“పద్మావతి ద హార్లట్” తో కమలా దాస్ కథన వ్యూహాలు

” నా రచనల ద్వారా ఒక అంతిమతీర్పును ప్రకటించి,దాన్ని పాఠకుల మీద రుద్దటం నాకిష్టం లేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని ఖాళీల్ని వదులుతాను. పాఠకులు తమ అవగాహనతో, అనుభవాలతో వాటిని పూరించుకునే అవకాశం ఉండాలి. మంచి రచనలెప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాయని నా నమ్మకం”.

పది పన్నెండేళ్ళ కిందట ఓ ఇంటర్వూలో కమలదాస్ చెప్పిన మాటలివి. ఈ మాటలు ఆమె రచనల్లోని ఇతర ప్రక్రియల కన్నా కధలకు మరింత బాగా వర్తిస్తాయి. పైకి చూట్టానికి అసంపూర్ణంగా, అస్పష్టంగా ముగిసినట్టు కన్పించే ఈ కధలల్లొ రచయిత్రి ఏ పాత్రల పక్షాన నిలబడిందో, ఏ విలువల్ని ప్రశ్నిస్తోందో స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఐతే ఆమె దాన్ని వాచ్యంగా చెప్పదు. తన కధ ద్వారా పాఠకుల్ని ఒక దృశ్యంలోకి, ఒక వాతావరణంలోకి ప్రవేశపెడుతుంది. దాని గుండా మనం సాగుతూ ఉండగా హఠాత్తుగా కథ ముగుస్తుంది. నిజానికిది ఒక ముగింపుకాదు – అనేక ముగింపులు. రకరకాల ఊహల దారులగుండా పాఠకుల్ని తన లక్ష్యంవైపుకు నడిపిస్తుంది కమలాదాస్. కథన శిల్పంలో ఆమె అనుసరించే ఈ వ్యూహానికి ఓ మంచి ఉదాహరణగా చూపదగిన కథ,”పద్మావతి ద హార్లట్” ( padmavathi , The Harlot).

పద్మావతి అనే ఓ వేశ్య దైవదర్శనం కోసం కాలినడకన ఏడుకొండలెక్కి,సాయంత్రానికి ఆలయ సమీపానికి చేరుతుండగా కథ మొదలవుతుంది. నడి వయసుకు చేరి అందంగా. దృఢంగా ఉందామె. ఆ ప్రాంతంలో తచ్చాడుతున్న కొందరు జులాయి కుర్రాళ్ళు ఆమె వెంటపడి మాటలు కలిపారు. వాళ్ళు వెకిలి చూపుల్నీ, మాటల్నీ పట్టించుకోకుండా వేగంగా నడుస్తోంది పద్మావతి. చీకటి పడేలోగా ఆలయానికి వెళ్ళి సంధ్యార్చనకు హాజరవ్వాలని ఆమె ఆశ.

తన పేరు పద్మావతి అనీ, ముప్పయ్యేళ్ళుగా దేవుణ్ణి చూడాలనుకుంటున్నా కుటుంబ బాధ్యతల వల్ల వీలు కాలేదని తనతో బాటు నడుస్తున్న కుర్రాళ్ళతో చెప్తుందామె.మంచాన పడిన తల్లిని జీవితాంతమూ పోషించటమూ, తమ్ముళ్ళను చదివించి వృద్ధిలోకి తేవటమూ, మంచి కట్నమిచ్చి చెల్లెలికి పెళ్ళి చెయ్యటమూ…..

ఈ బాధ్యతలన్నీ పూర్తయ్యేసరికి ఆమె జీవితంలో మూడొంతులు గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్ళెవరూ తనను పట్టించుకోరని దిగులుగా చెప్పింది పద్మావతి.

కుర్రాళ్ళకు ఆమె కష్టాలను వినిపించుకునే స్థితిలో లేరు. “పడుచు పిల్లవు కాకపోతేనేం, పిటపిటలాడుతున్నావు! ఈ రాత్రికి మమల్ని దయతలచరాదు” అంటూ వెకిలి మాటలు విసిరారు. దేవుడి నైవేద్యానికని ఆమె తీసుకు వెళుతున్న పళ్ళన్నీ లాక్కుని తింటున్నారు.” మీ తల్లుల వయసున్న ఆడదాన్నిరా నేను, కనికరమన్నా లేదేం మీకు?” అంటూ బాధతో , నిస్సహాయతతో కన్నీళ్ళ పర్యంతమైంది పద్మావతి. వాళ్ళ వెక్కిరింతల్ని పట్టించుకోకుండా వేగంగా పరిగెత్తి ఆలయాన్ని చేరింది. అప్పటికే పూజ ముగిసింది. గుడి తలుపులు వేసేసి పూజారి వెళ్ళిపోయాడు. చూట్టూ చీకటి,నిశ్శబ్ధం. కుర్రళ్ళు కూడా ఎటో మాయమయ్యారు. ఆమె భయంతో,నిరాశతో వణికిపోయింది. గుడి తలుపుల్ని చేతులతో బలంగా బాదసాగింది.

కాస్సేపట్లో తలుపు తెరుచుకుంది. ఆభరణాలతో వున్న పాదాలు కనబడ్డాయి. ఆమె వాటిపై వాలిపోయింది.కన్నీళ్ళతో వాటిని కడుగుతోంది, పట్టరాని ప్రేమతో ముద్దాడుతోంది.”దిక్కులేనిదాన్ని, వ్యభిచార కూపంలో బతికినదాన్ని నన్ను కరుణించు స్వామి” అంటూ విలపిస్తోంది.

“లే , పద్మావతీ” అంటూ ఆమెను లేవనెత్తి కౌగలించుకున్నాడు దేవుడు. గర్భగుడి చీకట్లో అతని ముఖం ఆమెకు కనబడ్డం లేదు. దేవుడు కరుణకు చలించిపోయింది. “అయ్యె, నీకు అర్పించేందుకు ఏమి లేదే నాదగ్గర! తెచ్చిన పళ్ళన్నీ ఆ అల్లరిమూక లాక్కున్నారు. నువ్వు మామూలు మగాడివైతే ఈ పాపిష్టి శరీరన్నయినా అర్పించేదాన్ని. కానీ, నువ్వేమో భగవంతుడివి” అంటూ రోదించింది. తనను హత్తుకున్న శరీరం వెడెక్కటం ఆమెకు అర్థమైంది. పరవశంలొ కళ్ళుమూసుకుంది పద్మావతి.

మర్నాడు తెలతెల వారుతుండగా పద్మావతి కొండ దిగి వెళ్తుంది.కుర్రాళ్ళ గుంపు మళ్లీ ఎదురైంది.ఆమె జుట్టు ముడి విడి పోయి,పొడుగ్గా జాలు వారుతుంది.రవిక చిరిగి పోయింది.చెంపల మీదా,కంఠం మీదా ఎర్రగా కందిపోయిన గాట్లు.బాగా వాచి,నీలి రంగుకు తిరిగిన పెదవులు.-ఇదీ ఆమె రూపం.ఆమె ముఖం నవ వధువులా సిగ్గుతో ఎర్రబడి ఉండడం చూసారు కుర్రవాళ్ళు.ఆమె దారికి అడ్డు జరిగి వంగి నమస్కరించారు వాళ్ళు.”జాగ్రత్తగా వెళ్ళమ్మా,మమ్మల్ని దీవించి వెళ్లు”అన్నారు.ఆమె ఏమీ పట్టనట్టుగా నడచి వెళ్తోంది.

చిన్న వాక్యాలతో చక్కని వర్ణనలతో ఒక కవితలా సాగిన ఈ చిన్న కథ ఒకదానికొకటి సమాంతరంగా ఉండే రెండు పాయలుగా సాగుతుంది.ఆలయంలో పద్మావతిని కలిసిందెవరు? ఆమెకు ఎదురైన అనుభవం శృంగారమా? దౌర్జన్యమా?ఈకథ ఆధ్యాత్మికమైనదా?ఫాంటసీయా?వాస్తవమా? ఆమెను అంతగా వేధించిన యువకులు ఎందుకంత భయ భక్తులతో నమస్కరించారు?ఎన్నో ప్రశ్నలు.అన్నింటికీ రెండేసి సమాధానాలున్నాయి ఈ కథలో.

పద్మావతి భావనలో తనను స్వీకరించినది భగవంతుడే.”నన్ను అస్యహించుకుంటూ,తమను తామే అసహ్యించుకునే విటులకు ఈ శరీరాన్ని అమ్ముకుంటున్నాను”అని విలపించిందిపద్మావతి.తనను స్వీకరించింది భగవంతుడేనన్న నమ్మకం వల్ల ఇష్టంతో,ఆమె అనుభూతించిన తొలి శృంగారానుభవం ఇది.

అందుకే “నవవధువులా”సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడిందని వర్ణిస్తుంది రచయిత్రి..ఇంతకాలంగా మోసిన బాధ్యతల నుండీ,అవమానాల నుండీ అపరాధ భావనల నుండీ విముక్తి దొరికిన ప్రశాంతతతో తిరిగి వెళ్ళింది.భగవంతున్ని చేరాలని సుదీర్ఘ కాలం పాటు తపించి,ఏడు కొండల నెక్కి,గజిబిజి దారుల గుండా మార్గాన్ని అన్వేషిస్తూ,అవమానాలను,వేధింపులనూ భరిస్తూ ఆమె చేసిన ప్రయాణమూ,గత జీవితంపై పశ్చాత్తాపమూ ఈ లోకరీతి అనుభవాన్ని ఆమెకు అందించాయి.దానివల్ల ఆమె ముఖంలో కనపడుతున్న అలౌకిక భావన పోకిరీ కుర్రాళ్ళలో పశ్చాత్తాపం కలిగించింది-కథ అందించే సాదారణ వ్యాఖ్యానం ఇది.

మరొక ప్లేన్ నుండి చూస్తే  కథలో అధివాస్తవిక దృష్టి ఏమీ లేదు.భౌతిక వాస్తవికతతో,హేతుబద్దతతో,మానసిక విశ్లేషణతో నడచిన కథ ఇది.కుటుంబ బాధ్యతల కోసం తనకు ఇష్టంలేని వృత్తిలో జీవించింది పద్మావతి.ఆమె వల్ల ప్రయోజనం పొందిన కుటుంబ సభ్యులందరూ ఆమెను వెలి వేశారు.ఆమెలో పెరుగుతూ వచ్చిన అపరాధ భావాన్ని,నైతిక భారాన్ని దించుకొవడానికి అవుట్ లెట్ గా ఉపకరించాయి ఈ ప్రయాణమూ,గుడిలో ఎదురైనానుభవమూ.సుదీర్ఘ కాలం పాటు ఆమె చేసిన కఠోరజీవనయానానికి ప్రతీకలుగా ఏడు కొండలనూ,చిక్కు దారులనూ వర్ణించింది రచయిత్రి. ఈ అనుభవాలన్నిటితోనూ ఆమె వ్యక్తిత్వం పరిణితి చెందింది.తనను అనుమానించి,వేదిస్తున్న యువకుల మీద కోపమే తప్ప ద్వేషం కలగలేదామెకు.అందుకే “మీ తల్లి లాంటి దాన్ని” అనగలిగింది.అంత స్వచ్ఛమైన  హృదయం వల్లనే భగవంతున్నిదర్శించగలిగానని చెప్పగలిగింది

నిజానికి ఆలయంలో ఆమె మీద అత్యాచారం జరిగిందని సూచించడానికి ఎన్నో ఆధారాలను సిద్ధం చేసింది రచయిత్రి. గాయపడిన పద్మావతి శరీరాన్నీ,చిరిగిపొయిన బట్టలనూ,అప్పటి దాకా వెంటనడిచిన కుర్రవాళ్ళు హఠాత్తుగా అదృశ్యమవటాన్ని,గుడిలో ఆమెను కలసిన వ్యక్తి ముఖం కనిపించనివ్వని చీకటినీ ఉద్దేశ్యపూర్వకంగానే కథలో కల్పించింది కమలాదాస్.తాము చేసిన అత్యాచారాన్ని గ్రహించని ఆమె నైర్మల్యాన్ని,స్వచ్ఛతను చూసిన కుర్రవాళ్ళు అపరాధ భావంతో భయంతో నమస్కరించారు-ఇది కథలోని మరో కోణం.

వీటితో బాటుగా వినిపించే మూడో వ్యాఖ్యానం రచయిత్రి లక్ష్యాన్నీ,దృక్పథాన్నీ సూటిగా వినిపిస్తుంది.వేశ్యలను తయారు చేస్తున్న సాంఘీక వ్యవస్థనూ,వాళ్ళను వెలివేసి తృప్తి పడే సమాజపు డొల్లతనాన్నీ పద్మావతి స్వచ్ఛమైన హృదయానికి సమాంతరంగా నిలబెట్టి హేళన చేసింది కమలాదాస్.అంతకన్నా పదునైన విమర్శను కూడా ఆమె ఈ కథ ద్వారా ఎక్కుపెట్టింది.అది-ఒక స్త్రీ తప్పనిసరి పరిస్థితులలో వేశ్యగా మారినా ఎల్లవేళలా పురుషుడిని లైంగిక దృష్టితోనే చూడ బోదు.బిడ్దగా,ప్రియుడిగా, తన సర్వస్వాన్నీ  అందించగల దేవుడిగా అనేక రూపాల్లో ప్రేమించగలదు.కానీ మగవాడికి ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో ఉన్న స్త్రీ అయినా ఉత్తి లైంగిక వస్తువే.భగవంతునికి తన శరీరంతో పని ఉండదనీ పద్మావతి స్త్రీ హృదయం భావించింది.కానీ “మగదేవుడికీ” మామూలు మగవాడికీ స్త్రీ విషయంలో స్థాయీ భేదాల్లేవు.ఇది కమలాదాస్ మాత్రమే సంధించగల విమర్శనాస్త్రం !

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 Responses to ““పద్మావతి ద హార్లట్” తో కమలా దాస్ కథన వ్యూహాలు”

  1. 1
    malleeswari Says:

    కధ రాయడం ఒక కళ.అదే కధని ఎంత వైవిధ్యంతో చదవొచ్చోకాత్యాయనిగారి సమీక్ష్ చెప్పింది.బహుశ ఈ వ్యాసం పాఠకులు నేర్చుకోవాల్సిన కళకి సంబంధించింది అనుకుంటాను.కధకి న్యాయం చేసిన ప్రయత్నమిది.అభినందనలు………మల్లీశ్వరి.

  2. 2
    ప్రాణహిత » సెప్టెంబరు 2009 సూచిక Says:

    [...] “పద్మావతి ద హార్లట్” తో కమలా దాస్ కథన … [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో