేయడం, ‘హిందువు’ అనే పదాన్ని ఆమె స్కూల్లో తిట్టుగా భావించడం, తమ స్కూల్లో ఇస్లాంని బలవంతంగా బోధించడం, తన తండ్రి దాన్ని నిరసించినా అధికార్లు పట్టించుకోకపోవడం, స్నేహితులు తనకి ఎద్దు మాంసం తినిపించి హేళన చేయడం, అలా మొట్టమొదటి సారిగా తనని ఒంటరితనం ఆవహించడం అతనికి ఇంకా గుర్తు. కొడుకులో నెలకొంటున్న సిగ్గుని, భయాన్నీ వివక్షతని పోగొట్టడం కోసం తండ్రి తమ ఇంట్లోనే ఎద్దు మాంసాన్ని వండించాడు. తండ్రి మాటల్లో చేతల్లో నిజాయితీ, నిరాడంబరత,స్వచ్చత,ప్రేమా మతసామరస్యంపై ఆయనకున్న ధృడమైన నమ్మకం-సురంజన్ దృష్టిలో తండ్రిని మహోన్నతంగా నిలబెట్టాయి.
1975లో తండ్రిని మతోన్మాదులు అరెస్టు చేసారు. మతం మార్చుకొమ్మని వేధించారు. మంచినీళ్ళ కు బదులు మూత్రాన్ని తాగించి,దూలానికి వేలాడదీసి దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు అలెక్స్ హేలి ‘రూట్స్’ లోని కుంతాకింతెలా ధృడంగా నిలిచాడు. తనకు బలవంతంగా సున్తీ చేస్తే స్పృహ తప్పాడు. విరిగిన పక్కటెముకలతో, విరిగిన కాళ్ళతో, రక్తం వోడుతున్న గాయాలతో ఇంటికి చేరిన తండ్రి ధైర్యాన్ని కోల్పోలేదు. భార్యకి శారీరక సుఖాన్ని ఇవ్వలేని నిర్బలత్వంలో సైతం తన ఆదర్శాలను వీడలేదు. తన కుటుంబాన్ని ఒక్క తాటిపై నిలబెట్టాడు. “మనం హిందువులం కాదు. నువ్వు మనిషివి”. అని కొడుకు భుజం తట్టాడు.
అయితే 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సురంజన్ న్యూనతాభావం చోటు చేసుకుంది. తాతముత్తాతల కాలం నించి తాము బంగ్లాదేశ్ వాసులమై వుండి ఇప్పుడు పరాయివాడు ఎలా అవుతాడు? అక్కడ తనకి ఏ హక్కులూ లేవా? ఎవరో తమ జాతీయ పతాకాన్ని తగులబెడితే కోపంతో గంగవెర్రులెత్తవలసింది పోయి నిర్లిప్తంగా వున్నాడెందుకు?
బోస్నియాలో జరిగే అత్యాచారాలకి బంగ్లాదేశ్ క్రిస్టియన్లు ఎలా బాధ్యలుకారో, ఇండియాలో ముస్లిములపై జరుగుతున్న అత్యాచారాలకు బంగ్లాదేశ్ హిందువులు బాధ్యులు కారు, కానీ తన మాట వినేదెవరు ?
ఒకనాడు దేశవాసులంతా ఏకమై స్వాంతంత్ర్యాన్ని సాధించుకున్నారు. దేశసమైక్యతను, ప్రపంచశాంతిని కోరుతూ ‘ జాతీయ సమైక్యతా కమిటి ‘ ఏర్పడింది . ఆనాటి సమైక్యత, స్నేహశీలత ఇప్పుడు ఏమైపోయాయి?
“అవును, నేను నిన్ను తన్నాను – కానీ తన్నినందుకు నొప్పి కలిగిందని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలురా ?” అన్న డి. ఎల్. రాయ్ కవిత ఇప్పటి కాలానికి బాగా వర్తిస్తుందని సురంజన్ నమ్మాడు. అయితే ఆత్మహత్య, లేదా ఇండియాకి పారిపోవడం తప్ప వేరే మధ్యే మార్గం లేదని అతనికి అర్థమయింది.
ఇండియాలో బి. జె. పి., బంగ్లాదేశ్ లో జమాతీ ఇస్లామి మత ఛాందసానికి ప్రతీకలు. ఈ రెండు దేశాల రాజకీయ కార్యాచరణ నించి ‘మతం’ అనే పదాన్ని తీసివేయగలిగితే ఎంత బాగుండేది! కానీ మతం ఎంతలా వేళ్ళూనుకొని పోయిందంటే, బీదబిక్కి సైతం దాని ఉక్కుపిడికిలి నించి తప్పించుకోలేదు.
“దోపిడికి గురవుతున్న వారి నిట్టూర్పు మతం. అది హృదయం లేని ప్రపంచానికి హృదయం. అది ప్రజలకు మత్తు మందు వంటిది.” అనే మార్క్సు మాటలు సురంజన్ చాలా ఇష్టం.
ఈ ‘లజ్జ’ కథ మొదలైన ఆరవరోజు సురంజన్ చెల్లెలు మాయని దుండగులు ఎత్తుకుపోతారు. ఇంట్లో సామానంతా ధ్వంసంచేసి ఆ అమ్మయిని ఎత్తుకు పోతుంటే, పక్షవాతం వచ్చిన తండ్రి నిస్సహాయంగా చూస్తూ వుండిపోతాడు. వాళ్ళ వెంటపడిన తల్లి, కూతురుని కాపాడలేకపోతుంది. విషయం తెలిసిన సురంజన్ తన ముస్లిం స్నేహితుడితో కలిసి ఊరంతా గాలిస్తాడు. ఆశ నిరాశవుతుంటే, ఊరకుక్కలకు దొరికిన పిల్లిలా తన చెల్లి ఎక్కడో సహయం కోసం ఆక్రోశించడం ఊహించుకుంటూ పిచ్చివాడయిపోతాడు. నిద్ర, ఆకలి, స్నానం, పానం లేకుండా రాత్రీ పగలు తేడా తెలియకుండా బాధపడుతూ వుండిపోతాడు. తల్లి రోదన, తండ్రి నిస్సహాయత అతన్ని మరింత బలహీనుణ్ణి చేస్తాయి.
బహిరంగ ప్రదేశాల్లో పూజా మందిరాలు, మసీదులకు బదులు అందమైన తోటలు, పాఠశాలలు వుండాలని, ప్రార్థనా స్థలాలన్నిటినీ ఆసుపత్రులుగా, అనాధశరణాలయాలుగా, యూనివర్శిటీలు, పాఠశాలలుగా మార్చాలని వాదించే సురంజన్ ఇప్పుడు దేవాలయాలను కూల్చడాన్ని వ్యతిరేకిస్తాడు. వామపక్ష పార్టీలు కూడా తన ఆశలని వమ్ము చేశాయని భావిస్తాడు. వారంతా వేరే పార్టీల్లొ చేరుతున్నారు. రోజుకొక మాట మారుస్తున్నారు. కామ్రేడ్ ఫర్హాద్ చనిపోతే పార్టీ ఆఫీసులో ఖురాన్ పఠనం ఎందుకో అతనికి అర్థం కాదు.
అయితే, తండ్రి సుధామయి మాత్రం అంత సంక్షోభంలోనూ ఆత్మస్థయిర్యాన్ని, నమ్మకాన్నీ కోల్పోలేదు. అతని ప్రాపంచిక దృక్పధం మారలేదు. మత కల్లోలాలు ప్రకృతి వైపరీత్యాలు కావు. వాటిని మనిషే సృష్టిస్తాడు అని అతను నమ్ముతాడు. దేముడికి మొరపెట్టుకునే భార్య మీద జాలిపడతాడు. “ఇన్నాళ్ళు నువ్వు ఎవరిని ఎరిగున్నవో, ఎవరి మీద ఆధారపడ్డావో వారే నీ భద్రతని అపహరిస్తుంటే నీ దేముడు ఏమి చేస్తాడు ? అన్ని తేడాలని మర్చిపోయి, కులం మతం జాతి అనే విబేధాలను పాతిపెట్టి ఒకటైపోయిన ప్రజలు మాత్రమే నిన్ను రక్షించగలరు,” అని వివరిస్తాడు.
1946 లో హిందు – ముస్లిం సమైక్యత కోసం తను వినదించాడు. ఈనాడు మళ్ళీ అదే నినాదం వినవస్తోంది. “ఇంకా ఎన్నాళ్ళు, ఎన్ని యుగాల వరకు ఈ నినాదం వినిపిస్తోంది ? మనం ప్రజలని ఇంకా మేల్కోల్పలేకపోయామా?” అని వాపోతాడు.
బంగ్లాదేశ్లో హిందువులకు భద్రతలేదని పారిపోతున్న వారిని చూసి, “సుఫియా, సుల్తానా, అన్వారా, పరిబానుల గురించి మీరు వినలేదా? వారిని కూడా ఎత్తుకుపోయి వారిపై అత్యాచారాలు జరపలేదా?” అని అతను ప్రశ్నిస్తాడు . ‘తన సొంత భూమిపై కాళ్ళూనికుని వున్నవాడే అందరి కంటే సంతోషంగా ఉంటాడని’ అతని నమ్మకం.
అయితే, తన కొడుకు విషానికి విరుగుడు కనిపెట్టకపోగా విషాన్నే మింగుతుంటే, తను నమ్మిన సిద్ధంతాన్ని మరచి పిచ్చివాడయిపోతుంటే, తన మాతృ దేశంలో ఒంటరివాడై కునారిల్లుతుంటే చూడలేని సుధామయి తన అభీష్టానికి వ్యతిరేకంగా, కొడుకు వేడుకోలుని పరిగణిస్తూ, ఇండియాకి వెళ్ళిపోవడానికి నిర్ణయించుంటాడు.
ఈ వాస్తవాలను హృద్యంగా, బలంగా, నిర్మొహమాటంగా చిత్రించిన తస్లీమా నస్రీన్ దేశద్రోహి అయింది. దేశాన్ని విడిచి రహస్య జీవితం గడపవలసి వచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున దాడికి గురయింది. ఆ దాడిని ఖండించే ముస్లిం మానవతావాదులు సైతం రహస్యంగానే నిరసన తెలిపారు. ప్రజాస్వామిక దేశంగా చెప్పుకోబడుతున్న మన దేశంలో కూడా ఆమె రహస్యంగానే గడపవలసి వచ్చింది.
సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి అద్భుతాలను సృష్టిస్తూ, ప్రకృతిని జయించే ప్రయత్నాలు చేస్తూ కూడా మానవుడు మతం, కులం ప్రాంతీయతత్వం అనే ఊబిలో కూరుకుపోతున్నాడు . మానవజాతి ఏక తాటిపై నిలిచి సాధించవలసిన విజయాలకు ఈ అడ్డుగోడలు అవరోధామవుతున్నాయి. సమైక్యత, సోదరభావం మాత్రమే ఈ సామాజిక కాలుష్యాన్ని కడిగివేయగలవు. అంతవరకు మనోహర్ మల్గోన్ కర్ లు, తస్లీమా సస్రీన్ లు సమాజాన్ని ఎదిరిస్తూ ఏటికి ఎదురీదుతూ, పారే రక్తపుటేరులను ఆపడం కోసం సమిధలవుతారు. మానవత్వం, సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే విస్తృత కాన్వాస్ పై ఆశాజనకమైన చిత్రాలు రచిస్తూ వుంటారు.
( నిజాలను నిర్భయంగా చెప్పినందుకు తస్లీమా నస్రీన్ దేశబహిష్కరణకు గురైంది. ఇప్పుడు స్వదేశం కోసం తపిస్తూ అక్కడికి తిరిగి వెళ్ళాలనే కాంక్షను వెల్లడిస్తోంది.)
6 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు
gks raja Sep 8, 2009 1
పుస్తకం కొన్నాను. కొంత చదివాను. కొంత మరిచాను. ఇప్పుడు మీ సమీక్ష విషయాన్ని తలకెక్కించింది.అభివందనాలు.
రాజా.
అజిత్ కుమార్ Sep 12, 2009 2
ఎదుటి వారి మతోన్మాదాన్ని నిరసించే మరో మతోన్మాదుల ఆక్రందన అంటే బాగుండునేమో ప్రస్తుతం మానవతావాదులెవరూ మిగిలిలేరు.మీకు కన్పించేవన్నీ మాస్కులే.
ari sitaramayya Sep 17, 2009 3
తన దేశం నుంచి పారిపోయి కలకత్తాలో తలదాచుకున్న తస్లీమాను అక్కడ ఉండ నివ్వ కుండా వెళ్ళగొట్టింది కమ్నూనలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సి పి ఎం) వారు. బిజేపీ వారికీ వీరికీ జెండాల రంగులో తప్ప పెద్ద తేడా లేదు.
Praveen Reddy Sep 18, 2009 4
చాల బావుంది
raman Sep 19, 2009 5
మీరు తస్లిమా గురించి ఇంకా వ్రాయాల్సింది.
she deserves to be read and known more.
ప్రాణహిత » సెప్టెంబర్ 2009 నెల సంచికకు స్వాగతం Oct 12, 2009 6
[...] మతోన్మాదాన్ని నిరసించే మానవతావాదుల