సాహిత్య సిద్ధాంతవేత్తగా ప్రేమ్ చంద్

“సాహిత్యం ఔన్నత్యం పొందితేనే దేశం ఔన్నత్యం పొందుతుంది” — ప్రేమ్ చంద్

భారతీయ ప్రగతిశీల రచయితలలో మున్షీ ప్రేమ్ చంద్, శరత్ చంద్ర ముఖర్జీ, కిషన్ చందర్ వంటివి ఐతిహాసిక పేర్లు. ఈ ముగ్గురు బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషలలో రచనలు చేసి మొత్తం భారతీయులకు ఆత్మీయ రచయితలయ్యారు.సమకాలిక జీవిత వాస్తవికతను విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించి కళాకృతి నివ్వడం, రూపాన్ని పరిరక్షిస్తూనే వస్తువుకు ప్రాధాన్యమివ్వడం, సామాజిక నిబద్ధతతో ప్రజాపక్షం వహించడం వంటి ఆరోగ్యకర సాహిత్య పద్ధతులను తర్వాత తరాల రచయితలకు సిద్ధం చేసిన రచయితలు వీరు.వీళ్ళలో ప్రేంచంద్ కథా, నవలా రచయితేకాక మంచి ఆధునిక సిద్ధాంతవేత్త కూడా.ఆయన అభిప్రాయాలు ఏడు దశాబ్దాలకు మించిన ప్రగతిశీల సాహిత్యచరిత్ర తెలిసిన మనకు బాగా పరిచయమైనవిగా కనిపించవచ్చును కాని, 1936కు ముందు అవి ఒక కొత్తరకం సాహిత్య సృష్టికి మార్గదర్శకాలుగా ఉపయోగపడ్డాయి.

భారతీయ భాషా సాహిత్యాలలోని నాటి పెడ ధోరణులు పట్ల అసంతృప్తిలోంచి ప్రేంచంద్ సాహిత్య సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.ఆయనకు అప్పటి సాహిత్య ధోరణుల మీద, సాహిత్య విమర్శకుల మీదా సినిమాల మీదా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తున్నది. “మన కళలన్నీ యవ్వనపు ఉన్మత్తతలో మునిగి తేలుతున్నాయి”.కవులు సాధారణ జీవన సమస్యలను ఎదుర్కొనడంగాని, అందులో ఉన్న నగ్న సత్యాల ప్రభావాన్ని గుర్తించడం గాని చేయకుండా మానసికంగా కొంత దిగజారి పోయారు.అందువలన వారి రచనలలో మానసిక, బౌద్ధిక జీవనం చాలావరకు లోపించింది.”ప్రస్తుతం హత్యలతోనూ, బందిపోటుతనాలతోనూ, చెడు వృత్తులతోను అనేక నవలలు నిండి ఉన్నాయి.” పలాయనవాద బాధ్యతారహిత మార్గంలో ప్రయాణిస్తున్న సాహిత్యాన్ని సరైన మార్గంలో పెట్టడానికి, సాహిత్యాన్ని జీవితానికి దగ్గరగా తీసుకురావడానికి గోదాన్, రంగభూమి, కర్మభూమి వంటి నవలల్ని, ‘కఫన్’ వంటి కథానికలను రాయడమేగాక, సరైన సాహిత్యం ఎలా ఉండాలో సిద్ధాంతం చెయ్యడానికి కూడా ప్రేమ్ చంద్ ప్రయత్నించాడు. ఆ క్రమంలో’సాహిత్యం – ఉద్దేశం’, ‘జీవితం – సాహిత్యం’, ‘సాహిత్యానికి ఆధారం’, ‘సాహిత్యం – మనోవిఙ్ఞానం’ వంటి వ్యాసాలు రచించాడు.

దేశ వ్యాప్తంగా ప్రగతిశీల సాహిత్యం ఉద్యమ రూపమెత్తుతున్న నేపధ్యంలో ప్రేమ్ చంద్ ఆ దృష్టితోనే సాహిత్య ధర్మాలను సూత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఒక కొత్తరకం సాహిత్యం పుట్టుకొస్తున్న సమయంలో దానిని కావలిసిన సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేసే బాధ్యత అగ్రగామి రచయితల మీద ఉంటుంది. ప్రేంచంద్ ఆ బాధ్యత నిర్వహించాడు.

ప్రాచీన సాహిత్యంలో మతం, జీవితం విడదీయరానంతగా కలిసిపోయి ఉంటాయి. మత ప్రచారంకోసం జీవితం ఆధారమైందా, జీవిత చిత్రణకు మతం ఊతంగా ఉపయోగపడిందా చెప్పలేనంతగా అవి కలిసిపోయాయి సాహిత్యంలో. వస్తువులోను రూపంలోను ఈ వాస్తవం బాగా కనిపిస్తుంది. పాశ్చాత్యపాలన భారత దేశంలో స్థిరపడి, పెట్టుబడిదారీ నాగరికత మొదలైన దానిని ఆహ్వానిస్తూ కొత్త సాహిత్యం పుట్టుకొచ్చింది. పారిశ్రామిక నాగరికతకు, మతానికి సిద్ధాంతపరంగా సంబంధం లేదు.ఆధునిక సాహిత్యంలో కూడా మతం పాత్ర ఉండడానికి అవకాశం లేదు. సంఘసంస్కరణ, జాతీయోద్యమ సాహిత్యంలో మతం సంస్కరింపబడగా, భౌతికవాద ప్రాపంచిక దృక్పధం మీద ఆధారపడిన ప్రగతిశీల – అభ్యుదయ సాహిత్యం మతాన్ని తిరస్కరించింది, ప్రతిఘటించింది. అందుకే ప్రేంచంద్ “ఆధునిక సాహిత్యం మతానికి ప్రత్యామ్నాయం” అన్నాడు. ఆధునిక సమాజంలోను, సాహిత్యంలోనూ మానవుడు చరిత్ర నిర్మాత. మతం మత్తుమందు. ప్రాచీన సాహిత్యంలో దేవుని స్థానాన్ని, ఆధునిక సాహిత్యంలో మనిషి ఆక్రమించాడు. ఈ మనిషి పొలాలలో కర్మాగారాలలో ప్రజాసమూహాలలో శ్రమించే మనిషి. ఆమనిషి శ్రమ సౌందర్య చిత్రణమే ఆధునిక – అభ్యుదయ సాహిత్యం. ప్రేంచంద్ మతానికి ఆధునిక సాహిత్యం ప్రత్యామ్నాయం అనడంలో ఉద్దేశమిదే.

సాహిత్యం జీవితాన్ని సౌందర్యవంతంచేస్తుంది. అంతే కాదు జీవితంలోని సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. అయితే ప్రాచీన సాహిత్యం చిత్రించిన సౌందర్యం అంతఃపురాలలో నివసించే, శ్రమతో సంబంధంలేని అల్పసంఖ్యాకులది. భారతీయ పురాణేతిహాసాలు వర్ణించిన సౌందర్యం భారతీయ సమాజంలోని అధికసంఖ్యాకులైన శ్రామికులదికాదు.ఆధునిక సాహిత్యంలో శ్రమజీవన సౌందర్యానిదే అగ్రస్థానం.”అలినీల పరికుంచిత కోమల శకుంతల” స్థానంలోకి “, ముగ్గుబుట్టవంటి తల”లు వచ్చాయి.”సౌందర్యం సంపన్నులలోనే కాదు, సామాన్యులలోనూ ఉంది” అని గుర్తించిన ప్రేంచంద్ ఆ సౌందర్యమే ఆధునిక సాహిత్యంలో ఆవిష్కరణ పొందాలని అభిలషించాడు.”విలాసమందిరాలను, మనోరంజన సామాగ్రిని పోగుజెయ్యటం సాహిత్యకారుని లక్ష్యం కాదు” అని సిద్ధాంతంచేశాడు ప్రేంచంద్.

“జీవితాన్ని విమర్శించేదే సాహిత్యం” అన్నది అన్ని నాగరిక సమాజాలు ఆమోదించిన సిద్ధాంతం. ప్రేంచంద్ కూడా దీనినే అనేక పర్యాయాలు ప్రస్తావించాడు . కళ కళ కోసమేననే సిద్ధాంతాన్ని ప్రగతిశీల రచయిత అయిన ప్రేంచంద్ తిరస్కరించి కళ జీవితం కోసమని ప్రజల కోసమని నొక్కి చెప్పాడు. “నేటి సాహిత్యకారుడు జీవిత సమస్యలనుండి దూరంగా పారిపోలేడు” అని నిర్ధారించాడు.

సాహిత్య రచన కాలానికి ప్రతిబింబంగా నిలబడుతుందనే అవగాహనతో ప్రేంచంద్, సాహిత్యం కాలబద్ధమై ఉండాలన్నడు.సాహిత్యం కాలబద్ధమేకాదు, స్థలబద్ధంకూడానన్నది నేటి అవగాహన.వాస్తవికత లేదా సహజత్వం ప్రజాసాహిత్య ప్రధానలక్షణంగా భావించిన ప్రేంచంద్ వాటిని సాహిత్యంలొ పెద్దపీట వేశాడు.”రచనలో సత్యం సహజత ఉంటే ఆ రచన కొన్నిశతాబ్దాల వరకు కొన్నియుగాల వరకు మానవ హృదయాలను కదిలించుతూనే ఉంటుంది”. ఒక రచనలో ఎంత ప్రజాస్వభావం ఉంటే అది అంతకాలం ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంటుందన్నది ప్రేంచంద్ అభిప్రాయం.అయితే ప్రజాస్వభావం లేని రచనలు కూడామనల్ని శతాబ్దాలుగా మనల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి కదా!ఇందుక్కారణం మనలో గత సమాజ అవశేషాల పట్ల ఆకర్షణ ఉండటమే.

ఇప్పటికే తెలుగులో రచయితలు సామాజిక సమస్యల్ని ఆవిష్కరించి పాఠకులను ఆలోచనలు రేకెత్తించాలి తప్ప, వాటిని పరిష్కారం చెప్పవలసిన పనిలేదు అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.సామాజిక సమస్యలకు రచయిత పరిష్కారం చెప్పడం పాఠకుని కించపరిచినట్లేనని, రచయిత పాఠకుని వివేకం మీద విశ్వాసముంచాలని వీళ్ళు వాదిస్తూ ఉంటారు. 1935 ప్రాంతంలో కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన అభిప్రాయాలనే వీళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే కుటుంబరావు పరిష్కారాల గురించి మాట్లాడిన రోజుల్లోనే ప్రేంచంద్ ఏమన్నాడో చూద్దాం: ఇప్పటి సాహిత్యం కేవలం మనసును ఉల్లాస పరిచే వస్తువు కాదు జీవితంలోని సమస్యలను చర్చిస్తూ వాటిని పరిష్కరిస్తోంది కూడా” ” జీవిత సమస్యలను పరిష్కరించడానికి జీవితాన్ని సుఖవంతంగాను, అర్థవంతంగాను చేయటానికి సాహిత్యం ఉపయోగపడటంకంటే ఎక్కువ ఉపయోగం ఏమీ ఉండదు”. ప్రపంచయుద్ధాలు, స్వాతంత్రోద్యమం, ఆకలి ముప్పైలు, తెలంగాణా విమోచనోద్యమం – ఇన్ని కొనసాగుతున్న కాలంలో కుటుంబరావు అలా అనడంలో ఔచిత్యం కనిపించడంలేదు.తీరిక సమయంలో అనవలసిన మాటలను ఆయన తీరికలేని సమయంలో అన్నారు. మన రచయితలు విమర్శకులు ఆయన అభిప్రాయాలనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా పునరుక్తం చేస్తూనే ఉన్నారు. ప్రేంచంద్ ఆలోచనల్ని గుర్తించడం నేటి మన కర్తవ్యం.

‘సాహిత్యానికి జీవితమే ఆధారమని’ నమ్మే ప్రేంచంద్ సమాజంలోంచి పుట్టిన సాహిత్యం సమాజంపైనా ప్రభావముద్ర వేస్తుందని భావించాడు.”సాహిత్యం మన జీవితాన్ని స్వాభావికంగాను, స్వతంత్రంగాను ఉంచుతుంది.అంటే మన హృదయాన్ని సంస్కారవంతంగా ఉంచుతుంది. ఇదే దాని ముఖ్యోద్దేశం”. సాహిత్యానికి జన్మస్థానం గమ్యస్థానం సమాజమేనన్నది ప్రేంచంద్ మాటల అంతరార్థం.అంతేకాదు స్వాతంత్రోద్యమ కాలంలో రచనలు చేసిన ప్రేంచంద్ సాహిత్యం ఉద్యమాలకు కూడా ప్రేరకశక్తిగా పని చేస్తుందని కూడా భావించాడు.”సాహిత్యం దేశభక్తి, రాజనీతి వెనుక నడిచే నగ్న సత్యమే కాకుండా వాటి ముందు ఉండి కరదీపికను చూపించే మార్గదర్శి కూడా”. వ్యక్తిని, సమూహాన్ని స్వావలంబులుగా, క్రియాశీలురుగా చెయ్యని సాహిత్యం చెత్త బుట్టలో పడుతుందని ఏ భాషాసాహిత్య చరిత్ర చూసినా అర్థమౌతుంది. ” మనలో ఉన్న సుందర భావాలను జాగృతం చేసి క్రియాత్మకశక్తిని ప్రేరణ కలిగించటమే సాహిత్య కర్తవ్యం”. అని ప్రేంచంద్ అన్నదిందుకే.

సాహిత్యంలో భాషకన్నా భావానికి ప్రాముఖ్యముందని భావించే ప్రేంచంద్ కు ప్రాపగాండకు, సాహిత్యానికి మధ్య ఉండే తేడా స్పష్టంగా తెలుసు. ” శుష్క విషయాలను ప్రకటించేది ప్రాపగండా. అనుభూతి కలిగించేది సాహిత్యం”. ఎవడేం చెప్పినా బాగుండడంలే” అనే గిరీశం తత్వాన్ని సాహిత్యంలో ప్రేంచంద్ అంగీకరించలేదు.”వ్రాయబడిందంతా సాహిత్యమంటే నేనెప్పుడు అంగీకరించను సత్యాన్ని వ్యక్తీకరిస్తూ, భాషా ప్రౌఢంగాను, సుందరంగాను, ఉండి మనస్సుమీదా మేధస్సు మీదా ప్రభవం చూపించేది మాత్రమే సాహిత్యమనాలి” అని స్పష్టంగా చెప్పారయన.

మానవ జీవితంలో సాహిత్య పాత్ర మహా ఉన్నతమైనదని ఆయన అభిప్రాయం. సాహిత్యమే లేకపోతే మానవ జీవితమే లేదనేంత దూరం వెళ్ళారాయన. “మన సభ్యత సాహిత్యం మీదనే ఆధారపడి ఉంటుంది. మన జీవితమంతా, చివరికి మనం కూడా సాహిత్యం ద్వారానే నిర్మింపబడ్డాం.”

సాహిత్యం గురించి ఇంత గొప్పగా భావించిన ప్రేంచంద్ సాహిత్యకారుడైన రచయితను గురించి కూడా మహోన్నతంగా ఆలోచించాడు. ఆయన రచయితకు గొప్ప స్థానమిచ్చాడు. అదే సమయంలో రచయిత మీద గొప్ప బాధ్యత కూడా పెట్టాడు. మనం ఇవాళకూడా రచనలో రచయితకు, సమాజంలో రచయితకు తేడా కనిపించినప్పుడు విమర్శిస్తూఉంటాం. మనసమాజంలో రచయితకు గౌరవనీయ స్థానముంది ప్రాచీనులు కవిని అపారమైన కావ్య సంసారానికి ప్రజాపతిగా భావించారు. ఆధునికులు అప్రకటిత శాసనకర్తగా భావించారు. ఎందుకింత గొప్ప స్థానమిచ్చారు? వాళ్ళలో ఉండె సృజనాత్మకశక్తే కారణం. ఆశక్తితో రచయితలు సమాజానికి అనేక ఆదర్శాలు ప్రబోధిస్తారు. సమాజానికి ఆదర్శాలు బోధించే రచయితల్లో అవి ఉన్నాయా అని సమాజం ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. తేడా కనిపిస్తే విమర్శిస్తుంది. అందుకే ప్రేంచంద్ “సాహిత్యకారుడు ఎప్పుడూ ఆదర్శవాదిగా ఉండాలి. మన సాహిత్య వేత్తలు ఈ ఆదర్శాలను కలిగి ఉండకపోతే మన సాహిత్యం శుభం చేకూరుస్తుందనే ఆశలేదు”. వీటినే మనం ఇవాళ నిబద్ధత, నిమగ్నత అంటున్నాము.

రచయిత అంటే అద్దాలమేడలో ఒంటి స్తంభపుమేడలో కూర్చునేవాడు కాదని, కాల్పనిక ఏడ్పులు ఏడ్చేవాడు కాడని అందరిలోనూ, అందరితోనూ కలిసిపోతూ తనలో అందరిని, అందరిలో తనను చూచుకోగలిగిన ప్రజాస్వామికవాదేనని ప్రేంచంద్ సూత్రీకరించాడు.”తనభావాలతో ఆదర్శాలను నింపి ఆత్మైక్యాన్ని సాధించి అన్ని ప్రాణుల భావాలు తన భావాలే అనుకునేవాడే నిజమైన సాహిత్యకారుడు.”తన బాధనే ప్రపంచ బాధగామార్చేవాడు కాదు, ప్రపంచ బాధనంతా తన బాధగా భావించేవాడే నిజమైన రచయిత అని ఆయన అభిప్రాయం.అంతే కాదు రచయిత సమాజంలో తాను కనుగొన్న సుఖ దుఃఖాలను రచనల ద్వారా ఇతరులలో కలుగజేయడం కర్తవ్యంగా ప్రబోధించాడు.”లోకంలో ఉన్న సుఖ దుఃఖాలలో భాగం పంచుకొంటూ ఇతరులలోకూడా సుఖ దుఃఖాల అనుభూతులను కలుగజేయగల్గినవాడే నిజమైన సాహిత్యకారుడు” రచయిత ఎప్పుడైన సమకాలిక వాస్తవాలకు నిబద్ధుడై ఉండాలన్నది కూడా ఆయన సిద్ధాంతం. ” సాహిత్యకారుడు కాలప్రవాహానికిలోనవుతాడు.” అందుకే రచయితలు దేశ కాల పరిస్థితులను దృష్తిలో ఉంచుకొని రచనలు చెయ్యాలని తమ రచనల్లో వాటిని ప్రతిఫలించాలని పేర్కొన్నాడు.

ప్రేంచంద్ సమకాలిక సాహిత్య విమర్శకుల పట్ల కూడా అసంతృప్తితో ఉన్నట్లున్నాడు. అప్పటి సాహిత్య విమర్శపట్ల కూడా పెదవి విరిచాడు.” నిజమైన సాహిత్యం విమర్శ మీదనే ఆధారపడి ఉంటుంది. అప్పటి సాహిత్య విమర్శకులు సమకాలిక సాహిత్యాన్ని విస్మరించి ప్రాచీన కావ్యాల ప్రశంసలోనే ఉండి పోవటాన్ని అధిక్షేపించాడు.”ప్రాచీన గ్రంథాలనీ పొగుడుతూ కూర్చుంటే లాభంలేదు.” అని చురక వేశాడు. దేశాన్ని సాహిత్యం ద్వారా సంపన్నం చేయాలని, సాహిత్యం ద్వారానే దేశంలో భావైక్యతను కలుగజేయాలని ఆయన ఆశయం. ఈ ఆశయం నెరవేరాలంటే విమర్శకులు వర్తమాన సాహిత్యం దగ్గరికి రావాలని ఆహ్వానించాడు.

ఆయన సాహిత్యాన్ని రచయితల, విమర్శకుల కార్యకలాపంగా మాత్రమే చూడలేదు. సాహిత్యాన్ని సమాజంలో అన్ని రంగాలవారికీ చెందినదిగా, సమిష్టి సంపదగా భావించాడు. ఏ రంగంలో కృషి చేసే వాళ్ళైనా సాహిత్యంతో సంబంధం కలిగుండాలని అభిప్రాయపడ్డారు.”మనకంటే యూరప్ సాహిత్యం అభివృద్ధి చెందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.అక్కడ సాహిత్యమంటే ఆసక్తి చూపి అధ్యయనం చేసే వాళ్ళు ఎక్కువ. ప్రతీ నాయకుడు, మంత్రి, ప్రొఫెసర్లు, మతాచార్యులు సాహిత్యంతో సంబంధం కలిగి ఉండటం తమ కర్తవ్యంగా భావిస్తారు. నగర దృశ్యాలను చూచి ఆనందించినట్లు, షికారులు చేసి ఆనందించినట్లే సాహిత్యాన్ని చదివి వాళ్ళు అనందం పొందుతారు.సాహిత్యం కూడా జీవితంలో ఒక భాగమని అనుకొంటారు. కాని మన దేశంలో పుస్తకాలు చదివితే చెడిపోతారనుకుంటారు.” 1936 కు ముందు ప్రేంచంద్ అన్న మాటలు మన దేశానికి ఎక్కువ వర్తిస్తాయి. రాజకీయాలకు, శాస్త్ర, సాంకేతికరంగాలకు ప్రాముఖ్యం పెరిగిపోయి సాహిత్యం నిరాదారణకు గురవుతున్నది. దాని ఫలితం చట్ట సభలలో, బహిరంగసభలలో, ఉద్యమాలలో అరాచకాల రూపంలో కనిపిస్తూనే ఉంది. సాహిత్యంతో సంభంధం లేకుండా తీసే సినిమాలలో బూతుసాహిత్యంగా చెలామణి అవుతున్నది. ప్రభుత్వం అన్ని సామాజిక రంగాలలో సాహిత్య సంబంధాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

ప్రేంచంద్ సాహిత్యం పట్ల ఎన్నో విలువైన అభిప్రాయాలు, ప్రగతిశీల ఆలోచనలు కలిగిఉన్నాడు. మతానికి సాహిత్యం ప్రత్యామ్నాయం అని ధైర్యంగా అన్న ఆయన భగవంతునిలో విశ్వాసం నిలుపుకోవడం ఆశ్చర్యకరమైన వైరుధ్యం. ” జీవితం పరమాత్ముని సృష్టికావడం వలన అనంతంగాను, అబోధంగాను, అగమ్యంగాను ఉంటోంది.”. ” మనలో నిజమైన సాహిత్యవేత్తలు, తపస్సంపన్నులు ఆత్మఙ్ఞానులు ఉద్యమించాలని భగవంతుని ప్రార్థించుదాం.” . “భగవంతుడు ప్రసాదించిన శక్తి అన్నిటికంటే విలువైనది”. ఈ వైరుధ్యాలు ఇప్పటికే అనేకమంది ప్రగతిశీల రచయితలలో ఉండడం వాస్తవం.ఇవి పరిష్కారమైతేనే స్పష్టత వస్తుంది.

ఏమైనప్పటికి ప్రేంచంద్ భారతీయ సాహిత్యం ప్రగతిమార్గంలో ప్రయాణించడానికి అవసరమైన సిద్ధాంతాలను మనకందించాడు. ఆయన మనకు చిరస్మరణీయుడు.

“దేశంలోని విలువైన సంపదంతా సాహిత్యాదర్శాలమీద ఆధారపడి ఉంది” — ప్రేంచంద్

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. raman Sep 19, 2009 1

    శరత్చంద్ర్ చటర్జీ నా లెక ముఖెర్జీనా?
    నాకు చటర్జీ అని గుర్తు.

  2. ప్రాణహిత » సెప్టెంబరు 2009 సూచిక Oct 11, 2009 2

    [...] సాహిత్య సిద్ధాంతవేత్తగా ప్రేమ్ చంద్ … [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో