Oct2009
జాతశ్రీ రచన ‘ఆర్తా రావం’ కథల సంపుటి పై సమీక్ష
కుమ్మరి , దొమ్మరి, గౌడ. సాలె, పాకీ , వడ్రంగి, గూర్ఖా, బెస్త … … …, ఇవన్నీ లోక వ్యవహరంలో కులాలు కావచ్చేమో… … …కానీ, ప్రపంచం మొత్తం మీద రెండే రెండు కులాలున్నాయి. ఒకటి ఉన్నవాడు, రెండోది లేనివాడు. ఉన్నవాడు లేనివాడి రక్త మాంసాల్ని, బ్రతుకుల్ని, ఆలిబిడ్డల్ని దోచుకుని బలుస్తాడు. లేనివాడు ఈ ఉన్నవాడి దాష్టీకానికి ‘బలి’ అవుతూ ‘ ఆర్తనాదం’ చేస్తాడు.బ్రతకడానికి దోవ దొరక్క విలవిల్లాడిపోతారు. తమ తాత తండ్రుల కాలాన్నీ తమ బాల్యాన్ని వర్తమానంతో బేరీజువేసేకొని ఇప్పుడు ఎదుర్కొంటున్న తమ కష్టాలకు , కన్నీళ్ళకు కారణం దొరక్క అయోమయంలో పడతాడు. కుటుంబ భాద్యతలు శరీరంలోని కణకణమూ కాల్చేస్తుంటే శ్లేష్మంలోని ఈగలా విలవిల్లాడిపోతాడు. తప్పించుకునె దారి దొరక్క అల్లాడిపోతాయీ బక్కబ్రతుకులు. విదేశాలకు వలస; పెరుగుతున్న ఆర్థికావసరాలు ; స్థానిక ప్రభుత్వమే కావచ్చు, రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు కావచ్చు వీటి బాధ్యతారహితం… … …వీటన్నింటివల్ల పల్లె ప్రజలు వారి అనువంశిక వృత్తులు చితికి పోతున్నాయని చెప్పటమే ఈ ‘ ఆర్తా రావం’ .
ఎవరు ఎంత సమర్థించినా, ‘యంత్రీకరణ’ అనే సునామీ దేశంలోని లక్షలాది పల్లెల్లో బ్రతుకుతున్న అమాయక జనాల్ని ముంచివేస్తుంది, దీని కబళింతకు ఒక వృత్తి , ఒక ప్రాంతం, ఒక కులం అని లేదు – భర్త అసమర్థత వల్ల వేరే బతుకుతెరువు లేక అడుక్కుతినే పుల్మణి (విషాదం) , కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చలేని గౌడ్ల మల్లేష్ (అంతర్ముఖం) ; డిగ్రీ చదివి కూడా ఉద్యోగం దొరక్క విప్లవవాది ముద్రపడ్డ కొడుకుని కన్న పాకీ లాల్ పాసీ (అనివార్యం) . గంగిరెద్దునాడించి పొట్టపోసుకునే కొమరాలు (వ్యక్తి గతం), కుమ్మరి వెంకన్న (చలివెంద్రం), గూర్ఖా ధనీరాం (సబ్ ఠీక్ నహీ హై ) బ్రతుకు రోజురోజుకీ దుర్భరమైపోతున్నా నాగముని (కుట్ర) , తన మాడు పగులుతున్నా తీయని నీళ్ళిచ్చే కొబ్బరి బోండాం లాంటి గుండె కల జాలరి ఊరగల్లు (అగ్ని తుఫాను), దొమ్మరి వెంకన్న (చలివేంద్రం )……………, ఇలా అందరూ…. అన్ని వృత్తులవారూ బలైపోతున్నారు. ఒకప్పుడు ఘనంగా బ్రతికిన కుటుంబాలకు కూడు దొరకటమే గగనమై పోతోంది ఇప్పుడు., ‘ఏదో అంతా మాయపొర గమ్మినట్టుంది ‘ ‘ పొరుగువాని అవసరమూ మన అవసరంలాంటిదేనన్న ఇంగితమైనా లేకుండా మార్కెట్ మనస్తత్వాల్ని అనుసరించడం. నాడు మనుషులు ఒకరిపై ఒకరు చూపుకునే ఆత్మీయానురాగాలతో బ్రతికితే…, నేడు దోమల్లా, నల్లుల్లా, పరాన్నభుక్తులై సమాజంలో బ్రతుకుతున్నారని చెబుతాయి ఈ కథలు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేని మనిషి బలైపోతున్నాడు. మారలేని యీ మనుషుల క(వ్య) థలే ” ఆర్తా రావం”.
సంకలనంలోని పది కథలు పల్లె ప్రజల చుట్టూ అల్లబడినవే. పక్కోడ్ని విడిచి బ్రతకలేని జీవితాలు పక్కోడ్ని పొడిచి బతికే దాకా వస్తే… … …, మనసుల్లోంచి మానవత్వాన్ని చెరిపేసుకోలేక దగాపడుతున్న అన్నలు, అక్కలు,తమ్ముళ్లు చెల్లెల్ల గురించి రాసినవే!
వీటిని కథలనే బదులు వేర్వేరు వృత్తుల వారి జీవన విశ్లేషణ అనడం సబబు. వీళ్ళ జీవితాల్లో జాతశ్రీ ‘జీవించి’ రాసాడనటం సమంజసం. ఈయనకు చేపల్లోని వివిధ రకాలు తెలుసు. చీకటి రోజుల్లో సముద్రం మీద చేప విరివిగా దొరుకుతుందని తెలుసు. గౌడుల పనిముట్లు, వడ్రంగి పనిముట్లు తెలుసు. గంగిరెద్దులకు చేసే అలంకార విశేషాలు తెలుసు.
మరో తరం తరువాత ఈ కులవృత్తులు ఇంకా ఉంటాయన్నది అనుమానాస్పదమే. అందుకే ముందుమాటలొ సింగమనేని నారాయణగారు “ఆర్తా రావాన్ని” కాలనాళిక (టైమ్ కాప్సూల్) అన్నాడు.
సమస్యల్ని వేలెత్తి చూపడంతో రచయిత బాధ్యత తీరుపోదు. ఆ సమస్యలకు పరిష్కారమూ చూపగలగాలి. చితికిపోతున్న తమ బ్రతుకుల్లొ ఏం చేస్తే ఒడ్డున పడతారో తెలిపితే ఇంకా బావుండేది. రచయితల్ని విప్లవకారులు అంటారు. వీరి సందేశమే బడుగు బ్రతుకులకు ఆశాదీపం. ‘అనివార్యం’ లోని పాకీ లాల్ పాసీ కొడుకు రాంపాసీ, విధ్వంసంలోని దొమ్మరి పోశాలు కొడుకు కొండాలు తప్ప మిగతా పాత్రలన్నీ ‘ మడిసికి విలువ తగ్గిందని ‘ వాపోవడం తప్ప మరేమిచేయలేకపోయారు. అయోమయపు నాలుగురోడ్ల కూడలిలో ఎటు పోవాలో తెలవక చతికిలబడ్డారు. మరికొన్ని పాత్రలైనా వెలుగు వేపు ప్రస్థానం చేసినట్లు సంకలనంలో కథలను మలిస్తే బావుండేది. రచయిత తన సామాజిక బాధ్యత నిర్వర్తించినట్లుండేది. సంకలనం ‘ కాల నాళిక’ గా కాక కరదీపికగా తోడ్పడేది.
vajjala shivakumar Nov 16, 2009 1
చక్కని పరిశీలన, సునిశితమైన విమర్శ , కాలనాళికను కరదీపికగా మలచడానికి సూచన ,బాగున్నాయి .పాత్రల అసహాయత కు అద్దంపట్టిన తీరూ బాగుంది.కూర చిదంబరం గారికి అభినందనలు. — వఝల శివకుమార్.