Sep2009
ఒక కొత్త చూపు కోసం
ఇక్కడ ఒక కవి
జీవించాడు వంతెన కడుతూ
వంగిపొయిన చెట్టు కొమ్మలా
భూమి మీద వాలిపోతూ
ఇంధ్ర ధనస్సులాంటి కలల్ని
పూరి గుడిసెల గుమ్మటాలకు వేలాడదీస్తూ
చీకటి గొంగడిని భుజం మీద వేసుకొని
చుక్కల వెలుతురు నీడల్ని దాటుకుంటూ
ఏ ఒక్క నిమిషం గాయపడకుండా ఉండలేదు
పావురాళ్ళగుంపులవెనక బైనాక్యూలర్
చూపులు వెంటాడుతున్నప్పుడు
చార్మినార్ ముందట ఎవరు మాత్రం
సంతోషంగా తిరగ గలరు
అత్తర్ వాసనల్లో కలిసిపోయిన
గాయాల గురించి ఎవరు మాట్లాడతారు?
కొత్తవంతెనను నిర్మిస్తున్న మనిషి తప్ప
నీదొక చెయ్యి నాదొక చెయ్యి
ఎప్పటికి కలిసిపోకుండా
మధ్య మధ్యలో వంతెనల్ని
బద్దలు కొడుతున్న దెవరు?
అవమానాలు, అనుమానాలు ఇంటికిటికీ లెక్క
ఎప్పుడూ తెరిచే ఉంచినప్పుడు
పిచ్చుక లెక్క మడుచుకు పోయి
వలవల ఏడ్చింది ఎవరు?
అది ఎప్పటికి
చిల్లులు పడ్డ పాత అంగీలాంటి బస్తే
షేర్వాణి ఒక ఆచ్చాదన మాత్రమే
రాణి తిరిగిన నేలైతే మాత్రం
మట్టిని కండ్ల కద్దుకుంటే పేదరికం పోతుందా?
లాఠీ చూపుల్లేని, అపనమ్మకాలు దర్వాజలు లేని
కొత్త ఇంటిలోకి ప్రయాణం జరగాల్సే ఉన్నది
తన వెన్నుముకను
బస్తీ నడిబొడ్డున పాతిపెట్టి వెళ్ళాడు కవి
అవును ఒక కవి
వంతెన కడుతూ మరణించాడు.
(ఉర్దూకవి మజర్ మెహదీ కోసం)
July 2nd, 2010 at 2:55 am
వేముగంటి గారు,
> ఇక్కడ ఒక కవి
జీవించాడు వంతెన కడుతు..
అనే కవితా పంక్తి చాలా బాగుంది.
అభినందనలు..
October 23rd, 2010 at 6:06 am
“ఇక్కడ ఒక కవి జీవించాడు
వంతెన కడుతూ”
(అవును మరి! కవులేంజేస్తరు..?
`మనసుల` మధ్య వంతెనలు కడుతూనే ఉంటరు..”)
“అవమానాలు, అనుమానాలు ఇంటికిటికీ లెక్క
ఎప్పుడూ తెరిచే ఉంచినప్పుడు”
ఈ కవితా పంక్తులు..చాలా బాగున్నయి..
అభినందనలు..
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in