తెలుగు కథలో ప్రతిఫలించే సామాజిక, సాంస్కృతిక పరివర్తనలు — తెలంగాణా స్త్రీల కధలు

అన్ని కులాలకు, మతాలకు నెలవైన మనదేశంలో సమన్వయం సాధించడానికి అనునిత్యం సంఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. నాటి స్వతంత్ర్య ఉద్యమ దశనుండి నేటి సెజ్ ఉద్యమాల వరకు గమనించినట్లయితే సామాన్య ప్రజల జీవన సంఘర్షణలకి రచయితలు పెద్ద పీట వేసారు. ఎక్కడయితే సంఘర్షణలు జరిగాయో అక్కడ (ఆ సమాజాల నుండి) ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఎక్కడయితే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయో ఆయా సమాజాల నుంచి రచయితలు పుట్టుకొచ్చి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు.

తెలంగాణా జీవితం, సంసృతి, పల్లెలతో ముడిపడి ఉంది. డెబ్బైవ దశకం వరకు కూడా 80 శాతము ప్రజలు పల్లెలో నివసిస్తూ వున్నారు. ఈనాడు తెలంగాణా సాహిత్యాన్ని రాస్తున్న రచయితలు చాలా వరకు పల్లెల నుండి మొదటి అడుగు వేసిన వారే.

ఈ రచయితలు సామాన్యప్రజల పక్షాన నిలబడి తమ రచనలు చేశారు. ఇందుకు కారణం ఆయా సమాజాలలో ఉన్న కులము, మతము, ఆర్థిక అసమానతలతో పాటు, ఇండియా పాకిస్తాన్ విభజన నైజాం నిరంకుశ పాలన, సాయుధ పోరాటం ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన విప్లవోద్యమాల ప్రభావం రచయితల మనో ఫలకం పై చెరగని ముద్ర లేస్తూ సామాజిక, సాంస్కృతిక అంశాలను అక్షర బద్దం చేయడానికి పురిగొల్పాయి.

తెలంగాణాలో కథ 19 వ శతాబ్దం ప్రారంభం నుండి అందులో భాగం అయిన మానవ సంబంధాలు, వాటి పరిణామాలపై శ్రద్ధ చూయిస్తూనే వివిధ దశలలో మార్పు చెందుతున్న సామాజిక పరిణామాలని సామాజిక దృక్కోణం నుండి తమ రచనలను, మహిళా రచయితలు సృజించడానికి ప్రయత్నించారు. అయితే ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ మహిళా రచయితలు తెలంగాణా సంస్కృతి పరిరక్షకులు కూడా కావటం. అందుకే వీరి రచనలలో తెలంగాణా సంస్కృతి ఆచార సంప్రదాయాలకు సంబంధించిన అంశాలు తరచుగా చోటు చేసుకుంటాయి. అందుకు బలంగా పునాదులు వేసిన బతుకమ్మ పండగ, తొలిఏకాదశి, ఉగాది, సంక్రాంతి, హోలి, రాఖీ పౌర్ణమి, పీర్లపండగలు, దసరా, దీపావళి నోములు సాంస్కృతిక అంశాలకు ప్రాతిపదికలు కాగా, ఉత్సవాలలో మమేకమయ్యే వ్యక్తులు, కుటుంబాల ప్రవర్తన రీతులు, తెలంగాణ సాఫీగా కొనసాగడానికి బాటలు వేసాయి.

అదే సమయంలో సమాజంలో వస్తున్న పెను మార్పులు అతలాకుతలం అవుతున్న సమాజం రచయితల వివేచనకు బాటలు వేసాయి. అలాంటి ఉద్విగ్న పరిస్థితుల లోంచి పుట్టిందే తెలంగాణా సాహిత్యం. రచయిత తనంతట తానుగా బాధ్యతను తీసుకుని సాహిత్య రచన చేయటానికి ఈ క్రింద కారణాలు దోహదం చేసాయి.

1) తెలంగాణాలో నిజాం నిరంకుశ పాలన
2) నల్గొండ జిల్లాలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం
3) ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన విప్లవోద్యమం.

ఈ మూడు కారణాలు తెలంగాణాలో రచయితలు విరివిరిగా రాయటానికి దోహదం చేశాయి. నిజాము నవాబుకి కేంద్ర బిందువైన హైదరాబాదు అన్ని ఉద్యమాలకి ఆలవాలంగావున్నప్పటికి, నల్గొండ జిల్లాలో రైతాంగ సాయిధ పోరాటం వరంగల్, కరీంనగర్ లలో ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవోద్యమం మొదలైంది. తెలంగాణా పల్లెలో వస్తున్న మార్పులు, వివిధ దశలలో సంఘర్షణలకు గురై మార్పు చెందుతూ అనేక మార్పులకు గురైంది. ఈ మార్పులను గమనిస్తున్న విద్యావంతులు ఆ సామాజిక పరిణామలని తమ రచనల్లో నిక్షిప్తం చేయసాగారు. అలా తెలంగాణా పల్లెలో సాహిత్యానికి పునాదులు ఏర్పడ్డాయి. అలాంటి ఏర్పాట్లకు పునాదులు వేసింది, సాయుధ పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా.
స్త్రీకి స్వాతంత్ర్యం లేని ఆ దశ నుండి స్త్రీలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని నెలబడటానికి పోరాటం చేస్తున్న ఈదశ వరకు కూడా తెలంగాణా స్త్రీ రచయితలు. సమకాలీన వివిధ సమస్యలను అనేక కోణాలలో దర్శిస్తూనె సాహిత్య సృజన చేసారు. అయితే ఈ రచయితలు స్త్రీ పక్షపాతిగా మాత్రం రచనలు చేయలేదు. తమ కుటుంబాలలో పురుషుడితో సమానంగా బరువు బాధ్యతలను మోస్తూనే ఆనాటి కుటుంబ జీవన స్థితి గతులు స్త్రీ విద్య, ఆర్థిక అసమానతలు మొదలైన అంశాలను తీసుకుని రచనలు చేశారు కాని 19 వ శతాబ్దం ఉత్తరార్థం వరకు స్త్రీల సాహిత్యం వెలుగు చూడలేదు. యిందుకు కారణం పురుష స్వామ్య ప్రభావం, మహ్మదీయుల పరిపాలన ప్రభావం, పరదా పద్దతి, స్త్రీ విద్య పై నిరాదరణ స్వేచ్చా స్వాతంత్ర్యాలు లేకపోవటం ఈ కారణాలతో చాలమంది స్త్రీల ప్రతిభ మరుగున పడిపోయింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాల స్త్రీలు మాత్రమే విద్యనందుకుని రచనలు చేసారు. కొన్ని సామాజిక వర్గాల రచనలను మాత్రమే ముందు తరంలో చూడవచ్చు. అన్ని వర్గాల నుండి సంపూర్ణమైన రచనలు రాలేదు. ముఖ్యంగా ఎస్. సి, బి. సి, మైనార్టి వర్గాల నుండి రచనలు రాకపోవటం ముందు దశలో ఒక లోటు. తెలంగాణా విముక్తి తరువాత స్వేచ్చా వాయువులు వీచిన తరువాత స్త్రీలు పురుషులతో సమానంగా విద్యాలయాల్లోకి అడుగు పెట్టారు. రచనా సాహిత్యంతో తమ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. చాలామంది తెలంగాణా స్త్రీ రచయితలు కవితతో ప్రారంభించి కథ, పాట, నవల, పరిశోధన ప్రక్రియలలో తమ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటున్నారు.

తెలంగాణాలోని స్త్రీ రచయితలుః

బండారు అచ్చమాంబ, నందగిరి ఇందిరాదేవి, ఇల్లిందుల సరస్వతి, పాకాల యశోదా రెడ్డి, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, ముదిగంటి సుజాతా రెడ్డి, అనిశెట్టి రజిత, గీతాంజలి, బండారు విజయ, గోపి భాగ్యలక్ష్మి, వేశపోగు గుల్బానమ్మ, మెత్కుపల్లి దమయంతి దేవి, మామిడి సత్యవతి, జ్యోతిర్మయి, జాజుల గౌరి, జూపాక సుభద్ర, గోగు శ్యామల, కందాల లిల్లి, జ్వలిత, లక్ష్మి, విక్టోరియా రాణి, నీలి వనజ, పచ్చనూరి అనురాధ, వి. నాగమణి, మేరి మాదిగా, కన్నారం ఝాన్సీ.

వీరి రచనలని నాలుగు దశలుగా విభజించవచ్చు.

మొదటి దశలో బండారు అచ్చమాంబ, నందగిరి ఇందిరాదేవి, ఇల్లిందుల సరస్వతి, పాకాల యశోదా రెడ్డి వీరు స్త్రీ జనోద్దరణ స్త్రీ విద్య, కుటుంబ సమస్యల మీద రచనలు చేశారు. అందుకు ఆనాటి సామాజిక అంశాల ప్రభావంతో పాటు స్త్రీ జనోద్దరణకు సంబంధించిన ఉద్యమాలు కొనసాగుతుండటం.

రెండవదశలో మాదిరెడ్డి సులోచన, పోల్కం పల్లి శాంతాదేవి, ముదిగంటి సుజాతా రెడ్డి, అనిశెట్టి రజిత, గీతాంజలి, బండారు విజయ. 70 వ దశకములో మాది రెడ్డి సులోచన, పోల్కం పల్లి శాంతాదేవి లు కథలు నవలలను పుంఖాను పుంఖాలుగా వెలువరించారు. అందుకు కారణం ఆసమయంలో కోస్తా రచయితలైన యద్దన పూడి సులోచన రాణి, కోడూరి కౌసల్యాదేవి లు మొదలైన వారు నవల రంగంలో దూసుకుపోతున్న దశ వీరు ఎక్కువగా కాల్పనిక సాహిత్యానికి పెద్ద పీట వేశారు.

ఇక అదే సమయంలో సాహిత్య పరిశోధన రంగం నుండి ముదిగంటి సుజాతా రెడ్డి, బహుజన అస్థిత్వ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అనిసెట్టి రజిత, బండారు విజయ రచనలలో ముందుకు దూసుకు వచ్చారు. అప్పటి వరకు ఎవ్వరు సృజించని ముస్లింవాద రచన్లోకి గీతాంజలి అడుగు పెట్టారు. గిరిజన గోండు లంబాడీల సాహిత్యాన్ని గోపి భాగ్యలక్ష్మి రాసింది.

మూడవ దశః 1980 వ దశకంలో అస్థిత్వ ఆత్మగౌరవ పోరాటాలు రూపుదిద్దుకుంటున్న క్రమంలో కొత్తగా అక్షరాలు నేర్చుకున్న తెలంగాణా దళిత స్త్రీలు 80 దశకం ఆరంభం నుండి సామాజిక నిచ్చెన మెట్లపై నిల్చుండి రచనలు చేయడం మొదలైంది. అయితే వీరు మొదట రాసిన రచనలు సార్వజనీనకమైనవి. రచనారంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వీరికి కారంచేడు చుండూరు సంఘటనలతో పాటు డండోరా ఉద్యమం ఒక ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. అదే సమయంలో ఏర్పడిన ”మాదిగ సాహిత్య వేదిక” జాజుల గౌరిని వి, నాగమణిని గుర్తించి సముచిత స్థానం ఇచ్చింది. పి. డి. యస్. యు. ద్వారా జూపాక సుభద్ర 1983 నుండి రచనలు వ్రాయటం మొదలైంది. 1990 లో ఉద్యమ జీవితం నుండి రచనలు ప్రారంభించిన గోగు శ్యామల అన్వేషి రిసెర్చ్ సెంటర్ ఫర్ వుమెన్స్ స్టడీస్, ఆర్థిక సహాయ సహకారాలతో ”నల్ల పొద్దు” దళిత స్త్రీల సాహిత్యా సంకలనం తీసుకువచ్చారు. ఆశ్చర్యంగా దాదాపు ఇరవై మంది తెలంగాణా దళిత స్త్రీల సాహిత్య సంకలనం తీసుకువచ్చారు. అందులో వరంగలు కు చెందిన వేశపోగు గుల్భానమ్మ, హైదరాబాదుకు చెందిన మొత్కుపల్లి దమయంతి దేవి, వరంగలు కు చెందిన మామిడి సత్యవతి, ఖమ్మంకు చెందిన జ్యోతిర్మయి, కందానిలిల్లి, మహబూబ్ నగర్ కు చెందిన దనసరి అనసూయ, ఖమ్మంకు చెందిన మద్దెల స్వాతి మార్గరేట్ వారి రచనలతో ముందుకు వచ్చారు. ఇంకా తెలంగాణా నుండి కె. పద్మ లత, భాగ్యరేఖ, జి. అనసూయ, ముదిగొండ శివ కౌముది దేవి, విరివిరిగా రచనలు చేస్తున్నారు. 99 శాతము దళిత స్త్రీలకు జానపద మౌఖిక సాహిత్యంలో పట్టు ఉంది.

ఆ తరువత 2005 తర్వాత రచనలు ప్రారంభించిన వారిలో మేరి మాదిగ, కన్నారం జాన్సీ, మునింగం వసంత పల్లవి, జె. సత్యకళ, మునింగం సరిత మొదలైన వారు తమదైన వారు తమదైన విలక్షణమైన శైలిలో రచనలు ప్రారంభించారు.

మరో వైపుముస్లిం మైనారిటి సాహిత్యం 1980నుండి మొదలై 2000 సంవత్సరం వరకు ఉదృతం అయ్యింది. అందులో ప్రధమంగా షాజహాన, షహనాజ్ ఫాతిమా మొదలైన వారు విరివిరిగా రచనలు చేస్తున్నారు.

తెలంగాణా స్త్రీల కథలుః

బండారు అచ్చమాంబః- ఆధునిక తెలుగు కథా సాహిత్యానికి తొలి బాటలు వేసింది తెలంగాణాలోని నల్గొండ జిల్లాకు చెందిన బండారు అచ్చమాంబ (1874) ఈమె మొదటి కథ ధన త్రయోదశి 1902 లో హిందుసుందరిలో ప్రచురింపబడింది. 1903 లోవెలువడ్డ అబలా సచ్చరిత్ర రత్నమాలలో రుద్రమ దేవి గణపాయిల జీవిత చరిత్రను రాసి ఆధునిక కాలంలో తెలంగాణా మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన రచయుత అచ్చమాంబ.

ఆధునిక కథకు బాటలు చేసింది గురజాడ అప్పారావు దిద్దుబాటు కథ అయితే అతని కంటే ఏనిమిది సంవత్సరాల ముందుగానే బండారు అచ్చమాంబ ధన త్రయోదశి కథను రాశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆమె ఇతర రచనలు స్త్రీ విద్య, ప్రేమ పరిరక్షణం, ఎరువు సొమ్ము పరువు చేటు, లలితాశారదులు, బీదకుంటుంబం మొదలైనవి.

ధనత్రయోదశకథః-విజయలక్ష్మమ్మ, వెంకటరత్నంలది బతికి చెడిన కుటుంబం. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వెంకటరత్నం శెట్టిగారి దగ్గర గుమాస్తాగా పని చేస్తూ వూంటాడు. కడుపేదరికంలో కూడా భర్త ప్రేమానురాగాలను తప్ప మరే ధన సంపదను ఆశించని ఇల్లాలు విజయలక్ష్మి. ఒకనాడు శెట్టిగారి దగ్గర పనిచేసే పెద్ద గుమాస్తా వెంకటరత్నంను డబ్బుకు ప్రలోభ పెట్టి కొంత సొమ్ము యజమాని దగ్గర నుండి కాజేయటానికి ఉపాయాలు వున్నాయని తనతో చేతులు కలిపితే దరిద్రం తీరిపోతుందని చెప్పి వంద రూపాయల నోటు అతని చేతిలో పెడతాడు. ఆరోజు దీపావళి, ఇంటికి వచ్చేసరికి ఇల్లాలు, పిల్లలు చిన్నబోయి ఉంటారు. కానీ విజయలక్ష్మి భర్తను తన మాటలతో సంతోషపరుస్తూఉంటుంది. వెంకటరత్నం లోలోన మానసిక సంఘర్షణ పడ్తూ వుంటాడు. అర్థరాత్రి మేలుకున్న విజయలక్ష్మి భర్త చేతిలోని డబ్బుని అతని మానసిక సంఘర్షణని గమనిస్తూ అతనితో కఠినంగా మాట్లాడి మందలిస్తుంది. ఎంతటి పేదరికం వున్నా సరే యజమాని డబ్బుని దొంగతనంగా వాడుకుని నీతి తప్ప వద్దని చెప్పి అతనిలో మానసిక పరివర్తనను తీసుకు వస్తుంది.

నందగిరి ఇందిరాదేవిః 1919లో హనుమ కొండలో జన్మించిన ఈ రచయిత్రి ఆంధ్రయువతి మండలి స్థాపకులో ఒకరు. సంసార బంధమైన ఇతి వృత్తాలను తీసుకుని కథలు రాసింది. ఈమె రాసిన ‘పందెం’ కథ ఇతివృత్తం ఏమిటంటే ఒక ఖైదికి ఉరిశిక్ష విధించటం మంచిదా జీవిథ ఖైదు విధించటం మంచిదా, ఏ శిక్ష సులువైంది అనే అంశం మీద మందు పార్టీ దగ్గర వచ్చిన పంతం పందెం దాకా పోతుంది. ఇద్దరు స్నేహితుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒకతను 10
సంవత్సరాల ఏకాంత వాసం చేసినందుకు మరొకతను రెండు లక్షలు చెల్లించేటట్టుగా కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి వ్యక్తికి అన్ని సౌకర్యాలను అమర్చి అతని కాలక్షేపానికి అతను కోరిన పుస్తకాలను అమరుస్తాడు. చివరికి ఒప్పందం చివరి గడియ వస్తుంది. కాని ఖైది అయిన వ్యక్తి తాను సంపాదించిన పుస్తక పరిఙ్ఞానం ముందు ఈ రెండు లక్షలు ఏ మాత్రం విలువ చేయవని చివరి నిమిషంలో ఒప్పందాన్ని ఉల్లంఘించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఇల్లందుల సరస్వతి దేవిః హైదరాబాద్ వాస్తవ్యులైన వీరు 1958-66 మధ్యన శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. స్వర్ణ కమలాలు, తులసీ దళాలు వీరు ప్రచురించిన కథాసంపుటాలు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు. ఆమె కథ ” కాని కాలంవస్తే” ఇండియా పాకిస్థాన్ విభజన తరువాత హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయ్యె ముందు ముస్లింలు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను ఈ కథ వివరిస్తుంది. ముస్లిం సమాజంలో ఎంతోగొప్పగా బతికి చివరికి ఆస్థి పాస్తులను అమ్ముకుని అన్నదమ్ములు పాకిస్తాన్ కు పారిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆసమయంలో ఇద్దరు కూతుర్ల పెండ్లి చెడిపోతుంది. అది తెలిసి తండ్రి కన్నుమూస్తాడు. పెద్దన్న తల్లికి తమ్ముడికి బంగారం, వెండి ఖరీదైన దుస్తులతో వాళ్ళను పాకిస్తాన్ కు తరలిస్తాడు. ఇద్దరు చెల్లండ్లను అప్పుపడి ఉన్న సేట్లకు కానుకగా అప్పగించాలనుకుంటాడు. ఇది తెలిసిన పెద్ద అమ్మాయి 40 ఏండ్ల వయస్సున్న తోటమాలితో వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న మరో ఇద్దరు అంగవికలులైన పనివాళ్ళు చిన్న అమ్మాయిని తీసుకుని హిందువుగా వేషం మార్చి ఊరు దాటడంతో కథ ముగుస్తుంది.

పాకాల యశోదా రెడ్డిః 1929 లో మహబూబ్ నగర్ జిల్లా బిజినే పల్లి లో జన్మించారు. తెలంగాణా మాండలికంలో కథలు రాసిన మొదటి రచయిత్రి. తెలంగాణా లో బాధ, అణచివేత వేదనలకు స్పందించి రచనలు చేశేవారు. 1934లో రాసిన యశోదాయిని ఆనంద ఘట్టం అనేది ఆమె మెదటి కథ. ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు, ధర్మశాల మరో కవిత సంకలనాన్ని అమె రచించారు. గంగి రేగి చెట్టు కథ: 1973లో వెలువడిన మావూరి ముచ్చట్లు కథా సంకలనం లోనిది. ఈ కథలో కథానాయిక తొమ్మిది సంవత్సరాల ఎచ్చమ్మ పురుట్లోనే తల్లి చనిపోతుంది. తండ్రి కాశీ రెడ్డి అమె మీద అలక వహించడంతో మరొకరి ఇంటికి పెంపకానికి పోతుంది.

కాశీ రెడ్డి చెల్లెలు ముత్యాలమ్మ, అన్నబిడ్డను తనకొడుక్కి ఇవ్వమని అడుగుతుంది. ఆయన ఇంట్లో ఉన్న మరో కూతుర్ని ఇస్తానని, తర్వాత మనసు మార్చుకుని ఎచ్చమ్మను ఇస్తానంటాడు. అన్న మాట కాదనలేక ఆమె అయిష్టంగానే ఆ సంబంధానికి ఒప్పుకుంటుంది. అందరు ఎచ్చమ్మ తల్లి సంవత్సరీకానికి కాశీ రెడ్డి ఇంటికి వస్తారు. కాని ముత్యలమ్మ కాబోయే కోడలిని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. పెరట్లో ఉన్న గంగి రేగి పండ్లను తెంప ఎచ్చమ్మ రఘునాధరెడ్డి తో కలిసి పోతుంది. చెట్టు ఎక్కిన ఎచ్చమ్మకు దిగరాదు. అప్పుడు రఘునాధరెడ్డివంగి తన వీపు మీద కాలు పెట్టి దిగమంటాడు. ఆమె బావ వీపు మీద కాలు పెట్టిదిగుతున్న సమయంలో అటుగా వచ్చిన ముత్యాలమ్మ ఆ దృశ్యాన్ని చూసి ఇపుడే నాకొడుకును ఇట్లా వంగపెడుతుంది, పెళ్ళి అయిన తరువాత నాకొడుకును కొంగుకు ముడివేసుకు తిరుగుతుందేమోనని తలంచి ఆ సంబందాన్ని తిరస్కరించి తన కొడుకును తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.

మాదిరెడ్డి సులోచన:1936 లో హైదరాబాద్ దగ్గరున్న శంషాబాద్ లో జన్మించిన మాదిరెడ్డి సులోచన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే 200కథలు, 70నవలలు రాసారు. 1972లొ ఆమె రాసిన “హక్కు”కథలో ఇంటిలో అబ్బాయిల తర్వాత పుట్టిన దేవాయిని ఆడపిల్లగా తల్లితండ్రుల నిర్లక్ష్యానికి గురవుతుంది. వివాహం తరువాత ఉన్నత విద్యను అభ్యసించి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అన్నలు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో వుండడంతో తండ్రి బాధ్యతను స్వీకరిస్తుంది. అయితే ఇంటి ఆస్తిపాస్తుల విషయానికి వచ్చేసరికి తండ్రి, అన్నలు ఆస్తిపాస్తుల వ్యవహారం లో ఆడపిల్లలకు హక్కు లేదని ఆమెను పక్కన పెడతారు. ఆమె శ్రమ, డబ్బు, ఖర్చు అయినా పుట్టింటి నిరాదరణకు గురి కావడంతో భర్త చివాట్లు పెడతాడు. నిరాశతో ఆమె వెనుతిరుగుతుంది.

పోల్కంపల్లి శాంతాదేవి:1942లో మహబూబ్ నగర్ వనపర్తి లోజన్మించారు. 150పైగాకథలు, 60నవలలు రాసారు. ఆమె రాసినకథ “మానవత”లో దేవకి కూతురు రత్న. తండ్రిలేని రత్న 20సంత్సరాల వయసులో ఉండగానే భర్తను పోగొట్టుకుంటుంది. ఏఆసరా లేని వారికి తల్లి దేవకి దొరగారి ఇంటిలోచేసే పనిమనిషి ఉద్యోగమే ఆధారం. ఇంటిలోఉన్న కూతురుని దొర దగ్గరకి తీసుకొనివెళ్ళి ఏదైనా బతుకు తెరువుచూపమని వేడుకుంటుంది దేవకి. దొర అలాగేనని భరోసా ఇచ్చి కూతురును తన బంగ్లాలోవదలి పెట్టి వెళ్లమంటాడు. కాని అదను చూసి ఆమెను అనుభవిస్తాడు. ఈ విషయం బయటకి చెప్పవద్దని ఏ నాటికైన తనదానిగా చేసుకుంటానై మాట ఇస్తాడు. దొరకు ఇచ్చిన మాటకు రత్న కట్టుబడిఉంటుంది. కొన్ని రోజులకి తరువాత ఆమె గర్భందాలుస్తుంది. ఈవిషయంతెలిసిన దేవకి కుతురుని నిలదీస్తుంది. కూతురు నోట దొర మాట విన్నదేవకి నిలువునా కంపించిపోతుంది. వ్యక్తిగతంగా ఎంతో ఉన్నతుడు అనుకున్న దొర ఇలాచేసాడంటే ఆ ఊరి ప్రజలు నమ్మరు. కాని అప్పటికే బంగ్లాను వదలి తన భార్యాబిడ్దల దగ్గరకు వెళ్లిపోతాడు. ఈ అవమానాన్ని భరించలేని రత్న ఆబిడ్డకు తండ్రి ఎవరు అని ఊరి ప్రజలు నిలదీస్తుందంటే తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్దపడుతుంది. తల్లి, కూతుళ్ల మంచితనాన్ని ఎరిగిఉన్న ఆ ఊరి ఉపాద్యాయుడు మానవతా దృక్పథంతో స్పందిస్తాడు. ఆత్మహత్యాప్రయత్నం నుంచి రత్నను రక్షించి ఆబిడ్డకు తండ్రిని తానేనని ఊరి ప్రజల ముందు ఒప్పుకొవడంతో ఈకథ ముగుస్తుంది.

ముదిగంటి సుజాతారెడ్డి: నల్లగొండజిల్లా నకరేకల్ ఆకారం గ్రామంలో జన్మించారు. పరిశోధనా రంగంలోనే కాకుండా విమర్శ, కథ, నవల, చరిత్ర రచనలలో ప్రసిద్దిరాలు. ఈమె రచనలు శ్రీనాధుని కవితాసౌందర్యము, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, నవలాను శీలనం అనే పరిశీలన గ్రంధమే కాకుండ, ముద్దెర అను విమర్శ గ్రంధాన్ని రచించి తన భర్త ప్రొఫెసర్ గోపాల్ రెడ్డితో కలసి తెలుగులో సంస్కృత సాహిత్య చరిత్రను రచించారు. “విసుర్రాయి” మింగుతున్న పట్నం, వ్యాపార మృగం అనే కథా సంకలనాలను వెలువరించారు. తొలి తరం తెలంగాణా కథలను సేకరించి రెండు సంపుటాలుగా ప్రచురించారు. “ఆకాశానికి విభజన రేఖలు లేవు” సంకెళ్ళు తెగాయి. అనే నవలను రచించారు. ” నైలు నది నాగరికత అనే యాత్ర చరిత్రక గ్రంధాన్ని రచించారు. “ఊరు బాగు పడేదెప్పుడు” అనే కథ 2001 సంవత్సరంలో వచ్చిన మింగుతున్న పట్నం అనే కథ సంకలనములోనిది. 17 సం. ల తర్వాత అమ్మమ్మను, తాతను చూడాలని బయలు దేరిన యువకుడి మనోగతాన్ని, వర్ణించేదే ఈ కథ. ఆ యువకుడు చిన్నప్పుడు తను చూసిన ఊరికి ఇప్పుడు ఉన్న ఊరికి మధ్య సామాజిక సంస్కృతిక అంశాలలో వచ్చిన మార్పును వలసలు పోయిన ఊరిలో ముసలి వారు మాత్రమే మిగిలిఉన్న దైన్యమైన స్థితిని కులవృత్తుల తీరు మారిన దృశ్యాలను, కళ్ళకు కట్టినట్లుగా ఈ కథ వివరిస్తుంది. చాలా రోజుల తర్వాత అమ్మమ్మ చెంత ఊరిలో గడ్డ పెరుగు అన్నం తిని, అమ్మమ్మ ముచ్చట్లు వింటు, నీలాకాశము క్రింద పడుకుని చల్లగాలిలో చుక్కలను లెక్క పెడుతూ చిన్న నాటి స్వర్గ సుఖం అనుభవించాలి అనుకున్న ఆ యువకుడు నిరాశాకు గురై వెను తిరగడంతో కథ ముగుస్తుంది.

అనిశెట్టి రజిత:1958ఏప్రిల్ 14 న వరంగల్ జిల్లా ఖాజీపేటలో జన్మించిన అనిశెట్టి రజిత బహుజన సాహిత్యాన్ని విస్తృతంగా రాసిన ప్రగతిశీల రచయిత్రి. 1975 లో రాసిన “పువ్వులు ముళ్ళు” అనే కవితతో ఆమె సాహిత్య ప్రస్తానము మొదలైంది. పెక్కు అవార్డులు అందుకున్న ఈమె తెలంగాణా ఉద్యమం చివరి దశలో పాల్గొన్నారు. గులాబీలు జ్వలిస్తున్నాయి. నేను ఒక నల్లమబ్బునవుతా. చెమట చెట్టు, ఓలచ్చవ్వ, ఉసిరు, గోరంతదీపాలు, దస్తకత్, అనగనగా కాలం, నన్హే ఓ నన్హే, మట్టి బంధం మొదలైన సంకలనాలను వెలువరించారు వానమ్మ వానమ్మ అనే కథ మట్టి బంధం అనే కథ సంకలనం లోనిది. వరంగల్ జిల్లా నరమెట్ట మండలములోని ఒక గ్రామములో వానను చూడని 14 సం. ల బాలుని గురించి విని, ఆ ఊరి కరువు పరిస్థితులను ఆకలింపు చేసుకుని రచయిత్రి ఈ కథ రాసారు. 14 సం. లుగా వానలు లేక పొవడంతో త్రాగు నీరు లేక కరువుకాటకాలతో తల్లడిల్లుతున్న ఆ గ్రామ ప్రజలు త్రాగటానికి నీరు లేక తినడానికి తిండి లేక వలసలు పోతున దశలో, విచ్చిన్నమౌతున్న జీవితాలను చూసి ఒక్క ఉపాధ్యాయిని అక్కడిబాలున్ని చేరదీసి విద్యా బుద్దులు చెప్పిస్తున్న క్రమములో అతని మానసిక స్థితిని గమనించి ఎట్టి పరిస్థితులలోనైన వాన చినుకుల స్పర్సను అతని ముందు ఉంచాలని ఏంతో దూరం ఉన్న స్నేహితురాలి ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ ఆ బాలుడు వానలో తడిసి ముద్దయి ఆ స్పర్శ అనుభూతికి తడిసి మురుస్తుంటే అతని ఆనందములో ఉపాధ్యాయురాలు పాలుపంచుకోవడంతో కథ ముగుస్తుంది.

గీతాంజలి: ముస్లిం జీవితాల గురించి తెలంగాణా మాండలికంలో అద్భుతమైన రచనలు వ్రాస్తున్న ముస్లిమేతర రచయిత్రి “ఆమె అడవిని జయించింది” చిన్న నవల, “బచ్చెదాని”, ” పహచాన్”, అమె కథా సంకలనాలు. విరసంలో సభ్యురాలు. పహచాన్ అనే కథని పహచాన్ అనే కథా సంకలనంలో నుంచి తీసుకోబడినది. ముస్లింల గొడుగులో బలి అయిన ముస్లిం యువతి మానసిక జీవన సంఘర్షణను ఈ కథ చర్చిస్తుంది. 10 మంది చేత ఏక కాలంలో అత్యాచారానికి గురై తండ్రి ప్రేమించిన వాడిని ఇతర కుటుంబ సభ్యులను కళ్ళముందే కోల్పోయిన ఆ యువతి చావుబతుకులను నుండి బయట పడి జీవచ్చవముగా మారిన క్షణం ఆ కేసు కోర్టు ముందుకు వచ్చినప్పుడు, దోషులను గుర్తించమని పోలీస్ వ్యవస్థ ఒక వైపు, దోషులను గుర్తిస్తే చంపుతామని హిందు మతోన్మాదులు మరోవైపు వేధిస్తుంటే ఎటు నిర్ణయించుకోలేని ఆ యువతి సందిగ్దావస్తలో వున్నప్పుడే ఆమె తల్లిని అపహరిస్తారు. ఆమె జాడ ఎప్పటికి తెలియకుండా పోతుంది. చివరికి తమ జీవితానికి ఆధారమైన బేకరీని శుభ్రం చేసి, పూర్వపు ఙ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న ఆ యువతికి జగన్నాధ రధయాత్రలో పాల్గొనమని పిలుపువస్తుంది. చివరికి ఉత్సవాలలో జరిగిన తొక్కిసలాటలో ఆమె మరణించిందని పేపరు లో వస్తుంది. బెస్ట్ బేకరీ కేసు యదార్ద సంఘటనకి ఈ కథ దగ్గరగా ఉంది.

గోపి భాగ్యలక్ష్మి: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ రచయిత్రి గిరిజన ప్రాంతాలలోని గోండులు లంబాడీలు మొదలైన గిరిజన తెగలతో కలుపు గోలుగా వుండి వారి జీవితానికి అతి దగ్గరగా రచనలు చేస్తున్నారు. ఈమె కథ “జంగుబాయి” జంగుబాయి ఒక గోండు అమ్మాయి, గోండుల ఆచార వ్యవహారాలు అత్యంత అనాగరికంగా వుండి, కొన్ని వారి ప్రాణాలకే ముప్పు తెచ్చే విధంగా ఉంటాయి. అందుకు తోడు మూడ నమ్మకాలు, మంత్ర తంత్రాలు కూడ జతౌతాయి. అలాంటి పరిస్థితులలో ఆ సామాజిక ఆచారాల ప్రకారం బాల్య వివాహాలు జరుపడం, అవగాహన లేని వారు యుక్త వయస్సుకు వచ్చే సరికి ఎడ మొహం పెడమొహం గా ఉండటం, పెళ్ళిల్లు విచ్చిన్నం అవడం, పెండ్లి ఖర్చులకీ పెండ్లి పెటాకులు అయిన ఖర్చులకు, అప్పుల కింద వళ్ళు పంట భూములను కోల్పోవటం, స్త్రీలకు ముట్టు అయిన క్షణంలో వర్షంలో అయినా తడుస్తూ రాత్రింబగళ్ళు బయట ఉండటం, అప్పుడే పుట్టిన శిశువుకి గుండు గీసి పుట్టెంటుకలు తీయడం, దానితో శిశువు మరణించే సందర్భాలు తలెత్తడం, ఈ ఆచారాలు ఉల్లంఘిస్తే అనార్థాలు జరుగుతాయని భయపడటం, మంత్రగాళ్ళ చేత శాంతి పూజలు చేయడం, నాగరిక ప్రజలు అమాయకుల మాన ప్రాణాలతో చెలగాటం ఆడటం మొదలైన గిరిజన కుటుంబాల సామాజిక, సాంస్కృతిక దోపిడి పీడన అంశాలన్నీ ఈ కథలో చర్చకు వస్తాయి.

ఇక తీలంగాణా సాహిత్యంలో తెలంగాణా దళిత స్త్రీల సాహిత్య అంశానికి వస్తే 1905 లో వరంగల్ లోని జనగాంలో జన్మించిన వేశపోగు గుల్భానమ్మ హైదరాబాద్ కి చెందిన మెత్కుపల్లి దమయంతి దేవి, పాటలు పద్యాలు వ్రాసారు.

మామిడి సత్యవతి తో దళిత కథ మొదలైంది.

మామిడి సత్యవతి: 1941లో వరంగల్ జిల్లా జనగాంలో జన్మించిన ఈమె 1960 దశకంలోనే అంటరానితనం వెట్టిచాకిరి మొదలైన దళిత సమస్యలపై రచనలు చేశారు. 1958 లో తన 17 ఏట ఈమె వ్యాసం స్కూల్ మ్యాగజైనులో అచ్చయింది. 40 కథలు, ఇరవై వ్యాసాలు రాసింది. మధ్య తరగతి జీవిత చిత్రణని వ్యవహారిక భాషలో రాసింది. ఆమె రాసిన “తెర తొలగింది” కథని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు తాగి తందనాలాడుతో రాచిరంపాన పెడ్తున్న భర్త ఇద్దరు పిల్లలతో సంసారం నెట్టుకొస్తున్న గ్రామీణ యువతికి ఆదర్శ భావాలు కలిగిన ఒక యువకుడు తారసపడతాడు. ఈబాధలన్నీ అనుభవిస్తున్న ఆయువతికి అతని మాటలు మైకంలో ముంచెత్తుతాయి. చివరికి సంసారం జీవితంలో విసిగిపోయి అతనితో కలసి జీవించాలని ఇంట్లోంచి పారిపోతుంది. వాళ్ళిద్దరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చున్న ముసలవ్వతో మాటలు కలుపుతుంది. ఆమెతో సంసారంలోని ఒడిదుడుకులను సమగ్రంగా చర్చించిన తర్వాత ప్రయాణం మధ్యలోనే ఆ యువకుడిని వదిలి తిరిగి తన ఇల్లు చేరడంతో కథ ముగుస్తుంది.

జాజుల గౌరి: 1969లో హైదరాబాద్ లో జన్మించిన జాజుల గౌరి 1980 సం. లో విద్యార్థి దశనుండె కవితలు రాయడం మొదలు పెట్టారు. చాలా కాలం వరకు ఏ పత్రికలు కూడా ఈమె రచనలను ప్రచురించలేదు. చుండురు, కారంచేడు ఉద్యమాలు ఆలోచనలను రేకేత్తిస్తున్న సమయంలో ఈమె రచనలు వెలుగుచూసాయి, కె. జి. సత్యమూర్తి సంపాదకత్వంలో వచ్చిన”ఏకలవ్య” పత్రికలో మొదటి సారి ఈమె కవిత అచ్చు అయింది. మాదిగ దండోరా ఉద్యమ నేపద్యంలో ఏర్పాటైన ” మాదిగ సాహిత్య వేదిక” ఈమె రచనలను గుర్తించి ఆ సంస్థకు ఉపాధ్యాక్షురాలిగా ఎన్నుకుంది. కవితతో మొదలైన ఆమె పయనం కథ, నవల, పాటలకు విస్తరించింది. తన జీవిత అనుభవాల నేపధ్యంలో వ్రాసిన ” మన్ను బువ్వ” కథ సంకలనాలు రాష్ట్రస్థాయిలో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులోని “కంచె” కథ ఆక్స్ ఫార్డ్ యూనివర్సిటికి ఎంపికైంది. చాలా కథలు ఇంగ్లీషులోకి అనువదింపబడ్డాయి. కొన్నికథలు పలుమార్లు ప్రచురితం అయినాయి. తొలిసారిగా తెలంగాణా భాషలో రాసిన మొదటి తరం దళిత రచయిత. ” మన్ను బువ్వ” కథ సంకలనంలో ని దస్తకత్ అనే కథను ఇక్కడ తీసుకొవడం జరిగింది.

రాములు కూలి నాలి చేసుకుని బతికే నిరుపేదల బిడ్డ అతను ప్రాధమిక విద్యలో ఉండగానే స్కాలర్ షిప్ వస్తుంది. అయితే అతను మాదిగ షెడ్యూలు కులాలకు చెందిన అబ్బాయి అని సర్టిఫై చేయడానికి ఆ ఫారం మీద సంతకం కావాలని అంటాడు హెడ్మాష్టరు. ఆ సంతకం కోసం రాములు తల్లి కొడుకులు రెండు రోజులు కూలి పొడగొట్టుకుని చెప్పులు అరిగేలా గవర్నమేంటు గెజిటెడ్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి అవమానాల పాలవుతారు. చివరికి మూడవ దినం ఆ సంతకం గవర్నమెంటు ఆఫీసు అటెండరుకి లంచం ఇవ్వడం ద్వారా సాధించుకుంటారు. అందుకు గాను నలభై రూపాయల స్కాలర్ షిప్ కోసం నూట ఇరవై రూపాయల కూలిని, ఇరవైరూపాయల లంచాన్ని శారీరక మానసిక శ్రమని పణంగా పెడ్తారు. దళితులు పుట్టుకతోనే వెనకబడినకులం, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారికి ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వం అధికారులు సర్టిఫికెట్ల మీద సర్టిఫై చేయడం అవసరమా అని రచయిత వ్యంగంగా ప్రశ్నించే సందేశం అంతర్లీనంగా ఉంటుంది.

జూపాక సుభద్ర: 1962లో వరంగల్ జిల్లాలోని దామరంచపల్లె జన్మించిన జూపాక సుభద్ర మంచి వక్త. పి. డి. యస్. యు. ఉద్యమ నేపధ్యం కలిగిన ఈమె రచనలు అదే సంస్థ సావనీర్లో 1983 లో అచ్చుఅయినాయి. కవితలు, కథలు వ్యాసాలు రాస్తారు. ప్రముఖ దళిత నవలలు అంటరాని వసంతం, కక్క నవలలను సమీక్షించింది. ఈ తెలుగు అధికార భాష సంఘం పురస్కారం అందుకున్నారు. ” మాన్యం” కథ “నల్ల రేగడి సాల్లు” కథ సంకలనం లోంచి తీసుకుంది.

మాదిగ ఉపకులానికి సంబంధించిన డక్కలి స్త్రీ మాదిగల ఇండ్లలోని మాన్యం హక్కు కోసం ఎలా ఆ గ్రామాలలోని మాదిగ వాడలలోకి ప్రవేశిస్తుంది చెపుతూ మాదిగలకు, డక్కలి వాళ్ళకు ఉన్న అవినాభావ సంబంధాలను సామాజిక చిత్రణలో భాగంగా డక్కలొళ్ళు పురాణ గాధలను కథ కథలుగా చెప్పి మాన్యం హక్కుగా భావించి, గాసాన్ని ఎల అడిగి తీసుకుంటారో మాదిగల తోటి ఏలా కల్సి మెలసి ఉంటారొ అనే అంశాలను ఈ కథ వివరంగా చర్చిస్తుంది.

గోగు శ్యామల: 1969 వ సం. లో రంగా రెడ్డి జిల్లా పెద్దెముల్ గ్రామంలో జన్మించారు. 1990 లో మెదటి సారి రాసిన పోరుదారుల్లో స్త్రీ విముక్తి అనే వ్యాసం నలుపు పత్రిక లో ప్రచురితం అయింది. ఈమె జనశక్తి పార్టీలో కార్య కర్తగా పనిచేసారు. అన్వేషిని స్వచ్చంద సంస్థ సహకారంతో తన ఉద్యోగంలో భాగంగా ” నల్ల పొద్దు” పుస్తకానికి సంపాదకత్వం వహించి జూపాక సుభద్ర తో “నల్లరేగడి సాల్లు” కథ సంకలనాన్ని తీసుకువచ్చారు. తనను తానుపూర్తిస్థాయి ఉద్యమ కార్యకర్తగా భావించుకుంటారు.

నల్లరేగడి సాల్లు సంకలనంలోంచి “చిందు భాగోతం పని బాటొళ్ళా ఊపిరి గాదు బిడ్డ” అనే కథ చిందు భాగోతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిందుల ఎల్లమ్మ, జీవిత అనుభవాలను కథగా మలిచింది. మాదిగ ఉపకులం అయిన చిందు కులానికి చెందిన చిందుల ఎల్లమ్మ సామాజిక జీవితంలో ఊర్లో అగ్రకులాల పురుషుల నుండి ఆమె ఎదుర్కొన్న వేధింపులను ఈ కథ చర్చించింది.

మేరి మాదిగ: 1976లోనల్లగొండ జిల్లారఘునాధపురంలో జన్మించారు. మాదిగ దండోరా ఉద్యమ నాయకులలో ప్రథమురాలు. మందక్రిష్ణ మాదిగతో పాటు సమాన స్థాయిని కలిగి ఉన్న ఆమె మంచి వక్త. ఎ. బి. సి. డి. వర్గీకరణ జరగడానికి కారణం అయిన అతి ముఖ్య కార్యకర్త. కొందరి కుయుక్తుల వలన ఉద్యమం నుండి బయటికి వచ్చిన ఆమె కాన్షిరాం స్థాపించిన బి. యస్పి. పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈమె కథ “మాస్టి పోసవ్వ”. మాదిగ ఉపకులాలలోమాస్టికులం ఒకటి. పూర్వకాలం మాదిగలకు సంబందించిన పనిముట్లను మాదిగలకు సరఫరా చేసేది. ఈకులమే మాస్టి పోసవ్వది. నట్టుకుదుర్లు, ఈలపీటలు, ఉదవ గొట్టాలు, సిబ్బిలు, పప్పుగుత్తులు, రొట్టెలపీటలు మొదలైన పనిముట్లను, వ్యవసాయనికి సంబంధించిన పనిముట్లను తీసుకొని ఊరిలో ఉన్న మాదిగ వాడలోకి ప్రవేశించడంతో కథ మొదలవుతుంది. ఈకథ ఆ రెండు కులాలకు మధ్య ఉన్న సంబంధాలను, ఇచ్చిపుచ్చుకొనే అంశాలను సవివరంగా చర్చిస్తుంది.

కన్నారం ఝాన్సి: ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఝాన్సీ కథ ” గోటీల దెబ్బ” పట్నానికి వలస వచ్చి విద్యా బుద్దులు నేర్చుకుంటున్న దళిత పిల్ల ఝాన్సీ, తిరిగి తన పల్లెకు పోయినప్పుడు అంటరాని తనన్ని అగ్రవర్ణాల వాళ్ళు పాటించడం అతి దగ్గర నుండి చూస్తుంది. పల్లెటూరి నుండి పట్నం వచ్చిన తర్వాత ఆ ఊరి కోమటి స్త్రీ అక్కడ ఉన్న దుకాణములో కనిపిస్తుంది. ఆమెకే తన దగ్గర ఉన్న గోటీలను అమ్మడం ద్వారా దూరం దూరం అన్న ఆ స్త్రీ చేతిపై తన చెయ్యి ఉండటాన్ని గర్వంగా బావిస్తూ అనందిస్తుంది ఆ పసి మనసు.

షాజహాన:ఖమ్మం జిల్లాలో జన్మించిన షాజహాన ముస్లిం స్త్రీల జీవితాల గురించి తనదైన ప్రత్యేక కోణంలో రచనలు చేస్తున్న ఈ రచయిత్రి ప్రతి అంశం మీద స్పష్టమైన అవగాహన కలిగివుంది. ” నకాబ్ ” అనే కవితా సంకలనాన్ని ప్రచురించిన ఈమె కథలు, వ్యాసాలు రాస్తుంటారు. ఈమె రాసిన కథ “సిల్ సిలా” ఓ నిరుపేద ముస్లిం దూదేకుల కుటుంబంలోని స్త్రీ కరీం బీ ఆమె మనోభావాలు, ప్రేమ, కరుణ కుటుంబం చుట్టు ఈ కథ తిరుగుతుంది. ఈ దేశపు ములవాసులైన ముస్లిం ప్రజల ధైన్య స్థితిని ఈ కథ మన ముందుంచుతుంది.

ఈ విధంగా తెలంగాణా స్త్రీ రచయితలు ఎన్నో సాహిత్య సృజన చేస్తూ ఆయా సమాజాలలోని కుటుంబాన్ని వ్యక్తులను వారి మధ్య అవినాభావ సంబంధాలను మానసిక సంఘర్షణలను వస్తువుగా తీసుకుని సామాజిక సాంస్కృతిక అంశాలను కథలలో ప్రతిబింభిస్తున్నారు. వీరి సాహిత్య సృజన చాలా సీరియస్ గా కొనసాగుతుంటుంది. మౌఖిక సాహిత్యం, కళలు, యక్షగానాలు, చిందు పురాణాలు, జానపద సాహిత్య సంపదనంతా వారసత్వంగా అందిపుచ్చుకుని ఆలవోకగా రచనలు చేయడం వీరికున్న అదనపు అర్హత. కాని యింకా ఏన్నో వెనకబడివున్న యస్. సి, బి. సి, మైనార్టి శ్రమ ఉత్పత్తి సమాజాల నుండి విరివిరిగా సాహిత్యం రావలసిన అవసరం ఉంది. అప్పుడే ఈ సాహిత్య స్రవంతి సంపూర్ణమౌతుంది. అప్పటివరకు అది అసంపూర్ణమే.

5 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

5 అభిప్రాయాలు

  1. Dr.Darla Sep 6, 2009 1

    సోదరి జాజుల గౌరి రాసిన వ్యాసం బాగుంది. ఇది ఒక ప్రయత్నం … ప్రయత్నాన్ని అభినందించాలి… విశ్లేషణ తదితరాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు.

  2. Rakesh Sep 8, 2009 2

    వ్యాసాలు రాసిన మహిళామణులను కూడా పరిగణిస్తే, మంథని బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేసిన “ప్రతిభా”రాణి గారిని పేర్కొనవచ్చు. విద్యాబోధన పద్ధతులపై ఆమె రాసిన ఒక వ్యాసాన్ని NCERT వారు ఆంగ్లంలోకి తర్జురుచేసి జాతీయ అవార్డు ప్రకటించారు.

    కథలు రాసిన విషయం తెలియదు కానీ – వ్యాసాలు, కవితలూ ఎన్నో రాసారు.

    మచ్చుకి -
    “వెనుకబడ్డ వాడెవ్వడు
    వెనుకబడ్డ వానిపేర వెనుకవేసుకునేదెవరు?
    తనయింటనె తండ్రివెంట తనకులవృత్తిని నేర్చి..
    సంతృప్తిగ బతుకువాడు వెనుకబడ్డవాడెట్లా?

    పైసా ఖర్చునులేకా.. మోసాలకు తావీయక, పేరాసను మదిజేర్చక
    నిర్విరావమముగ శ్రమించు నిపుణుడు కార్మికజీవుడు
    వెనుకబడ్డవాడెట్లా?”

    ఇలాంటివే, ఎన్నో ఏళ్ళక్రితం రాసినా, అముద్రితాలుగానేవున్న రచనలూ, కవితలూ, వ్యాసాలూ కలిపి “ప్రతిభా సౌరభాలు” అన్న పేరిట రాణి టీచరుగారి షష్ఠిపూర్తి (2004) సందర్భంగా డా. సినారె చేతులమీదుగా ఆవిష్కరింపడం జరిగింది.
    అటుపిమ్మట, కొద్దిరోజులకే – కాన్సరు వ్యాధితో ఆమె చనిపోవడం విచారకరం!!

  3. Dr.Darla Sep 8, 2009 3

    రాకేష్ గారూ… గౌరి వ్యాసం ప్రేరణతో ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం కలుగుతుందేమో… మీరు పేర్కొన్న ప్రతిభా రాణి గారి గురించి కనీసం ఒక బ్లాగు పోస్ట్ అయినా రాయండి. తర్వాత సాహితీ వేత్తలు కూడా దాన్ని పరిశీలిస్తారు. మీ ఉత్సాహం అభినందనీయం

  4. జాన్ హైడ్ కనుమూరి Sep 9, 2009 4

    జాజుల గౌరి రాసిన వ్యాసం బాగుంది. ఇది ఒక ప్రయత్నం
    అభినందనలు

    జాన్ హైడ్ కనుమూరి

  5. rahamthulla Nov 28, 2009 5

    భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
    కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
    మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

    న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

    ‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

    పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో