Sep2009
వెన్నెల శిల్పం
- బాణాల శ్రీనివాస రావు
అందరూ నిదురించేవేళ
రాత్రిని జోకొడుతూ……
ఎన్నడూ వినని పదాలకు
ప్రాణంపోస్తూ……
నిఘంటు అర్థాల్నిమార్చే
నవ భాషావేత్తా….
ఏ స్వరాలకందని
సుస్వరాలుకూర్చే
సంగీతకారిణీ…….
నీ పాటల్ని అర్థంచేసుకోలేని
మా అఙ్ఞానాన్ని మన్నించుతల్లీ!
ఉన్నట్టుంటే ఒక నదీతరంగం
ఆ చేతుల్లో ఒదిగే ఒయాసిస్సు
అటుగావెళ్ళే గాలికెరటం
ఆగదిలో వీచే వింజామర కుండపోతగా కురిసే వెన్నెల
గోడకు వేలాడే వెలుగు శిల్పం
వెలిసి వెలిసి అలిసిన హరివిల్లు
ఆచిన్నిమెడలో మెరిసే మణిహారం
ఆపాదాల స్పర్శకు పరవశించి
పాటలై ప్రవహించే పాల రాళ్ళు
సూర్యగోళం చుట్టూ తిరిగే గ్రహాలు
గతి తప్పి దిగొచ్చిన ఆటబొమ్మలు
నిశ్శబ్దం కొమ్మన కూసే
వెలుగు కోయిల స్వరమా…
స్పష్టంగా నీ ముందు
తలవంచే ఓ పసిడి బొమ్మ.