Oct2009
మహా మేధావి, మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ కు ప్రాణహిత కన్నీటి నివాళి

డా|| కె. బాలగోపాల్
బాలగోపాల్ ఇంక లేరు అనే వార్త ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదు. అది క్రూరమైన వాస్తవమని తెలుస్తున్నప్పుడల్లా, అది అబద్దమైతే ఎంత బాగుండు అని గొంతుకు పుట్టెడు దుఃఖం అడ్డు పడుతున్నది. నిద్రపోతున్నట్టే ఉన్న ఆయన నిర్జీవ శరీరం ఫొటొల్లో చూస్తున్నప్పుడల్లా కన్నీళ్ళు ఆగకుండా దుంకుతున్నయి. ఎక్కడ పేదలకు, అభాగ్యులకు, దళితులకు, ఆదివాసిలకు, సమాజంలో నోరూ, ‘అస్తిత్వమూ’ లేని అసంఖ్యాక ప్రజానీకానికి అన్యాయం జరిగిందన్నా డైరీ పట్టుకు ప్రత్యక్షమయ్యే బాలగోపాల్ ఇంక కనబడరు అంటేనే గొప్ప శూన్యం ఆవరించి హృదయం భోరుమంటున్నది. తెలంగాణ లో అన్నట్టు ‘మా ఆయుష్షు పోసుకునైనా’ బాలగోపాల్ మళ్ళీ జీవించి వస్తే ఎంత బాగుండు అనిపిస్తున్నది. అప్పుడే ఆయన వెళ్ళిపోయి మూడు రోజులు దాటుతున్నది. ఆయన లేడనే కఠోర సత్యం వెన్నంటి వేటాడుతున్నది.
ఒక మహా మేధావిగా, రచయితగా, సాహిత్య విమర్శకునిగా, ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తగా, మార్క్సిస్టు విశ్లేషకునిగా, పౌరహక్కుల, మానవహక్కుల ఉద్యమకారునిగా, సామాన్య కార్యకర్తగా బాలగోపాల్ తెలుగు ప్రజలకే కాదు, యావద్భారతానికీ గత 30 ఏండ్లుగా తెలుసు. ముతక అంగీ, దూసుకోని తలా, చిరిగిపోయిన చెప్పులూ, చేతిలో డైరీ తో బాలగోపాల్ ని మొదటిసారి చూసిన వాళ్ళెవరైనా కొంచెం ఆశ్చర్యపోతారు. ఒక్క సారి ఆయన కంచుకంఠం , నిశితమైన వ్యాఖ్యలు, పరిశీలన , ఎవరికీ తట్టని కోణాల్ని ఆయన కొత్త పద్దతిలో స్పృశించిన తీరు, నిర్మొహమాటంగా చెప్పదల్చుకున్నది స్పష్టంగా నీళ్ళు నమలకుండా చెప్పే పద్దతీ అనుభవంలోకి వచ్చాక ఇంక ఆయన్ని మర్చిపోవడం అసాధ్యం. ముఖ్యంగా ఆయన నిరాడంబరత, నిబద్దత, అన్నింటికంటే మించి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన అందరికంటే ముందే నిలబడి ఒక సామాన్య కార్యకర్తగా పనిచెయ్యడం ఒక గొప్ప ప్రేరణా ఉత్తేజాన్నీ ఇచ్చేది. గత 30 ఏండ్లుగా తెలుగు నేలపై బహుశా ఇంకెవ్వరూ చెయ్యలేనంత పనినీ , ఇంకెవ్వరూ రాయలేనంత రచనలనూ, ఇంకెవ్వరూ జీవించలేని జీవితాన్ని మనకందించి, తన మహత్తర మేధో శక్తిని పూర్తిగా ప్రజల పరం చేసి వెళ్ళిపోయిన బాలగోపాల్ లాంటి వాళ్ళు బహుశా శతాబ్దానికి ఒక్కరే జన్మిస్తారు. నీతీ, నిజాయితీ మానవత్వమూ, నమ్మిన విలువలకోసం నిలబడడం బొత్తిగా మృగ్యమై పోయిన ఈ ప్రపంచీకరణ యుగంలో, నిస్వార్థంతో అత్యంత నిరాడంబరంగా జీవించి, ఇతరులకు దాదాపు అసాధ్యమైన ఒక ‘రుషి’త్వంతో ‘కాగితం మీద అక్షరానికి బలై పోయి’న బాలగోపాల్ వ్యక్తిత్వం మహోన్నతమైనది. అనితర సాధ్యమైనది.
1952 అక్టోబర్ 6 న బళ్ళారిలో లో పండిత కుటుంబం లో జన్మించిన బాలగోపాల్ ప్రముఖ సాహిత్యవేత్త రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ మనుమడు. తండ్రి ఉద్యోగ రీత్యా అనేక వూళ్ళు తిరిగిన కారణంగా, బాలగోపాల్ ఇంటర్మీడియేట్ కావలిలో, డిగ్రీ తిరుపతిలో చేసారు. తర్వాత వరంగల్ ఆర్ . ఇ . సి లో గణిత శాస్త్రంలో ఎమ్మెస్సి, పీఎచ్ డి చేసారు. గణిత శాస్త్రంలో అద్భుతమైన ప్రతిభ ను కనబర్చిన బాలగోపాల్ సంభావ్యతా సిద్దాంతం పై అనేక అంతర్జాతీయ పత్రికల్లో విలువైన సరి కొత్త ప్రతిపాదనలు ప్రకటిస్తూ వ్యాసాలు రాసారు. వరంగల్ ఆర్ . ఇ. సి లో ఉన్నప్పుడే ఆయన మీద అప్పుడు వెల్లువెతుతున్న విద్యార్థి ఉద్యమాలు, పీడిత ప్రజల పోరాటాలు తీవ్రమైన ప్రభావం నెరపాయి. స్వయంగా అత్యంత ప్రతిభావంతుడైన ఆయన ఆలోచనా విధానాన్ని, ఆర్ , ఇ. సి లో, వరంగల్ లో విద్యార్థి ఉదయమాన్ని నిర్మిస్తున్న సూరపనేని జనార్ధన్, జన్ను చిన్నాలు పీడిత ప్రజల వైపు మళ్ళించారు. నిరంతర అధ్యయనశీలి అయిన బాలగోపాల్ గణితంతో పాటు సామాజిక, ఆర్థిక శాస్త్రాలను, చరిత్రనూ విస్తృతంగా అధ్యయనం చేసారు. బారత దేశ చరిత్రను కొత్త కోణంలో ఆవిష్కరించిన డి. డి. కోశాంబి రచనల అధ్యయనం, సూరపనేని జనార్ధన్ ఆచరణ బాలగోపాల్ ఆలోచననీ , వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దాయి. ఇంక అక్కడినుండి బాలగోపాల్ 30 ఏండ్లుగా సాగించిన జీవితమూ, ఆచరణ ప్రస్థానం పీడిత ప్రజలకూ , అభాగ్యులకూ, తమ హక్కుల కోసం ఉనికి కోసం అడిగే నోరు లేని ప్రజలకూ అంకితమైంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో రీడర్ గా చేరిన బాలగోపాల్ జీవిక కోసమే ఉద్యోగం చేసినా గొప్ప నిజాయితీ , క్రమశిక్షణ గల ఉపాధాయడిగా పేరుపొందారు. ప్రజలతో అతి సన్నిహితంగా పని చేసే హక్కుల ఉద్యమకారుడిగా, సామాన్య కార్యకర్తగా, ప్రతి సామాజిక అంశాన్ని అతి సూక్ష్మంగా, నిశితంగా పరిశీలించి, విశ్లేషించే సామాజిక శాస్త్రవేత్తగా, సాహిత్యాన్ని పదునైన దృష్టితో విమర్శించి అనేక విలువైన పరిశీలనలు చేసిన సాహిత్య విమర్శకుడిగా, ఎక్కడ అన్యాయం, అత్యాచారం జరిగినా అక్కడ అలుపెరగకుండా నిజనిర్ధారణ జరిపే సత్యశోధకుడిగా, ఒక్క తెలుగు నేలపైనే కాదు కాశ్మీరు, మణిపూర్ , ఛత్తీస్ ఘడ్ , గడ్చిరోలి, పంజాబ్ - దేశం నలుమూలలా ఇంకెవ్వరూ శోదించనన్ని మూలమూలల్ని తిరిగి భారత దేశ నైసర్గిక స్వరూప స్వభావాల్ని ఔపోసిన పట్టిన సామాజిక బాటసారిగా బాలగోపాల్ ది అపురూపమైన, అరుదైన బహుముఖీన వ్యక్తిత్వం. వరంగల్ లో పోలీసులు, రాజ్యమూ తనని వెంటాడి వేధించినా, అనేక బెదిరింపులకు గురిచేసి కిడ్నాప్ చేసినా, కొట్టినా, హింసించినా ఎంత మాత్రమూ లొంగలేదు. బెదరలేదు. తన ప్రస్థానంలో వెనుకంజవేయలేదు. చెక్కుచెదరని దృఢసంకల్పంతో , నిబద్దతతో, చిత్తశుద్దితో, అంకిత భావతో ఆయన తాను ఎంచుకున్న, సరిఅయినది అనుకున్న మార్గంలో ప్రయాణం చేసారు. సమకాలికులకే కాదు, అనేక ముందు తరాల వారికీ మారదర్శకంగా నిలిచారు.
హక్కుల రంగం ప్రధాన కార్యక్షేత్రంగా ఎంచుకున్న బాలగోపాల్ తాను మొదటి నుండీ నిర్మించి భాగమైన ఎ. పీ. సీ. ఎల్సి నుండి సైద్దాంతిక విభేదాలతో బయటికొచ్చారు. మనం పాలకవర్గాలు, రాజ్యమూ , పోలీసులూ కాలరాచివేస్తున్న హక్కుల గురించి ఉద్యమిస్తున్నప్పుడు, రాజ్యాధికారం కోసం పోరాడుతున్న వారు హరిస్తున్న హక్కుల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందనీ, ప్రదానంగా ప్రజల జీవించే హక్కు గురించి పోరాడాల్సిన అవసరం ఉందనీ ‘మానవ హక్కుల వేదిక’ స్థాపించారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలం హక్కుల కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని హై కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంబించి అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రతిభావంతుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. న్యాయవాదిగా కోట్లు గడించే అవకాశం ఉన్నా బాలగోపాల్ తన వద్దకు వచ్చే వారి దగ్గర ఖర్చుల కన్నా ఎక్కువ ఏనాడూ ఫీజు తీసుకోలేదు. ఆయన దగ్గరకి న్యయం కోసం వచ్చిన వాళ్ళంతా అభాగ్యులే, నిరుపేదలే! పైగా ఆయనే సమాజం లో ఉనికీ, అస్తిత్వమూ లేని అనేక ప్రజా సమూహాల వద్దకు వెళ్ళి వాళ్ళ తరఫున, వారి న్యాయమైన హక్కుల కోసం కేసు ఫైలు చేసేవారు. చెంచులు, యానాదులు, పాకీ వాళ్ళు, ఆదిలాబాదు ఆదివాసిలు, దళితులు – ఒకరేమిటి సమాజం అంచులకు నెట్టివేయబడ్డ పతితులు, భ్రష్టులు, దగాపడిన ప్రజానీకం – అందరూ ఆయన క్లైంట్లు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులవుతున్న ఆదివాసిల కోసం, విశాఖ లో బాక్సైటు తవ్వకాల్లో, సముద్రతీరంలో ‘పారిశ్రామికీకరణ’ వల్ల కూడు, గూడు కోల్పోతున్న అసంఖ్యాక ప్రజానీకం కోసం, ఆదిలాబాదులో మలేరియా బారిన పడి మరణిస్తున్న వారికోసం, సెజ్ ల వల్ల జీవనోపాధి కోల్పోయిన పేద రైతుల కోసం, చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై దాడి పేరు మీద పోలీసులు, కోబ్రాలు నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తున్న ఆదివాసిల కోసం, కాశ్మీరులో ‘టెర్రరిస్టులని ఏరిపారేసే’ నెపం మీద పోలీసులు, సైన్యం ఉక్కుపాదాల కింద నలిగిపోతున పేద ముస్లిం ల కోసం, హైదరాబాదులో తీవ్రవాదులు దాడి చేస్తే పాతబస్తీ లో పోలీసులు పట్టుకెళ్ళి కాల్చిపారేసి ఎన్కౌంటరన్న నిరుపేద ముస్లిం యువకుల కోసం, సింగరేణి లో ఓపెన్ కాస్టు మైనింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయే గని కార్మికుల కోసం- ఒకరేమిటి, ఒకచోటేమిటి – దేశం నలుమూలలా ప్రజల జీవించే హక్కు కోసం బాలగోపాల్ తన జీవితమంతా ఒక అలుపెరుగని సేనానిలా పోరాడారు. ఆయన హక్కుల ఉద్యమం పరిధిని మున్నెన్నడూ లేనంతగా విస్తృతపరిచారు. కేవలం ఎన్కౌంటర్ లలో , రాజ్యహింసలో చనిపోయిన వాళ్ళకోసమే కాదు, ప్రతి మనిషికీ జీవించే హక్కు కోసం, రాజ్యాంగం రాసుకున్న గౌరవప్రదమైన జీవితం కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం హక్కుల ఉద్యమం పని చేయాల్సిఉన్నదనీ, ఆ మేరకు హక్కుల ఉద్యమం ప్రజాస్వామికంగా విస్తృతమవ్వాలనీ నమ్మి అది ఆచరణలో చూపించారు. హక్కుల ఉద్యమం కేవలం ఉన్నత వర్గాలకు చెందిన మేధావుల ఉద్యమం కాదనీ, దాన్ని అట్టడుగు వర్గాల ప్రజలవద్దకు, వారి మూలాల్లోకి ఆచరణాత్మకంగా తీసికెళ్ళాల్సిన అవసరం ఉందనీ చెప్పి, తన జీవితాన్ని అందుకోసం అంకితం చేసి, మానవహక్కుల ఉద్యమానికి విశాల ప్రజాస్వామిక ప్రాతిపదికని ఏర్పరిచారు. అందుకే ఆయన మరణవార్త విని తెలుగు నేల నలుమూలలా శోకిస్తున్నది. యావద్భారత దేశం నలుమూలలా కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా కంటనీరు పెట్టుకుంటున్నది.
బాలగోపాల్ కృషి, కార్యక్షేత్రమూ ప్రదానంగా హక్కుల రంగమే అయినప్పటికీ ఆయన ఆర్థిక, సామాజిక, చరిత్ర రంగాలలో విశేషమైన కృషి చేసారు. విలువైన ప్రతిపాదనలెన్నో చేసారు. ఆయన EPW (Economic and Political Weekly of India) లో రాసిన అనేక వ్యాసాలు ఆయన మహత్తర మేధాశక్తికీ, సూక్ష్మదృష్టికీ, నిశితమైన పరిశీలనలకూ , ఆంగ్లభాషపై ఆయనకున్న పట్టుకూ అద్దం పడతాయి. డి. డి. కోశాంబి ని పరిచయం చేస్తూ ఆయన రాసిన పుస్తకం ఒక కరదీపిక లాంటిది. ఆంధ్రజ్యోతి, ప్రజాతంత్ర లాంటి పత్రికల్లో ఆయన రాసిన కాలమ్స్ నడుస్తున్న చరిత్రను కొత్త కోణాల్లో పరిచయం చేసినవి. ముఖ్యంగా ఈ మధ్య వై. ఎస్ . ఆర్ చని పోయినప్పుడు అన్ని పత్రికల్లో ఆయన మరణానికి నివాళులర్పిస్తూ వ్యాసాలొస్తున్నప్పుడు బాలగోపాలొక్కరే ‘నిత్య మరణానికి నివాళులెక్కడ’ అంటూ ఆదిలాబాదులో మలేరియా బారిన పడి మరణించిన ఆదివాసిల గురించి కనువిప్పు కలిగించే అద్భుతమైన వ్యాసం రాసారు. సాహిత్యంలో బాలగోపాల్ చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. చెర మరణించినప్పుడు రాసిన వ్యాసం కానీ. కొకు సాహిత్యం మీద రాసిన వ్యాసాలు కానీ , సాహిత్యం ‘రూపం-సారం’ గురించి రాసిన వ్యాసాలు కానీ సాహిత్యంలో బాలగోపాల్ చేసిన అద్భుత కృషికి తార్కాణం. ఐతే ఇతర రంగాల్లో లాగే సాహిత్య విమర్శలో కూడా ఇంతకు ముందే ఏర్పర్చిన దారిలో వెళ్ళకుండా బాలగోపాల్ కొన్ని విలువైన ప్రతిపాదనలని చేసారు. సాహిత్యం కేవలం ఉద్యమ సాహిత్యం గానో, లేక ఉద్యమానికి అనుబంధంగా ఉండే సాహిత్యంగానో ఉండాల్సిన అవసరం లేదనీ, సాహిత్యం జీవితం నుండి రావాలని, జీవితాన్ని విభిన్న కోణాల్లో ప్రతిఫలించాలని, జీవితం లోని ఖాళీలని పూరించాలని ప్రతిపాదించారు. సంప్రదాయ ఛాందస మార్క్సిస్టులకి భిన్నంగా, సాహిత్య విమర్శనీ ప్రయోజనాన్నీ మార్క్సిస్టు పద్దతిలోనే ముందుకు తీసికెళ్ళి మార్క్సిజాన్ని సుసంపన్నం చేసిన రేమండ్ విలియమ్స్ , థియోడోర్ అడోర్నో లాంటి పాశ్చాత్య మార్క్సిస్టుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జీవితం చీకటి కోణాలని సమర్థవంతంగా పట్టుకోవడం మంచి సాహిత్యం లక్షణమనీ , చైతన్యవంతంగా జీవించదల్చుకున్న మనిషికి భయం వల్లనో, అభద్రత వల్లనో, బలమైన భావజాలం ప్రభావం వల్లనో, ఇంతకు ముందే ఏర్పర్చుకున్న దృక్కోణం వల్లనో కళ్ళముందే ఉండి చూడలేకుండా పోయిన అనేక విషయాలని సాహిత్యం చూపిస్తుందనీ, అట్లా చూపించే క్రమంలో ఏయే కారణాల వల్ల అంతవరకూ ఆ విషయాలు కనబడకుండా పోయినవో సాహిత్యం చెప్పకనే చెపుతుందనీ అది గొప్ప సాహిత్య లక్షణాల్లో ఒకటనీ బాలగోపాల్ ప్రతిపాదించారు. ఆధునికతకూ, సంప్రదాయానికీ మధ్య ఘర్షణ ని సమర్థవంతంగా చిత్రించి, ఆధునికతను స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్న గిరీశం లాంటి దగుల్బాజీ లను ఏంటీ-హీరో గా ఎన్నుకున్నా గురజాడ కన్యాశుల్కం మనల్ని ఆధునికత వైపు రమ్మంటుందనీ అందువల్లే అది గొప్ప సాహిత్యంగా నిలబడిందనీ , ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న విశ్వనాథ సాహిత్యం నిలబడలేదని నిర్మొహమాటంగా ప్రకటించారు.
అన్ని రంగాలలో తనదైన విశిష్ట ముద్ర వేసిన బాలగోపాల్, తన జీవితాంతం ఆయా రంగాల్లో ఒక విస్తృతమైన ప్రజాస్వామిక ప్రాతిపదిక కోసం నిరంతర కృషి సలిపారు. నిజానికి ఆయన కేవలం గణితం లోనే కృషి సలిపి ఉంటే నోబెల్ ప్రైజ్ రావాల్సిన ప్రతిభావంతుడని అనేక గణిత శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు కూడా! కానీ బాలగోపాల్ దృష్టి విశాలమైనది. అతి నిశితమైనది. ఆయన మార్గం పేద ప్రజల పక్షం వహించడం. కేవలం మాటల్లో కాదు స్వయంగా కఠోర దీక్షతో, నియమ నిబద్దతలతో, అంకిత భావంతో ఆచరించి చూపారు. తన అతి తక్కువ జీవిత కాలంలో మనం కొన్ని తరాల పాటు ప్రేరణ పొందగలిగే, ఉత్తేజం పొందే అపురూపమైన జీవితాచరణనూ, అనుభవాన్నీ , రచనలనీ మనకు వదిలి వెళ్ళారు. స్వయంగా మితభాషి అయిన బాలగోపాల్ అవసరమైతే తప్ప మాట్లాడే వారు కారు. మాట్లాడితే ప్రతి మాట విలువైనదే!
చివరిసారిగా హైదరాబాదులో ఒక సభలో కల్సినప్పుడు ‘సార్! బాగున్నారా? ‘ అనే ప్రశ్నకు సమాధానంగా ‘ పని చేస్తున్నా కదా! బాగున్నట్టే లెక్క’ అన్నారు. పనిని, ప్రజల కోసం పనినే ఊపిరిగా, జీవించడంగా , జీవితంగా భావించి మసలుకున్న ఆకాశమంత ఎత్తైన మహా వ్యక్తిత్వం ఆయనది. అటువంటి అరుదైన మనిషినీ, వ్యక్తిత్వాన్నీ కోల్పోవడం మనకు పూడ్చలేని లోటు. బాలగోపాల్ మనమధ్య లేకున్నా ఆయన జీవితాచరణ ఉన్నది, ఆయన నమ్మిన జీవన విధానమూ, ఆశయాలూ ఉన్నయి. ఆయన మనకు మిగిల్చిన తరగని గని లాంటి ఆయన రచనలు ఉన్నయి. ఆయన లా పనిచేయడం, జీవించడం అనితర సాధ్యమే అయినప్పటికీ కనీసం మన మన పరిధుల్లోనైనా ఆయన జీవితాంతం ఆరాట పడ్డ పేద, అబాగ్య, నోరులేని, అట్టడుగువర్గాల ప్రజానీకం కోసం ఏమి చేయగలిగినా అది ఆయనకు నివాళే అవుతుంది. ఆయన నిర్మించిన విశాల ప్రజాస్వామిక ఉద్యమాన్నీ, భావజాలాన్నీ ముందుకు తీసికెళ్ళడమే ఆయనకు మనమర్పించగలిగే నిజమైన అశృనివాళి.
ప్రాణహిత బాలగోపాల్ కు సజల నయనాలతో వీడ్కోలు చెపుతూ ఆయన మహోన్నత వ్యక్తిత్వం ముందు శిరస్సు వంచి ఆయన ఆలోచనలకూ, ఆచరణకూ పునరంకితమవుతున్నది.
October 12th, 2009 at 11:02 am
నేను ఆసక్తిగా చదువుతున్న వ్యాసాల్లో బాలగోపాల్ గారివి కూడా ఉన్నాయి. ఆయన గురించి మా అమ్మ చెపుతూ ఉండేది. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయనను తప్పకుండా కలుసుకోవాలని నిశ్చయించుకున్నానుగాని ఇప్పుడది సాధ్యం కాదని అనుకున్నప్పుడల్లా బాధ కలుగుతోందిగాఆయనలా రాసేవారు దాదాపుగా మరెవరూ లేనట్టే భావిస్తున్నాను.
October 13th, 2009 at 1:13 am
అంతే, తెలుగు ప్రపంచమే కాదు, భారత సమాజమే ఒక అరుదైన మేధావిని కోల్పోయింది. మాటలు (ప్రీచింగ్స్ ) లేకుండా కేవలం ఆచరణే గీటురాయిగా బతికిన మనిషి మనకిక లేరు. వరవరరావు తన బ్లాగులో రాసిన వ్యాసంలో కూడా మరిన్ని ఆసక్తికరమైన బాలగోపాల్ జీవిత విశేషాలు అందజేశారు. ఇవన్నీ చదువుతున్న కొద్దీ రానురాను మనమెంత దురదృష్టవంతులమవుతున్నామో, ఈ దేశపు నోరులేని జీవాలు (వోయిస్ లెస్ పీపుల్ ) మరెంత నిస్సహాయ స్థితిలో పడుతున్నారో తలచుకుంటుంటే బెంగగా వుంది. ఆవేదనగా వుంది…
October 13th, 2009 at 11:47 am
I attended Balagopal’s meeting only one time in early 80′s. I was so impressed with his speech. Clear, straight forward and no jargon in his speech. Even though I left India 25 years back and shamelessly not in touch with Indian politics, few people, especially Balagopal is in mind all the time. Usually I do not mourn death that much. More over there are occasions I felt happy for the dead. But, this is day five, without Balagopal. I can not get over. My mind is going crazy every minute. Unfortunately I can not cry. I wish I do. Swamy, your editorial is excellent.
October 13th, 2009 at 8:24 pm
బడుగు జీవుల హక్కుల కోసం పోరాడిన సార్ వంటి వారిని ఈ క్లిష్ట సమయంలో కోల్పోవడం (రకరకాల ప్రభావాలకు లోనై తమ సొంత వ్యాపారాలు చూసుకోనే ఉద్యమకారులు తయారయిన కాలం) అల్పజీవుల దురుదృష్టం. హక్కుల ఉద్యమపు లైట్ హౌస్ కుప్పకూలింది.
October 31st, 2009 at 8:49 pm
sampradaya marxist sahitya drukpadam ante udamlalanu prepepinchadame ane drukpadam ee madhye yerpadatlunnadi. Nenu shityam chadave rojullo – 1970-1980s – atuvanti vadana gurinchi vinaledu. Manusula astivaniki chaityananiki madhya eppudu kontha kali vuntundhi – a khali ni nimpe karyacharana lo niche srijanatamaka achrana puduthundi anedhi naa lanti vaaru 1980s lo yerparchukunna tatvika bhavam. Dintlo udyamam mathrame – slogans, tactcis, strategy etc, undalane vadana yemi ledhu. Anna Kernina, The Brothers Karamazov, Fathers and Sons, A doll’s House, A Lear of the Steppes, Raavi Sastry, Kara rachanalo – Modugapoolu, Renda adangazi (Kooli Ginjalau) lanti rachanala laga, pratkyasham ga udyamalu levu. Aite veetini Marxistlu vismaricha ledu.
Samasya anta karyacharananu instrumentalist sthayiki kudinchadam lo vunda vacchu. Idi kevalam sahityanaki parimitaimana samaysya kaadu. Ye tatvikata sravanthi aina astiva sastram (ontology) lo nilabadi dani adharam ga gnana sastram (Epistimology) antimamga acharana loki payaninchinapudu ituvanti instrumentalist dhornula prabhavam takkuvaga untayi.