Sep2009
శ్రీశ్రీ ని జనం దృష్టితో చూడాలి
శ్రీశ్రీ శత జయంతి ప్రారంభమయిన తర్వాత వస్తున్న వ్యాసాలను, కవితలను ఇతరత్రా అన్నిటిని చూచిన తర్వాత నాకీ వ్యాసం రాయాలనిపించింది.
శ్రీశ్రీ పట్ల మనం గౌరవంగానే స్పందిస్తున్నాం. మహాకవి, యుగకవి , ఈ శతాబ్ధం కవిగా ఆఖరుకు మన కవిగా మనం మహాకవి శ్రీ శ్రీని ఆకాశానికెత్తాం ఇదంతా బాగానే వుంది. అయితే శత జయంతి ప్రారంభమైన తర్వాత తెలుగు సాహిత్యం శ్రీశ్రీని ఏకోణం నుండి తలకెత్తుతుంది ? – అసలు ఏ కోణం నుండీ శ్రీశ్రీని తిలకించాలి ? – అనే రెండు ప్రశ్నలొస్తాయి.
అసలు శ్రీశ్రీ ఎవరూ ? –
ఎవరి కోసం కలం పట్టారు ?
ఎవరి కోసం కవిత్వం వ్రాసారు ?
జీవితమంతా ఎవరి కోసం తపించారు ?
ఏ రకమైన ఉద్యమాలలో, పోరాటాలలో పాల్గొన్నారు ?
ఈ ప్రశ్నలకు వచ్చే జవాబులకు, ఇపుడొస్తున్న శతజయంతి ఆర్టికల్స్ కు ఏమైనా సంబంధముందా ?
శ్రీశ్రీ జనం కవి, విప్లవకవి, మరో ప్రపంచం కవి, అంతరాలు లేని వ్యవస్థ వైతాళికుడు శ్రీశ్రీ అటు వంటి మహాకవి హిమాలయాల వ్యక్తిత్వాన్ని దిగజార్చటానికి ‘ శతజయంతి ‘ ని వాడుకోవటానికి కొందరు కుట్రపన్నుతున్నట్టు కనిపిస్తుంది. శ్రీశ్రీ నిర్వహించిన పాత్రను భవిష్యత్ చరిత్రలో వక్రీకరణ చేయటానికి ‘శతజయంతి’ ని ఒక సాధనంగా వాడుకొంటున్నట్టు భావించాల్సివుంటుంది. లేకపోతే శ్రీశ్రీ సృష్టించిన సాహిత్యంలోని అంతరంగాన్ని వదిలిపెట్టి, దగాపడిన . తరతరాలుగా దోపిడికి గురి అవుతున్న జనం కన్నీళ్ళు కష్టాలు, తిరుగుబాటుకు అంకితమిచ్చిన ‘వస్తువు’ ను వదిలి ‘ పదాల’ అందం వెంట పరుగుతీయటం అర్థంకావటంలేదు.
శ్రీ శ్రీ పదాల అందాలను మెచ్చుకుంటున్నారు వాక్య నిర్మాణ సొగసును మెచ్చుకుంటున్నారు. శబ్దసౌందర్యాన్ని మెచ్చుకుంటున్నారు. వస్తువు జోలికి వెళ్లటం లేదు అసలు’వస్తువు’ తోనే శ్రీశ్రీ మహాకవి అయ్యారు . ‘యుగకవి’ అయ్యారు ఈ శతాబ్దం కవి అయ్యారు. విప్లవ కవి అయ్యారు కాదనలేని సత్యమిది.
దగాపడిన తమ్ముల్లారా !
ఏడవకేడవకండి
వస్తున్నాయ్
వస్తున్నాయ్
ఎవరి కొరకు వ్రాసారు ?
” కమ్మరికొలిమీ , కుమ్మరి చక్రం
జాలరి పగ్గం
సాలెల మగ్గం ”
ఎవరు వీరు ? శ్రీ శ్రీ సాహిత్యంలోని ‘శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు ‘
నా వినుతించే,
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతిక
నా విరచించే నవీన రీతిక
భావం !
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం !
అన్నారు శ్రీశ్రీ తనవస్తువేమిటో తన పదాల సౌందర్యం ఎందుకొరకో, తన సాహిత్యం ఎవరికోసమో చెప్పారు శ్రీశ్రీ
” దగాపడిన తమ్ములార
మీ కోసం కలం పట్టి”
అన్నారు శ్రీశ్రీ శతజయంతి స్పందనలో “దగా పడిన తమ్ముళ్ల” ప్రస్తావనే లేదు.
” స్వాతంత్ర్యం
సమభావం
సౌభ్రాత్రం
సౌహార్థం పునాదులై ఇళ్ళులేచి
జనావళికి శుభంపూచి”
అన్నారు శ్రీశ్రీ. 60 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత దేశంలోని స్వాతంత్ర్యం సమభావం గూర్చి ఇపుడున్న పరిస్థితి గూర్చి ఎవరూ ప్రస్తావించటంలేదు కన్నీరు కార్చటంలేదు . కార్చిచ్చు అవటంలేదు . వీరికి జన మంటే ప్రేమలేదు కానీ శ్రీశ్రీ అంటే ప్రేమ ఇదెక్కడి ప్రేమ ! జనాన్ని ప్రేమించలేని వాడు శ్రీ శ్రీని ఎలా ప్రేమిస్తాడు ?
దగా దగా
కుడి ఎడమల దగాదగా
అన్నట్టుగా వుంది శ్రీ శ్రీ శతజయంతిపై స్పందన
ఏ సాహిత్యానికైనా వస్తువే ప్రాణం తన వస్తువును ప్రజలకు అంకితం చేశాడు కాబట్టే శ్రీశ్రీకి ఇంతపేరు ! శత జయంతిలో ఆకాశమెత్తు మన నివాళులు.
“అలజడి మాజీవితం
ఆందోళన మాఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం “
అని స్పష్టంగా చెప్పిన శ్రీశ్రీ విప్లవ ధోరణిని విస్మరించి ‘శతజయంతి’లో ఆయన తాగుడు ను ఎజెండా చేయటం ఆశ్చర్యం, బాధకల్గించే విషయం. ఎన్నోవ్యాసాలలో తాగుడు ఎజెండా అయ్యింది. వ్యక్తిగత పరిచయాల నేపధ్యంలో ఈ తాగుడును వ్రాస్తున్నారు. ఇది అవసరమా? కావాలనిచేస్తున్న కుట్రగానే నా అభిప్రాయం
‘ కదిలేది కదిలించేది
మారేది మార్పించేది
పాడేది పాడించేది
పెను నిద్దర వదిలించేది
మునుముందుకు సాగించేది
పరిపూర్ణపు బ్రతుకిచ్చేది
కావాలోయ్ నవ కవనానికి ‘
అన్నారు శ్రీ శ్రీ మార్పు కు దోహదం కలిగించేది అసలైన సాహిత్యం. అది శ్రీ శ్రీకి నిజమైన నివాళి
జనమంటే కొందరికి భయం భయం
శ్రీశ్రీయే వారి కంటే నయం నయం
3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
రవికిరణ్ తిమ్మిరెడ్డి Sep 11, 2009 1
మధు గారు,
శ్రీశ్రీ శతజయంతి పేరు చెప్పుకుని, శ్రీశ్రీని వ్యక్థిగా విమర్సించటవో, లేకపోతే ఆయన మీద వ్యాసంలో తమ గొప్పలు చెప్పుకోవటవో చదివి చదివి అసహ్యవేసిన మనసుకి క్లుప్తంగానైనా, సరళంగా సూటిగా బావుంది మీ వ్యాసం. ఈ మాత్రం తెగువ చేసినందుకు ధన్యవాదాలు వ్రాసిన మీకు, ప్రచురించిన ప్రాణహిత పత్రికకి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
yasasvi Sep 11, 2009 2
మధు గారూ!! శ్రీశ్రీ బతికి ఉన్నప్పుడు..ఏమీ కానివాళ్ళు ఇవాళ ఆయన మీద రాయడానికి కారణం ..అందునా ఆయన వ్యక్తిగతమైన అలవాట్లమీద కేంద్రీకరించడానికి కారణం …తమకి శ్రీశ్రీ
ఎంత సన్నిహితంగా తెలుసునో చెప్పడానికి కారణం..తమ తమ గొప్పలు చెప్పుకోవాలన్న ఒక యావ మాత్రమే!! చలం మ హా ప్రస్థానం కి రాసిన ముందుమాటలో ఈ తరహా వారిని గురించి
ముందే ప్రస్తావించి వున్నాడు. శ్రీశ్రీ కవిత్వం గురించి వ్యాఖ్యానించే స్థోమ త లేని వారే ఆయన అలవాట్లని ప్రముఖంగా ప్రస్తావించే తోవ తీస్తారు. అందువలన ఎవరు మాట్లాడుతున్నారూ..వారివారి ప్రయోజనాలు ఏమిటీ?? అన్న ది అంచనా వేసుకోండి. అప్పుడు మీకు ఆ మాటల దిశ…వారి గొంతుల్లోని ఆ వ్యాఖ్యల పరమార్ధము స్పష్టపడుతుంది. మీరు బాధ
పడకండి. శ్రీశ్రీ ప్రత్యేకత మనుష్యులంటే ఆయనకున్న మమత. ఆయన కవిత్వం రేపటి తరాలకి
అర్ధం అయ్యే పధ్ధతి ఇలాగే ఉంటుంది. శ్రీశ్రీ తాగటం ఆయన వ్యక్తిగతమే గానీ..భావి తరాలకిచ్చిన
సందేశం కాదనీ…గుర్తించే తెలివి..సున్నితత్వం…ఇవాళ్టి తరానికే కాదు..తరతరాలకీ..తెలుగులో
ఉంటాయి.తేలిక వ్యాఖ్యానాలు గాలికి పోతాయి.
యశస్వి.
ప్రాణహిత » సెప్టెంబర్ 2009 నెల సంచికకు స్వాగతం Oct 12, 2009 3
[...] శ్రీ శ్రీ ని జనం దృష్టితో చూడాలి – సీ.