పురాకృతం

శ్రీకాంత్

తేలికగా ఉండడమంటే ఏమిటి?

బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు,దేహంలోకి చొచ్చుకుపోయే గాలే కావొచ్చు.ఒక అద్భుతం.నీరులానూ.తుంపరలానూ వుండటం. అది ప్రేమ కూడా.తేలికగా వుండటం అదే కావొచ్చును.

ప్రేమించడం నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం నాకు తెలీదు.ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం యితరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది యీ పద్యం కూడా.

మరెప్పుడో మొదలయ్యింది సంఘర్షణతోనే.యిక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే.కానీ, పాదాల చుట్టూ చుట్టుకొనే నీడా దేహంపై కదులాడే ఎండా? యివి కూడా వాస్తవాలు.

ప్రేమ కూడా వాస్తవం.

యీ శాపగ్రస్త పదాల ముందు ఆమె నిర్లిప్తంగా కదలాడింది. యీ శాపవిమోచనం లేని పదాలతో పాటు ఆమె నిరాసక్తతగా నడుస్తూ వుంది. సగం తెరుచుకున్న పెదవులు. కనులలో రోగగ్రస్తమైన ఎర్రటి జీర ఒక స్పర్శ. ప్ర్రాణప్రదమైనదాన్ని ఒడిసిపట్టుకున్నట్టు లేదా తల్లినుంచి విడిపోతున్న తల్లి చూపూ.

ద్రోహం: వుండకపోవడం . ఉండటమూ నేరం.

ఉండటం ఉండకపోవడం మధ్య హస్తాల మధ్య తడిలా పారిపోయే నీరులా అదృశ్యమైనది ఏమిటి?

వుండటం.వుండకపోవడం.

భౌతికమైన ప్రేమ. ప్రేమ నుంచి మరింత దీర్ఘంగా,ఎండాకాలంలో పల్చనయ్యి బలహీనంగా తడిమేసన్నటి నదీ చారికలా ఆవిరవ్వకుండా మాయమయ్యే ఇంద్రజాలపు రూపం. ఒక సూర్యకిరణం లేదా చిట్లి సప్తరంగులుగా బయల్పడే సౌదర్యవంతమైన చిరునవ్వు,హింసాత్మకంగా ఏడు రంగులలో ప్రతిబింబించే వెక్కిళ్ళ రోదన. నొప్పి కూడా.అర్థరాత్రి ఎండాకాలం తన పాదం ముంగిట మోపే సుదూర సమీప సమయాన ఎండాకాలం తన తొలిపక్షి పిల్లలతో చల్లటి వేడి రెక్కలతో వీచే దిగులు పారిజాత పరిమళ గాయపు సమయాన

వొక స్వరం. లేదా వొక భాష.

సుదూరం నుంచి, మరచిపోయిన ఒట్టి మరచిపోయినదేదో వొదిలి వెళ్ళిన సువాసనలాగా,అప్పుడెప్పుడో వర్షాకాలపు మధ్యాహ్నపు సాయంత్రం పూట, మేఘాలు మృదువుగా,కదులుతున్న రక్తంలా గడ్డ కడుతున్న చేతివేళ్ళల్లా కదలాడుతున్నప్పుడు పెదాలపై వొదిలివెళ్ళిన వుమ్మిలా లేతగా జారుతున్నప్పుడు

సుదూరం నుంచి

మరచిపోవాలనుకొన్నదేదో, మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో, తిరిగి వున్మత్త వుద్రేక వృత్తాలుగా దేహాన్నీ, దేహం లోపల సమయపు నదుల మధ్య నింపాదిగా కదులుతున్న కలలనీ పిచ్చితనంతో , హింసాత్మక ప్రేమతో కత్తుల్ల గాయపరుస్తుంది.

సుదూరం లేదా దూరం (ప్రశ్న: దూరం అంటే ఏమిటి?)

సముద్రం నుంచి మేఘాల దాకా మేఘాల నుంచి సముద్రం దాకా భూమిపై నుంచి భూమి పొరల్లోని సున్నితమైన నదీ ప్రవాహాల్లా అచ్చు నాన్నాల్లా అమ్మల్లా గోరింటాకు విచ్చుకున్న రక్తపు పత్తిపూవులా అరచేతంతా అలుముకున్నట్టు అర్థరాత్రి చీకటినొప్పిలో,నాదైన నాదికాని యీ దేహంలో

నువ్వు

నిశ్శబ్దంగా యుద్ధ భీభత్స  తీవ్రతతో వూహించీ వూహించలేనంతగా వర్షపు చుక్కలు మట్టిని గాయపర్చిన తీవ్రతతో, అపస్మారకపు సాయంత్రం ఆకస్మికంగా నోరు నొక్కి గుండెల్లో దింపిన కత్తిమత్తు వాస్తవంతో గోరువెచ్చని నీటిలాంటి రాత్రిపూట దేహం లోపలంతా నలుమూలలా నింపాదిగా ముళ్ళరక్తపు ఙ్ఞాపకాలతో దిగబడే, లోతుగా విత్తనాల్లా నాటుకుని మొలుచుకువచ్చే

నువ్వు


ప్రశ్న రెండు

నువ్వు అంటే ఎవరు? వొట్టి ప్రతీకలు. నగిషీల భాషాప్రతీకలు. సౌందర్యాత్మక భాష, సౌందర్యాత్మక హింస . హింసా సౌందర్యం. సౌందర్యపు హింస.

యిప్పుడే యిక్కడే వున్నంత సుదూర సమయాన.

నాలుగు చినుకులు చూరు నుంచి జారి అంతదాకా కురిసి వుండి వెళ్ళిపోయిన వర్షాన్ని ఙ్ఞాపకం చేసినట్టు, ఒక వర్షాకాలపు తొలి గాలిరోజుల మధ్య నుంచి, అదే వర్షాకాలపు తొలి సజల రాత్రుళ్ళు మేఘాల మధ్య చిక్కుకుపోయిన చందమామను వెతుక్కుంటున్నట్టు ఒక దేహం గురించీ, దేహంలాంటి దిగులు కలల్నీ వొదిలేసి వెళ్ళిన కొడుకుల్ని మృత్యునయనాలతో ఆ వృద్ధుడు హింసాత్మక కరుణతో కంపిస్తూ గుడ్డిగా కళ్ళ వేళ్ళంచులతో గరుకుగా తడుముకూంటూ ఎదురు చూస్తున్నట్టూ నేను నాకోసం ఎదురు చూస్తున్నప్పుడు  చాలా మామూలుగా ఎదురుపడ్డ

నువ్వు

I was simple

I was simpler then

It was smplicity

which seemed so sensual.

అని

పదాలన్నీ నువ్వే అయిన రోజులు. నువ్వే అయిన పదాలు అస్థిత్వాన్ని కమ్ముకున్న రోజులు. అవి గుసగుసల  అమాయకత్వపు ధ్వనుల రోజులు.కనిపిపించనిదేదో కదలి గడ్డి మృదువుగా రాత్రితో సన్నటినీటి కోతలా వూగులాడినట్టు అనేకానేక సుధీర్ఘ నలుపు వర్షాల తర్వాత తిరిగి ప్రత్యక్షమయ్యే వ్యతిరేకాలు: పునరావృతమయ్యే పురాతన ప్రశ్న: subject and the other.  అతడు అన్నాడు.

“other is the self”

అవి కొన్ని సమయాలు. అవి కొన్ని వ్యక్తిగత సమయాలు. దేహం లోపల నదులు అంచులదాకా ప్రవహించి, ఏమాత్రం  కదలినా ఏ మాత్రం శబ్దించినా దేహం జ్వలిస్తూ వొలికిపోయేంతగా నిండిపోయిన దేహపు అలల-యిద్దరిదీ అయిన – యిద్దరిదీ కాని వ్యక్తిగత పరిమళ కలల సమయాలు.


“నేనొక క్రిష్టియన్ ని ” ఆమె అంది.” నీకు తెలుసా బైబిల్ లోని ఆమె కథనాన్ని గురించీ” అతడు చిర్నవ్వుతో అడిగాడు. ఆరుబయట అశోక చెట్ల గాలులతో పాటు గాలిలా మారుతూ ఆమె చిర్నవ్వింది  .


దేహం . రహస్య దేహం. బహిర్గతమయ్యీ రహస్యంగా మిగిలిపోయే దేహం.


దేహం మారుతుంది. అశొక చెట్ల గుంపుగానూ, మేఘావృత వుద్యానవపు గులాబీల సందడిగానూ,సముద్రతెరల నిండైన మెత్తటి పాదాల స్పర్శలగానూ, యింకా ప్రేమపూరితమైన పక్షుల కేరింతలగాను లేదా సాయంత్రంపూట బేబీకేర్ సెంటరల నుంచి వడివడిగా పొర్లే పిల్లల హృదయాల్లానూ,విశ్వంగానూ సమయంగానూ సర్వరహితంగానూ దేహం మారుతుంది.

“body is a universe in itself” అతడు అన్నాడు.

నక్షత్రాల బిందువుల కింద, అరతెరచిన కిటికీ లోంచి సన్నగా పొగలా జొరపడుతున్న వెన్నెలలా వేకువ ఝామున వుండే నింపాది ఉన్మాద, చిక్కటి చీకటి రక్తంలాటి మంచూ, దేహం నలువైపులా వీడిపోయి మరొక దేహాన్ని ఊదారంగు సర్పంలా చుట్టుకొని మరలా అంతలోనే కరిగి పోయి, తరచూ తడిమే

ఎవరు  ఎవరు?

ఆమె దేహం అతడి దేహమయ్యేంతవరకూ అతడి దేహం ఆమె  దేహమయ్యేంత వరకూ కలగలిసిపోయి వ్యతిరేకార్థాలైన ఏక భాషలా మారిన పలవరింతల మత్తుసమయాలు


” నన్ను హిందువని అంటారు  కానీ మగ పందినని నా అనుమానం ” అతడు అన్నాడు.

ఒక రాత్రిపూట దేహాన్ని పూర్తిగా చూడాలనే వాంఛతొ దుస్తులను, పొలాల మధ్య కలుపు మొక్కలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు, బంగారు రంగు ద్రావకపు వున్మాద మెరుపుల మధ్య తునాతునకలు చేసినప్పుడు, ఆ ముస్లిం ప్రియురాలు అంది.


” నేను రజస్వలను. మతపరంగా అపవిత్రను.వొద్దిప్పుడు, నిజంగా వొద్దిప్పుడు.”


అతడు చెప్పాడు: మనం నిజంగా మతాన్ని పునర్ నిర్వచించుకోవాలి. నిజంగా మనకు తెలియని, తెలిసీ తెలియని అస్పష్ట ఆకారపు రాముడ్నీ, జీసస్ నీ అల్లానూ.


నీకు గుర్తుందా? అతడిలోని అతడు ప్రశ్నించాడు.

ఆ తెల్లటి గులాబీపూల చందమామని నువ్వేమని పిలిచే వాడిని? తెరుచుకున్న తెరచాపల రెక్కల సుతిమెత్తని శబ్దాల కలకలమని కదా.

ఏదో వొకటి వుంటూనే వుంటుంది

నాకు తెలియని దుఃఖంనుంచి నీకు తెలిసిన భయ దుఃఖపూరితమైన నమాజ్ దాకా ఏదో ఒకటి వింటూనే వుంటుంది. వెనక్కు వెడితే, దేహం లోపల వానపాముల్లా కదలాడే ఙ్ఞాపకాల వెంట నిశ్శబ్దశబ్దంగా మెలికలు తిరుగుతూ వెడితే, మొదటి రక్తస్పర్శపు ఎర్రగులాబీ పరిమళమా


మొదటి దేహంకోతలో నన్నుమృదువుగా యింకించుకున్నదానా, ఒకానొక మధ్యాహ్నంపూట నాకేమీ తెలియని, నాకు తెలిసీ తెలియని నీ దేహం లోపల నన్ను పిల్లల ఆటలలో బొమ్మల్లా, మిఠాయిపొట్లాల్లా దాచుకున్నదానా


ఒకానొక రాత్రిపూట నువ్వు


జాబిలి మధ్యగా రక్తపుచారికలా పగిలితే ఎవరూ లేని ఒంటరి వేసవి ఆకు అల్లాడని పనస ఆకుల రాత్రి మధ్య నేను ఒంటరిగా గాయపడితే, నామొదటి అర్థంకాని చందమామా నువ్వు నా ఎదురుగా గాజుగ్లాసులోని సూర్యజలంలాంటి పాపలా తిరిగి వస్తే , నేనేం చేయను? నా చేతి వేలు నుంచి, నింపాదిగా జారిపడుతున్న రక్తంబొట్లలా నేనెవరో తెలియని ఙ్ఞాపకం మృదుమెత్తగా రాత్రిలా కదులాడుతుంటేనూ, నువ్వూ, పగటి మధ్యాహ్న సమయాలలోనూ కదులాడిన క్రైస్తవ బిడ్డ కూడా, గుండెలో యింకించుకున్న బాధలా ఎదురుపడితేనూ, యీ సముద్రమంతానూ, యీ పొంగిపోవడమంతానూ


చాలా రోజుల క్రొతం

పేరులేని, ‘నేను’లేని రోజుల క్రితం

నాదయిన ‘నేను’ లేని వ్యక్తావ్యక్త రోజుల గాఢమైన అలల మధ్య నిశ్శబ్దశబ్దంగా తేలాను. తేలికగా, మోయలేనంత తేలిక బరువుగా కదలాడాను.


గది ఎదురుగా కూర్చుని ఎదురుగా కదలాడే మామిడాకుల బాషను అనువదించటం నైరాశ్యం. అదృశ్యంగా దేహాన్ని పలుకరించే గాలి వేళ్ళను కళ్ళతో స్పృశించటం నైరాశ్యం. అస్థిత్వమంతా కరిగిపోయి, ఒక చిన్నినీటి చినుకులోకి యింకిపోయి వుండటం నైరాశ్యం.

వైద్యులు దానిని ఖచ్చితంగా నైరశ్యమే అన్నారు.

మరి ,ఒక దాగుడుమూతల మత్తు రాత్రి మధ్య నువ్వేమన్నవు?”నువ్వెప్పుడూ ఎందుకంత దిగులుగా వుంటావు”


నా భాషలో చెప్పాలంటే అస్థిత్వం= దేహం=దిగులు=అనంతం. ఎందుకంటే జీవితానికి ఒక గతం భవిష్యత్తు లేదని నమ్మినందుకు కావొచ్చు.

యిప్పుడు యిక్కడ వుండేదే జీవితం

అని విశ్వసించినందుకూ కావొచ్చు. కానీ, యివన్నీ మరో  జీవితపు శకలాలు. తునాతునకలయిన నా భాష మధ్య యిరుక్కున్న ప్రియురాలు తరువాత అతడితో చెప్పింది. ” నేను కూడా యిప్పుడు శకలాలలో జీవిస్తాను. ప్రతి తునకలోనూ పూర్తిగా యిమిడిపోయి, దేహంలోని రక్తాన్ని మరికొద్దిగా దానిలోకి వొంపి నిశ్శబ్దశబ్దంగా జీవిస్తాను. కారా మీరందరూ నాదేహ జీవితపు, జీవిత దేహపు శకలాలు?”

ఏమయినా అయి వుండవచ్చు

విసురుగా పగిలిన గ్లాసుగాయపు వెలుతురులాంటి మధ్యాహ్నపు అంధకారంలో వేగంగా కమ్ముకుంటున్న ప్రాచీన కోరిక. ఒకటి: నువ్వు మరుగుతున్న రక్తపు భూమిలా వున్నావు.రెండు: నువ్వు ఆవిరయ్యిన వెన్నెలలా, జాబిలి నల్లటి మేఘాల మధ్య మాయమయ్యి ఆకాశమంతటా వొదిలివేసిన వెన్నెల పరిమళంలా.

“మొదటి భాష ఆమెది.రెండవ పలవరింత అతడిది

Metaphors of desire.

నేనిప్పుడు రజస్వలను మతపరంగా అపవిత్రను”

తెరకమ్మిన ముస్లిం జాబిలి నవ్వుతో ఆపై వొదిగిపోయిన కోరికతో గూటిమధ్య కదలాదే పక్షిపిల్లలాంటి దేహాల కంపనతో ఆపై వర్షపు సాయంత్రం వర్షానంతరాన మట్టి రహదారుల పక్కగా ప్రవహించే సన్నటి నీటిపాయల్లాంటి వేళ్ళతో ప్రవహించింది. అతడు అన్నాడు:


“నీ లోపల అంతం కాని చెలమొకటి వుంది. యీ రోజది రక్తంతో నిండి వుంది. యింకా యీరోజు నేనొక రక్తపిపాసిని”

సరిహద్దులు లేని కోరిక. ప్రేమ. నా సారాంశం మొత్తమూ రక్తభరితమయ్యేదాకా  అదొక ఎరుపు గులాబీల నదిలో పురాతనమైన విరామపు నిదుర. నిదుర నుంచి నిదురలోకి, కలలోంచి కలలోకి,

ఆ పై


చాలా రోజుల తర్వాత అనేకానేక వున్మత్త వుద్రేక పసుపుపచ్చటి సమయాల తరువాత గాయం.

దేహం బ్రతికి వున్న గాయం .

ఆమె తన గురించి కొద్దిగా చెప్పుకొన్నప్పుడు తన తల్లిదండ్రుల గురించి పూర్తిగా కన్నీళ్ళతో శబ్దించినప్పుడు ఆమె దేహం మట్టిపై పారాడే మేఘం, యింకా మరింతగా పదమూడేళ్ళ వయస్సులో బలాత్కరింపబడిన పెనుగులాట రాత్రి గురించీ, చీకటిలో ముళ్ళపోదల దేహంలోకి చొరబడిన కంఠం తెగిన చీకటి గురించీ ఆమె చెప్పుకున్నప్పుడు, తండ్రికి తెలియకుండా తల్లి చేయించిన అబార్షన్ గురించీ తెల్లటి పింగాణి వంటి ప్లేటులో కదలకవున్న ఎదిగీ ఎదగని పిండం గురించి తలుచుకున్నప్పుడల్లా యిప్పటికిన్నూ

ఆమె కళ్ళలో రెండు రక్తం బావులు.

ఆమె పరిపూర్ణమైన గులాబి. ముస్లిమ్ గులాబి. రేకులపై ఎండుతున్న రక్తపు చారికలుగల శబ్ధించే గులాబి. ఎప్పటికి గుర్తుండే వొళ్ళు విరుచుకున్న మసక చీకటి మధ్యాహ్నం వర్షపుచుక్కల సవ్వడి సమయాలలో సుదూరం నుంచి వస్తున్న నక్షత్రాల కాంతిగొంతుతో రాలిపోతున్న వుల్కల మంద్రమైన వేగంతోనూ, అశాశ్వత శాశ్వతమైన స్వరంతో ఆమె చెప్పింది.


“నేను చేసిందేమిటి? యింటి చూట్టూ వున్న మట్టిలో కదులాడిన మొక్కల్ని ప్రేమించినట్టు మనుషులను ప్రేమించటం నేరమా? నాకు ఏమీ అక్కరలేదు. కొద్దిగా ప్రేమ . మరికొద్దిగా ప్రేమ. మరికొద్దిగా నమ్మకం. జీవించేందుకు”

పెదాలపై ఎండిపోయిన సముద్రం .ఉప్పు.కంపిస్తున్న దేహం.

అటువంటి మహొద్రేకమైన రోజుల తర్వాత కడుపు చుట్టూ కడుపు లోపలా సుడిగుండాల్లా అలుముకున్న రోజుల తర్వాత.

ప్రశాంతత

వర్షం వెలసిపోయి వుండవచ్చు. కాటుక మేఘాలు కరిగి దేహపు ఆకాశం తెరపిగా మారి ఉండవచ్చు. బీభత్స  అలజడులను దేహం నిశ్శబ్దంగా తట్టుకొని వేపవృక్షంలా పరావర్తనం చెంది వుండవచ్చు. పల్చటి ఎండ కనుల మైదానాలపై లేతగా అలుముకొని, సంధ్యా సమయాన ఎటువంటి ఘర్షణా లేకుండా నిండుగా వున్న సరస్సులా ఆమె మౌనంగా అతడి వేళ్ళతో పెనవేసుకొని కూర్చింది.

ప్రశాంతత

చిర్నవ్వు

శాంతి

అవి సమయాలు. రక్తం సన్నటి సెలయేరులా ప్రవహించే సమయాలు. దేహం మృదుగమ్మత్తు కాంతితో ప్రసరించే సమయాలు. శూన్యం తన చూట్టూ తాను ముడుచుకున్న శంఖంలా, సముద్రపొడ్డున సముద్రం ఘోషను తనలో మౌనంగా యిముడ్చుకొంటున్న  శంఖంలా మారుతున్న సమయాలు. అతడు చెప్పాడు.:


” శాంతి వుండవచ్చు. ప్రాచీన కాంతిపుంజంలా శాంతి మన చుట్టూతా కప్పుకొని వుండవచ్చు. దానిని తనువుతో స్పృశించేందుకు ప్రేమ కావాలి. ఓర్పు కావాలి. అంతకు మించి దుఃఖాలకు కారణాలు వెతుక్కునే ధైర్యమూ కావాలి”

ఆకాశానికి నిర్లక్ష్య స్వేచ్ఛతో ఎగిరిన ఒక పక్షి. చందమామను మధ్యగా ముద్దాడుతూ వెడుతున్న మేఘమొకటి. మేఘం వెనకగా నల్లటి తడితో కదలాడుతున్న నక్షత్రమొకటి. సమస్తాన్నీ కౌగలించుకొంటూ రెపరెపలాడుతున్న గాలి కూడా. నిశ్శబ్దపు ప్రేమ కూడా.

అతడు చెప్పాడు.”అత్యంత ముఖ్యమైన విషయాలన్నీ దాగుని వుంటాయి. వాటి సరళత్వంచేత సాన్నిహిత్యంచేత. మనమొకదాన్ని గమనించనిదెందుకంటే అదెప్పుడూ మన నయనాల ముందు వుండటం వలన”

అంతకంటే సరళమైన భాషలో అతడు చెప్పాడు ఒక చిర్నవ్వు సంఘర్షణతో: “కొన్ని ప్రియమైన రూపాల విలువ వాటి సమక్షంలో తెలియదు. తెలిసే లోపల దేహపు రూపాలు మిగిలివుండవు”

యిప్పుడే ఉన్నటువంటి దూరసమయాల తర్వాత

ఆమె సాన్నిహిత్యపు దూరంలోకి వెళ్ళిపోయింది. యిప్పటిదాకా యిక్కడే వున్నదేదో వున్నట్టే మాయమయినట్టు ఆ వేకువఝామున అంతదాక అక్కడే కనిపించిన మనిషి ఆకస్మికంగా కత్తుల దెబ్బలకు వొరిగినట్టు ఆ తర్వాత హిందూత్వపు గుంపొకటి తెల్లాటి దూడలాంటి, ఆ ముస్లిమ్ కుర్రాడి షాపు తగులబెట్టినప్పుడు, ఆ ముస్లిమ్ జాబిలి కంపిస్తూ రెక్కలు విరిగిపోతున్న పావురంలా అడిగింది.

“వీళ్ళెందుకిలా మనుషుల్ని చంపుతారు. ఆ ముస్లిమ్ అమాయకుడు. తల్లి లేని అతడి షాపును తగులబెట్టి వాళ్ళు ఎటువంటి ఆనందాన్ని పొందుతారు?”

అతడు మాట్లాడలేకపోయాడు. అటువంటి హింసాత్మక జుగుప్సాభరిత క్షణాలలో ప్రపంచ మొత్తం మంటల్లోపడ్డ పాప పెన్సిల్ చిత్రమయినప్పుడు మరొక మూల యిరవైవేల మంది బోస్నియా ముస్లిం యువతులను చెరచినప్పుడు, దేహం రెండు కళ్ళుగా మారి  రెండు కళ్ళు రెండు అల్లకల్లోల నదులుగా మారి నదులు హిమపర్వతాలై భరించలేనంత స్వంత హిందువు వునికిగా మారినప్పుడు అతడు మాట్లాడలేకపోయాడు. ముస్లిమ్ సీతా మాగ్దలీనా,

తెలుపు నలుపు గులాబీ పరిమళమా

నా దేహం నాకే పరాయిగా మారుతుంది. అటువంటి కాంతి తెగిన సమయాలలో దేహం తునాతునకలవుతుంది. అస్థిత్వం నుదుటి మీద బొట్టూ, వేసుకున్న దుస్తులుగా మారిన జుగుప్సాభరిత సమయాలలో నా హిందూత్వపు దేహం నగ్నంగా మారి నడివీధిలో నిలబడుతుంది. జీవితపు అర్థం  కుంకుమబొట్లలోనూ గణేష్ నిమజ్జనాలలోనూ పాతిక రూపాయలు పెట్టి కొనుక్కోబడుతున్న గంగాజలంలోనూ, మణికట్టు తెగి ఆత్మహత్య చేసుకోబడుతుంది. ఆమె కళ్ళనుంచి రాలిపడ్డ రెండు రక్తం బొట్లలోనూ యింకిపోతుంది.ఆమె అంది:

“నా అస్థిత్వం నా మతమేనా? నేనంటే వొట్టి నా పేరేనా, నేను మాట్లాడే నా భాషేనా?”

నేనేమి అర్థం చేసుకోగలను. నేనొక నీలాంటి , నీ ఆలోచనలాంటి శకలపు చీకటి మరక నీడను మాత్రమే. నువ్వు నన్నొక తుఫాను సముద్రంగా మార్చినప్పుడు గిల గిలా తన్నుకులాడుతున్న మేఘాల మధ్య యిరుక్కుని మెరుపులా బయటపడుతున్న కాంతి రేఖలా మార్చినప్పుడు, ముస్లిం ధరిత్రీ నేనొక నాకర్థమయ్యీ కాని స్వప్నంలా మారాను. నేను నీ స్వప్నంలా మారాను.నీ వేళ్ళ చివర్ల అసంఖ్యాకంగా మొలకెత్తి కదలాడే యింద్రజాలపు వెదురు పూలపొదల స్వరాల్లాగా కూడా మారాను.

తరువాత

ఒక స్వప్నం వుండింది. రెండు కళ్ళు (నీ నిష్కల్మషపు కళ్ళు) సుధీర్ఘంగా అనంతంగా సాగిన ఆకాశపు చారికలలాంటి హస్తాలూ వుండినాయి. వాటిని కుదించినట్టు, ఒక వేడిశీతలమయపు కౌగిలీ వుండింది. అన్నింటినీ మించి నిరంతరం దేహాన్ని రెండు పెదాల్లా మార్చి, రెండు పెదాలయి అద్దుకునే మెత్తటి మంద్రభరితమైన పెదాలూ వుండినాయి.

ఒక స్వచ్ఛమైన ప్రదేశం:దేహం

రెండు దేహాలు కలసి పోయి వొక దేహంగా మారేంత వరకూ రెండు కలలూ కలసి పోయి వొక చీకటి స్పర్శలా మారేంతవరకూ లేదా రెండు ప్రపంచాలూ మిళితమైపోయి  వొక వుధృత ప్రశాంత అమ్మమ్మలాంటి దుఃఖభాజన పరివాహక ప్రాంతంలా మారేంతవరకూ,లేదా ఆ సాయంత్రపు సముద్రపొడ్డున పక్కపక్కనే ఆనుకొని నడుస్తున్న వృద్ధ దంపతుల మగ్గిన జీవితపు సుగంధపు ప్రేమలా మారేంతవరకూ ప్రేమించిన అనేకానేక యుద్ధాలతో సంఘర్షించిన దేహం ఇది. ఈ దేహం ఎవరిది.? నీదా?(నీ ముస్లీం మంసపు మల్లెల పరిమళాలదా?) లేక నాదా?ఇప్పటికి ఇటువంటి అనామధేయపు వొంటరిలాంటి కలసి ఉన్న జ్ఞాపకపు ఆప్యాయత క్షణాలలో నాన కళ్లలా లేదా అతడు మృదువుగా నేర్పించిన ఆటల్లా తిరిగి వచ్చే జ్ఞాపకాలు ఎవరివి?ఖురాన్ను తృణీకరించిన రజస్వలరతి ప్రియురాలా ,నేనెవరిని?నా దేహం ఎవరిది? నేను స్త్రీత్వాన్నా లేక పురుషత్వాన్నా?ప్రతిసారి ధూళిలో లేదా వర్షంలో మిళితమయ్యే వానపాములాంటి జీవితంలా పునరావృతమయ్యే ప్రశ్న.జవాబు కూడా.నాకున్నదంతా నీ దేహం.నీ స్వప్నం.నీ కోరిక.నీ వాంచ.నిజానికి నేను నీలా మారాను.ముస్లీం రక్తం.వేకువఝామున పొడిచే నమాజ్.దర్గాలో ప్రశాంతంగా నాపక్కన చేపపిల్లలా తాకుతూ యిదులాడిన పాదపు స్పర్శ.యింతియాజ్ నువ్వెవరు? నేనెవరు? యీ రెంటి మధ్యలో సాలెగూడు లతల్లా కొట్టుకులాడుతూ గడుస్తున్న   జీవితపు మిణుగురు మహా కాంతి ఎవరు? యిన్నాళ్ల తర్వాత -మొలకెత్తిన అనాథ మొక్కలా-నిశ్శబ్ధశబ్ధంగా యింకుతున్న సత్యం.నీ జాబిలిరక్తపు గాఢమైన గాఢమైన వుమ్మిలాంటి,వుమ్మి లాంటి తడి స్పర్శ లాంటి సత్యం.నా ముస్లీం రంజాన్ తొలి జాబిలి -other is the self -మార్పుకు మరోవైపు.


self is the other.Reversal.జీవితం కూడా అదే అయి వుండవచ్చు.selfనుంచి otherలేదా other నుంచి self కు మారేందుకు సంఘర్షించడం.పున్నమి నాడు సముద్ర తోకలపై రౌద్రంగా లేచిన సర్పాల అలల్లా పైకెగసి వెన్నెల వృత్తాన్ని అందుకునేందుకు ప్రయత్నించినట్టు:ప్రపంచమంతా వెన్నెలతో దహించివేస్తున్నప్పుడు  కూడా చీకటి వుంటుంది.నెగళ్ళ మధ్య రాత్రి అదృశ్యమైనట్టు,నువ్వు గమనించగలిగితే,మౌనంగా నిశ్చలంగా ఉన్న పనస చెట్టులా నిశ్సబ్ధంగా గమనించగలిగితే నేను  ఆ చీకటిని లేదా మంటల నాలికల మధ్య కదలాడే రాత్రి ఉమ్మిని,లేదా లాలాజలంతో లోపలికి ఇంకుతున్న పెదవి తెగిన రక్తపు చుక్కను కూడా.


మార్పుకు మరొక వైపు


ఇటువంటి నైరాశ్యపుస్తబ్దత రాత్రిళ్ల నడక తర్వాత


మత్తుభరితమైన లేదా మత్తుభరిత స్థితానంతరం ఉండే ప్రశాంతమైన సముద్ర నైరాశ్యపు స్థితిలొ ఆకాశలో మరో మూలగా రాలిపోయిన నక్షత్రమొకటి .పురాతన లిపి మధ్య అనామక వాస్తవ్యుడొకడు.సుదూరపు ఆకాశపు అంచుల్లా తునాతునకలు చేసే మానవుడొకడు జన్మించాడు.తర్వాతర్వాత అతడ్ని దేవుని బిడ్డని అన్నారు.మరో భాషలొ విప్లవకారుడు కూడా.reversal.నేను మరొక భాషలో, మరొక sexలోని దానిని మార్చుతాను.దట్టంగా మబ్బులు కమ్మిన దిగులు పూరిత రాత్రి మధ్య స్త్రీత్వపు రూపమొకటి అంబరం మధ్య చీకటిలో గీసిన అగ్గిపుల్లలా సన్నగా మండుతూ కదలాడింది.లేదా ,సాగదీసిన మెరుపు నక్షత్రంలా దేహాకాశపు మధ్య కత్తి కోతలా గీయబడింది.జీసస్ జీవించినప్పుడు వాళ్ళు చెప్పారు కదా “ప్రేమ జనించింది. యీ భారమయపు దుఃఖాల్ని దూరం చేసే  ప్రేమ లేదా యిటువంటి  హింసాత్మక కమిలిన చర్మంపై శీతలంగా తిరుగాడి settleఅయ్యే మృదువైన స్పర్శొకటి జనించింది”.

ముస్లిమ్ ఊర్మిలా మాగ్దలీనా

నేను నీ గురించి ఆలోచిస్తాను. దేహంతోటి రక్తంతోటి నాకున్న వొట్టి కలల దీపపు వృత్తాకారపు కాంతితోనూ నీ గురించి నేను నీడలా ఆలోచిస్తాను. మార్పు వస్తుంది. బాధైన కానీ కన్నీటి తెరల వుప్పు మట్టిపెళ్ళలాగైన కానీ.కానీ ప్రేమ వస్తుంది. నిశ్శబ్ద శబ్దంగా, ఒక రాత్రి పూట సడీ సవ్వడీ లేకుండా దేహం పక్కగా కదులాడుతున్న చీకటి గాలిలాగైనా మృత్యువులాంటి ప్రేమ వస్తుంది.

వేకువ ఝామున అమ్మలేచి పాతిక సంత్సరాల ప్రేమైక జీవితపు ఙ్ఞాపకాల దుప్పటిని కప్పుకుని వెచ్చగా పిల్లల్ని గమనిస్తూ, అతడి గురించి ఆలోచించినట్టుగా కూడా ప్రేమ వస్తుంది.

ప్రేమ. ఏమిటిది?

నేను పలుమార్లు నాలోకి నేనే పారిపొయి నాలోకి కూడా నేను పారిపోలేని దాక్కునే క్షణాలలో నీలోకి వొదిగి ప్రశ్నించుకున్నట్టు, నా ప్రేమైక దుఃఖ వూబి పూలు విచ్చుకున్న అసంఖ్యాక కౌగిళ్ళ వక్షోజాలదానా

ప్రేమ. ఏమిటిది?

నిజానికి యింతమందినీ యిన్నివేల సంవత్సరాలుగా బ్రతికిస్తున్న ప్రేమ మొగలిపూల యింద్రజాల మత్తు పరిమళమేమిటి? యింకా, యిప్పటికీ దుప్పటిపై అదృశ్య స్పర్శలా  పరుచుకున్నట్టు నువ్వు లేని నీ దేహస్పర్శపు ఙ్ఞాపకపు ప్రేమవాంఛా గాఢ పిచ్చితనమేమిటి? ఎక్కడనుంచి మొదలుపెట్టాలి? ఎక్కడ నుంచి అర్థం చేసుకోవాలి?అర్థపు  జీవన సారమంతా వేళ్ళ మధ్య నుంచి జారిపోయే నీటిపాయల్లా పారిపోతున్నప్పుడు

మాగ్దలీనా

బైబిల్ నుంచి వొళ్ళు విరుచుకుంటూ కలల మత్తుతో నిదుర తుంపర కళ్ళతో లేచొచ్చి, నగ్నంగా నన్ను రక్తంలో కలుపుకునేంతగా గాఢంగా కౌగిలించుకున్న

మాగ్దలీనా

స్వప్నమేఘపు చెలిమిలో కదులాడే నెలవంకా

నీవంటి , నువ్వే ఐన వర్షంలా తుంపరలా తుఫానులా దేహం పీల్చి పిప్పి అయ్యెటట్టు దేహాన్ని ఆవిరిగా మార్చి దేహంలోకి యింకించుకునేంతగా

ప్రాణప్రదమైనదాన్నెదో వొడిసిపట్టుకున్నట్టు నన్నూ నాజీవితాన్ని నీ కనుల అంచుల కింద పదిలంగా దాచుకున్న అమ్మయీ, యిన్నిరోజుల తర్వాత నిన్ను మరొకసారి రక్తపు వుద్రేకతనంతో గాయపర్చుకుని తలుచుకున్నప్పుడల్లా, నేను మరోసారి దారితప్పి నా దేహపు అపరిచిత వీధుల్లో అనాధలా విలవిల లాడుతూ అయోమయంగా తన్నుకులాడుతున్నప్పుడల్లా

మాగ్దలీనా సీతా

నీదేహం మరోసారి గుర్తుకు వచ్చి మరొకరితో గడపలేని అర్థవంతమైన ప్రేమ గుర్తుకువచ్చి

సీతా మాగ్దలీనా

వర్షపు అరణ్యాల జలపాతాల పుత్రికా, నేనేంచెయగలను, రాత్రిపూట ఎవరూ లేని, ఒంటరితనంలో ఒక్కడ్నే ఒక బంగారుకాంతి తరంగపు గ్లాసుతో కూర్చుని, వృద్ధుడిలా అందరూ ఉండి అందరూ వదిలేసిన ఎవరూ లేని భాషలేని మనిషిలా యిలా వుండటం తప్ప ఏం చేయగలను?

ముస్లిమ్ మాగ్దలీనా

అసంఖ్యాక రోజుల సంవత్సరాల తర్వాత కూడా, యీ అక్షరాలు వీటి వెంట వున్న రక్తతీవ్రతకూడ చెప్పక మిగిలినదేదో కూడా  ప్రేమ కావొచ్చు. యిదంతా  అనివార్యమైన ఋతువుల్లాంటి జీవితానుభవం కావొచ్చు. యిదంతా, నా తల్లీతండ్రీ కావొచ్చు. యిదంతా నా తరతరాల చరిత్ర సారాంశాం కావొచ్చు.

తిరిగి చూసుకున్నప్పుడల్లా నాదేహంలో లోతుగా దిగబడ్డ నీ పాదముద్రలు.ఆ మృదు కఠిన పాదాలముద్రలలో లోతుగా మిళితమైన అమ్మ పాద ముద్రలు.వాటిలో కలసి పోయిన అమ్మమ్మ కలల పాదాల సజల వృత్తాలు.నాదేహాన్ని నేను పరికించుకుంటే గూడు కట్టుకున్న దట్టమైన అరణ్యాల జలపాతాల తండ్రి గూడులు.వాటిలో పక్షి పిల్లల్లా కదలాడే నా తండ్రి చిర్నవ్వు కలలు.మట్టి కలలు.చెమటకలలు.చుట్టూరా కురుస్తున్న అతడి తండ్రి కనుల వర్షపు మేఘాలు.వాటికి పైగా మృదువుగా కాంక్షించి గమనిస్తున్న నా తండ్రి తల్లి దయాపురిత కనులు.

.                                                 మాగ్దలీనా

నా అర్దాంతరపు వృద్ధాప్యపు తల్లీ!నేనేం చెప్పాలి?నేనేం చెప్పగలను?యీ దారీ తెన్ను లేని అపస్మారక అక్రమ క్రమంలో వొట్టిగా నిన్ను కాంక్షించడం తప్ప నువ్వు నేర్పించిన రంగులలోంచి నా జీవితాన్ని పునర్ నిర్వచించుకోవడం తప్పితే నేనేం చేయగలను?

నీ వలన నా తల్లిని మరింతగా అర్థం చేసుకోగలను.నా తల్లి వలన నిన్ను మరింతగా అర్థం చేసుకోగలను.నువ్వూ నా తల్లీ కలసి వొక రూపంగా కలగలసి పోయి నన్నొ దీపపు ధూళి పొగలా మార్చినపుడు  ఆ ఉదయం పూట శాంతియుతమైన చర్చి ముందు నిశ్శబ్దంగా మూసుకున్న నీ కనురెప్పల పైన నేను మౌనంగా మోకరిల్లడం తప్పితే చర్చి లాంటి నా తల్లి పాదాలపై నేను నా తల వాల్చడం తప్పితే,

ద్రౌపదీ మగ్దలీనా

నా రక్తము నేను వాంచించిన అస్థిత్వపు స్వప్నమూ అయినదానా,నేను శాంతంగా నీ ముందూ యిద్దరి చిర పవిటల నాడల మధ్య నిశ్సబ్దపు కంపనగా వొరిగి పోతాను.మత్తుగా తడిసిన మట్టి పొరల మధ్యకు వొక నీటి చినుకులా యింకిపోతాను.నిశ్శబ్దంగా భాషను దాటిన వొక అనుభూతి మధ్యలోకి కూడా కుంగిపోతాను.మరోమారు భాషను అనుభూతి చెందుతాను.నేనే నువ్వు.నేనే నా తల్లిని.నువ్వు నా అస్థిత్వపు నేత్రానివి.వైరుధ్యాలు లేని సీమల మధ్య రెండనుకున్నవీ,రెండుగా భావించినవన్నీ వొకటీగా కలగలసిపోయి కలలలోని కలల్లా,భూమిలోని నీటి పొరల్లా నువ్వేదొ నేనేదో తెలియని ప్రశాంతమైన సమయాల్లో మిగిలే యీ వాస్తవం

యింతకు మునుపే చెప్పాను



other is the self,self is the other

కానీ రెండింటి మధ్యా మిగిలే గాఢమైన ఖాళీల మధ్యే జీవితం నీటి చెలిమలా వూరుతుంది.రెండింటి మధ్యా నిర్వచించలేని,నిర్వచించకుండా మిగిలి పోయిన రహస్య ఖాళీల మధ్య జీవితపు కలలు,కనురెప్పల ఆకుల అంచులకు వేళ్ళాడే  మంచు బిందువుల్లా కదులుతాయి.కలలు ప్రేమ కావొచ్చు.వుద్రేకమైన కోరికలూ కావొచ్చు.స్వచ్ఛమైన ప్రక్షాళన దుఃఖం కావొచ్చుఅన్నీ అయిన కవిత్వమూకావొచ్చు. ఆమె ఆ రెండింటి మధ్యగా వున్న ప్రపంచాలలో సంచరించింది.

ఆమె- ఆమె దేహం కూడా. అందుకే, యింకా వెనక్కు వెడితే ఆమె అంది:

“నువ్వు మనుషుల్నెప్పుడూ ధైర్యంగా ప్రేమించి వుండవు. అందుకే నీకు మనుషుల్నేం చేసుకోవాలో తెలియదు . నువ్వొక ఎదిగిన బాలుడివి”

అది అతడి మూర్ఖత్వం అయి ఉండవచ్చు. మరింత సూక్ష్మంగా తన ప్రపంచం నుంచి బయటకు రాలేని ఒక బలహీనతయి వుండవచ్చు. అయినప్పటికీ, సుదూర సమీప సమయాల తర్వాత వ్రాసుకొనే నాలుగు నలుపు అక్షరాల మధ్య నుంచి కదలాడే గాయం; మొదటి స్వప్నాక్షరం నుంచి వెనువెంటే వస్తున్న గాయపు నీడలు కూడా

There’s no point in agonizing for nothing

అతడు తనకు తనే చెప్పుకొన్నాడు. యింకా పలుమార్లు యితరులకు.’యీ భూమిని మించి యీ ప్రపంచాన్ని మించిన మహత్తరమైన బహుమతి మానవుడికి మరొకటి లేదు.ఆ తరువాత నీడలు వొరుసుకున్న యినప గొలుసుల్లా గాలికి పాదం ముందు కదలాడితే వాటికి పైగా సన్నటి జాబిలికోత దీర్ఘంగా సాగితే యింకా ముందుకు సాగేందుకు పడే తపన ముందు కొద్దిగా ప్రేమ మరికొద్దిగా రాజకీయాలు.

చాలా దూరం నడచామనుకున్న ప్రయాణించామనుకున్న అలసట విరామం మధ్యలో, ఆకస్మికంగా బయలుదేరిన చోటనే వున్నామని గ్రహించిన అసహనపు స్థితి. ఒక నిస్సహాయత. ఒక అకారణ కోపం జీవితపు రంగుల గీతలు అస్తవ్యస్తంగా మారిన దిగులు దుఃఖం కూడానూ.

ప్రయాణమంటే ఏమిటి?

Between the points,life and death,lies this scorching earth


వొక ద్వీపంపై ఒంటరిగా నిలబడి,నలువైపులా అనంతానంతంగా పరుచుకున్న ఆకాశపు ప్రతిబింబపు నీటి మెరుపుల్ని గమనించడంలాంటి స్థితి.ప్రపంచమంతా, మనుష్యులంతా జంతుదిగులు కళ్ళ ప్రేమస్పర్శంతా అదృశ్యమయ్యి ఒంటరిగా,ఙ్ఞానంలేని చేష్టలుడిగిన స్థితిలో స్తంభించిన మానవుడి స్థితి కూడా. నగ్నఛాతిపై బిడ్డొకడు లేతహస్తాలతో పాకినప్పుడు ఆ తండ్రి వొక్కసారిగా లోనైన ఆనందపు నిర్లిప్త నిర్వికారపు స్థితి కూడా కావొచ్చు.

అనేక రకాల నిర్వచనాలు. ప్రవచనాలు.

నిశ్శబ్దంగా వున్నందుకు. నటించకుండా మునుపే ఇవ్వబడిన పాత్రల ప్రతీకలలో జీవించనందుకు. ఒకటి: ముందుగా వైద్యం,వాళ్ళు నైరాశ్యమన్నారు. రెండు: స్నేహితుడొకడు’నీకేం కావాలో నీకు తెలీకపోవడం వలన”న్నాడు.మూడు: అతడి తండ్రి అకారణ నైరూప్య విషాదమొద్ద”న్నాడు. అతడి ప్రియురాలు “నువ్వు నాకర్థంకావన్న”ది. మరికొంతమంది దుఃఖమనీ. మరి కొద్దిమంది తాత్వికతనీ అన్నారు.

నిర్వచనాలు. నీ వచనాలు.

వచనాలు చాలు. విచ్చుకునే పగటికాంతి కిరణాల్లా,ముందుకువచ్చి వెనక్కి వెళ్ళిపోయే అలల కాంతి తరంగాల్లా,వొట్టి వేదనలు. తమదైన ఙ్ఞానపు పరిధిలో other ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడాను. జీవితమింతే అయివుండవచ్చు.

నిర్వచనాలు. నీ వచనాలు. ప్రతీకలు.

అతడిలోని మరొకడు మరొక సమయంలో వ్రాసుకున్న అక్షరాలు.

“I have lived, laughed and cried over a few images”

అసంఖ్యాక ప్రపంచాలు. అసంఖ్యాక దట్టమైన అడవుల మధ్య ఎవరి పాదాలు  తాకని దారికై వెతుక్కునే ఒక  multiple single vision  విశ్వంకై తన్నుకులాడే నావికుడను కూడా నేను. అదే అతడు కూడా.

ఆ తరవాత సమయాలలో సమయాలు కలగలసి పోయినాయి.

సంధ్యా సమయపు దుమారపు గాలిలో కొట్టుకు పోతున్న రంగు వెలసిన చిన్న ఆకుల్లా,ధూళి రేణువుల్లా దేహం కూడా తునకలయ్యి నలుదిశలా అదృశ్యంగా చిలకరించబడుతుంది.అటువంటి సంధ్యాచీకట్లలో,వొకడు అసంఖ్యాకంగా విడిపోయే క్షణాలలో పనస చెట్టు మధ్యలో వాలుతున్న మసక వెన్నెల పావురాలను గమనిస్తూ అతడు అడిగాడు.

నేను అంటే ఏమిటి?

మట్టిలో కదిలే దేహమా లేక యీ దేహం ప్రదర్శించే క్రియలా,లేక యీ దేహం లోపల కదలాడే పదాల పరిమితులా?యివన్నీ అయిన,యివన్నీ కానిదేదో కూడా నేను.

రాత్రి పూట దీపపు కాంతిలో వృత్తాలుగా గిరికీలు కొట్టే పురుగు.సాగిన నీడలలోకదలాడే అదృశ్యరహశ్య తెమ్మెర.నీడల అంచులను తాకుతూ స్తబ్దుగా వున్న గడ్డిరెమ్మలు.అక్కడక్కడా అస్పృశ్యంగానిశ్చలమైన కనులతో చూస్తున్న పొదలు.రాత్రిని మించిన సౌందర్యం మరొకటి లేదు.రాత్రి చీకటిని మించిన సౌందర్యాత్మకమైన హింస మరొకటి లేదు.అటువంటి సమయాలలో మరొకచోట ఆమె మౌనంగా గాయపడుతూ  ఉంది.ఆసుపత్రి తెల్లటి గోడల సమాదుల మధ్య అపస్మారకంగా పడి ఉంది.కడుపులోని బిడ్డ వాంతి చేసుకొని,ఆ ద్రవం,ప్రేమా తప్పమరేమిలేని గుండెలోకి బురదలా చొచ్చుకవచ్చినపుడు అందరు ఉండి ఎవరూలేక మరణపు మునివేళ్ళను తాకుతూ ఆమె నిశ్శబ్ధ సంబాషణ సాగిస్తూ ఉండింది.

ఆమెకు రక్తం కావాలి

.

రక్తపు ఊపిరి కావాలి.మరణపు మంచు కొండల మధ్య రక్తపు మంట కావాలి.దేహాన్ని వొణికించే గ్లూకొజ్ తెరల మధ్య యీ జీవితాన్ని జివించేందుకు రక్తపు ప్రియుడు కావాలి.


“ఎంతమందికి యీదేహాన్ని యిచ్చాను.ఎంతమందియీదేహపు గుహలో ఆదిమ మానవుల్లా తలదాచుకున్నారు.దేహం ప్రాచీన గుహగా మారేంతవరకూ గుహ గోడలపై వీర్యపు ఉలులతో చెరగిపోని చిత్రాలను చెక్కేంతవరకూ మరెంతమంది యీదేహాన్ని సృష్టించుకున్నారు.నిజానికి ప్రేమ భాషలో ప్రియుళ్ళంతా ఆదిమ కట్టెల మంటలయితే నేనొక వేటాడబడి కాల్చబడే జంతువును అయ్యాను. నేను దారి తప్పిన ప్రయాణికురాలి నయినప్పుడుల్లా వాళ్ళు నన్ను భక్షించారు”.

మాంసపు రుచి.దేహం.మాంసపు పురాతన స్మృతి


ఆ తర్వాత అతడు చెప్పాడు. “యిదంతా అవ్యక్త చరిత్ర..పగటి పూట కనిపించని వెన్నెల పూల కథ.రాత్రి కీచు రాళ్ళతో ఉదయించేదాకా నువ్వు జ్ఞాపకం రావు.అందుకనే విసిగి వేసారిన ప్రతీకలతో పౌరాణిక స్త్రీ కూడా విచ్చుకున్న భూమి పొరల మధ్యకు వెళ్లిపోయింది.


ఆ తరువాత సూదులు నరాల్లోకి పలుగూ పారల్లా దిగబడక మునుపు ఆమె నవ్వుతో(వొక హిందుత్వపు గుడి ముందు) కుండలోంచి ముంచిన చక్కని నీటి లాంటి మాటలతో చెప్పింది.

“విసుగు పుట్టించే పునరావృతాలు.విసుగు పుట్టించే ప్రతీకలు.నేను అలసి పోయాను.నా దేహపు చందమామలతోటీ,సీతాకోక చిలకలతోటీ కనుల సముద్రాలతోటీ వక్షోజాల పరిమళాలతోటీ హస్తాల ప్రశాంత నదులతోటీ అలసి పోయాను.ఈ చరిత్ర ఎవరిది?ఈభాష ఎవరిది?ఈ తత్వం ఎవరిది?ఏది నా కీర్తన?ఏది నా ప్రార్థన?ఏది నాకోరిక?History is linear,like a desiring phallus.చివరికి భాష కూడా మర్మాంగమే.History can’t be – leave alone being the touch of warmth mensus -even a sanitory napkin “ఆమె,తన తల్లి కూడా.ఆమె తల్లి ఆమె కూడా.


ఆమె ఎవరు?


ఆమె అంటే ఎవరు?


వొకప్పుడు ఆమె ప్రశాంత ఆకాశాన రెక్కలు నీలి తెరచాపల్లా పరచి తిరుగాడే రహస్యడేగ.మరోసారిక్షుద్ర ప్రతీకలభాషలో,ఆమెసౌందర్యపు పెదాలతోసమస్తాన్నీపరిమళంతో అద్దే వెన్నెల గులాబి.


తరవాతర్వాత


వొంటిగంట రాత్రి పూట వేసవి శీతల వెచ్చటిగాలిని నింపాదిగా గాట్లు పెట్టే సారంగి.అతడొకనాడు నైరాశ్యపు నిశ్శబ్దంలో చిక్కుకొని చేపలా విలవిల లాడుతున్నప్పుడు లేదా నైరాశ్యపు స్తబ్దతలొ మరణపు మత్తుతో మూతలు పడుతున్న కనులతో వొక పలవరింత.ఎక్కడకన్నా వెళ్లాలి.వెళ్ళిపోవాలి.ఎక్కడకైనా,యిక్కడనుంచి,నాకే తెలియని ,నేనూహిస్తున్న అవ్యక్త అదృశ్య ప్ర్రపంచంలోకి తునకలు తునకలుగా రాలిపోవాలి.అని అంటున్నప్పుడు,


ఆమె మరణపు సరిహద్దుల మధ్య మెత్తటి పాదాల గజ్జెలతో తచ్చట్లాడుతూ మౌనంగా చెప్పింది;”ఎక్కడకు వెడతావు.యిక్కడ నుంచి మరెక్కడకు?యీ మనుషుల్ని వొదలి యీ దేహాలనుంచీ,గుండె చప్పుడ్ల నుంచీ కాంతి నుంచీ మెరుపుల్నుంచీ,ప్రేమ పూల కనకాంబరపు వర్షంనుంచీ కాంతి నుంచి మెరుపుల్నుంచీ కన్నీళ్ళ మేఘాల్నుంచీ నువ్వు ఎక్కడకు పారిపోతావు.నేను తిరిగి రావాలి,యీ ప్రపంచం నుంచి మరలా భూమి పైకి రావాలి.మరలా మనుషుల్ని ప్రేమించాలి.మరలా గాయ పడాలి.మళ్ళీ ప్రేమించాలి.నన్ను చూడు.నిశితంగా గమనించు.నన్నూయీ దేహాన్ని.”


రంగు కోల్పోతున్న ఆకాశంలా రూపం.వొక అస్పష్టపు శ్వేత కాంతి.నెమ్మదిగా కుంచించుకు పోతున్న ప్రమిదల కాంతి.మృదువుగా నదిలోకి జారిపోతున్న యిసుక కాంతి.చాలా నెమ్మదిగా కారి పోతున్న రక్తంలా.ఆమె నుదుటిపై రూపరహితంగా కదలాడుతున్న గాలి తెరలేవో ఆమెతో గుసగుసలాడుతూ ఆమె చేతి వేళ్ళ అంచులను పట్టుకొని తమతో పారాడించుకొంటూ,తీసుకొని వెళ్ళేందుకు సిద్దమయినట్టు కూడా పల్చగా తెర మరుగవుతున్న ప్రియ స్నేహితుడి నీడలా మసకబారిన మధ్యాహ్నం మహానగరాన్ని చీకటి వలల  అలల్లా కమ్ముకుంటున్న సూర్యగ్రహణపు చీకటి తుఫానులా


అతను అన్నాడు “వెళ్ళకు నన్నువొదిలి.నేను నీకు చెప్పాలి.నేను చెప్పని కథల్ని.నావీ,నా తల్లివీ.వెళ్ళకు నన్ను వొదిలి.నేను నీకు చెప్పాలి.నేను చెప్పని కలల్ని.నేను నీతో సంభాషించాలి.మరొక్కసారి.పూర్తిగా.సంపూర్ణ శాంతితో.వెళ్ళకు”.


పెదవులపై ఎండి పోయిన రక్తపు బొట్టు.మూసుకున్న కళ్ళపై నుంచి దీర్ఘమవుతున్న నీడల వృక్షాలు.కళ్ళ కింద అగాధాలవుతున్న నెగళ్ళు.


“వెళ్లకు .నేను నీతో చెప్పాల్సిన విషయమొకటుంది.నువ్వొకసారి కనులెందుకు విప్పార్చవు?నీ ఎదురుగా దిగులుగా వీక్షించే నీటి చెలమల్ని ఎందుకు తాకవు? రా, హస్తాల్నందుకొని ,నీ హస్తాల్ని నువ్వే బలంగా అదుముకొని నిద్రా తెరల్ని చీల్చుకొని బయటకు రా,నువ్వొక సారి యీ భూమిపైకి తిరిగి రా.నేను నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.


మిత్రురాలా,నేను నిన్ను ప్రేమించాల్సిన సమయాలు చాలా ఉన్నాయి.నిన్ను నేనూ నీవాళ్ళందరూ మోసగించాల్సిన సమయాలు చాలా ఉన్నాయి.తిరిగి రా.మరణించకు.నేను నిన్ను ప్రేమించాను.నేను నిన్ను గాయపర్చాలి.నిన్ను మరొక్కసారి చిర్నవ్వు కన్నీళ్ళతో చూడాలి.నిన్ను మరొక్కసారి నగ్నంగా గమనించాలి.నిన్ను మరొక్కసారి రజస్వలగా రమించాలి.వెళ్ళకు.రా మరణించకు.అన్నింటికంటే నువ్వు వినాల్సిన,వ్రాయాల్సిన చరిత్రలున్నాయి.అసంఖ్యాకంగా.”


మరోదారి లేదు


అప్పుడే స్నానం చేసి వచ్చిన సబ్బు వాసన దేహం చుట్టూ అగరొత్తుల పొగల పాముల్లా చుట్టుకున్నట్టు మరింతగా,ఆమెకు మాత్రమే వచ్చే సువాసన.అప్పుడే ఆర్పి వేయబడిన దీపపు మెరుపు లాంటి జ్ఞాపకం లాంటి మెత్తటి పాదాల తడి.మరింత దూరంలో మరింత నిశ్శబ్ద  దూరంలో కూడా వెనువెంటే చిటికెన వేలు పట్టుకొని తడబడే అడుగులతో నడిచే పాప లాంటి స్పర్శ.


అతడు ఆమెకోసారి చెప్పాడు.”నేనొకసారి తప్పక నీవొక అద్భుతమైన  నీలాంటి సౌందర్యవంతమైన కవిత రాస్తాను.వొక కవిత.శ్వాసించే,మృదు మదురంగా విచ్చుకొనే గడ్డి పూవు లాంటి కదలికలు గల కవిత”


మరో దారి లేదు


రాత్రి పూట గదంతా ప్రశాంత స్తబ్దతతో ప్రాణం పోసుకుంటున్నప్పుడు లయబద్దంగా వినిపించే గుండె చప్పుడు.కలల గుండె చప్పుళ్ళతో కలలను తట్టి లేపుతున్నప్పుడు,పెదాలపై పెదాలను ఆన్చి వూపిరిని పోస్తున్నప్పుడు


మరో దారి లేదు


వచ్చి వెళ్లిపొయే గాలిలా యిటువంటి వెచ్చని పనస ఆకుల రెప్పల సవ్వడి సువాసనలా,నిజానికి మరోదారి లేదు.నువ్వు వెళ్ళిపొతావు.ముఖ్యంగా సమయంలో చిట్లే సూర్య కాంతిలా;నలువైపులకు,మట్టినీ నీటినీ వృక్షాలానూ జంతువులనూ (ముఖ్యంగా నామృగ తృష్ణనూ) కమ్ముకొనే సూర్య సాలీడు గూడులా నువ్వు వెళ్లిపొతావు.ఆతరువాత అతడిలోకి  అతడే,వొక పేడ పురుగులా,వడ్రంగి పిట్టలా తవ్వుకుంటూ లోపలికి  లోలోపలికి



మరోదారిలేదు


అదే అతడు కూడా చెప్పింది.నేను నిశ్శబ్దగానే వెళ్లిపోతాను.ఆ తరువాత నేను దానిని పొడిగిస్తాను.ఎవరూ గమనించని గాలిలా,వున్నంతసేపూ గమనించని ప్రేమలా,నేనూ నిశ్శబ్ధంగానే వెళ్లిపోతాను.మా అమ్మమ్మలా,తాతయ్యలా,నిశ్శబ్ధంగానే మధ్యాహ్నపు మట్టి తవ్వుకుంటూసాగుతున్న ఎడ్ల నాగలి నదిలా,పగుళ్ళిచ్చిన పురాతనమైన  నా పూర్వీకుల కలల్లా,మరోసమయంలో విచ్చుకునే,మట్టిలో నాటిన కలలు,ప్రేమ కలలు విచ్చుకోవడం చూడకుండానే వెళ్ళిపొతాను.నిశ్శబ్ధంగానే ,మృదు నిశ్శబ్ధంగానే .


మరో దారి లేదు


యీ రాత్రి.ముఖ్యంగా యీ రాత్రి.


మరో దారి లేదు


సుదూరంలో అదృశ్యమైన కాంతి తరంగాలు;వొక వృత్తంలా తిరిగి వచ్చే సందర్భపు రాత్రి.వచ్చి మెరుపులా శిరస్సులోంచి  పాదాల్ని చీలుస్తూ భూమిలోకి  వెళ్ళిపోయే                  కాంతి తరంగాలు.వెళ్ళిపోవడం నిశ్సబ్దంగానే,కానీ ,బ్రతికుండగానే వేటాడే నీదైన శరీర భాషా స్పర్శ.దానిని నేనేం  చేయగలను? సతమతమయ్యే తాత్విక ప్రశ్నల మధ్య ,సరళంగానైనా “నేను” ఏమిటి? “నువ్వు” ఏమిటి? అనే తాత్విక ప్రశ్నల మధ్య,శ్లేష్మంలో ఈగలా విలవిలలాదుతున్నప్పుడు,నేను ఏం చేయాలి?


కొల్పోవడమంటే ఏమిటి? వుండడమంటే ఏమిటి?


భౌతికమంటే ఏమిటి?భౌతికం కానిదేమిటి?


ఆ రోజుల్లాంటి పసుపు పచ్చని రెక్కల్లాంటి నిమ్మ రంగు పారదర్శకపు శీతాకాలపు పగటి మధ్య వజ్రపు కత్తుల్లా మెరుస్తున్న నీటి మధ్యకు జారినపుడు పైకెలా తేలాలో తెలియక ,నీటి తునకల విశ్వపు ప్రపంచాలమధ్య పైకి రావాలో లేదో కూడా తెలియక నిశ్చలమవుతున్న వూపిరి స్థితి.


మళ్ళా మళ్ళా మళ్ళా పునరావృతమయ్యే, యుగాల నుంచీ నీడల్లా వెంటాడే ప్రశ్న.నేను. ప్రపంచం.రెండింటి మద్యా ఊగిసలాడే వంతెన లాంటిదేదో


Between life and deth lies this scorching earth


కానీ యిదంతా యెలా మొదలైంది? యిదంతా మొదలైందా లేదా కొనసాగుతున్నదేదో మొదలుగా పొరపడ్దానా?కానీ మొదలేదో,కొనసాగుతున్నదేదో లేదా అంతమేదో తెలిసేదెలా?


నిర్వికారంగా నేలకు రాలిపొయిన ఆకులు.స్తంబించి కూడా తాకుతున్న గాలి.అదృశ్యంగా తాకుతున్న జ్ఞాపకం.అదే అతడు కూడా.కానీ,అతడు? అతడు ఎవ్వరు? నువ్వెలా అతడెవరో నిర్ణయించగలవు? యీ నిర్మానుష్యపు కర్ఫ్యూ వీధులలో తిరుగాడే పోలీసు గన్నులా లేక రాత్రికి రాత్రి తన యిద్దరు పాలు తాగే పిల్లలను కోల్పోయిన పచ్చి పాల తల్లి రోదన అతడా? కోల్పోయిన తనానికి జెండర్ ఉంటుందా? రాత్రికి రాత్రే కోల్పోయిన బిడ్డ గురించి గుండెను కన్నీటి కత్తులతో కోసుకొని రోదిస్తున్న ముస్లీం అస్పృశ్యపు కేకలా?


ఏది నిజంగా otherness?


దేహం లోపల వొక భీతావహపు అగ్నిపర్వతం బద్దలయింది.ప్రేమను కలగాపులగం చేసే  వీధి దారుల మధ్య రక్తపు నెమళ్ళను పరిచే హింసాత్మక వర్షమూ మొదలయింది.అరలలో రహస్యంగా దాచుకున్న బల్లిగుడ్లు చిట్లినట్లు అరల మధ్య భద్రంగా వుంచిన బల్లిగుడ్లను వొక చీపురు తెమ్మెరతో ఊడ్చి వేసినట్లు,పదిలంగా ఉందనుకున్నదేదో ,పదిలంగా ఉండిన దనుకున్నదేదో మాయమవ్వడం ప్రారంభమయ్యింది.


వొక land slide :లేదా పునరావృతమయ్యే landslides.

అపుడెప్పుడో వేలిని కరుచుకున్న వుంగరం సంవత్సరాల తరువాత వేలిని కోస్తున్నంతగా చాలా నెమ్మదిగా చర్మం మట్టి పొరల్లోకి దిగబడుతుంది.కిటికీ పక్కగా మొక్కలా ప్రారంభమైన వొక పచ్చదనం సంవత్సరాల తర్వాత చీకటి బెరడులతో నిశ్సబ్దంగా వ్యాపిస్తుంది.కిటికి కనుగుడ్డుపై బిరబిరా పాకి తొగి చూసి తటాలున వెనక్కి తిరిగి అదృశ్యమయ్యే వుడత.దీపపు కాంతిలో మృదు చలనంతో సంఘర్షించే నీడలు సంవత్సరాల క్రితం స్వచ్చమైన చీకటిలో జన్మించలేదు.కొన్ని విషయాలు పునరావృతమవ్వకుండా పునరావృతమవుతాయి.


ఆమె ప్రేమలా

మరొక రోజు

మరొక సమయం.అప్పటికింకా ఎండిపోని నగరానికి కలలతో వచ్చినప్పుడు,యింకా కమలని గాయపు రక్తంలా సెప్టిక్ కాని పుండులా నగరం పచ్చిగా వున్నప్పుడు నెత్తి మీద వొట్టి కలల మూటతో,సుదూర  ప్రదేశాలకు పనికై నెత్తి మీద చద్ది మూట చంకలో పిల్లాడ్నేసుకొని పలుగు పారలతో కదలివెళ్ళినట్లు దేదీప్యమానంగా సుర్య కాంతిలో యీ నగరానికి వొచ్చినపుడు గతంలేదు.గతం అర్థాన్ని సంతరించుకోని వొక యిప్పుడు వొక రేపు మాత్రమే ఉండింది.


ఆమె నిశ్శబ్ధంగా నిశ్శబ్ధ యుద్ధ తీవ్రతతో అతడ్ని వాంచించినప్పుడు,వొక యిప్పుడు వొక రేపు మాత్రమే వుండింది. సమయం మంద్రమైన ప్రవాహంలా వర్షానంతరం బురదగా మారి పక్కగా విస్తరించిన గడ్ది గుప్పిళ్ళ మధ్య వృత్తాలుగా చేరిన నీటిలానూ వుండింది. రాత్రిళ్ళ పూట, చిట్లి అద్దపు తునకల్లా వుధృతంగా జారి పడే జలపాతంలాగా కూడా వుండింది.

వర్షమొచ్చినప్పుడు తడవడం,ఎండలో ఆవిరవ్వడం ,వొక పక్షి కూతలా మారి గాలిలోకెగిరితే వెనువెంటనే తనువు కూడా గానంలా మారడం.ముట్టుకుంటే స్పర్శగా మారి,వెదికితే సముద్రంలా,వూదితే అడవి వేణువులా మారడం తప్పితే నిజానికి ఏమీ లేదు.


ప్రవాహంతో పాటు పోవడమే తప్పితే ప్రవాహపు సౌందర్యాన్ని అనుభవించడం తప్పితే ఏమీలేదు.వున్నదంతా విత్తనంలా చిట్లే శరీరం.దట్టమైన కాటుక మేఘాల మధ్య మెరిసే మెరుపు పల్వరుసలాంటి చిరునవ్వు. సమయరహిత సమయంలా అలా నిలిచి పోయే ప్రశాంతత.వొక నదీమ పారిజాతాల కళ్ల ఆనందం. వొక మాట .వొక స్పర్శ.వొక స్వప్నం.అంతిమంగా మిగిలే వొక స్వచ్చమైన సారాంశం.


ఆ సుదీర్ఘమైనమధ్యాహ్న సమయాలలో,తన చుట్టూ దిగులు,దిగులు లాంటి కళ్ళతో నిలబడ్డ “పెద్ద పిల్లల్ని జ్ఞాపకాలలోనే,జ్ఞాపకాలుగానే చూచిన ఎనబై ఏళ్ళ వృద్ధుడు.తన చుట్టూ వృత్తాకారంలో బావిలోని నీటి వృత్తంలా పరుచుకున్న కన్న పిల్లల్ని ఆ నలబై యాబై ఏళ్ళ పిల్లల్ని ముప్పై ఏళ్ల క్రితపు భౌతిక రూపాలలొ కాంచి,తడబడుతూ మాట్లాడిన ఎనబై ఏళ్ళ కలల ముదుసలి.


అతడు చెప్పాడు. వూపిరి కోసం గాలిలో తడుములాడుకుంటూ “మీరు సంతోషంగా ఉండండి.నేను మీకు ఏమీ ఇవ్వలేక పోయాను.”బ్రతికి ఉన్న అస్థి పంజరం,సగం తెరచిన నోరు,కొసతాళ్ళ మంచం మీద వెళ్ళికల్లా పడుకోబెట్టిన,పై తాటాకుల కప్పు కేసి స్తబ్దుగా చూస్తున్న ఎండిన నయనాలు.


వేసవి.దేహం చుట్టూ అదృశ్యంగా కమ్ముకొనే చెమ్మ.యింతి వెనుక పచ్చగా వుండిన మామిడి చెట్టు మాయమై,భూమిపై వొట్టి మరకగా మిగిలినట్లు మరికొన్ని రోజుల తరువాత వొట్టి మంచం తప్పితే మరేమీలేదు.అక్కడక్కడా అతడు కదలాడిన పొగాకు వాసన తప్పితే మరేమీ లేదు.ఆవాసనలోంచీ సాగి నలుమూలలా స్థిరపడ్డ పిల్లలు తప్పితే మరేమీ లేదు.


మిగిలి లేదు. ఊహ తెలిసినప్పటినుంచీ అంతకు మునుపు నుంచీ నడుం వంచడం తప్ప విరామంగా పడుకున్న వూహ తెలీని,ముదుసలి పగుళ్ళిచ్చిన దేహం తప్ప,ఆ చిట్లిన నల్లటి ముఖంలో కనిపించే అమ్మ ముఖం తప్ప ఎండిన గీతల్లా పగులుతున్న అమ్మ ముఖం అమ్మమ్మ ముఖంలా మారుతున్నదృశ్యం తప్ప మరేదీ లేదు.మరెప్పుడో పక్షవాతంతో కదల్లేక మంచంపై నిశ్చలంగా పడి ఉన్నవృద్ధుడి మనస్సులో సంఘర్షణ తండ్రి హృదయంగా పరావర్తనం చెందుతున్న మార్పు వేగం తప్ప మరేమీ లేదు.వొక జీవితం.వొక కల. వొక ప్రేమ. మరెక్కడో మొదలయ్యి సాగి,నిశ్చలంగా పలు ప్రపంచాల్ని తడుపుతున్న వొక నది కూడా.


అదే అతను కూడా చెప్పింది. యితరులకు చెప్పినట్టుగా బలీయంగా ఊహించినది స్వప్నించినదికూడా,కాని అసంఖ్యాకమైన దారులున్నప్పుడు అసంఖ్యాకమైన దారులు చిక్కుపడి కలగాపులగంగా దారే లేనంతగా మారిపోయినప్పుడు,దేహమూ దేహంలోని సారాంశమూ కలలేవీ లేక,లేక కలలపై నమ్మకం కోల్పోయినప్పుడు,మరింత సూక్ష్మంగా కలలకూ వాస్తవాలకూ మధ్య ఉన్న,ఉన్నదనుకున్న సూక్ష్మమైన పరిధేదో చెరిగి పోయి.


ఉనికి క్షణక్షణపు  మనుగడ అవుతున్నప్పుడు,స్నేహితుడా సౌందర్యం హింస కాదా? జీవించడం హింస కాదా? యిమడలేని మరొ వాస్తవమేదో అదాటున తలుపు తట్టి అనుమతి లేకుండా జొరబడినప్పుడు,ప్రతి చర్యా హింసాత్మకంగా విచ్చుకొనే ఎర్ర గులాబీలు కావా? దేహం చుట్టూ పొరల్లా ఉన్న ప్రపంచమూ ప్రేమలూ మనుషులూ హింసాత్మక ప్రతికలు కారా? రాత్రి అనుకోకుండా ఎదురు పడ్డ ప్రశాంతమైన మృదు చిరునవ్వు హింస కాదా?అయి ఉండవచ్చు.కాక పోవచ్చునుకూడా.


అతను అలా మంచంపై ఈగలతో పొర్లుతున్నప్పుడు మల మూత్రాలతొ అభిషిక్తుడై స్పర్శ కోల్పోయి,వొక్క చూపులాంటిదేదో మిగిలి ఉన్నప్పుడు,మిగిలేది వొక కల.అది గతమయి వుండవచ్చు. భవిష్యత్తు అయి ఉండవచ్చు.మరింత సూక్ష్మంగా వొక కలా గతమూ భవిష్యత్తు కలగలసిన చర్యకు మరోపేరు అయి ఉండవచ్చు.


అవి క్షణాలు


యిప్పుడు నాకున్నటువంటివి.సూర్యోదయం సూర్యాస్తమాయమైనప్పుడు సూర్యాస్తమయం సూర్యోదయమైనప్పుడు,అటువంటి కలగలసిన రహస్యపు ఉనికి క్షణాలలొ మిగిలేది వొట్టి సంధ్యా సమయం మాత్రమే.అప్పుడప్పుడూఎల్లప్పుడూ అసంఖ్యాక పొరల మధ్య దారి తప్పిపోతున్నప్పుడు,వొక దారి ఉందనుకొని మరచి పోతున్నప్పుడు రాత్రి పగలుగా మారుతుంది.పగలు రాత్రిగా మారుతుంది.రెండూ కాని సమయాలలో ప్రపంచమంతా కాంతి పుంజాలతో నిండి పోతుంది.


అది స్వప్నమా?


అతడు ప్రశ్నించాడు.కానీ, ఏది స్వప్నం ఏది వాస్తవం?రెంటీనీ విడదీయగలిగిన అంతిమ సత్యమేదైనా వుందా?ఏదీ లేనపుడు ప్రియురాలా నిజానికి

నేను ఏమిటి?నువ్వుఏమిటి?


నేను ఊహిస్తాను.స్నేహం గురించీ స్వప్నం గురించీ. ఆతర్వాత మిగిలేదంతా అనంతం కాదా?గాలిలో కదలాడే అదృశ్య ఆకుల తునకల వేళ్ళ చివర్ల పరామార్శ కాదా?యివన్నీయివి అన్నీ ఏమయినా అర్థం చెపుతాయా?ఏమయినా?వేళ్ళ మధ్య యిరుక్కున్న బ్లేడు తునక నుంచి,యింకా తెగని మనికట్టు నరందాకా,మధ్యలో వుండే దూరాన్ని గురించి చెప్పటాన్ని చెప్పలేకపొవటం మధ్య వున్న ప్రాణమైన ప్రాణరహిత రక్తం మృదువుగా యింకిపోయే సౌందర్యపు హింసాత్మకపు ప్రక్రియ గురించీ  నువ్వు చెప్పాలి.నేనైనా చెప్పాలి.అర్థమూ అర్థ రాహిత్యం గురించి


జీవితం గురించి,జీవితం లాంటి దేన్నో గురించి


కొద్దిగా విరామం.యీ యుద్ధఖండికల  మధ్య వొద్దనుకున్నా గుమిగూడే జల తాకిడిల మధ్య నుంచి విరామం.విరామం స్పర్శ.విరామం ఉనికి.వునికి స్పర్శ.స్పర్శ జ్ఞాపకం.జ్ఞాపకం తిరిగి వునికి.అది అంతే.


అంటే ఏమిటి?


మళ్ళా నేను అర్థ రాత్రి దగ్గరకే వస్తాను.నేను మళ్ళా చీకటి సమయాలలోకే వస్తాను.దీనిని మించి నాకు మరో సమయము లేదు కనుక.నాలోకి నేను అదృశ్యమయ్యే సమయాలలోకి,నాలోకి నేను దారి తెలిసి తెలియని గుడ్డివాడిలా కరిగి పోయె సమయ రహిత సమయాలలో నా అంతట నేను “నేను”లా మిగిలే సమయాలలో నేను మరలా నా పాత ప్రాచీన ప్రతీకలలోకే వస్తాను.


Does one know what one is?

Does one know what the other is?


ఎప్పటికీ ఏమీ లేదు.


వుంది.యిదంతా వొక వున్మాద మత్తు సారంగి నావికుడి వున్మత్త ప్రేలాపన.ఆకాశమంతా స్తబ్దుగా మారిన తర్వాత మిగిలే నిశ్శబ్ధ శబ్ధం.ఏమీ లేదు.అంతా వుండీ ఏమీ లేదు.మరొక పదజాలంలో,అంతా వుండినట్లు వుండి ఏమీ లేదు.దేని గురించి యిదంతా?యీ భరించీ భరించలేనంత ప్రయత్నమంతా?యీ జీవిత ప్రేమ సంఘర్షణ దుఃఖ సంతోషమంతా?


ఆ తరువాత యీ ప్రశ్నల తరువాత

అతడు తిరిగి వస్తాడు.

30.01.1999 నుంచి 25.08.1999.

సీఫెల్,   హైద్రాబాద్.



3 అభిప్రాయాలు »కవితలు

3 అభిప్రాయాలు

  1. a.nagaraju Sep 7, 2009 1

    శ్రీకాంతు కవిత మానవ ప్రస్తానంలోని అన్వేషణను,తాత్వికతను తనదైన గొంతుతో వ్యక్తం చేస్తోంది.

  2. జాన్ హైడ్ కనుమూరి Sep 9, 2009 2

    చాలా కాలం తర్వాత శ్రీకాంత్ రచన చదివాను

    ప్రాణహితకు అభినందనలు

  3. ప్రాణహిత » సెప్టెంబరు 2009 సూచిక Oct 11, 2009 3

    [...] పురాకృతం – శ్రీకాంత్ [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో