Oct2009
అన్వేషణ
- డా|| కె.సుభాషిణి
ఈ మధ్య మాకొలిగ్స్ కొంతమంది నన్ను చూస్తూనే మాట్లాడ్డం మానేస్తున్నారని నా అనుమానం. ఒక్కొక్కసారి “సార్ మేడమ్ వస్తోంది.. ఊరికే వుండండి…” అని నా రాక గురించి మిగిలిన వాళ్లకు తెలియజేసే సంకేతాలు నాకు తెలుస్తున్నాయి.
అప్పుడప్పుడు………
“మా ముందు మాట్లాడటం కాదు… మేడమ్ ముందు మాట్లాడండి మీ తోలు తీస్తుంది..”
” అంటూ సవాళ్ళు విసిరే లేడీ లెక్చరర్స్ మాటలు కూడా నా చెవిన పడుతుంటాయి.
మా తమ్ముడేమో…” ఆ.. నారీలోకాన్ని వుద్దరించడానికి వచ్చిందమ్మా.. కారణజన్మురాలు..” నన్ను ఎగతాళి చేస్తూ తన అహంకారాన్ని ప్రదర్శించుకుంటుంటాడు వాడు.
నీకు చాదస్తం ఎక్కువవుతోంది అని ఒకరిద్దరు ఫ్రెండ్స్ అన్న సందర్భాలూ వున్నాయి. ఇలా అందరిలోనూ రంద్రాన్వేషణ చేసుకుంటూపోతే.. చివరకు నీకు నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు అని నన్ను హెచ్చరించిన వాళ్ళూ వున్నారు. ఎందుకు వృధా ప్రయాస.. నీ సంగతి నువ్వు చూసుకో వాళ్లకు లేని బాధ నీకు ఎందుకు.. కందకు లేని దురద కత్తికి అంటూ కొందరు నన్ను ఆపాలని కూడా చూశారు.
“వాళ్లంతకు వాళ్ళు వచ్చి.. అమ్మా! యిది మా సమస్య అని వస్తే.. అప్పుడు నువ్వు ఏదన్నా చేసినా అర్ధం వుంటుంది. నువ్వే వాళ్ళ దగ్గరకు పోయి ఇదిగో.. మీ సమస్య యిది.. నాకు చాలా బాధగా వుంది అని నువ్వు పుల్లపెట్టడం ఏం బాగాలేదు..” మా అక్క అలా మాట్లాడినప్పుడు…. ఆ క్షణంలో నిరుత్సాహంగా అనిపించినా… మరు నిముషం నుండే మొండిగా అన్వేషించడం మొదలుపెడతాను.
రెండురోజులు ఏదైనా వూరికి పోయి వస్తూనే..
“ఏమ్మా…! నీ అన్వేషణ ఎంతవరకు వచ్చింది? ఏమన్నా ఫలించిందా..” అంటూ నా కూతురు వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తుంది.
“పెద్దగయ్యాక నువ్వు కూడా నాతోపాటు రావాలి.. అప్పుడు అర్ధమవుతుంది నీకు.. ” నేను నవ్వుతూ చెప్తాను.
“అమ్మో!.. అంతబరువు బాధ్యతలు నేనెక్కడ మోస్తాను..” నా కూతురు భయం నటిస్తుంది.
ఈ అన్వేషణ ఎందుకు మొదలుపెట్టావు అంటే చెప్పలేను కాని… ఎప్పుడు మొదలుపెట్టావు అని ఎవరయినా అడిగితే మాత్రం సమాధానం ఠక్కున వచ్చేస్తుంది. ఆ సమయము సందర్భం అలా గుర్తుండిపోయాయి. కనీసం రోజుకు ఒక్కసారయినా గుర్తుకు వస్తూనే వుంటుంది. ఎంతమందికి చెప్పివుంటానో ఈ పాటికి.. నా మెదడులోనూ.. నాలుకమీద నాపేరు ఎంత స్థిరంగా వుండిపోయిందో.. ఆ సందర్భం కూడా అలా ఫిక్స్ అయిపోయింది.
ఆ రోజు సెమినార్ హాల్ లో మీటింగ్.. కొత్తగా చేరిన లెక్చరర్స్ ఒక్కొక్కరు వేదిక మీదకు వచ్చి తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. ఎప్పుడూ రొటీన్ గా వుండే కార్యక్రమమే.. అయితే ఎవరు ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు.. ఏ యూనివర్శిటీల్లో చదివి వచ్చారు అనే కుతూహలంతో వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటున్నాను.
సన్నగా కొంచెం పొడుగ్గా వున్న ఒక అమ్మాయి స్టేజి మీదకు వచ్చింది. అందరిలాగా నోట్లో వున్నది గబగబా చెప్పేయ్యకుండా నవ్వుముఖంతో చుట్టూ చూసింది. మెల్లిగా గొంతు సవరించుకొని… “ఐయామ్ సుధారాణి… ఫ్రం జె.ఎన్.టి.యూ అనంతపూర్… అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అపాయింట్ మెంట్..” నేను బి.టెక్ లో వుండగానే పెండ్లి అయ్యింది. అయినా డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. తర్వాత బాబు పుట్టాడు. సో.. టూ యియర్స్ ఖాళీగా వుండిపోయాను. యిప్పుడు మా బాబు పెద్దగయ్యాడు కాబట్టి జాబ్ లో జాయిన్ అయ్యాను..” అక్కడక్కడ చప్పట్ల శబ్దం వినిపిస్తే.. ప్రిన్సిపాల్ ముఖంలో నవ్వు కనిపించింది. ఆ క్షణంలో నేను కొంచెం వులికి పాటుకు గురయ్యాననే మాట మాత్రం వాస్తవం.
ఆ రోజు దాదాపు కొత్తవాళ్ళూ ఇరవైమంది దాకా పరిచయం చేసుకున్నారు. పద్నాలుగుమంది అబ్బాయిల్లోగాని ఆరుమంది అమ్మాయిల్లో గాని ఎవరు కూడా ఈ రకం ఎక్సప్లనేషన్ యివ్వలేదు. అంతకు ముందు ఎవరు కూడా యిలా మాట్లాడలేదు. లోపల ఏదో మెల్లిగా కదిలినట్టుగా వుంది. అలా చిన్నగా ప్రారంభమయిన కదలిక వుప్పెనలాగా విరుచుకుపడింది. అది మెల్లిగా అశాంతికి దారి తీసింది. ఆ అశాంతి నుండి పుట్టుకొచ్చిందే యిప్పటి నా అన్వేషణ.
“బి.టెక్ లో పెండ్లి అయ్యింది.. అని సుధారాణి చెప్పినంత సులువుగా ఏ ప్రసాదో లేకుంటే కార్తికో ఎప్పుడైనా, ఎక్కడైనా చెప్పారా? లేక చెప్తారా?ప్రశ్నలయితే తెగ పుట్టుకొస్తున్నాయి. వాటికి సమాధానం వెతికే సమయంలో యింకొక కొత్త విషయం స్ఫురించింది.
కొంతమంది ఆడపిల్లలకు అయితే చదువుతుండగానే తల్లిదండ్రులు పెండ్లి చేస్తున్నారు. కాని మగపిల్లలకయితే పెండ్లి ఊసే ఎత్తుకోరు. అయితే తల్లిదండ్రుల యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఏ సెకండ్ యియర్ లోనో, ధర్డ్ యియర్ లోనో ప్రేమించిన అమ్మాయిలను ఏ గుళ్లోనో, గోపురంలోనో పెండ్లి చేసుకునే అబ్బాయిల సంఖ్య ఈ మధ్య బాగానే పెరిగింది. వెంటనే తల్లిదండ్రులు సీన్లోకి ఎంటర్ కావడం.. జంటను విడగొట్టడం.. ఎవరి పిల్లల్ని వాళ్లదగ్గరే వుంచుకోవడం.. అంతటితో ఆగదు.. అమ్మాయిని కాలేజి మాన్పించి యింట్లో నిర్భందిస్తే.. అబ్బాయేమో జల్సాగా కాలేజికి వస్తాడు. కిందమీద పడి డిగ్రీ పూర్తి చేసుకుంటాడు.. అమ్మాయి చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది. వీళ్ళే సొంతంగా పెండ్లిచేసుకున్నా.. తల్లిదండ్రులు చేసినా ఏ రకంగా అయినా సరే ఎటుకాకుండా అయిపోతున్నది అమ్మాయిలే.
చదువుకుంటుండగానే మా వాళ్లు పెండ్లి చేశారు. తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళను చూసుకోవడానికి యింట్లో వుండిపోవాల్సి వచ్చింది. అందుకే జాబ్ చేయలేకపోయాను.. అంటూ అబ్బాయిలు ఎందుకు చెప్పరు.. మనం మాత్రమే ఎందుకు చెప్తున్నాం అని అమ్మాయిలు ఎప్పుడూ ప్రశ్నించుకుంటారో? అశాంతి ఎప్పుడు తగ్గుతుందో… ఏమో…?
డెబ్భై రెండేళ్ల ప్రభావతి ఆంటిని చూశాకా, నా అన్వేషణ ఎంత పురాతనమైనదో నాకు తెలిసొచ్చింది.
“అప్పట్లో నేను బి.ఏ. మ్యాథమేటిక్స్ చదివాను. బి.ఈ.డి. కూడా చేశాను. పెండ్లయ్యాక ఎయిడెడ్ స్కూల్లో కొంతకాలం టీచర్ గా పని చేశాను. మా పెద్దబ్బాయి పుట్టాకా.. వుద్యోగం, సద్యోగం అనుకుంటే వాడికి కష్టమవుతుందని కోప్పడి నన్ను వుద్యోగం మాన్పించాడు. యిప్పుడు కూడికలు, తీసివేతలు లాంటివి కూడా మరచిపోయాను. ఈయనను కాకుండా వేరే ఎవరినయినా చేసుకునివుంటే నా జీవితం వేరేగా వుండేదేమో…”
“అయ్యో ఆంటీ..మీరు నోరు విప్పి మీ అభిప్రాయాన్ని బలంగా చెప్పినంత వరకు మీరు కాంతారావ్ను చేసుకున్నా హనుమంతరావ్ ను చేసుకున్నా ఒక్కటే.. ప్చ్.. ఎంత ఘోరం.. యింత అసంతృప్తిని లోపల పెట్టుకుని యాభైఏండ్లు ఆయనతో సంసారం చేశారా..” నా మనసు బాధగా మూలిగింది.
నా అన్వేషణ అర్ధరహితమైనది కాదు చాలా అర్ధవంతమయినదని ఎవరు ఎంత ఎత్తి పొడిచినా.. వెక్కిరించినా లెక్క చేయకుండా యింకా తీవ్రతరం చేయాలని అప్పుడే అనుకున్నాను
* * * * * *
“ఏం ముంతాజ్ విశేషం..” స్వీటు తుంచి చిన్న ముక్కను నోట్లో వేసుకున్నాను.
“మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది ఆంటీ..”
“సంవత్సరం కిందట ట్విన్స్ పుట్టినప్పుడే వచ్చింది కదా..!”
అందంగా సిగ్గుపడింది ముంతాజ్.
“సీనియర్ అసిస్టెంటుగా ప్రమోషన్ వచ్చింది..”
తన వుద్యోగం సంగతి వదిలేసి మొగునికి ప్రమోషన్ వచ్చినందుకు సంతోషపడిపోతోంది ముంతాజ్.
ఎప్పుడొచ్చారో ముంతాజ్ కూతుళ్ళిద్దరు…. వాళ్ళమ్మ నైటిని పట్టుకుని చెరొకవైపు నిలబడ్డారు. ఇద్దరి పిల్లలతోనూ వేగలేక ఈ ఆరునెలల కాలంలో మనిషి సగమైపోయింది.
“నీది మెటర్నిటి లీవ్ అయిపోయింది!.. ఎన్ని దినాలు లాస్ ఆఫ్ పేలో వుంటావ్..? ఎటూ వీళ్ళు పాలు తాగటం లేదు కదా యిప్పుడు? ఒకటో తేది నుండి కాలేజికి పోవచ్చు కదా…?”
“ఎక్కడాంటీ..! పిల్లోల్లు కొంచెం పెద్దగయ్యాక కావాలంటే అప్పుడు ఏదన్నా చూసుకుందువు… యిప్పుడేంలే అని మా అత్త అంటోంది. ఒక్క పాప అయితే ఎట్లోగట్ల తిప్పలు పడిందును. మా అమ్మ దగ్గర కొన్ని రోజులు… అత్త దగ్గర కొన్ని రోజులు పెట్టివుందును. ట్విన్స్ కదా! వుద్యోగం గురించే ఆలోచించడం లేదాంటీ.. మాది ప్రవేట్ కాలేజి.. యిచ్చే జీతం అంతంత మటుకే .. యింక మెటర్నిటి లీవ్ లు ఏం వుంటాయి. అన్నీ లాస్ ఆఫ్ పేలే.. లేకుంటే ఏకంగా యింటికి పంపించడమే…”
“అయితే యిప్పట్లో చేరవన్న మాట…”
“చేరితే వీళ్లను ఎవరు చూస్తారంటే..”
“గ్యాప్ ఎక్కువయితే సబ్జెక్ట్ మీద గ్రిప్ వుండదు.. మరిచిపోతావ్.. ఈ కాంపిటీషన్ లో వుద్యోగం తెచ్చుకోవటం చాలా కష్టం..”
నాలో పెరిగిపోతున్న అశాంతి.. నా బాధ్యతను మరింతగా పెంచుతోంది.
“రియాజ్ది గవర్నమెంట్ జాబ్ కదా! కొన్ని రోజులు తను లీవ్ పెట్టి యింట్లో వుంటే… నువ్వు ఏదన్నా చూసుకోవచ్చేమో కదా..!”
అర్ధం పర్ధం లేకుండా ప్రశ్నలు వేసే చిన్న పిల్లను చూసినట్లు నా వైపు చూసినవ్వింది. ఘోరపరాజయం నాకు…
“వీళ్ళతో ఏగడం ఎవరి చాతనవుతుంది ఆంటీ..! ఏ టైమ్ కు ఏం తినిపించాలో ఆయనకు ఏం తెలుసు? ఒక్కరోజుకూడా వీళ్ళను భరించలేడు. రెండోరోజే సన్యాసం పుచ్చుకుంటాడు…” నవ్వాలో ఏడ్వాలో నాకు అర్ధం కాలేదు.
” పిల్లలకు ఏటైంలో ఏం తినిపించాలి అన్న విషయము మీద ముంతాజ్ ట్రైనింగ్ తీసుకోలేదు కదా! మరి పిల్లల్ని పెంచడం తనకు మాత్రమే తెలుసు.. మొగునికి ఏం తెలుసు అని ఎలా అనుకుంటుంది సంవత్సరం పాటు వుద్యోగం చేయడం కంటే ఒక్కరోజు ట్విన్స్ ఆలనా పాలనా చూడడం మగవాళ్లకు కష్టం.. మరి ఆడవాళ్లకు…?
“మేడమ్..”
ఉలిక్కిపడ్డాను. నా అన్వేషణ తాత్కాలికంగా ఆగింది. ఎదురుగా మేస్త్రీ పంపిన గౌండా నిల్చోని వున్నాడు.
“మేడమ్ పనికాడికి వస్తారా? వంటింట్లో గూళ్ళుయాడపెట్టాల్నో చెప్పాలంట…”
“సార్ లేరా?”
“వున్నాడు.. య్యాడేడా పెట్టాల్నో సార్ కేం తెలుస్తాది మేడమ్.. ఈ రోజే కుకింగ్ ఫ్లాట్ ఫామ్ కు బీమ్ ఏయ్యాల.. మీకు అరుగు ఎంత ఎత్తులో పెట్టాల్నో సార్ కు ఎట్లు తెలుస్తది..”
వొళ్ళు మండిపోయింది నాకు.
“ఆయనకు లేని ఫీలింగ్స్ వీళ్ళకు ఎందుకు వస్తాయో…” ఆవేశంగా ఏదో అనబోయి అంతలోనే వూరుకున్నాను. ప్రస్తుతం వాదించే వోపిక నాకు లేదు.
“సర్లే నువ్వు పో.. యిప్పుడే వచ్చేస్తాను…” తరిమినంత పని చేశాను.
వాళ్ళు వాగే నానా చెత్తను, తిక్క చేష్టలను భరించి మంచి ఇల్లాలు అనే బిరుదు సంపాదించుకొని ఆ ముళ్ల కిరీటం మోయటం కంటే ఎదురు తిరిగి వాళ్ళ నోరు మూయించి గయ్యాళి అన్న బిరుదును నెత్తిమీద మోసుకోవడమే నాకు మహా గొప్ప సుఖంగా వుంటుంది.
* * * *
“చూడండి మేడమ్.. ఈ ఎత్తులో కూచోబెడితే మీకు సరిపోతుందా?”
“వాళ్ళు ఏదో అడుగుతున్నారు… చూడు కొంచెం..”
ఏం పట్టనట్టు చేతులు వెనక్కు పెట్టుకొని పచార్లు చేస్తున్న ఆయన్ని కొంచెం విసుగ్గా పిలిచాను.
అన్నీ వింటుంటాడు.. చూస్తుంటాడు. కాని దేంట్లోనూ తల దూర్చడు. మామూలుగా నాకు సంబంధం లేదు అన్నట్టు వుంటాడు. ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి.
“అందరికి కన్వీనియంట్ గా వుండే హైట్ లో కూచోబెట్టండయ్యా..”
“కర్ర విరగదు.. పాము చావదు.. ఈయన ధోరణి ఎప్పుడూ ఇంతే. అలా కాకుండా.. ఏం ఆవిడ వొక్కతేనా వంటచేసేది.. మేం చేయమా? మాకు కూడా అరుగు అనుకూలంగా వుండాలా వద్దా అని అనొచ్చు కదా…!
ముఖం చిట్లించుకున్న నన్ను చూస్తూనే అయనకు విషయం అర్ధమయినట్లుంది.
“పని జరిగిపోతుంది.. అదే మనకు కావల్సింది. అన్నిటికీ అనవసరంగా బి.పి పెంచుకోవద్దు…”
నామొహాన సలహా ఒకటి పడేశాడు. విసురుగా ఏదో అనబోయాను. కాని ఎదురుగా కనిపించిన దృశ్యం పెరిగిపోతున్న నా బి.పి.ని తాత్కాలికంగా ఆపి.. పక్కకు పోయి జోగుతున్న నా అన్వేషణను తట్టిలేపింది.
ఎప్పుడూ చూసేదే కాని ఎందుకో ఆ సమయంలో వొళ్ళు గగుర్పొడిచింది.
ఇసుక, సిమెంట్ ను నీళ్ళు వేసి ఒక అబ్బాయి కలుపుతున్నాడు. యింకొక అబ్బాయి మాల్ ను ఇనుపగోళాలలో నింపి ఆడవాళ్ళ తలల మీద ఎత్తి పెడుతున్నాడు. తలమీద వున్న మాల్ గంపను కిందపడకుండా ఒక చేత్తో పట్టుకొని, ఇంకొక చేత్తో చంకలో వున్న పిల్లవాన్ని ఎగదోసుకుంటూ నేను నిలబడ్డ చోటుకు నెమ్మదిగా వస్తోంది శకుంతల. నేను కళ్ళు అప్పగించి అలా చూస్తూ వుండిపోయాను.
“మ్మోవ్.. నువ్విట్ల పెండ్లినడకలు నడ్సుకుంటూ వస్తే పనులుగావ్.. ఎప్పుడూ జూడు కొడుకును సంకలో ఏస్కోని తిర్లాడతాంటావ్..” ఖాళీ గంపను అందిస్తూ శకుంతలను విసుక్కున్నాడు గౌండా.
“పరిగెత్తుకొని రావల్నేమోల్యా పాపం.. యాడజూసినా రాళ్ళు, ఇసుక కాళ్లకు అడ్డంగా వుండాయి. పరిగెత్తినామంటే బొక్కబోర్లా బడి మూతి పండ్లు రాలగొట్టుకుంటాం అన్నోవ్..” శకుంతల గట్టిగా మాట్లాడేసరికి గౌండా కొంచెం తగ్గాడు.
“పోందా వాన్ని అట్ల మోసే బదులు యాడన్నా ఓ సోట కూసోబెట్టగూడదూ? పాలు తాగే సిన్న పిల్లోడా ఏమన్నా..! కాళ్ళు వచ్చినాయ్… యాడో ఒక సోట యిడ్సిపెడ్తే వాడే వుంటాడు…”
“ఈ రాళ్ళు, ఉసుక మధ్య యాడ కూసోబెట్టేది.. అయినా పిల్లగాడు వొక్కడు ఈ రాళ్ళు, ఉసుక మధ్య ఎంతసేపు తిర్లాడుతాడు. ఖర్మగాలి ఏందన్నా మీద ఏస్కుంటే.. ల్యాకపోతే మనం ఎవరు జూన్నప్పుడు ఆ నీళ్లగుంతలో పడితే! యింగేమన్నా వుంద్యా…? మళ్ళీ అదొక లంపటం అయ్యి కూసుంటాది నా పాణానికి…” ఖాళీ గంప తీసుకొని గౌండాకు సమాధానం యిస్తూ ఆగకుండా వెళ్ళీపోయింది.
మెల్లిగా తేరుకున్నాను. నా అన్వేషణ ఏదో చిక్కుముడిలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తోంది. సుధారాణి, ముంతాజ్, శకుంతల ఎవరి కష్టం వాళ్లది. సమస్య ఒకటిలాగానే కనిపిస్తుంది కాని ఒకే రకంగా చూడలేని పరిస్థితి. శకుంతల కేసు చాలా డిఫరెంట్.
చంకలో పిల్లాడు.. తలమీద గంప.. నాకు ఎదురుగా వస్తోంది. శకుంతల అంటే ఇక ఎన్నటికి యిలానే గుర్తుండి పోతుందేమో.
” నీ కొడుకును చూసుకోవడానికి యింట్లో ఎవరూ లేరా శకుంతల…” తన వెనుకే నడుస్తూ అడిగాను.
“ఎవరుంటారు..? మావోళ్లు అందరు పన్లకు పోయేటోళ్ళే.. మాయవ్వ అయితే యింటికాడనే వుంటాది. కాని కండ్లు సరిగ్గా కనపడవు. మనుమరాలయితే బాగా జూస్తాదని కొడుక్కి నన్ను జేసుకుంది మాయవ్వ. సన్న కొడుకని మావాయన్ని ముద్దుగా సాక్కొంది. వాయనకు మా పని సరిగా స్యాత కాదు మేడమ్… ఎన్నడన్నా జేసినా వచ్చిన పైసలు తాగడానికి జల్సాలు చేయడానికి సరిపోతాయి. తల్లి, పెండ్లాం, బిడ్డలు ఏమయిపోయినా బట్టదు. ఇంట్లో ఏంది అయిపోయినాయని సెప్పగూడ్దు.. ఖర్మగాలి సెప్పితినా యింగ అయిపాయ.. సావగొడ్తాడు. ఆమంచికి బుద్ధి పుట్టినపుడు యిన్ని బజ్జీలో ల్యాకుంటే వొడలో కట్టిచ్చకస్తాడు. ఎప్పుడన్నా టీకి పైసలు అడిగిత్తే రెండు రూపాయలు సేతిలో పెడ్తాడు. అదే మహాభాగ్యం నాకు…”
” కొడుకు పుట్టినాక కూడా మీ ఆయన ఏం మారలేదా? వీడు పుట్టినాకా ఎన్ని నెలల వరకు యింట్లో వుంటుంది…?”
తెల్లని పలు వరుస తళుక్కున మెరిసేట్టుగా నవ్వింది.
“నెలలా…! అయ్యో మేడమ్.. వీడు పుట్టిన పదారు దినాల్నుండే పనికి పోతాండా! యాదో ఒక చెట్టుకొమ్మకు చేరితే ఉయ్యాల గట్టేది.. దాండ్లో పండబెట్టేది. మధ్యలో పోయి పాలు యిచ్చేది. పని పంచేటు అయితాంది అని మేస్త్రీలు తిడతాంటారు.. కాని ఏం జేస్తాం.. చెప్పు మేడమ్.. ఇంట్లో మా మామతో తన్నులు తిని పస్తులుండేదాని కంటే.. వీళ్ళ తిట్లు స్యానా కమ్మగా వుంటాయి మేడమ్..”
చివరి మాటలు నవ్వుతూ చెప్పినా ఆ మాటల్లోని ఆవేదన, శకుంతల గుండెల్లో ఎన్ని సుడిగుండాలను సృష్టిస్తూ వుంటుందో ఊహించి నా గుండె బరువెక్కింది. బయటికి రాలేని ఆవేదనను అట్లే లోపలే నొక్కి పట్టేశాను. నాతో మాట్లాడుతూనే ఎక్కడా నిలబడకుండా శకుంతల తన పని తాను చేసుకుపోతోంది. ఆ పిల్లవాన్ని మోసి ఆ చెయ్యి ఏం కావాలి? నొప్పిని అలవాటుగా మార్చేసుకుందా శకుంతల?
పాలు తాగే పిల్లలు తల్లితో పాటు వుండాలి. అనేదానికి ఆర్ధం వుంది. మరి… పెద్దపిల్లల్ని కూడా తనతో పాటే తల్లి నిరంతరం మోయాలా? శకుంతల లాగా పిల్లని చంకలో మోసుకొని తిరిగే మనిషి ఎవరో గుర్తుకు వస్తున్నారు. ఎక్కడ.. ఎవరు.. ఓ అబ్బాయి చంద్రిక కదూ..! బస్సులో తను పోయే బస్సులోనే వస్తుంది చంద్రిక. టీచర్.. భుజాన బ్యాగ్.. చంకలో పిల్ల ఇంకొక చేతిలో బుట్ట, దాంట్లో పాపకు సంబంధించిన సరంజామా. మొగుడు, పెళ్ళాలు యిద్దరు టీచర్లే.. ఇద్దరు బస్ లో ఆప్ అండ్ డౌన్ చేసే వాళ్ళే. ఇద్దరు ఒకే రూట్ లో వెళ్ళే వాళ్ళే. అతనే దిగిపోయేది. పాపతో పాటు ఆమె హుస్సేనాపురం వరకు వెళ్లాలి. మళ్లీ అక్కడినుండి కొంచెం దూరం నడిచేది వుంటూందని చెప్పింది. ప్చ్!.. వద్దురా తండ్రీ ఈ బాధలు…
“అబ్బా… సంపితివి కదరా.. ఎంతేటుకొరికితివిరా నా కొడకా..”
శకుంతల అరిచిన అరుపుకు వులిక్కిపడ్డాను. పయిట సరి చేసుకుంటోంది. క్షణంలో పరిస్థితి అర్ధమయ్యింది.
“బుద్ధుందా నీకు కొంచెమన్నా! నీ దగ్గర పాలు వుంటే కదా వాడు తాగడానికి రాని పాలతో వాడు మాత్రం ఎట్లు కడుపు నింపుకుంటాడు. లేయ్.. లేసి వానికి కొంచెం ఏమన్నా తినిపించు..”
” వీనికి పొద్దూకులు తిన్పిచ్చుకుంటూ కూసుంటే మేస్త్రీ వూకోడు మేడమ్.. రేపట్నుండి పన్లోకి రావాకు… ఇంటికాన్నే వుండి నీ కొడుకును మేపుకుంటాండు అని సెప్తాడు.. ఆమాటలు పల్ల్యాకనే ఈ నాకొడుకుని యిట్లా ముందు ఏస్కోని కూసునేది. మాయవ్వ యింగొగ మాటకూడా సెప్పింది.. పిల్లోనికి పాలు యిచ్చినంతకాలం మళ్ళీ నెల తప్పమంట కదా..” చివరిమాటలు తలొంచుకుని మెల్లిగా గొణిగింది. నేను కూడా ఎందుకో ఆ మాటల్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. నా ఆలోచన వేరే దగ్గర వుంది.
” ఇంటికాన్నే వుండి.. వాన్ని మేపడమా..” గొంతులో ఏదో అడ్డం పడినట్లుగా అనిపించి బలవంతంగా గుటక వేశాను. ఉక్కిరి బిక్కిరిగా వుంది. త్వరగా ఏదో ఒకటి చెప్పాలి.
“పిల్లలున్నాక యిలాంటివి వుండకుంటే ఎలా వుంటాయి? ఏం కాదులే మీ మేస్త్రీకి నేను చెప్తాను. వానికి ముందు కడుపు నిండా ఏదో వొకటి తినిపించు. లేకపోతే వాడు ఏడుస్తుంటే పని అసలే చేయలేవ్…”
శకుంతల సమస్యను తాత్కాలికంగా మాత్రమే సర్దగలిగాను.
* * * * *
మొన్నటి నుండి నా మీద నాకే విసుగు, చిరాకు కలుగుతున్నాయి. టన్నుల కొద్ది బరువును వీపు మీద మోస్తున్నట్టుగా వుంది. కళ్ళ ముందు తెరుచుకున్న కొత్త ప్రపంచపు ద్వారాలు నా వీపు మీద వున్న బరువును ఎలా దించుకోవాలో చెప్తున్నాయి.
యిన్ని రోజులు పక్కిళ్ళు, ఎదురిళ్ళు… ఆవీధి, ఈ వీధి… ఆ కాలేజి, ఈ ఆఫీసు.. ఆ ఊరు, ఈ సిటి అన్నా అన్వేషించాననే అనుకున్నాను. అయితే నా అన్వేషణ ఎంత పరిమితమైన సర్కిల్ లో చేసుకుంటూ పోయానో శకుంతలను చూశాక స్పష్టంగా అర్ధమయ్యింది.
“ఒకవేళ శకుంతలకే కవలపిల్లలు పుట్టింటే ఏంటి పరిస్థితి..?” ఆ ఊహకే వొక్కసారిగా వొళ్ళు జలదరించింది.
“అమ్మో..” గుండెను అదిమి పెట్టుకున్నాను.
“మరి ముంతాజ్ కు కవల పిల్లలే కదా!…”
“కావచ్చు.. కాని యిద్దరి పరిస్థితి ఒక్కటే ఎట్లవుతుంది..?” తేడా నాకు స్పష్టంగా తెలిసిపోతోంది.
“ఇద్దరి పిల్లలతో శకుంతల పనికి ఎలా పోగలదు..? మేస్త్రీ పనిలోకి రానిస్తాడా? రానిచ్చే ప్రసక్తే వుండదు. అప్పుడన్నా శకుంతల మొగుడు సంసారాన్ని. పట్టించుకుంటాడో పట్టిచ్చుకోకపోతే ఏంగతి… ఏం చేస్తుంది. పాపం తనకు తప్పదు కదా.. బహుశా తల్లికి అంటగట్టి పనికి పోతాదేమో.. లేకుంటే పుట్టింట్లో వుంటుందేమో. ఎన్ని రోజులు వుండగలదు? ఎప్పుడైనా పనికి పోవాల్సిందే కదా! ఇద్దర్ని పట్టుకొని నేను పనికి ఎట్ల పోతాను. ఒక్కర్నినీ ఎంబడి తీస్కపో అని శకుంతల మొగునితో అంటే ఎంతబాగుంటుంది..! చదువుకున్న ముంతాజ్ అనలేకపోతే యిక శకుంతల అనగలదా? అంటే గింటే ఎన్నటికైనా శకుంతలే అనాల..! ముంతాజ్ మాత్రం రియాజ్ తో అలా అనదు.. అనలేదు.. అనలేదు కూడా. తను వుద్యోగం చేయకపోయినా యిల్లు గడుస్తుంది అనే ధీమా.. ప్రవేట్ జాబ్ తర్వాత ఎక్కడైనా దొరుకుతుందనే ధైర్యం… ఒకవేళ ముంతాజ్ ది పర్మినెంట్ వుద్యోగం అయ్యి.. రియాజ్ ది ప్రవేట్ జాబ్ అయితే ఏం చేసే వాళ్ళు? వుద్యోగం వదిలేసి పిల్లల్ని చూసుకుంటూ రియాజ్ ఇంట్లో వుంటాడా…?”
నా ఆలోచనకు నాకే నవ్వు వచ్చింది.
అదే నిజమైతే ఈ అన్వేషణతో పని ఏముంటుంది…? అశాంతి ఎందుకు వుంటుంది. నా పిచ్చి కాకపోతే యింకొక విషయము అశాంతిని లేపుతుంది.. “అయినా మగవాళ్లు అంత సులభంగా వుద్యోగాలను వదిలివేయరు. అంతగా అయితే భారం అనిపించినా మనిషిని పెట్టుకుంటారు. సుధారాణి చేసింది అదే కదా! మొగుడు పెళ్ళాలిద్దరు కలిసి నెలకు యాభైవేలు సంపాదిస్తుంటే నెలకు రెండు వేలు పెట్టి మనిషిని పెట్టుకోవడం పెద్ద విషయం కాదు…” తల విదుల్చుకున్నాను. నిద్రపట్టక పరుపుమీద అటుయిటు దొర్లుతున్నాను. ఆయనేమో ప్రశాంతంగా గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఎంత హాయిగా నిద్రపోతున్నాడో? ఒక్క నిమిషం అసూయగా అనిపించింది.
నాకు ఎందుకు నిద్రపట్టదు?
“వూర్లో వాళ్ళ సమస్యలన్ని నీ సమస్యలే అనుకుంటావ్..” ఎవరో చెవిలో అరిచినట్టుగా అనిపించింది. ఓహో… అయితే.. వీళ్ళకు సమస్యలేమీ లేకపోతే.. అన్వేషణ వుండదు.. హాయిగా నిద్రపోవచ్చు…” మెల్లిగా కళ్ళు మూతలు పడుతున్నాయి.
October 12th, 2009 at 3:04 pm
ఉత్తం పురషలొఅ సాగిన ఈ కథలొఅని కథానాయకి ” హైపొ కాడ్రియాక్ ” అన్న వ్యాధితొ భాదపడుతున్నట్లు అర్థమౌతున్నది.